Jump to content

ధనుర్విద్యావిలాసము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

ధనుర్విద్యావిలాసము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరఘుకులాబ్ధిసోమా
సూరిస్తుతదివ్యనామ శూరలలామా
మారీచమదవిరామా
నీరధరశ్యామ యీవనీరఘురామా.

1


వ.

అవధరింపుము, అట్లు సావధానమనస్కు లగు శౌనకాదులకుం
బ్రమోదంబున రౌమహర్షణి చెప్పినట్లు వైశంపాయనుండు జనమే
జయున కిట్లనియె నట్లు తొమ్మిదిలక్షణంబులు సవిస్తరంబుగా విని
తక్కుంగల లక్షణంబులు వినుటకుం గుతూహలంబునఁ బొదలు పార్టు
నకుఁ గుంభసంభవుం డిట్లనియె.

2


క.

ఆయోధన సమయంబునఁ
బాయక ధనురాశుగముల బలువిడి నూనం
దోయము లగు సాధనముల
నాయతగతి విస్తరింతు నాలింపు మిఁకన్.

3


ఉ.

సాదికినిం బదాతికిని సంగరవేళల నొండుకార్ముకం
బూదగ దంతిదంతముల నొక్కటి లేడియడుంగు చాడ్పునన్
మేదురమైన చర్మమున మీనములీల పొడల్ దలిర్పగా
బోదనమీఱ నొక్కటియ ప్రోది ఘటింపుదు రద్భుతంబుగన్.

4


గీ.

అట్టిసాధనయుగళంబునందు ధరణి
హరిణచరణాభ మేకచాపాశ్రయంబు

మీనముల మానములఁ గాంచి మెలపు గొలుపు
నది పదంపడి ద్విత్రిచాపాశ్రయంబు.

5


వ.

మఱియును.

6


క.

కంబళములనైననుఁ జి
త్రాంబరముల నైన ధర శరాసనరక్షా
ర్థంబుగ విరచింతురు సద
నంబుల డాఁచుటకు గవుసెనల నలువముగన్.

7


వ.

వెండియు శరగోపనార్హంబులగు తూణీరంబుల భేదంబులును, మానం
బులును తద్విధానంబులునుం బ్రశంసించెద నాకర్ణింపుము.

8


క.

క్షోణి నుపాసంగంబును
తూణంబు నిషంగ మిషుధి తూణీరంబున్
తూణియు నను నామము లగుఁ
దూణీరంబునకుఁ బొదియు దొన యనఁ దెనుఁగున్.

9


వ.

వెండియు.

10


మ.

తనరుం దూణము లాఱుచందముల నందంబందు నందుం గవా
జినబంధంబులు నాల్గు నాళఫలకసిద్ధంబులై రెండు క్ర
న్నన నీయాఱిటిలో గవాజినజముల్ నారాచభిన్నేషుల
న్మనుచుం నాళమయంబు దారుభవమున్ నారాచరక్షార్హముల్.

11


గీ.

అగ్గవాజనతూణంబులందు నాల్గు
శిఖరములు గల్గుగొన చతుశ్శిఖర మండ్రు
కణఁక నేకైకశిఖరంబు గలుగు నవియు
నేకశిఖరాభిధానంబు లిద్దరిత్రి.

12


గీ.

ఏకశిఖర మొకటి యీచతుశ్శిఖరంబు
నంగుళములు ముప్పదాఱు కొలఁది
అవల దొనల నొకటి యష్టాంగుళోత్సేధ
మొకటి ద్వాదశాంగుళోచ్ఛ్రయంబు.

13

ఉ.

సద్రసవద్గవాజిననిషంగచతుష్టయ మాజితేజిపై
భద్రగజంబుపై రథముపై ధరపైఁ గొనవచ్చు నాళికా
ముద్రితతూణమున్ ఫలకముద్రితతూణము యుద్ధరంగరం
గద్రథసామజార్హములు గావు పదాతికి సాది కర్హముల్.

14


సీ.

షట్త్రింశదంగుళోచ్ఛ్రయముపై విప్పుగా
        విలసద్గవాజినావృతి నమర్చి,
అరవిప్పు సిరిగప్పు నరనిందముల చంద
        మాకలింపుచు నాల్గురేక లునిచి,
అతిమనోహరముగా నాశ్చర్యకరముగా
        బంగారుజలపూత పాదుకొలిపి,
భర్మనిర్మితచర్మపట్టికావలయంబు
        తతమధ్య మేఖలాకృతి నమర్చి,


తే.

చెలు వమరఁ దీర్చునది చతుశ్శిఖరతూణ
మేకశిఖరంబులవిధాన మీదృశంబు
గాని శిఖరమానంబులఁ గలదు భేద
మమర నిన్నాల్గు కరికరాభములు సుమ్ము.

15


క.

మూఁతలతోఁ బదిముష్టులు
బాతిందగు నాళఫలకభవతూణంబుల్
మూఁతలగు రెండుముష్టులు
మూఁతలుగా కెనిమిదేసి ముష్టులగు పొదుల్.

16


చ.

ఎలమికొలందికై యిడిన యెన్మిదిముష్టులమధ్యనాళమున్
వలగొని చుట్టునుం దిరుగువాఱఁగ మొగ్గల బంతికైవడిన్
జెలువుగ వంశనాళముల జేవుఱు లందుచుఁ గూర్చి తీర్చి యుి
మ్ములఁ గదియింతు రా భరణిమూఁతవిధంబున మూఁత దానిపై.

17


క.

ఒకనారాచమునకు వే
ఱొకనారాచంబు సోకకుండగ నినుపన్

సుకరంబై నాళౌఘ
ప్రకటనిషంగంబు దనరు భవ్యంబగుచున్.

18


ఉ.

రంజితలీల మేడమొగరంబు తెఱంగు తుఱంగలించురే
ఖం జిగి గుల్కు దారుఫలకంబులు జేవు ఱలంది కూర్చి పై
నంజలి కప్పువిప్పులక్రియ న్మొగపుందెర పొప్పు మీఱు మూఁ
తం జెలువాఱఁదీర్చునది దారుమయంబగు తూణ మిద్ధరన్.

19


వ.

ఈ యాఱుతూణంబులం గవాజినతూణంబులు చతుర్విధయుద్ధార్హం
బులగు నందు హయారోహణంబులం దశ్రమంబులు పదక్రమంబులం
దూణంబులు గట్టాయితంబులుగా ధరియించుటకుం దగిన సాధనంబై
మేఖలాబంధంబు గలదు. అట్టి మేఖలాబంధంబునకు లక్షణంబును,
తద్ధారణంబును బ్రశంసించెద నాకర్ణింపుము.

20


ఉ.

కొండి ధ్రువంబుగా మొదటఁ గూర్చిన బాఱెడుచర్మపట్టికా
ఖండముమధ్య రంధ్రితసుకాంచనపద్మచతుష్కమగ్రమం
దుండగ నంగుళద్వితయ మోలి వెడల్పు ఘటిల్ల నొప్పు నా
ఖండము జోడుగాఁ గురుచఖండ మిడం దగు మూఁడుజేనలన్.

21


గీ.

అట్లు సార్ధాంగుళము వెడ ల్పమరుచున్న
మూఁడుజేనలఖండంబు జోడు చేసి
తీర్చి తూణాసనము క్రిందఁ దిరిగిరా న
మర్తు రది మేఖలాలలామంబు ధరణి.

22


వ.

మఱియును.

23


క.

శిరమున సింహలలాట
స్ఫురణం బిడి జేనకొలఁది సురియవిధమునం
గరిదంతంబున ఖండము
మురువుగ రచియింతు రవల మొన వక్రముగాన్.

24


గీ.

దాని సింహలలాటంబు దరియ మూఁడు
వ్రేళ్ళకొలఁదిని నిడుపుగా వీడఁదొలఁచి

వివరమున పట్టికలు గూర్చి వెడలఁదిగిచి
దక్షిణశ్రోణి దొన వ్రేలఁ దాల్చవలయు.

25


వ.

విను మట్లు క్షురికాకారంబునం దీర్చిన దంతశలాకశీర్షంబునం దన
రెడు వివరంబునం గురుచపట్టికాఖండంబు మొన మరలం దిగిచి,
కూర్చిన తూణీరంబు శ్రోణిస్థలంబున నిట్టట్టుం జలింపక దృఢసంహతం
బగు న ట్లవలగ్నంబున లగ్నంబగు కనకధట్టికాపట్టిక నట్టిదంతశలా
కికం గీలించి దీర్ఘం బగుచుం బసిండిజలపూతలం దళతళమను నెత్తళు
కులు కులుకు వాటింపం దనరారు చర్మపట్టికాలలామంబుమధ్యం
బునం దిరుగువారం ద్రిప్పి, యగ్రంబునం గల కమలచతుష్టయంబు
నం దొక్కకమలగర్భరంధ్రగర్భరంధ్రంబున నయోమయంబగు
కొండిం దవులించిన, దక్షిణశ్రోణితలంబునఁ దూణీరంబును వలపి
ఱుంద దంతశలాకయుం దనరు. నిద్ధారణం బాశ్వికుల కనుగుణం
బగుఁ బాదచారులకుం దగిన కొలంది ధరియింపందగు నింక మౌర్వీ
లక్షణవిధానంబు లేర్పరించెద నాకర్ణింపుము.

26


క.

మౌర్వీజ్యాగుణశింజను
లుర్విన్ నామములు నారి కొనరించుటకున్
మూర్వాత్వగ్సూత్రంబు ల
ఖర్వంబగు పట్టుధమనికలు సాధనముల్.

27


వ.

అట్టి గుణంబునకు యథానుగుణంబుగా విధానంబు గల దాకర్ణింపుము.

28


సీ.

నరములచేఁ జాగ నారచే నైనను
        గళుకుగా సూత్ర మొక్కటి ఘటించి,
వలముగాఁ జుట్టు దావలముగాఁ బట్టు కే
        వలముగాఁ దిరిగి రావలను పఱచి,
మెలిదీఱ సారించ మేలు వక్కాణించ
        నలఁతి సంజ్ఞాసూత్ర మాకలించి,
వలకన్నువలెఁ జెన్ను గలకన్ను లలరార
        నట్టిట్టుగా సూత్ర మలవరించి,

నవరణమ్ములఁ గూర్చగాఁ దివురు రెండు
గొనయముల రెండుకొలఁకులకొనల నాగ
బంధ మొనరించి మధ్యంబు పట్టుత్రాటఁ
గట్టఁదగు నంగుళీచతుష్కంబు కొలఁది.

29


క.

ధనురాగమోదితంబులు
ధనువుల సవరణములందుఁ దార్ప హితంబుల్
గొనయము లనఁగా నవియును
ఘనతరధమనీలలామకములు కుమారా.

30


గీ.

నరముచాగనార నాణెంబు గల పట్టు
వెదురుపేడు లోకవిశ్రుతముగ
నంశభవశరాసవరశింజినీవిధా
నంబులకును సాధనంబు లండ్రు.

31


వ.

మఱియు దూరాపాతార్హంబులైన శరాసనంబులకుం గూర్పందగిన
మార్వీలలామంబులకు విధానంబు గల దాకర్ణింపుము.

32


గీ.

పరువమై డాలు మేలగు పట్టునూలు
కొలఁది కగునట్లుగాఁ బోసి కుదురుచేసి
మైనమున దీసి కూర్చిన మఱియు వాని
గులుకు దూరగవిశిఖానుగుణము గుణము.

33


వ.

అట్లుం గాక మఱియును.

34


క.

జలముల గోధూమము లిడి
సలసలమనఁ గాచి కాచి చాపము కొలఁదిన్
బలువిడి పోసిన పట్టా
జలముల నుడికించి తివిచి సమ్ముద మొదవన్.

35


సీ.

పదియాఱుముష్టుల బాణాసనమునకు
        పదియేనుముష్టులై పరగు మౌర్వి,
పదియేనుముష్టుల బాణాసనమునకు
        పదునాల్గుముష్టులఁ బరగు మౌర్వి,

పదునాల్గుముష్టుల బాణాసనమునకు
        పదమూఁడుముష్టులఁ బరగు మౌర్వి
పదమూఁడుముష్టుల బాణాసనమునకు
        పదిరెండుముష్టులఁ బరగు మౌర్వి,


గీ.

యేకొలందిని గార్ముకం బెసగుచుండు
నా కొలంది యథావిధి నాకలించి
కొలఁది కొకముష్టి కొఱఁతగాఁ గూర్చవలయు
గుణము ధనురాగ మజ్ఞానకుశలుఁ డగుచు.

36


వ.

ఇఁక నంగుళీత్రాణంబుల లక్షణంబులును, తద్వినియోగంబులును,
తత్సాధనంబులును, ప్రశంసించెద నాకర్ణింపుము.

37


క.

ఈవిద్యకు సాధనములు
భావింపఁగ నాల్గుముఖ్యభావము గాంచున్
భూవలయంబున గుణవ
ల్లీవిశిఖశరాసనాంగుళిత్రాణంబుల్.

38


గీ.

అందు శరధనుర్జ్యాత్రితయంబు కరణి
గాదు విను మంగుళిత్రాణ మూదకున్న
గొడుగనగు బాణములు పెక్కు దొడుగరామి
నంగుళీత్రాణ మిడఁదగు నండ్రు బుధులు.

39


వ.

వెండియు.

40


గీ.

బాతుముక్కురీతిఁ బటుహంసపక్షంబు
రీతి, నిమ్మబద్దరీతిఁ బిప్ప
లచ్ఛదంబురీతి లలిదీర్తు రంగుళీ
త్రముల నాల్గుతెఱఁగు లమరునట్లు.

41


గీ.

బాతుముక్కురీతి భాసిల్లుచుండెడు
నంగుళీత్ర మవని నరసిచూడ

భాతి నమరుచుండు నూతనాభ్యాసికి
విశిఖనిచయ మేయు వేళలందు.

42


చ.

పదపడి హంసరొమ్మువలె భాసిలుచుండెడు నంగుళీత్రమున్
ముదమున లక్ష్యవేది శరముల్ నినుపం జను ధన్వికిన్ దగున్
గుదురయి నిమ్మబద్దవలె గుండ్రనగాఁ దగు నంగుళీత్రముం
పొదువగు దూరపాతిశరపుంజసమాకలనానుకూలమై.

43


ఉ.

ఏనుఁగు నెక్కి సాహిణము నెక్కి రథోత్తమ మెక్కి పోరులం
దైనను వేఁటలాడు నెడ నైనను బర్వులువాఱుచున్ యదృ
చ్ఛానిరతిన్ ధనుర్ధరుఁడు చర్మవినిర్మిత మంగుళీత్రముం
బూని శరంబు లేయ నగు బొట్టనవేలు చలింపకుండుటన్.

44


శా.

క్షోణి న్మద్గువిషాణఖండమున సర్గోధాంగచర్మంబునన్
మాణిక్యంబున రూప్యకాంచనములన్ మత్తేభదంతంబునన్
నాణెంబుల్ వెదచల్లఁ దీర్చుదురు విన్నాణంబుతో నంగుళ
త్రాణం బంగుళరక్షకం బగుట సిద్ధం బయ్యెఁ దన్నామమున్.

45


గీ.

ఇందు మొదలిటి మూఁడును హేమరజత
మణి గజవిషాణ పాషాణ మద్గుశృంగ
ముల రచింతు రయ్యశ్వత్థదళముఁబోలు
నంగుళీత్రంబు గోధాజినార్జితంబు.

46


గీ.

క్రౌంచచంచుపుటాకృతి గజవిషాణ
ముఖ్యపూర్వోక్తసాధనములను బొడవు
గా యథావిధి రచియింపఁగా నెసంగు
నంగుళీత్రంబు నూతనాభ్యాసములకు.

47


వ.

ఇట్లు బాతుముక్కుకరణిం బురణించు నంగుళిత్రాణంబునకు విధా
నంబు నిరూపితం బగు, నింక హంసపక్షంబుకైవడిం దనరు నంగుళీ
త్రాణంబునకు విధానం బుపన్యసించెద. నాకర్ణింపుము.

48

క.

పోఁడిమి గజదంత మరుణ
చూడాండమువలె నమర్చి చొరఁదొలిచి యసిం
గేడిం గోసిన నవియును
గేడిం దళుకొత్తు నొడ్డగెడవుమొగములన్.

49


వ.

ఇం దొక్కవిశేషంబు గలదు.

50


గీ.

గేడివట్టు లొడ్డగెడవుగాఁ గోసిన
యంగుళిత్రయుగళ మవల నవల
తూచిచూచు నెడలఁ దులకు నేకాకృతి
హంసరొమ్మురీతి నమరవలయు.

51


వ.

ఇక వర్తులంబగు నంగుళిత్రాణంబునకు విధానం బుపన్యసించెద
నాకర్ణింపుము.

52


గీ.

పరిణతంబగు జంబీరఫలమురీతి
గజనిషాణాదులను గుండ్రగా నమర్చి
విడఁ దొలిచి రెండు సమముగా నడుమఁగోయ
దనరు వృత్తము లంగుళిత్రములు రెండు.

53


వ.

ఇంక నశ్వత్రదళాభం బగు నంగుళిత్రాణంబునకు విధానం బుపన్య
సించెద నాకర్ణింపుము.

54


చ.

చతురస్రంబుగ నాలుగంగుళములున్ చర్మంబు గోధాంగకో
ద్యతముంగోసి దినత్రయం బది శిలాధస్స్థంబు గావించి సం
గతి నశ్వత్థపలాశభావమునఁ జక్కం దీర్చి బాలక్షపా
పతి లీలన్ వివరం బమర్చి గర వాపన్? వ్యాఘ్రవక్త్రాభమై
సతతంబున్ విలుకాండ్ర కింపు నెఱపున్ జర్మాంగుళీత్రం బిలన్.

55


ఉ.

జడ్డన హంసరోమువ లెఁ జక్కన గాఁదగు నంగుళీత్రమున్
రొడ్డవలంబుగా నిడి గిరుక్కునఁద్రిప్పిన బొట్నవ్రేల మా

రొడ్డదు నిమ్మబ్రద్దవలె నొజ్జలు గుల్కెడు నంగుళీత్రమం
దిడ్డను మేలురంధ్రమది యిట్టిటు వ్రేలఁ జలించునట్లుగన్.

56


వ.

మఱియు నీయంగుళిత్రాణంబులకు గుణలతార్ధాంశంబు లా వునుపం
దగు నంతకు నధికంబుగా నునిచిన జ్యాఘాతంబున నంగుళీత్రాణంబు
వీడి పడు నంగుష్ఠంబునకు నొవ్వడరం జేయు వెండియుఁ జర్మాంగుళి
త్రాణంబు దక్కం దక్కినయంగుళిత్రాణత్రితయంబునకువివరం
బులు రొడ్డవలంబుగా నోరుదెరచిన కరణిం దీర్చవలయు, హంసోర
స్సదృశంబులగు నంగుళిత్రాణంబులు కొన్నిదేశంబుల విలుకాండ్రకుం
బ్రియం బాపాదించు, వెండియుం గ్రౌంచచంచూపుటసముదంచి
తంబులగు నంగుళిత్రాణంబులు కొన్నిదేశంబుల విలుకాండ్రకుం
బ్రమోదం బాపాదించు, జంబీరఫలార్ధప్రతీకాశంబులగు నంగుళి
త్రాణంబులు కొన్నిదేశంబుల విలుకాండ్రకుఁ బ్రమోదం బాపాదించు,
వ్యాఘ్రాననంబు కరణిం బరిణద్ధంబగు చర్మాంగుళిత్రాణంబులు
నిఖలదేశంబులం గల విలుకాండ్రకు నాదరణీయంబగు, నట్లగుట
జర్మాంగుళిత్రాణం బుత్తమం బగు నండ్రు మఱియునుం గల విశే
షంబు లాకర్ణింపుము.

57


ఉ.

చాపం బెక్కెడు నేర్పు లాఱుతెఱఁగుల్ శాస్త్రానుకూలంబులై
ప్రాపించు న్విను మందు రెండుదెఱఁగుల్ ప్రత్యగ్రచాపార్హముల్
దీపించుం బెఱనాలుగుందెఱఁగు లబ్ధిన్ సంతతాభ్యాసప
చ్చాపారోపణసాధనంబు లగుచున్ సభ్యంబులై ధారుణిన్.

58


వ.

అందు నూతనచాపజ్యారోపణప్రకారద్వయం బుపన్యసించెద
నాకర్ణింపుము.

59


చ.

కుడితొడక్రింద వామపదగుల్ఫము నూనుచు వామభాగపున్
దొడకును గ్రిందుగా గిరిమతోఁ గుడిపాదపుగుల్ఫ మూనినన్
బుడమిని గోముఖాసనముఁ బోల్చి సుఖాసనసంజ్ఞ గాంచు న
య్యెడ నుభయోరుపర్వముల నెత్తిన గోముఖనామకంబగున్.

60

ఉ.

అటువలె గోముఖాసనమునందు నరుం డుభయోరుపర్వముల్
హటమున లస్తకంబునకు నవ్వల నివ్వల నూదుచుం గొమల్
చిటుకున వేఱొకం డెదిరిచేతుల వంపఁ బిజుంద వ్రాలి వి
స్ఫుటగతిఁ గ్రొత్తశార్ఙ్గమునఁ బూన్చదగున్ గుణ మశ్రమంబునన్.

61


వ.

వెండియు నెండల నెండినం గుండలాభంబగు నవీన శార్ఙ్గకోదం
డం బంగారంబులం గ్రాచి మెత్తదనం బాపాదించి తత్సదృశంబుగా
దారుఖండం బమర్చి యక్కాఁచిన శార్ఙ్గయష్టి నద్దారుఖండంబు
పై నిడి రజ్జువులం దృఢబంధంబు గావించినం దినత్రయంబు గడచను
నంతకుం దిన్ననై యుండు నట్లు సరాళంబైన శార్ఙ్గయష్టిం
బూర్వోక్తప్రకారంబున నెక్కిడం దగు నదియునుంగాక శార్ఙ్గ
యష్టి మఱియుం గఠినంబగునేని కొమలవంపు లెదుర నొక్కండు
ద్రోచిపట్టినం దానును జానుపర్వంబుల నూని పిఱిందిదెస మ్రొగ్గ
వ్రాలిన నొండొకరుండు లాఘవంబున మౌర్వి నెక్కిడందగు నిత్తెఱంగు
నకు మువ్వురు గావలయు నైనను ప్రకారభేదంబు లేమిం జేసి మొద
లింటి తెఱంగున నంతర్భావంబు ప్రాప్తించునని పలుకుదురు, మఱియు
నొక్కరుండు నవీనశార్ఙ్గం బెక్కిడం గోరిన నొక్కయుపాయంబు
గల దది యెట్లనిన, శింజనీసదృశంబుగా నొక్కచర్మపట్టికాలలామం
బునకుం గొలకులం గూర్చి యక్కొలకుల శార్ఙ్గయష్టి కొమల
దోయిం దవులించి యెక్కిడందగు, నదియును సవిశేషంబుగా వివరిం
చెద నాకర్ణింపుము.

62


క.

అసహాయస్థితి నొక్కరుఁ
వెసకమున నవీనశార్ఙ్గ మెక్కిడఁ దలఁపన్
బ్రసభంబున నుప్పొంగుచు
నసమగతిం గోముఖాసనాసీనుండై.

63


చ.

కొలఁకు లమర్చి శృంగములఁ గూర్చిన పట్టిక యోగపట్టికా
వలయము కైవడిం దిరుగు వాఱఁగఁ దాలిచి రెండువైపులం

దొలయఁగ నూరుపర్వముల నూని పిఱందికి మ్రొగ్గ వ్రాలి ని
శ్చలగతి కేలుదోయి నవశార్ఙ్గము సజ్యము సేయఁగాఁదగున్.

64


వ.

ఇట్టి నవీనజ్యారోహణంబులను, బూర్వోక్తంబైన మౌర్వీలలామంబు
సమర్థకంబుగా నయోమయంబైన మౌర్వీదామం బెక్కిదండగు నది
యును సవిస్తరంబుగా వివరించెద నాకర్ణింపుము.

65


చ.

ఇనుమునఁ గొంకియుం గొలుసు నీవల నావల దావలంబుగా
గొనయములం దమర్చి యటు గూర్చిన యగ్గొనయంపుదోయి క్ర
న్నన నవశార్ఙ్గపుం సవరణమ్ముల దారిచి యెక్కుపెట్టు వే
ళను గొలుందు కొంకితవులం దొలుదొల్త ఘటింపఁగాఁదగున్.

66


వ.

ఇట్లు పేడెత్తకుండం దరతరంబునం బదిలంబుగా పైపైగొలుసులం
గొంకి దవులించి కొమలపట్టున సూత్రమ్ములు గుదురుగా గట్టి
కతిపయదినంబు లునిచినం దెఱంగుపడియుండు నట్టియెడ నయో
మయం బైన శింజిని సడలించి పూర్వోక్తంబై న మౌర్వీలలామంబు
సేర్పందగు, నీరెండువిధంబుల నవీనశార్ఙ్గంబులు సజ్యంబులు గావించి
యలవరించి డించిన శార్ఙ్గంబుల నెక్కెడందగిన నాల్గుతెఱంగులం
బ్రశంసించెద నాకర్ణింపుము.

67


చ.

కడిమిమెయిం సుఖాసనము గైకొనుచుం గొమ వామభాగపుం
దొడపయి నూది లస్తకముతోడనె దక్షిణజంఘక్రిందుగా
నిడి వలచేత మాఱుగొమ నేడ్తెఱ వంచుచు సవ్యపాణి నె
క్కిడఁదగు మౌర్వి శార్ఙ్గమున నిట్టితెఱంగు మహార్హమై తగున్.

68


చ.

లలి సమపాదుఁడై నిలిచి లస్తకమున్ వలఱెక్క నూనుచున్
వలతొడలోన నొక్కకొమవంపు ఘటింపుచు సొంపు మీఱఁగా
వలపలికేలిమీఁది కొమ వంచుచు దాపలికేలు సాచి దా
నలి గొనయమ్ములన్ సవరణమ్ములఁ గూర్పఁ దగున్ జవంబునన్.

69


ఉ.

డాపలిప్రక్క నొక్కకొమ డగ్గఱ దక్షిణకూర్పరంబునన్
జాపపుమధ్య మూని పెలుచం గొమ దావలచేత వంచుచుం

డాపలికేలు సాచి ప్రకటంబుగ శార్ఙ్గము నెక్కిడందగున్
మోపిడ నిట్టి మూఁడువిధముల్ విహితంబులు ధారుణీస్థలిన్.

70


గీ.

ఆఱవతెఱంగు ధనురాగమార్థవిదులు
మెచ్చ రడుగున శార్ఙ్గము మెట్టుకతన
బెట్టిదంబైన వి ల్లెక్కుఁబెట్టఁదగిన
తెఱగు గావున వివరింతుఁ దెల్లముగను.

71


క.

మోపుల వలతొడ కొమ నిడి
చాపము లస్తకము వామచరణాధస్స్థం
బె పెలుచగ వలపలికిన్
డాపలిచేఁ ద్రోచి యెక్కిడందగు వలచేన్.

72


వ.

ఇట్టి యాఱుతెఱంగులు శాస్త్రవిహితంబులై ప్రసిద్ధిగాంచు, మఱియు
నింతకుం దమతమప్రజ్ఞావిశేషంబులం గొందఱు కొన్నితెఱంగుల
నెక్కిడఁజూచినం జూచెదరుఁగాక సకలధనుర్ధరాసాధారణంబులు
గాకుండ నింక నిందొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

73


క.

నిస్తుల మగువింటన్ గుణ
లస్తకములకును నవాంగుళము లెడగలుగన్
బ్రస్తుతి నెక్కిడఁగా దగు
శస్తముగా దీకొలంది సమకొననున్నన్.

74


గీ.

ఈతెఱంగున శార్ఙ్గంబు లెక్కుపెట్టి
తత్ప్రకారముల్ భావింపఁదగు నరుండు
భావ మది రెండువిధములఁ బరిఢవిల్లు
కనుబొమలతీరు బాలచంద్రునివిధంబు.

75


ఉ.

బాలసుధాకరుండుఁ బలె భాసిలు శార్ఙ్గము లక్ష్యవేదికా
ఖేలనవేళ నారస మొగిన్ నిగుడింపగ నర్హమై తగున్

భ్రూలతికావిలాసమునఁ బోల్పగ నై తగు శార్ఙ్గచాపమున్
వ్రీలక చిత్రలక్ష్యముల వేడ్కలు గుల్కుచునుండు నందమై.

76


వ.

అట్లగుట నెక్కిడిన బాలశశాంకభావంబునం బరిఢవిల్లు శార్ఙ్గంబు
కఠినలక్ష్యభేదనంబునకుం దెఱంగుపడియుండు, వెండియుఁ గను
బొమల నలువంబునఁ జెలువంబు దాల్చిన శరాసనంబు దూరపాతన
ప్రముఖచిత్రలక్ష్యంబుల శరంబు లరి వాపుటకుం దరంబైయుండుఁ
గావున శార్ఙ్గంబు లెక్కిడి మనంబున నివ్విశేషంబు లరయం దగు
నింక తక్కుంగల విశేషంబు లాకర్ణింపుము.

77


శా.

చాపం బెక్కిడునేరుపుల్ దెలిసి యుత్సాహంబునన్ వింటికిన్
నైపుల్ గాంచఁదగున్ ధనుర్ధరుఁడు భాస్వల్లీలఁ జాపంబునన్
నైపుల్ గాంచి ధరించనేర్చిన ధనుర్వ్యాపారపారంగతున్
బ్రాపించున్ జిరకీర్తియున్ విజయమున్ భాగ్యోదయంబున్ మహిన్.

78


క.

సకలకళాపరిణతుఁడై
రకమున శార్ఙ్గంబు నరుఁడు రచియించినచో
నొకవైపున మె త్తదనం
బొకవైపున కఠినభావ ముండుం దిరమై.

79


వ.

ఇట్లు కఠినభాగంబు పుచ్ఛంబును, బులకనిభాగంబు శిరంబును గావిం
చుట నొక్కవిశేషంబు గలదు.

80


మ.

మెఱయన్ ముష్టి శరాసనంబు నడుమన్ మేలైన తన్ముష్టిపై
జరగున్ బాణము లట్లుగా విశిఖముల్ సంధించుచున్ దీయుచో
బిఱుసయ్యున్ బొడవౌట క్రిందివలుపున్ జిట్టాన జబ్బయ్యునుం
గుణుచౌటం బయివైపునుం గలసి వంగుం దుల్యభావంబులన్.

81


చ.

సమత్బలశృంగమై తనరు శార్ఙ్గముకోటులలోన నొక్కటై
యమరు వసుంధరావలయ మందలి శైలసముద్రకన్యకా

రమణులహస్తపద్మముల రాజిలు శార్ఙ్గము సాటివచ్చు ని
క్కముగను రాజరాజులకుఁ గాని లభింపదు తాదృశం బిలన్.

82


వ.

అట్టి శార్ఙ్గధనుర్లలామంబున కూర్ధ్వాధరవివేచనంబు వలవదు,
రెండువైపుల సంజ్ఞాసూత్రం బిడవలయు; నిద్ధనుశ్రేష్ఠంబు సవ్యాప
సవ్యంబుల నేయుటకుం దెఱంగుపడియుండు, వెండియు నెక్కిడితివి
యుచుం దారతమ్యంబులు భావించి కఠినభాగంబు పుచ్ఛంబునుఁ
జులకనిభాగంబు శిరంబునుం గావించి శిరోభాగంబునకుం గొమ
క్రింద జ్ఞాపకంబుగా సూత్రంబు చుట్టందగు, గొందఱు గుఱుతులిడక
యభ్యస్తంబులగు శార్ఙ్గబులకు నూర్ధ్వాధఃకాయంబు నిరూపింతు
రెట్టులనిన నాకర్ణింపుము.

83


క.

బాణపు టొరయికచేతన్
బాణితలం బలవరించి పట్టుటచేతన్
క్షోణితలంబున వింటికి
నాణె మెఱిఁగి వైపు దెలియ నైపుణ మెసగున్.

84


వ.

ద్వంద్వసంకులసమరంబులను నిశాసమయంబులను శరసంధానంబున
కూర్ధ్వాధరభాగవినిభాగంబు దుర్లభం బగుట సంజ్ఞాసూత్రంబునం
జుట్టవలయు నిట్లు వైపులు భావించి శరాసనంబు వామముష్టిం
దాల్పందగు, నట్లు దాల్ప నుచితంబులగు ముష్టులు వివరించెద
నాకర్ణింపుము.

85


క.

క్షతి శార్ఙ్గము దాల్పఁగ వ
ర్ణితమై ముష్టిత్రయంబు నెలకొను శాస్త్రో
చితమై వర్తుల మనఁగా
చతురస్రం బనఁగ దీర్ఘచతురస్ర మనన్.

86


వ.

క్రమంబునఁ దల్లక్షణంబులు నిరూపించెద.

87


క.

అంగుష్ఠము వెలిగాఁ జతు
రంగుళముల విల్లు దాల్చి యన్నాల్గిటిపై

యంగుష్ఠము వాచినయెడ
లంగనుపడు ముష్టివర్తులంబన బరగున్.

88


క.

అంగుష్ఠాగ్రంబు ద్వితీ
యాంగుళశిఖరంబు సోకునట్లుగఁ బెఱ మూఁ
డంగుళు లవి దాల్చిన
సంగతమై దనరు ముష్టిచతురస్ర మనన్.

89


క.

అంగుష్ఠాగ్రమున ద్వితీ
యాంగుళనఖరంబు మూయునట్లుగ నిడి మూఁ
డంగుళముల పిడికిటఁ గొన
సంగతమగు ముష్టిదీర్ఘచతురస్ర మనన్.

90


మ.

ఇలపై బాణము లేయ నిశ్చలముగా నేస్థానమందైన రా
జిలుచో వర్తులముష్టి మేలు రథవాజిస్యందనస్థుండు
కులయుద్ధమ్ముల వేటలం దమిఁ బరుంగుల్ వాఱుచున్ వ్రేయ నొ
జ్జలు గుల్కుం జతురస్ర దీర్ఘచతురస్రంబుల్ మనోజ్ఞాకృతిన్.

91


వ.

విను మిందుల నొక్కవిశేషంబు గలదు దూరాపాతనప్రముఖంబు
లగు కొన్నివిన్నాణంబులు సమస్థాన ప్రముఖస్థానంబుల నచలుండై
సంధానంబు సేయుంగావున శరంబు సడలక ధారాళంబుగా నడుచు
ద్విరదరథప్రముఖవాహనంబుల నారూఢుండై సంధానంబు సేయు
నప్పుడు వాహనవల్గనంబులఁ జెల్లించుంగావున, వర్తులముష్టి నాశుగం
బునకుం బట్టులేమిం జేసి సడలిపడుం గావున వాహనారూఢులకు
చతురస్ర దీర్ఘచతురస్రంబులు యోగ్యంబు లిమ్ముష్టుల మధ్యమ
ప్రముఖాంగుళత్రితయంబున శార్ఙ్గమధ్యంబుఁ బట్టి తక్కిన
ప్రథమద్వితీయాంగుళంబుల నంగుష్ఠంబుమీదుగాఁ జుట్టిన వ్రేలి
క్రింద శరంబు సడలకుండునట్లుగా నరివోయం దరంబై యుండు,
మఱియు నిట్టి ముష్టిత్రితయంబునం గుణదోషంబు లేర్పరచెద
నాకర్ణింపుము.

92

క.

ముంజె య్యెడచేయు సగము
శింజినిఘాతంబు దారసిలనీక రహిన్
రంజితముష్టిత్రయమున
మంజులగతి శార్ఙ్గమధ్యమము పూనఁదగున్.

93


క.

కరతలము సగము ముంజే
యరయ గుణాఘాత మొందు నట్లుగఁ దాల్పం
ధరణీస్థలిఁ బంచానన
చరణాభం బండ్రు తగదు శార్ఙ్గము ధృతికిన్.

94


వ.

విను మర్ధచంద్రహస్తంబున వంశభవకార్ముకంబు ధరియించినం
బంచాననచరమపరిణాహంబునం బురణించు నిప్పట్టు శార్ఙ్గంబులకుం
గాదని కుమారపరశురామప్రముఖులగు ధనుఃకళాపరిపూర్ణులనిర్ణ
యంబు గలదు, మఱియును.

95


గీ.

తనబలిమి కెక్కు డగు విల్లు దాల్చునేని
పట్టుగా రాని పట్టునఁ బట్టెనేని
పొడవు సింజిని గలవిల్లు పూనునేని
యతనిముంజేయి గుణఘాత మందుచుండు.

96


సీ.

అరచేయి నవకోరకాశ్రయంబునఁ బొక్కు
        బలువిల్లు వదలుగాఁ బట్టునేని,
ముడుతవాఱును జర్మమును జారుపట్టులో
        దృఢత చాలక విల్లు దిరిగెనేని,
యభ్యాసదుస్సహం బగు విల్లు సమబలం
        బైనను జబ్బుగాఁ బూనునేని,
యంగుళంబులకు నొవ్వడరు వైపులఁగ్రిందు
        మీఁదుగా వీడ్వడ నూఁదునేని,


తే.

యనుగుణం బైనకార్ముకం బమరఁబట్టి
మొదటి నదటున మణిబంధమునకు సోక

నీక శింజిని మొరయించి నిలుపుఁగాక
కాక కరతలమున కంటనీక శరము.

97


వ.

ఇవ్విధంబున కార్ముకముష్టిప్రకారంబులు బ్రవర్తిల్లుచుండు, నింక
స్థానప్రతిష్టానలక్షణవినియోగంబు లుపన్యసించెద నాకర్షింపుము.

98


శా.

ఈశానుండు గుహుండు భార్గవకులాధీశుండు రామక్షమా
ధీశుండుం మొదలౌ ధనుర్ధరకులాధీశుల్ శరాభ్యాసముం
దా శంకింపుదు రైదునిల్కడలు ప్రత్యాలీఢ మాలీఢమున్
వైశాఖంబు సమంబు మండల మనన్ నామంబు లైదింటికిన్.

99


సీ.

ఎడమపాదము లక్ష్య మెదురుగా మున్నిడ
        నవనిఁ బ్రత్యాలీఢ మైతనర్చు,
గుఱిఁకిఁ జక్కన గాఁగఁ గుడికాలు మున్నిడ
        నాలీఢ మారూఢమై తనర్చు,
పుడమి మూరకొలంది యెడముగా నంఘ్రిద్వ
        యము నిల్ప వైశాఖమై తనర్చు,
నడుమ నంగుళయుగ్మ మెడముగా నిలిచిన
        నది సమస్థానకం బై తనర్చు,


తే.

నిల సమస్థానమున నుండి యడ్డముగను
దోరణాకృతి నడుగులదోయి ద్రిప్పి
యభయ పార్ష్ణిముఖంబులు నొరయ నిలుప
మహిఁ దనరుఁ దోరణాకృతి మండలంబు.

100


వ.

వెండియు ధనుర్ధరుం డయ్యైస్థానంబుల నిలుచు విన్నాణంబులును
దత్తద్వినియోగంబులు నుపన్యసించెద నాకర్ణింపుము.

101


మ.

తెఱఁగారం గుడిపాద మడ్డముగ ధాత్రిన్ నిల్పి తద్గుల్ఫముం
గుఱిగా మూరెఁట వామపాద మిడి యంగుష్ఠంబు పైఁ జక్కఁగా
గుఱికిం గార్ముకముష్టి సాచి శర మక్షోభంబుగా నేయున
త్తఱి నీస్థాన మధీనమై తనరుఁ బ్రత్యాలీఢనామంబునన్.

102

మ.

తనరారున్ విను మాఱుచందములఁ బ్రత్యాలీఢమం దాద్యమై
ననుచున్ వైష్ణవ మాంతరం బగు విధానంబై తగున్ స్వస్తికా
సన మీరెండునుగాక నాల్గుతెఱఁగుల్ సంధిల్లు వామాంఘ్రి తి
న్ననగా రెండును మూఁడు నాల్గయిదు జేనల్ జంగలన్ సాచినన్.

103


సీ.

జగతిపై మూరెఁడుజంగగా నిలిచిన
        సొరిది హెచ్చున నేయ సుగమ మండ్రు,
బలువిడి మూఁడుజేనలజంగ సాఁచిన
        యది సమలక్ష్యార్హమై తనర్చు,
నత్యంతకఠినలక్ష్యముల దూయఁగ నేయ
        నాల్గుజేనలజంగ నాణె మందు
రైదుజేనలజంగ నంగయష్టిక డాఁచి
        మిగులఁ దగ్గున నేయఁ దగు ధరిత్రి,


తే.

నిత్తెఱంగుల నాల్గింట నెడమపిఱుఁదు
గానరా సవ్యజానుభాగంబు మ్రోల
వంచుకతమున దృఢసౌష్ఠవంబు గలుగు
నందమైన ప్రత్యాలీఢ మందు వినుము.

104


వ.

మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

105


సీ.

కుడికాలు వెనుకనుంకున నైదుజేనల
        జంగగా సాంచి సారంగమునకుఁ
బొంచిన బెబ్బులిపోలిక డాకాలి
        మీఁదఁ గూర్చుండి బిట్టూదునపుడు
కొంచెము భూమికై కుదురుగా నొఱఁగుచు
        గళుకైన డాపలికాలిమీఁద
వంచగా వలెఁగౌను వంచుట యెట్లన్న
        తనవామభాగనితంబదేశ,

తే.

మెలమి గనుపడు నిట్లుగా నివ్విశేష
మస్త్రవిద్యార్థపారగు లైనయట్టి
ఘనులసన్నిధి నభ్యాసమున ఘటించు
చాపధరుఁడు ధనుఃకళాసమధికుండు.

106


వ.

విను మిందు వైష్ణవంబును స్వస్తికాసనంబునుం గాక శుద్ధప్రత్యా
లీఢంబునం దాఱుభేదంబు లంగుళీభేదంబుల నేర్పరింతురు అట్లైన ననేక
భేదంబు లేర్పడు నాఱుతెరంగు లనుటకుం గొలఁది గాకుండు గావున,
వితస్తిద్వితయంబు, వితస్తిత్రితయంబు, వితస్తిచతుష్టయంబును
వితస్తిపంచమంబును, గొలందులుగా నడుగుల విన్యాసంబుల నాల్గు
తెఱంగు లేర్పరించి, వైష్ణవ స్వస్తికాసనంబులతోడ నాఱుతెఱంగు
లనుట సుగమంబై యుండు, వైష్ణవస్థానంబు శరప్రయోగ్యంబు గాకుం
డియు, స్థానంబుల నగ్రగణ్యంబగుఁ బ్రత్యాలీఢంబునకుఁ బ్రథమపరిక
రం బగుటం దత్రృతిష్ఠానంబ నాఁ బరగుచుండు స్వస్తికంబు భిన్న
ప్రకారం బయ్యునుం బ్రత్యాలీఢంబునం బట్టుటం దత్రృతిష్ఠానంబ
నాఁ బరగు, నిట్లు ప్రతిష్ఠానయుగళంబునకు లక్షణంబు ప్రతిష్ఠానప్రకర
ణంబున వక్కాణింతు, నింక నాలీఢస్థానంబున ధనుర్ధరుండు నిలు
పందగు విన్నాణం బుపదేశించెద నాకర్ణింపుము.

107


వ.

ఆలీడస్థానవిభాగము.

(ఎ.) 107


మ.

కడిమిన్ వామపదంబు ధాత్రిపయిఁ జక్కన్ నిల్పుచుం మూరెఁటన్
గుడిహజ్జమ్మును జంగ సాఁచి యుభయాంగుష్ఠాంగముల్ లక్ష్యమం
దిడి పార్ణిద్వయ మిట్టటున్ గదలఁగా నీరన్ ధృతిన్ నిల్చి తూ
పడరింపన్ వశమౌ ధనుర్ధరుల కయ్యాలీఢ మారూఢమై.

108


వ.

ఈలక్షణానకు కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు.

109


సీ.

కుడికాలుజంగ మూరెఁ డెడంబుగా సాఁచి
        కుడికాలు వంచక కుదురుపఱచి,
పదద్వయాంగుష్ఠముల్ పటుశరవ్యంబున
        కెలమిఁ జక్కనగాఁగ నిలిపిఁ నిలిచి,

గోధాంగుళిత్రముల్ కొమరారఁ గాఁ బత్రి
        మౌర్విని సంధించి మగటిమిగను,
చాప మాకర్ణాంత మేపారఁగాఁ దివ్చు
        తఱినిఁ గాల్గదలింపఁ దగదు కదలి,


తే.

శార్ఙ్గమున నేయుధన్వికి సత్త్వ మెడలఁ
బార్ష్ణి చలియించు నదిగాన పార్థ వినుము
కాలు గదలింప దోషంబు గల దటంచు
చాపధరులందు రాలీఢసరణులందు.

110


వ.

వైశాఖస్థానవిభాగము.

111


మ.

పుడమిన్ మూరెఁ డెడంబుగాఁ బదయుగంబున్ నిల్పి వామాంఘ్రికిన్
గడువ్రేలుం దుదలై శరవ్య మెదురుంగాఁ జాపముష్టింగడున్
బెడిదంబై తనరార సాఁచి యపు డాభీలస్థితిన్ బాణముల్
వడి నేయందగు తానకంబు దనరున్ వైశాఖనామంబునన్.

112


వ.

ఈ స్థానకంబునకు లక్షణవివక్ష.

113


గీ.

రెండుపదములనడుమ మూరెఁడువెడల్పు
విడిచి నిలుచుండవలెఁ దనయెడమకాల
నమరు చిటికెనవ్రేల లక్ష్యమున కెదురఁ
దనరు వైశాఖనామకస్థానమునను.

114


వ.

సమస్థానవిభాగము.

115


గీ.

అంగుళద్వయ మెడ ముండునట్లుగాఁగ
సౌరుఁగాఁ బాదయుగళంబు సరస నూఁది
యూర్ధ్వలక్ష్యంబుపైఁ జూడ్కులొలయ నిలుచు
తానకం బగు ధర సమస్థానకంబు.

116


క.

పాదద్వంద్వము నడుమను
మేదిని రెండంగుళములు మితమిడి నిలుపన్

గాఁదగు నూర్ధ్వశరవ్యని
షాదనమునఁజూడ్కి దనరు సమపాదమునన్.

117


వ.

మండలస్థానవిభాగము.

118


గీ.

పదము లిరుగడలును జొప్పి పార్శ్వములను
మండలాకృతి జానుయుగ్మంబు వంచి
తగ నధోలక్ష్యమునఁ జూడ్కి దవుల నిలుచు
తానకంబగు మండలస్థానకంబు.

119


వ.

ఇట్టి స్థానపంచకంబునకు వినియోగంబులు వివరించెద నాకర్ణింపుము.


శా.

ఆశంసార్హములై ధరం బరగు ప్రత్యాలీఢ మాలీఢముల్
వైశాఖంబు సమానలక్ష్యముల భవ్యంబుల్ సమం బూర్ధ్వగం
బై శోభిల్లెడు లక్ష్యముం గడప నర్హంబౌ సధోలక్ష్య ము
ద్దేశింపం దగు మండలంబున ధరిత్రిన్ రాజతేజోనిధీ.

121


వ.

ఊర్ధ్వాధస్సమానలక్ష్యవినిభాగము.

(ఎ.) 121


గీ.

పార్థ విను పాదచారికి పాదచారి
తొడరు నాధోరణునకు నాగోరణుండు
రథికి రథి సాదికిని సాది రహి సమాన
లక్ష్యములు గాఁగఁ బలికిరి లక్ష్యవిదులు.

122


చ.

తరుశిఖరస్థలీఫలపతంగవితానము శైలకూటగో
చరహరిచిత్రకాయముఖసత్వనికాయము శస్త్రభృన్నభ
శ్చరనికరంబు కృత్రిమఝషప్రముఖాంబరయంత్రముల్ వసుం
ధర నివి యూర్థ్వలక్ష్యము లనంబడు నో భరతాన్వయాగ్రణీ.

123


గీ.

ఉన్నతస్థాయి కడుగున నొనరుచుండు
నిభము పంచాననము భటుం డెద్దియేని
తగ నధోలక్ష్యభావంబు దాల్చునిట్టు
లవని చాక్షుషలక్ష్యత్రయంబు దనరు.

124

గీ.

ధరణిమీఁద భద్రదంతావళముమీఁద
రథముమీఁద సలుపు రణములందు
స్థానపంచకంబు దనరు వైశాఖ మొ
క్కటియె సాదులకును గరిమ నెఱపు.

125


వ.

వెండియు నీస్థానపంచకంబున కనుబంధంబులై ప్రతిష్ఠానంబు లనేకం
బులు గలవు. అందు ధనుర్ధరానుగుణంబులై వైష్ణవంబును, స్వస్తి
కాసనంబును, దోరణంబును, గతాగతంబును, హంసలలితంబును,
బార్శ్వగంబును, డోలాపాదంబును, వివర్తనంబును, నేకపాదంబును,
మయూరలలితంబును, వ్యత్యస్తపాదంబును, భ్రమరీమండలంబును,
జక్రమండలంబును, నర్ధమండలంబును, జిత్రంబును లోనుగా
బంచదశస్థానంబులు బ్రవర్తిల్లుచుండు, నందు వైష్ణవంబును, స్వస్తి
కాసనంబును, దోరణంబును, గతాగతంబును, బ్రత్యాలీఢాను
బంధంబును, హంసలలితంబును, బార్శ్వగంబును, డోలాపాదంబును,
వివర్తనంబును, వైశాఖంబున కనుబంధంబులై యుండు, నేకపాదం
బును, మయూరలలితంబును, వ్యత్యస్తపాదంబును, సమస్థానకంబున
కనుబంధంబులై యుండు, మఱియు భ్రమరీమండలంబును, జక్రమండ
లంబును, నర్థమండలంబును బూర్వోక్తంబులగు ప్రతిష్ఠానంబుల కరణి
మండలస్థానంబున కనుబంధంబులు గాకుండియు నామానుబంధం
బునం దత్ప్రతిష్ఠానంబులనాఁ బరగుచుండు, నిట్టి ప్రతిష్ఠానంబులకు
లక్షణవినియోగంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

126


వైష్ణవస్థానకము

గీ.

కుడియడుం గూని డాపలిగుల్ఫమందు
సవ్వపదసార్ణి గీలించి సగము ధరణి
పార్శ్వముఖముగా సూనుచు భాతి నిలచు
తానకం బగు వైష్ణవస్థానకంబు.

127


స్వస్తికాసనము

క.

ప్రత్యాలీఢపదస్థితి
సత్యము వలజంఘ వామజంఘకుఁ బైఁగా

నత్యంతముఁ గూర్చున్నన్
బ్రత్యయమున స్వస్తికాసనం బనఁబరగున్.

128


గతాగతము

క.

వారక ప్రత్యాలీఢప
దారూఢి శరవ్య మెదిరి యరిమురినడవన్
దోరణ మగుఁ దోరణమున
ధారుణిఁ బోరాకలను గతాగత మమరున్.

129


హంసలలితము, పార్శ్వగము, డోలాపాదము, వివర్తనము

సీ.

హంస మేఁగిన రీతి నడుగు లూనుచు నేఁగు
        నది హంసలలితాఖ్యమై తనర్చుఁ
గుడికేల ధను వూఁది గుఱికినై యాననం
        బటు ద్రిప్ప పార్శ్వగంబై తనర్చు
మోకాళ్ళఁ జిఱుదొడల్ మును వంచి శర మేయ
        నవని డోలాపాదమై తనర్చుఁ
గా ల్ద్రిప్పక పిఱిందికడకు వక్షము ద్రిప్పు
        నది వివర్తాహ్వయంబై తనర్చు


తే.

మానితం బగు నీప్రతిష్ఠానమునకు
నాలుగింటికి జనకమై నలువ మగుచు
జగతి సవ్యాపసవ్యలక్ష్యముల నేయఁ
దనరు వైశాఖనామకస్థానకంబు.

130


ఏకపాదము

మ.

కమనీయాకృతిఁ జాపరోపముల జాగ్రల్లీలచేఁ బూనుచున్
సమపాదస్థితి నందమౌ నెడమహజ్జన్ దక్షిణోరుప్రదే
శమునం దూనుచు దూరపాతనములన్ సంధానవిద్యాపరి
శ్రమముం జూపెడు ధన్వి నిల్కడ ప్రశస్తం బేకపాదంబునన్.

131

మయూరతిలకము

మయూరతిలకం బగున్ మదమయూరభావంబునం
బ్రయత్నమునఁ బాదముల్ పయిపయిన్ గడు న్మోపుచున్
జయంబు గొని సంగరక్షమసమస్థితిన్ ధన్వి దా
వియచ్చరులు మెచ్చఁగా విరివి మీఱఁ గ్రీడించుచోన్.

132


వ్యత్యస్తపాదము

మ.

గళమందున్ గటియందు వామచరణస్కంధంబునందుం ద్రిభం
గుల భగ్నంబగు మేనుతోఁ గుడియడుంగుం ధాత్రి పై నూని డా
పలిజంఘన్ వలజంఘపై నిడుచుఁ దత్పాదాగ్ర మిప్పాద మీ
వల నూనన్ సమపాదసంస్థితులకు వ్యత్యస్తపాదం బగున్.

133


భ్రమరీమండలము, చక్రమండలము. అర్ధమండలము

మ.

భ్రమరీమండలమౌ భ్రమభ్రమరవిభ్రాంతిన్ భటుం డేకపా
దమునన్ ధారుణి దిర్ధిరం దిరుగ మాద్యల్లీలఁ గ్రీడించుచో
సమపాదభ్రమి చక్రమండల మగున్ జక్రాకృతిన్ జుట్టిరా
నమరున్ మేదిని నర్ధమండలము చంద్రార్ధంబు కా ల్ద్రిప్పినన్.

134


వ.

విను మిట్టి ప్రతిష్ఠానంబులకు వినియోగం బుపన్యసించెద.

135


సీ.

ఇల నుండు కందుకాదుల దూయ నేయఁగా
        నాయితం బగు స్వస్తికాసనంబు,
పరచుచుండెడు ఘోరభల్లుకాదులఁ గూల్ప
        నారూఢమై యుండుఁ దోరణంబు,
జిరజిర పైకి వచ్చిన వరాహాదుల
        నలయింపఁదనరు గతాగతంబు,
హ్రస్వుఁడై యహితుఁ డేయఁగఁ దాను హ్రస్వుఁడై
        లలి నేయఁదనరు డోలాపదంబు,
ఘనసమానలక్ష్యంబుపైఁ గదిసి కదిసి
యాశుగము లేయఁగా దగు హంసలలిత

మిరుగడలఁ గ్రమ్ము శత్రుల నేయుటకును
భాసురం బగు ధన్వికిఁ బార్శ్వగంబు.

186


ద్రుతవి.

ఒరుని మార్కొని యొండొకరుండు దా
శరము లేయుచు సారెకు వెన్కొనన్
మరలి యేయుచు మార్తుర నోపఁగా
ధర వివర్త ముదారత వర్తిలున్.

137


ఇంద్రవ.

సత్యంబుగాఁ బల్కుదుఁ జాపహస్తుం
డత్యంత మభ్రంబున నభ్రగం బౌ
ద్ధత్యంబునం బర్వగఁ దాని నేయన్
వ్యత్యస్తపాదంబున వాసి గాంచున్.

138


క.

వియదావరణపదస్థితి
భయదుండై దనుజుఁ డేయు బాణంబులు దాఁ
బయిఁబొరయనీక మెలఁగగ
మయూరలలితంబు దనరు మహనీయంబై.

139


తే.

దూరపాతిశరంబులం దొడఁగుటకును
సముచితం బగు ధర సమస్థానకంబు
ధర సమస్థానకములీల దవ్వు నడువ
నేకపాదంబు జోకల నాకలించు.

140


క.

కుతుకమున నేకపాద
స్థితిఁ గుమ్మరసారెభంగి దిర్దిరఁ దిరుగన్
బ్రతివీరాభీలరణో
ధ్ధతి భ్రమరీమండల మనఁ దనరు భటునకున్.

141


చ.

పలువురు పన్నిదంబులను బైకొని బాణము లేయ ధీరుఁడై
వలఁగొని చుట్టునుం దిరుగువారుచు నందఱు కన్నిరూపులై
చిలుకుటలంతిబాణములఁ జిందరవందర లాడుచున్ మహిన్
మెలఁగఁగఁ జక్రమండలము మేలు ఘటించు ధనుర్ధరాళికిన్.

142

క.

కోరి సమప్రత్యాలీ
ఢారూఢుల విశిఖ మెడలి యర్ధశరధరా
కారముగ నడుగు మార్చు క
ళారసికత కర్ధమండలము దనరు మహిన్.

143


చిత్రగతి

మ.

నమపాదప్రముఖాదిమస్థిరచరస్థానప్రతిష్ఠానతా
నములన్ నాలుగడుంగుల న్మెలఁగుచున్ దభ్రం బదభ్రంబు హ్ర
స్వము దీర్ఘంబును వే నదృశ్యమును దృశ్యంబై పిసాళించు గా
త్రముతో రాజిలు ధన్విచెయ్ద మిలఁ జిత్రస్థానమౌఁ బోరుల్.

144


వ.

మఱియును.

(ఎ.) 144


సీ.

హస్త్యశ్వరథభూములందు ధనుష్మంతుఁ
        డతిభయంకరవృత్తి నడరి నిలిచి,
ధనురాశుగంబులు ధరియించి నాల్గడుం
        గుల కొలంది మెలంగి కుడియెడమలఁ
దిరుగుచు దిశలందు దివియందు భువియందు
        శరములు సవ్యాపసవ్యములను,
వేయుచు రిపులను డాయుచుఁ బరివేష
        గతుఁడైన చండభాస్కరుని కరణి
హ్రస్వుఁ డన దీర్ఘుఁ డన సూక్ష్మఁ డనఁగ మెఱసి
శూరవరులెల్ల వెఱఁ గంది చూడఁ జక్ర
వలయమున సంచరింపుచు వెలయ జగతిఁ
జిత్రగతి యన నొప్పుఁ బ్రసిద్ధముగను.

145


వ.

వెండియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

146


క.

స్థిరములు చరములు నై ధా
త్రి రహించున్ స్థానములు ప్రతిష్ఠానంబుల్
స్థిరమగు చతురంగార్హము
చరము పదాతికిని దక్కఁ జన దన్యులకున్.

147

వ.

అందుఁ బ్రథమోద్దిష్టంబగు ప్రత్యాలీఢాదిస్థానపంచకంబును వైష్ణవ
స్వస్తిశాసనడోలాపాదపార్శ్వగవివర్తవ్యత్యస్తపాదైకపాదం
బులులోనుగా సప్తప్రతిష్ఠానంబులుం గూడ ద్వాదశస్థానంబులు
స్థిరంబు లనంబరగుఁ జిత్రంబు స్థిరచరస్థానసంకీర్ణంబు గావున నుభయ
సంకీర్ణం బనం బరగు, వెండియు స్థిరస్థానంబులు చతుర్విధయుద్ధా
ర్హంబు లనియు, గతాగతంబును, దోరణంబును, హంసలలితంబును,
మయూరతిలకంబును, అర్ధమండలంబును, జక్రమండలంబును, భ్రమ
రమండలంబును లోనుగా సప్తప్రతిష్టానంబులు చరంబు లనం
బరగుఁ, బత్రంబు స్థిరచిరస్థానసంకీర్ణంబు గావున నుభయసంకీర్ణం
బనం బరగు, వెండియు స్థిరస్థానంబులు చతుర్విధ యుద్ధార్హంబు
లనియుఁ జరస్థానంబులు పదాతిసుగమంబు లనియును,
స్థిరచరస్థానసంకీర్ణం బగుటఁ జిత్రంబు చతురంగార్హం బనియును నిర్దిష్టం బయ్యె,
నిం దాశ్వికులకు వైశాఖం బొక్కటి విధేయంబు గావునఁ దత్ప్రతిష్ఠా
నంబులగు పార్శ్వగవివర్తనంబులు విధేయంబులై యుండు, మఱి
యును జిత్రస్థానకంబు పాదచారులకు విధేయం బగునట్లు హయ
గజస్యందనారోహకులకు విధేయంబు గాకుండియు వాహనచిత్రవల్గ
నంబులం జిత్రస్థానకంబునాఁ బరగు, నిట్టి వింశతిస్థానకంబుల లక్షణ
వినియోగంబు లెఱింగినధనుర్ధరుండు లోకోత్తరుండై వర్థిల్లు ననిన
నాచార్యుం గనుగొని పాండవమధ్యముం డిట్లనియె.

148


శా.

స్థానంబుల్ వినియోగలక్షణపరీక్షారూఢి బోధింపగా
నానందంబునఁ బొందు డెందము మహాత్మా ధన్వికిన్ భవ్యమై
స్థానం బెయ్యది యాదిమంబు నిఖిలస్థానంబులం దత్తదా
ఖ్యానంబుల్ వినఁగోరు నాహృదయ మోకారుణ్యపాథోనిధీ.

149


వ.

అని యడిగిన నాచార్యుండు పార్థుని భక్తిస్నేహంబులకుం దద్దయు
సంతసిల్లి యిట్లనియె.

150


క.

నీ వడిగినట్ల యడిగితి
భావం బిగురొత్త మున్ను భార్గవరామున్

నావినతికిఁ బరితుష్టుం
డావిబుధకులావతంసుఁ డానతి యిచ్చెన్.

151


వ.

 తత్ప్రకారంబు వినుపించెద నాకర్ణింపుము.

(ఎ.) 151


శా.

ఏయేలక్ష్యములందు శాస్త్రనియతం బేస్థానకం బుర్విలో
నాయాలక్ష్యవిభేదనంబు వివరం బాస్థానకంబైన మే
లై యుండుం జిరకాలసంస్థితికి బ్రత్యాలీఢ మిష్వాసదీ
క్షాయుక్తిన్ సమ మాదిమంబు నిఖిలస్థానంబులం దారయన్.

152


క.

శ్రుతులకు నోంకారము వలెఁ
గృతులకు శ్రీకార మెసఁగురీతి సమపద
స్థితినిఖలస్థానములకు
హితగతి ప్రథమాంగ మగుచు నిల విలసిల్లున్.

153


వ.

అని యానతిచ్చి తత్సమయసమాపాదితప్రమోదపరాయత్తచిత్తుండై
వెండియు.

154


మ.

క్షితిజాగ్రంబునఁ గృత్రిమం బయిన పక్షిన్ లక్ష్యముంగా సమ
స్థితి సంథానము సేయు కౌశలము కీర్తించెన్ మహాకూపపా
తితకార్తస్వరకందుకంబు దృఢశక్తిన్ మండలస్థానక
స్థితి బాణమ్ముల దిప్చు నేర్పును బ్రబోధించెన్ రహస్యంబునన్.

155


వ.

మఱియు నీదృశంబులగు విన్నాణంబులు పెక్కు లుపదేశించినం గృతా
ర్థుండనై వచ్చి భవాదృశరాజకుమారసమక్షంబునం గూపపతితంబగు
కందుకంబును, మణిమయంబగు నంగుళీయకంబునుం దిగిచితి, నది
గారణంబుగాఁ గృపగాంగేయానుమతంబున భవత్ప్రముఖకుమార
వర్గంబున కాచార్యకం బొనర్చుచున్నవాఁడ, మద్భాగ్యంబుపెంపున
నీయట్టి శిష్యునిం బడసి యీ దృశంబులగు ధనుఃకళావైదగ్ధ్యంబు
లుపదేశింపం గాంచితి, నీవలన నామనోరథంబు సఫలంబు గాఁగల
దని మృదుమధురభాషణంబులం బ్రబోధించు నాచార్యుం గాంచి
వినయావనతవదనుండై పుత్రుం డిట్లనియె.

156

క.

సమ మూర్థ్వలక్ష్యగంబై
తుములంబున మండలం బధోలక్ష్యగమై
యమరఁగ నవసర మెయ్యది
విమలాత్మా, తెలియఁబల్కవే వినవలతున్.

157


వ.

అనిన నాచార్యుండు పార్థున కిట్లనియె.

158


సీ.

హరిదంతదంతావళావళుల్ సరివచ్చు
        మదకలస్తంబేరమములమీఁదఁ
గనకాద్రిశిఖరసంకాశంబులగు మణి
        ఖచితకాంచనశతాంగములమీఁదఁ
జక్రవాళంబు మెచ్చని హేమవరణంపు
        ఘనగోపురాట్టాలకములమీఁద
జలధరంబులభాతి సకలదిక్కులఁ గామ
        గంబైన వరపుష్పకంబుమీఁద,


తే.

నిలిచి క్రిందికి శరములు నిలుపునపుడు
మండలస్థానకంబున నుండవలయు
నున్నతస్థాయిపై శరం బొలయఁజేయఁ
దరియఁ జనువేళ నగు సమస్థానకంబు.

159


వ.

వెండియు వాహనారూఢుం గదిసి శరంబులు నినుచు పాదచారికి
సమస్థానకంబును, నట్లు కదియంబడి శరంబులు నినుచు పాదచారిపై
శరంబులు నడుపు వాహనారూఢునకు మండలస్థానకంబును దక్కుం
గల సమలక్ష్యంబుల నాలీఢప్రత్యాలీఢవైశాఖంబును బ్రతినియతం
బులై యుండు నిట్టి విన్నాణంబు లెఱింగిన ధనుర్ధరుండు త్రిలోకీతిల
కుండగు. నింక ధనుర్ధరాకర్షణహస్తవిశేషంబులును, దదనుకూలం
బులగు విన్నాణంబులు నుపన్యసించెద నాకర్ణింపుము.

160


సీ.

కర్తరీహంసముఖంబు లరాళంబు
        కటకాముఖం బన గణుతిఁ గాంచు,
హస్తముల్ బాణాననాకర్షణంబున
        కలరు నిన్నాలుగు నరయ నందుఁ

గర్తరీహంసముఖములు వంశజశార్ఙ్గ
        కోదండయుగళానుగుణము లండ్రు,
శార్ఙ్గమరాళహస్తమున వంశభవంబు
        కటకాముఖంబునఁ గడిమి నెఱపు,


తే.

నలపతాకాఖ్యహస్తమునందు జుట్న
వ్రేలి వెలిఁ బెట్టనగు కర్తరీకరంబు
కొలఁది తర్జని మధ్యమాంగుష్ఠనఖర
శిఖరములు గూర్పఁదగు హంసముఖకరంబు.

161


గీ.

మహితతర్జనిమధ్యమామధ్యమమున
బుంఖ మంగుష్ఠ మొరయంగఁ బూనఁదగిన
హస్తమగుఁ కటకాముఖం బదియు వంశ
గుణగుణితవంశధను వనుగుణ సుమ్ము.

162


చ.

బొటమనవ్రేలిమీఁది కణుపుంబయిఁ జుట్టనవ్రేలు వాంచి ప
ట్టుటయె యరాళహస్తము కడున్ బెడిదంబగు శార్ఙ్గచాప ము
త్కటరభసంబునం దివియఁగాఁదగు సాధన మిందునారిది
వ్సుటకును మూఁడుచందములు చొప్పడు నిప్పుడ విప్పి చెప్పెదన్.

163


చ.

శర మరివోసి పింజె సరసం బెనువ్రేలు గుణంబుమీఁదుగా
నరుదుగ వాంచి తర్జని శరాధర మూనఁగ బొట్నవ్రేలిపై
పరువముమీఁదుగా గుణముపై నెడమం గుడి మూఁడుదిక్కులం
బరువడి నూననయ్యె సరిపట్టును లోవెలిపట్టు లిద్ధరన్.

164


క.

రెండవకణు పంగుష్ఠము
రెండవకణుపుపయిఁ దేజరిల శింజినిపై
నుండును జుట్టనవ్రేల్తుదఁ
జండతరస్ఫూర్తి గలుగు సరిపట్టునకున్.

165

గీ.

గుణము పెనువ్రేలి మొదలిటి కణుపుమీఁదఁ
గూర్చు కతమునఁ గొలఁది కంగుళము వాసి
పొడవుగల సాయకం బిట్లు దొడఁగవలయు
పదిల మగు నంగుళిత్ర మిప్పట్టునందు.

166


క.

అంగుష్టాగ్రంబు ద్వితీ
యాంగుళమధ్యమున మధ్యమాంగుళ మెడఁగా
సంగత మగు జుట్టనవ్రే
లుం గొన గుణ మివలఁ దనరు లోపట్టునకున్.

167


గీ.

వసుధ వెలిపట్టు లోపట్టువలె నెసంగుఁ
గాని యంగుష్ఠనఖరంబు గానుపించు
నించుకేనియు తనకునై యిది విశేష
మరయ నకలాంగుళిత్రయోగ్యములు రెండు.

168


చ.

ఇట్టు లరాళహస్తమున నేర్తెఱ న మ్మరివోసి తీయుచున్
జుట్టనవ్రేలి కవ్వలన సొంపులు గుల్కెడు నంగుళిత్రయం
బిట్టల మొప్పు మీఱ నిసుమేనియు రాలక యుండునట్లుగాఁ
బట్టఁదగున్ శరంబు తెగఁబాపిన గుప్పున విప్పఁగాఁ దగున్.

169


వ.

కర్తరీహస్తంబున ధనురాకర్షణం బెట్టిదనిన.

170


గీ.

ఖగ మదికి మధ్యమాంగుళాగ్రంబు పింజె
వలపలిగ నారిలోపల వాంచి గుణము
మీఁదుగా నంబు తర్జని మెట్టఁ దనరు
కర్తరీహస్తమునఁ దదాకర్ష ణంబు.

171


క.

సరిపట్టున నంగుష్ఠో
పరిభాగము సరస గుణముపై తర్జని మో
మరవాంచి మోపఁగా నగు
నరయఁ దదాకర్షణంబు హంసముఖమునన్.

172

మ.

అనురాగమ్మున నీకు నీగతి సఖండాఖండభావోల్లస
ద్ధనురాకర్షణసుప్రశస్తములు హస్తమ్ముల్ నిరూపించితిన్
విను వా లమ్మరివోయు మూలము ధనుర్వేదానుకూలంబుగా
వినుపింతున్ జమదగ్నిరామకరుణావిర్భూతబోధంబునన్.

173


వ.

బాణగ్రహణహస్తనిరూపణము.

174


గీ.

హంసముఖము శిఖర మను హస్తయుగళంబు
తూణముఖమునుండి బాణ మెడలఁ
దివియుటకును ధాత్రిఁ దివురు హస్తము లంచు
నస్త్రశాస్త్రవిదుల కభిమతంబు.

175


వ.

అందు హంసముఖహస్తలక్షణంబు నిరూపితం బయ్యె. శిఖరహస్తం
బునకు లక్షణంబు నిరూపించెద నాకర్ణింపుము.

176


క.

అంగుష్ఠం బెడగా నిత
రాంగుళులన్ వాంచి పట్టి యన్నాల్గిటిపై
శృంగాకృతిఁ జక్కనఁగా
నంగుష్ఠము నిలుప శిఖరహస్త మనఁ దగున్.

177


డి.

హంసముఖహస్తమున దొన నమరుచున్న
కాండ మెడలఁగ దివుచుట కలము పట్టు
సమధికస్ఫూర్తి శిఖరహస్తమున విశాఖ
మిషుధివెడలంగఁ దివుచుట యీటెపట్టు.

178


మ.

కనదూర్ధ్వాధరభావముష్టికలనాకర్షంబులన్ దోషముల్
గని విన్నాణమున్ శరాసనము జాగ్రల్లీలచే వామము
ష్టిని గీలించి శరంబు లాఘవమునం జే నొయ్యనం బూని శిం
జిని యొక్కించుక లాగి పుంఖ మదుకన్ జెల్వొందు సంధానమున్.

179


గీ.

అదికి గుణముపైఁ బింజకు నవల నివలఁ
దర్జనీమధ్యములఁ బిట్టు దార్చవలయు

నట్లు గానింప గుణము నోరారఁ బింజ
గఱచుఁ గఱచిన శరము పొంకముగ నడచు.

180


క.

ఈరీతిఁ బుంఖ మదుకక
బీరమ్మున నదికెనేని పింజ గుణమునన్
జారున్ జారక నిలిచిన
వారక తెగగొనిన శరము వడవడ వణఁకున్.

181


క.

పింజమొగమ్మున కొలఁదికి
శింజనిలో వెలితిఁ జూప జిరజిర దిరుగున్
రంజన సెడి లక్ష్యంబున
కుం జొరక కదంబకంబు గుణరత్ననిధీ.

182


గీ.

కణఁక బాలుండు బిట్టున బెణక నీక
కాండ మరివోయఁగా నగు గాఢలీలఁ
బోతుటీఁగయు వ్రాలిన పుంఖమెడలి
సడలి పడనగుఁ దెగవాపు సమయములను.

183


క.

సాయక మదికెడువేళ ను
పాయంబునఁ బుంఖ మెడమభాగంబునకుం
బాయక త్రిప్పిన విశిఖం
బాయతుకున గుఱికి నుఱుకు నటునిటు సొరకన్.

184


క.

ఎడమకు నటువలెఁ ద్రిప్పిన
కుటికే ల్ప్రథమాంగుళమునకుం దర్జనికిన్
నడుమను నెడ మిమ్మడి గు
మ్మడివిత్తుం బోలి హాలి మలయన్ వలయున్.

185


క.

దాపలిముష్టిని నెలకొను
చాపము లస్తకమునడుమ సరవిన్ జూడ్కుల్

ప్రాపింపఁగ వలపలిచెయి
లోపలికిం ద్రిప్ప శరము లోలత నడుచున్.

186


క.

ప్రక్కలు చెక్కులు దృక్కులు
చక్కనగా నిలుచునేని చాపము నడుమన్
గ్రక్కున విశిఖపుఁదాఁకున
మొక్కలమున మూఁడుదోషములు ప్రభవించున్.

187


గీ.

పింజ సోకినఁ మచ్చఁ బ్రాపించియుండు
కఱ్ఱ సోకిన రాపిడిఁ గలిగియుండు
ఘోరపుటలుంగు సోఁకినఁ గోఁత గలుగు
తివిచి వలచెయ్యి లోనికిఁ ద్రిప్పరాదు.

188


వ.

మఱియు నీయాకర్షణహస్తచతుష్టయంబునకు సప్తస్థానంబులు గల
వాకర్ణింపుము.

189


మ.

బొమ లిమ్మౌ నధరాధరాధరతలంబున్ దక్షిణశ్రోత్రమూ
లము వక్షం బపసవ్యజత్రుభుజమూలద్వంద్వమున్ మీసముల్
సముదారస్థితి బాణహస్తనియతస్థానంబులందున్ నితాం
తము రాణించు ధనురాభిమతమై స్థానత్రయం బిమ్ములన్.

190


క.

వలజత్రువు వలవీనున్
మలయక చిబుకాధరములమధ్యంబును రా
జిలుచుండు బాణహస్తపు
నిలుకడకున్ ధాత్రి మాననీయము లగుచున్.

191


క.

ముష్టిత్రితయంబున నొక
ముష్టిన్ వంశభవచాపముం దాల్తురు స
దృష్టిన్ దక్షిణజత్రుస
మష్టిం గటకాముఖాఖ్య మగు హస్తమునన్.

192

మ.

కర్ణాభ్యర్ణము సోక గాఢధనురాకర్షంబు గావించుచో
నిర్ణీతస్థితి దక్షిణేక్షణతటిన్ నిల్పం దగున్ నిల్పి త
త్కర్ణప్రాంగణ మంగుళిత్ర మొఱయంగా న మ్మరిం బాపినం
దూర్ణంబై నడచుం శరవ్యమునకుం దూరం బుదారోద్ధతిన్.

193


క.

ఆకర్ణాంతంబుగ ధను
రాకర్షణమునఁ గదంబ మగ్రము వెలిగా
నాకృష్ణ మగుట నగుదూ
రాకలనంబునకుఁ జూడ్కి యమరుం దిరమై.

194


గీ.

వామభుజకూర్పరంబున వంపు దీర్చి
గాఢముష్టి ధనుర్లస్తకం బమర్చి
దృష్టి కార్ముకముష్టిపై ధృతిని గూర్చి
రహి నిలుప నొప్పుఁ జుబుకాధరముల నడుమ.

195


క.

విను చుబుకాధరమధ్యం
బున శింజిని నిలుప దీర్ఘములు హ్రస్వములై
తనరెడు బహువిధశరములు
నిలుపందగుఁ బగలు రేలు నెలకొను హాయిన్.

196


వ.

వెండియు దక్షిణజత్రుస్థానంబు వంశభవధనురాకర్ష ణంబునం బాణ
హస్తక్షేత్రంబై యుండు కర్ణాభ్యర్ణంబును, చిబుకాధరమధ్యం
బును, శార్ఙ్గాకర్షణంబున, బాణహస్తక్షేత్రంబై ప్రవర్తిల్లుచుండు
వెండియు, నాకర్షణంబున గుణదోషంబు లేర్పరించెద నాకర్ణింపుము.

197


సీ.

పలుమొన లధరంబుపై నూనగా రాదు
        మునుకొని కనుబొమల్ ముడువరాదు
మెడ వంచుకొని గ్రుడ్లు మిణకరించఁగ రాదు
        దీమసంబున నోరు దెఱవరాదు

హొయలుగా వక్షమ్ము బయలు చూపఁగరాదు
        గడ్డంబు వెలిగడ నిడ్డఁగాదు
నిశ్వాసపవనంబు నిగుడింపఁగారాదు
        చిత్త మొండొకచోటఁ జేర్పరాదు


గీ.

కీళ్ళనరములు బిగువు సోకింపరాదు
వామభుజకూర్పరంబును వంపరాదు
నిలిచి తివుచుచు నెడనెడ నిలుపరాదు
నరుఁడు బాణాసనాకర్షణమ్ములందు.

198


మ.

శరసంధానవిధానతానకములన్ సంధిల్లు నిద్దోషముల్
పరిభావించి ధనుఃకళానుకలనాభాస్వన్మనోవృత్తియై
శరసంధానవిమోచనమ్ముల విశేషంబుల్ పిసాళింపుచున్
నరుఁ డానందము నొందుచుండు ధరణీనాథుల్ ప్రశంసింపఁగాన్.

199


వ.

ఇట్లు శరసంధానంబునుం ధనురాకర్షణంబునుం బసమించు నింక శరం
బాకర్షించుచో వామముష్టిపై నాఱుచందంబుల నిలుపందగు. నట్టి
నిలుకడలకుం దగినస్థానంబులును అట్టి స్థానంబుల నిలిపినం దనరు
విశేషంబులును వివరించెద నాకర్ణింపుము.

200


సీ.

అలుఁగు లస్తకమున కవలఁ జిక్కఁగఁ జాప
        మోజ నాకర్షించు టొకవిధంబు,
ఒకపాలు వెలిని లస్తకములో నలుఁగు గా
        నోజ నాకర్షించు టొకవిధంబు,
సాబాలు వెలిని లస్తకములో నలుఁగు గా
        నోజ నాకర్షించు టొకవిధంబు,
శరముఖం బవల లస్తకమంతయును జిక్క
        నోజ నాకర్షించు టొకవిధంబు,


గీ.

కణఁకఁ బెనువ్రేలి రెండవకణుపుమీఁద
నొకట నలుఁ గూనగా దిప్చు టొకవిధంబు

ఆకణుపు లోనుగా నలుం గమరఁ దివిచి
యోలి శరమోచనము సేయు టొకవిధంబు.

(ఎ) 200


సీ.

క్రందుకయ్యములందుఁ గడిఁదివేఁటలయందుఁ
        బ్రథమద్వితీయముల్ పరగుచుండు,
ద్వంద్వయుద్ధములంచుఁ దరలకేయుటలందు
        బాగై తృతీయంబు ప్రబలుచుండు,
దూరపాతములందుఁ దూఁగనేయుటలందు
        మించు తృతీయంబు పంచమంబు,
దూరలక్ష్యములందు దూయనేయుటలందు
        సముచితంబై షష్ఠ మమరియుండు


గీ.

తెగువ బాణముల్ ప్రథమద్వితీయములను
దక్కఁ దక్కిన నాల్గిటఁ దగదు తెగువ
బాణములు దక్కఁ దక్కటిబాణసమితి
యాఱుదెఱఁగులఁ దెగవాపనగు నరుండు.

201


వ.

విను మియ్యాఱుతెఱంగులం దృతీయంబగు విధంబు శరాగ్రంబునకు
లస్తకంబు సాబాలు వెలి నుండుటం జేసి పురఃప్రేరణంబున కను
గుణంబగుట శరంబు సత్వరంబై నడచుం గావున ధనుర్ధరభావజు
ష్టంబై యుండుఁ దురీయపంచమప్రకారంబులు పురఃప్రేరణార్హం
బులు గాకుండియు నలుంగు లస్తకంబులోఁ బడం గాండంబు నిండారం
దివియంబడుం గావున దూరాపాతనంబున కనుగుణంబులై యుండు
షష్ఠప్రకారం బంగుష్ఠంబు రెండవపర్వంబులోనికి నలుంగు దివియం
బడుటం గొండొకసమయంబున, లస్తకాంగుష్ఠంబులకుం ప్రమాదం
బాపాదించుం గాని సరకుఁగొనక యభ్యాసబలంబునం గుశలుఁడగు
నరుండు దూరస్థంబగు లక్ష్యంబు భేదింపఁ దమకించునెడ నిత్తెఱం
గునం దివిచి తెగవాపంజూచు నీయాఱుతెఱంగుల మెఱుంగు లంత
రంగంబునఁ దరంగితంబులుగాఁ బరిగ్రహించి ధనుర్ధరకులావతంసుండ
వగు మన పలికి మఱియు నిట్లనియె.

202

సీ.

కడిమి నూర్ధ్వాధరాంగములు కార్ముకమున
        కెఱఁగి వక్కాణింప నేమి ఫలము,
ముష్టిభేదముల నిమ్ముగ శరాసనమధ్య
        మెడపక ధరియింప నేమి ఫలము,
స్థానప్రతిష్ఠానతానకంబుల లక్ష్య
        మెడపక నెదిరింప నేమి ఫలము,
సాయక మరివోసి చాప మాకర్ణాంత
        మెలమి నాకర్షింప నేమి ఫలము,


గీ.

ఆత్మమానసవృత్తితో నాకలించి
మానసము చూడ్కితో నేకధా నయించి
కదలఁగానీక చూడ్కి లక్ష్యమున నుంచి
మొసి విశిఖమ్ము గుఱుతుపై నిలుపఁడేని.

203


సీ.

కలశమధ్యగదీపకలికాంకురము లీలఁ
        దలపు నిశ్చలముగా నిలుపవలయు,
నంతకంతకు నంతరాంతరాళంబున
        నింపు దీపింప రాణింపవలయు,
గజముపై గమకించు కంఠీరవము భాతి
        చాపయష్టిని మేను డాపవలయు,
సొరిది డాపలికంటిచూడ్కి కార్ముకమధ్య
        మము దాల్చుముష్టిపై మనుపవలయు


గీ.

కడిఁది కుడికంటిచూడ్కి పుంఖమున కలుఁగు
నకును లక్ష్యప్రదేశంబునకును సమము
గాఁగఁ బరగింపఁగాఁ దగుఁ గౌశలమున
శరము లరివాపు నెడలందుఁ జాపధరుఁడు.

204


క.

సాదులకు నిషాదుల కరి
భేదులకు మృగాదులకును బెనుపుగ నిలుపం

గాదట్టిచూడ్కి యచలము
భేదిలనేయుటకుఁ దక్క భీషణమూర్తీ.

205


గీ.

మాట లిఁక వేయు నేటికి మానసంబు
చంచలించినఁ జూడ్కియుఁ జంచలించుఁ
జూడ్కులు చలింప లక్ష్యంబు సొరదు శరము
శరము లక్ష్యంబు సొరదేని జాఱు యశము.

206


వ.

ఇట్లగుటఁ దదేకధ్యానంబున నిశ్చలమనస్కుండై పూర్వోక్తప్రకారం
బున యథాస్థానంబులఁ జూడ్కులు నిగుడింపుచు దృఢముష్టిసంధా
నలాఘవంబుల శరమోక్షణం బాపాదించి లక్ష్యశుద్ధిం గాంచి శర
దిందుచంద్రికాసుందరంబులైన యశఃకందళంబులు హరిల్లతాంగు
లకు మేలుముసుంగులై మెఱుంగులు తుఱుంగలింప నుభయకుల
వర్ధనుండనై వర్ధిల్లుము.

207


క.

శరపుంఖోద్వేజనమును
శరమోక్షణలక్షణంబు శరమోక్షానం
తరమునఁ జాపోత్సరణం
బరయం దగు మూఁడుతెఱగు లవి యెట్లనినన్.

208


శా.

ఆకర్ణాంతము కాండముం దివియుచో నర్ధాంగుళం బాశుగం
బేకస్పూర్తిని లోనికిం దిగిచి లా వెక్కించి యిట్టట్టునుం
బైకిం క్రిందికిఁ దీక పుంఖము బిగింపన్ నిశ్చలంబై రయో
ద్రేకం బొప్పఁ గదంబకంబు నడచున్ ధీరుల్ ప్రశంసింపఁగాన్.

209


వ.

అం దొక్కవిశేషంబు గలదు.

210


క.

ఎడనెడ నెడమకుఁ గుడికిన్
వెడవెడ నుబికించునేని శిఖరము నడుమన్
దడఁబడి సుడిఁబడి బడిబడి
వడిసెడి యెడపడనిజడిమ వడవడ వడఁకున్.

211

చ.

అటులు బిగించి పుంఖమున కావలి యీవలియంగుళంబు లొ
క్కట వదలం దగుం జులకగా వదలం గమకింపకున్నచో
బొటమనవ్రేల నందముగఁ బొంపెసలా రెడు నంగుళిత్రముం
దటుకున జాఱు మౌర్వి బలుతాఁకున వీడి ధనుఃకళానిధీ.

212


క.

ముష్టిం బ్రథమము తాన స
ముష్టిం జక్కందనంబు మానక ధనురా
కృష్టిం గాఢోల్లసనము
దృష్టిన్ నిలుకడయు భాగధేయము లనఘా.

213


వ.

అట్లు ప్రథమోద్దిష్టంబులగు పుంఖోద్వేజనంబు వివరింపంబడు నింక
ద్వితీయోద్దిష్టంబగు శరమోచనలక్షణంబు వివరించెద నాకర్ణింపుము.

214


క.

శరమోక్షణసమయంబున
నురుశక్తిం జాపముష్టి నుబికింపఁదగున్
బొరిబొరి నిరుగడ ఱెక్కలు
తరతరమున నొకటి కొకటి తఱిఁదఱి నొరయన్.

215


గీ.

సంతతాభ్యాసవశమున శస్త్రధరుఁడు
చాపముష్టియు బాణహస్తంబు నొకటి
నెమ్మి నుబికించి యేసెనేనియు శరంబు
దూరతరలక్ష్యములమీఁదఁ దూఁగు నిజము.

216


వ.

తృతీయంబగు చాపోత్సరణంబు వివరించెద నాకర్ణింపుము.

217


క.

ప్రబలు శరమోక్షణంబున
నుబికించిన చాపముష్టి నొగి జాడింపన్
సబలంబై మార్గణమున్
నిబిడతరస్థిరశరవ్యనిర్మథన మగున్.

218

క.

బాణ మరివాపితోడనె
బాణాసనముష్టి ననువుపడ ఝాడింపన్
బాణము లక్ష్యంబున వి
న్నాణంబుగఁ దెంపుసేయు నయవినయనిధీ.

219


వ.

విను మిత్తెఱంగులు మూఁడునుం ద్విరదరథపదక్రమశరమోక్షణ
లక్షణానుగుణంబులు తురగారోహణంబునం ద్వితీయతృతీయ
కృత్యంబులు గావింప నలవి గాకుండిన నుపాయంబున నిందొక్కటి
యైన నాచరింపఁదగు శరప్రయోగంబుల నిత్తెఱంగు లావశ్యకంబులై
యుండు మఱియు నిందుల కనుబంధంబైన విశేషంబు గల దాక
ర్ణింపుము.

220


ఉ.

మానితముష్టి కార్ముకము మధ్యముఁ బట్టిన నేమి సూచిత
స్థానవిశేషభావములఁ దప్పక నిల్చిన నేమి బాణసం
ధాన మొనర్చి మౌర్వి విహితంబుగఁ దీసిన నేమి పుంఖమం
దూనినయంగుళుల్ తెగువ నొయ్యన విప్పఁగలేనివానికిన్.

221


క.

శరమోక్షణసమయంబున
వరుసన్ బెనువ్రేలు లాఘవంబున వదలన్
గర మర్థి శరవ్యమునకు
నురుతరగతిఁ గాండ మొయ్య నొయ్యన నడచున్.

222


గీ.

కణఁక నంగుష్ఠనఖర మాకసముఁ జూడ
రూఢిఁ దర్జనీనఖరమ్ము రొమ్ము సూడ
నురుకశాఘాతమునకు బిట్టులికి నట్టు
లోలి శరమోచనము సేయు టుచిత మండ్రు.

223


వ.

వెండియు నొక్కవిశేషంబు గలదు. శరాభ్యాసంబు సేయు విన్నా
ణులకుం దక్షిణహస్తాంగుష్ఠనఖరంబు మాంసంబునకుం బొడ వునుపఁ
దగ ద ట్లునిచినన్ జ్యాఘాతంబున నఖరం బురియు నట్లగుట సమం

బుగా నీడవలయు నింక శరాభ్యాసమాసవాసరతారకాయోగకరణ
ప్రకరణంబు నిరూపించెద నాకర్ణింపుము.

224


మ.

మును మున్ గార్తిక మార్గశిరమున్ బుష్యంబు మాఘంబు ఫా
ల్గునమున్ జైత్రము మాధవంబు రహి కెక్కున్ జ్యేష్ఠ మాషాఢముం
ధనురభ్యాసకళాకలాపకలనాధారంబులై ధాత్రి నొ
య్యన నిమ్మాసముల న్నవాభ్యసనయోగ్యం బండ్రు మాఘం బిలన్.

225


శా.

హాలిన్ బ్రాతర ధీతికిన్ హిమజలవ్యాసక్తిచేతోమలం
బై లావూనక శార్ఙ్గముం దివియ నవ్యాభ్యాసి కెన్నన్ శర
త్ప్రాలేయంబుల నిమ్ము గాదు ప్రథమారంభోత్సవోత్సాహమున్
వాలాయంబుగ శీతలోష్మసదృశవ్యావృత్తి మాఘంబునన్.

226


సీ.

పన్నిదంబున భంగపరచవచ్చినవాని
        పన్నిదంబులు దీర్చి భంగపరచు,
కాలత్రయాభ్యాసకలనానుకులమై
        సాహసోత్సాహముల్ సంఘటించు,
కల్పవృక్షముభాతి గామధేనువురీతిఁ
        గామితార్థంబులు గలుగఁజేయు,
నాఁడు నాఁటికిని విన్నాణంబు దులకించు
        ప్రతిభావిశేషంబు పాదుకొలుపు,


తే.

నోలిఁ దిథివారతారకాయోగకరణ
వివరణస్ఫూర్తి సుముహూర్తవిహితమహిత
మాఘవాసరభాసురమంత్రతంత్ర.
కలితలలితధనుఃకళాకౌశలంబు.

227


వ.

వెండియుఁ బురహరస్కందపరశురామప్రముఖులగు మహాపురుషు
లిమ్మాఘంబున ధనుర్విద్యాప్రథమరంగోత్సవంబు యథావిధిం
గావించి దుష్టనిగ్రహజాగ్రదవగ్రహసమగ్రద్ద్యోతితహృద్యా

నవద్యధనుర్విద్యాసముద్యమంబున మాద్యజ్జంభారిసంబేరమ
రమాజనకవీచికావిచికలకలహంసహంసరథసతీసతికాముకము
కురబింబానుబింబయశోవిడంబాడంబరనిరంతరపాండురప్రసార
ఘనసారపేటికాయితదశశిశాభ్యంతరులై దిగంతవిశ్రాంతిం
బరిఢవిల్లుటం జేసి మాఘం బమోఘం బని ధనుఃకళానియామక
నికరావతంసులగు విద్వాంసులు ప్రశంసితు రింక ధనుశ్శరవ్యాపార
సమయాసమయంబులు నిరూపించెద నాకర్ణింపుము.

228


క.

కార్తికమాది దొమ్మిది
కీర్తింపఁగ శార్ఙ్గనిరతికిం దగునెలలై
వర్తిల్లు వంశభవ మఖి
లర్తుప్రతిపాద్య మగుచు లాలింపఁబడున్.

229


క.

తక్కిన మాసత్రయమున
నక్క జమున శార్ఙ్గచాప మాకర్షింపన్
జొక్కము గా దలవంశజ
మొక్కటి సకలర్తువిలసనోచిత మనఘా.

230


గీ.

సకలఋతుయోగ్య మయ్యు వంశజశ రాస
మంబుదాగమసమయంబులందు శరము
నడపఁజాలదు తామున్ను నడపినట్టు
లరసి తగువేళ ధను వూననగు నరుండు.

231


క.

నిద్రాసక్తుని కైవడి
నుద్రేకము సూప దంబుదోదయముద్రా
ముద్రితమై శార్ఙ్గం బను
పద్రవమునఁ బూనఁదగదు ప్రాజ్ఞుల కవనిన్.

232


క.

మొక్కల మానిన వంశజ
మెక్కిడి పన్నిదము తీర్పు మెనసినకినుకన్

మిక్కిలి నడువకయును శర
మక్కఱ నెఱవేర్చు నంబుదాగమవేళన్.

233


మ.

చను నాషాఢము జ్యేష్ఠమాసమును వైశాఖంబు దూరాభిపా
తనయోగ్యాశుగసుప్రయోగకలనాధారంబులై చైత్రపా
ల్గునమాఘంబులు నారసంబులకుఁ జెల్లుం దక్కనుం గల్గుబా
ణనికాయంబులు తొమ్మిదింట నడపన్ నాణెంబులై వర్తిలున్.

234


వ.

మఱియు ధనురభ్యాసప్రథమకరణంబులగు తిథివారతారకాయో
గకరణంబులు వివరించెద నాకర్ణింపుము.

235


గీ.

మాఘశుద్ధపక్షంబున మలయు నాఱు
బహుళమున నాల్గుదిథు లివి పది శరాస
నూతనాభ్యాసములకు సన్నుతము లయ్యె
వాని వివరింతు వినుము భావజవిరోధి.

236


గీ.

శుద్ధమున ద్వితీయ శుద్ధతృతీయయు
శుద్ధపంచమియును శుద్ధసప్త
మియును శుద్ధదశిమిమీఁది త్రయోదశి
యరయ భావుకంబు లైన తిథులు.

237


గీ.

బహుళమున ద్వితీయ బహుళతృతీయయు
బహుళపంచమియును బహుళసప్త
మియును వరము లనుచు నియమించి రిద్ధను
రాగమజ్ఞులైన యస్త్రగురులు.

238


గీ.

వారములను మూఁడువారము ల్కార్ముక
ధారణానుగుణములై రహించు
భానువాసరంబు భార్గవవారంబు
గురునివాసరంబు గుణపయోధి.

239

సీ.

ధీరసమ్మతమైన తిథిని విల్లుధరించు
        వారికి నసమానవైభవంబు
ప్రతిహితంబైన వారమున నారంభించు
        వారికి నాయుష్యవర్ధనంబు
శుభతారనిష్వాసము భజింప గమకించు
        వారికిఁ గలిదోషవర్ధనంబు
సద్యోగమునఁ గార్ముకోద్యమంబు ఘటించు
        వారి కామయవినివారణంబు


తే.

నమరు శుభకరకరణంబులందు రంగ
మంగళస్థానతానకాసంగచంగు
లగు మగల డెందముల కందమై తనర్చు
గాఢతరసౌఖ్యలాభంబు గలుగుచుండు.

240


వ.

ఇట్లు తీథివారతారకాయోగకరణంబులు ప్రవర్తిల్లు నింక రంగప్రకా
రంబును తదనుబంధంబులగు విన్నాణంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

241


క.

ఈ విలువిద్యకు సాధన
మై విబుధజనాభినంద్యమై యస్త్రపరీ
క్షావిలసనవిహితంబగు
నావరణము రంగ మనఁగ నవనిం బరగున్.

242


ఉ.

రంగముఖానుకూలచతురంగము రాజితరాజరాజసా
రంగము దర్శనోత్సవతరంగము కార్ముకవేదసారపా
రంగము విస్ఫురచ్ఛరకురంగము ధారుణిపై ధనుఃకళా
రంగము విద్యకుం బ్రథము రంగము రంగు లెసంగ నర్జునా.

243


వ.

అట్టి రంగంబునకు నంగంబులై ప్రమాకరణంబును, మదుత్తరణం
బును, సమీకరణంబును, విరజీకరణంబును, బరిష్కరణంబును
నాఁ బ్రసిద్ధంబులైన నామంబులం బంచసంస్కారంబులు ప్రవర్తిల్లు

చుండు, నట్టి సంస్కారపంచకంబునకు లక్షణప్రపంచంబు వివరించెద
నాకర్ణింపుము.

244


సీ.

దక్షిణపశ్చిమోత్తరపూర్వదిగ్విభా
        గములు గూర్చుట ప్రమాకరణ మండ్రు
అస్థికంటకశిలాహతి దీఱ ధారుణీ
        స్థిరశోధనము దురుత్తరణ మండ్రు
పల్లముల్ మెఱక లేర్పడనీక చదరంబు
        గావించు విధి సమీకరణ మండ్రు
అడుగుతాఁకున రజం బదరకుండఁగ ధరా
        ఘట్టనము విరజీకరణ మండ్రు


గీ.

ద్వారసీమలఁ బచ్చలతోరణములఁ
గూర్చి ముత్యాలసరులమ్రుగ్గులు ఘటించి
ప్రతిదినము ధూపదీపాదిబలివిధాన
కల్పనానల్పవిధి పరిష్కరణ మండ్రు.

245


క.

రంగవిధానంబున కివి
యంగోపాంగంబు లని శరాసనగురుశి
క్షం గల శాసన మిట వీ
నిం గూర్పక మెలఁగవచ్చునే రంగమునన్.

246


గీ.

అన వినుచుఁ బార్థుఁ డిట్లను నతనితోడ
కలశభవ పంచసంస్కారములు ఘటింప
కున్న నేమేమి దోషంబు లొదవుచుండు
ననఁగ నతనితో నిట్లను నస్త్రగురుఁడు.

247


ఉ.

ఆయము లేని గేహము సహాయము లేని చిరప్రవాస మా
దాయము లేని బేర ముచితజ్ఞత లేని ప్రధాని యౌవన
ప్రాయము లేని లేమ రతిభావ మెఱుంగని పల్కు విక్రమో
పాయము లేని రాజు సిరిఁ బాటికి నెక్కునె వత్స ధారుణిన్.

248

క.

ప్రస్తారలక్షణక్రమ
విస్తారంబై దిగంతవిశ్రాంతధను
ర్వాస్తుప్రమాకరణవిధి
శస్తంబై తనరు సకలజనసమ్మతమై.

249


గీ.

కంటకాస్థిశిలావళీకలితమైన
ధరణితలమున నడుఁ గూన దరముగామి
గని దురుత్తరణాఖ్యసంస్కార మెలమి
నిర్ణయించిడి కార్ముకనిగమవిదులు.

250


వ.

అదియునుం గాక.

251


ఉ.

కీకసలోష్టలేశములఁ గిల్బిషభావముఁ గాంచు రంగధా
త్రీకటకంబు దాన నియతిం గొనరాదు మహాస్త్రశస్త్రముల్
దీకొని యస్థిలోష్టవితతిం దెమలించిన రంగ ముజ్జ్వలం
బై కనుప్పు దానఁ గొనునస్త్ర మభీష్టఫలప్రదం బగున్.

252


గీ.

ఒడ్డగెడవైన రంగమధ్యోర్వి ధన్వి
స్థానపంచకమున నడు గూన కునికి
గని సమీకరణాఖ్యసంస్కార మవని
నామతించిరి ధనురాగమార్థవిదులు.

253


గీ.

అడుఁగుతాకున భూరజం బడలి మేన
సోఁకెనేనియు ధన్వికి సొలపు పుట్టు
గాన విరజీకరణపరిష్కార మవని
నెఱపి రస్త్రశస్త్రాగమనిగమవిదులు.

254


క.

జగతి నరిష్టనివారక
మగుటఁ బరిష్కరణవిధి మహార్హం బనుచున్
నిగదించిరి వరకార్ముక
నిగమపరిజ్ఞానఘనులు నేర్పు దలిర్పన్.

255

వ.

అట్టి ధనుఃకళారంగంబునకుం దగినవిధానం బాకర్ణింపుము.

256


గీ.

ఎలమి నిన్నూఱుబారలకొలఁదిఁ బావ
నావనీస్థలిఁ జతురస్ర మాచరించి
కిరణపరిణతమణిగణఘృణివిచిత్ర
కనకవరణంబు నలుగడఁ గడలుకొలిపి.

257


క.

పంకరుహనాభ శంకర
పంకరుహానన కళానుభావోజ్జ్వలమై
పొంకము గులుక యథావిధి
శంకుస్థాపనము సేయఁ జను మధ్యమునన్.

258


వ.

తదనంతరంబ.

259


గీ.

హరిహరహిరణ్యగర్భుల నభినుతించి
ధరణిఁ బూజంచి దిగ్దేవతావతంస
ములకు నంజలిఁ గావించి మొదలిచాప
ధరులచెలువంబు హృదయపద్మమునఁ దలంచి.

260


సీ.

వల్మీకతరులతాగుల్మము ల్మాయించి
        కుద్దాలముల ధాత్రి గుద్దలించి
కంటకాస్థిశిలాప్రకాండంబు లెడలించి
        గరిమతోఁ జదరంబుగా ఘటించి
కోటిశమ్ముల ధాత్రిఁ గొమరార ఘట్టించి
        చెన్నారు పన్నీరు చిలుకరించి
ప్రేక్షాలయమ్ములఁ బెలుచ శృంగారించి
        సింహాసనములు సజ్జీకరించి


గీ.

కడిది గొడుగులు పడగ లుగ్రంపుటాల
వట్టములు చామరంబులు వఱలఁజేసి
మేలిబంగారురంగారుమెలపుఁ గొలుపు
కంబములడంబముల మంచకము లమర్చి.

261

క.

ద్వారములు నాలుగును బం
గారపుగడపలను వలను గరగరికల శృం
గారములు గులుకఁ బచ్చల
తోరణములు గూర్చవలయుఁ దొలుతొలుత రహిన్.

262


మ.

ప్రకటస్ఫారగభీరనీరపరిఖాప్రాకారమున్ హైమమం
చకముల్ కాంచనచిత్రవప్రవలయాంచత్ప్రేక్షణాగారమున్
సకలాశాధిగమాతివిస్తరవిరాజద్గోపురాట్టాలక
ప్రకరంబుల్ సుకరంబు లైన ఖురళీరంగం బెసంగున్ రహిన్.

263


వ.

ఇవ్విధంబున నంగప్రత్యంగసంగతంబుగా ఖురళీరంగంబు నిర్మింపంజేసి
చందనాగరుపరిమళఝలఝలంబులగు జలంబులు కలయం జిలుక
రించి ముక్తాఫలరంగవల్లికావిన్యాసంబుల భాసమానంబు గావించి
శాంతికబలివిధానహోమంబుల రామణీయకం బాపాదించి గంధ
పుష్పాక్షతధూపదీపాదిసంస్కారంబులఁ బరిష్కరణంబుఁ గావించి
దేవతాయతనంబులకుం బోలె నసంస్కృతసంపర్కంబు దొరలనీక
దౌవారికులవలన నహోరాత్రంబును సురక్షితంబుఁ గావించి యథా
సూచితమాసవాసరాదిస్ఫూర్తంబగు సుముహూర్తంబు నిశ్చ
యించి యిష్టదేవతానుస్మరణపూర్వకంబుగాఁ బర్యంకంబు డిగ్గి
దంతధావనజిహ్వానిర్లేహనగండూషముఖప్రక్షాళనతైలాభ్యంగోద్వర్తన
గంధామలకసురభిళజలావగాహనంబుల బరిశుద్ధుండై ధౌతకౌశే
యంబులు ధరియించి మణిగణస్థగితకటకకాంచీప్రముఖంబుల
నలంకృతుండై కస్తూరికాతిలకంబు లలాటంబున వాటంబు గులుకఁ
గాలాగరుధూపంబులును మాల్యాంగరాగధారణలేపనంబులును
లోనుగా సుచితాధివాసనంబుల భాసమానుండై మహోత్సాహంబున.

264


సీ.

కలధౌతజలజాతలలితాతరళితాత
        పత్రంబు లొకచాయఁ బరిఢవిల్ల
కలనాదముల భేదముల మోదముల నూద
        గలవాదకులవాదికలు ఘటిల్ల

పగడంపు జగజంపు నిగరంపు జిగిపెంపు
        లొగి నింపు మేల్కట్టు లుల్లసిల్ల
పటువీరభటవారచటులారభటి మీఱ
        పటహారవము లోలిఁ బరిఢవిల్ల


గీ.

చోళనేపాళపాంచాలగౌళమాళ
వాంగవంగకళింగకర్ణాటలాట
పాండ్యకొంకణటంకణప్రముఖసుముఖ
నరవరకుమారకులు గొల్వ నగరు వెడలి.

265


సీ.

నవయస్కు లుత్సాహసహితులై యొకచాయ
        భావరంజనముగాఁ బలుకరింప
భూసురాగ్రేసరుల్ భాసురోల్లాసులై
        సమధికస్వస్తిఘోషము ఘటింప
వందివైతాళికవ్రాతముల్ కెలఁకుల
        విజయాంకబిరుదముల్ విస్తరింప
గణికావతంసముల్ గానమానంబుల
        గరగరికలఁ గుఱంగట నటింప


గీ.

పణవకాహళతమ్మటపటహశంఖ
వేణువీణామృదంగాదివివిధవాద్య
ధీరఘుమఘుమధ్వానంబు దిశల నిగుడ
రమణ నరుదేరఁగా నగు రాజవీధి.

266


వ.

వెండియు నాఖండలశుండాలశుండాదండసముద్దండతరభుజాగ్రజాగ్ర
న్మండలాగ్రమహోగ్రధారాధారాళధారాధరధారాసంపాతభీ
తరిపువ్రాతచేతస్సరోజాతులగు పదాతులమొత్తమ్ముల చిత్త
మ్ము లనునెత్తమ్ము లుత్సవరసాయత్తమ్ములై క్రొత్తలగు నుత్త
లమ్ముల సరిహత్తిన కత్తళమ్ముల ఘణఘణత్కారమ్ములు ధీర
మ్ములై శ్రవణమ్ములకుం బ్రవణమ్ములుగా రవణించిన నురవణిం

చుచుం బరవాహినీమదకలకలభావలగ్నపరివారితఘంటికా
నిర్వాణంబులను బుద్ధిం దలంగక చెలంగెడు మాతంగమ్ముల
యంగమ్ములం గడలుకొను మదసలిలధారాపూరమ్ముల రొంపులగు నిలా
తలంబులం జలిబిలి నలమికొను ప్రత్యగారద్వారస్ఫారితసురచిరతర
మరకతమణిగణకిరణకలాకలాపమ్ములు సురూపమ్ములై చూపట్టినం
బచ్చికలను మచ్చికలను నిచ్చల విచ్చలవిడి మెచ్చులం గూర్చుచుఁ
గబళింప సంభ్రమించు ప్రతిగృహసంవర్ధితసారంగకిశోరమ్ముల
విహారమ్ములకు లోచనకుముదమ్ములు వికసింప, భర్మనిర్మితనిర్మల
హర్మ్యాగ్రమ్ములనుండి యఱ్ఱులెత్తి చూచు పురపురంధ్రీతిలక
మ్ముల ముఖమ్ములు సాంద్రతరచంద్రికావికాసమ్ముల కనుప్రాస
మ్ములను హాసమ్ముల భాసిల్లుచు, నిష్కలంకశశాంకసహప్రశంకా
స్పదమ్ము లగుటకుం గనుకని యనేకభావమ్ముల మూర్తీభవించి
యంతరంగమ్ములం దరంగితమ్ములగు నానందరసంబులం బొంగి
పొరలు వాహినీపతులును, వాహినీపతుల కనుసన్నలం గ్రన్ననం
గాంచి కాంచననేత్రమ్ముల శ్రోత్రమ్ములకు మిత్రమ్ములగు వాదిత్ర
మ్ములఁ జిత్రమ్ములు గులుకు పాత్రమ్ముల నలుగెలఁకులం బలుపలుకులఁ
గొలకొలమను కలకలం బాపాదించు పామరనరవ్యూహంబుల మోహ
రమ్మున నోహరిసాహరి నెడనెడ నెడఁగలుగం జడియు వేత్రపాణులును,
వేత్రపాణుల ధిక్కారంబులకుం గక్కసంబుల వెక్కసం బందుచు,
నొక్కటం ద్రొక్కటపడి మక్కువకాండ్రదిక్కు మొగమ్ములుగా
స్రుక్కినం గ్రక్కున నక్కునం గదీయించినం జొక్కు చక్కెరబొమ్మలును,
చక్కెరబొమ్మల విహారమ్ములకు నిమ్మగు ప్రతిభవనపావనవనవాటి
కాంతరశ్రాంతాతాంతలతాంతకాండకుటజోటజమరువకకురువక
మల్లికావల్లికాసమంజసనికుంజపంజరపరివృతపరిసరసరోవర
వరాంభస్సంజాతకంజాతమంజులకింజల్కపుంజరంజితపింజరరజో
వ్రజంబులఁ గడారంబులగు సమీరకిశోరంబుల విహారమ్ములఁ జంచ
లమ్ములగు నూతనప్రోతనికేతనకేతనపటాంచలంబుల యనుకూల
ప్రేరణమ్ములకుం గారణమ్ములను సమీకరణమ్ములఁ గుశలసూచ

కమ్ములకుం బ్రహర్షించుచు వేదానువాదమ్ముల మోదమ్ములు
గూర్చు సాంగవేదులును సాంగవేదుల కుఱుంగటి కిసలయసేవంతికా
లవలీకువలయారవిందనానావిధకుసుమవిసరంబులును, వివిధ
వర్ణంబులగు హరిద్రాదిభద్రచూర్ణంబులును,బొంకంబులగు
సాంకవకర్పూరకర్చూరకుంకుమాదిసురభిళభవ్యద్రవ్యదివ్యాస్త్ర
చందనపంకంబులును, నూతనంబులగు వజ్రవైడూర్యాదిరత్నంబు
లును, శ్రీలంబులగు కాంచనదుకూలంబులును, బరిమళోదారంబు
లగు జలపూరంబులును, లోనుగాఁ బ్రశస్తవస్తుసంఘాతంబులకుం
బాత్రమ్ములగు కనకపాత్రమ్ములు కరతలంబుల నమర్చికొని, మాంగ
ల్యగానంబుల వీనులకు వినోదంబులు గూర్చు భూసురపక్ష్మలాక్షీ,
నికరంబులకుం దరణికిరణప్రసారంబులు సోకనీక శరచ్చంద్రచంద్రి
కాభంబులగు నుల్లాభంబులం బట్టిన పరిచారకనివహంబులును, బరి
చారకనివహంబులకుం బురస్సరులై సమవయస్కులగు రాజనందను
లిరుగెలంకులం గొలువ నగ్రభాగంబున మాల్యాంబరాభరణ
భూషితుండును, శిరస్త్రాణతనుత్రాణతలత్రాణకలితుండునునై
కనత్కనకమణిగణకలాకలాపంబులగు శరచాపంబులు ధరియించి,
మదకలశుండాలంబులీల మందయానంబునన్ ధనురాచార్యుండు నడు
వ నుదంచిత్సాహంబునం బొడలుచు, నఖండితాఖండలవైభవం
బున ఖురళిరంగద్వారంబుఁ జేరంజని, పరిఖాపరివారితతప్తకార్త
స్వరభాస్వరవర్ణంబును, మరకతమణిఖచితమంచకశ్రేణీ
సముదంచితంబును, లంబమానముక్తాఫలమంజరీసమంజసోల్లాభ
శోభితంబును, తరుణారుణకిసలయతోరణస్ఫారితచతుర్ద్వారంబును
నిరంతరాలేపితఘనసారచందనాగరుపరిమళఘుమఘుమితంబు
నునై, విలసిల్లుచు సదాశివస్థేమంబులీల సర్వమంగళాభిరామంబై ,
రామవిజయంబులీల సుమిత్రానందనాశ్రయంబై , సరోవరంబులీలఁ
బద్మరాగోపశోభితభువనంబై , శింశుమారంబులీల సూర్యావరణీ
యంబై , యలకానగరంబులీల రాజరాజాభిరక్షితంబై , మెఱుం
గులు తుఱంగలించు రంగమధ్యంబుఁ బ్రవేశించి వేదవేదాంగాది

హృద్యానవద్యవిద్యానుద్యోతితప్రశంసులగు విద్వాంసులును,
గావ్యనాటకాలంకారధోరణీపరిణతానల్పకల్పనానుభవులగు మహా
కవులును, భాసురేతిహాసోపన్యాసవ్యాసోద్భాసితవాణీశ్రేణికులగు
పౌరాణికులును, నిరతిశయరాజ్యలక్ష్మీసమాగమకళానుబంధులగు
బంధులును, ధీమంతులగు సామంతులును, సంధివిగ్రహయానాసన
ద్వైధీభావసమాశ్రయణాభిధానషడ్గుణయథానుసంధానపరికర
పరతంత్రులగు మంత్రులును, ఘననయదేశీయభేదాపాదితహృద
యంగమసంగీతగోష్టీవిధాయకులగు గాయకులును, నానావిధ
జాతీయకథాసూచకులగు పరియాచకులును, శ్రోత్రపుటైకపాత్ర
కథాస్పందులగు వందులును, సముచితాస్తరణంబులం బరివేష్టింప
నగ్రభాగంబున మణిఖచితకాంచనపీఠంబున నాచార్యు నాసీనుం
గావించి తానును బవిత్రామరణంబునం బ్రాఙ్ముఖంబుగా నాసీ
నుండై కల్పోక్తమంత్రతంత్రప్రయోగకలనాసమాహితులగు
పురోహితు లిరుఁగెలంకులం గలసి పూజోపకరణంబులగు చందన
కఃసుమతాంబూలాదిభవ్యద్రవ్యంబు లుచితప్రదేశంబుల నమర్చి,
పరిత్రాస్తరణంబున శరశరాసనంబు లునిచి వినాయకప్రార్థనా
పూర్వకంబుగాఁ బుణ్యాహవాచనంబు సలుప దానును సమాహిత
మనస్కుడై మఱియును.

267


ఉ.

వాసవుఁ డాదిగా ఖచరవర్గ మనర్గళభక్తి నిన్నుఁ గై
సేసి నిరంతరాయమునఁ జేకొనుచుండుదు రీప్సితార్థముల్
దోసిలియొగ్గి నిన్ బ్రియముతోఁ దలతున్ గొలుతున్ ధనుఃకళా
భ్యాస మనంతరాయముగఁ బాటిలఁజేయఁగదే గణాగ్రణీ.

268


గీ.

అని వినాయకుఁ బ్రార్థించి యష్టదిశల
నమరు నింద్రాగ్నియమనైర్వతాబ్ధిరాజ
పవనయక్షరాట్కలాసపతుల నామ
తించి కల్పోక్తవిధులఁ బూజించి మఱియు.

269

సీ.

ప్రతిభానుభావ మేర్పఱచుమీ సురరాజ
        భవ్యముల్ గూర్చుమీ హవ్యవాహ,
ధర్మానుకూలచింతన లిమ్ము సమవర్తి
        యవయోగములఁ బాపు యాతుధాన,
యొడల మహోత్సాహ మునుపు మంబుధిరాజ
        కౌశలం బొసఁగుమీ గంధవాహ,
నవనవోల్లాసంబు ననుచుమీ నరవాహ
        వాంఛితార్థము లిమ్ము వామదేవ,


తే.

వకుళవంజుళలవలీలవంగలుంగ
కనకకల్హారకరవీరకమలకుముద
ముఖనిఖలసూనసంతానముద్రితోప
హారము ఘటించి మీకు జోహారు సేతు.

270


వ.

అని యష్టదిక్పాలకుల నారాధించి కల్పోక్తప్రకారంబున హోమ
గుండంబుఁ గావించి యందు వీతిహోత్రుం బ్రజ్వరిల్లం జేసి యథా
విధి ధనుర్యాగంబు గావించి, యగ్నిప్రదక్షిణంబును బలివిధానం
బులు నిర్వర్తించి ప్రదక్షిణజ్వాలాకలాపంబుల వెలుంగున నగ్ని
భట్టారకున కభిముఖంబుగా నిలిచి నిటలతటఘటితాంజలిపుటుండై
యిట్లని వినుతింపం దగు.

271


సీ.

నీసఖ్యమునఁ గదా నీరజబంధుండు
        శిశిరావరోధంబుఁ జెందకుండు,
నీముఖంబునఁ గదా నిర్జరావళులకుఁ
        జన్నంపుటామెతల్ సంభవించు,
నీ కొసంగును గదా నీహారకిరణుండు
        మునుమున్ను నిజకళామోదకంబు,
నీతేజమునఁ గదా నిఖిలలోకంబుల
        కాహారపరిపాక మనుగమించు,

గీ.

పావనాకార సంశ్రితభయవిదూర
హరనిటలచక్షురుపగేహ హవ్యవాహ
విఘ్నము లడంప విలువిద్య విస్తరింప
వరదుఁడవు నీవు నీకును వందనంబు.

272


వ.

అని యగ్నిభట్టారకు నారాధించి తత్ప్రసాదంబునఁ గృతార్థుండై
యర్ఘ్యపాద్యాదిపోడశోపచారంబుల ధాత్రీదేవిం బూజించి కరం
బులు మొగిచి.

273


ఉ.

అమ్మ తపోనుభావనిధి వమ్మ సమస్తము దాల్చు పేటి వీ
వమ్మ జగంబుల మ్మనుతు వమ్మ రమాదులు నీదుసాటి రా
రమ్మ రథాంగపాణి సతి వమ్మ మనంబున నీకు మ్రొక్కినా
నమ్మ దయోదయాంబునిధి వమ్మ పదాహతి నోర్చు ధారుణీ.

274


వ.

అని ధరిత్రిం బ్రార్థించి శరశరాసనానయవంబుల నిష్టదేవతావాహ
నంబు గావించి.

275


సీ.

విరివిగా విరిసిన విరజాజిపువులతో
        నెఱిదీర నెఱయు గన్నెరులతోడఁ
జెంగావిరంగైన క్రొంగల్వవిరులతో
        సౌగంధ్య మెసగు గొజ్జఁగులతోడ,
ఘుమ్మన నెత్తావిఁ గ్రమ్ము గేదఁగులతో
        బరువంపుసిరుల తామరలతోడఁ,
బొలుపు సంపాదించు పున్నాగములతోడఁ
        బ్రియములౌ బొడ్డుమల్లియలతోడ,


గీ.

కలితమృగమదకర్పూరగంధసార
కుంకుమాగరుకర్పూరసాంకవాది
సురభిళాలేపములతోడ సొబగు మీఱ
శరశరాసనపూజలు సలుపవలయు.

276


వ.

ఇవ్విధంబునఁ బూజించి మఱియును.

277

సీ.

వామశృంగం బల వామదేవుండును
        దక్షిణశృంగంబు తమ్మిచూలి,
గొటిమలు గుహుఁడును గొమలు హేరంబుఁడు
        వక్షస్స్థలంబు జైవాతృకుండు,
లక్ష్మీవినోదుండు లస్తకస్థానంబు
        పృష్ఠంబు పద్మినీప్రియతముండు,
మార్వీలలామంబు గీర్వాణనాధుండు
        కుండలిశ్రేష్ఠుఁడు గొనయములను,


గీ.

చక్రహస్తుఁడు సతతము శరముఖంబు
మహిమ నీశుండు సాయకమధ్యమంబు
పుష్కరభవుండు మార్గణపుంఖ మెలమి
సదమల ప్రౌఢిఁ గాచుచుండుదురు గాత.

278


వ.

అని యివ్విధంబున శరశరాసనంబులకు నంగరక్షకులు గావించి.

279


సీ.

పాదద్వయము తీర్థపాదుఁడు రక్షించుఁ
        బ్రపదముల్ పాలించు భవహరుండు,
గుల్ఫముల్ గాచు రక్షోవిభేదనశాలి
        జానుజంఘుల నేలు సర్వమయుఁడు,
నూరువుల్ గాచు వందారు మందారుండు
        గుహ్యంబు గాచు సద్గుణపయోధి,
జఘనంబు రక్షించు జగదేకనాథుండు
        నాభి నేలును నిత్యశోభనుండు,
శ్రోణిద్వయం బేలు సురుచిరా కారుండు,
        మధ్య మేలు తమోవిమర్దనుండు,
జఠరంబుఁ బాలించు సర్వాంతరాత్ముండు
        వక్ష మేలును భక్తవత్సలుండు,
స్కంధముల్ రక్షించుఁ గరుణాలవాలుండు
        జత్రువుల్ గాచును శత్రుహరుఁడు,

బాహువుల్ ప్రోచు గోపాలకశ్రేష్ఠుండు
        కూర్పరంబులు గాచుఁ గుశలదాయి,
మణిబంధముల నేలు మణిమయాభరణుండు
        కరతలంబులఁ గాచు ఖరవిరోధి,
గళము సంరక్షించు గంభీరవాహుండు
        చుబుకంబుఁ గాచు యశోధనుండు,
గండయుగ్మము బ్రోచుఁ గల్యాణశీలుండు
        శ్రుతులఁ బాలించు విశ్రుతయశుండు,
ఘ్రాణ మేలు బహుప్రకారఖేలనశాలి
        నయనముల్ గాచు దుర్నయవిదారి,
భ్రూయుగ్మ మేలు సంపూర్ణతేజోనిధి
        ఫాలస్థలముఁ గాచుఁ బావనుండు,
మూర్దంబు పాలించు మునిమనస్సదనుండు
        పృష్ఠభాగము నేలుఁ బృథుబలుండు


గీ.

అగ్రభాగముఁ గాచు సర్వాగ్రగణ్యుఁ
డుభయపార్శ్వంబులను బ్రోచు నూర్జితుండు
ప్రోచు బహిరంతరము లాదిపూరుషుండు
మదిని బాయక నిలుచును మాధవుండు.

280


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబులు పఠింపుచు మంత్రకవచంబున నవ
యవంబులు సురక్షితంబులు గావించి యథావిధిన్ ధనురాచార్యుం
బూజించి పండ్రెండుమారులు ప్రణామం బాచరించి యానతపూర్వ
కాయంబుగాఁ దత్సన్నిధి భయవినయంబులు రెట్టింప నిలిచి యిట్లని
ప్రార్థింపం దగు.

281


సీ.

ఏవిద్యపెంపున నీశానదేవుండు
        త్రిపురసంహారంబు ధృతి ఘటించె,
నేనేర్పుపెంపున సేనాధినాథుండు
        శూరపద్మాదుల బీర మణఁచె,

నేకళాపరిణతి నెసఁగ భార్గవరాముఁ
        డరిలోకభీకరుండై చెలంగె,
నేకౌశలంబునఁ గాకుత్స్థతిలకుండు
        దశముఖాదులఁ ద్రుంచి ధరణి నేలె,


తే.

నట్టి విలువిద్య నయమున నభ్యసింపఁ
గోరి మి మ్మాశ్రయించితిఁ గూర్మి పేర్మి
ననుఁ గృతార్థునిఁ గావించి కనుము కీర్తి
యరినికరభేది ధనురాగమార్థవేది.

289


వ.

అని వినుతించి సమీహితమనస్కుడై నిలువం దగు నట్లు కరం
బులు సాచి వినయావనతవదనుండై ప్రార్థించు శిష్యునకు నాచా
ర్యుండు శరశరాసనంబు లొసంగుటకుం దగిన విన్నాణంబు గల
దాకర్ణింపుము.

283


క.

బాణాసన తిలకంబును
బాణత్రితయంబు సవ్యపాణి నొసఁగి వి
న్నాణంబు మీఱ దక్షిణ
పాణి నఱయ దాన మిచ్చి భావం బలరన్.

284


సీ.

శ్రీరస్తు రాజ్యలక్ష్మీసమూర్జితధామ
        సౌభాగ్య మస్తు సజ్జనలలామ,
ఆరోగ్య మస్తు గంభీరభావవికాస
        విజయోస్తు విజయకాయజవిలాస
కీర్తి రస్తు బుధప్రకీర్తితామలశీల
        శుభమస్తు శత్రుతేజోవిఫాల,
అష్టపుత్రాప్రాప్తి రస్తు ధైర్యనిధాన
        దీర్ఘాయు రస్తు సుస్థిరనిధాన,

గీ.

అని యిటుల మాగధులగాన మనుదినంబు
వీనులకు సోఁకగాఁ దగు విభవ మంది
మనుకుమారాగ్రణీధనుర్మహిమఁ దెలిసి
యనుచు నాశీర్వదింపఁగా నగు గురుండు.

285


వ.

అని యివ్విధంబున నాశీర్వదించి యిచ్చు ధనుర్బాణంబులు కరయు
గళంబున నంగీకరించి కృతార్థుండై క్రమ్మఱ నొక్కప్రణామం
బాచరించి యనఘంబులగు మణికనకపట్టాంబరంబు లర్పించి,
యాచార్యుం బరితృప్తుం గావించి గోభూహిరణ్యప్రము వాంఛిత
మహార్హవస్తుప్రదానంబుల ధాత్రీసురులం దనిపి, వారలవలన
దీవనలం బడిసి బంధుమిత్రపరివారసహితంబుగా నానాపదార్థ
సంపన్నంబులైన యన్నంబులు గుడిచి చందనకుసుమాంగరాగం
బుల నలంకృతుండై మహోత్సవంబున నయ్యహోరాత్రంబునం
బొద్దుపుచ్చుచు వినోదింపందగు నిట్టిది ప్రథమారంభంబు మఱియు
నుంగల విశేషంబు లాకర్ణింపు మని యాచార్యుం డర్జునునకుం
జెప్పునట్లు రౌమహర్షణి శౌనకాదులకుం జెప్పె నని వైశంపాయ
నుండు జనమేజయులకుం జెప్పుటయు నవ్విభుండు ప్రమోదంబున
బొదలుచుం దరువాతి చరితంబు వినవలతుఁ జెప్పు మనుటయు.

286


మ.

వరదోషాటవిభంగ భంగభవదీవ్యద్దివ్యకల్లోలినీ
శరజత్కీర్తితరంగ రంగదలికాసక్తాలకశ్రీవిభా
స్వరసోమాంబుదసంగ సంగరకళాసజ్జీభవత్కౌశికా
ధ్వరనానాగమగాంగ గాంగపులినోద్యత్తాపసేంద్రాకృతీ.

287


భుజం.

ఇలాకన్యకారూఢహేలాభిరామా
బలారాతిజిత్సార్వభౌమాతిభీమా
కళానాయకస్మేరకల్యాణసీమా
కులక్ష్మాధరస్థేమ కోదండరామా.

288

గద్య.

ఇది శ్రీమత్కౌసల్యానందనకరుణాకటాక్షవీక్షణపరంపరాసాదిత
కవితావిచిత్ర, సుకవిజనానుగ్రహపాత్ర, మైత్రేయసగోత్ర, నృసింహ
గురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీతంబైన ధనుర్విద్యావిలాసంబను
లక్షణగ్రంథంబునందు ధనుర్బాణగోపనార్హనిచోళనిషంగరచనా
ప్రవచనంబును, మౌర్వీవిధానకథనంబును, నంగుళిత్రాణప్రకీర్తనం
బును, జ్యారోపణప్రకరణంబును, ధనురూర్ధ్వాధరభాగవినిభాగం
బును, ముష్టిప్రకరణంబును, స్థానోపసంఖ్యానంబును, శరగ్రహణో
పాయప్రతిపాదనంబును, సంధానక్రమవివరణంబును, నాకర్షణహస్త
ప్రస్తావంబును, బాణహస్తక్షేత్రనిరూపణంబును, దృష్టిలక్షణాన్వీక్ష
ణంబును, ధనురాకర్షణకౌశలోపన్యాసంబును, పుంఖోద్వేజనవిభ
జనంబును, జపముష్టిప్రేరణవివరణంబును, శరమోచనప్రకారప్రవ
చనంబును, జాపోత్సరణలక్షణవినిభాగంబును, శరాభ్యాసోచితమా
సోపన్యాసంబును, శరవ్యాపారయోగ్యతిథివారతారకాయోగకరణ
విస్తరప్రస్తానంబును, ఖురళికారంగప్రసంగంబును, రంగప్రవేశ
లక్షణనిర్దేశంబును, ధనుశ్శరపూజాయోజనంబును, గురుప్రణామ
స్థేమంబును, శరశరాసనగ్రహణపార్వాపర్యపర్యాలోచనంబు లోను
గాఁగలుగు విశేషంబులం దనరుద్వితీయాశ్వాసము.

289