ధనుర్విద్యావిలాసము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ధనుర్విద్యావిలాసము

తృతీయాశ్వాసము

క.

శ్రీరవికులకలశాంబుధి
పూరణహిమధామ నిఖలభువనస్థేమా
ధారశ్రుతిసుఖనామా!
నీరధర శ్యామ! యీవనీరఘురామా!

1


వ.

అవధరింపు మట్లు రౌమహర్షణి శౌనకాదులకుం జెప్పినట్టు జనమేజ
యునకు వైశంపాయనుం డిట్లనియె.

2


ఉ.

ఆమఱునాఁటి వేకువ హితానుమతిం జలకంబు లాడి ధౌ
తామలచేలగంధకుసుమాభరణాంచితుఁడై శిరస్త్రమున్
మైమరు వంగుళిత్రము సమస్థితి రాజిలగా ధనుర్గురు
గ్రామణి మున్నుగా ఖురళికావరణంబునఁ జేరి ధీరుఁడై.

3


శా.

విద్వద్వ్యాపకు నాదిదేవుని మనోవీధిన్ బ్రశంసింపుచున్
విష్వక్సేను వినాయకుం దలఁచి పృథ్వీదేవి కానమ్రుఁడై
యిష్వాసమ్మున కంగరక్ష లిడి తా నేకాగ్రభావంబుతో
దుష్పాపప్రతిరోధి నస్త్రగురుఁ జేతుల్ మోడ్చి భావింపుచున్.

4


క.

కోదండపృష్ఠభాగము
మీఁ దరయగ తద్గుణంబు మేదినిఁ జూడన్
బ్రోదిన్ వర్తులముష్టిని
గోదండము పూనఁగాఁదగున్ సమపదుఁడై.

5


వ.

 ఇట్లు సమపదస్థానకంబున నిలిచి పూర్వాధఃకృతపృష్ఠమౌర్వికంబుగాఁ
జాపంబు వర్తులముష్టిం దాల్చి మఱియును.

6

సీ.

అవల నరాళాఖ్య మైనహస్తంబుచేఁ
        బ్రోదిమై శింజిని పూనవలయు
నట్లు శింజినిఁ బూని యాదట వైష్ణవ
        స్థానకంబున బిట్టు దనరవలయు
చాపశృంగము సవ్యజానుపర్వగముగా
        సవ్యాంఘ్రి మును జంగ సాచవలయు
నట్లు ప్రత్యాలీఢ మమర నాకుంచిత
        ప్రేరితంబుల నేర్పుఁ బెనుపవలయు


గీ.

సమధికాకుంచితప్రేరితములయందు
హ్రస్వుఁడును దీర్ఘుఁ డగుచు సవ్యాంఘ్రిజంఘ
మీఁదఁ గూర్చుండి లేచుచుఁ బ్రోదిమీఱ
ధీరుఁడై విల్లు మెల్లనఁ దివియవలయు.

7


క.

అలుకని శార్ఙ్గం బనుచును
జులకనగా మౌర్వి తివియఁ జూడక ఘనుఁడై
బలు శార్ఙ్గము దివిచినగతి
బలిమిం దివియఁదగు బాహుబల మధికముగన్.

8


క.

ఈరీతి విల్లు దివియుచు
నారిం జిబుకాధరములనడుమను బదిలుం
డై రహి వలకనుఁగొలికిన్
వారక నిలుపంగవలయు వలచెవిమ్రోలన్.

9


క.

ఆకుంచితమున హ్రస్వుఁడు
దీకొని ప్రేరితమునందు దీర్ఘుం డగుచున్
జేకొని వెనుక న్ముంగల
నాకర్షణవేళఁ బదిలుఁడై వీఁగఁదగున్.

10


క.

శర మరివోసినకైవడి
స్థిరతరగతి మౌర్వి దిగిచి తెగవాపి పొరిం

బొరి నర్ధమండలంబున
మరలి సమస్థానకమున మలయన్ వలయున్.

11


వ.

ఇవ్విధంబునఁ బ్రత్యాలీఢస్థానకంబున సంస్థితుండై ద్విత్రిచతుఃపంచ
వితస్తిప్రమాణంబుల జంగ సాచి తత్తదనుకూలంబులగు పూర్వోక్త
లక్షణంబుల నుపలక్షితుండై డాపలముష్టి దృష్టి నెలకొనం జేయుచు
చుబుకాధరమధ్యంబునను దక్షిణలోచనాపాంగప్రదేశంబునను
దక్షిణకర్ణాభ్యర్ణంబునను మౌర్విని నిలుపుచు నెడనెడఁ బుంఖోద్వే
జనశరమోచనంబు లానందకరణిం గుణంబు వదలి సింహగర్జనంబు
సేయుచు నర్ధమండలంబున సమస్థానకంబునకు వచ్చి ధనురాలింగ
నంబు సేయుచుఁ గ్రమ్మఱ మౌర్వి తివియం దగు.

12


క.

ఈ చెప్పినచందంబుల
వాచాలుం డగుచుఁ బెక్కువరుసల దివియన్
జూచిన చాపము బరువై
సూచితగతి గాత్రమునకు సొలపు ఘటిల్లున్.

13


ఉ.

అంతట మాని సారతమై బెడిదంబగు ద్రోణముష్టిచేఁ
గొంతపరిశ్రమంబు గని కొండొకసాముల నారితేరి య
శ్రాంతము నిట్లు శస్త్రగురుసన్నిధి రంగమునన్ వినీతుఁడై
యెంతయు సావధానమతి నేడ్తెఱ నభ్యసనంబు సేయుచున్.

14


వ.

వెండియుఁ జతురస్రదీర్ఘచతురస్రంబులగు ముష్టివిశేషంబుల ధను
ర్గ్రహణప్రకారంబులును, కటకాముఖ కర్తరీహంసముఖ నామకం
బులగు హస్తంబుల గుణాకర్షణప్రకారంబులును, యథావిధి నభ్య
సింపుచుఁ దక్కుంగల్గు నాలీఢసమవైశాఖమండలస్థానచతుష్టయం
బునం బేర్వేఱ నాకుంచితప్రేరితప్రముఖంబులగు విశేషంబుల నభ్యా
సంబు సలుపందగు మఱియును.

15

సీ.

పరగఁ బ్రత్యాలీఢపదభావము లభించి
        యాలీఢపదభావ మందవలయు,
నాలీఢపాదవిన్యాసంబు భావించి
        సమపదాభ్యాసంబు సలుపవలయు,
సమపదాభ్యాసంబు సలిపి విన్నాణియై
        వైశాఖమున బిట్టు వఱలవలయు,
వైశాఖమున మహాకౌశలం బార్జించి
        మండలావస్థితి నుండవలయు


గీ.

మండలస్థానకంబున గండు మిగిలి
తత్ప్రతిష్ఠానములఁ బెంపు దనరవలయు
తత్రతిష్ఠానములఁ బెంపు దనరునేని
చిత్రగతుల నభ్యాసంబు సేయవలయు.

16


వ.

ఇట్లు స్థానప్రతిస్థానంబుల మెఱుంగు మెఱిచినకైవడి మెలంగుచు,
చరణజానుజంఘోరువక్షోగళనయనభ్రూలలాటకరతలమణిబంధ
కూర్పరప్రముఖంబులగు నంగకంబుల దృష్టిముష్టిసంధానస్థానా
కర్షణాకుంచితప్రేరితపుంఖోద్వేజన శరమోచన ముష్టిప్రేరణ సింహ
గర్జన కార్ముకోత్సరణార్ధమండల సమస్థాపక ధనురాలింగన ప్రము
ఖంబులగు విశేషంబులం దగిన విన్నాణంబుల యథోక్తప్రకారంబున
నలవరించుచు, నెడనెడ నాచార్యుండు బోధించు దృష్టిముష్టిసంధాన
స్థానకౌశలంబులు మఱవక యేకాగ్రచిత్తుండై కొన్నివాసరంబు
లభ్యాసంబు సలిపి వెండియు.

17


క.

నాలుగుజేనల కొలఁదిన్
హాలిన్ నెలవంకలీల నమఱిచి కుడ్యం
బాలోనలుకనగా నిను
మోలిన్ నిండార నునిచి యుత్సాహమునన్.

18

క.

ఆకుడ్యమ్మున లక్ష్యము
సైకమ్మున జేనకొలఁదిఁ జతురస్రముగాఁ
బ్రాకటగతి నమరిచి విలు
గైకొని గురువునకు మ్రొక్కి కౌశల మెసగన్.

19


శా.

ప్రౌఢిన్ దూ పరివోసి లక్ష్యమున దృక్పాతంబు గావించుచున్
రూఢిన్ గాత్రము వింటిమ్రోలఁ గలికారూపంబునం గ్రుచ్చుచున్
గాఢాకర్షణ మాచరించి కుసుమాకారంబున న్విక్రమా
గూఢంబై మయి విస్తరిల్ల శరముల్ గూర్పందగున్ లక్ష్యమున్.

20


వ.

ఇవ్విధంబున సమపదస్థానకంబున నిలుచుటయు నూర్ధ్వాధఃకృత
పృష్ఠ మౌర్వికంబుగాఁ జాపంబు వర్తులముష్టిం దాల్చుటయు శరం
బరి నమర్చుటయుఁ గార్ముకాధశ్శృంగంబు వామోరుపర్వాగ్రం
బుగా వామచరణంబు సాచి ప్రత్యాలీఢంబున నిలుచుటయుఁ దోడనే
వామముష్టి సాచి గాఢాకర్షణంబు గావించుటయుఁ బుంఖోద్వేజన
శరమోచనముష్టిప్రేరణసింహగర్జనార్ధమండలసమస్థానకధనురాలింగ
నంబులు లోనుగా నభ్యాసక్రమంబున నాచార్యుండు బోధించిన
కరణి నిరంతరంబు శరంబుల లక్ష్యంబున నడపుచు.

21


సీ.

తొలుదొల్త నొకవింటికొలఁది లక్ష్యంబున
        కెదిరించి సాయకం బేయవలయు
నొకవింటికొలఁది తప్పక తాఁకెనేనియు
        రెండువిండ్లకొలంది నుండవలయు
రెండువిండ్లకొలంది కాండంబు నడచిన
        మూఁడువిండ్లకొలంది మొనయవలయు
లక్ష్యంబు మూఁడువిండ్లకొలంది నందిన
        నాల్గువిండ్లకొలంది నడపవలయు


గీ.

విశ్రమంబున నొక్కొక్కవింటికొలది
విస్తరింపుచు నిరువదివిండ్లమీఁద

నొక్కవింటికొలందిని మొక్కలమున
నిలిచి గుఱిమీఁద విశిఖమ్ము నినుపవలయు.

22


క.

ఒప్పుగ బాణత్రితయము
తప్పక లక్ష్యంబునడుమ దవులఁగ నేయన్
జొప్పడు ధీరుఁడు ధారుణి
మెప్పులు గను విల్లుదాల్చు మేటిమగలలోన్.

23


క.

వెంబడి వెంబడి బలువా
లంబులు మూఁ డేకముష్టి లక్ష్యము సొర నే
యం బరగిన పిమ్మట వివి
ధంబు లగుశరమ్ము లేయఁదగు లక్ష్యముపై.

24


క.

నానావిధవిశిఖంబులు
పూని శరవ్యంబుమీఁదఁ బొరిఁబొరి నేయం
బూనుచుఁ బ్రతివాసరమును
మానక కడిమిన్ బరిశ్రమము సేయఁదగున్.

25


క.

అంతదడవు రంగస్థలి
సంతతము పరిశ్రమంబు సలిపెడునతఁ డ
శ్రాంతం బాయుష్యంబు ని
తాంతస్థితి వృద్ధి నొందఁ దనరు ధరిత్రిన్.

26


వ.

ఇవ్విధంబునం బరిశ్రమంబు గావింపుచు.

27


గీ.

అవల నైదునూఱు లైనను నన్నూట
యఱువదైన శరము లనుదినంబు
నేయుచుండవలయు నెడపక కడపట
శతశరంబులైనఁ జాపధరుఁడు.

28


క.

ఈరీతి నభ్యసింపుచు
వారక యభ్యాస మొక్కవాసర ముడుపన్

ధారుణి నలువదిదినముల
నేరుపు గొనకొనదు చాపనిరతున కనఘా.

29


వ.

ఇట్లు జ్యారోపణకార్ముకగ్రహణశరసంధానసమాకర్షణగాత్రాకుంచన
దృష్టిప్రసరణపుంఖోద్వేజనశరమోచనముష్టిప్రేరణకార్ముకోత్సరణ
సింహగర్జనాదిలక్షణంబులను శిక్షితుండై చెలంగవలయు నింక లక్ష్య
వేదికావిధానంబును దదనుబంధంబులగు లక్షణంబులునుం గల
వవియును యథానుకూలంబుగా నిరూపించెద నాకర్ణింపుము.

30


గీ.

లలి శరవ్యంబు లక్ష్యము లక్ష మనఁగ
నమరు నామత్రయంబు లోకమున గుఱికి
వేదిపై లక్ష్య మిడ లక్ష్యవేది యండ్రు
అదియు నారాచవిలసనార్హమ్ము సుమ్ము.

31


క.

ద్విరదరథాదికనిష్ఠుర
తరలక్ష్యవిభేదనంబు తనచే నగు సు
స్థిరలీల లక్ష్యవేదిక
నిరతిన్ నారసము ననుప నేర్చినపిదపన్.

32


వ.

అట్లగుట లక్ష్యవేదికావిధానంబును దదాయామోత్సేధపరిణాహంబుల
ప్రమాణంబులును, అందలిపరిశ్రమంబును, దదనుకులంబు లగు
విన్నాణంబులునుం దెలియవలయుఁ గ్రమక్రమంబున వివరించెద
నాకర్ణింపుము.

33


సీ.

రహి నుదన్ముఖమైనఁ బ్రత్యఙ్ముఖంబైన
        భిత్తివేదికలీలఁ బెంపవలయు
నది చతుష్పంచదశాంగుళోత్సేధంబు
        కొమరార షష్ట్యంగుళముల నిడుపు
నమరఁ జత్వారింశదంగుళపరిణాహ
        మును గల్గు మూఁడువైపుల ఘటించి,

నడుమ గోధూమచూర్ణం బేని కార్పాస
        చూర్ణ మేనియు నించి సొబగు మీఱ
మెత్తగా వల్మీకమృత్తిక మర్దించి
        గోక్షీరతైలముల్ గూర్చి మెదపి,
సలిలంబు లెడనెడఁ జల్లుచుఁ గఠినంపు
        ముద్దపాకంబుగా నద్దళించి
కుడ్యముఖమున నది ద్విత్రిచతురంగు
        ళములకొలందిఁ గుడ్యము ఘటించి
తనబలంబును శరాసనబలం బూహించి
        వెయి రెండువే ల్మూఁడువేలు నాల్గు


గీ.

వేలు ఘట్టనములు చేసి హాళిఁ దీర్ప
నధరమూర్ధ్వంబు మార్దవ మాకళింప
వక్షమతి కర్కశస్వభావంబుఁ దాల్పఁ
దనరు నిది లక్ష్యవేదివిధాన మవని.

34


వ.

వెండియు నట్టి లక్ష్యవేదిక కూర్ధ్వభాగంబు శిరంబనియును, మధ్యంబు
వక్షస్థలంబనియును, నధోభాగంబు పుచ్ఛంబనియును, ధనుఃకళాని
పుణుల పరిభాషణంబు గలుగు, నట్టి వేదికాముఖంబున నెంత ఘట్ట
నంబు సలిపిన నంత నూర్ధ్వాధరప్రదేశంబుల మార్దవంబును మధ్యం
బునఁ గాఠిన్యంబునుం గలుగుట నిక్కువం బీ యింగితం బెఱింగిన
పరీక్షాసమయంబుల నభ్యాసికి భంగంబు దొరకొనకుండు, మఱియు
నిట్టి వేదికావిధానంబు ప్రతివాసరకరణీయం బగు నని పలుకుదు రది
యట్లుండె వెండియు నాకర్ణింపుము.

35


క.

గురుభృగురవివాసరముల
నరయగ నొకవాసరంబునం దీగతి సు
స్థిరలీల లక్ష్యవేదిక
సరవిం బచరింపవలయు సమ్ముద మొదవన్.

36

వ.

మఱియును.

37


ఉ.

వాసరనాథజీవభృగువారములం దొలుదొల్త నూతనా
భ్యాసికి లక్ష్యవేది పరిపాటి నమర్పఁదగున్ నిరంతరా
భ్యాసికి సౌమ్యవార మశుభంబగుఁ దక్కటి యాఱువారముల్
భాసిలు లక్ష్యవేది నిలుప ధనురాగమసమ్మతంబులై.

38


వ.

ఇట్లు నూతనాభ్యాసి పూర్వోక్తంబులగు రవిగురుభార్గవవారంబులఁ
బంచాంగసంగతంబగు నొక్కవాసరంబున లక్ష్యవేదికావిధానంబు
పూర్వోక్తప్రకారంబున నాచరింపంజేసి.

39


సీ.

ఆవేళ వేకువ నవలీల మేల్కాంచి
        యఘమర్షణస్నాన మవధరించి
భవ్యమాల్యాంబరాభరణముల్ ధరియించి
        తిలకంబు నుదుటఁ జిత్రీకరించి
ఆగమోక్తుల ధనుర్యాగంబు గానించి
        యగ్నిప్రదక్షిణ మాచరించి
ధాత్రీసురులకు సంతర్పణల్ గావించి
        వార లొసంగు దీవనలు గాంచి


గీ.

బొమిడికం బుత్తమాంగకంబున ధరించి
కంచుకము గూర్పరమ్మున మించఁ గొడిగి
అవల గోధాంగుళిత్రాణ మవధరించి
రంగమధ్యంబుఁ జేరి ధీరత రహించి.

40


సీ.

రహి నిష్టదేవతాప్రార్థన గావించి
        శరశరాసములపూజలు ఘటించి
మ్రొక్కుచు గురునాజ్ఞ ముదమున భావించి
        యవల ధాత్రీదేవి నభినుతించి

యేపుమై చాపంబువైపులు భావించి
        గరిమతో నరిఁ జక్కఁగా ఘటించి
ప్రోదిమై విల్లు వర్తులముష్టిఁ గీలించి
        యాలక్ష్యవేదిక నధికరించి


గీ.

దవ్వులను లక్ష్యవేదికఁ దనరు శక్తి
యమరుచోట సమస్థానకము ఘటించి
కార్ముకగుణంబు పృష్ఠభాగంబు క్రిందు
మీఁదు గనునట్లుగా ముష్టి నూఁది మఱియు.

41


గీ.

మ్రోల నొరుఁ డూను తూణపుముఖమునందు
నీటెపట్టున నారస మెడలఁ దిగిచి
సాఁచి నారాచమధ్యంబు చాపయష్టి
నడుమ డాపలిముష్టిపై నిడఁగవలయు.

42


క.

అటు లూనిననారాచం
బిటునటులుం గదలనీక యిట్లు పదిలుఁడై
దిటమున జుట్టనవ్రేలం
బటుతరగతి నూదవలయుఁ బాటవ మెసఁగన్.

43


క.

మొదలిటినియమము దప్పక
సదమలగతిఁ బుంఖ మదికి సమధికధైర్యా
స్పదుఁడై డాపలిపార్ష్ణిన్
బదపడి యిడవలయు సవ్యపదగుల్ఫమునన్.

44


వ.

ఇవ్విధంబున వైష్ణవస్థానకంబుననుండి తోడన ధనుశ్శృంగంబు
వామోరుపర్వాగ్రగంబుగా శరాసనంబు వంచి యిరువదినాలుగంగు
ళంబులకొలఁదిం బదయుగళంబునకు నెడ గల్గునట్లుగా వామపదంబు
జఱపుచు బెట్టిదంబుగా నిలువరించి పూర్వోక్తప్రకారంబుగా నరాళ
హస్తంబున గాఢాకర్షణంబుఁ గావించుచుఁ జుబుకాధరమధ్యంబు

సోఁకం దిగిచి పదజానుజంఘోరుకటిమధ్యవక్షోగళచుబుకాధరనయన
భ్రూలలాటభుజకూర్పరమణిబంధకరతలాంగుళంబుల నార్జవం బా
పాదించుచు దక్షిణభుజకూర్పరంబు నారాచపుంఖంబునకును, నారా
చపుంఖంబు వామజత్రుస్థానమునకును వామజత్రుస్థానంబు ధనుర్లస్తక
సంహతంబగు వామముష్టిప్రదేశంబునకుం జక్కనగా సూలునం బట్టిన
యట్టు లమర్చి యట్లు బెడిదంబగు వామముష్టిప్రదేశంబు ననుసరించి
నిశ్చలంబుగా దృష్టిప్రసారంబు నిగుడింపుచుఁ గోరకంబు కరణిఁ జాప
యష్టిమఱుంగున గాత్రం బాకుంచితంబుఁ గావించి యూర్పుగాడ్పుల
నెడగలుగం జడియుచుఁ గర్ణాభ్యర్ణంబునకుం దిగిచి తోడనే వలపట
డాపటం బ్రకటంబులగు ఱెక్క లక్కజంబుగా నొండొకటి నొరయం
బుంఖోద్వేజనంబును, నారాచమోచనంబును, ముష్టిప్రేరణంబునుం
జాపోత్సరణంబునుం గావించి పుంఖంబు లస్తకంబు వెడలునంతకుం
బంచాననంబునకుం గమకించు శరభంబులీల సరభసంబుగా మలయా
నిలశీతలవలనంబులం జిలిబిలివికసించు మల్లికాముకుళంబుకరణి
వెలి కుఱికి కఠికరణిం గరకరి నర్ధమండలంబునం దక్షిణచరణంబు
వామాంఘ్రిసదృశంబుగా సమపదస్థానకంబున నిలిచి యూర్ధ్వాధః
కృతగుణపృష్టంబగు కార్ముకంబు వక్షంబునకుం దెచ్చి పౌరుషంబు
నకుం బరిరంభణంబునుఁ గావించుచు, సింహగర్జనంబుతోడన దక్షిణ
హస్తప్రథమాంగుళనఖరంబు గగనభాగంబును, ద్వితీయాంగుళనఖ
రంబు వక్షఃస్థలంబునుం జూచునట్లుగా నమర్చి నిలుపం దగు నిది
వేదికాలక్ష్యంబున నారాచనమోచనప్రకారంబు, మఱియు నిందు
లకుం దగినవిన్నాణంబులు గలవు క్రమక్రమంబున వివరించెద
నాకర్ణింపుము.

45


క.

ఇమ్ముగఁ బ్రత్యాలీఢప
దమ్మునఁ గూర్చుండి యేయఁదలచినఁ బదయు
గ్మమ్మునకు నడుమ నెడముస
సి మ్మనుపఁగవలయు నైదుజేనలకొలఁదిన్.

46

క.

ఏయదుకున దానదుకునొ
యాయదుకున నదియు లక్ష్యమం దెడసొచ్చున్
బాయక నుబికింపుచు నల
చే యించుక లోపలికి ససిం ద్రిప్పినచోన్.

47


గీ.

ఎడమపార్శ్వంబు గ్రక్కున నించుకంత
వంచి పుంఖంబు వడి నుబికించెనేని
పుట్ట నురగంబు సొరఁబాఱుపోల్కి నార
సము ఖచిక్కునఁ జొక్కు లక్ష్యంబునందు.

48


సీ.

మున్నుగా నొకశార్ఙ్గముకొలంది నడపించి
        యిరుశార్ఙ్గములదూర మిడఁగవలయు
నిరుశార్ఙ్గములదూర మిడి నేర్పు నాటించి
        సార్ధత్రయంబుగా జరగవలయు
సార్ధశార్ఙ్గత్రయాయతికృతాభ్యాసుఁడై
        నాల్గుశార్ఙ్గము లెడ నడపవలయు
నాలుగింటికొలంది నారాచ మడరించి
        సార్ధపంచక మెడ జరగవలయు


గీ.

సార్ధశార్ఙ్గపంచక మితస్థలమునందు
చతురుఁడై మీఁద నొక్కొకశార్ఙ్గమాన
మెరుగునట్లు నానాఁటికిఁ బదునొకండు
శార్ఙ్గములదూర ముద్ధతి సలుపులయు.

49


గీ.

పదునొకండుశార్ఙ్గమ్ముల పదునొకండు
సరణు లభ్యాసపరిణతిస్థలమునందు
సార్ధశార్ఙ్గత్రయాయతి సార్ధశార్ఙ్గ
పంచకాయతి వేయుట భరము సుమ్ము.

50

క.

ఈలీల నీస్థలంబుల
వ్రీలక నారసము లక్ష్యవేదిక నిలుపన్
జాలినధీరుడు విజయ
శ్రీలాలితుఁ డగుచు నుల్లసిల్లు నధికుఁడై.

51


క.

ఱెక్కలుగల నారసమే
యక్కజముగ రెండుచోటులందు నడపఁగా
ఱెక్కలు లేనిది నూఱుల
నొక్కఁడు నడపున్ బహుప్రయోగనిపుణుఁడై.

52


ఉ.

ఱెక్కలనారసంబులు గుటి న్నినుపందగు లక్ష్యవేదికన్
ఱెక్కలులేనినారసము ఱివ్వున నైదిటిమీఁదిచోటులన్
రెక్కొనఁజేసెనేని యది రింగున నడ్డముఁబ్రాకు నిట్టులీ
చక్కటు లన్నియుం దెలయఁ జాపధరుం డలరుం జగంబులన్.

53


క.

ఏకాదశస్థలంబుల
దాకొని ప్రథమస్థలంబు దక్కఁ బయిపయిన్
దీకొని నారస మదికినఁ
బ్రాకటముగ రెండుగఱులు పై నిడవలయున్.

54


క.

ఒకశార్ఙ్గము కొలఁదిం బా
యక నారాచంబు సరవి నదికెడుచోఁ ద
ప్పక రెండుఱెక్క లడుగున
నొకగరిపై నమరునట్టు లూనఁగవలయున్.

55


క.

ఒకశార్ఙ్గము కొలఁదికి ల
స్తకమున నారాచ మూనఁ జను మఱి పైపై
నొకశార్ఙ్గమాన మెదిగిన
నొకదారమువాసి మీఁద నూనఁగ వలయున్.

56

గీ.

మీఁదు లక్షీకరించిన మీఁదనదికి
క్రిందు లక్షీకరించినఁ గ్రిందనదికి
నడుమ లక్షీకరించిన నడుమనదికి
నారసము లక్ష్యవేదిపై నడుపవలయు.

57


సీ.

కుడియోర నగ్ర ముంకువమీఱ సోఁకిన
        నెడమయోరకుఁ బుంఖ మెడలరాదు
ఎడమయోర నలుఁగు కడిఁదిమై నాటినఁ
        గుడియోరకై పింజ సడలరాదు
అగ్రంబుమీఁద నవ్యగ్రమై సోఁకిన
        వడిఁ బుంఖ మడుగున వ్రాలరాదు
అగ్రం బడుంగున నవలీల గాఁడిన
        పుంఖంబు మీఁదికిఁ బొరయరాదు


గీ.

నారసము లక్ష్యవేదిపై నాటునపుడు
వఱలుపుంఖంబు వడవడ వడఁకరాదు
కావున యథానుసంధానకౌశలమున
నలుఁగునకుఁ బింజ సమముగా నడపవలయు.

58


గీ.

నారసము లక్ష్యవేదిపై నడపునపుడు
నస్త్రధరుఁ డెంతతగ్గిన నంతమేలు
తగ్గి నారాచ మెత్తునఁ దవులనీక
నలువు దీపింప సమముగా నడపవలయు.

59


వ.

మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

60


సీ.

ఏవిల్లు తనబుద్ధి కెలమి నాపాదించు
        నావిల్లు హితముగా నందవలయు
నేముష్టి తనపేర్మి కామోదము ఘటించు
        నాముష్టి నిష్వాస మందవలయు

నేస్థానకము మది కింపు సంపాదించు
        నాస్థానకంబున నమరవలయు
నేహస్త మాత్మకు దోహళంబు ఘటించు
        నాహస్తమునఁ దివియంగవలయు


గీ.

లక్ష్యలక్షణాభిజ్ఞుఁడై లక్ష్యవేది
నారసము లేకవిధముల నడపఁజూడ
ననుదినంబు చిరాభ్యాసమునఁ జెలంగి
నారసము లన్నివిధములు నడపవలయు.

61


వ.

అని యిట్లు కొందఱు ధనుర్ధరు లుక్తలక్షణంబుల నతిక్రమించి
లక్ష్యభేదనంబు ఫలంబుగాఁ గార్ముకముష్టిసంధానస్థానాకర్షణం
బులు మార్పడ శరంబులు నినుపఁజూచిన సంప్రదాయజ్ఞులగు ధనురా
చార్యుల కభిమతంబు గాకుండు. మఱియును విశేషంబు గల
దాకర్ణింపుము.

62


సీ.

అఖిలదేశభవంబులైన శార్ఙ్గములలో
        ననఖండ శార్ఙ్గమ్ము నాణె మండ్రు
ముఖ్యంబులగు మూఁడుముష్టుల వర్తుల
        నామకంబగు ముష్టి నాణె మండ్రు
స్థానప్రతిష్ఠానసరణిఁ బ్రత్యాలీఢ
        నామకస్థానంబు నాణె మండ్రు
ఆకర్షణములైన హస్తంబుల నరాళ
        నామకహస్తంబు నాణె మండ్రు


గీ.

భవభవోద్భవజమదగ్నిభవదిలీప
కౌశికరఘూద్వహాదిక కార్ముకాగ
మార్థనిర్ధారణాగరీయఃప్రబోధ
సంశ్రితశ్రీపరిశ్రితశస్త్రధరులు.

63

వ.

అట్లు కఠినలక్ష్యభేదనకౌశలంబునకుం బ్రథమస్థానంబగు లక్ష్యవేది
కాభేదనంబునం గుశలుఁడై చిత్రలక్ష్యంబుల శరప్రయోగనైపుణ్యంబు
సంపాదింపవలయు నదియును వివరించెద నాకర్ణింపుము.

64


సీ.

గుణలంబితం బైన గోవిషాణంబున
        నిషుపంచకము గాఁడ నేయవలయు
పళ్ళెరంబులనీటిపై యంత్రములఁ జూచి
        యేపుమై తెగిపడ నేయవలయు
నారికేళఫలంబు ధారుణిపై నుంచి
        యెసగంబు మై దూయ నేయవలయు
ధాత్రిపైఁ బరచిన చిత్రకంబళముల
        నెలమిఁ గూర్చినభంగి నేయవలయు


గీ.

రజ్జులంబితచషకంబు రథముమీఁద
సాహిణముమీఁద పరువునఁ జౌకళించి
వాఁడిశరమునఁ దెగ నేయవలయు ధన్వి
తత్తదనుకూలబాణసంధాన మరసి.

65


క.

కృత్రిమతరుశాఖాగ్రగ
పత్రిం బడ నేయవలయు భాసురదృష్టిన్
ధాత్రీశుఁ డొక్కశరమున
చిత్రశరవ్యముల నచలచేతస్కుండై.

66


వ.

విను మొక్కవిశేషంబు వివరించెద, లక్ష్యంబు చాక్షుషంబును,
శాబ్దంబును, మానసికంబునను భేదంబులఁ ద్రివిధంబులై యుండు
చక్షుర్గ్రాహ్యంబగు లక్ష్యంబు చాక్షుషం బనియును, శబ్దగ్రాహ్యం
బగు లక్ష్యంబు శాబ్దంబనియు, మనోగ్రాహ్యంబగు లక్ష్యంబు మాన
సికంబనియును, బ్రఖ్యాతంబులై యుండు నం దూర్ధ్వాధస్సమవిని
భాగంబుల నింతవట్టుఁ జాక్షుషంబు వివక్షితం బయ్యె, ద్వితీయంబగు
శాబ్దలక్ష్యంబున శరాభ్యాసంబున కుపాయంబు గల దాకర్ణింపుము.

67

సీ.

జల్లెడ కొలఁది లక్ష్యము రాత్రిఁ బచరించి
        యాలక్ష్యమున ఘంట వ్రేలఁగట్టి,
యెలమి నాఘంటకు నిరువదిబారల
        సన్నంపుసూత్రంబు సంఘటించి,
కుడియోర నొకరుఁ డాగుణము లాఁగుచు ఘంటఁ
        గదలింపఁ దానును గనులు మోడ్చి,
మొదల లక్ష్యమునకు మూఁడువిండ్లకొలంది
        శబ్ద మాలింపుచు శరము నడపి,


గీ.

యవల నభ్యాసమున నాలుగైదునాఱు
విండ్లకొలఁదుల నొక్కొక్కవింటికొలఁది
నాఁడు నాఁటికి దూరంబు నడపవలయు
శాబ్దలక్ష్యశరాభ్యాససరణులందు.

68


గీ.

అట్టి శాబ్దలక్ష్య మధికరించుచు లక్ష్య
మొకటి క్రింద మీఁద నొకటి నుంచి
యేయుచుండవలయు నిది ధనురాగమ
సంప్రదాయవిదులశాసనంబు.

69


క.

అల ఘంటాధ్వని మానస
నలినంబునఁ బాదుకొలిపి నయనాంబుజముల్
బలువిడి మొగిచి శరంబుల
సలలితగతి నడుపవలయు సతతము రాత్రిన్.

70


వ.

ఇట్లు చిరాభ్యాసంబున శాబ్దలక్ష్యభేదనంబున విన్నాణంబు సంపా
దింపందగు నింక మానసికలక్ష్యభేదనోపాయంబు సమీరప్రేరణం
బున దీపం బదృశ్యంబైనం దొల్లింటి యభ్యాసంబున భుజియించి
యది కతంబుగాఁ బగలింటి యభ్యాసంబున నిశాసమయంబున శరం
బులు లక్ష్యంబునం జొనుపుటం జేసి భాగ్యవశంబున నప్రయత్నం
బుగా నీకు లక్ష్యం బయ్యె, నిట్టిది మానసికలక్ష్యభేదనప్రకారంబు.

వెండియు ని ట్టూర్ధ్వాధస్సమభాగంబులం దనరు చాక్షుషశాబ్దమాన
సికలక్ష్యంబులం జిత్రలక్ష్యంబుల విచిత్రంబుగా లక్ష్యశుద్ధిమంతంబు
లైన శరంబులు నడపుచుఁ జిరాభ్యాసంబునం గృతహస్తుండై
పురంబు వెడలి మృగయావినోదంబులు సలుపుచు నెగసెడు విహం
గంబులను, బరుంగులిడు కురంగంబులును, పై కుఱుకు వ్యాఘ్రంబు
లును, గదలెడు విహంగంబులును, నడ్డంబు సను భల్లుకంబులును,
గిరికూటస్థంబులగు సింహంబులును బడలుపడ నేయుచు ననవరతా
భ్యాసంబున నైపుణ్యంబు సంపాదింపవలయు నభ్యాసబలంబు లేని
ధనుర్ధరుండు యుద్ధంబుల నపరాధపృషత్కుండగు, నట్లగుట మఱ
వక యభ్యాసంబున నప్రమత్తుండు గావలయు నింకనుం గల విశే
షంబు లాకర్ణింపుము.

71


సీ.

అరి యేడునూఱుచిన్నంగల నిలఁ జూడ్కి
        దగు ననామికమీఁద నిగుడఁజేయ
నరి యాఱునూఱుచిన్నంగల నిలఁ జూడ్కి
        దగు ననామికమీఁద నిగుడఁ జేయ
నహితుఁ డేనూఱుచిన్నంగల నిలఁ జూడ్కి
        దగు మధ్యమాధిష్ఠితంబు సేయ
గొంగ నన్నూఱుచిన్నంగల నిలఁ జూడ్కిఁ
        దగుఁ దర్జనీసంస్థితంబు సేయఁ,


గీ.

జెలఁగి శత్రుండు మున్నూఱుచిన్నయంగ
లందు నిలిచిన శర మగ్రమందుఁ జూడ్కి
సేర నరివాపఁదగు నట్టి చిన్నయంగ
బారకొలఁదికి మూఁడవపాలు సుమ్ము.

72


వ.

మఱియును.

73


క.

ఇన్నూఱుచిన్నయంగలఁ
జెన్నారెడు నహితుపై నజిహ్మగ మేయం

గ్రన్ననఁ దన్మకుటంబుప
యి నెలకొనఁజేయవలయు నీక్షణ మనఘా.

74


గీ.

అట్లు నూఱుచిన్నయంగల రిపుఁ డున్న
నిటలసీమఁ జూడ్కి నిలుపవలయు
నింక చిన్నయంగ నేఁబదియెడఁ గల్గ
దృష్టి చిబుక మనుసరింపవలయు.

75


వ.

ఇట్టి కొలంది లక్ష్యభేదనంబునకుం గొందఱు ధనుర్ధరు లుపన్యసించిన
విశేషంబు గల దదియును వివరించెద నాకర్ణింపుము.

76


చ.

ఎనుబదిచిన్నయంగ లెడ మేడ్తెఱఁ గల్గినవేళ లక్ష్యముం
బనుపడ మధ్యమాంగుళముపై నిడు మర్వది చిన్నయంగలం
దనరెడువేళ లక్ష్యములఁ దర్జనిపై నిడు మంతలోపలన్
మొనసినవేళ మార్గణపుమోమున లక్ష్యము నిల్పు ముద్ధతిన్.

77


గీ.

మఱియుఁ గదిసినఁ బుంఖంబు మధ్యమంబు
నలుఁగు నేకాకృతిని శరవ్యంబునడుమ
చక్కనగ నట్లు దివియుచు సాయకంబు
లక్ష్యమున నొప్పగాఁదగు లక్ష్యవేది.

78


వ.

ఇట్లు పాదచారియై ధనురభ్యాసంబు సలుపు నభ్యాసికిం దగిన విన్నా
ణంబులుం బ్రవర్తిల్లుచుండు నింక రథగజాశ్వంబుల నుండు శరా
భ్యాసికిం దగిన విన్నాణంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

79


సీ.

చామరధ్వజసితచ్ఛత్రాదిపార్థివ
        వ్యంజనంబుల భావరంజనంబు,
స్థానపంచకసముత్థానంబు గలుగు నా
        యోధనంబులకును సాధనంబు,

పరశుపట్టెసగదాప్రముఖాయుధోత్తమ
        ప్రేరణంబులకును గారణంబు,
ఘనచిత్రలక్ష్యభేదనబాణవేణికా
        యోజనంబునకును భాజనంబు,


గీ.

మొదలి హరిహరపురుహూతముఖధనుర్ధ
రావతంసుల కభిమతంబై తనర్చు
నరదము తురంగమాతంగకాది వివిధ
వాహనంబుల నుత్తమవాహనంబు.

80


వ.

వెండియు రథారోహకులకుం దగిన దృష్టిముష్టిసంధానస్థానశర
మోచనప్రకారంబులు మున్ను వక్కాణించితి రథారోహణంబుల
నట్టి విన్నాణంబులు మఱువక యాచరింపుచుం బ్రతివాసరంబును
రథారోహణంబు గావించి విలంబమధ్యమతీవ్రయానంబుల నచంచ
లంబుగా శరసంధానమోచనంబుల లక్ష్యశుద్ధిఁ గాంచి రాణించం
దగు నింక సంగ్రామసమయంబుల రథారోహణంబు చేసి రథికుం
డాచరించు విన్నాణం బుపచరించెద నాకర్ణింపుము.

81


సీ.

బాణంబు గల శిరస్త్రాణంబుఁ గీలించి
        ఘనతనుత్రాణ మొక్కటి ధరించి
రాణించు నంగుళత్రాణంబుఁ గదియించి
        కవదొనల్ పదిలంబుగా బిగించి
విద్యాగురూత్తంసువిభవంబుఁ గీర్తించి
        విలుగొని రథ మెక్కి విస్తరించి
రథముపై నొగలపై రథ్యంబులను భువి
        నెలకొని శరములు నిగుడఁజేసి


గీ.

కరణపరిదాహపరిణతస్ఫురణతరణి
కరణిఁ బురణింపుచును రణాంగణమునందు

హ్రస్వుఁడును దీర్ఘుఁడును సూక్ష్ముఁ డలఘుఁ డగుచు
మెలఁగు రథికుండు క్రొక్కారు మెఱుఁగు పగిది.

82


సీ.

తనమేను రథము రథ్యముల సారథిఁ గాఁచి
        యని సేయువాఁడు మహారథుండు
మును పన్నిదములాడి మొనసిన విరథుఁ డై
        యందంద పఱచువాఁ డర్ధరథుఁడు
విరథుడయ్యును బోవ వెన్నీక యచలుఁ డై
        యాలంబు సేయువాఁ డతిరథుండు
రథము వ్రీలినఁ బాసి రథకుఁ డై క్రమ్మఱఁ
        జావమొత్తెడువాఁడు సమరథుండు


గీ.

మ్రందని హయంబు లుడివోని మార్గణములు
కందని రథంబు విఱుఁగని కార్ముకంబు
పడని సారథి సడలని పడగగలుగు
సింహవిక్రముఁ డతిరథశ్రేష్ఠుఁ డనఘ.

83


వ.

మఱియును.

84


చ.

బలముల నీవలావలను బాయవడం జొరనోలి నడ్డమై
నలువము మీఱగా నడిపి నాలుగుపాయలు జేసి మూలలన్
వలయములన్ వడిన్ దెరపి వారగ నుధ్ధతి సూపి ఘోరపుం
దళములతోడఁ బార్థివుఁ డుదారతఁ బోరఁ దగున్ రథస్థుఁడై.

85


వ.

మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

86


క.

కేవలమగు రథికునకుం
దావలమగు పోరులందు దశలక్షణముల్
భావజ్ఞుండగు సారథి
భావింపగ వలయుఁ గార్యపరతంత్రుం డై.

87

క.

సారథి రథికునకంటె ను
దారుండగు నేని మిగులధైర్యస్థైర్య
శ్రీరూఢుండై రథికుఁడు
వీరాహవకేళులందు విజయము నొందున్.

88


వ.

అనిన నర్జునుం డాచార్యునితో నిట్లను మహాత్మా! యుద్ధరంగంబున
రథికునకుం బొడము దశలక్షణంబులకు నభిధానంబు లెవ్వి. యివ్వి
రథంబున రథికుం బ్రబోధించినసారథి యెవ్వఁడు. అట్టి విన్నాణంబు
లెవ్వరివలనం బ్రసాదితంబులయ్యె. నిట్టి విధానంబు పురాతనరథికనిక
రంబులం బ్రవరిల్లెనేనియు వినవలతుఁ జెప్పు మనిన మెప్పు నప్పా
కశాసనతనయుని పాణితలం బప్పళించుచుఁ గుంభసంభవుం డిట్లనియె.

89


గీ.

రామరావణసంగ్రామరంగవీథి
రఘుకులేంద్రుని ఘోరనారాచనిహతి
రాక్షసవిభుండు సొగయ సారథి రథంబు
దొలగఁ దోలెడు నంతలోఁ దెలసి యతఁడు.

90


వ.

రోషారుణలోచనుండై సారథివదనంబు చుఱచుఱం జూచి యిట్లనియె.

91


సీ.

చెఱసాల వడె సునాసీరుఁ డధీరుఁడై
        చకితుఁడై పఱచె వైశ్వానరుండు
బలిమి చాలక మాటుపఱచె మై శమనుండు
        పఱచె భీతిలి కోణపాలకుండు
పాశముల్ వమ్మైన భయ మొందె వరుణుండు
        కాందిశీకుం డయ్యె గంధవహుఁడు
పుష్పకం బొసఁగి పెంపు దొఱంగె ధనదుండు
        సత్వంబునకు మెచ్చె శంకరుండు


గీ.

మచ్ఛరాసననిర్ముక్తమార్గణాగ్ని
కఖలజగములు సంక్షోభ మందుచుండు

మనుజమాత్రుండు గెలుచునె ననుఁ గడంగి
మఱలఁదోలితె రథ మభిమాన మెడలి.

92


వ.

అని కటకటంబడి పలికిన నులికిపడి సూతుండు భీతుండై చేతులు
మొగిచి నిటలతటంబునకుం దిగిచికొని, కొనియాడుచు మున్ను పుర
త్రయభేదనంబునకు నుత్సాహంబున సన్నాహంబు సేయుచుం బుర
హరుండు సారథ్యంబునకుం జతురానను నొడంబఱచుటకునై యొక్క
విశేషం బుపవ్యసించెద నది శుక్రుం డెఱింగియుండుటం జేసి యేక
తంబున మహాత్ముండు యోగనిష్ఠాపరాయత్తచిత్తుండై యుండు
నవసరంబున దండప్రణామం బాచరించి నిటలతటఘటితాంజలి
పుటుండనై వినయంబునం గొలిచియున్న నన్నుం గాంచి ప్రస
న్నుండై యిట్లనియె.

93


క.

సారథివై రథికునకుం
బోరుల విజయంబుఁ గూర్పఁబూనెడు నీకున్
సారములగు విన్నాణము
లారూఢి నుపన్యసింతు నవి యెట్లనినన్.

94


మ.

సమరోత్సాహము దర్ప మింగితము హర్షంబున్ బురఃపారవ
శ్యము భేదంబు బలాబలంబులును దైన్యంబు న్నిమిత్తంబు భా
వమునం దీపదిలక్షణంబులను భావస్ఫూర్తి భావించి యు
ద్ధములన్ సూతుఁడు మేలుగూర్చి రథకుం దాఁ బ్రోచుటొప్పున్ భువిన్.

95


వ.

అని యిత్తెఱంగున సురగురుం డుపదేశించిన విన్నాణంబులు మఱువ
కుండుదుం గావునం దత్తత్సమయంబుల భవన్ముఖలక్షణంబు లరసి
తగినవిధానంబు లాచరింపవలసె, యుష్మద్విజయంబుఁ గోరిన నా
యెడలం బ్రసన్నుండవగుమని ప్రార్థించు సారథిం గాంచి ప్రసన్నుండై
యుద్ధంబునకు సమర్థుం డయ్యెనని పురాణేతిహాసంబున వినంబడు నట్ల
గుట రథికు నుత్సాహదర్పేంగితహర్షభేదదైన్యపారవశ్యబలాబల

నిమిత్తంబులను నామంబులం బరగు దశవిధలక్షణంబు లరయంజాలు
సారథిం గైకొనునేని రథికుండు సకలలోకాధికుండై ప్రవర్తిల్లు
చుండుఁ దక్కుంగల విశేషంబు లాకర్ణింపుము.

96


మ.

రణదాయోధనసాధనంబు రిపుజిద్రాజాధిరాజాధిరో
హణలీలాసుగమంబు శత్రుభయదండాభీలశుండావిజృం
భణదుస్సాధము సర్వతోముఖము భూపాలైకసామ్రాజ్వల
క్షణమౌ వారణమందుఁ బోరఁ దరమౌ స్థానంబులం దైదిటన్.

97


గీ.

పాదచారియైన భద్రేభ మెక్కిన
రథముమీఁదనైన రణములందు
నాశుగముల నడప నగు శరవ్యంబుల
హయముమీఁద నడుపు టరిది సుమ్ము.

98


వ.

అట్లగుట సంగ్రామసముచితలక్షణలక్షితంబులగు హయంబులును,
దదనుకూలంబులగు నలంకారంబులును, వలయు సాధనంబులును,
వేఱువేఱ నిరూపించెద నాకర్ణింపుము.

99


సీ.

కళ దేరు పీవరస్కంధంబు గలదాని
        మెఱుఁగారు వెన్నున మెఱయుదాని
గమ్రభావముఁ దాల్చు కర్ణముల్ గలదాని
        యొఱపుదేరు కడింది యురముదాని,
గంభీరహేషావిజృంభణంబులదాని
        గుళుకుగిట్టెలసౌరు గలుగుదాని
గుఱుమట్టమైన లాంగూలంబు గలదాని
        మెఱుఁగారు వెన్నున మెఱయుదాని,


గీ.

సముచితము లైన శుభలక్షణములదాని
గరుడపవమానవేగంబు గలుగుదాని
ఘోరరణముల విజయంబుఁ గూర్చుదాని
భవ్యమగు నుత్తమాశ్వంబుఁ బడయవలయు.

100

వ.

విను మీదృశంబగు నుత్తమాశ్వంబుఁ బడసి ధనుర్ధరుండు యుద్ధంబుల
నారోహణంబుఁ జేయందగు. వెండియుం దదనుకూలంబులైన యలం
కారంబులు నిరూపించెద నాకర్ణింపుము.

101


సీ.

హాటకస్థగితసింహతలాటబిరుదంబు
        ససిదేరుదిష్టిపూసలసరంబు
మెడ నాణిముత్యాలబెడఁగు లీనెడుచెండ్లు
        పరిఢవిల్లు కడానిపసిఁడిగుండ్లు
కమనీయమణికనత్కనకకల్యాణంబు
        నీలంపుటంకెవన్నియలడంబు,
చతురంకములచలచ్చామరంబులదోయి
        సతమౌహుమానిజాంశాతురాయి,


గీ.

చలివెలుఁగుఱాఁగవాగె వజ్రపుఖలీన
మందములఁ గుల్కునందియ లఱిదివాలు
తళుకుగల సింగిణుల్ మేలితరకసములు
భర్మమయకార్ముకవలగ్నబంధనంబు.

102


వ.

వెండియు నీదృశంబగు నలంకారంబు భాండంబు నాఁ బరగు నిత్తెఱం
గునఁ దురంగంబునకు నలంకరణంబు గావింపవలయు, నింక నాశ్వికులకు
నశ్వారోహణంబులం దగినసన్నాహం బుపన్యసించెద నాకర్ణింపుము.

103


సీ.

భూరిగైరికచారుహీరకోటీరంబు
        రమణీయమణిమయోరశ్ఛదంబు
భర్మనిర్మితచర్మపట్టలలామంబు
        కీలితాభీలకౌశేయకంబు
కరతలోజ్జ్వలహైమకార్ముకోత్తంసంబు
        స్థగితగోధాంగుళిత్రద్వయంబు
భాగావళీపూర్ణతూణీరయుగళంబు
        భరితకార్ముకమధ్యబంధనంబు

గీ.

రహి ధనుశ్శాస్త్రచోదితక్రమనిరూఢీ
దాల్చి వరభూషణంబులు తళుకు లొలుక
నంగముల సంగరోత్సాహ మావహిల్ల
హయముపై నెక్కఁదగు నుత్తమాశ్వికుండు.

104


వ.

వెండియు నశ్వారోహకుండు శరసంధానమోచనంబుల నాచరింపందగిన
విన్నాణంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

105


క.

కట్టాయితముగ నిలువం
బట్టినహయ మెక్కి కదలి పార్ష్ణితలములన్
గట్టింపుచు బలుచబుకునఁ
జిట్టాడం గొట్టవలయుఁ జిఱుప్రక్కలపై.

106


ఆ.

అట్టి తాడనమున నతిశయం బొక్కటి
గలదు కరము శిరము గడచునట్టు
లెత్తి కొట్టవలయు నేడ్తెఱఁ జిఱుప్రక్క
లఱిమి కొట్టరాదు పిఱుఁదులందు.

107


వ.

అట్లు కశాఘాతంబులన సత్వరంబు గావించియు సజ్యంబగు శరాసనంబు
వామహస్తంబున నలవరించి క్రమ్మఱఁ గశాభిహతి నశ్వంబున కుద్వే
గంబు సంపాదించి తోడన వాఁడిగలుగు బాణంబు తూణంబును
దివిచి గుణంబున యథావిధి సంధానంబు గావించి చతురస్రముష్టిం
బ్రథమద్వితీయాంగుళమధ్యంబునను స్థిరంబుగా నిలువంబట్టి వెండియుఁ
జబుకునఁ జుబుకనం గొట్టి ధట్టించి హయంబునకు రయంబు సంపా
దించి మఱియును.

108


సీ.

తనకొలందికి నేయఁదగిన దూరంబున
        మూఁడుభాగముల నిమ్ముగ విరోధి,
మలయ డాపలికాలిమడమ నంకెనమీద
        సదృశంబుగా నూది చాపయష్టి,

వామాంఘ్రి సమముగా దీమసంబునఁ బట్టి
        దృఢలీల నిండారఁ దిగిచి శత్రు
డా మూఁడుభాగమ్ములందును మూఁడుభా
        గంబులకొలఁది డగ్గఱినపిదప


గీ.

నడచు గుఱ్ఱంబుచెవి ప్రమాణంబు గాఁగ
మానస మచంచలంబుగా మనిపి శరము
ఠీవి నడపించి కేలు ఝాడింపవలయు
నసమసమరాంగణమ్ముల నాశ్వికుండు.

109


గీ.

హయముఁ నదలించినది మొద లంచితముగ
నాశుగోత్తంస మరివాపు నంతదడవు
లక్ష్యమున దృష్టి నతినిశ్చలంబు గాఁగ
నప్రమత్తుఁడై యిడఁదగు నాశ్వికుండు.

110


క.

తురగంబుం బరగింపుచు
శరసంధానమ్ము సేయ సమకొనుచోఁ జె
చ్చెఱ నెడమకాలియంకెన
పొరిఁబొరి నంగుళమువాసి పొడ విడవలయున్.

111


గీ.

ఎడమపాద మూన నించుక హెచ్చుగా
నిడక యంగుళంబు లేకరీతి
నునిచెనేని బాణ ముబికింపనూనుచో
మ్రొగ్గతిల్లు సాది ముంగలికిని.

112


వ.

మఱియు నొక్కవిశేషంబు గలదు.

113


క.

అంకెనపై దాపలియడు
గుంకువగా మిగుల భార మూనఁగఁ దగ ద
య్యంకనబంధము వీడును
సంకటమున టంగువాఱు జాఱు శిథిలమై.

114

క.

ఆవిధమున నడ రొదవుం
గావున భారమ్ము సమముగా నిడవలయున్
దా వామాంఘ్రితలంబున
కావలితంబై తనర్చు నంకెనమీఁదన్.

115


వ.

అనిన నాచార్యునకు నర్జునుం డిట్లనియె.

116


చ.

దురమున నుగ్రపున్ రిపుల తోరపుఘోరపుటంపవెల్లివి
స్తర మరుదేర వారలకుఁ జాలి శరాలి నొగి న్నిగుడ్చుచున్
బరిగొనుచున్ బిఱిందిదెసఁ బైకొను శాత్రవు నేయ గుఱ్ఱమున్
మరలుపరామి నాశ్వికుఁడు మార్గణముల్ నిగుడింప నెట్లగున్.

117


వ.

అదియునుం గాక.

118


క.

కరిరథసంబాధంబై
తురఁగము మఱలింపరానిత్రోవన్ బోవన్
బరవీరులు వెనుకొనఁగా
శర మె ట్లరి వాపవచ్చుఁ జాపధరుఁ డిలన్.

119


వ.

అనిన నాచార్యుం డిట్లనియె.

120


గీ.

అంకెనలమీఁదఁ బాదంబు లాని లేచి
వెనుమఱలి రొమ్ము పల్లపువెనుకఁ గోటి
సమముగా వాంచి తిర్యగిష్వాసుఁ డగుచు
మెఱుపు మెఱసినగతి నమ్ము బఱపవలయు.

121


వ.

విను మట్లు చాపంబు తిర్యక్సమశృంగంబుగా నాకర్షింపక తొల్లింటి
తెఱంగున నాకర్షించిన శృంగంబునకు భంగంబు సంప్రాప్తంబగు
నీదృశంబగు శరప్రయోగనైపుణ్యంబు చిరాభ్యాసంబున నధికరింపం
దగు. వెండియు నాశ్వికునకుం దగిన చిత్రయుద్ధప్రకారం బుపన్య
సించెద నాకర్ణింపుము.

122

దండకము

శ్రీ జానకీమానసాంభోజమిత్రా సుమిత్రాసుతానూదితస్తోత్ర
పాత్రా, సుపాత్రానిశప్రాపితామేయగోత్రా, సుగోత్రామరశ్రీపరిత్రాణ
చిత్రా, అహోరామధాత్రీకళత్రా, సతం బీవనీపట్టణాస్థానసింహాసన
స్థాయినై యున్న నిన్నుం బ్రకీర్తించుచుం గుంభజుం డర్జునుం గూర్చి
బోధించు నీయాశ్వికాభంగసంగ్రామరంగప్రసంగంబులన్ వాక్ప్రసూ
నంబులం దండకాకారమౌ చిన్నిపూదండ గావించి మీదివ్యపాదార
విందంబులందున్ సమర్పించి సేవించెదన్ సత్కృపార్ద్రైకభావంబునం
బ్రోవవే, సాదరుండై గురుం డానరుం గాంచి తోషించి భాషించి వేడ్కన్
బెడంగైన చెన్నుల్ విడంబించుకన్నుల్ మెఱుంగారు మేనున్ తెఱంగైన
కౌనున్ ససిందేరునిమ్మున్ బిసాళించు రొమ్మున్ సిరుల్ గూర్చువాహంబు
పైపచ్చడా లంకెవన్నెల్ రవాళించుబంగారపున్నీరులన్ సౌరులన్ దేరు
పల్యాణమున్ మేలిముత్యాలచెండ్లున్ సొబంగారు బంగారుగుండ్లున్ జిరా
కెంపు రాసొంపు రాణింప నింపౌఖలీనంబు నీలాలడాలై విరాళించు మేల్వాగె
బాగౌ నిజాంశాతురాయీ చలచ్చామరంబుల్ లసన్మండలాగ్రంబు
తూణీరముల్ మేనిసింగాణివిండ్లున్ ధనుర్మధ్యమాధారబంధంబునున్
లోనుగా యుద్ధరంగోచితాడంబరఁబుల్ విడంబంబునం గూర్చి తేరం గిరీ
టంబునున్ గంటకంబున్ దిటంబైన గోధాంగుళిత్రాణముం దూణముం
బాణబాణాసనంబుల్ న్మేఖలాబంధమున్ మెచ్చఁగా సద్ధనుర్మధ్య
మాధారబంధంబు సమ్యగ్వలచ్చర్మపట్టీలలామంబు సేమంబునం తాల్చి
సన్నద్ధుఁడై యుధ్ధతిన్ వాహ ముత్సాహముల్ మీఱఁగాఁ దీరగా
నెక్కుచున్ గ్రక్కునన్ నిక్కి యేదిక్కునం దానయై యాశ్వితాగ్రేసరుం
డశ్వమున్ విశ్వమున్ మెచ్చఁగా హెచ్చి రానిచ్చుచుం గ్రచ్చఱన్
మెచ్చుచున్ డాయుచున్ బాయుచున్ వ్రేయుచున్ మ్రోయుచున్
వైరులం బోరులం జీరికిం గోక వెన్నీక మున్నావలం దావలంబై చలంబాఱ
బోరాడ బేర్వాడి క్రొవ్వాడివాలమ్ము ఫాలమ్మునన్ నాటి ధాటిన్ విరోధిన్
నిరోధించుచున్ ఘోరమై నీరథిన్ దూరు పెంజోరలీలన్ సఖేలంబుగా

శాత్రవవ్యూహ ముత్సాహియై చొచ్చి యొక్కొక్కచోఁ గాలఁ దాటించి
చౌదాటు దాటించి బాణంబు తూణంబునం దీసి పెల్లేసి యుల్లాసియై
యట్టహాసంబు భాసిల్ల మల్లాడుచున్ బారెటన్ నిల్పుచున్ మూరెటన్
మల్పుచున్ కోపులన్ ద్రిప్పుచున్ తూపులన్ గప్పుచున్ శత్రు లుద్గా
త్రులై నెట్టనం జుట్టునం జుట్టినం దిట్టయై ముట్టి ధేయంచు వేయంచు
వాలంబులన్ దత్తడిం దిర్దిరం ద్రిప్పుచున్ విల్లు చక్రాకృతిన్ బర్వఁగా
దుర్విగాఢైకసంధానపారీణుఁడై నూఱు నిన్నూఱు మున్నూఱు నన్నూఱు
నేనూఱు నార్నూఱుగాఁ దూపులన్ వీపులన్ వైపులన్ బ్రక్కలన్
జెక్కులన్ మేనులన్ వీనులన్ ద్రొక్కటం జక్కఁగా డుస్సి పాఱం
బ్రయోగింపుచున్ ద్రుంపుచున్ సొంపుగాఁ బెంపుగావింపుచున్ డాయ వేచా
యలన్ మాయలన్ సాయకంబుల్ రకం బార నేయం జయోదారుఁడై
ధీరుఁడై పైకి రానీక క్రొక్కా రు మేఘంబునన్ దోచు విద్యుల్లతాధోరణిన్
దారుణాధోరణప్రేరణశ్రీరణద్వారణోత్సారణక్రూరనారాచధారాళధారా
ప్రసారంబు ఘోరంబు గావింపుచున్, బారులై తేరు లొక్కుమ్మడిన్
గ్రమ్మినన్ హుమ్మురంచున్ హయంబున్ రయం బారగాఁ జుట్టుపేరెం
బులన్ ద్రోలుచున్ దా రథిన్ సారథిన్ యుగ్యమున్ బగ్గమున్
జాపమున్ రోపమున్ దండియై ఖండముల్ సేయుచున్ జిత్రసంచార
దుర్వారుఁడై శూరుఁడై లోకముల్ మెచ్చగా శత్రుసందోహమున్
దోలి భాస్వజ్జయశ్రీసమారూఢుఁడై హారనీహారడిండీరపాటీరకర్పూర
మందారగోక్షీరవిస్ఫారకీర్తిస్ఫురన్మూర్తియై భాసిల్ల రేకల్కితేజీ అయా
రేహుమా మేల్బళీ సత్కులీనాళ్వరత్నంబ నీధాటికిన్ విద్విషత్కోటి
పేరోటమిన్ గూటమిన్ బాసి రంచున్ జెవు ల్ముట్టుచున్ గంఠమున్
దట్టుచున్ బెంపు వాటింపగా నొప్పు నంచున్ గురుం డశ్వయుద్ధప్రకారం
బుదారస్థితిం జెప్పిన మెప్పునం గాంచి పూజించి పార్థుండు సంతోష
వార్ధిన్ వెసం దేరుభావంబుతోఁ దక్కునుం గల్గు విన్నాణముల్ సెప్పు
మంచున్ బ్రకాంక్షించె యుష్మత్పదాబ్జద్వయీచిహ్నితం బైన యీ
దండకం బిట్టు లాచంద్రతారార్కసంస్థాయి గావించుచున్ మేలు రావిం

చుచున్ బ్రోవవే దేవ దేవాధిదేవైక విశ్రామసీమా శుభస్థేమకోదండ
రామా నమస్తే నమస్తే నమస్తే నమః.

123


వ.

చిత్రయుద్ధప్రకారం బుపన్యసించి మృగయావినోదంబుల నానావిధ
సత్త్వంబుల నధికరించి శరంబు లేయం దగిన విన్నాణంబు లాకర్ణింపం
దగుఁ గుతూహలాయత్తచిత్తుండగు పార్థునకు నాచార్యుం డిట్లనియె.

124


క.

ఆకాశంబునఁ బక్షులఁ
బ్రాకటముగ నడవులందు బహువిధగతులం
దీకొను మెకముల నేయ వి
వేకమ్మునఁ గలవు సుమ్ము విన్నాణంబుల్.

125


సీ.

వీను లక్ష్యము చేసి విశిఖ మేసిన గాఁడి
        పాఱు వీపుననైన బ్రక్కనైన
నురము లక్ష్యము చేసి యరివాప నోనాటు
        శరము రొమ్ముననైన జబ్బనైన
మొగము సూపిన గళంబున సోకు గళము ల
        క్ష్యంబు జేసిన నాటు జంఘనైనఁ
ద్రోటీ లక్ష్యము సేయఁ బాటవమ్మున నాటు
        గళముననైన వక్షముననైనఁ


గీ.

పఱచెడు మెకంబునకు నెదుర్పడిన కిటికి
కుడియెడమ లడ్డముగఁ బ్రాఁకు క్రోలుపులికి
గగనమున నేఁగు పక్షికి గ్రమముతోడ
నభ్యసింపఁగ నగు నేర్పు లాశ్వికునకు.

126


వ.

విను మొక్కవిశేషంబు గలదు. కార్ముకంబుల సారంబును బరచెడి
మృగంబులవేగంబును శరంబుల తారతమ్యంబును భావించి లక్షీక
రించిన యవయవంబునకుం గురంగట మనోభావంబునకుం దగిన
దూరంబున లక్ష్యం బిడి శరంబు నినుపం దగు నిట్టియోజానావైద

గ్ధ్యంబు చిరాభ్యాసబలంబునం బ్రాపించు నింక దూరాపాతనశరా
భ్యాసంప్రశంసం బుపదేశించెద నాకర్ణింపుము.

127


సీ.

దూరపాతనమున కారూఢి నొందిన
        మూఁటిలోపల శిలీముఖము లెస్స
ఆశుగంబులలోన నది సుకుమారంబు
        సంధానమున నేర్పు చాలఁ గలుగు
దిరుగు నడ్డము ప్రాఁకు నరచెయ్యి నగలించు
        వలకేలు చులకగా వదలకున్న
గాలివాటముఁ జూచి గగనంబు పంచుట
        సంధిల్లు దీనికి సాధనంబు


గీ.

వణఁకగానీక చెంగట వ్రాలనీక
విరిగిపడనీక నటునిటు వ్రీలనీక
నలిశిలీముఖ మొప్పుగా నడపనేర్చు
జనుఁడు కోదండదీక్షావిశారదుండు.

128


వ.

విను మిట్టి దూరాపాతనప్రయత్నంబునకు సమీరప్రేరణగ్రహణ
పూర్వకంబుగా నభోవిభజనంబు గావించ నేర్పు గలుగుట ప్రథ
మాంగంబగుటం దద్విభజనోపాయం బుపన్యసించెద నాకర్ణింపుము.

129


క.

ఏదిక్కున కనుకూలం
బై దొరకొను పవనవేగ మాదిక్కునకున్
మోదంబున నభిముఖుఁడై
ప్రోది సమస్థానకంబు పూని నిలుచుచున్.

130


గీ.

తనశిరోమధ్యముననుండి ధరణి నంటి
నట్లు ముందరఁ గనుపడు నాకసంబు
మూఁడుభాగముల్ గాఁ బంచి ముష్టిక్రింద
భాగములు రెండు పై నొక్కభాగ మునిచి.

131

క.

ఆయెత్తుననె శిలీముఖ
మేయం దగు నించుకంత హెచ్చును దగ్గున్
జేయక నైపుణ్యంబునఁ
బాయక దూరాభిపాతపరిచయమునకున్.

132


క.

పగ లాకాశము పంచుట
సుగమము గాదేని రేయిఁ జుక్కలు గుఱిఁగా
గగనంబు మూఁడుపాళ్ళుగ
విగణింపఁగవలయు భావవీథినిపుణుఁడై.

133


గీ.

అట్లు భావించి భాగద్వయాయతముగ
వేణుదండంబు గుఱుతు గావించి నిలిపి
దానిపైఁ గార్ముకపుముష్టి నూని దూర
సమభిపాతనాభ్యాసంబు సలుపవలయు.

134


క.

కోటల పేటల తోటల
మాటుల విభజింపఁ జనదు మన్నున్ మిన్నున్
గూటమివలెఁ గనుపడుటకుఁ
జాటున నాలోకనంబు సమకొన కునికిన్.

135


క.

కావునఁ బంచుట బయులునఁ
గావింపగవలయు సుమ్ము గగనము బుద్ధిన్
భావించియుఁ దారావళి
భావించియుఁ బగలురేయి పరిపాటి మెయిన్.

136


వ.

వెండియు నొక్కవిశేషంబు గలదు.

137


గీ.

ఆకసంబు కొంద ఱైదుభాగములుగాఁ
బంచి రెండుపాళ్ళు పై ఘటించి
మూఁడుపాళ్ళు చాపముష్టిక్రింద ఘటించి
లీల నడుపుదురు శిలీముఖంబు.

138

వ.

ఇట్లు సమీరప్రేరణపూర్వకంబుగా గగనంబు విభజింపందగు నింక
దూరాపాతనంబున కభ్యాసక్రమంబు గల దాకర్ణింపుము.

139


సీ.

మును ప్రమాణంబుగాఁ గొనిన దండముమీఁదఁ
        జాపముష్టి ఘటించి శరము దొడిగి,
తెగవాపి శరము మేదినికి వ్రాలుకొలంది
        భావించి యది మూఁడుపాళ్ళు చేసి,
భాగ మీవల రెండుభాగంబు లవలఁగా
        నభమున నాఱుజేనలకొలంది,
పిటకంబు రజ్జులంబితముగాఁ గీలించి
        యాపిట్యలక్ష్యమై యమరఁజేసి


గీ.

మునుపు దాను శిలీముఖ మొనరఁ దొడగు
పజ్జఁ గొలగఱ్ఱపై ముష్టి పాదుకొలిపి
పదపడి శిలీముఖంబులఁ బఱపవలయు
దినదినంబున నభ్యాసమునఁ జెలంగి.

140


వ.

వెండియు నొక్కవిశేషంబు గలదు.

141


సీ.

ఆలక్ష్యపిటకంబునందు గోధుమపొట్టు
        నిండార నేర్పున నినుపవలయు,
పెనుపొందఁ గార్పాసబీజముల్ నించిన
        నంతకంటెను లెస్సయై తనర్చు,
నదియుఁ జతుష్కోణమైనను యోగ్యంబు
        వృత్తమైనను బరమోత్తమంబు,
మృదులతావలయనిర్మితమైన మే లగు
        వైణవంబైనను వాసికెక్కు,


గీ.

కడిమి నాలక్ష్యపిటకంబు గాఁడిపాఱఁ
జాలు దూరాభిపాతనశరచయంబు

మొదలఁ గొలగఱ్ఱపైఁ జాపముష్టి నిలిపి
నిరత మభ్యాసమునకు నై నిలుపవలయు.

142


గీ.

తొలుత నభము పంచి కొలగఱ్ఱ యార్జించి
యిట్టి పరిచయంబు లెచటనైన
జేయవచ్చు గాని చెలఁగి యాకాశంబు
పంచరాదు బయలు గాంచఁడేని.

143


వ.

ఇవ్విధంబున నభోవిభజనప్రమాణంబగు వేణుదండంబుపై ముష్టి
నిలిపి యభ్యాసంబు సేయుచుం జిరాభ్యాసంబున లక్ష్యశుద్ధిం గాంచి
బయలున శరంబులు నడపుచు ముష్టిగతంబులైన తారతమ్యంబులు
భావింపుచు నైపుణ్యంబు సంపాదింపందగు నిందు పురాతనధను
ర్ధరసంప్రదాయవేద్యంబై సుధీజనహృద్యంబైన చోద్యంబు గల
దాకర్ణింపుము.

144


సీ.

కొలగఱ్ఱపై ముష్టి నిలిపి మున్నేసిన
        యభ్యాసపరిచయం బాత్మ నిలిపి,
బయలున గగనంబు పంచి భాగద్వయ
        మడుగున విలసిల్లునట్లు గాఁగ,
కార్ముకముష్టి పొంకము చేసి విశిఖంబు
        నిగుడించి చూడ్కులు నిగుడఁజేసి,
రూఢిమై శరము ధారుణి గాఁడి యుండిన
        చోటున కరుదెంచి చూడవలయు,


గీ.

ముష్టి గగనంబు పంచినదృష్టితోడ
నుచితవైఖరి నచలమై యుండెనేని
జానుపర్వంబునకుఁ బింజ సమము గాఁగ
లీల ధర గాఁడియుండు శిలీముఖంబు.

145


వ.

వెండియు నట్లు ధరం గాఁడిన శిలీముఖపుంఖంబు జానుపర్వంబునకు దల
కడచి, కార్ముకముష్టిభాగద్వయంబున కతిక్రమించిన దనియును

శిలీముఖపుంఖంబు జానుపర్వంబునకు దిగువం దోచిన భాగద్వయం
బునకు దిగువంబడినదనియును భావంబునం దెలియుచు నుభయ
మధ్యగంబుగా ప్రమాణంబున ముష్టి నలవరించి విన్నాణం బార్జింపం
దగు మఱియును.

146


సీ.

ప్రాక్సమీరంబు నిర్భరలీల విసరుచోఁ
        బ్రత్యఙ్ముఖంబుగాఁ బఱపవలయు,
దక్షిణానిలడింభ మక్షీణ మైనచో
        నెఱి నుదఙ్ముఖముగా నినుపవలయు,
ప్రత్యక్సమీరంబు భాస్వరం బైనచో
        నలిని బ్రాఙ్ముఖముగా నడపవలయు,
నొగి నుదఙ్మారుతం బూర్జితం బైనచోఁ
        దఱి నవాఙ్ముఖముగాఁ దార్పవలయు,


గీ.

ప్రోది జలములపై నేయరాదు మొయిలు
నభముఁ బ్రాకెడువేళల నడపరాదు
గాడ్పు నెదిరించునట్లుగాఁ గడవఁజనదు
సాయకము గాళుపుల కడ్డ మేయరాదు.

147


వ.

ఇట్లు సమీరప్రేరణగుణదోషవినిభాగంబును, గగనవిభజనోపాయం
బును, దూరాపాతనంబుల నభ్యాసంబుల తెఱంగును, వెండియు
నయ్యైయెడలం గలుగు విశేషంబులు నేర్పరించితి ననవుడుఁ
పార్థుండు కృతార్థుఁడై యాచార్యునకు వందనం బాచరించి వెండియు
నిట్లనియె.

148


క.

అనఘా దూరాపాతం
బునకుం దానకము దృష్టి ముష్టియు వేర్వే
ర నిరూపింపందగు నన
ననిమిషపతిసుతునితోడ నాచార్యుఁ డనున్.

149

సీ.

చెలగు నాలుగుకొలందుల శరాసనముల
        పదియేనుపిడియలై పరగునిట్లు,
వెలయు దూరాపాతివిశిఖద్వయంబులో
        లీల రాజిల్లు శిలీముఖంబు,
సంధిల్లు సూచితస్థానపంచకములో
        మానితం బగు సమస్థానకంబు,
ముదము సంపాదించు ముష్టిత్రయంబులో
        వర్ణనీయంబైన వర్తులంబు,


గీ.

నైకమగుదృష్టులందు నుల్లోకితంబు
నలరు ఋతువులలోన గ్రీష్మాగమంబు
లలిని గార్ముకవిద్యావిలాసకలనఁ
దనరు దూరాభిపాతనంబునకు ధరణి.

150


సీ.

అంగయష్టిక తిన్ననై యుండఁగావలె
        నూరువుల్ చక్కనై యుండవలయు,
తనపూన్కి కుడియడుంగున నూనవలె విల్లు
        హయము పల్లముభాతి నమరవలయు.
శరము సాదితెఱంగుఁ బురణింపఁగావలెఁ
        దివియుచో డాకేలఁ దివురవలయు
సమకొల్ప నెడమకేల్ జాడింపఁగావలెఁ
        నరివాప శరము బిట్టడరవలయు.


గీ.

నాకసము పంచి దృఢముష్టి నధిగమించి
విశిఖపుటలుంగు మొనమీఁద విస్తరించి
నడచు బాణంబుతోఁగూడి నభముఁ బ్రాఁకి
దృష్టి లక్ష్యప్రదేశంబు దివురవలయు.

151


వ.

వెండియు నభ్యాసంబున సర్వసాధారణంబుగా ధనుర్ధరులు శరంబులు
నడపందగినకొలందులు వివరించెద నాకర్ణింపుము.

153

గీ.

పరపు నిన్నూటయేఁబదిబార లొకఁడు
పరపు మున్నూటముప్పదిబార లొకఁడు
పరపు మున్నూటయఱువదిబార లొకఁడు
పరపు విశిఖంబు నన్నూఱుబార లొకఁడు.

153


వ.

మఱియు నిరంతరాభ్యాసబలంబున నేనూఱుబారలకొలంది విశిఖంబు
నడుపందగు నిదియును సకలజనసాధారణంబు గాకుండు నైనను
నొక్క విశేషంబు గల దమూల్యంబులగు శరాసనంబులును ననర్ఘ్యం
బులగు శిలీముఖంబులును ననుకూలంబులగు సమీరప్రేరణంబులు
కలిమిం జేసి కొన్నిదేశంబుల ధనుర్ధరులు కొలంది నతిక్రమించి యేయం
జాలియుండుదు రదియును సాధనబలంబునం గాని యభ్యాసబలంబునం
గాదని నిర్దేశింపందగు నవియును వివరించెద నాకర్ణింపుము.

154


సీ.

నడుపుదు రీహస్తినగరంబువారలు
        ప్రదర మేనూఱుబారలకొలంది
బాణంబు సౌవీరపతు లేతు రేనూట
        నలువదినాల్గుబారలకొలంది
పరగింతు రంబు నేపాలభూపాలకుల్
        రహి నాఱునూఱుబారలకొలంది
సాగింతు రంబు కోసలదేశవాసులు
        లలి నేడునూఱుబారలకొలంది


గీ.

సలిలములగాడ్పు లేవేళ నొలయుచుంట
శార్ఙ్గము శిలీముఖంబును జబ్బు వారి
తలగ దిన్నూఱుబారలకొలఁది మీఱి
యిషువు బంగాళభూపతు లేయునపుడు.

155


వ.

వెండియు నేడునూఱుబారలకొలంది శిలీముఖంబు లతిక్రమింప నేయం
జాలిన కౌశలంబు మంత్రబలంబునంగాని సాధనాభ్యాసబలంబులం
గాదని నిర్దేశింపందగు మఱియును.

156

సీ.

కొన్ని జాంగలములు కొన్ని యనూపముల్
        జాంగలానూపమిశ్రములు కొన్ని
గిరిశిలాగహనసంకీర్ణంబులైన దే
        శంబులు గణుతింప జాంగలములు
పాథః ప్రవాహసంబాధంబులైన దే
        శంబు లనూపాహ్వయంబు లయ్యె
కుధరాంభుపూరసంకుచితదేశంబులు
        జాంగలానూపమిశ్రములు సుమ్ము


గీ.

సత్వరంబగు జాంగలస్థలములందు
నతివిలంబ మనూపంబులందు నుభయ
మిశ్రమగు జంగలానూపమిశ్రదేశ
ముల శిలీముఖగమనమ్ము తలఁప నవని.

157


గీ.

వృషభమిథునములను వినుము దూరాపాత
విలసనంబు సలుప విహిత మండ్రు
అట్టివేళనైన నంబువాహంబులు
నింగిఁ బ్రాఁకెనేని నినుపవలయు.

158


క.

బలువిడి శార్ఙ్గమ్మునకును
జలి సోఁకిన నూలుకొలుపఁజాలదు జడమై
యలకనిబాణం బైనను
జలుబానిన దూర మరుగఁజాలదు వలమై.

159


గీ.

శార్ఙ్గ మొకవత్సరము గడచనిన రెండు
వత్సరంబులయది మూఁడువత్సరముల
యదియు దూరాభిపాతనార్హంబులైన
శరము లరివోయుటకుఁ జూవె సముచితంబు.

160

క.

ఒకవత్సరంపు శార్ఙ్గము
వికటంబగు పన్నిదమున విశిఖము దొడుగన్
సుకరంబగు విలుకాండ్రకుఁ
బ్రకటాభ్యాసంబునకును బనుగొన దనఘా.

161


చ.

గణుతికి నెక్కుచుండు విలుకాండ్రు శరం బడరించువేళ స
ద్గుణములు మూఁడు పాటిలఁదగున్ విశిఖంబునఁ దీవ్రవేగమున్
దొణకమి లక్ష్యభేదనము తోరపుటంపరవెల్లి నిట్టు లీ
గుణములు గల్గునట్లుగ నిగుడ్చనివాఁ డొకధన్వియే మహిన్.

162


సీ.

మది నిష్టదేవతామననంబు సలువుట
        విద్యాప్రదాయకు వేడికొనుట
ధనురాగమప్రబోధమున రాణించుట
        శస్త్రాస్త్రమంత్రవిస్తరము గనుట
శరశరాసనవిశేషములు భావించుట
        సంతతాభ్యాసంబు సలుపుచుంట
శరయోజనార్హమౌ సమయం బెఱుంగుట
        కుశలుఁడై లక్ష్యంబుకొలఁది గనుట
సమబలం బైనట్టిచాప మార్జించుట
        గుణము యోగ్యంబుగాఁ గూర్చికొనుట
మఱి ధనుశ్శరములమంత్రముల్ వ్రాయుట
        వైపులు భావించి వలను గనుట
యేపుమై దృఢముష్టిఁ జాపంబు దాల్చుట
        సముచితస్థానసౌష్ఠవము గనుట,
తగులీల నంగుళిత్రాణం బమర్చుట
        పదనైన బాణంపుహదను గనుట,
సమధికస్థితిఁ బింజ సమముగా నదుకుట
        యాకర్షణమున సోయగము గనుట,

చక్కగాఁ జూడ్కి లక్ష్యమునందు నిల్పుట
        చిత్త మాయత్తంబు చేసికొనుట,
సదమలస్థితి వీపు గదలనీకుండుట
        ధనువుచాటున రొమ్ము దాచుకొనుట,
కొమలు వంగిన ముష్టి గుఱుతుగా నిలుపుట
        మునుకొని కనుబొమల్ ముడువకుంట,
పలుమొన లధరంబుపై నూనకుండుట
        సరవిపై గడ్డంబు సాచకుంట,
నరముల కీళ్ళ తిన్నదనంబు సూపుట
        యంగంబు లచలంబులై తనరుట,
నిట్టూర్పు సలుపక నిండారఁ దివియుట
        తివియుచున్నెడ నోరు దెఱవకుంట,
యాకుంచితమున నర్ధాంగంబు కుంచుట
        ప్రేరితంబున విస్తరిలి వెడలుట,
యుద్రేకమునఁ బుంఖ ముబికింపఁజూచుట
        చాపముష్టి నలుంగు ససిఁబఱుచుట,
సొరిదిమైఁ బుంఖంబు చులకఁగా వదలుట
        సింహంబులీల గర్జిల్లుచుంట,
ఠీవి డాకేలు జాడింపఁగా నేర్చుట
        ప్రోదిమై సమపదంబున నిలుచుట,
పౌరుషంబునకుఁ జాపము కౌఁగిలించుట,
        తెగవాపి విశిఖమ్ము తెఱఁగు గనుట,


గీ.

బాణములు సత్వరములుగాఁ బఱపుటకును
దొణఁకక నలోలవైఖరిఁ దూఁగుటకును
కఠినలక్ష్యంబు భేదింపఁగలుగుటకును
ఘనత పాటించు నలువదికౌశలములు.

163

వ.

వెండియు ని న్నలుబదికౌశలంబుల నప్రమత్తుండై శరంబును నడపిన
ధనుర్ధరుండు లక్ష్యశుద్ధిం బడసి కృతార్థుండగు, మఱియు నిష్టదేవ
తానుస్మరణంబునుం గురుస్మరణంబునుం గాక తక్కుంగలుగు నీ
యష్టత్రింశత్కౌశలంబులం బండ్రెండుచోటులం గరణీయంబులై
నాల్గువిన్నాణంబులు బ్రవర్తిల్లుచుండు నని సంక్షేపరూపంబుగా
ధనురాగమసంప్రదాయజ్ఞులగు కొందఱు విన్నాణం బుపన్యసించు
దురు. అత్తెఱంగు నివరించెద నాకర్ణింపుము.

164


ఉ.

పోఁడిమి నంబకంబు నరివోసి వడిం దెగవాపువేళలన్
మూఁడిట మార్దవంబు మఱి మూఁడిటిలోనఁ గఠోరభావముల్
మూఁడిట నార్జవం బవల మూఁడిటిలోన సమానభావముల్
జూడఁగ నాల్గుచైదములు సొన్పఁదగున్ బదిరెండుచోటులన్.

165


క.

శరనంధానంబున భా
సురకార్ముకముష్టి నమరు జుట్టనఁవ్రేలన్
గర మర్థి నెడమప్రక్కకు
నిరుపమగతి మార్దవంబు నినుపఁగవలయున్.

166


చ.

హదనునఁ జాపముష్టి వలహస్తపుజుట్టనవ్రేల సవ్యపున్
బదముఖమున్ దగున్ గఠినభావము గైకొనఁగా లలాటమున్
వదనము కూర్పరంబులును వాసి గనందగు నార్జవంబునన్
బదకర నేత్రయుగ్మములు పాటిల మేలు సమానవైఖరిన్.

167


వ.

వెండియుఁ బండ్రెండుచోటుల నిన్నాలుగువిన్నాణంబులు గావించు
తెఱంగు ప్రకరణానుసారంబుగా నయ్యైవేళల విస్తరంబునం బ్రస్తా
పించితిం గావున సంగ్రహంబుగా నుదేశించితి నింక నొక్కవిశేషంబు
గల దిన్నాల్గువిన్నాణంబులం బరిఢవిల్లు నిన్నలువదికౌశలంబుల
ననాదరంబున నెవ్వండేని శరంబులు నడపిన నతనియుపేక్షం జేసి
శరగమనంబున ననేకదోషంబులు గలుగు నవియును వేఱువేఱ వివ
రించెద నాకర్ణింపుము.

168

సీ.

తమి దేవతాగురుధ్యానముల్ మఱచిన
        బన్నిదంబుల విద్య భంగపరచు
ధనురాగమప్రబోధంబు సంధిలదేని
        విద్యాపరీక్షల వెఱపుఁ గోరు
శస్త్రాస్త్రమంత్రవిస్తరము చేకుఱదేని
        పరభయానకలీల పాదుకొనదు
చులకనిబాణంబు బలుశరాసరమునఁ
        దూఁగించ జబ్బుగా నేగుచుండుఁ
జులకనివింట నగ్గలమైన విశిఖమ్ము
        సమకొల్పఁ గ్రక్కున సనక మాను
సతత మభ్యాసంబు సలుపఁజూడనిచోట
        లాఘవంబునఁగాదు లక్ష్యశుద్ధి
సమయం బెఱుంగక చాపంబు బూనిన
        నేపుమై పంత మీడేరకుండు
కుశలుఁడై లక్ష్యమ్ము కొలఁదిఁ గన్గొన కేయు
        తఱి శరవ్యమునందుఁ దవుల దమ్ము
దుస్సహంబగు వింటఁ దొడిగిన శరము చెం
        గట వ్రాలు గాత్రంబు కంప మందు
గుణము యోగ్యంబుగాఁ గూర్చనిచో విల్లు
        నాద మీదు శరంబు నడుమ వ్రాలు
ధనురాశుగములు మంత్రము లోలి వ్రాయక
        తాల్చునేని సురక్షితములు గావు
వైపు లిట్టటుగాఁగఁ జాపంబు దాల్చిన
        శృంగముల్ సమముగా వంగకుండుఁ
గొమలవంపులు సమానములు గామిని గార్ము
        కంబులో మెలియున్నఁ గదలు శరము
దృఢముష్టిఁ గొనఁడేని తిరుగు బాణాసనం
        బరచెయ్యి నొచ్చు సాయకము సడలు

స్థానంబునందు సౌష్ఠవమున నిలువక
        నరివాడ శరము లక్ష్యమునఁ దప్పుఁ
దగులీల నంగుళిత్రము బూన కరివాప
        విశిఖముల్ విసరు మౌర్వియును సడలు
నంగుళిత్రము వట్రనై రంధ్ర మున్నచో
        జాఱు బాణము పింజ సడల విసరు
బిగువుగా వివరమ్ము తగు నంగుళిత్రాణ
        మంగుష్ఠమునకు నొ ప్పడరఁజేయు
మృదువైన పెళుసైనఁ బదపడి గుణఘాత
        మున నంగుళిత్రాణ మనువు దప్పుఁ
బదను మిక్కిలి లేని బాణంబు తెగవాప
        చెలఁగి లక్ష్యము తెంపు చేయకుండు
కట్ట తిన్ననగాని కాండంబు నడపిన
        దూరంబు చని చని తొణఁకుచుండు
గఱులు మెత్తనివై న కఱకులైనను బాగు
        గాఁ గూర్చకుండినఁ గదలు శరము
నిండారఁ గుసికఱ్ఱనుండు రంద్రమ్ములో
        నలుఁ గూనకున్న సాయకము విఱుగు
వక్ర మైనను కఱ్ఱ వలమైన విశిఖమ్ము
        చాపమధ్యము సోఁకి యేపు దఱుగు
సమముగా నరి నమర్చక శర మ్మరివాప
        వెడలి క్రిందును మీఁదు విసరుఁ బింజ
యాకర్షణమ్ము జబ్బై తనర్చిన మార్గ
        ణము సబాటమ్ముగా నడవకుండుఁ
జక్కగాఁ జూడ్కి లక్ష్యమునందు నిలుపక
        తెగవాప విశిఖంబు దవులదందు
భావంబు చూడ్కితోఁ బ్రాకకున్నెడ లక్ష్య
        భేదనోపాయంబు పాదుకొనదు

యేపుమై తగవాపునెడ వీపు గదలిన
        కాండంబు చని చని కదలుచుండు
ధనువుచాటున రొమ్ము దాఁచకుండిన పోర
        నరిమార్గణం బోలమాస గొనదు
కొమలు వంగిన ముష్టి కుదురుగా నిడఁడేని
        జాఱు శింజినియును జాప మెడలు
బొమముడి కఠినచాపము దీయునెడఁ గల్గు
        నది సులక్షణము గాదండ్రు బుధులు
పలుమొన లధరంబుపై నూని తివియుచో
        ముఖ మార్జవంబున మొనయకుండు
గడ్డంబు వెలిగడగా సాచి తివియుచో
        శింజినిఘాతంబుఁ జెందుచుండు,
నరములు కీళ్ళు తిన్ననఁగాక తివియుచో
        నొక్కవేళ భరంబు నొందు మేను.
సకలాంగకంబులు చలియింప నరివాప
        బాణంబు చంచలభావ మందు,
నిండారఁ దివియుచో నిశ్శ్వాస మొలసిన
        కఠినలక్ష్యము దూయఁగాన దమ్ము,
తివియుచున్నెడ నోరు దెఱచునేని కదంబ
        కంబు లక్ష్యమునందు గాడకుండు,
నాకుంచితమున నర్ధాంగంబు కుంచక
        తెగవాప విశిఖమ్ము తేలి నడచు,
ప్రేరితమ్మున విస్తరిలి క్రోలుపులిరీతి
        పెరుగఁడేని పరుండు భీతి గొనఁడు,
నెఱివుంఖము బిగించి నినుపఁడేని శరంబు
        దూరలక్ష్యములందు దూ కుండు,
చాపముష్టి నలుంగు సమకొల్పఁడేని తూ
        పడరి క్రిందును మీఁదు బడుచునుండు,

పడిఁ బింజ సులకగా వదలఁడేని శరంబు
        నడువ బుంఖముఁ బ్రాకుఁ గుడియెడమల,
సింహంబులీల గర్జిలఁడేని పదిలుఁడై
        తనబాణగమనంబు గను పరుండు,
ఠీవి డాకేలు ఝాడింపడేని శరంబు
        పరుషలక్ష్యము డుస్సి పారకుండు,
తెగవాపి సమపరస్థితిఁ బూనలేనిచో
        ధర ధనుర్ధరసమ్మతంబు గాదు,
సమపదంబున నుండి చాప మక్కునఁ జేర్చి
        కౌగిలింపఁగ రాదు కౌశలంబు
తెగవాపి విశిఖంబు తెఱగుఁ గన్గొనఁడేని
        తద్గుణాగుణదీక్ష దగులకుండు,


గీ.

ఘనతవాటించు నలుబదికౌశలముల
సంప్రదాయంబు దెలుపు నాచార్యునొద్ద
సతత మభ్యాసమునఁ జేసి చాపధరుఁడు
నలువు దీపింప విశిఖముల్ నడుపవలయు.

169


వ.

వెండియు నిష్టదేవతాధ్యానప్రముఖంబులగు నిన్నలువదిలక్షణంబు
లకుం దగిన విన్నాణంబు లాచరింపమిం బరగెడు బాణంబుల దోషం
బులు మనంబున నాకలింపుచు వేర్వేఱ నయ్యెలక్షణంబులకుఁ దగిన
కౌశలంబుల నయ్యైదోషంబులు పరిహరింపుచు, నలోలంబులును సత్వ
రంబులును, లక్ష్యశుద్ధిమంతంబులునుం గా శరంబులు నడుపందగు
మఱియు శరగమనంబున దోషంబు బ్రాపించినం గాంచి యీ
లక్షణంబున నిక్కౌశలం బాచరించిన నిద్దోషంబులు బాయు నని
పన్నిదంబునం దల్లక్షణంబునం దత్కౌశలం బాచరించి నిర్దోషంబుగా
శరంబు నడుపం జాలిన ధనుర్ధరుండు భండనంబులం బ్రచండమదకల
శుండాలం బుద్దండశుండాదండంబునం గమలషండంబుఁ దెమల్చిన
కరణిం బరవాహినీపతుల నతులగతులం గుతలంబున శరక్షతుల

నుపహతులం జేయుచు సామ్రాజ్యపూజ్యుండై వర్తిల్లు మఱియునుం
గల విశేషంబు లాకర్ణింపుము.

170


సీ.

తగనివేగంబునఁ దెగవాప ఱెక్కల
        మొదలు గాళుపు సోఁకి మ్రోయుచుండు,
నవుడు పుంఖము సోఁక నంగుళిత్రాణంబు
        మును మున్ను తిరుగుచు మొరయుచుండుఁ,
దఱిఁదఱి నంగుళిత్రం బట్లు విఱిగిన
        బాణంబు తిరుగుడు బడుచునుండు,
నాలీల మెలివారు వాలమ్ముఁ గడిది ల
        క్ష్యవిభేదనము సేయఁజాలకుండు,


గీ.

గావున యథార్హమగు వేగ మావహించి
రూఢిఁ దర్జని నఖరమ్ము రొమ్ము నూడ
సరవి నంగుష్ఠనఖ మాకసమునుఁ జూడ
నోలి శరమోక్షణము సేయు టుచిత మండ్రు.

171


క.

అతివేగమ్మున మొరసెడు
గతి దెలియక శరము జబ్బుగా నడచినచో
వితతముగ మొరయు ననుచును
గొతుకక పలుకుదురు ధరణిఁ గొందఱు ధన్వుల్.

172


గీ.

సంప్రదాయంబు దెలియని చాపధరుని
గాంచి విలువిద్య నేర్చిన కారణమున
తెలియ కీలీల మిగుల వారింతు రనుచు
నెలమి దళుకొత్తగా నిర్ణయింపవలయు.

173


గీ.

పింజసెలవులందుఁ బెలుచ నొక్కటి వలం
బొకటి సన్న మగుచు నుండెనేని
యడరఁజేయువేళ నెడమకుఁ గుడికిని
నడుచు శరము పింజ సడలుచుండు.

174

వ.

తాదృశవ్యపాయంబు పాయ నుపాయంబు గలదు.

175


క.

సన్నంపుసెలవియోరం
గ్రన్నన లక్కయిడఁ జక్కగాఁ జను మఱియున్
బెన్నగు మారట సెలవిం
జెన్నారెడుఱెక్క సడలిచిన మెలిదీరున్.

176


క.

సూత్రంబు జుట్టి కొంద ఱ
పాత్రంబగు శరపుమెలిని బాపుదు రదియున్
జిత్రంబై విలసిల్లును
ధాత్రీసుర శుభనిదాన ధైర్యనిధానా.

177


వ.

మఱియుఁ దులాదండాభంబైన కాండంబునకు నియోగం బుపన్యసించెద
నాకర్ణింపుము.

178


మ.

ఇలపైఁ గ్రుమ్మరు కొద్దిసత్వములపై హేరాళపుంధాటి మి
న్నులకుం బ్రాకు పులుంగుమొత్తముపయిన్ భూజాగ్రశాఖాంతరం
బులఁ గూర్చుండెడు నండజంబులపయిన్ బ్రోదిన్ బ్రయోగింపఁ దా
వలమై యుండు ధనుర్ధరాళికిఁ దులాదండాభకాండం బిలన్.

179


వ.

అదియునుం దత్తల్లక్ష్యంబుల నరి నమర్చు తెఱం గెరింగించెద.

180


సీ.

అఖిలాంబకములలో నల తులాదండాభ
        మరికి బెత్తెడు మించ నదుకవలయు,
దూరలక్ష్యంబునఁ దొడగ బెత్తెంటిలో
        నర్ధాంగుళము తగ్గ నదుకవలయు,
నతిదూరలక్ష్యమం దడలించుచో వింటి
        నడిరేఖమీఁదుగాఁ దొడగవలయు,
గుఱినిఁ బుంఖముఁ దాకఁగోరిన నంగుళ
        ద్వితయమాత్రము క్రింద నదుకవలయు,

గీ.

నవని వ్రాలెడు ఖగము లక్ష్యముగ విక్ర
మించఁ గోపులు సరిగాఁగ వాంచి వింట
సమరిచి తరాజుకైవడి నడరఁజేయ
నగుఁ దులాదండసన్నిభంబగు శరంబు.

181


క.

తరులన్ వ్రాలెడు పక్షిన్
బరసున నాకసమునందు బఱచు ఖగంబున్
బొరయం దులాదండశరం
బిరవందగ నేయు ధన్వి యిల నధికుఁ డగున్.

182


చ.

హరిణవిషాణమధ్యనిభమౌ నెడముంగల వృక్షశాఖలం
దిరమగు పత్రిపై జతను దిన్ననగాఁ దగువృక్షశాఖలం
దిరవగు పత్రిపైఁ గణక నేయగఁబూనిన పృష్ఠభాగ మం
బరము గుణంబు భూతలము పాదుకొనన్ ధను వూనగాఁ దగున్.

183


క.

తిన్ననగాఁ జను తరుశా
ఖ న్నెలకొను ఖగము నేయఁగాఁ బూనినచోఁ
బన్నిన నెడ గలుగం జని
క్రన్ననఁ దెగవాప విఱుగక ససి న్నడచున్.

184


క.

ఒకశాఖమీఁదుగా వే
బొకశాఖ పొసంగ నడుమ నుండెడు పులుగున్
రకమున నేయందగు తల
గక విలు తిర్యక్సమంబుగా నిడి శరమున్.

185


గీ.

అట్లు క్రింద మీఁద నమరెడు కొమ్మల
వంక లుండెనేని వలను జూచి
ధనువు వాంచి నినుపఁదగుఁ దులాదండాభ
మగు శరంబు నినుచు నపుడు ధన్వి.

186

వ.

అవి యివ్విధంబునఁ జతుశ్చత్వారింశల్లక్షణంబులు క్రమంబున వివ
రించి బ్రహ్మశిరంబును, నైందాస్త్రంబును, నైశికంబును, బ్రహ్మా
స్త్రంబును, వరుణాస్త్రంబును, నాజ్ఞేయాస్త్రంబును, శిఖరాస్త్రం
బును, వాయవ్యాస్త్రంబును, హయశిరంబును, గ్రౌంచాస్త్రంబును,
వైద్యాధరంబును, బ్రస్థాపనంబును, బ్రశమనంబును, సౌరాష్ట్రం
బును, దర్పణంబును, శోషణంబును, సంతాపంబును, విలాపంబును,
మదనాస్త్రంబును, గందర్పాస్త్రంబును, మోహనంబును, బైశాచం
బును, సౌమనసంబును, సంవర్తంబును, మౌసలంబును, సత్యాస్త్రం
బును, మాయావంతంబును, దేజఃప్రభంబును, దేజఃకర్షణంబును,
సోమశిరంబును, త్వష్టృమధామయంబులును, భగ్నాస్త్రంబును,
నారాయణాస్త్రంబును, బైనాకాస్త్రంబును లోనుగా ననేకదివ్యా
స్త్రంబులునుం, దత్ప్రతినంహారంబులు నుపదేశించి, కరుణార్ద్రంబు
లగు కటాక్షవీక్షణంబు లొలయం బాండవమధ్యముం గనుంగొని
యిట్లనియె.

187


శా.

శ్రీదంబుల్ సతతాభయప్రదము లశ్రీ వారకంబుల్ జయ
ప్రాదుర్భూతికి హేతుభూతములు సౌభాగ్యప్రదంబుల్ ధను
ర్వేదోక్తంబులు దేశికానుకలనావేద్యంబు లాద్యంబు లి
ట్లీదివ్యాస్త్రము లన్నియుం బడసి తీ వేకాగ్రభావంబునన్.

188


సీ.

బాణబాణాసనప్రకరంబు లునిచిన
        వేశ్మంబు చొరఁజూచువేళలందు
సభలలోఁ జిత్రలక్ష్యముల పన్నిదమున
        విశిఖ మేయగఁజూచువేళలందు,
ధృతిలక్ష్యవేదికాదికశరాభ్యాసముల్
        వెలయింప విలుకొనువేళలందు,
సంగ్రామరంగప్రసంగసంగతులందు,
        వెస నస్త్ర మడరించువేళలందు,

గీ.

చరణసంక్షాళనం బుపస్పర్శనంబు
గురుపరంపరాధ్యానంబు గురుతరాస్త్ర
దేవతావందనము మహాదేవకీర్త
నము నరుండు యథావిధి నడుపవలయు.

189


మ.

బలభిన్నీలనీలదేహవినమత్ప్రాణావనోత్సాహని
శ్చలకారుణ్యరసప్రవాహకపిరాజన్యాహవవ్యూహని
స్తులదానోద్యమవారివాహవిశిఖక్షుబ్ధారిసందోహది
గ్వలయారూఢయశఃప్రరోహవిగతవ్యామోహభావోన్నతిన్.

190


మా.

సదమలచిరకీర్తీ! సంవిదానందమూర్తీ!
మృదువచనవిచిత్రా! మేఘసంకాశగాత్రా!
వదనవిజితచంద్రా! వర్ణితాటోపసాంద్రా!
విదితకుశలధామా! వీరకోదండరామా!

191


గద్య.

ఇది శ్రీమత్కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాపాదితకవితా
విచిత్ర, మైత్రేయసగోత్ర, నృసింహగురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీ
తంబైన “ధనుర్విద్యావిలాసం” బను లక్షణప్రబంధంబునందు
లక్ష్యశుద్ధిలాభంబును, లక్ష్యవేదికారచనావిధానంబును, నారాచ
మోచనప్రకారంబును, చిత్రలక్ష్యభేదనోపాయప్రతిపాదనంబును,
శార్ఙ్గలక్ష్యశరాభ్యాసవిలాసంబును, దూరనికటస్థలలక్ష్యభేదన, దృష్టి
ముష్టిినియమనలక్షణాన్వీక్షణంబును, రథారోహణశరాభ్యాసవిశేష
భాషణంబును, గజారోహణశరప్రయోగవినిభాగంబును, హయా
రోహణశరమోక్షణలక్షణంబును, దూరపాతిశరాభ్యాసవిస్తరప్రకీర్త
నంబును, శరప్రయోగసమయాసమయనిరూపణంబును, శరగమన
గుణదోషవినిభాగంబును, దివ్యాస్త్రమంత్రతంత్రప్రయోగోపసంహార
విస్తరప్రస్తాపంబును, లోనుగా గల విశేషంబుల సర్వంబును గల
తృతీయాశ్వాసము.

192