ధనుర్విద్యావిలాసము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక


ఆంధ్రదేశమున నధీశ్వరులై వెలసినవారు ప్రాచీనులు నర్వాచీనులును ధనుర్విద్యలో నద్భుతప్రజ్ఞతో నారితేరి మగలమగలై గండరగండండ్రై సమరనిశ్శంకులై సంగరకిరీటులై యుండి రనుట చరిత్రపరిశోధకులు చక్కగా నెఱిఁగినవిషయమే.

అంతకుఁ బూర్వపువారివార్త లట్లుండగా చరిత్రసుపరిజ్ఞాతులయినవారు సాతవాహనులు, ఇక్ష్వాకులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు (వారిసేనానులు డెబ్బదేడు గోత్రాలవారు) వెలమవారు, రెడ్డివారు, కమ్మవారు, బలిఁజెవారు, కోటవారు, సాగివారు, పూసపాటివారు, వత్సవాయివారు, మందపాటివారు, తెలుగుచోళులు, వెలనాటిచోళులు, విద్యానగరాధీశులు, సాళ్వవారు, దాట్లవారు, మట్లవారు, గజపతులు, జగపతులు, తంజావూరు, మధుర, పుదుకోట, నాయకులు, నిటీవలివా రనేకులు జమీనుదార్లు నింక నెందఱెందఱో

కదనమె బొమ్మరిల్లు చెలికత్తెలు వీరజయాంగనామణుల్!
మదకరిమస్తకుంభములు మాటికి దొంతులు సంగరస్థలిన్
గుదిగొని పడ్డరాహుతుల క్రొవ్వులు గుజ్జనఁగూళ్లు బాపురే!

అన్న ప్రశస్తి గన్నవారే, వా రట్టివా రగుటకు గట్టిగా ధనుశ్శాస్త్రమున జితశ్రములగుట ముఖ్యహేతువు.

ఆయామహీపాలుర యేల్బళ్లలో ధనుర్విద్యాభ్యాసరంగములు చాలఁగా వెలసియుండెడి వనుటను ప్రాచీనగ్రంథములు ప్రఖ్యాతపఱచుచున్నవి. నేఁటికిని ధనుర్విద్య యాటవికులగు కోయ చెంచు సవరాది జాతు లవారికి వెన్నతోఁ బెట్టిన విద్యగాఁ బరిచితమయి యుండుట యెల్లరు నెఱిఁగిన విషయమే.

ఇర్వదేండ్లకు ముందు వినుకొండప్రాంతగ్రామవాస్తవ్యులు కలియుగార్జునబిరుదాంకులు అప్పారాయాభిధాను లొకరు ధనుర్విద్యలో నద్భుతనైపుణ్యము ప్రదర్శించుట నే నెఱుఁగుదును. నేడును వారు తద్విద్యానివుణులై నెగడుచున్నారట! తాలింఖానాలు వస్తాదుల కుస్తీపట్లు నేఁడును పలుచోట్ల సాగుచున్నవి. సంస్కృతాంధ్రగ్రంథములఁ జదివి నేర్చుట తగ్గినదేమో కాని వానిలో విషయములు తొలుతఁ బ్రాకృతమున నిటీవల ఉర్దూలో పారిభాషికపదములతో వెలసి వ్యవహారరూఢి గనుట ఆయాగ్రంథార్థము లనుభూతిలో నన్వితములయి నిన్నమొన్నటిదాఁక ననేకుల కందుబాటులో నుండుట దెలియవచ్చుచునే యున్నది.

ప్రస్తుతమగు ధనుర్విద్యావిలాసవిషయములు ధనుర్విద్యావిశారదుఁడగు తురకపండితుని (మహమ్మదజాఫర్ గురుని) యుపదేశముచొప్పున నేర్చి గ్రంథరచనాప్రేరకుఁడు, రేపల్లెఱేఁడు తిరుపతిరాయప్రభుఁడు వివరించుచుండగా విని వాని పద్యకావ్యరూపమున కృష్ణమాచార్యుఁ డను కవి రచించెనట! పాశ్చాత్యయుద్ధశాస్త్రశిక్షలు పెంపొందిన పిదప తుపాకులు ఫిరంగులు మొదలగునవి వెలయుటచే ధనుర్విద్య కంతగాఁ బ్రాముఖ్యము లేదయ్యెను. తుపాకులు మొదలగు నాయుధతంత్రములుగూడ బాంబులు, విమానములు, సబ్‌మరైనులు, మైనులు, రాడార్లు, ఆటంబాంబులు ప్రబలిన తర్వాత వెనుకఁబడఁజొచ్చినవి గదా! నిజముగా సత్యదయాజ్ఞానధీరుల యాయుధమగు నహింసాప్రయోగము బలయునేని ఆటంబాంబులదాఁకను బెరిగిన యుద్ధతంత్ర మెల్ల నిరర్థకమే కాఁగలదు.

సృష్ట్యాదినుండి నేటిదాఁక వీరాధివీరు లనిపించుకొన్న మహాపురుషుల యుద్ధతంత్రము లెల్ల గంధివీరుని ధీరతావీరతలముందు నిలువనేరక నిర్వీర్యములే యయినవి గదా, ప్రపంచము నందలి హింసా తంత్రసారమెల్ల దనమీఁదికిఁ దెచ్చుకొని యాయన హింసాపక్షమును నిర్వీర్య మొనర్చినాడు. అహింసాపక్షమునకు సర్వాంతర్యామియై విజయము చేకూర్చుచున్నాడు. భారతీయుల మూలమున నిది పరిస్పుటమై ప్రజ్వరిల్లినతర్వాతనే లోకము దీనిప్రాభవమునకు జోహారు లర్పింపఁగల్గును.

ధనుర్వేదము యజుర్వేదమున కుపవేదమట. చరణవ్యూహమున నిట్లున్నది.

“యథా ఋగ్వేదస్యోపవేది ఆయుర్వేదః చికత్సాశాస్త్రమ్
యజుర్వేదస్యోపవేదో ధనుర్వేదో యుద్ధశాస్త్రమ్
సామవేదస్యోపవేదో గంధర్వవేద స్సంగీతశాస్త్రమ్
అధర్వవేదస్యార్థశాస్త్రం నీతిశాస్త్రం శస్త్రశాస్త్రమ్
విశ్వకర్మాదిప్రణీత శిల్పశాస్త్రమ్
ఇతి భగవాన్ వేదవ్యాసః స్కందః కుమారోవా౽హ "

విశ్వామిత్రప్రణీతమగు ధనుర్వేదగ్రంథమున నీవిషయ మిట్లు గలదు॥ అధ ధనుర్వేదో నిరూప్యతే, స చ పాదచతుష్టయాత్మకో విశ్వామిత్రప్రణీతః, ఆరౌ బ్రహ్మణా ప్రజాపతయే రుద్రాయ చప్రోక్తో రుద్రేణ విశ్వామిత్రాయ విశ్వామిత్రేణ మనవే పురుహూతాదిభ్య ఉపదిష్టః సహిపాదచతుష్టయాత్మక ఉపవేదః తత్ర ప్రథమః పాదః దీక్షాప్రకారః. ద్వితీయః పాదస్సంగ్రహః, తృతీయపాద స్సిద్ధ్యాత్మకః, చతుర్థః ప్రయోగపాదః , తత్ర ప్రథమపాదే ధనుర్లక్షణ మధికారి నిరూపణం చ కృతం, ధనుశ్శబ్దశ్చాపరూఢోపి చతుర్థా యుద్దే ప్రవర్తతే, ముక్త మముక్తం ముక్తాముక్తం యంత్రముక్త మితీ ముక్తంచేతి అముక్తం ఖడ్గాదిః ముక్తాముక్తం శల్యావాంతరభేదాదిః, యంత్రముక్తం శరాది తత్రా ముక్తం శస్త్రముచ్యతే. తదపి బ్రాహ్మ వైష్ణవపాశుపత ప్రాజాపత్యాగ్నేయాది భేదాదనేకవిధం, ఏవం సంధి దైవతేషు చతుర్విధా యుద్ధేష్వధికారః క్షత్రియకుమారాణాం తదనుయాయినాం చ సర్వేషాం చతుర్థా పదాతిరథగజతురంగరూపా దీక్షాభిషేక శకున మంగళకరణాదికం చ ప్రథమ పాదే నిరూపిత మస్తి సర్వేషాం శస్త్రవిశేషాణా మాచాత్యాణాం లక్షణ పూర్వకం సంగ్రహణప్రకారో దర్శితః ద్వితీయే గురు సంప్రదాయ సిద్ధానాం శాస్త్రవిశేషాణాం పునః పునరభ్యాసో మంత్రదేవతా సిద్ధికరణ మపి వక్ష్యతే. తృతీయే పాదే దేవతార్చనాభ్యాసాదిభిః సిద్ధానా మస్త్రవిశేషాణాం ప్రయోగః చతుర్థపాదే యుద్ధప్రకారః క్షత్రియాణాం స్వధర్మప్రవిష్టానాం యుద్ధకర్మనిష్టానాం స్వధర్మాచరణం యుద్ధం. దుష్టదస్యు చౌరాదిభ్యః ప్రజాపాలనం చ ధనుర్వేదస్య ప్రయోజనం, ఏవం బ్రహ్మ రుద్రప్రజాపతి విశ్వామిత్రప్రణీతం ధనుర్వేదశాస్త్రం సురాసురైః పారంపర్యాదవగతం శ్రీపరశురామద్రోణభీష్మాదిభిః ప్రభృతం తచ్చ ధనుర్దీక్షాయాం పార్ధః, ఉత్తమాధికారీ. బాణాసురో, మధ్యమాధికారీ, సాత్యకి ప్రభృతయః సహస్రార్జునో హీనాధికారీ, గురవధాత్ ఇతి ధనుర్ధర ప్రశంసా॥ ఆ ముద్రితములైన గ్రంధములు శ్రీ మానదల్లి రామకృష్ణకవి ఎం. ఏ, గారి దగ్గఱనున్నవి. దానిని జూచియే నే నాయాభాగముల నుదాహరించితిని.

ఈ ధనుర్వేదమును గూర్చి శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ. గా రిప్పటి కిర్వదియాఱేండ్లకు ముందు గొప్పవ్యాసము ప్రకటించిరి. దానినెల్ల నిక్కడ మరలఁ బ్రకటించి దానిపై విశేషార్థములు వివరింతును.

"ధనుశ్శబ్దము వింటికి రూఢమైనను ముక్తము అముక్తము ముక్తాముక్తము యంత్రముక్తము అను చతుర్విధ ప్రహరణముల వర్తించుచు ధనుర్వేదము శత్రుదండరూపమగు సమస్తప్రయోగసామగ్రీతత్త్వమును బ్రతిపాదించును. ఆది యిరువదివేల శ్లోకములతో నీశానసంహిత యను పేరితో శివునిచేఁ బార్వతి కుపదేశింపఁ బడియె.

అందు

వింశత్సహస్రమానస్తు ధనుర్వేదోపి కీర్తితః
యస్మిన్ నిగద్యతే సర్యలోకతత్త్వం వరాననే
బలాపాదనకాధ్యాయః స్థానాధ్వాయః ప్రమర్దనం

భౌతికాపాదనాధ్యాయః సంధివిక్షేపణం తథా
అక్రమోజ్జీవనోధ్యాయః శ్రమప్రాప్తేర్హి లక్షణమ్
ఆయుధగ్రహణం శిక్షా క్రమస్తత్పరిశీలనమ్
సన్నాహస్థాన చలన మపసవ్యస్థితిక్రమః
ఆశ్లేషోవాంతరాలంబ హస్తాటన పటుక్రియా
ముష్టిబంధస్థానబంధో ధృష్టతాపాదనం తథా
సంగ్రామవిద్యావిజ్ఞానం సర్వాయుధ విలంఘనమ్
సూత్రాధ్యాయః పరీక్షా చ పాదపాయూపఘట్టనమ్
రథాశ్వేభాద్యవస్థాన లక్షణాధ్యాయ ఏవ చ
(విలుంటనం మోటనం చ భ్రమణం పరిశీలనమ్
ఆయుర్జ్ఞానం మోహనం చ భిన్నముల్లాసితం తథా)
చాపాదిలక్షణజ్ఞానమస్త్రాణాం కరణం తథా
అస్త్రమంత్రపరిజ్ఞానాధ్యాయో మదవినిర్గమ
ఏవమాద్యా ధనుర్వేదే విద్యాః సంతి సహస్రశః

అను నిరువదితొమ్మిది యంశములు విస్తరింపఁబడియె. ధనుర్వేదసూత్రములు పరశురామకృతములై శాండిల్యభాష్యవివృతములై కేరళీదేశమున లభించుచున్నవని తెలియుచున్నది. అది నాలుగుపాదములు గలది. ప్రథమము దీక్షాపాదము. రెండవది సంగ్రహపాదము. మూడవది సిద్ధిపాదము. నాల్గవది ప్రయోగపాదము. ధనుశ్శబ్దము సర్వప్రహరణముల వర్తించు. అది ముక్తాది చతుర్భేదకము. ముక్తమనగాఁ జక్ర వజ్ర వలయ శక్తితోమర కుంత పాషాణాదికము. అముక్తమనగా నంకుశ పాశ క్షురికా అసి గదా ముసల దండాదికము. ముక్తాముక్త మనఁ బాశవాగురా రజ్జు వలయాదికము. యంత్రముక్త మనఁ జాప శతఘ్నిశల్యక మంజుషార్క వర్ణాదికము. మనశాస్త్రానుసారముగా సర్వశస్త్రములలో ధనువు శ్రేష్ఠము. వింటియంగములు బాణము అర్థచంద్రము శిలీముఖము నారాచము మోచకము మొదలగునవి. అస్త్రము మంత్రాక్షర ప్రతిలోమ పఠితమై యధిదైవత ప్రేరితమై యుండును. మంత్రదేవతాభేదముల ననుసరించి, బ్రాహ్మ్యము ప్రాజాపత్యము వైష్ణవము శైవము ఐంద్రము వారుణము ఆగ్నేయము వాయవ్యము సౌమ్యము (చంద్రదైవతకము) ఆదిత్యము దౌర్గము (దుర్గాదైవతకము) గాణేశ్వరము (వినాయకాధిదైవతకము) స్కాందము శాక్తేయము యాక్షంరాక్షసము నాగము గారుడము గాంధర్వము పైశాచము పైత్రము (పితృదైవతకము) పార్థివము ఆప్యము (జలాధిదైవతకము) తైజసము సావనము నాభసము (ఈకడపటి) యైదును బంచభూతముల గ్రమముగా స్తంభింపజేయునట సాముద్రము పార్వతము గాయత్రము త్రైష్టుభ మానుష్టుభము మొదలగునవిఁ (కడపటిమూడును ఛందోదైవతకము లగు మంత్రములు ప్రయోగములుగా గలవి). ఈ యాయుధశిక్ష కధికారులు క్షత్రియులును బ్రాహ్మణులును దదనుయాయులును నగుదురు. రథగజతురగపదాతులె వానికధికరణములు, ఈ సూత్రపాఠమునఁ బ్రథమపాదమున ధనుర్వేదాభ్యాసమునకు దీక్షాభిషేకశకునమాంగల్యకలణాదికము వివరింపఁబడియె. రెండవదియగు సంగ్రహపాదమున సకలాస్త్రశస్త్రముల సంగ్రహవిధియు మూఁడవది యగు సిద్ధిపాదమున సంగ్రహించిన యస్త్రములకుఁ బునఃపునరభ్యాసమున మంత్రదేవతాైనియమజపహోమోపాసనక్రియలును విస్తరింపఁబడియె. మంత్రదేవత సకళ యనియు నిష్కళ యనియు నిఱుదెఱంగులం బరఁగు. అదియు చేతనావత్త్వము, ఇచ్ఛావిగ్రహత్వము, యష్టవ్యత్వము, తుష్టిమత్వము ఫలదాతృత్వము అను నైగుగుణములు గల దని పూజాహోమోపాసనాదుల సాధకులు నడపుదురు. షోడశోపచారములచే సిద్ధదైవత మిచ్చు ఫలదానముచే సాధకుఁ డస్త్రప్రయోగము నొనర్చుట నాల్గవపాదమున విస్తరింపబడియె. శస్త్రగ్రహణమునకు ధనుర్వేదమున నియమము గలదు. సామదానభేదములచే నసాధ్యుడయి దుర్వినీతుఁ డగు పురుషునిఁ గాని, బహుప్రజాసంరక్షణార్థము తత్పాలకుఁగాని, దేశకాలావస్థోచితముగాఁ గర్తృకరణశక్తి కనుగుణముగా నాపత్కాలమునను, సర్వదా ధర్మరక్షణమునను, దండము విధేయమని శాస్త్రజ్ఞులు గ్రహించిరి.

ఈ ధనుర్వేదమున ముక్తాముక్తాదిచతుర్భేదకములు గాక నియుద్ధమని పంచమభేదమును దరువాతి శాస్త్రజ్ఞులు గ్రహించిరి. తద్భేదములన్నియు మల్లయుద్ధములలోఁ బ్రయోగింపఁబడునవి. నాచనసోమనాథాదులు యుద్ధప్రక్రియల నుత్తరహరివంశాదుల వర్ణించియుండుట యెల్లరకు విదితమే గదా!

ధనుర్వేదదైవతమంత్రస్వరూపముల వైశంపాయనుఁడు తన నీతిప్రకాశికలో నిట్లు వర్ణించుచున్నాడు.

“చతుష్పాచ్చ ధనుర్వేదో రక్తవర్ణశ్చతుర్ముఖః
అష్టబహుస్త్రిణేత్రశ్చ సాంఖ్యాయన నగోత్రవాన్
వజ్రంఖడ్గోధనుశ్చక్రం దక్షిణే భుజమండలే
శతఘ్నీ చ గదాశూలం పట్టిసం వామబాహుషు
ప్రయోగకోటీరయుతో నిత్యాంగో మంత్రకంచుకః
ఉపసంహారహృదయః శస్త్రాస్త్రోభయకుండలః
అనేకవల్లితాకారభూషణః పింగళేక్షణః
జయమాలా పరివృతో వృషారూఢస్సన ఉచ్యతే”

అని స్వరూపప్రతిపాదనానంతరము—

"తన్మంత్రం చ ప్రవక్ష్యామి వైరిజాలనికృంతనం
ఆత్మసైన్య స్వపక్షాణా మాత్మన శ్చాభిరక్షకమ్
ఆదౌ ప్రణవ ముచార్య నమ ఇత్యక్షరే తతః
వతేతి భగపూర్వం తు ధనుర్వేదాయ చోచ్చరేత్
మాం రక్ష రక్షేత్యుచ్చార్య మమ శత్రూన్ వధేతిచ
భక్షయేతి ద్విరుచ్చార్య హుంఫట్ స్వాహే త్యథోచ్చరేత్
అహమేవ ఋషిశ్చాస్య గాయత్రీ చ్ఛంధ ఉచ్యతే
మహేశ్వరో దేవతాస్య వినియోగో౽రినిగ్రహే
ద్రాత్రింశద్వర్ణకమనుం వర్ణసంఖ్యాసహస్రకైః
జపిత్వా సిద్ధి మాప్నోతీ రిపూంశ్చాత్యధితిష్ఠతి”

అని మంత్రలక్షణము నుపదేశించెను. ముక్తాదిభేదములు గాక ధనుర్వేదము మతాంతరముగా—

“ఆధానం చైవ సంధానం విమోక్ష సంహృతి స్తథా
ధనుర్వేదశ్చతుర్థేతి వదంతీతి పరే జగుః”

అని బాణము నెత్తుటయు ఎక్కుపెట్టుటయు తెగగొని యేయుటయు లక్ష్యవేధము అని నాల్గుక్రియల నుద్ద్యోతించు విభాగములు గల వని కొంద ఱూహింతురు. మఱికొందఱు శస్త్రము ప్రతిశస్త్రము అస్త్రము పరమాస్త్రము అని చతుర్విధముగా విభజించిరి. వసిష్ఠసంహితయు సారంగధరుని వీరచింతామణి, కోదండచతుర్భుజము, కోదండమండనము, హరిహరచతురంగము, రాజవిజయము, వైశంపాయనుని నీతిప్రకాశికయు నిప్పుడు మనకు లభింపఁగలవు. పరశురామసంహిత, రాజవిలాసము, భోజుని ధనుస్సంహిత, ఈశానసంహిత, విశ్వామిత్రసంహిత, లోహార్ణవము, లోహరత్నాకరము మొదలగునవి యుత్పన్నము లయ్యె. సోమేశ్వరుని యభిలషితార్థచింతామణిలోను కెెలది బసవేంద్రుని శివతత్త్వరత్నాకరమునను, వీరమిత్రోదయభాగ మగు లక్షణప్రకాశమున దైవజ్ఞవిలాసమున రాజనీతిఖండమునను అగ్నిపురాణమునను విష్ణుధర్మోత్తరమునను ధనుర్వేదమును గుఱించి విస్తరించు నధ్యాయములు గలవు. ఇవియన్నియు మనకు లభించునవియే. శుక్రనీతిలో గజాశ్వరాజనీతిఖండములు గాక ధనుర్వేదము విస్తరముగాఁ జెప్పఁబడియె. అందు యవక్షారగంధకాదిమిశ్రితమగు నస్త్రబాణక్రమములు యంత్రముచ్యములు వర్ణింపఁబడియె. ఖడ్గాదినానాయుధలక్షణము లద్భుతముగా వివరింపఁబడియె. ఉదాహరణముగా నీపంఙ్తిఁ జూడఁదగును. ఖడ్గమును బ్రశంసించుచు జమదగ్నికి శుక్రాచార్యుడు—

అసిరేవ పరం శస్త్రం స్వహస్తే నిత్యశో౽క్షయమ్
అమోఘాకార సదృశం సర్వశత్రుక్షయప్రదమ్
ఉత్తానే వాథ కుబ్జేవా బలేసాచీగతే పివా

“సంవిష్టే చోపవిష్టే చ ఖడ్గ ఏవ పరాయణమ్
సంకటేచ విషమే గిరిదుర్గే నిమ్నగర్త సికతాస్థగితే
కంటక ద్రుమ వృతేపి చ దేశే ఖడ్గ ఏవ శరణం జమదగ్నే
క్షితే రథే వాజిని కుంజరే వాగృహే ద్రుమే నాగరకే ప్రమాదే
సర్వత్ర సర్వస్య చ భార్గవేంద్ర పరాయణం స్యాదసి రేవ నిత్యమ్
ధనురిహ శరపాతా దేవ వై హంతీ శత్రూన్
దహతి రిపుసమూహం వాజి వహ్నిర్జవేన
సుభటకరగతస్తుక్షి ప్రమభాసమాత్రే
శమయతి రిపుసేనాం పాతయోగేన ఖడ్గః
మతంగ జస్థో రథవాజిగో వా శరక్షయే శస్త్రగణక్షయేచ
సమస్ధితో వా విషమస్థితోవా నరో౽సినా మర్దయతీహ సర్వాన్"

అని సంగ్రహశ్లోకములు పఠించెను. గదను వర్ణించుచు - గదాక్షణం వక్ష్యతేసమాహితో నిబోధ తత్రపంచాశ దంగుళాయా మాశ్రేష్టా చత్వారిం శదంగు ళాయామా మధ్యమా. త్రింశ దంగుళ యామా నికృష్టా భవేదితి త్రివిధా గదా బుధైరుపదిష్టా పలానా సహస్ర ముత్తమాయా శతాన్యష్టౌ మధ్య మాయా ష్పఠ్మతాని కనిష్టాయా ఇతిగదాయాః త్రివిధం గౌరవం భవతి. యస్తు బలదర్పితః సమర్థ గౌరవో దేవదేవ వరాధిష్ఠితః సతాం గృహ్ణాతి తస్యముక్తస్య చదోషాః సంభవేయుః తథా యా గదా లఘీయసి భవతి నసా సంగ్రామే యుద్ధవిశారదైః ప్రశస్యతే తస్మాత్సమా సర్వేషాం ప్రశస్తా భవతి. యాహి ప్రతిచారే ప్రహరే చారికాసుర సంచారమోక్షా సమే త్యభిధీయతే త్ర్యస్రా వృతాశ్రిర్వాసుగాత్రా వ్రణరహితా సువిహితా ప్రియదర్శనా కర్తవ్యా గ్రహే (పిడి) దశాంగు లాయామో దశాంగుల పరిణాహశ్చ త్రయాణాం పురుషాణామ్ మూలతః సుద్రవ్యాణి పద్మగర్భోపమా పూర్ణచంద్రోపమా వా గ్రహమూలం చిత్రజ్ఞైశ్చిత్రితం భవతి. స్థూలాగ్రా విశిష్టా చతురస్రా మధ్యమా తాలమూలాకృతిర్ని కృష్ణా భవతి. తప్తకాంచన పదై ర్వా బహుచిత్రిత రూపై ర్మూలమధ్యాగ్ర బంధనై ర్విచి త్రీకృతా గదాశ్రేష్టా భవతి సర్వశస్త్రేషు. సాహిప్రియావిధౌ వపుష్మత్వా ద్బలవత్త్వాచ్చ సుఖయోగా భవతి నానాచిత్రైర రలంకృతానసర్వేభ్యః శస్త్రేభ్యశ్చాక్షయ్యా సాహిగదా శస్త్రజ్ఞై రాయుధవరే త్యభిధీయతే”

గదను గుఱించి రాజవిజయమున సంగ్రహముగా

"పంచాశ దంగులో దండో దలేష్వర్కాంగుళా గదా
దళాని షోడశైవ స్యుః కలశోంగుళి మాత్రకః”

అని సంగ్రహింపఁబడియె. శుక్రనీతిలో శక్తి యను నాయుధమునకు లక్షణ మిట్లు చెప్పఁబడినది.

“వత్స జమదగ్నే శృణు యన్మాం త్వం పరిపృచ్ఛసి ఉత్తమా మధ్యమా కనిష్ఠా చేతి తీవ్రః శక్తయోభవంతి తాసాం దండశ్చతుర్విధో నైణవః దారుమయో దండమయ ఆయసశ్చేతి. సుస్నిగ్ధత్వం నిర్వృణత్వం పూజితత్వం చేతి దండగుణాః స్యుః తాసు పంచహస్తా ఉత్తమా మధ్యమ ద్వివిత తస్తిహీనాత్వధమా భవంతి తాసాం కక్షాద్వయోప ఘటితలక్షణ ఉభయతః ఫలద్వయం భవంతి (ఫలమనఁగా ఖడ్గపురేకు) హస్తమాత్ర మతితీక్ష్ణం కాయ భేదేన సమర్థ మతిఘనం తచ్చ నిస్త్రీంశాకారం కార్యం సంక్షిప్తమధ్యభాగం భవతి మధ్యఫలమితరాభ్యాం కక్షాఫలాభ్యాం యుక్తం శ్రితం వాభవతి. తచ్చ ద్వివిధం మూల యుక్తం మూలశ్రిత ముఖయుక్తం చేతి తచ్చ దండే పత్రభాగాది చిత్రాన్వితం నాగబంధైర్బధ్నీయాత్ అధోత్తమాయాశ్శక్తే ఫలాగ్రేణ శతఫలవర్ధితం గౌరవం భవతి మధ్యమా యాస్త్వశీతిఫలం కనిష్ఠాయాః షష్టి ఫలమితి శక్తలక్షణ ముక్తం.”

ఈ యుదాహరణధోరణి గనుగొన్న శుక్రనీతి మూలగ్రంథమంతయుఁ బ్రాకృతముననో మాగధీభాషనో గాథారూపమున రచింపఁబడి యుండు నని తోచుచున్నది. పైపంక్తులలోని యర్థచ్ఛేదమును గమనించి మాగధికి మార్చినచో సులభముగా గాథారూపము చెందు చున్నది. గాథ యనఁగాఁ బ్రాకృత మాగధీ భాషలలో నార్యావృత్తము వంటిది. ఇది కందపద్యమునందలి రెండవ నాల్గవ పాదముల కొనలో రెండు మూఁడు మాత్రలు తగ్గినట్టి యొకానొక జాతిపద్యము.”

శ్రీ కవిగారు పరుశురామ సూత్రములు శాండిల్యభాష్యముతో గేరళ దేశమునఁ గలవనిరి గాని యవి యుండుట యింతదాఁకఁ దెలియరాలేదు. అగ్నిపురాణమున 249 అధ్యాయముననుండి 252 అధ్యాయముదాక ధనుర్వేదవివరణమున్నది. యుక్తికల్పతరువు, అభిలషితార్థచింతామణి, శివతత్త్వరత్నాకరము, వీరమిత్రోదయము (ఇవిముద్రితములు) చతుష్షష్టికలాసంగ్రహము ననుగ్రంథములలో యుద్ధతంత్రవివరణ మున్నది. యామలాష్టకతంత్రమునఁ గవిగా రుద్ధరించిన విషయసంగ్రహసూచీ మాత్రమున్నదిగాని తద్వివరణములు లేవు. ఇవి గాక వైశంపాయననీతిప్రకాశిక, వసిష్ఠసంహిత, శివధనుర్వేదము, మనుసారము (వ్రాతప్రతి పంజాబు కేటలాగులోనున్నది.) కోదండమండనము, హరిహరచతురంగము, వీరచింతామణి, శివోక్తధనుర్వేదసంహిత, భారతాదులలోని ధనుర్వేదవిషయములు నేఁ జూచిన ముఖ్యగ్రంథములు.

భారతమున:— నానావయవం విరించి—— స్వామ్యసూత్య రాష్ట్రదుర్గకోశసుహృద్బలంబులు, నాన్వీక్షకీత్రయీవార్తాదండనీతులు నరిమిత్రో దాసీనాదిక ద్వాదశరాజమండలంబును సంధి విగ్రహ యానాస సద్విధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయువానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి ధర్మార్థకామమోక్షంబులకు సాధకంబు లయి యుండునట్లుగా నూరువేలధ్యాయబులు నఖిలలోకహితంబగు నీతిశాస్త్రంబు రచియించి యిది లోకచరిత్ర నిర్మలీకరణంబునకుఁ గారణం బగునని యనుగ్రహించె, నాలోకపితామహూలలాటంబున ననాది నిధనుండును విశ్వజగత్కర్తయు సర్వభూతాత్ముండును సనాతనుండును నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిర్భవించి యాగ్రంథం బధిగ మించి దాని నభ్యసించుటకు మర్త్యుల కాయుర్బుద్ధులు సాలవని యుమ్మలించి యమ్మహనీయతంత్రంబు సంక్షేపరూపంబునఁ బదివేలధ్యాయంబుల వైశాలాక్షంబన నిర్మించె.

ఆ.

హరునివలనఁ బడసి యాశాస్త్ర మమరేంద్రుఁ
డయిదువేలు సేసె నమరగురుఁడు
తేటపడి నొనర్చెఁ ద్రిసహస్రకాధ్యాయ
రూపసమ్మితముగ భూపవర్య.

దాని శుక్రుండు సహస్రాధ్యాయపరిమితంబు గావించె మఱియు మనుష్యులశక్తి యెఱింగి మునులు క్రమంబున సంక్షిప్తరూపంబులుగా గ్రంథంబులు గావించి రిది నీతిశాస్త్ర ప్రకారంబు” (భారతము శాంతిపర్వము 2. ఆశ్వాసము) మఱియు.

“విష్ణుండు దండనీతిశాస్త్రంబు సకలంబు నాంగిరసున కిచ్చె నాంగిరసుం డింద్రమరీచులకు మరీచి భృగునకు భృగుం డనేకమునులకు నిచ్చె” శాంత్తి 2. ఆశ్వాసమున "ఏయజ్ఞంబులును సంగ్రామయజ్ఞంబునకు సదృశంబులు గావు వినుము వీరమస్తకరాశి వేదికగాఁ గృపాణబాణాదిసాధనంబులు సమిత్సృక్సృవంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రతదీక్షితుండు సమరాధ్వరంబు సలిపి రుధిరజలపూరయు మస్తిష్కకర్దమయుఁ గేశశైవాలయు నాంత్రఫేనయు భేరీమండూకయు హేతిమీనయు గజకళేబరపులినయు నగు సమరపుణ్యనది నవభృథస్నానంబు సేసి మదీయలోకంబున సుశ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్తపదవిం బ్రవర్తిల్లుఁ బుణ్యతముం డగుటకుఁ దనువు దొఱంగవలయు నని లేదు తెగువతోడి యనివర్తనగతియ చాలు." (శాంతి 2. ఆశ్వాసము.)

వేదములు ప్రధానముగా యజ్ఞతంత్రప్రతిపాదకములుగా నున్నవి గాన యుపవేదములు గూడఁ దదర్థానుసారముగా గాంధర్వాదివిద్యల యజ్ఞతంత్రాత్మకములనుఁగా సమర్థించినవి. అట్లే శైవవైఘానస శాక్తా ద్యాగమములును శివవిష్ణుశక్తిపూజావిధానములును యజ్ఞతంత్రాత్మకముల గావించినవి. భగవద్గీతలలో మఱింత విపులీకరణముతో జ్ఞానతపోయజ్ఞాదికల్పనము లున్నవి.

పైవిధమున భారతమునఁ బేర్కొనబడిన ధనుర్వేదగ్రంథములు గానరావుగాని మునులు క్రమంబున సంక్షిప్తరూపముగాఁ గావించిన గ్రంథము లీక్రిందివి గానవచ్చుచు నవి.

వశిష్టధనుర్వేదసంహిత

“అధైకదా విజగీషు ర్విశ్వామిత్రో రాజర్షి ర్గురుం వశిష్ట మభ్యుపేత్యప్రణ మ్యోవాచ బ్రూహి భగవన్ ధనుర్విద్యాం శ్రోత్రియాయ దృడచేతసే శిష్యాయ దుష్టశత్రువినాశాయచ త మువాచమహర్షి రహ్మర్షి ప్రవరో వశిష్ఠః శ్రుణు భో రాజన్ విశ్వామిత్ర! యాం సరహస్యధనుర్విద్యాం భగవాన్ సదాశివః పరశురామా యోవాచ. తా మేవ సరహస్యాం వచ్మితే హితాయ గోబ్రాహ్మణసాధువేదసంరక్షణాయ చ యజుర్వేదా ధర్వసమ్మితాం సంహితామ్ తత్రచతుష్టయ పాదాత్మకో ధనుర్వేదః యస్య ప్రథమేపాదే దీక్షాప్రకారం ద్వితీయే సంగ్రహః తృతీయే సిద్ధప్రయోగః చతుర్దే ప్రయోగవిధయః ధనుర్వేదవిధి ఆచార్యలక్షణము వేదవిధి చాపప్రమాణము, శుభచాపలక్షణము, వర్జితధనువు గుణలక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు, తత్ఫలములు శరోపరిఔషధలేపనము నారాచనాళీకశతఘ్నీవర్ణనములు స్థాన ముష్ట్యా కర్షణలక్షణములు, గుణముష్టి, ధనుర్ముష్టి, సన్ధానము, ధనుర్వ్యాయములు లక్ష్యములు లక్ష్యాభాసము అనధ్యాయములు శ్రమక్రియ లక్ష్యాస్ఖలనవిధి శీఘ్రసంధానము దూరపాతిత్వము దృఢభేదనము హీనగతి సమూహము బాణాలక్ష్యస్ఖలనగతి సమూహము క్షుద్రగతులు దృఢచతుష్కము చిత్రవిధి కాష్ఠచ్ఛేదనము ధావనలక్ష్యము ధావనవిధి, శబ్దవేదిత్వము ప్రత్యాగమనము అస్త్రవిధి అస్త్రములు వానిమంత్రసంస్కారము పాశుపతాస్త్రము ఔషధులు ఔషధవిధి ఉపవాసము సంగ్రామవిధి రుద్రమంత్రజపము వ్యూహాదులతో యుద్ధకరణము దగ్ధవ్యూహము శకటవ్యూహము పిపీలికావ్యూహము సేనానయము పదాతిక్రమము అశ్వక్రమము హస్తిక్రమము రథక్రమము సేనాపతికరణవిధి శిక్ష హంతవ్యా హంతవ్యోపదేశము పరిశేషప్రకరణము:- అస్త్రనామములు:— అసి, అంకుశము అవిద్య, అసిపుత్రిక, అర్ధధార, అంతర్ముఖము, ఆటీముఖము, ఆర, ఆస్తరము, ఇలి, ఇషువు, ఉత్పత్రపత్రము, ఏషణి, ఏంద్రచక్రము, కవచము, కరపత్రము, కాలచక్రము, కుఠారము, కుంతము, కుఠాలిక, కుండిక, కుద్దాలము, క్రకచము, ఖేటకము, ఖగము, ఖట్వాంగము, గద, గాంధర్వము, గారుడాస్త్రము, గోశీర్షము, చక్రము, చమ్రము చాపము, క్షురిక, జంభనము, జింభశాస్త్రము, తులాగుడ, తూణీరము, తోమరము, త్రిశూలము, త్రిహర్చక, దంతకట్వకము, దండిచక్రము, దండము, దివ్యాస్త్రము, ద్రధనము, దంతశంఖు, ధర్మచక్రము, ధనుస్సు, నఖశస్త్రము, నారాచము, నాళీకము, నాగపాశము, నాగాస్త్రము, నిస్త్రింశము, నందనము, పరిఘము, పట్టిసము, పరశువు, పాశుపతము ప్రశమనము, ప్రస్వాపనము, పినాకము, ప్రామము, బాణము, వక్రము, వాసి, రరుణము, బ్రహ్మశిరము, వాయ్యస్త్రము విద్య బడిశము, బ్రహ్మస్త్రము, బర్హణము, బ్రహ్మదండము, వేతసపత్రకము, వ్రీహిముఖము విలాపనము, వృద్ధిపత్రము, భల్లము, భింఢిపాలము, భుశుండి, మకరాస్త్రము, మండలాగ్రము, మాష్టికము, ముసలము, మాదకి, మయూఖి, ముదిత, లఘిత్రము, లగండము, లవిత్రము, శరము, శక్తి, శతఘ్ని, శలాకాస్త, శూల, శస్త్రి, శిరానీముఖము, శార్ఙము, శోషణము, సమ్మోహనము, సర్పాస్త్రము, సంతాపనము, సాయకము, సింహముఖము, సూచీ సూచీముఖము, సీరము స్ధూణము, హయ్యశరము, హేతి, క్షుర, క్రౌంచాస్త్రము, కుశపత్రము, శ్రేణి, దాత్రము.

శివతత్త్వరత్నాకరము:- ఇది సంధానగ్రంథము, అర్వాచీనము, కెళిది బసవరాజుచే క్రీ. శ. 1691 నుండి 1715 లో సంధానింపఁబడినది. ఇందు 8 వ కల్లోలమున ద్వితీయ, తృతీయ, చతుర్థ తరంగములలో ధనుర్యుద్ధశాస్త్ర విషయములున్నవి.

నీతిప్రకాశిక

దీనికే వైశంపాయననీతి యని నామాంతరము. ఇది యెనిమిదధ్యాయములు గలది.

తొలుత బ్రహ్మ పృథుచక్రవర్తి కుపదేశించిన ధనుర్వేదమును వైశంపాయనుఁడు జనమేజయున కుపదేశించినట్లు గ్రంథావతారణిక ప్రథమాధ్యాయమున గలిదోషములు రాజనీతిమున్నగు విషయములు శత్రుపై దాడి వెడలుటకుఁ బూర్వము సంసిద్ధుఁడై యుండవలసిన తీరులు గలవు.

ద్వితీయాధ్యాయమున జయప్రదములైన ధనుర్వేదోక్తములైన యాయుధములు ముక్తక అముక్తక ముక్తాముక్తక మంత్రముక్తకము లని నాల్గు తెఱఁగులనియు ధనుర్వేద ప్రథమపాదమున సూచితములగు ధనురాది ద్వాదశాయుధములు మొదటిరకములనియు, ద్వితీయపాదమునఁ జెప్పబడిన యిర్వది యాయుధములు రెండవరకమనియు, తృతీయపాదమునవి మూఁడవరకపుటాయుధములనియు నవి నలువదినాలుగనియు సోపసంహారములనియు నేబదియెదుపసంహారాయుధము లనియు, చతుర్థపాదమున సర్వశక్తిమంతములగు నారాయుధములు ప్రతిపాదింబడినవనియి ధనుర్వేదవిషయము చెప్పబడినది.

తృతీయధ్యాయమున ఖడ్గోత్పత్తి తద్వివరణము తెల్పబడినది.

చతుర్థ పంచమాధ్యాయములలో తొలుతటి రెండురకముల యాయుధముల వివరణమున్ను పంచమము చివర కలికాలోపయుక్తము లగు భయంకరాయుధముల విషయము వర్ణింపబడినది.

షష్ఠము సైన్యవిషయవివరణము, సప్తమము దండనీతిని గుఱించి, అష్టమమున రాజ్యపరిపాలనావిషయము సామాన్యధర్మములును ప్రతిపాదింపబడినవి.

కోదండమండనము

దీనికర్తపే రెఱుఁగరాలేదు.

జ్యాకుండలితకోదండయష్టి ర్యస్య కరే స్థితా
స్థితా తస్య కరేంభోదివేలాకుండలితా మాహీ
ద్రోణభీష్మాష్టునాదీనా మద్యాపివ్యా ప్తభారతః
సధనుర్గుణటంకారః స్ఫారః స్పూర్జతి భూతలే
యజ్జామదగ్న్య భృగురు రాఘవసూర్యపుత్త్ర
ద్రోణార్జునప్రభృతిభి ర్జమదగ్నిముఖ్యః
నీతం యశస్త్రిషు జగత్సు యదద్యతావ
త్కుందేందుధామధవళం సధనుఃప్రభావః
సర్వశాస్త్రాణి సంక్షిప్య కృత్వానుభవ మాత్మనః
సంప్రదాయ ముపాదాయ కుర్మః కోదండమండనమ్
అనాదిబ్రహ్మసంభూత స్త్రివర్గఫలసాధనః
యజుర్వేదోపవేదోయం ధనుర్వేదో నిగద్యతే
మనుష్యో౽పిమహాధన్వి భోజరాజో ధనుశ్శ్రమాత్
వివ్యాధ స్ఫారనారాచైః ధారాయంత్రం కలౌయుగే
శ్రీమతో భోజరాజస్య కోంకణానాం క్షయక్షణే
అద్వితీయస్య సాహాయ్యం విదధీత శరాసనమ్

1 అధ్యాయము ధనుర్వేదప్రశంసా 2 శిష్యలక్షణము 3 అధివాసనాధికారము.

విప్రే భూభుజిభంగభాజి వికలే బాలే వివస్త్రే స్త్రియాం
వృద్ధవ్యాధితముక్తకేశవివశే భగ్నోర్ధ్వబాహుష్వపి
నిశ్శస్త్రే శరణార్థినిక్షితిగతే తవాస్మీతిచ
క్షీబం జల్పతి నత్వయా రణముఖే వ్యాపారణీయం ధనుః

4 ఉపనయనవిధి 5 ధనుర్లక్షణము 6 గుణలక్షణము 8 కోదండగుణబాణకర్మ 9 యోగాభ్యాసము 10 క్రియాభ్యాసము 11 శలాకాభ్యాసము 12 జ్యాఘాతాభ్యాసము 13 శ్రమకాండము 14 గతిదోషనిర్ణ యము 15 గతినిర్ణయము 16 లక్ష్యసాదనము 17 ఆకర్షణము 18 దృఢవేధము 19 దూరాపాతము 20 చిత్రవేధము 21 సమరసంభారము.

యుక్తికల్పతరువు చతుష్షష్టికలాసంగ్రహము అభిలషితార్థచింతామణి యనుసంధానగ్రంథములలో ధనుర్వేదవిషయ మత్యల్పమే కలదు.

హరిహర చతురంగమ్

ధనుశ్శాస్త్రప్రకరణమ్

“చతురంగబలం ప్రోక్తం నచ యుద్ధక్రియాక్షమమ్
ధనుర్విద్యాసు నిపుణధానుష్కేణ వినాతతః
ధనుర్వేదం సమాలోచ్య తథై వేశానసంహితామ్
వీరచింతామణిం వీక్ష్య శ్రీకోదండచతుర్ముఖమ్”

“సారసంగ్రహమాలోచ్య ధనుశ్శాస్త్రాంతరాణిచవ వక్షీతత్ర ధనుర్విద్యా సారభూతార్థ సంచయం ధనుఃప్రశంస ధన్విప్రశంస ధనుర్గుణశ్చ బాణశ్చ గురుశ్శిష్యశ్చ పంచమః ధనుర్విద్యాంగ మేతాని కథ్యత్తేక్రమశ స్సహ” చాపద్రవ్యము చాపభేదములు చాపప్రమాణములు చాపదోషములు ధనుఃషడంగములు “అటనీ కర్ణికా శంఖః స్కంధాఃకోట్యంతరేస్థితాః పల్లవోలస్తకో మధ్యేషడంగం ధనురుచ్యతే” షడంగణవివరణము శరద్రవ్యము శరత్రైవిధ్యము తన్మాకము నిందితశరములు శరసప్తాంగములు “ముఖకర్ణి తథా స్కంధౌ గాత్రం వక్త్రానననం తధాజంఘా పుంఖశ్చ విపిజే సప్తంగా న్యనుకల్పయేత్" పుంఖాష్టవిధత్వము పక్షములు పత్రచ్ఛేదము ఫలపాయనము గురుశిష్యులు అనధ్యాయములు శ్రమము గురుపూజాదికము “శుక్రగౌతమ శాండిల్య జమదగ్ని బృహస్పతీ ధనుర్వేద గురూం శ్చాగ్రాన్ తర్పయే ద్బలికర్మణౌ ఉపనయనమ్ పూజా ధనుర్గ్రహణమ్ శ్రమఫల లక్ష్యమ్” లక్ష్యదోషగుణములు స్థానదోషములు స్థానములు సంధానదోషములు అంగదోషము దార్థ్యము ముష్టి వ్యాయములు వాయుసంధారణము సౌష్ఠవము అభ్యాసము క్రమలు గతులు గతిదోషము "కుంభస్థలం గజానాం స్యాత్ వాజినాం కర్ణపృష్ఠకమ్ నరాణాం హృదయం మర్మత్వేవం మర్మవిధో విదుః రాధా యంత్రమ్ శబ్దవేధ మనోవేధ” ఖడ్గలక్షణము. ఇది మ్యుఖవిషయసూచి "ఇతి శ్రీమన్మహారాజాధి రాజగజపతిప్రతాపరుద్ర దేవస్వహస్తధారితకనకకేసరిచతుష్టయావేష్టిత శాతకుంభమయ కుంభసంభృత మేఘాడంబరాభిధాన సితాతపత్రశోభమాన కవిపుంగవ పండిత రాజ రాజగురు వాజిపేయయాజి మంత్రివర గోదావరిమిశ్రవిరచితే హరిహర చతురంగే పంచమో ధనుర్విద్యాపరిచ్ఛేదః.”

వీరచింతామణి:— భగవతోవ్యాసస్యకృతిః

ఆచార్యలక్షణము, శస్త్రకర్మారంభ కాలము శిష్యునికి ధనుర్ధానము వేధత్రయము ధనురాదానవిధి ధనుర్లక్షణము ధనురాచార్యులు పరశురామాదులు.

"త్రిపర్వం పంచపర్వంచ సప్తపర్వం ప్రకీర్తితమ్
నవపర్వంచ కోదండం చతుర్థా యుద్ధకారకమ్
చతుఃపర్వంచ షట్పర్వ మష్టపర్వం విసర్జయేత్
కేషాంశ్చ భవే చ్ఛాపం వితస్తినవసమ్మితమ్
పౌరుపేయంతు యచ్ఛార్ఙ్గం బహువత్సరశోభితమ్
వితస్తిభి స్సార్థషడ్భిర్మితం సర్వార్థసాధనమ్”

ఇత్యంతమగు ధనుఃప్రమాణము గుణలక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు ఫలపాయనము.

"ఫలస్య పాయనం వక్ష్యే దివ్యౌషధివిలేపనైః
యేనదుర్భేద్యవర్మాణి భేదమే త్తరుపత్రవత్
పిప్పలీ సైంధవం కుష్ఠం గోమూత్రేరతు పేషయేత్

అనేన లేపయే చ్ఛస్త్రం లిప్తం చాగ్నౌ ప్రతాపయేత్
శిఖిగ్రీవాసువర్మాభం తప్తపీతం తదౌషధమ్
తతస్తు విమలం తోయం పాయయే చ్ఛస్త్రముత్తమమ్”

నారాచనాళీకములు స్థానముష్ట్యాకర్షణములు స్థానములు ముష్టులు వ్యాయములు అనధ్యాయములు శ్రమక్రియలు లక్ష్యాస్ఖలనవిధి శీఘ్రసంధానము దూరాపాతము శీఘ్రదృఢభేదిత హీనతులు శుద్ధగతులు దృఢచతుష్కము చిత్రవిధి బాణభాగములు కాష్ఠఛేదనము బిందుకము గోలయుగళము వేధవిధి అస్త్రవిధి శస్త్రవారణము సంగ్రామవిధి విష్ణుస్మరణము అక్షౌహిణీ మహాక్షౌహిణీ వ్యూహవిశేషములు.

ముఖే రథా గజాః పృష్ఠే తత్పృష్ఠేచ పదాతయః
పార్శ్వయో శ్చ హయాః కార్యాః వ్యూహ స్సాయం విధి స్మృతః
అర్థచంద్రం చ చక్రంచ శకటం మకరం తథా
కమలం శ్రేణికాగుల్మం వ్యూహ నేవం ప్రకల్పయేత్

యుద్ధవిధి:—

యస్తు భగ్నేషు సైన్యేషు విద్రుశేషు నివర్తతే
పదేపదే శ్వమేధస్య రభతే ఫల మక్షయమ్
ద్వా విమౌ పురుషా లోకే సూర్యమండలభేదినౌ
పరివ్రా డ్యోగయుక్తశ్చరణే చాభిముఖోహతః
ఆస్యేన వాయవో యాన్తి పృష్ఠే భాను ర్వయాంసిచ”
అనుప్లవంతే మేఘాశ్చ యస్య తస్స రణే జయః

ఇతి ధనుర్వేదః

నలజనంపాటిశాసనమున (ఇది నన్నయకుఁ జాలఁ బ్రాచీనము) నిట్లున్నది.

దీని రక్షిఞ్చనవాని (కి) అడుగడు గశ్వమేధంబున ఫలంబగు.

ఇదే నన్నిచోడని కుమారసంభవమున నిట్లున్నది.

చ.

పుడమిపుఁడున్ ధనాఢ్యుఁడును భూరిబలుండు శౌర్యవంతుఁడున్
గడుదృఢపాణి (యున్నయినఁగాని) యెడంబడ దశ్వమేధ మొం
డడరఁగఁ జేయఁ దన్మఖమునందుల పుణ్యఫలంబు నందఁగా
నడుగుడుగశ్వమేధ మగునాజిమొనం జని చావు సేగియే.

సంస్కృతగ్రంథముల యాంధ్రీకరణము లయినను భారతాదులలోను దేసిరచనలగు కుమారసంభవాదులలోను యుద్ధతంత్రవిశేషములు వ్యూహనామములు ఆయుధనామములు ప్రాకృతరూపములతో నధికముగా నున్నవి. అవి కర్ణాటాంధ్రసమానములుగా నున్నవి. అంతేకాక యుద్ధగణిత భరతనాట్యాది శాస్త్రపారిభాషికపదములు మహారాష్ట్ర ప్రాకృతమున నున్నవి. ఆఱ్నూఱేండ్లు నిర్వక్రముగా రాజ్యమేలిన చాళుక్యులనాటనో అంతకు బూర్వము సాతవాహనులనాటనో యవి యట్లు నెలసియుండవచ్చును. సభాపతివచనమున బత్తీసాయుధములపే ర్లిట్లున్నవి. అసి, ముసల, ముద్గర, రోహణ, కణయ, కంపణ, శిల్లు, భల్లాతక, భిండివాల, కరవాల, కుంత, కోదండ, కఠార, తోమర, పరశు, త్రిశూల, వజ్రముష్టి, గదాతౌది, లాంగూలంబులు, నతళము, వంకిణి, చక్రము, సబళ, యీటె, యినుపకోల, సెలకట్టె, పట్టెసము, ప్రకూర్మము, నఖమయూరము, దండ, నాసంబులు.

ధనుశ్శాస్త్రవిషయకములైన సంస్కృతగ్రంథముల తీరిట్లుండఁగాఁ ధనుర్విద్యావిలాసముగాక శ్రీ పాకలపాటి రాజగోపాలరాజ ప్రణీతమగు దెలుఁగున నిప్పుడు ప్రసక్త మయిన ధనుశ్శాస్త్రము ఆద్యభ్యాస పరికర వ్యూహ ధర్మఖండములని యైదుఖండములు గలిగి యనేక ధనుశ్శాస్త్రరహస్యార్థములతో గర్భితమై ముద్రితమై కానవచ్చుచున్నది. కాని యందు తుదిఖండమగు ధర్మఖండము గానరాదు. అది యెందుచేతనో ముద్రణమున కెక్క దయ్యెను. క్రీ. 1811వ సంవత్సరమున ధనుశ్శాస్త్రమును మందపాటి వెంకటపతి రాజుగారి దగ్గఱ శుశ్రూషించి నేర్చుకొనె నట. ధనుశ్శాస్త్రరహస్యార్థములు వారికి స్వయముగ జ్ఞానదృష్టికి గోచరింపఁగా నా గంథ్రమును వారు రచించిరట. ఆ గ్రంథమున ధనుర్విద్యావిలాసము లోని విషయములు చాలఁగా జేరియే యున్నవి గాని ఇంక నెన్నో విశేషవిషయములందు గలవు. దానిలోని విషయసూచి యిట్టిది:——

ఆదిఖండము - ప్రథమాశ్వాసము.

1. నిమిభూపాలుఁడు నైమిశారణ్యమున కరుగుట, 2. నీచజనకృతమగు పరిభవము. 3. నారదాగమనము 4. ధనుర్విద్యామహాత్మ్యము. 5. బ్రహ్మయజ్ఞమున నారాయణుఁడు హయగ్రీవుఁడై యవతరించుట. 6. వేదోపవేదములయుత్పత్తి. 7. టిట్టిభబ్రాహ్మణోపాఖ్యానము. 8. నారదుఁడు దివ్యాస్త్రమంత్రములను శపించుట. 9. పారాశర్యస్తవము. 10. భారతకథాప్రకటనము. 11. పరిక్షిత్సంభవము.

ఆదిఖండము - ద్వితీయాశ్వాసము.

12. అర్జునుఁడు పరీక్షిత్తుకు విద్యాభ్యాసమహాత్మ్యమును బోధించుట. 13. అవక్రీతు చరిత్రము. 14. కుమారభార్గవులు సదాశివుని భజించుట. 15. శ క్తి త్రయోత్పత్తి. 15. ధనురాదిసాధనషట్కసంభవము. 17. శక్తిత్రయపూజానిరూపణము. 18. దివ్యాస్త్రసంభవము. 19. ధనుర్విద్యాసాంప్రదాయము. 20. రాజవంశముల క్రమము. 21. భీషణేతిహాసము, 22. నందరాజయుద్ధము. 23. సిద్ధదర్శనము. 24. ఏకాదశమహాధనుర్ధరచరిత్రము. 25. దిండికారకృతవిద్యాలాభము

అభ్యాసఖండము - ప్రథమాశ్వాసము.

1. కృపాచార్యుం డర్జునుని గృహమున కేతెంచుట. 2. అర్జునుఁడు విద్యాలాభమునకై పరీక్షిత్తుని కృపాచార్యుని కప్పగించుట. 3. విద్యారంభపూజావిధానము. 4. షణ్ముఖాదుల సత్యవచనప్రకటనము. 5. గురుశిష్యాభ్యాస రంగలక్షణములు. 6. ముహూర్తప్రకారము. 7. నిబిడాసనవర్తుల ముష్టిలక్షణము. 8. షణ్ముఖలక్షణములు తద్వినియోగములు. 9. ఏకశరాభ్యాసప్రకారము, 10. చతుర్ధశోపాయంబు లెఱింగించుట. 11. వైష్ణవసాచీకృత సన్యాసలక్షణములు. 12. పంచస్థాన చిత్రస్థానలక్షణములును, తద్వినియోగంబులును అభ్యాసప్రకారంబును 13. చతుర్ముఖంబుల నభ్యసించువిధి. 14. వృషదత్తేతిహాసము. 15. కురుభూమహాదేవీభాషణము. 16. షడుపాయప్రకారము. 17 సూచీముఖప్రభావము. 18. పద్ధతినవజప్రకటనము. 19. సూచీముఖాభ్యాసభేదము. 20. క్రీడాసంగరప్రకారము. 21. లాఘవశక్తి మహాత్మ్యము లెఱింగించుట. 22. నిరంతరభ్యాస శరస౦ఖ్యానిరూపణము. 23. చతుర్యుగ సంధానప్రమాణము లుపన్యసించుట.

అభ్యాసఖండము - ద్వితీయాశ్వాసము.

24. దృఠశక్తికీర్తనము. 25. మోహనాకర్షణలక్షణము. 26. భుజబాహుదండ ముష్టి సౌష్టవప్రకారము 27. చలాచల భాగనిరూపణము. 28. రజ్ఙచాపనిరూపణము తదభ్యాసప్రకారము. 29. భోజ్యవస్తుప్రకారము. 33. పంచదోషనిహపణము, 33. కురులోచనోపాఖ్యానము నారాయణుఁడు దానిని శపించుట. 32. చతుర్విధ మోక్షణములు - తత్ప్రకటనము. 33. లక్ష్యవేదికావిధానము. 34. పంచశుద్ధులవిధము. 35. బ్రహ్మదండ మోక్షణప్రకారము. 26. విధిత్రయప్రకటనము. 37. చతుర్యుగపురుషాఢ్యు లేయు భారంబుకొలందు లెఱిగించుట. 39. కాపీవిద్యామహాత్మ్యము, 39, దూరాపాతిశరప్రయోగవిధానము. 40. గురుస్తవము. 41. ధనుస్తవము. 42. చతుష్ప్రహార పరిమితాభ్యాస వివరణము.

అభ్యాసఖండము - తృతీయాశ్వాసము

43. యోగీశ్వరుల ధారణక్రమము. 41. లంబలక్ష్య నిర్మాణక్రమము. 45. దీపకలికావశంబున దృక్సిద్ధి వడయుప్రకారము. 46. క్రమక్రమాభ్యాసవివరణము, 47. నవలక్ష్యాభ్యాసప్రకారము. 48. ఉమామహేశ్వరసంవాదము. 49. ధునీయంత్రకల్పితము. 50. శబ్దలక్ష్యరహస్యముల నుపన్యసించుట. 51. ధనంజయ చరిత్రము. 52. చిత్రలక్ష్యమార్గములు గుహ్యప్రకారముగా నెఱింగించుట. 53. గురుదక్షిణా సమ ర్పణప్రకారము. 54. ధ్వజవిచారము. 55. కులధర్మంబులగు హింసాకార్యములకు నిర్దోషంబుగా గురుఁడు స్మృత్యర్ధంబు సమాధానము సెప్పుట. 56. మృగయావినోదము.

అభ్యాసఖండము - చతుర్థాశ్వాసము.

57. బ్రహ్మోపదేశమున స్వాయంభువమనువు ధనుశాస్త్రమును రచియించుట. 58. కర్దమశాపముచే వైకల్యము నొంది మరల హయగ్రీవపాదులవలన శాస్త్రదశకము కల్పింపబడుట. 59. గరుడుఁడు నిజరచితం బైన భానశాస్త్రమును గాధేయుని కిచ్చుట. 50. గాధేయుఁడు రామచంద్రుని దోడి తెచ్చుట. 61. తాటకాపహరణము. 62. ఖాణోపదేశారంభము. 63. గుణపంచకప్రభావము. 64. వాయుధారణవిధమును ప్రకటించుట. 65. పరికరషట్కధారణ క్రమం బెరింగించుటయు తిద్విమోక్షణక్రమంబును. 61. వాయునిరూపణప్రకారము. 61. ఏకశృంగశరాభ్యాసలక్షణము. 68. స్తంభీకృతవిద్యాచమత్కారము. 69. స్థానసంచక ప్రతిస్థానలక్షణ వినియోగములు. 71. దూరాపాతిశరనైపుణ్యప్రకారము. 71. కుమారోపాఖ్యానము. 72 భారతయోధుల కౌశల చమత్కార భేదములు.

పరికరఖండము - ప్రథమాశ్వాసము.

1. ధనుర్దండములు దేశ దేశ భేదములై జన్మించుట. 2. వేణుకులకీర్తనము. 3. భూసారవిశేషనిర్ణయము. 4. వంశసంభవప్రకారము. 5. వేణుఖండనముహూర్తములు. 6. వేణుఖండనప్రకారము. 7. భూవహ్నిపార్థనము. 8. ధనుస్సంగ్రహశాలానిర్ణయము. 9. విళ్ళగీతలకు రూపము లేర్పరించుట. 10. ధనుర్నిర్మాణ వస్తునిర్దేశములు. 11.చాపనిర్మితప్రకారము. 12. కళాయంత్రంబు కల్పించువిధము. 13. తులాయంత్రనిర్మాణప్రకారము. 14. బలువుల సంఖ్యాప్రకటనము. 15. యుగత్రయపురుషుల ధనుర్భల ప్రమాణములు. 16. గాండీవాది కోదండసంభవము. 17. ధనుర్దండము పండించుతెఱగు. 18. కుణవల్లీషట్కంబును సృజించు విధానము. 19. జాంగలాది భూనిర్ణయప్రకారము. 20. ఏకవింశతివేణువుల చాపదండములుగల రాజులనిర్ణయంబులు. 21. శార్ఞ్గాది చాపలక్షణములు.

పరికరఖండము - ద్వితీయాశ్వాసము

22. శిలీముఖకర్తనము. 23. సెలకట్టియలభేద ముపన్యసించుట. 21. శరోత్పత్తిక్రమము. 25. సెలకట్టియల రాజమార్గంబునంబరచి అందుత్తమసారంబుల సంగ్రహించుట. 26. ధారావక్రంబులు దీర్చువిధము. 27. పుంఖార్హవస్తునిర్దేశము. 28. మయవిశ్వకర్మ సంవాదము. 29. వర్ణభేదవస్తునిర్దేశము. 30. శిల్పవిద్యాచాతుర్యము. 31. శరములకు లక్కగరులు కట్టుమార్గము. 32. ప్రతిపత్రార్హంబులైన పులుగులనామధేయములు. 33. దూరాపాతి, తేజోఘాతి, పాషాణఘాత, లోహఘాతి రచితప్రకారము. 34. అలుకుల రూపప్రకటనము. 35. పంచధారలవలన శరకల్పలప్రకారము, 36. షడ్విధజాతులుంగల కట్టియలకు వినియోగంబు లెఱింగించుట.

పరికరఖండము - తృతీయాశ్వాసము

37. ఉపసాధనములు. 38. గోధాలలామంబులు, కనకశృంగ శిలాచర్మంబుల నిర్మించువిధము. 39. చెకినుల తారతమ్యంబు లేర్పఱించుట 40. ఏకవింశత్యంగుళీత్రాణ నిర్మాణ కౌసలప్రభావము. 41. కనకాంగుళీగుప్తంబు మూసనుబోయువిధము. 42. హేమచర్మ సంయుక్తాంగుళీగోపాయితమార్గము. 43. మయగౌతమసంవాదము. 44. వేణుతూణీరప్రకారము. 45. దారుతూణీరనిర్మాణవిధానము, 46. చర్మనిషంగప్రకారము. 47. కేకీముకురంబులు తరకసులం బొదువు విధము. 48 తరకసుల వినియోగము.

పరికరఖండము - చతుర్థాశ్వాసము

49. గురుస్తవము. 50. భార్గవదత్తమైన గ్రంథప్రకారము. 51. కులమారి పైశాచ కాశ్మిక ఘోరి కుటిలాభిధానంబులు గల ధను ద్దోషంబుల ప్రకారము. 57. రథవాహోపాఖ్యానము. 53. షణ్ముఖకుండల పద్మవరాట భుజంగచక్రపంచక లక్షణపలసూత్రంబు లుపన్యసించుట. 54. దివ్యాస్త్రప్రయోగార్హశరలక్షణములు, తత్పూజానిరూపణంబును. 55. అమోగాస్త్రసంభవము, 56. ధీయువధ. 51. దివ్యాస్త్రగర్వప్రకారము. 58. అమోఘాస్త్రము పరంపరానుగ్రహముగా భూలోకంబునకు వచ్చుట.

వ్యూహఖండము - పంచమాశ్వాసము.

1. అక్షౌహిణీసంఖ్య. 2, సమరంబులకు బయనంబగు సేనాలక్షణంబులు. 3. భటఘోటకరిరథాదుల స్వరూపప్రకటనము. 4. అతిరథ మహారధ సమరథార్ధరథులగుణంబులు. 5. రథీజమనోజ్ఞత్వకౌశలవిశేషంబులుగల సారథులచందము. 6. ఉపసైన్యంబగు బేడుదండున దీపించుతెఱగు. 7. మిత్రవ్యూహనామనిర్దేశము. 8. మహావ్యూహంబు లొడ్డెడువిధము, 9. పోటుమానసు లెక్కటికయ్యంబులకు జోళ్లు గట్టి పెనంగుమార్గము. 10. అసిచర్ముల యుద్ధము. 11. కుంతాయుధులసమరము. 12. మల్లరణము. 13. చక్రాయుధుల కథనము. 14. గదాధరుసంగ్రామము. 15. అశ్వవిద్వేషము. 16. వారణవిరోధము. 11. అర్ధరథ సమరథ మహారథా తిరథికుల యుద్ధచమత్కారము. 18. అర్ధరథాదుల నైజంబుల ప్రకటనము.

కడపటి దగుధర్మఖండ మిందు ముద్రితము గాలేదు, గాన దానివిషయసూచి యిందు చేరలేదు. ఈ గ్రంథము ధనుశ్శాస్త్రవిషయమున సంస్కృతగ్రంథము లన్నింటిని మించినది. దీనికి మూలమగు సంస్కృతగ్రంథమేదో తెలియరాలేదు. ఇందు ధనుర్వేదగ్రంథగర్తల పేళ్లు తత్సంప్రదాయాదులు చాల జెప్పబడినవి.

కృతిపతి

ఈవని కోదండరామస్వామి.

కృష్ణానేని తిరుమల మాణిక్యారాయప్రభుఁడు ధనుర్విద్యావిశేషములు వివరింపఁగాఁ దదాస్థానకవి యగు కృష్ణమాచార్యుఁడు తెలుఁగున మూడాశ్వాసములప్రబంధముగా కృతిప్రేరకుని యిలవేల్పయిన యీవని కోదండరామదేవున కర్పితముగా నీగ్రంథము రచియించినాఁడు. కృతిపతి వెలసియున్న యీవని గ్రామము గుంటూరు మండలమున తెనాలి తాలూకాలో నున్నది. ఈగ్రంథమునకు,

కృతికర్త

కృష్ణమాచార్యుఁడు. ఈతని నివాసగ్రామ మేదో తెలియరాదు. ఈధనుర్విద్యావిలాసమునే కాక శకుంతలాపరిణయ మని మరొకప్రబంధమును గూడ నీతఁడు రచించినాఁడు. [1]శకుంతలాపరిణయము నీతఁడు చిరుమామిళ్ల పాపయ్య ప్రభుఁడని నామాంతరముగల వెంకటాద్రినాయనింగారి ప్రేరణమున తిరుపతి వెంకటేశ్వరస్వామి కర్పించినాఁడు. అందా పాపయప్రభుని వంశవిస్తర మెల్ల వర్ణింపబడినది. చల్లపల్లి జమీందార్లగు నేర్లగడ్డవారికిని, ముక్త్యాల, అమరావతీ ప్రభులగు వాసిరెడ్డివారికిని చిరుమామిళ్లవారు దగ్గర బంధువులు. నేటికిని నది సాగుచునే యున్నది. చిరుమామిళ్ల వంశ్యులు, నాయఁడమ్మగారు, పాగోలు వాస్తవ్యులుఁ చల్లపల్లి శ్రీశివరామనృపునకుఁ చిన్నతల్లిభర్తయు, ముక్తాల శ్రీచంద్రమాళీశ్వర ప్రభునకు భావుకుఁడునై వర్ధిల్లుచున్నారు. శకుంతలాపరిణయమున గ్రంథకర్త తన్ను కృష్ణకవి యనియు ధనుర్విద్యావిలాసమున గృష్ణమాచార్యుఁడనియుఁ బేర్కొన్నాఁడు. శకుంతలాపరిణయమునాఁటి యీతనివై ష్ణవత ధనుర్విద్యావిలాసమునాటికి క్రమపాకము పొందినదిగాఁ బోలును. పేళ్లు మార్పునుబట్టి రెండు గ్రంధములకుఁ కర్తలు వేర్వేరువా రగుదురేమో యని సందేహింపరాదు. ఈనామభేదమే కాని రెండు గ్రంథముల గద్యములు సమానముగానున్నవి.

"ఇది శ్రీమత్కౌసల్యానందనప్రసాదసమాసాదితకవితావిచిత్ర మైత్రేయసగోత్ర నృసింహగురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీతంబైనఁ శకుంతలాపరిణయము” శకుంతలాపరిణయ రచనమునకుఁ దర్వాతి రచనముఁ గాబోలును ధనుర్విద్యావిలాసము. ఇందు గద్య మించుక మార్పు చెందినది ‘‘కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాసమాసాదిత” అని. కాని రెండు గ్రంథములందును గురుస్తుతియుఁ కవి కులగోత్ర ప్రశంసయు నొక్కవిధముననే యున్నవి.

క.

భాసురసూరి గ్రామణి
భూసురముఖ పంకరుహనభోమణి నినమ
ద్దాసనిచయ చింతామణి
నే సింగర గురుశిఖామణిం గణుతింతున్.


మ.

నను రామానుజపాదపద్మయుగళీ నవ్యావ్యయధ్యానపా
వనహృద్భాగగవతావతంసపదసేవాసక్తచిత్తున్ మరు
త్తనయారాధన లబ్ధచారుకవితాధారున్ సదారూఢభా
వను నాస్థానకవిన్ నిజాశ్రితునిఁ బిల్వంబంచి పల్కెం గృపన్.


క.

పాత్రుఁడవై మైత్రేయస
గోత్రుఁడవై నారసింహగురువర్యునకున్
బుత్రుఁడవై వెలయుదు వి
ద్ధాత్రిన్ మాపనుపు సేయఁదగుఁ గృష్ణకవీ!

రెండు గ్రంథములందును పద్యము లున్నవి గావున రెండు నొక్కకవిరచనములే యగుట స్పష్టము ఇవి గాక, ఆంధ్రసాహిత్యపరిషత్తు కేటలాగులోనున్న కొమ్మాలపాటి దండకము, నింకొక యక్షగానము నీతని రచనములని శ్రీనిడదవో లు వెంకటరావుగారు చెప్పిరి. కావచ్చును. పరిషత్తు పుస్తకముల జాబితాలో నాదండకమున కృష్ణమాచార్య రచనమని కలదు. ఆగ్రంథమును నే జదివిచూడలేదు. ఆకాశరావణసంహారమని మరొక పద్యకావ్యము, రసవంతమయినది తెనాలి తాలూకాలోనే మోదుకూ రనువూర మొగసాటి మూర్తిరాజుగారను భట్టు రాజుగారి యింటదొరకినది. నేను మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక శాలకుఁ జేర్చినాను. తద్గ్రంథకర్త ఉరుటూరి వెంకటకృష్ణకవి తన గ్రంథమునే తద్ధనుర్విద్యావిలాసరచనాప్రేరకుఁ డగు కృష్ణానేని తిరుపతి మాణిక్యారాయప్రభుని ప్రేరణముననే రచించినట్టు వ్రాసినాడు అదికూడ (ఈవని) కోదండరామస్వామికే యర్పితమై యున్నది. కృతిప్రేరకుఁడగు ఆతిరుపతిరాయనిగూర్చి ధనుర్విద్యావిలాసములో నున్న పద్యములే ఆకాశరావణసంహారమున నున్నవి. ఆకాశరావణసంహారమున గొన్ని తాటియాకు లేయానుపూర్వి లేక దొరకినవిగాన దానిని గూర్చి యింతకంటె హెచ్చువిషయములు గుర్తింపఁగా లేదు. అతని గద్య మిట్టిది. “ఇది శ్రీవిమలచిత్తమునిచరణసేవాధురీణ, రాఘవపాండవీయాది బహుప్రబంధనిబంధనప్రవీణ ఆపస్తంభసూత్రహరితసగోత్ర వురుటూరి........౦కశ్లేషకవితాపితామహోంక సంస్కృతాంధ్రభాషాచతుర్విధవివిధకవితానిలయ వెంగన మంత్రి తనయవినయవిశంకట వెంకటకృష్ణకవి ప్రణీతం బైన యాకాశరావణసంహారంబునందు తృతీయాశ్వాసము.”

కృతిప్రేరకులు – వెలమవారు

'వెలమ' యని నేటివ్యవహార మైనను వెలుమ 'వెల్మ' పదములే ప్రాచీనన్యవహారరూఢములు, రెడ్డి, కమ్మ, వెలుమ, బలిజ జాతులవారు బహుప్రాచీనకాలమున నుండియు నంధ్రదేశమున మహాప్రాభవము ననుభవించినవారు. ఇప్పుడు ప్రసక్తులగు వెలుమవారిలో పద్మనాయకులనువారుఁ (వారికే పద్మవెలుమ లని వ్యవహారము) చాల సుందరాకారులు, రాచఠీవిగలవారు, ఏల్బడులు నెఱపుచు, వీరాధివీరు లయి చాల విఖ్యాతిగన్నవారు. వారియాచారవ్యవహారములు రాచవారితీరు లవి. కాకతీయుల నాఁట నుండి నేఁటిదాఁక నవిచ్ఛిన్నమయిన రాజ్యవైభవము ననుభవించుచు వర్థిల్లినవారు. వెలుమవారిలో రావువంశ్యులగు వెలుగోటి ప్రభువులు. ‘వెలుమ’ పదము 'వర్మ' పదవికృతి కావచ్చును. 'వర్మ' పదము వరుమ, వలుమ వెలుమ పదములుగాఁ గ్రమపరిణామము చెందియుండవచ్చును. 'నందాంతం క్షత్రియకులమ్' అన్న ప్రవాదముచొప్పున నెన్నఁడో క్షత్రియులు పలువురు చతుర్థ వర్ణమువారు గా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడదేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్లాలవారు నయిరి. అహనానూఱు అను నతిప్రాచీనద్రవిడగ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్య మొకటి కలదు.

"అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్"

వయలై వేలివియలూర్ - 97పాట్టు

పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలుగలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగలవాఁడునగు, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవృతి (చెంచ) గల వియలూరు అనుగ్రామము అనిపై నేదోయున్నది. వెళ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట.[2]

ఐక్ష్వాకులు మొదలగుక్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడదేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకులనాఁటి కథలు) యుండవచ్చును. తెలుఁగుదేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగుదేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడ దేశపు శివకవియగు సుందరి మూర్తినాయనారు నాఁటి కథ. అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంతభేదముతో నున్నది. వెల్మలనుగూర్చి చాటువు.

ఉ.

పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర

క్షాకరణంబు నొడ్లకపకారులుగా రెపు డప్పుగోరు మం
దాకినితోడబుట్టియు గుణప్రతిభన్ వెలుమల్ పురంబునన్.

కాళహస్తి, వెంకటగిరి, నూజివీడు, పిఠాపురము, బొబ్బిలి, మైలవరము, నరసారావుపేట, పెదపవని, కొల్లాపురము, తిరువూరు రేపల్లె, రాచూరు, ఉల్లిపాలెము, మొదలగు స్థలముల వెలుమవా రిప్పటికిని జమీందారులుగా నున్నారు. అందు మన కిప్పుడు ప్రసక్తులు, రేపల్లె, రాచూరు జమీందార్లగు మాణిక్యాలరావు వారు. వీరితొల్తటియింటిపేరు కృష్ణానేనివారు. వీరు పుణ్యపలిగోత్రమువారు. తొల్త వీరు తెలుంగాణమున (నైజాం రాష్ట్రమున) నుండిరి. ఇప్పటికిని వీరిబంధువులు, అనుమకొండ దగ్గఱ పెదపెండ్యాలలో ' పొట్లపల్లివారు' అనఁబరగుచున్నారట. వీరికి మాణిక్యారావు వారని బిరుదుపేరు కుతుబ్ షాహ యిచ్చినాఁడు. జైనులలో, మాణిక్యచంద. మాణిక్యసీన, మాణిక్యదేవాది నామములు మాణిక్య పదఘటితములు గలవు. తెలుఁగాణమున మాణిక్యప్రభువను యోగీంద్రుఁ డెప్పుడో" వెలసెనట. వారి శిష్యపరంపర నేఁడును తెలుఁగాణమునఁ గలదు. ఇది వారి పేర ఏర్పడిన బిరుదేమో! ఈ వెలమప్రభువు పూర్వుఁడో ఆమాణిక్యప్రభుయోగి పూర్వుఁడో నే నెఱుఁగను.

వీరి వంశవృక్ష మిట్టిది.

పద్మనాయఁకులు దెబ్బదియైదు గోత్రముల వారట. వారిలో కుతుబ్ షాహాకు ఆశ్రితుడు మాణిక్యారాయఁడు, అతఁడు కోవెలకొండ, మెదకు, పెదకొండపల్లి, కొండవీడు, దుర్గములఁ గాచినందుకు కుతుబ్ షహా, బిరుదు లిచ్చినాడు (చూ. 21 నుండి 29 పద్యముదాఁక, ప్రథమాశ్వాసము). ఆతని కుమారుఁడు కొండలరాయడు అబ్దుల్లా పాదుషా కాశ్రితుఁడై బిరుదులందెను. (చూ. 32 పద్యము) అతని మునిమనుమని కొడుకు అప్పభూపతి ఔరంగజేబునకు ఆశ్రితుఁ డయ్యెను (చూ. 32, 33 పద్యములు) తత్పుత్రుఁడు తిరుపతిరాయఁడు. ముర్తుజాన్నగరము పాలించెను. (చూ. 34 నుండి 40 దాఁక పద్యములు). ఈతని కాఱుగురు కొడుకులు. ఆఱవవాఁడగు సీతన్నమాణిక్యరావు (47 నుండి 50 దాఁక
పద్యములు) అతని రెండవ కొడుకు తిరుపతియే యేతత్కృతి ప్రేరకుఁడు. ఈతడు క్రీ. 1775 దాకనున్నవాఁడు. (చూ. 56 నుండి 72 దాఁక పద్యములు). వీరి వంశము కృష్ణా, గుంటూరు మండలములందు చిరకీర్తి నార్జించినది. దాతృత్వమునండును, శౌర్యమునందును నీవంశమువారు సుప్రఖ్యాతులు. ఈ వంశమున నేఁడు వర్థమానులుగా నున్న శ్రీ వెంకటహయగ్రీవరావుగారి తాతగారు వెంకటగోపాలరావుగారు, విలువిద్యలోను అశ్వారోహణకలలోను జితశ్రములని, చాల సౌందర్యవంతులని, సకలకలారసికులని వారిని బ్రత్యక్షముగా నెఱిఁగినవారు మా నాయనగారు చెప్పఁగా వింటిని. వారిని గూర్చి వింతకథలు, కృష్ణా గుంటూరుమండలవాసు లిప్పటికిని జెప్పుకొనుచుందురు. వారి ప్రధానగ్రామమగు రాచూరి దగ్గఱనే పల్లెకోన గ్రామమున భట్టురాజులు చదువగా నీ క్రిందిచాటుపద్యములు నీ వంశమువారి యోగ్యతను వెల్లడించువానిని నేను చాటుపద్యమణిమంజరిలోఁ బ్రకటించితిని.
సీ.

సుమమౌక్తికానల్పసుప్రతీకంబుతోఁ
                      గంబుతోఁ బుండరీకంబుతోడఁ
బల్లవకుసుమ సంపాదనైకాంతుతో
                      గంతుతో రోహిణీకాంతుతోడ
నధిగతపరమోగ్రుఁ డైన స్వర్భానుతో
                      ఖాను నలచిత్రభానుతోడతో
దండిగాండీవకోదండాభిరాముతో
                      రాముతో నందనారాముతోడ


గీ.

నీదుసత్కీర్తి నీమూర్తి నీప్రతాప
దీప్తి నీదోర్పలస్ఫూర్తి దీటు మిగిలి
యలరె మాణిక్యరాయవంశాబ్ధిసోమ
భాసురగుణాళి భావభూపాలమాళి.


సీ.

ఒక తాత కుతుబుశా ప్రకటదక్షిణభుజా
                      దండుఁడై కోవెలకొండ యేలె

నెలమి రెండవతాత యిభరాముపాదుశా
                      పంపునఁ బెదకొండపల్లె యేలె
మహి మంచు ముమ్మడిమాణిక్యరాయఁడు
                      వినుతి కెక్కి కొండవీటి నేలె
రాణించు రఘుపతి మాణిక్యరాయండు
                      పరభయంకరవృత్తిఁ బరిఢవిల్లెఁ


గీ.

దండ్రికంటెను బెదతండ్రి తండ్రికంటె
తాతముత్తాతలకు నెల్ల ఖ్యాతి దనర
వన్నెగంటి కృష్ణానేని వంశమునను
నిర్మలోపాయ బళిర మాణిక్యరాయ.


సీ.

దురములోఁ గదిసినదొరలశిరంబులు
                      భేదింప బలుదిట్ట నీదుపట్ట
కదనరంగమునందుఁ గదిసినపరరాజ
                      నిచయంబులను దాఁకు నీదుబాకు
జన్యసంతోషులై చనుదెంచువైరుల
                      నిముసంబులో మ్రింగు నీదు బాంగు
............................................
                      ..............................................


గీ.

సోరిది నీడాలు వై రులచుక్కవ్రాలు
బళిర నీపౌరుషం బెన్నఁ దరముగాదు
అవనిమాణిక్య రాజవంశాబ్ధిచంద్ర
రాజవేంకటగోపాలరాయభూప.


సీ.

శ్రీకరవిజయలక్ష్మీవిరాజితవైభ
                      వేంద్రుండు సద్గుణసాంద్రమూర్తి
మాణిక్యరాడ్వంశమందారభూజంబు
                      పద్మనాయజ మనఃపద్మహేళి

మన్నెకులోద్యాన మధుమాసపైకంబు
                      కామినీమన్మధాకారవేషు
నలిపుణ్యపతిగోత్ర వితతాబ్ధిచంద్రముం
                      డర్థిచాతక వార్షుకాంబుదంబు


గీ.

అని జనుల్ మెచ్చఁ గీర్తిచే నలరి తహహ
చరితదేశాంత సత్కవీశ్వరనితాంత
వర్ణితస్వాంత రేపల్లెపూర్నిశాంత
ధీపితాటోప! వేంకటగోపభూప.

వీ రనేకదేవాలయములకు భూముల నిచ్చిరి. బ్రాహ్మణులకు వసతులు గల్పించిరి.

మాణిక్యారావువారు కల్పించిన దేవబ్రాహ్మణవృత్తులు.

1. పెద్దపూడి :-

ఇది వకసంతు, కూచిపూడి సర్కారు. ముర్త్యుజానగరు తాలూకాలోనిది. ఇది ప్రస్తుతము వాసిరెడ్డివారికి పోయినది.

పూర్వము అరణ్యముగానున్న ఈ స్థలములో ఋషులు సోమేశ్వరస్వామిని, వీరు గోపాలస్వామిని ప్రతిష్టించిరి. 1056 శకంలో గజపతాన్వయులు, గణపతి మహారాజులుగారు పరిపాలించిరి. వీరికి ప్రధానులు గోపరాజురామన్న. గ్రామకరిణీకపు మిరాశీలు వీరు ఏర్పరచుచు, తెలగాణ్యులు, కౌశికగోత్రులై న పుచ్చరాజువారికి సగభాగంగా యిచ్చినారు. 1240 శకం లగాయతు రెడ్డిరాజులు ప్రభుత్వం చేసిరి. వీరికాలములో కొండవీటిసీమ 44 అగ్రహారములు బ్రాహ్మణులకు దానంచేసిరి. వేగినాటివారికి 3 అగ్రహారములు ద్రావిళ్లకు 5 వెలనాటివారికి 36. ఈ గ్రామము వెల్నాటివారిక్రిందకు వచ్చెను. ఈ గ్రామం యెల్లేపద్ది లక్ష్మణదీక్షితులుకు, షడ్దర్మనాల వల్లభసోమయాజులుకు దానం చేసిరి. పైజీర్ణదేవాయములను మరల ప్రతిష్టించి ఏర్పరచినవసతులు కుం 070 శ్రీ సోమేశ్వరస్వామివారికి. కుం 070 గోపాలస్వామివారికి. 1500 శకం వరకు చక్కగాజరిగెను. మహమ్మదీయుల పరిపాలనలో విచ్చిత్తు గలిగినది. కొండవీటిసమతుబందలు చేసేటప్పుడు, ఈ గ్రామం కూచిపూడి సమ తులో చేర్చిరి. అప్పటికి షడ్దర్శనాలవారు ఖిలమైపోగా తిమ్మరాజువారిపరం చేయబడినది. కొండవీటి సీమ వంతుచేసి జమీందార్లుకు పంచిపెట్టేటప్పుడు ఈవంతు ఈగ్రామం రమణయ్య మాణిక్యరావు వంతులో వచ్చి రేపల్లెతాలూకాలో దాఖలు అయినది. 1122 ఫసలీ మొదలు 1126 ఫసలీవరకు పరిపాలించిరి. తరువాత వీరి తమ్ములు వల్లన్నగారు వచ్చి ఈ గ్రామానికి పశ్చిమభాగమందు వనంతోట వేయుంచి శ్రీ వేణుగోపాలస్వామివారికి దానవ్యయం ఒకుకు 070కుభూమి యిచ్చినారు. ఈవల్లన్నగారు సీతన్నగారు గోపన్న గారు 1168 వ ఫసలీవరకు ప్రభుత్వం చేశేరు. 1169 ఫసలీలో సీతన్నగారి కుమారులు జంగన్న మాణిక్యరాయలంగారు చాలధర్మవంతులై రాజ్యము పరిపాలించుచు శ్రీసోమేశ్వరస్వామివారి ఆలయం పునః నిర్మించి కుం 070కు భూమి దానంచేసిరి. మరియు వీరు చేయించిన దానముల వివరం. అయితం వేదావధానులు, రాయప్రోలు సూరంబొట్లు. వట్టెం రామలింగ దీక్షితులు, పోతుకుచ్చి పాపంబొట్లు, నేతి తెలగావధానులు, బూరుగుల నిమ్మంబొట్లుగార్లకు ఒకొక్కరికి కుం 82 చొ॥ దానం చేసిరి. వీరు 1169 నుంచి 1201 ఫసలీవరకు. 33 సం॥ ప్రభుత్వంచేసిరి. 1202 లో వీరికుమారులు భావన్నగారు రాజ్యమునకువచ్చిరి. వీరు కూడ తండ్రివలే దానములు చేయుచూ రాజ్యం పరిపాలించి 1213 ఫసలీవరకు రాజ్యం చేసిరి. ఆర్థికదుస్ధితివల్ల 22 గ్రామాదులు వాసిరెడ్డివారికి అమ్ముటవల్ల పొన్నూరు వగైరాలతో కూడ ఈ గ్రామము వారికి పోయినది, కనుక సదరు 1213 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు పరిపాలించిరి. ఈ గ్రామమీకట్టు 36కుచ్చళ్ళలో వనంతోటలు 6టికు వల్లన్నగారుకు 070 యెల్లేపెద్ది సుబ్బన్న 170 ప్రబల పేరుభొట్లు 070 జాస్తే భావన్న 070 చదలవాడ పట్టాభిరాముడు యీచదలవాడ రామన్న చేరి ఒక 070 గ్రామం కవార 070 మాలపల్లి 070 చెర్వులు 3 టికి. యెల్లేపద్ది సుబ్బన్న చెర్వు 070 చడలవారమణప్ప చెర్వు070 కర్ర తిరుపతి 070 - 070 జయనిపాడు డొంకలు 070 చవుడుభూమి 070 యీ యినాములు 070 వెరశి 850 పోను మిగతాది గుడికట్టు.
(2) వల్లూరు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 20.

ఈగ్రామం 1122లో రమణయ్య మాణిక్యరాయలంగారు పరిపాలించిరి. 1160 వరకు రమణయ్యగారు వల్లన్నగారు సీతన్నగారు పరిపాలించిన తరువాత నిజాముల్ ములుకు పెద్ద కుమారుడైన నాసర జంగు దీనిని పరాసువారికి యిచ్చినారు. వారు 1160 నుండి 1168 వరకు ప్రభుత్వం చేసి అపజయులు కాగా సీతన్నమాణిక్యారాయణంగారి అన్న కుమారుడు గోపాలరావు మాణిక్యరాయణింగారు 1168లో ప్రభుత్వం చేసి సీతన్నగారి కుమారుడైన జంగన్నగారు 1167 ప్రభుత్వానికి వచ్చి 1178 ఫసలీలో మజుకూరి మిరాసదార్లు అయిన వల్లూరి వేంకటాచలం పర్వతాలు. శంకరప్ప, విస్సంరాజు, పునరుద్ధరించిన గణపేశ్వరస్వామి వీరభధ్రస్వామివార్ల ఆలయములు శ్రీ పూర్వమున్న చెన్నకేశ్వరస్వామివారి ఆలయము మ్లేచ్ఛలచే విచ్ఛిత్తుచేయబడినది కనుక తస్థానే శ్రీ వేంకటగోపాలస్వామివారిని ప్రతిష్టించి శ్రీ ఆంజనేయస్వామినికూడ ప్రతిష్టించిదిరి పై దేవాలయములు శ్రీవారు ఇచ్చిన వసతులు.

కు 1 శ్రీ గణపేశ్వరస్వామి, వీరభద్రస్వామి వార్లకు కు 1 శ్రీ వేణుగోపాలస్వామివార్లకు:

1177 ఫసలీతో కుంఫిణీవారు మృత్తుజానగరుకు ప్రభుత్వానికి వచ్చి 3 సం॥ పరిపాలించి తిరిగి జమీందార్ల పరం చేసినారు. వీర్లకుమాళ్లు భావయ్య మాణిక్యరావు 1202లో రాజ్యమునకువచ్చి వీరు పాలించుచుండిరి.

8. కట్టెంపూడి :—

గోపరాజురామన్నగారు ఈ గ్రామానికి తూములింగన్నగారికి యేకభోగముగా మిరాశీ వ్రాసియిచ్చినారు. ఈ తూములింగన్నగారు గ్రామమునకు దక్షిణభాగమందు కేశవస్వామివారి ఆలయమున్నూ ఉత్తరం శ్రీ మల్లికార్జున ఆలయం కట్టించి వీటికి 080 మాన్యం ఇప్పించిరి ఇదే ప్రకారం 1500 శకంవరకు జరిగెను తరువాత తురకల పరిపాలనలో ఇది విచ్చిత్తు అయినది. అప్పుడు పొన్నూరు సమతులో నిది. అప్పుడు మాణిక్యరావువారు పాతృనివారు అలవర్తివార్ల అధికారములోనికి వచ్చినది. తరువాత కొండవీటిసీమ 3 వంతులుగా చేయగా ఈ గ్రామం రమణయ్య మాణిక్యరావు వారికి అప్పచెప్పగా వారు ప్రభుత్వంచేసి 1127౧లో సీతన్న మాణిక్యరాయలంగారు ప్రభుత్వానికి వచ్చి అచ్చన్నగారికి కు 080 మాన్యం ఇప్పించినారు. వీరి అన్నదమ్ములు ఆరుగురు క్రమేణ ప్రభుత్వం చేసి గోపాలమాణిక్యరాయలంగారు 1168 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు సీతన్నగారి కుమారులు జంగన్నగారు ప్రభుత్వానికి వచ్చి 130 కుచ్చెళ్ల యీనాములు ఇప్పించిరి. 1201 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు భావయ్య మాణిక్యరాయలంగారు 1202లో రాజ్యంకు వచ్చి 1122 ఫసలీవరకు ప్రభుత్వం చేస్తూవున్నారు. గ్రామంగుడికట్టు కుచ్చళ్లు 1754

(4) పూండ్ల :— పొన్నూరు తాలూకాలోని రేపల్లెలోని రాజా భావయ్యమాణిక్యరావు సర్కారులోని 1222 ఫసలీ; 1201 నుంచి గ్రామం గుడికట్టు 122 కుచ్చళ్లు.

(5) ఇనగర్తిపాడు :—— పొన్నూరుసంతు రేపల్లె తాలూకా పైమాదిరిగా పరిపాలనలు జరిగెను. ఈ గ్రామం విష్ణువర్థనుడు పరిపాలనలో చెఱుకూరు త్రివిక్రమస్వామివారికి అగ్రహారం యిచ్చినారు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 13.

(6) నుదురుమాడు ఖండ్రిక :— ఈఖండ్రికలో 5 గ్రామాదు లున్నవి ఒకప్పుడు ఈ 5 గ్రామాదులలోని రుసుము మాణిక్యరావు వసూలు చేయుచుండిరి. (7) మండూరు :— కూచిపూడి సర్కారు ముర్తున్నజాగరు రాచూరు తాలూకే:

ఇక్కడ మాండవ్యమహాముని కొంతకాలం తపస్సు చేసిన చోటు. ఇక్కడ శివలింగం ప్రతిష్టించిరి. దీనికి మాండలేశ్వరస్యామి అని పేరు. దీనికి దక్షిణభాగమందు వేణుగోపాలస్వామివారిని ప్రతిష్టించిరి. ఇది అరణ్యము మునీశ్వరులే ఈ దేవాలయములను పూజించుచుండిరి.

1122లో కొండసీమ 14 వంత్లు చేసి పంచిపెట్టుటలో ఈగ్రామం బరభద్ర పాతృని అప్పన వంతు వచ్చెను. ఈయన 170 కుచ్చిళ్లు శ్రీస్వామివార్లకు యిచ్చి వుత్సవము యేర్పాటు చేసిరి. ఈయన తదనంతరం ఈయన కుమార్డు పాపన్న రాజ్యపాలన చేయుచుండగా మాణిక్యారావువారు బలవంతముగా ఆక్రమించి వొలివేరు యెడ్లపల్లి మండూరు చినగాదెలవఱ్ఱు అంగలకుదురు కొండపాడు వగైరాగ్రామాదులు పాతృనివారి మనోవర్తిక్రింద వుంచిరి.

1211లో రాచూరు తాలూక వేలం వేయబడుటవల్ల ఈగ్రామం మల్రాజు వెంకటగుండారాయునింగారు కొనిరి గ్రామంగుడికట్టుకు 60.

చినగాదెల వర్కు కూచిపూడి తాలూకా రాచూరు సర్కారు ఇదిమండూరుకు వాయవ్యమూల వున్న ఒక దిబ్బ, ఈప్రదేశ మందు మండూరు ప్రజలు చిన్న గాదెలు కట్టుకొని ధాన్యం నిలవ చేసుకొంటూ వచ్చి క్రమేణ రయితులు నివసించుట వల్ల చినగాగాదెలవఱ్ఱు గ్రామమయినది. ఇది బలభద్రపాతృనివారిది. రాచూరు మాణిక్యరావువారు జయించి బలభదృపాతృని వారికి మనోవర్తి క్రింద వుంచిన 45 గ్రామాదులలో యిది ఒకటి. మాణిక్యారావు జంగన్నరావు తిరుపతిరాయంగార్లు ఆయన అన్నదమ్ములు భాగం పంచుకొనుటలో ఇది తిరుపతిరాయణింగారి వంతు వచ్చినది. తిరుపతి రాయణింగారికి సంతానం లేకపోవుట చేత జంగన్నగారి కుమారుడైన భావన్నారాయణంగారు 1208 ఫసలో ప్రభుత్వమునకు వచ్చి 1211 లో రాచూరు తాలుకా కుంఫిణీవారిచేత వేలం వేయనా ఈ గ్రామం రాజమల్రాజు వెంకట గుండారాయణింగారి పరిపాలన లోనికి పోయినది. గ్రామంగుడికట్టు 25 కుచ్చెళ్లు.

జానంచుండూడు: ఇదిగుంటూరు వండురు తాలూకా: 1122 ఫసవీలో మూడు వంతులుగా భాగించి నప్పుడు ఇది రేపల్లేతాలూకాలో చేర్చబడి రమణయ్య మాణిక్యరావుగారి పరం చేయబడగా క్రమముగా మల్లన్న సీతన్న గోపన్న జంగన్న గార్లు 1182 ఫసలీవరకు ప్రభుత్వం చేసిన తరువాత అన్నదమ్ములైన జంగన్న తిరుపతిరాయనంగార్లు భాగం పంచుకొనుటలో తిరుపతి రాయనంగారి వంతు వచ్చుటవల్ల రాచూరు తాలూకాలో చేరినది. వీరికుమారులైన అప్పారాయనంగారు సీతన్న గార్లు 1208 వరకు పాలించి నిస్సంతువల్ల జంగన్నగారి కుమారులైన భావన్నగారు 3 సం॥ పరిపాలించిన తరువాత 1211 వేలంలో మల్రాజువారికి పోయెను. గుడి కట్టు కుచ్చళ్ల 40

(10) పొత్తూరు సంతుగుంటూరు సర్కారు రాచూరు తాలూకా:- ఉత్తరం సోమేశ్వరస్వామి తూర్పు వేణుగోపాలస్వాములను ప్రతిష్టించిరి. 1182లో పంచుకొనుటలో తిరుపతి రాయన్నాగారివంతులో వచ్చి రాచూరులో చేరినది. గుడి కట్టు 75 మిగతా విషయములు పైదానిమాదరి—

(11) గారపాడుసంతు గుంటూరు సర్కారు రామారు తాలుకా:- ఇది అగ్రహరంగాసాలు 1కి 5వరహాలు ఇచ్చులాగున రమణయ్య మాణిక్యారావువారు ఏర్పాటు చేసి తిరువుల కృష్ణసోమయాజులం గారికి యిచ్చిరి. 1182లో కృష్ణసౌమయాజులంగారు ఈ గ్రామం తూర్పున గంగాధరస్వామిని ప్రతిష్టించి కుం10 మాన్యంను దక్షిణభాగమందు శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్టించి కుం10 యిచ్చిరి మిగతది పై దానిమాదిరి. గ్రామం గుడికట్టి 83 పగ్గానికి 1 కి 64 కుంటలు ప్రాప్తి అయిన కుచ్చళ్లు 25

(12) సుద్దపల్లి :—— సంతుగుంటూరు సర్కార్ రాచూరు తాలూకా గ్రామాన ఐదు పశ్చిమమున కాశీ విశ్వేశ్వర స్వామిని మధ్యను వేణుగోపాలస్వామిని దంటు దేవరాయి దీక్షుతులు ప్రతిష్టించి కు2 దానం చేసి అగ్రహార మనుభవించుచుండిరి. ఇది పైవారికి కృష్ణదేవరాయలుచేత యివ్వబడిన అగ్రహారం: మిగతా కథ పైదానిమాదిరి గుడికట్టు, కు 75

కొండవీటికైఫీయతులో మాణిక్యారావువారికి ప్రసక్తమయిన గ్రంథభాగమిది:——ఉడయగిరి, అద్దంకి, వినుకొండ, బెల్లకొండ, నాగార్జునకొండ, తంగేడుకేతవరం మొదలైన దుర్గములు జయించి కొండవీడు వచ్చి అప్పుడు పరిపాలించుచున్న ప్రతాపరుద్రగజపతి కుమారుడు వీరభద్రగజపతిని జయించి అతనికి అభయమిచ్చెను. . . సింహాచలమువరకు సాధించెను, కటకం పర్యంతం జయించి గజపతివారి కుమార్తెను బలాత్కారముగా వివాహము చేసుకొనెను. సింహాచలం అవతలి దేశములు గజపతి వారికి వదలి కొండవీటికి సాళ్వతిమ్మరుసు మేనల్లుడు నాదెళ్ల గోపమంత్రికి పట్టం గట్టెను. నాదెళ్ల గోపమంత్రిగారు దేవాలయము కట్టించి పరిపాలించుచుండెను. రాయల భార్య కంభంలో ఉండిపోయి తన స్వంతద్రవ్యముతో కంభం చెరువు త్రవ్వించెను. దేవాలయము కట్టించినది, 1455 వరకు కృష్ణరాయలు రాజ్యం చేసెను. తరువాత అచ్యుతరాయలు 1456 నుంచి 1467 వరకు 8 సంవత్సరములు పరిపాలించెను. ఇతనికి ప్రధానియైన రామయభాస్కరునికి అధికార మిచ్చి కొండవీటికి పంపగా పూర్వము రెడ్డిరాజులు కట్టించిన సౌధములు గుళ్లు పడిపోవుటవల్ల ఆ రాళ్లు తెప్పించి యీ దుర్గానికి పశ్చిమభాగమందు మావులకోట గట్టించి పట్నం నిర్మించి గోపీనాథస్వామివారిని ప్రతిష్టించెను. ఇక్కడ ఒక బావి త్రవ్వించి తిరుగుబాటు చేసిన పాలెగాండ్లను నమ్మకముమీద పిలిపించి స్వామివారికి ప్రదక్షిణం చేయవలసినదని చెప్పి అదివరకు పూర్వమే తగిన ఏర్పాటు చేయబడిన ఆబావిలో వారిని కూలద్రోసి చంపెనని ప్రతీతి. ఈ పట్టణమునకు కొండవీటి గోపీనాథపురమని నామాంకితము చేసిరి. ఈ పురం దగ్గరగా వెన్నముద్ద కృష్ణుడు మూలస్థానేశ్వరుడు. అంగడివీరభద్రుడు మొదలయిన దేవస్థానములు నిర్మించెను. ఈయన సహోదరి చిన్నమాంబ ఈ పట్టణానికి మూడుఘడియల దూరాన రామచంద్రపురమనే అగ్రహారము కట్టించి పర్వతేశ్వరుడను ప్రతిష్టించి, గోపీనాథ అనే చెరువు త్రవ్వించి సాంతలూరు అనే అగ్రహారమును ధారాగ్రహితము చేసేను. ఇతను మొగలాయి పౌజును జయించి రాజ్యము నిర్వక్రముగా పరిపాలించెను. విజయనగరమందు సదాశివదేవమహారాయలు పరిపాలనము చేయుచుండి అత్రేయగోత్రులైన విఠలయ్య దేవమహారాజు గారిని ఈ దేశానికి పట్టం కట్టిరి. ఇతను కొండసింగయ్య అను దేవాలయమును ఈ దేవాలయమునకు ఉత్తరాన కొండపల్లి చెరువు పడమర వకతోట నిర్మించెను. ఇతను 1443 మొదలు 1470 వరకు 27 సం॥లు పాలించెను. విజయనగరంలో అప్పుడు పరిపాలించుచున్న రామరాజయ్యదేవమహారాయలను 1487లో తురకలు చంపి రాజ్యము స్వాధీనము చేసుకొని మల్కిరాయపాదుషావారు పరిపాలించుచూ ముర్త్యుజ అనే తురకను ఈదేశానికి పరిపాలనకు పంపిరి. అతను దేవాలయములు పడగొట్టి గోపీనాథపురమునకు ముర్తుజానగరమని పేరిడి రాజ్యము చేయుచుండగా శ్రీ వీరప్రతాపతిరుమలదేవరాయలు కృష్ణయావలనున్న మొగలులను జయించి సామ్రాజ్యానికి వచ్చి ఆనెగొంది తిరుమల దేవరాయల పుత్రులయిన శ్రీరంగరాజయ్యకు ఈ దేశానికి ప్రభుత్వం కట్టిరి. ఆయనే కృష్ణాతీరమందున్న మూరంపూడి అనే గ్రామమును గంగాధర రామేశ్వరస్వామివారికి దానం చేసిరి. ఇది 1474లో జరిగెను. అజరత్ విభురా పాదుశాహావారు కృష్ణా ఆవలిభాగం ప్రభుత్వం చేస్తూయుండిరి. కర్ణాటక పాదుషాహా శ్రీరంగరాయలను జయించి కృష్ణ దక్షిణదేశ మందున్న వినుకొండ మొదలైన సాధించవలెనని రాయరావు అనే బ్రాహ్మడికి సేన ఇచ్చి పంపగా ఆయన వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, మాచెర్లసీమ జయించి వెలమవారు పరిపాలించుచున్న నేలకోట కొబ్బెర్లతోట జయించి అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిల, దరశికంభం, కాకర్ల, తూపాడు, తంగేడు, గురజాల, కేతవరం, కోడెపూడి మొదలైన నేలకోటలను జయించి కొండవీటిని ముట్టడించగా రాయలవారి ముతాలీమతులై ? ముఠాధిపతులైన? వెలుగోటి తిమ్మన్న లోబడి రాయరావుకి అధీనుడైనాడు. 1502లో స్వాధీనపరచుకొని 1504వరకు పరిపాలించి గోల్కొండకు వెళ్లెను. గోల్కొండలో ఉన్న అజరత్ గారు ఇక్కడ మన పూర్వీకుడు ముర్తుజాచే గట్టపడిన పట్టణము బాగుగా కట్టించెను. వినుకొండ, బెల్లంకొండ మొదలయిన దుర్గముల వ్యవహారములుగూడ ఇక్కడ జరుగునట్లు యేర్పాటు చేసి దీనికి ముర్తుజానగరు సర్కారని పేరిడి కొండవీటి సీమనంతయు 14 సమతులు చేసినారు. పాలడ్లు, పులివఱ్ఱు, ప్రతిపాడు, సంతరావూరు, నూతక్కి, చీరాల, పాణం, మంగళగిరి, మునిగోరు, నాదెళ్ల, రావిపూడి, కూచిపూడి, గుంటూరు, తాడికొండ ఈ విధముగ 44 గ్రామాదులను 14 సమతులు చేసిరి.

కొండవీటి జిల్లాలో హుజూరునాయకుడు ఖిల్లాదారు హోదాలో యున్న మాణ్యిక్యారావు స్వదేశిముఖి అనిన్నీ, మాసూరు వారికి మజుందారనిన్నీ, పాత్రునివారికి దేశపాండ్యగిరిన్నీ సదరు సమతులను స్వాధీనపరచి నాదెళ్ల సమతుకు కమ్మవారిని నియమించి వారి పరంగా మామ్లియతు జరిగేటట్లుగా నిర్ణయించినారు. తరువాత మహమదు పాదుషాహి రాయలంగారు గోల్కొండను రాజ్యంచేయుచు బందిపోట్లను అడచుటకై అమీనుముల్కును కొండవీటికి బంపగా అతను బందిపోటును అణచి 1514లో ముల్లగూరి అగ్రహారమును పాడు చేసి తన పేర మల్కాచెర్వు, మల్కామాహాలు, మల్కాబావి కట్టించి ముల్లగూరిని యాబలూరి గ్రామంలో కల్పి అమీనుబాదా అను పేరు పెట్టి దుర్గం కట్టించిరి. ఒక బురుజు పేరు మల్కాబురుజని పేరు పెట్టి హిందువుల కట్టడముల పాడొనరించి 1512 నుంచి 1520 వరకు 7 సం॥ పరిపాలించెను. కాలమందు సిగిలిన్ ఖాను ఈ పురమువచ్చి మహమ్మదు కుదుబ్ షావారి ఈ పురమునకు దక్షిణమున పేట, పురము కట్టించెను. తరువాత అబ్దుల్లా సుల్తాను, అబ్దుల్లాహుస్సేను, తానీషా అలంగీరు, పాదుషాలు రాజ్యము చేసిరి. వారి దినములలో అధికారము చేసిన హమీళ్ళు చితాపఖానుడు 1521 నుంచి 1524వరకు, 1524నుంచి ఒక సం॥ అబినిసిద్ధి చివులు ఖానుడు 1524నుంచి 1527వరకు అప్పరస ఖానుడు ప్రభుత్వం చేసిరి. వీరి తర్వాత యల్లాస్ ఖానుడు గుంటుపల్లి ముత్తురాజయ్యలు పరిపాలించి. తరువాత 1574లో యల్లాస్ ఖానుడు అమీలు అయి పూర్వము రెడ్లరాజులు చిన్నకొండమీద కట్టించిన విఘ్నేశ్వరాలయమును పడగొట్టించి ఈ దేవాలయానికి దక్షిణంగా కొంచెం నైరృతి మూలగా యల్లాస్ ఖాను పేట కట్టించి, ఆవూరు గణేశపేట అనికూడ పిలుస్తూ వచ్చిరి. పిమ్మట కుటిఖానుడు అమీను పదవికి వచ్చి 1574నుంచి 1577వరకు మూడు సం॥ పరిపాలించెను. తరువాత జూపల్లె రంగారావుగారి కుమారుడు రంగపతిరావు రాజ్యమునకు వచ్చి ఈ పట్నానికి నైరృతిమూలగా నాదెండ్లకుపోయే మార్గంలో ఈ ఊరి పొలం కొంత తీసికొని అందులో దేవాలయం కట్టించి ఈపట్టణం లోనున్న శ్రీరంగనాయకస్వామివారిని జయవిజయలతో కూడ తెచ్చి ప్రతిష్టించి అక్కడ రంగపతి పేట కట్టించి సోల్ససమేతు శ్రీరంగనగరమని చుట్టు పొలిమేరిస్తంభములు వేయించి పై దుర్గానికి వాయవ్యమూలను మిరియాలచుట్టు? మీదను బురుజు కట్టించి మిరియాలబురుజు అని పేరు పెట్టించి 1538 నుండి 1540 వరకు మూడు సం॥ ప్రభుత్వం చేసెను. తానీశా, అలంగీరు వారి పరియంతం దుర్గములలో కిల్లేదార్లను ఉంచి హవేలీ గ్రామాలు వారి క్రింద ఉంచడమున్నూ, మిగతా సమతులు అమీళ్ల పరంగా ఉంచుతూ 1121 ఫసలీవరకు జరిగినది. ౧౧౨౨ ఫసలీలో నవాబు ముచరాజ ఖాను.....మృత్తుజానగరు మూడు...... విభాగించెను. అప్పుడు ఈ జిల్లా క్రింద 18 గ్రామాలు ఉంచి జమీందార్లకు సావరాలు ముడుతూ ఉండేటట్లుగా ఏర్పాటు చేసెను. తర్వాత ఆషబ్ షా నవాబు నిజాముల్ ముల్క్ బహద్దరుగారు సుభా అధ్యక్షులై జాజావాదుల్లా మొలతరము ఖానుడు బాలకృష్ణ మొదలయినవారికి అమీలు యిచ్చిరి. వారు వచ్చి అల్లకల్లోలముగా రాజ్యమును సరిచేసి దేశముఖి దేశ పాండ్యలవల్ల సుంకములు తీసికొంటు వచ్చినారు. తరువాత సాహెబు జావాగారు పరిపాలించిరి. తరువాత వీరి కుమారులు నజర్ జంగ్ ప్రభుత్వం వహించి 1160 ఫసలీలో పరాసువారి పరం చేసెను. తరువాత బసాలద్ జంగ్ దివాను అయిన రాజాబలవంతు ఇంద్రజిత్తు బహద్దరుగారికి ఖిల్లాదారు పని ఇచ్చి పంపగా వారు వచ్చి నల్గురు జమీందార్ల వ్యవహారం తానే చేసికొంటూ ఉండగా ముశ్చఫీలు ముశ్ నాభాముశే లాలి మొదలయిన పరాసువారు పెళ్లూరి రామయ్యగారిని మంత్రిగా యేర్చరచి వ్యవహరించిరి. ఆరవీటినుండి తద్దిఖానుడు మేస్తరుది వీలువచ్చి జమిందార్ల పరంగా వ్యవహరించిరి, ఇంతలో టిప్పుసుల్తాను తరపున గండికోటనుంచి మీరు సాహెబుగారు 6000 గుఱ్ఱాలతో వచ్చి దోపిడి జరిపెను. తరువాత గోలకొండనుంచి పంపబడ్డ సాహెబు వచ్చి జమిందార్ల నేర్పాటు చేసి గుంటూరు సుబా చేసి ఏడు సంవత్సరములు పరిపాలించిరి. 1177 పసలీలో... వారు వచ్చి 1177వరకు 3 సం॥ పరిపాలించిరి. 1200 ఫసలీలో ఈ తాలూక జమీందార్ల పరంచేసిరి. అప్పుడు యీ ఓంటుకు మానూరి నరసన్నకు ఒప్పగింపబడెను. ఆయన 1219 వరకు 20 సం॥ పాలించి వీరి తమ్ముని కుమారులు వెంకటకృష్ణునింగారు 1221వరకు పాలించెను.

(1) భీష్మకునినగరం కుండిననగరంపట్టున పోలయవేమారెడ్డి మరల పట్టణం కట్టించెను (2) దీనికి ఉత్తరం పుట్టకోట కట్టించిరి. (3) ఈగ్రామానికి ఉత్తరదార్వాజాకు పశ్చిమంగా శివాలయం పడిపోయినది. (4) ఈదేవాలయానికి తూర్పు లంకెలబావి ఉన్నది. (5) ఈ బావికి తూర్పున కైలాసరాయనికొండ ఉన్నది. 108 దేవాలయాలను రెడ్లు పూజించేవి మ్లేచ్ఛులు పాడుచేసిరి (6) ఈ స్థలానికి ఉత్తరం బార్ల ఆవీడు దేవాలయం దానికి క్రిందుగా బ్రహ్మగుండం కోనేరు ఉన్నది. (7) పట్నానికి ఆగ్నేయముగా వేంక టేశ్వరస్వామి - యీస్వామికి తూర్పు పుష్కరిణిఉన్నది. (8) ఈ స్వామికి ఆగ్నేయంగా కన్యకలబావి (9) ఈ పట్నానికి దక్షిణంగా గోపినాథస్వామి దేవాలయం ఈ ఆలయానికి పశ్చిమంగా రంగనాథస్వామివారిని గజపతివారు ప్రతిష్టించిరి. (11) నాగమయ్య దక్షిణముగా కో నేరు ఉన్నది. (12) ఈ కోనేరుకు దక్షిణంగా మాణిక్యారావువారి కోనేరుకలదు, పూర్వం కర్ణాటక ప్రభుత్వంలో యీ వెలుమవారు గోపీనాథపట్నం తురకలదని యిక్కడ రాజగృహములు కట్టించుకొని నివసించుతూ ఈ కోనేరు త్రవ్వించిరి. (18) ఈ కోనేటికి తూర్పుఁగా మాణిక్యారావు గుండాలని రెండుదద్దణాలున్నవి. పూర్వము యుద్ధాలలో మగవారు చనిపోతే స్త్రీలు సహగమనం చేసినారు యీగుండాలలో అని ప్రసిద్ధి. (14) ఈ గుండాలకు దక్షిణంగా రెడ్లు కట్టించిన పెద్దకోనేరు ఉన్నది. (15) ఈ కోనేటికి పశ్చిమమున గృహరాజ మేడదిబ్బ ఉన్నది. రెడ్లప్రభుత్వంలో కోమటి వేమారెడ్డిగారు శ్రీనాథుని ప్రభావంవల్ల నవులూరిపోతరాజు దేవాలయం వద్దనున్ను యేడుతాళ్లపొడుగు యేడుమోకులుతిరిగే లావును గల తుమ్మచెట్టును తెప్పించి ఒంటిస్తంభము మేడ కట్టించి ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారికి సింహాసనముగ ప్రతిష్టించిరి. ఈ మేడ శిఖరానను బొల్లిమోర వేంకటేశ్వరస్వామివారి దేవాలయమునకు మకరతోరణం కట్టించిరి. ఇక్కడకు వెంకటేశ్వరస్వామివారి కొండ తూర్పుగాఉండును. (16) ఈ కొండకుదగ్గర జద్దిగాల బావి దీనికి దగ్గరగా రెడ్డివారి చెరువుగలదు. (17) పెదదాసరాయ, చినదాసరాయ తోట లున్నవి. (18) ఈ గ్రామానికి దక్షిణంగా స్వయంభువు అయిన కొండ శింగరయ్య అనే నృసింహస్వామి బిలంలో ఉన్నాడు. (19) ఈ స్థలానికి ఉత్తరం తిరుమల లక్ష్మీనృసింహ ఆలయమున్నది. (20) గ్రామమున పశ్చిమం శ్రీరామేశ్వరస్వామివారి దేవాలయం ఉన్నది. (21) దీనికి దగ్గర రుక్మిణీ సత్యభామా సమేత గోపాలస్వామి దేవాలయం (22) దీనికి పశ్చిమంగా సీతాపతి అనేచెరువున్నది. (23) ఈ గ్రామానికి ఉత్తరం వీరభద్రస్వామివారు, (24) దీనికి ఉత్తరంగా రెడ్లు కట్టించిన దేవస్థానము లున్నవి. పెద్ద దర్వాజా ఉన్నది. (25) దీనికి ఉత్తరం పత్తేఖాను మశీదు ఉన్నది. (26) దీనికి ఉత్తరం .... అనే అత్తారు మశీదు ఉన్నది. (27) దీనికి ఉత్తరం పాడుబడ్డ మశీదు. (28) ఈ గ్రామాణికి పశ్చిమం పేట మహమ్మదాపురం. (39) దీనికి దక్షిణం నల్లమశీదు. (30) దీనికి పడమట గుమ్మల్ మశీదు. (31) దక్షిణ జామత్ కానా మశీదు. (32) చిన్న మశీదు (38) దక్షిణమున రెండుదర్వాజా లున్నవి. (34) దీనికి దక్షిణం కొండవీటి గోపీనాథస్వామి పట్టణం అనే మర్త్యుజానగరు. దీనికి ఉతరపువైపు కొండపల్లి దర్వాజా ఉన్నది. (35) దీనికి దక్షిణ గోపీనాథపట్నంలో నాదొడ్లదర్వాజాలు. (36) కుదుబ్ షాపేట. శ్రీవెన్ముద్ద కృష్ణస్వామి దేవాలయము గలదు. (37) కమాల్ దీన్ వారి మశీదు ఉన్నది.

గ్రంథార్థము

ఈ గ్రంథమునఁ బ్రధానముగా ధనుర్నిర్మాణము మొదల్కొని శరప్రయోగాంతముగాఁ గల ధనుశ్శాస్త్రవిషయయములు, అనుభవరూఢకములు ససిగా వివరింపఁబడినవి. కాని యీ గ్రంథమునకంటెఁ దునిరాజాగారు ప్రకటించిన ధనుశ్శాస్త్రము విపులమయినది. విషయవిశేషములు గలది. సంస్కృతధనుశ్శాస్త్రగ్రంథము లన్నింటను విషయసామ్య మున్నది. వాని ననుసరించియే యీ రెండు తెల్గుగ్రంథములు వెలసినవి. కాని యీయిర్వురుగూడ సంస్క్రతమూలగ్రంథముల బేర్కొనరైరి. ఈ యిర్వుర గురువులును సంస్కృతముననున్న యాయాశాస్త్రగ్రంథముల నెఱుఁగక తత్తద్విషయవిశేషములనే గురుసాంప్రదాయానుసారమున నేర్చుకొని వానిని వారి వారి వ్యవహారభాషలలో వ్రాసికొనియుందురు. ఈగ్రంథమున కృష్ణమాచార్యుఁడు “ఈలక్షణాలను కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు” అని కొన్ని పద్యాలు చేర్చిరి. అతడు కృష్ణమాచార్యునికంటెఁ దర్వాతివాడు.

నేను కృతిపేరకుని వంశము వారగు రాచూరి జమీందారుగారికి జాబులు వ్రాసి ముద్రణోపక్రమము తర్వాత నొకవ్రాఁతప్రతిని వారివల్ల బడసితిని. కాళహస్తి వ్రాఁతగ్రంథములలో నొకప్రతి తిరుపతి దేవస్థాన పుస్తకశాలకు లభించింది. ఈ రెంటి సహాయము లేకున్నచో నేతద్గ్రంథముద్రణ మీతీరుననేని నెఱవేఱకపోయెడిదే.

రాచూరు జమీందారు గారగు శ్రీ కృష్ణానేని హయగ్రీవరావుగారు వారివ్రాఁతప్రతి నొసగియు, తమవంశచరిత్రాది సాధనములను తమయుద్యోగి శ్రీ కోపల్లె రామకృష్ణరావుగారి ద్వారమున పంపియు, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తమదగ్గరనున్న ధనుశ్శాస్త్రగ్రంథముల నీపీఠికారచనకాలమున నొసగి, ప్రతిదినము ఉదయము వచ్చిన ప్రూపులను నాఁడే వానిని మద్రాసు పంపుటలో నాకు చిరంజీవి పంగనామముల బాలకృష్ణమూర్తి బి. ఓ. యల్ (ఆనర్సు) నా సహాయోగ్యోగి చాలదోడ్పడియు, విద్యాజన్మవంశములందు సంతానమగు చిరంజీవులు శ్రీనివాస, సచ్చిదానందులు; సుందరమూ ర్త్యానందమూర్తులు నన్ననువర్తించి యుపకరించిరి.

విరోధి మాఘపూర్ణిమ

వేటూరి ప్రభాకరశాస్త్రి

  1. దీనిని పనప్పాకం శ్రీనివాసాచార్యులుగారు 1894 లో ముద్రించిరి.
  2. తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్స్టిట్యూట్ లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్ప పిళ్ళగా రీవిషయము తెల్పిరి.