ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

—♦♦♦♦§§♦♦♦♦—


శ్రీతనయాకార, సితకీర్తిహార
చాతుర్యఘన, రామ,జానకీరమణ
కల్పవృక్షముభాతిఁ గవులకోరికలు
కల్పించుఘనదాత, గడఁకనాలింపు;
అక్కథకుఁడు శౌనకాది సన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె.

దుష్యంతచరిత్ర


అట్టి పూరుని వి(మలాన్వ )యంబునను
నెట్టన దుష్యంతనృపుఁ డుద్భవించె
గుబ్బలిపెకలించి గుబ్బలిమీఁద
గుబ్బున వైచును క్రొత్తలావునను;
గజములఁ జేపట్టి కడిమివాటించి,
భజన కాకసముపైఁ బాఱంగమీటు,
నలఘుసత్వంబున ననిలునకైన
జళుకుపుట్టించును జాతుర్యలీల;
బలభేది కొంతయుఁ బరిణామమెసగ
బలిమిమై రాక్షసబలముఁ గారించుఁ;
బగతురఁదెగటార్చి బహుళవిస్ఫూర్తి,
జగమెల్ల నేకశాసనముగా నేలి,
వరుస బ్రహ్మ క్షత్ర వైశ్య శూద్రులను
సరి నిజధర్మముల్ సలుపంగఁజేసె.
ఒనరినవేడ్కతో నొక్కనాఁడతఁడు
తనరాజచిహ్నలై తనరినయట్టి


తగఁ బుండరీక [1]భూదారభావములు
జగతి ఖడ్లిత్వంబు చామరత్వంబు
వనమృగంబులు దాల్చి వర్తించుటెట్టు'!
లని మృగంబులమీఁద నలిగెనో! యనఁగ
వేటలాడఁగఁబూని వెడలి, యారాజు
గాటమై సేనలు కదిసి సేవింప
వందిబృందంబు కైవారంబుసేయ,
నందంద మ్రోయంగ నఖిలవాద్యములు
ద్రిజగంబు వ్రేల్మిడి దిరిగిరానోపు
నిజజవాశ్వరథంబు నెమ్మితో నెక్కి
సకలసాధనములుఁ జనుదేర వెంట
నకలంకగతి నేఁగె నడవిలోపలకు.
శరభ వాహ వరాహ శార్దూల గవయ
రురు శల్య భల్లూక రోహిత వృషభ
కరివైరి వారణ ఖడ్గ గంధర్వ
హరిణాది మృగకోటి నవలీలఁగదిసి
చించియు, నొంచియుఁ, జెదలనేసియును,
ద్రుంచియు, దంచియుఁ, దూలనేసియును,
గెడపియు, నెడిపియు, గీటడంచియును,
బొడిచియు, నడఁచియుఁ, బోకక్రుమ్మియును,
నులిచియుఁ, బఱచియు, నొగులనేసియును,
బలువిడి నీరీతి బహుళమార్గముల
విలువిద్య యెంతయు వేడిమిచూపి,
కలమృగంబులనెల్ల గలగుండుపెట్టి,
పట్టినమృగకోటిఁ బట్టణంబునకుఁ
బెట్టిపుత్తెంచుచుఁ, బృథివీశుఁ డంతఁ,


జంద్రునిలోనున్న సారంగ మటకు
సాంద్ర[2]రయంబునఁ జనుదెంచె ననఁగ
శివునిచే వెలువడి చెలువంపుటిఱ్ఱి
యవలీల నచ్చోటి కరుదెంచెననఁగ
బంగారుకెంజాయ భాసిల్లుమేన
రంగైనయొకయిఱ్ఱి రాజిల్లఁ జూచి:
'చోరవర్తనము లీక్షోణి లేకుండ
నీరీతి నాజ్ఞ నేనేలుచునుండఁ
గాంతకన్నులకాంతిఁ గడఁగి [3]చోరించి
వింతగా నీయిఱ్ఱి విపినంబులోన
దాఁగియున్నదటంచు [4]ధాటితో డాసి
యేఁగి చంద్రుఁడుపట్ట నెసగెనో, యనఁగఁ (?)
జలమునడాసి, దుష్యంతభూవిభుఁడు
బలములచే దానిఁ బట్టింపఁబోయెఁ.
బోయిన, నాయిఱ్ఱి పొడవుగానెగసి,
వాయువేగంబున వలలెల్లదాటి
పఱవఁగఁ గనుఁగొనెఁ బార్థివోత్తముఁడు.
.........................................
అంతంతఁ బఱుచుచు, నిఖిలదిక్కులను
వింతగాఁ బలుమఱు వెఱచిచూచుచును,
గొరిసెచేఁ జెవిక్రింద గోఁకిదీటుచును,
ధరణీశు నలయించి దవ్వుగాఁజనియె
జనిన నారాజును జలమునఁ గొంద
ఱనుచరులును దాను హరిణంబువెంటఁ
బోవఁబోవ, మృగంబు పుణ్యాశ్రమంబు
వేవచ్చిచొచ్చిన, వీక్షించి మౌను


లడ్డంబుగావచ్చి యతని దీవించి
దొడ్డప్రియంబులు దోప నిట్లనిరి:
"చనదు చంపగ దీనిఁ; జాలు నీయలుక;
[5]యనఘాత్మ, యిదిమదీయాశ్రమమృగము.
ధూర్తులఁ దెగటార్పఁ దొడరు నీబలిమి
యార్తుల రక్షింప నందంబుగాదె!”
అనిన, వారలమాట లంగీకరించి
మనుజేశుఁ డిట్లను: “ మహితాత్ములార,
దవ్వులనే వేడ్క దనరంగఁజేయు
నెవ్వరియాశ్రమం బీపుణ్యభూమి? "
అనవుడు మౌనీంద్రు లతని కిట్లనిరి :
"వినుమయా రాజన్య, విఖ్యాతుఁ డగుచు
దేవదానవులకు ధృతిఁదండ్రి యగుచు
భావజ్ఞ కశ్యపబ్రహ్మసంయమికిఁ
దమ్ముఁడై, ఘనతపోధర్మాత్ముడైన
యమ్మహాత్ముడు కణ్వుఁ; డతనియాశ్రమము.'
అని చెప్ప, దుష్యంతుఁ డలరిచిత్తమున :
'మునిచంద్రు సేవించి, ముదమొప్ప నిందు
ఘనతపోమహిమలు గలయ నీక్షించి,
నను బుణ్యుఁజేయుదు ననువొప్ప'ననుచు
మనమునఁదలపోసి, మంత్రుల భటుల
నునిచి యచ్చోటికి నుర్వీశుఁ డేఁగె,
దారుక మాకంద దాడిమీ నారి
కేర కేసర నాగకేసర గ్రాహి
జంబీర శింశుపా జంబూ కదంబ
నింబ ప్రియక నీల నిచుల కుద్దాల


బంధూక నారంగ ఫలపూర పనస
సిందుర చామర శేలు ఖర్జూర
చందన ద్రాక్షానుస్యందనాశ్వత్థ (?)
కుంద వాసంతికా కురవక లికుచ
మల్లికానన నవమల్లికా ముఖ్య
వల్లరీతరువుల వారక యొప్పు
పువ్వులు ఫలములుఁ బూపలుఁ గలిగి
నివ్వటిల్లుచునుండ నెగడినదానిఁ,
దనియంగ మునులు సంధ్యలు వార్వ జలము
గొనిపోవుకపులచేఁ గొమరొప్పుదాని,
మునిపుత్త్రులకుఁ గందమూలాదు లెపుడుఁ
దనియంగఁ దమిఁబూని తద్దయువేడ్కఁ
దప్పక కొమ్ములం ద్రవ్విచ్చునట్టి
దుప్పుల నిఱ్ఱులఁ దొడరినదానిఁ,
జెలఁగి ధేనువులకుఁ జెలువంపుఁబూరి
చెలిమితో మేపెడు చిఱుతబెబ్బులులు
నెమలిబర్హముక్రింద నిద్రకెప్పుడును
నెమకివచ్చుచునున్న నిడుదపాములును,
మూషికశిశువుల మొగి మేఁతవెట్టి
పోషించుచున్నట్టి పోతుపిల్లులును,
వెండియుఁ దమలోన విరసంబుమాని
దండిగేహంబులఁ దనరు జంతువులు,
నెఱి నెండఁబోసిన నివ్వరివడ్లు
గఱగఱగామేసి కౌశలం బొప్ప
సకలశాస్త్రంబులఁ జదువుచునున్న
శుకశారికాతతి శోభిల్లుదాని,
హోమధూమమ్ముచే నొగిఁ గెంపుచెడిన
లేమావిననల వేల్లితమైనదాని,


జపమాలికలు దెచ్చి సంయమీంద్రులకు
గృపనిచ్చు చెంచుల గీల్కొన్నదాని,
వాదించి చదివెడువటువుల వివిధ
వేదఘోషంబుల విలసిల్లుదాని,
మునుకొని వివిధంవుమ్రుగ్గులుగూర్చు
మునికుమారికలచే మొనసినదాని,
నేరుమద్దులమీఁద నెంచుచునున్న
నారపుట్టముల నున్నతమైనదాని,
భోగంబులన్నియుఁ బో విడనాడి
యోగమార్గంబెల్ల నొప్పుగా దెలిసి
యొదవ శిష్యులకు బ్రహ్మోపదేశంబు
తుదిచేయు మౌనులఁ దొడరినదానిఁ,
బుణ్యఫలముల కెల్లభూమియై మిగుల
గణ్యధర్మంబుల ఘనమైనదానిఁ
ఘనతపోధనుఁడైన కణ్వమునీంద్రు
ననఘాశ్రమస్థాన మధికమోదమునఁ
గనుఁగొని, యాశ్చర్యకలితుఁడై నృపతి
మునుకొని యచ్చోటిమునులకందఱకు
బ్రణమిల్లి, వారిచే బహుమానమంది,
[6] గుణవంతుఁ డందలి కొత్తలన్నియును
బరికించి చూచుచు, భక్తి దీపింప
సరవిఁ గణ్వునిపర్ణశాల కేతెంచి,
నెమలి[7]బర్హముకంటె నెఱిఁగల్మి గలిగి
యమరినకొప్పున నమరినదానిఁ,
బదియాఱుగాఁ జంద్రు భంగమొందించు
వదనపద్మమ్మున వలనొప్పుదాని,


దొండపంటికి సిగ్గు దొడరంగఁ జేయు
దండికెంపులమోవిఁ దనరెడుదానిఁ,
జిలుకకోవెలలకుఁ జెలగువీణెలకుఁ
బలుకులఁ దలవంపు పాటించుదాని,
మరుఁడు జయంబంది మహిమఁబూరించు
కరశంఖగతి నొప్పు కంఠంబుదానిఁ,
గవజక్కవలఁ గవకవ నవ్వఁజాలు
సవరని చనుఁదోయి జానొప్పుదాని,
నిగురించులతలతో నెకసెక్కమాడు
జిగిబిగిగల మేని చెలువంబుదానిఁ,
గన్నియ లావణ్యగౌరవంబునను
వెన్నున విహరించు విపులంపువేణి
యుదరంబుపైఁ దోచెనోయనఁ జాలు
నొదవినరోమాళి నొప్పారుదానిఁ,
బఱపైన చనుఁదోయిభారంబువలన
సరిపేదమధ్యంబు జడియ, నానాభిఁ
బసిఁడిశలాకచే బంధించిరనఁగఁ
బస మూడువళులను భాసిల్లుదాని,
మరుని [8]జైత్రరథంబు మార్కొనఁజాలు
వరజఘనంబుల వాసైనదాని ,
ననఁటికంబంబుల నదలించుతొడల
నొనరినపిక్కల నొఱపైనదాని,
రాయంచగములతో ఱంతుగావించు
ప్రాయంపునడపులఁ బరఁగినదానిఁ
బటురీతిఁ జెలులతో భాషించుదానిఁ
గుటిలకుంతలను శకుంతల నతఁడు


పలుమాఱుచూచుచు , భావంబులోన
వలరాజుతూపులు వాటమైనాటఁ,
బదరి తద్గుణపాశబద్ధుఁడై, కదల
మెదలంగనేరక మిన్నకయుండె.
మనసు మానినిమీఁద మరగియుండంగ
నెనయంగఁ దన్ను దానెఱుఁగంగలేక,
తరుణిలావణ్యామృతంబుఁ గ్రోలంగ
సరి ననిమేషత సంధిల్లెననఁగఁ
గనురెప్పవెట్టక కడువిస్మయమున
దనమనంబున నిట్లు దలపోయఁదొడఁగెఁ :
“జెలువల నాబ్రహ్మ సృజియించుచోట
నలర ఘృణాక్షరన్యాయాన దీని
సృజియింపఁబోలు నీక్షితి; నట్లుగాక
యజునకు నీనేర్పు నందమౌనేని,
యింక నొక్కతెఁ గాంత నీయింతి[9]సవతుఁ
గొంగక మఱి యేల [10]గూర్పంగ లేఁడు!
శృంగారరసమెల్లఁ జెన్నారఁ గూర్చి
యంగజుఁ డిచ్చోట యంత్రించెఁగాక!
వితతవేదాభ్యాస వికలుఁడైనట్టి
చతురాననున కట్టిచతురత గలదె!
ఈయింతికౌగిలి యెవ్వానికబ్బె,
నాయుత్తమునకబ్బు నమరరాజ్యంబు,
పటురీతి సరిచేయ భావ్యంబుగాదు
కుటిలకుంతలుల నీకోమలాంగికిని.”
అని యిట్ లుతలపోయు నవనినాయకునిఁ
గనుఁగొని, మునిపుత్రి గారవంబునను


ఆతిథ్య మొనరించి, యాసీనుఁజేసి,
చేతులుమొగిచి యాక్షితినాధుకనియె:
ఓరాజ, నీవెందునుండివచ్చితివి ?
నీరాక యిందేల? నీకుఁ బేరేమి?"
అనినఁ,దొయ్యలిఁజూచి యవనీశుఁడనియె ;
“ విను, నేను దుష్యంతవిభుఁడసువాఁడ ;
వేటకై సేనతో వెడలి యేతెంచి,
గాటంపుభక్తితో గణ్వసంయమిని
సేవింపవచ్చితిఁ జెలువ, 'నేనిచటి;
కా విప్రవరుఁడున్నయచ్చోటు చెపుమ. "
అసుడు, శకుంతల యతనికిట్లనియె:
" మునినాథుఁ డింతటిమున్నుగాఁ గదలి
సమిధలు దర్భలు శాకముల్ పండ్లు
నమరంగఁ గొనితేర నడవికిఁజనియె;
మీరువచ్చుటవిన్న, మీఱిన వేడ్క,
వారక యేతెంచు వనములోవెడలి."
అనుటయు, రాజన్యుఁ డాయింతిఁజూచి
మనమున నిట్లను:మహనీయకన్య
మునిపుత్రి యెట్లయ్యె ! మోగి దీనిమీఁదఁ
గనుకూర్మి నాకెట్లు కడముట్టఁబుట్టెఁ !
గానివస్తువుమీఁదఁ గాంక్ష, డెందమున
నూనదెన్నఁడు మఱి యుచితంబు దక్కి!
దీనిజన్మవిధంబు తెలియక నాకు
నూనిన సందేహ ముడుగదెంతయును."
అని యిట్లుదలపోసి యబలకిట్లనియె:
“ వనజాక్షి , యడుగంగవలసె నిన్నొకటి;
[11]బ్రహ్మవిదుండన బ్రహ్మణ్యుఁడనఁగ
బ్రహ్మచారియనంగ బరఁగుఁ గణ్వుండు ;


అతనికి నీ వెట్టులాత్మజవైతి!
హితమతి నీక్రమం బెఱిఁగింపవలయు.”
అనిన, శకుంతల యారాజుకనియె:

శకుంతలాజన్మవృత్తాంతము



"విను, మేను విన్నట్టివిధము చెప్పెదను;
అనఘ, విశ్వామిత్రుఁడను రాజమౌని
మును దపంబుండంగఁ బురుహూతుఁడలిగి,
తనరాజ్య మాతండు తడవునన్ భీతి
మనముగా నంకిలిగావింపఁ దంచి,
మేనకయనుదాని మృగరాజమధ్య
మానుగా రావించి మన్నించి పలికె :
'ఓకాంత, వీ వేఁగి యుగ్రతపంబు
చేకొనిసేయు కౌశికమునీంద్రునకు
వివిధభావంబుల విఘ్నంబుచేసి
యువతి, యేతే;'మ్మన్న నువిద యిట్లనియె:
'ఓదేవ, నీమాట యొనఁ[12]గూర్పనోపఁ;
గాదు నాచే నింతకార్యంబుసేయఁ;
దగ దూడలోపునే దంటు మేయంగ!
మగువలతరమె యమ్మహితాత్ముగలఁప!
నెఱిఁగియుఁ బాఁతఱ నెవ్వఁడుగూలు!
వెఱతు నేఁ బోవ నావిమలాత్ముకడకు.'
అనిన నింద్రుఁడుపల్కె: 'నట్లేల! నీకు
ననువగునీకార్య; మతివ, భీతిలకు;
గాని కార్యములకుఁ గళ్యాణి, నిన్ను
బూనుదునే! వేడ్కఁబొ;' మ్మన్న నదియుఁ
గైకొని యేతెంచి, కౌశికునెదుటఁ
దూకొన్న మధులక్ష్మితోడుగా మెఱసి,


బహువిలాసంబులు బహుగీతతతులు
బహునాట్యకళలును బహుభంగిఁజూపఁ,
దలయెత్తి యటు చూచి, తప మెల్లమాని,
వలరాజునకుఁదక్కి, వలవంతఁజిక్కి,
మేనెల్లమఱచి, యమ్మేనకఁగూడి
మానైన మరుకేళి మదమొప్పఁజేయ
వనితపుట్టిన, దాని వసుధపై విడిచి
వనిత మేనక యేఁగె వాసవుపురికి.
కౌశికుండును, నంత ఘనతపంబునకుఁ
గౌశలంబుననేఁగె గర్వంబుదక్కి.
ఇట యేడ్చుచుండంగ నింత నా బాలఁ
జటులశకుంతాలి సంరక్ష సేయ,
నొకనాడు కుశనది కొగిఁగణ్వమౌని
యకలంకగతి నట కరుదెంచిచూచి,
కొనిపోయి యబ్బాలఁ గూఁతుగాఁ బెనిచి,
తన [13]చెలియలిచేత స్తన్యమిప్పించి,
రమణ శకుంతాలి రక్షించెఁగాన
నమర శకుంతలయనుపేరు పెట్టి,
పోషకుండును దండ్రి భువినగుననెడి
భాష గణ్వుఁడు నాకుఁ బస దండ్రియయ్యె.
నని నాదువృత్తాంత మాద్యులు చెప్ప
వినియుందు నీరీతి విశ్వంభరేంద్ర!”
అనిన, నాదుష్యంతుఁ డధికహర్షమున
మనసిజుండేఁప నమ్మగువకట్లనియె:
“వనిత, నిజంబెకావలయు నెంతయును;
మనుజ కాంతల కిట్టిమంజిమ గలదె!


మెఱయ నాకసముపై మెఱుఁగారుమెఱుఁగు
నెఱయంగఁ దోచునే నేలపై నందు!
నింక నొక్కటి నాకు ఇందీవరాక్షి
కొంకక సమకూర్ప గూడును నీకుఁ ;
గ్రుంకుగుబ్బలి పొడ్పుగుబ్బలి కడల
నంకితంబైనట్టి యవనిమండలికి
నాయకుండననొప్పునాకు నోతన్వి,
నాయికవగుము [14] మన్మథశాస్త్రవిధిని."
అనిన, శకుంతల యవనీశుఁబలికె :
మునిలేనిపిమ్మట ముదితాత్మ, నాకు
స్వాతంత్య్రమున నీకు సమకూరనగునె!
మాతండ్రిరానిమ్ము మఱి యగుఁగాక '.
అనవుడు రాజన్యుఁ డబలకిట్లనియె:
"వినుము, నీ కేటికి వెఱవంగ ముగ్ధ!
యెనయ వివాహంబు లెనిమిదియందు
మIనత క్షత్రియులకు గాంధర్వసరణి
యెఱుఁగ వధూవరులిద్దఱుఁదక్క
మఱి యన్యులెఱిఁగిన మతముగా; దదియు,
వసుధ గాంధర్వవివాహంబు మున్ను
వసుధేశకన్యకావరుల కబ్బినది ;
మీతండ్రివిన్నను మిగుల [15]మోదించు;
నేతెంతుగా." కvdన నింతి యిట్లనియె:
“ నా కుమారుని రాజ్యనాథునిఁ చేయ
నీకుఁగూడిన, నేను నీచెప్పినట్లు
చేసెదఁ; గాకున్న, జేయంగఁగూడ;
దీసమయము నాకు నీడేర్పఁగలవె!"


అనిన, దుష్యంతుండు నంగీకరించి
వనితకోరినలాగు వారకసలిపి,
మదనుండుమెచ్చంగ మగువతోగూడి
వదలనికూర్మి జవ్వనికి నిట్లనియె:
“పోయెద నోకాంత, పురమున కేను ;
నాయెడ నెయ్యంబు నాతి, మరువకుము.
పిలువఁబుత్తెంచెద బింబోష్ఠి, నిన్ను
నలరఁ దండ్రికిఁ జెప్పి యరుదెమ్ము నీవు."
అనుచు వీడ్కొనివచ్చి, యటసేనఁ గూడి
తనపురంబున కేఁగె ధారుణీ విభుఁడు.

భ ర తో త్ప త్తి


అట గణ్వమునియు, నయ్యడవిలోనుండి
పటురీతి సమిధలు ఫలములుఁ గొనుచుఁ
బర్ణశాలకువచ్చి, పరమహర్షమునం
బూర్ణచంద్రాననం బుత్రికఁజూచి,
సిగ్గును, వెఱవును, జిడిముడిపాటు,
నగ్గలియుఁ, గాంతి, యలస భావంబు,
గర్భచిహ్నము, మఱి గర్భస్థుఁడైన
యర్శకువిభవంబు [16] నంతయునపుడు
తనదివ్యదృష్టిచేఁ దప్పకదెలిసి,
మనముననలరి సమ్మతి నూరకుండె.
అంత, శకుంతల హర్షంపుదిథిని
గాంతిమంతుని బుత్త్రుఁ గనిన, నమ్మౌని
తడయక యేతెంచి, దౌహిత్రునకును
గడువేడ్కఁచేసి సంస్కారంబు లెల్ల :
[17]"సత్వాల బలిమిమై సమయించుఁగాన,
సత్వదమనుండగు శైశవంబునను;


బరఁగ నామీద భూభరణబు సెయ
భరతనామకుఁ డనఁ బ్రజలు వీఁ " డనుచు
నామధేమంబును నలువొప్ప బెట్టి,
ప్రేమతోఁ బెనువంగ, బెరిగి యాసుతుఁడు
సింగంపుఁగొదమల సిగపట్టితిగిచి,
భంగించి యావలఁబాఱంగఁ దోలు ;
నెలుగుపిల్లలఁ దెచ్చి యింటిబాలకుల
నలబూచిబూచని యాడించుచుండు,
నీరీతి మఱియు ననేకలీలలను
వారక నేయుచు వర్తింపుచుండె.

శకుంతలను హస్తినాపురికనుపుట



అంతఁ,గణ్వమునీంద్రుఁ డనుఁగుఁగూఁతునకుఁ
గాంతి రాచూలికిఁ గడు వేడ్కతోడ
దివ్యభూషణములు, దివ్యాంబరములు,
దివ్యగంధంబులు దీపింప నొసగి,
తనశిష్యగణములఁ దగఁ దోడుగూర్చి
యనఘుఁ డల్లునియూరికనిచిపుత్తెంచె.
ఆరీతి మునిపంప, నాశిష్యవరులు
దారకుతోఁగూడఁ దరుణిఁదోడ్కొనుచు
హస్తినాపురమునకరుదెంచి, యధిపు
శన్తంపుమొగసాలఁ జదురొప్పనిలిచి,
దౌవారికులచేతఁ దమరాకతెఱఁగు
భూవరునకుఁ జెప్పిపుత్తేర, నతఁడు
నతిభ క్తితో వారి నటకురావించి,
చతురతఁబూజించి సన్నుతిఁబలి :
" అనఘాత్ములార, మీరరుదెంచుకతన
ఘన తపో ధర్మాత్మ కలితుండనైతి.


మహితాత్ముడగు కణ్వమౌనిచంద్రునకు
బహుభంగిఁ దపములు పరఁగునె యెపుడు!
దేవ విప్రార్థమై ధృతిఁ గూడఁబోయు
నీవారధాన్యంబు నెలవుగాఁగలదె(వె)!
కందమూలంబులుఁ, గమ్మనిపండ్లు,
నందంద యతిథులకబ్బునే పెట్టఁ?
బరమేశుఁబూజింపఁ బత్రపుష్పములు
వరనదీజలములు వారకకలవె?
మఱియును దక్కినమహితకృత్యములు
[18]దరలక మౌనికిఁ దనరునె యచట!
ఆమహాత్మకుఁ డేమియానతియిచ్చె?
నేముగావించెద మిటు చెప్పవలయు. "
ననవుడు, మునిపుత్రు లతనికిట్లనిరి :
"ఘనుఁడ, కౌరవ వంశకర్తవు నీవు
ఇలయేలుచుండంగ నెల్లవస్తువులు
నిలయీనువిధమున నెసగునెల్లెడలఁ;
బ్రజలకందఱకును బరిణామమెపుడు;
నిజధర్మములుచెల్లు నిఖిలభూములను;
గావున, నెప్పుడు గణ్వసంయమికి
భావింప సుఖముతోఁ బ్రబలుఁదపంబు.
అమ్మౌనివాక్యంబు లాదటవినుము :
నెమ్మి నేలేనిచో నీవనంబునకు
నమరంగ వేటకై యరుదెంచి, నీవు
కొమరె నాకూఁతు శకుంతలాకన్య
గాంధర్వమునఁ బెండ్లికడఁకతో [19]నాడి
బాంధవంబుగఁజన్నపద్ధతిక్రమము
 


మనముననెఱిఁగి సమ్మతిచేసి, పిదపఁ
దనయుఁడెదిగినదాఁక దనయనిల్పితిమి;
[20] ఇంకీకుమారకు నిల్లాలి నీవు
గొంగక యొప్పుగాఁ గొను.' మనిచెప్పి
పుత్తెంచెమమ్ము నోభూపాల!" యనిన,
నత్తఱి వికలుఁడై యవనీశుఁడనియె:
ఈకన్య నెన్నఁడు నేఁబెండ్లియైతి!
నాకు నీబాలుఁ డెన్నటికుమారకుఁడు!
ఏ నేమియునెఱుంగ! నీభంగి నాకు
గానక కొడిమెలు గట్టంగఁదగునె!”
అనిన, వారలు రాజు కలుక నిట్లనిరి:
“మనుజేశ, యూరకే మఱపుగైకొంటి;
వేము చెప్పఁగనేల! యీ రహస్యములు;
శ్యామశకుంతల సర్వంబుఁదెలుపు”.
ననిన శకుంతల యవనీశుఁబలికె :
"వినుతాత్మ, మఱచితే విజ్ఞానివయ్యు
మున్ను దపోవనంబున వేడ్క నన్నుఁ
గ్రన్ననఁ గామార్థిం గడముట్టఁగూడి,
రాజ్యానుభవమున రాజిల్లి యిపుడు
పూజ్యుండవై యుండి బొంకంగఁదగునె!
ధర్మంబులన్నియుఁ దగఁజేయుకంటెఁ
గర్మోక్తమున నొక్క క్రతువు మేలండ్రు;
ఆక్రతువులు నూఱు నటు సేయుకంటెఁ
సుక్రమస్తుతుఁడగు సుతుఁడు మేలండ్రు;
ఆసుతశతకంబు నందుటకంటె
వాసిగా నొకసత్యవచనంబు మేలు;


సకలధర్మంబులు సరవితో వ్రాసి
యొకవంక నిడి, సత్య మొకవంకఁ బెట్టి
త్రాసునఁ దూఁచిన, ధర్మంబుకంటె
వాసియయ్యెను సత్యవచనంబుతొల్లి
కావున, సత్యంబు గడచిపోనాడు
భూవిభుగావించుపుణ్యంబులెల్ల
నొనర బూడిదలోనిహోమంబుగాదె!
మనుజేశ, కల్లలు మానుము నీవు”.
అనిన, మానినిఁజూచి యవనీశుడనియె:
"వినరాని మాటలు వెలఁది, యాడెదవు;
నలి నసత్యముగాఁగ నామాటలెల్ల,
వెలఁది, నీమాటలు వేదంబొ చెపుమ!
మటుమాయప్రోగులు, మదనమోహినులు,
నటమటంబులఠావు, లనృతభాషిణులు,
కన్నుండఁ గనుపాపఁ గడఁకతోఁదివియు
కన్నగాండ్రులుగారె ! కాంతలన్వారు.
సత్యంబులెల్ల నసత్యంబు సేయ,
నిత్యమనిత్యంబు నిజముగాఁ జేయ
నేరుపు సంధిల్లు నెలఁతల కెల్ల;
సారెకు నీమాట చాలించి యరుగు".
మనిన, శోకంబుతో నతివయిట్లనియె:
"వనములోపలనుండు వనితాజనంబు
పలుకుల సత్యంబు పాటిగాదయ్యెఁ!
గలకాలమును శత్త్రుగణములఁజెఱుచు
కుచ్చితంబులునేర్చు కువలయాధిపులు
నచ్చుగా సత్యంబులాడెడువారె!
నామోముచూడుఁడి నలినలియయ్యె!
నేమింక నేమననేర్తుము నిన్ను


దనయునకైనను దండ్రిముందటను
ఘనయౌవరాజ్యంబు గానలేదయ్యె!"
నని యిట్లు పలుకుచు నధిపుదూఱుచును,
మనమునశోకించి మఱియు నిట్లనియె:
"అనలుండు, చంద్రుండు, నంభోజసఖుఁడు,
ననిలుండు, భూమియు, నాకసం, బాత్మ,
యుదకంబు, జముఁడును, నుభయసంధ్యలును
మదిఁజూతు రెప్పుడు మనుజులనెల్ల;
గావున, నీరాజుకల్ల నిజంబు
దేవతాతతులార, దృష్టింపుఁ డీరు."
అని పలుమాఱు నయ్యతివ శోకింప,
వనితకై యాకాశవాణియిట్లనియె:
"ఓరాజ! వినుమ, యీయువతి నీభార్య;
శూరుఁ డీబాలుండు సూనుండునీకు;
గాంధర్వ[21]విధమునఁ గానలో నీవు
సంధించితివి దీని; సత్య మీమాట.
సందియం బేటికి! సతియైన దీని,
నందనుఁ గైకొమ్ము నరనాథ, మేలు".
అనిన సంతోషించి [22]రఖిలసభ్యులును;
జననాథుఁడును హర్ష[23]సంభృతుఁ డగుచు
మౌని [24]సామంతుల మంత్రులఁ బలికె :
"నేనెఱింగియు నింతి నింతసేయుటలు,
వనములో నొంటిమై వర్తించునట్టి
ఘనకృత్య మిందఱుఁ గలయంగఁ దెలియ
వలసి; యింతియె కాని, [25]వరుస నీసాధ్వి
కులకాంతయగు; వీఁడు కొడుకును నగును."


అనుచుఁ బార్థివచంద్రుఁ డాశకుంతలను
'జనుము లోనికి' నని శాసించి పలికి,
పులకలు మే నెల్లఁ బొదలి భూషింప
నలఘుశౌర్యునిఁ బుత్త్రు నందంద యెత్తి,
బిగియఁ గౌఁగిటఁజేర్చి, ప్రియమొప్పఁ దొడలఁ
దగవొప్ప నిడుకొని, ధారుణీవిభుఁడు
ఆకణ్వశిష్యుల కతిభక్తితోడఁ
బ్రాకటంబుగ నిచ్చి బహువస్తుతతులు,
మునినాథునకు లేఖ ముదమొప్పఁబెట్టి
యనిచిన, దీవించి యరిగి రమ్మునులు,
అంతట, దుష్యంతుఁ డఖిలరాజ్యంబు
వింతలాగున నేలి విఖ్యాతివడసి,
యాశకుంతలఁ గూడి యఖిలసౌఖ్యంబు
లాశయ్య బహుకాల మలర భోగించి,
క్రతువులు బహురీతిఁ గ్రమమొప్పఁజేసి,
చతురత యోగవిచారుఁడై, పిదపఁ
దనప్రధానులనెల్లఁ దాల్మి రావించి,
తనయుఁ బట్టముగట్టి తగ నొప్పగించి,
మునివృత్తి గైకొని ముదిమి నారాజు
ఘనతపంబునఁ బుణ్యగతులఁ బ్రాపించె.
ధరఁ గులకర్తయై తనరినయట్టి
భరతుండు ధర్మసుభరితుఁ డావెనుక
భూలోకమంతయు భుజశక్తి నేలి,
చాలవేడుకఁ జేసె జన్నముల్ పెక్కు.
సారత నతనిచేఁ జంద్రవంశంబు
భారతవంశమై పరఁగె నెంతయును.
జగతి దుష్యంతునిచరితంబు విన్నఁ,
దగవొప్పఁ జదివినఁ దనరుఁ బుణ్యములు.


అంత నాకులకర్త హస్తిపురభర్త
వింతగా భరతుండు విభుఁడైనవెనుక ,
వెండియు నృపతులు వివిధప్రతాప
[26]ఖండితవైరులై కడునేల భూమి,
శంతనుండను రాజు జనియించి వేడ్క
నెంతయు నేలుచు నెఱవైభవమున,
నీతిసహాయుఁడై [27] నిఖిలభూపతుల
చేతఁ గప్పంబులు చెలువొప్పఁ గొనుచు
వారణ మదవారి వర్షాగమంబు
వారక యేప్రొద్దు వాకిటఁ గలిగి,
కైలాస హిమశైల గంధశైలముల
వాలినతనకీర్తి వన్నియవ్రాయ,
సతులతోఁ బతులయాచ్నావృత్తిదక్క
నితరయాచ్నావృత్తి యిలమీఁద లేక,
పేరిన సురల దుర్భిక్షదోషంబు
వారక క్రతువులవలన మాన్చుచును
ఉర్వియేలుచునుండి, యొక్కనాఁ డతఁడు
సర్వసేనాఢ్యుడై జాహ్నవికడకు
వేఁటలాడఁగబోయి విపినంబుచొచ్చి,
మీటుగల్గిన యుగ్రమృగములఁ జంపి,
శాంతి నెంతయుఁ దూలి, సహకార వకుళ
హింతాల వనరాజి నెనగుజాహ్నవికి
నరుదెంచి, మధురంబులైనతోయములు
గరగలఁదెప్పించి కమ్మగాగ్రోలి,
పూచినగురువింద పొదరిండ్లనీడ
రాచిల్కపల్కుల రసికుఁడైవినుచుఁ,


గలయఁ దమ్ములసోఁకి కడలులఁ బ్రాకి
ఫలవృక్షములఁదాఁకి పైగాడ్పువొలయ,
నేకతంబుగ సేన యెడగల్గ నిలిపి,
సైకతంబుననున్న సమయంబునందుఁ,

వసువులు గంగతో మొఱవెట్టుట


గామినీవేషంబుగైకొని గంగ
భూమీశుఁగవయంగఁ బూనిపోవంగ,
వసువులడ్డమువచ్చి వరుసతోమ్రొక్కి ,
యసమానదైన్యులై యాగంగకనిరి :
"ఎందుఁబోయెదు గంగ! [28]హితమలరంగఁ
బొందఁబోయెడులాగొ భూపాలతిలకు!
ఈతనిసంబంధ మెఱుఁగుదుమింత,
నీతఁడు మునుమేన నిక్ష్వాకుకులుఁడు;
భీమశార్యుఁడు మహాభీషుఁడను రాజు;
భూమియేలుచు యాగములు పెక్కు చేసి
దేహాంత్యమున బ్రహ్మదేవుని [29]సభ క
నాహతనిజపుణ్యుఁడై పోయి మరలి,
పెరసినతనయిచ్చఁ బెక్కు కాలములు
సురలోకవిభుకొల్వు చొచ్చియుండఁగను,
దేవి, నీవొకదివ్యదేహంబు దాల్చి
యావాసవుని గొల్వ నరుదెంచునపుడు,
[30]నివిడినగాడ్పున నీచీరదొలఁగ,
ధవళాక్షి, మును లెల్లఁ దలవంచుటయును,
అంబరంబు ధరించునాలోన నిన్ను
నంబుజానన, కాంక్ష నాతండు చూచెఁ;


జూచిన, నింద్రుండు క్షోణీశుఁ గినిసి
'భూచక్రమునఁ బోయిపుట్టు నీ' వనుచు
శాపించుటయు, నొండుజనులకుఁ బుట్ట
నోపక యారాజు యుక్తమార్గమున
ననుపమకులదీపుఁడగు ప్రతీపునకు
జనియించె ధర నిట్లు శంతనుండనఁగ.
శృంగారరసమెల్ల క్షితినితండైన
నంగజునకుఁ బుట్ట ననువు లే దబల!
ఎన్నఁగా నాఁడు నీ వీరాజుమీఁదఁ
గన్ను వేసితి; గానఁ, గడు వేడ్క పుట్టి
కాంతవై నీవిదే కవయఁబోయెదవు.
వింతవారముగాము వినుము మాకథయు;
నేడులోకంబుల నెదురెందులేక
వేడుక విహరించి, వెసలోకమునకుఁ
బొసఁగ భార్యలు మేముఁ బోవుచుండంగఁ,
బసఁగ మే మేఁగునప్పథమధ్యమునకుఁ
జేరువనున్న వశిష్ఠాశ్రమమునఁ
గోరి సుఖింపంగఁ, గొంతసేపునకు
నందఱమును డిగ్గ, నచ్చోటనుండె
నందిని యనునావు నయన రమ్యాంగి;
ఎట్టికోరిక లెవ్వ రిచ్చలోఁ దలఁచి
రట్టికోరికలిచ్చు నంతటిసొమ్ము.
[31]మేయఁబోవఁగ దాని మేనిరోమముల
చాయకు వెఱఁగంది సంప్రీతి నపుడు
ఆర్యాణియనునది యష్టమవసువు
భార్య యాధేనువుఁ బట్టి తెమ్మనుచు
మగనిఁ బ్రార్థించిన, మానినిమాట
తగదనమైతిమి; తప్పుచేసితిమి.


పడతి [32] యిట్లనుపఁగఁ, ద్వర వాఁడుపోయి
యొడిసి వశిష్ఠుని హోమధేనువును
బట్టి తెచ్చిన, నేముఁ బదిలమైగదలి
నెట్టనవచ్చుచో, నిజబుద్ధినెఱిఁగి
మనుజులై పొం' డని మాకు వసిష్ఠుఁ
డెనమండ్రకును శాపమిచ్చె; నిచ్చుటయు,
నందిని విడిపించి నయమొప్పుఁగదలి
యందఱమునువచ్చి యతనికిమ్రొక్కి,
చేతులుమొగిచి: "మాచేసినతప్పు
బ్రాఁతియా! మునినాథ, పసలేదుగదవె!
ఈలీలఁ దప్పుగా నేలగైకొంటి!
భూలోకమున నేము పుట్టనోడుదుము;
చచ్చుచుఁ, బుట్టుచు, సకలరోగముల
వెచ్చుచు, వ్యాధితో విహరింపఁగలమె!
మొదల బాల్యంబున, ముదిమి నంత్యమునఁ,
బొదలుయౌవనమున పొక్కంగఁగలమె!
పత్తెంబుమ్రింగుచుఁ, బవలునురేలు
విత్తంబు దలంచుచు విహరింపఁగలమె!
సర్వజ్ఞ, యార్పవే! శాపాగ్ని;" యనిన,
నౌర్వశేయుఁడు మాకు నభయంబులిచ్చి :
'కథలేల! మీలోనఁ గడపటివాఁడు
పృథివి నుండెడుఁగాక పెద్దకాలంబు;
మట్టపునియతితో మానుషయోనిఁ
బుట్టుచు, మరణంబుఁ బొందుఁ డేడ్వురును;
సంతానశూన్యుఁడై సకలభోగముల
పొంతఁబోవనిపుట్టు పుట్టెడు నితఁడు'


అని వశిష్ఠుఁడు మమ్ము ననుపుటఁ జేసి
జయింపవలసె నీజగతిలోపలను.
నీయందు మునిఁగిన, నెఱయఁజేరినను,
బాయంగనగు సర్వసాపంబులండ్రు;
ఒక్క నిఁ దనయుఁగా నుండని ”. మ్మనుచు
మ్రొక్కి యావసువు లమ్ముదితకిట్లనిరి:
"ఇలదీర్ఘజీవిగా, నేము మాలోనఁ
బొలఁతి, చతుర్థాంశములు పుచ్చి నచ్చి
కలసియిత్తుము పుత్త్రుఁగా నీకు; నతఁడు
నిలిచివర్థిల్లెఁడు నృపుఁడు మోదింప”.

గంగాశంతనుల సమయము

అనిన నట్టిదకాకయని వారినెల్ల
ననిచి, భాగీరథి యటవచ్చివచ్చి
వసుధీశునెమ్మేను, వక్షస్‌స్థలంబుఁ,
బసనిదీప్తులు, ముఖపం కేరుహంబు,
నాజానుబాహులు, నసమానరుచియు,
రాజీవ రుచిర నేత్రంబులుఁ జూచి,
యీశానుతలకెక్కి యేలినగంగ
యాశంతనునిమూర్తి కాత్మలో మెచ్చి,
గరువంబునేరక కదిసిపోలేక
సురిగిరానేరక సుడిపడియున్నఁ,
బతియును దానిసౌభాగ్యసంపదకు
మతిలోనఁజొక్కి., మన్మథునకుఁజిక్కి :
“దైవకన్యకయొ ! గంధర్వకన్యకయొ!
యీవచ్చుకన్య దేవేంద్రకన్యకయొ !
వరకన్యకయొ ! కాక, వసుమతినంత
నరకన్యకకు నిట్టినయరూపు గలదె!


కలికిమీనంబులో ! కన్నులో ! యెఱుఁగ;
నలరినపవడమో ! యధరమో ! యెఱుఁగఁ,
గ్రమ మొప్పఁగంబువో ! కంఠ మో ! యెఱుఁగఁ ;
గమలమృణాళమో! కరములో ! యెఱుఁగఁ ;
జక్రవాకంబులో ! చన్నులో ! యెఱుగఁ;
జక్ర మో! పులిన మో ! జఘనమో ! యెఱుఁగ ;
[33]గరిమకూర్మములొ ! మీఁగాళ్లొ ! యెఱుంగ ;
నరుణపంకజములో ! యడుగులో  ! యెఱుఁగ;
నేరూప మెఱుఁగ లే; నిట్టిసౌభాగ్య
మీరూపు నిర్మింప [34]నేరఁడుబ్రహ్మ
ఒక మాఱు కౌఁగిలి యువిదయిచ్చుటయు,
సకలంబువెలగాదు జగతీతలంబు.
ఈచోట నొంటిగా నెవ్వారికెదురు
చూచుచువచ్చెనో శుక వాణి ముగ్ధ !
అమ్ములగతినాటె నతివ [35]చూపులును
[36]నమ్మఁజాలనిరీతి నాశరీరమున.
నడిగిచూచెదఁగాక యబలవృత్తాంత ;
మడుగంగ మఱుమాట లాడకుండెడినొ!
కదిసి చూచెదఁగాక కమలాయతాక్షి;
గదియఁగా నెక్కడ కదలిపోయెడినొ!”
అని యిట్లుదలపోయు నధిపతిఁ జూచి,
వనజాక్షి యారాజువామాంక మెక్కె ;
ఎక్కినఁ, బులకలు నిరువురమేన
నొక్కట నెసగుట యుపమింపనొప్పె
[37]గీష్పతి పదమగల్గినచోటెఱింగి
పుష్పాస్త్రునకు నారు పోసినాఁడనఁగ.


అప్పుడు నరనాథుఁ డాత్మలో 'నబల
చెప్పినయట్లెల్లఁ జేయుదు' ననుచుఁ
దలఁచుచున్నతనికిఁ దరుణి యిట్లనియె:
"నెలకొని చేసెద నీకుఁగాపురము ;
ఏ నేమిచేసిన నీవు గాదనక
యూనినమతి నూరకుండనోపుదువె!
ఉండక యెన్నఁడే నుల్లంబునొవ్వ
మండలేశ్వర, నన్ను మఱచి యాడినను,
అప్పుడు నినుడించి యరిగెదఁజువ్వె !
చెప్పితి, నట్లైనఁజేపట్టు, " మనిన
నొడఁబడి, శంతనుం డువిదకచ్చోటఁ
గడురమ్యముగ నిండ్లు గట్టించి, యందు
సురతానుభవమున సురరాజు పోలె
సురనదిఁ గూడి భాసురసౌఖ్య మందె.
అత్తఱి, వరుణేంద్రులాదిగా వసువు
లెత్తిన క్రమముతో నింతికిఁ బతికి
జనియింప జనియింప, జాహ్నవి వారి
మనుజేశ్వరుఁడుచూడ మదిఁగొంకులేక
గొనిపోయి గంగలోఁ గూయికూయనఁగ
మునిచి, తీర్థములాడి ముద మొప్పవచ్చు.
ఇట్టుముంచి వధింప [38]నెవ్వగదాఁక,
నెట్టనఁజూచి యానృపచక్రవర్తి
యాలికడ్డముచెప్పనన్నాఁడు గాన
లోలోన వగలఁగాలుచు నోర్చియోర్చి,
యనల తేజుని నంత నష్టమవుత్త్రుఁ
గొనిపోవఁ, బోనీక గోపించిపలికె


ౘఱ్ఱన రేఁగి యాజాహ్నవిఁ జూచి :
“వెఱ్ఱిదానవుగాక వెలఁది, నీకడుపు
చుఱ్ఱనకున్నది చోద్యంబు చూడ !
వఱ్ఱువచ్చిన నట్లు వలచితి గాక,
కొఱ్ఱుమ్రింగినయట్లు కొంత గై కొంటి
నఱ్ఱుత్రొక్కిన నడ్డ మాడరాదనుచు.
జుఱ్ఱఁజూచితి నీవు సోమకులంబు !
మఱ్ఱినుండెడు భూతమాతవు గాక,
కఱ్ఱువట్టిద (?) నీవు కాంతవుగావు.
ఒఱ్ఱెలాగునను ని న్నొకమాట యన్న,
జఱ్ఱన [39]జూఱెదు సంసార మెల్ల.
విఱ్ఱవీగక నీవు విడిచిన, మాకు
జెఱ్ఱికి నొకకాలు చెడినట్లు [40]సకియ !
తిఱ్ఱిఁబోసిననీళ్లు తెఱవ, నీబ్రదుకు ;
గొఱ్ఱెదూడలఁ జేస్తి కొడుకులనెల్ల.
ఉఱ్ఱూఁతలూఁగు నీయురుకుచద్వయము
ముఱ్ఱుపా లేబిడ్డ మూతిఁ బట్టితివి !
కుఱ్ఱలవంటి నాకొడుకుల మ్రింగి,
గఱ్ఱనఁ ద్రేంచెను గంగలో మీలు!
అఱ్ఱాడి మ్రింగిన నట మ్రింగనిమ్ము,
తఱ్ఱ, [41]యెత్తెద వాని దయమాటలాడి.
మిఱ్ఱుగాదే యెల్లి మిన్నేరు ! పూడ్చి,
కొఱ్ఱవిత్తించెదఁ గోపంబు మాన ;
ఈకుమారకు జముకీకు మాఱకము;
నీకు మాఱాడితి నేఁ"; డన్న నవ్వి:
“వీటికి నామీఁద నింతకోపంబు!
వాటంపునెయ్యంబు వలదన్న మాని,


చాలించి పోయెద జాహ్నవి నేను ;
బాలు నేఁ గొనిపోయి భక్తిఁబెంచెదను
యౌవనప్రాప్తితో నరుదెంచు నిచటి
కీవసుంధరకెల్ల నితఁడొడయండు;
పుట్టుచు మరణంబుఁబొందినవారు
నెట్టన వసువులు నేఁడైన నెఱుఁగు;
వారి వశిష్ఠుండు వసుధపైఁ బుట్ట
నీరీతిఁ బొమ్మన్న నే తెంచినారు ;
ఒప్పుగా నీచేత నుపకృతులైన
యప్పుణ్యు లొక వేళ నగుదురు నీకు. "
అనిచెప్పి, గంగ రయంబెసగంగఁ
దనయునిఁగొంచు శంతనుడించి పోయె.
అంత నూరికివచ్చి, యతఁడవ్వధూటిఁ
జింతించి చింతించి చిత్తజుండేఁప,
నూరిపట్టున నుండ నుల్లంబురాక
వీరవర్గముగొల్వ వేటాడవెడల,

శంతనుఁడు భీష్మునిఁ బడయుట

భాగీరథీ నదీ పథమునఁ దొంటి
భోగభూమికిఁ బోయి పొడగనునపుడు,
కదిసి యోడలఁగాని గడువంగరాని
యుదకంబు సన్ననై యుబ్బెల్లస్రుక్కి,
పలుచనై చెదరుచుఁ బొకుఱాళ్లకును
నలబల సేయుచు నడుమంటస్రుక్కి,
యారీతిఁ దనుబాసి యాకాశగంగ
భూరి తనుత్వంబు పొరసెనోయనఁగ
జాలువారుచునున్న సందియంబంది
హేల [42]ప్రయాణమై యెగువకుఁ బోయి,


యక్కడఁ బొడగాంచె నాత్మనందనుని ;
నొక్కండు వింట నేయుచునున్న వాని,
నట్టగా నేసిన యుమ్ములకట్టఁ
దొట్టిన నీటికందుప నున్న వాని,
నరుదారఁ దనరూప మచ్చొత్తినట్లు
భరియించి బహుకళాప్రభనున్న వానిఁ
గనుఁగొని, తనసుతుఁగా నిశ్చయంబు
మనమునలేకయు, మమతావిభూతి :
"నెవ్వనితనయుఁడో యీదీర్ఘ [43]బాహుఁ!
డెవ్వనివుణ్యమో యీ మేలుగాంచె!
సుతు నింతవాని నీశుఁడు నాకు నీయ
క్షితికెల్ల యువరాజుఁజేయంగఁ దగదె!”
అనివిచారించుచో, నతనికి గంగ
వనితయైపొడసూపి వరలజ్జఁబలికె:
"ఏను మున్నిటిగంగ ; నితఁడునీనుతుఁడు;
మానవేశ్వర, నీవుమఱచిన వినుము.
ఇతఁడు వశిష్ఠుతో నెల్ల వేదములు
చతురతఁ జదివె శాస్త్రములతోఁగూడఁ ;
బరశురాముఁడు నేర్ప బహుతరవిద్య
శరములు మంత్రించి సంధింపనేర్చె :
వాహనారోహణ వరశక్తియుక్తి,
[44]వ్యూహాశుకృతులఁ దా నుపదిష్టుఁడయ్యె ;
సనకసనందన సన్మునీశ్వరుల
ఘనకృప నెఱిఁగె [45]యోగప్రకారంబు ;
నింతటఁ గొనిపోయి యేలింపుధరణి;
సంతాన [46]వంతులసరస నుండెదవు".


అనుటయు, వేడ్కఁ జా నాగంగననిచి
తనయునిఁదెచ్చి, శంతనమహీవిభుఁడు
హస్తిపురంబులో నతనికి వేడ్కఁ
బ్రస్తుత యువరాజపట్టంబుఁ గట్టి,
రణమున సాధింపరానిశాత్రవుల
నణుమాత్రమున గెల్చి, యతనిసత్వమున
జలరాశి వేష్టిత సకలభూతలము
నలమి యేలుచునుండి, యటనొక్కనాఁడు,

శంతనుఁడు సత్యవతిని మోహించుట

ఆప గేయునిమీఁద నఖిల భూభరము
మోపి, రథంబెక్కి- ముదము రెట్టింప
యమున [47]వాలునకు నెయ్యమున వేటాడ
నమితసేనాఢ్యుఁడై యరిగి, యచ్చోటఁ
గప్పారుజలముపైఁ గాంచనచ్ఛాయ
నొప్పారుచున్న యాయోజనగంధి
నీలమేఘంబుపై నెలకొను మెఱుపుఁ
బోలియుండఁగఁ జూచి, బుద్ధినూహించి :
"యీసౌరభంబును, నీజవ్వనంబు,
నీస్వరూపము బ్రహ్మ యీయింతికొసగి
[48]నౌకల వలనొప్ప నడుప నిట్లునిచె;
నీకార్యమునఁగదా యితఁడు [49]ఛాందసుఁడు ! "
అనితలపోసి యిట్లను నింతిఁజేరి :
"వనిత, నీరూప యౌవన విలాసములు
సూడిదగాఁ జిత్తజునకు నీవచ్చు:
నోడరేవున నుండ నుచితమె నీకు !
నింతికి నర్ధాంగమిచ్చిన శివుఁడు
కాంత, నీరూపంబుగని సిగ్గువడఁడె !


కాముండు మూర్తితోఁ గలిగిననాఁడు
నీ [50]మేనుగలిగిన నిలుచునే [51]జగము:!
ఎన్నంగ ధరయెల్ల నేలినవాఁడ,
నన్ను నేలుదుగాక నలినాయతాక్షి !
కాముబారికి మునుగాము ; నీప్రేమ
యేమనిభావింతు నెఱిఁగింపఁగదవె ! ”
అనిన నాతనిమూర్తి కతివమెచ్చియును,
మనసువికారంబు మఱువెట్టి పలికె:
"ఏనియ్యకొననేర నీయర్థమునకు ;
మాన వేశ్వర, నీవు మాతండ్రినడుగు ;
అల్లదె మాపల్లె; యందు మాతల్లి
సల్లీలతోఁగూడి జనకుఁడుండెడిని ;
వారినుండియు నీవు వచ్చునందాఁక
వారినుండెదఁ బూర్వవర్తనంబునను ;
విచ్చేయు." మనవుడు, విరిదమ్మినుండి
యచ్చుగాఁ బోలేని యలిపోలె నతఁడు
సతిఁబాయలేకయు ఝషవైరివురికిఁ
గతిపయ [52]మంత్రిసంకలితుఁడై పోయి,
దాసుఁడయ్యును విష్ణుదాసుఁడైయున్న
యాసతీమణితండ్రి నచ్చోటఁ గాంచి,
యతనిచేఁ బూజితుండై వేడ్కఁబలికెఁ:
"జతురత మాతోడి సంబంధివైతి ;
కాశి నీగతి మత్తకాశినీమణుల
దాసులు గానరు తపముచేసియును.
రత్నంబుగంటివి ; రభసంబు [53]మిగుల
యత్నంబుతో నడుగ నరుదెంచినాఁడ.


గ్రామంబులిత్తునో ! కరులుగావలెనొ !
హేమ మౌక్తిక రాసులిత్తునో తనియ !
నెయ్యది నీకోర్కె ! యెఱిఁగింపు. " మనినఁ,
దియ్యనిమాటల దేవలుండనియె:
“హరిణలోచనఁ బెండ్లియాడెదు గాక ;
ధరణీశ, నీకంటెఁ దగువారువేరి !
ఉంకువ నీచేత నొల్లముగొనఁగ;
నింక చెప్పకపోదు హితలీల వినుము ;
నాపుత్రికుదయించు నందనునంద
యువరాజభారంబు నున్పనోపుదువె!
ఓపిన, నిది నాకు నుంకువ ". యనినఁ,
గోపమించుకవచ్చి కువలయేశ్వరుఁడు :
"ఆపగేయుఁడు రాజ్య మరయుచునుండ,
నీపని యెట్లుగా నేనియ్యకొందుఁ !
గట్టిడికార్యంబు, కళ్యాణియైనఁ
గట్టినట్లున్నది కడునాత్మనాకు. "
అనిఖిన్నుఁడై పోయి హస్తినాపురము,
తనయిల్లువెడలక తాపభారమున,
వాలినమొగులులో వనజాప్తుఁ [54]డట్లు
చాలఁదూలిన జీర్ణచంద్రుండువోలెఁ
గుంభినీజనులకుఁ గొలువియ్యకున్న,
గాంభీర్యజలరాశి గాంగేయుఁ డెఱిఁగి,
యయ్యెడ నొక్కనాఁ డయ్యయున్నె డకు
నొయ్యన సుముఖుఁడై యొక్కఁడుఁ బోయి:

భీష్మ ప్రతిజ్ఞ

“యిదియేమి తండ్రి ! నీవెన్నఁడు [55]లేదు,
చెదరియున్నావు నీచిత్తంబులోన !


సాధింప, ఘనుఁడైన శత్రుఁడా లేఁడు !
బాధింప, నోడినపాపంబు లేదు !
విల్లు నేనును గల్గ విజయంబునీకు ;
నెల్ల కార్యములు నాకెఱిఁగింపు. " మనిన,
(ననువొప్పఁ దా వేట కరిగినలాగు,)
ఘనుఁడు యోజనగంధిఁ గదిసినలాగు,
రమణికి సుతుయౌవరాజ్య ముంకువగ
(నమరంగ దాశరా జడిగినలాగు,)
వలదని తా నంత వచ్చినలాగు,
లలిఁ బంచశరుఁడేయులాగుఁ జెప్పుటయు,
గురుభక్తి యాత్మలోఁ గొలఁదికి మిగుల
సురనదీతనయుండు క్షోణీశుఁబలికె :
"జాలరీఁడాడినచతురంపుమాట
యేలగైకొనవైతి! వేనున్న నేమి!
గురుహితం బెఱుఁగని కొడుకేమికొడుకు!
ధరణీశ, నీకోర్కి తలకూర్తువినుము ;
అందుఁబుట్టెడువాఁడు ననఘ, నీసుతుఁడు,
పొందుగా ధర యేలఁబోలదే చెపుమ!
తగ నేనపోయి, యాతని నొడంబఱచి
మగువఁదెచ్చెద"; నని మక్కువఁబోయి,
దేవలుఁగాంచి సుధీవరుఁడనియె:
"భూవరునకు నేల పుత్రినీవైతి?
నాచిత్తమెఱుఁగక నరనాథుఁ డపుడు
నీచేత సతి నంద నేరకపోయె.
ఆతఁడేమెఱుఁగు ! నీయాత్మజగాంచు
సుతునిఁ బట్టముగట్టి క్షోణియేలింతు;
నేనేలనొల్ల ; సూర్యేందులు సాక్షి ;
మానవేశ్వరునకు మగువని.” మ్మనిన,


డక్కగా నాడుబిడ్డల నిచ్చుచోటఁ
దక్కక చింతింపఁదగుఁ; గాన నతఁడు
నృపనందనునిఁబల్కు: “నీకు నీవోపి
నృపునిఁ జేసెదనంటి ; నిజము నీమాట;
నీకుఁబుట్టెడువారు నీయంశమునకు
రాకమానరు; ఘోరరణములౌ నపుడు;
కావునఁ, గూడదు కళ్యాణ". మనిన,
నా వేశమెత్తిన ట్లతఁడు భీష్మించె:
“ఏను బెండిలియాడి యెన్నఁడే నొకనిఁ
గానఁగ మఱిగదా ! గలుగుఁ గయ్యములు;
మనుజేంద్రుపెండ్లికై [56]మానెదఁబెండ్లి ;
ఘనతఁ బుత్త్రుల గానఁగలవాఁడఁ గాను.
[57]అమర మైయుండు నాయౌవనావస్థ :
రమణుల [58]నంగ యారంభదీమముగఁ
గుసుమాస్త్రుఁడేయనీ కుసుమబాణముల,
వెస వీడిపోవనీ నితరులునన్నుఁ,
బట్టితిఁ బట్టితి బ్రహ్మచర్యంబు
గట్టిగా. " ననుటయుఁ, గడు [59]మెచ్చి సురలు
'దేవవ్రతుం' డని దివినుండి పొగడ,
భూవరుపైఁ గురిసెఁ బుష్పవర్షములు.
'భీష్మించి యతఁడేఁగెఁ బితృభక్తి' ననుచు
భీష్మనామకుఁజేసి పిలిచిరి జనులు.
అంత సంతోషించి, యాదాశరాజు
'కాంతనిచ్చితి ' నని గాంగేయు వెనుక
నిభముపై గూఁతురి నెక్కించుకొనుచు
నిభపురంబున కేఁగె నెలమిదీపింప.


సత్యంబుతోవచ్చి సౌంజ్ఞ దై వార
సత్యవతీదేవి జనకున కపుడు
విభవంబుతో యుక్తవిధిఁ బెండ్లిసేయ,
నభినవోత్సాహుఁడై యపుడు పుత్త్రునకు
సరవిఁ గోరినదాఁక చావులేకుండ
వరమిచ్చి, యాసత్యవతియును దానుఁ
జిత్ర చిత్తజు కేళిఁ జెలఁగుచునుండి,
చిత్రాంగదునుని విచిత్రవీర్యునిని
బుత్త్రులఁగాఁగాంచి, పుత్త్రోత్సవంబు
ధాత్రి మెచ్చఁగఁ జేసి తనరఁబెంచుచును,
రాజ్యంబుచేసి, యారాజు గీర్వాణ
రాజ్యంబు కాలధర్మమునఁ బ్రాపించె.
అప్పుడు భీష్ముఁ డయ్యబల నూరార్చి,
తప్పక శ్రాద్ధముల్ తండ్రికిఁజేసి,
నవలీల సింహాసనంబు గైకొనక
యవనికి రాజుఁ జిత్రాంగదుఁజేసె.
చేసినచోట నాచిత్రాంగదుండు
వాసవునైన సత్వమునఁ గైకొనక :
"కరి గండభేరుండ కంఠీరవముల
గరిడికిఁగొనివచ్చి కడఁక నొంచుదునొ !
ఏఱులన్నియుఁ బూడ్చి, హేమాద్రి వెఱికి,
జారంగవిడుతునో జలధిలోపలను !
కాదేని, జలధిచక్రము వ్రక్కలించి
పోదునో శేషుతోఁబోరాడ! ననుచు,
నట్టిదిగా దేని, యవని సత్వాడ్యుఁ
బట్టి సాధింతునో బలమున 1” ననఁగ,
......... ......... ......... ......... ........ .........
........ .......... .......... .......... ......... .......


అంత నే తెంచెఁ జిత్రాంగదుఁడనఁగఁ
గాంతిభీకరుఁడైన గంధర్వుఁ డొకఁడు ;
ఏ తెంచి యారాజు నిట్లనిపలికె:
"భూతలాధీశ, చెప్పుదురు నీలావు;
అష్టదిక్కరులను నడిగితి రణము;
నష్టదిక్పాలుర నడిగితి రణము ;
నెందులేదు ; భుజంబు లేర్పులు వట్టె ;
విందుసేయుము మల్లవిద్య నా”. కనుచు
నరులుఱిచ్చవడంగ నలినాక్షులేడ్వ,
దొరలునివర్తింపఁ దోడ్కొనిపోయి,
భూరి కురుక్షేత్రమున నాజిచేసి,
యా రాజుఁ దెగటార్చి యాతండువోవ,
నొక్కింతశోకించి, యూర్ధ్వకృత్యములు
తక్కక భీష్ముఁ డాతనికిఁ జేయించి,
యుర్వి కాతనితమ్ము నొడయనిఁజేసి
సర్వంబునడపుచో ; [60]జగతిలో నంత,

కాశిరాజుకూఁతుల భీష్ముఁడు తోడ్తెచ్చుట

మువ్వురుసుతలకు మొగిఁ గాశిరాజు
జవ్వనంబునఁ బెండ్లిసమకూర్ప వలసి
వీరస్వయంవరవిధికి భూవరుల
వారక పిలిపించువార్త పుట్టుటయు,
నొక్కఁడు రథమెక్కి, యుర్విగ్రక్కదల
గ్రక్కున భీష్ముఁ డాకాశికిఁ బోయి,
తప్పక వీరులందఱు నల్గువాతి
కప్పలగతినుండఁ గనుఁగొని నవ్వి,


కమనీయ కమలినీ కబళనార్థంబు
కమలాకరముఁజొచ్చు గజమునుబోలె
మచ్చుగాఁ బన్నినమంచెలమీఁదఁ
జొచ్చి, కాశీశుండు చూడఁజూడంగ,
నంబుజగంధుల నంబ యంబిక యు
నంబాలికయు ననునట్టి కన్యకలఁ
దనరథంబెక్కించి దర్పించిపలికె:
“మనుజేంద్రులార, యేమఱియుండవలదు ;
అనుజునిపెండ్లికి నఖిలంబు నెఱుఁగఁ
గొనిపోవుచున్నాఁడఁ గుటిలకుంతలుల.
అసుర బ్రాహ్మంబులను వివాహముల
నాసుర మీ పెండ్లి; యర్హంబు మాకు ;
పెనఁగివినుండు నా పేరుభీష్ముండు ;
వినుఁ డొంటివచ్చితి విల్లునునేను ”.
అనిపోవఁ, బోనీక యడ్డంబుదాఁకి,
జననాథు లస్త్రశస్త్రంబులచేత
ముంచిన, నతఁడు రామునిశిష్యుఁడౌటఁ
బొంచి యూనృపవైరమునఁ బెచ్చు పెరిగి,
యనుపమాస్త్రంబుల నవి ద్రుంచివైచి,
తనరథ వేగంబు దప్పకయుండఁ,
గృత్తసూత రథాశ్వ కేతన చ్ఛత్ర.
మత్తేభ [61]కుంభముల్ మార్గంబుదెలుప,
విచ్చుచుఁ బొదువుచు వెస భానుమీఁద
వచ్చుమంచువిధంబు వైరులు దెలుప,
నావలవెడలినయతనిబాణములఁ
బ్రేవులుదునిసియుఁ, బృథివివ్రాలియును,


[62]బిరుదులువోయియు, విఱిగియు, నృపతు
లరవరులయ్యు నయ్యనువున డస్సి
[63]దీనాస్యులై పెక్కు తెరువులఁ బోవఁ,
దానట్లుపోవక తవిలి సాల్వుండు
భీష్ముని నారాచ [64]ప్రేరితుఁజేయ,
గ్రీష్మ కాలాదిత్యుక్రియ నాతఁ డలిగి,
విల్లును జోడును [65]వెడఁదైన కేడె
మల్లియఁ దునిమి, యయ్యెడ నొక్కకోల
నాటించి తేరుభగ్నముసేయ, నతఁడు
దాటి ధాత్రికిడిగ్గి తలవీడఁబాఱె.
అంత నూరికివచ్చి యాపగేయుండు
కాంతల నొక్కలగ్నమునఁ దమ్మునకు
....... ........ ......... ......... ......... ........
......... ......... ......... ........ ....... .......
శక్తిత్రయంబుతో సంధించునట్లు
భక్తిమైనున్న చోఁ బలికె నయ్యంబ :
“నరనాథ, యిటమున్న నన్ను సాల్వుండు
వరియించె ; మాతండ్రివచనంబుఁగలదు ;
నీవునుఁదెచ్చితి; నీతిమార్గమున
భావింప, నీకంటెఁబ్రాజ్ఞులు గలరె !”
....... .......... ......... ....... ....... .........
అనుటయుఁ, దనకుముప్పైన యాయింతి
ననిచి, భీష్ముం డంబికాంబాలికలను
ననుజునకిచ్చిన, నసమాస్త్రు కేళిఁ
దనియక యతఁడు నిత్యంబుఁగ్రీడించి,
నానాఁటి కొడల జీర్ణవ్యాధిపుట్టి
మానక యాలీల మరణంబునొందె.


అరయ నట్టిద కాదె యధికకామంబు
నరులకుఁ గొఱగాదు నయవిధిఁజూడ.
గాంగేయు భూనాథుఁగాకుండ నడిగి
యంగననిచ్చిన నదియేలవెలయు !
అనుజుఁడిట్లేఁగిన, నాపగేయుండు
మనమున శోకాగ్ని మంటయై మండ
దీనుఁడై, యెవ్వరుఁ దెలిపినఁ దెలివి
నూనక మూర్ఛిల్లి యొక్కింతదెలిసి :
"శంతనుమాఱుగాఁ జర్చించి మిమ్ము
నెంతయు నరసితి నేఁ దమ్ములార !
[66]ఒమ్మగుపనిగాఁగ నొకమాను వొడువ
బొమ్మరమ్మును గాకపోయినట్లయ్యె !
ఇలకు విచారింప నే నున్న వాఁడఁ !
గులసూత్ర మింతతో గుఱుచయయ్యెడినొ!
ప్రాణసాధ్యంబైనపని గాదుగాక,
ప్రాణంబునకు నడ్డపడనె యింతకును ! "
అనియేడ్చి యతనికి నపరకర్మముల
నొనరించి, యరయుచునుండె భూతలము.

చంద్రవంశోద్ధరణకై నత్యవతి ప్రయత్నము

నిత్య నిస్‌స్పృహవృత్తి నెగడినయతని
సత్యవతీ దేవి జపవేళఁ గదిసి,
విపులచంద్రముఖంబు వెసవాంచియున్న
యపరయామినివోలె నాస్యంబువంచి,
యెలుఁగు [67]డగ్గువడంగ నేడ్చుచుఁబలికెఁ :
"గలరెధర్మజ్ఞులు ఘనుఁడ, నీకంటె!


సకలపావనమైన చంద్రవంశమున
[68]నొకఁడవె శేషించియున్నాఁడ టపుడు;
శంతనుహితముగా సంతానమునకుఁ :
గాంతానుభోగంబు గైకొనవలయు;
అరులు నీతరువాత 'హస్తినాపురము
దొరకుమా' కని యాసతో నున్న వారు ;
ఆరయబ్రహ్మచర్యం బింక వలదు ;
కారణంబెడలుచోఁ గార్య మేమిటికి ! "
అనిన భీష్ముఁడుపల్కు. : "నమ్మ, యిట్లేల
ననువిచారింపవు నయహీనుఁజేసి !
పట్ట నేరుతునఁట! పట్టినవ్రతమ
నెట్టన విడుతునే నింగి పైఁబడిన !
ఎల్లధర్మంబుల నెఱుఁగుదువంటి;
తల్లి, యీమాటకుఁ దగుదునె యేను !
ఎఱిఁగినధర్మంబు నే విన్నవింతు ;
నెఱిఁ జంద్రవంశంబు నిలుచునట్లైన.
పరశురామునిచేతఁ బతులఁ గోల్పోయి
తరుణులు తొల్లి త్రేతాయుగాంతమున
నాచరించినధర్మ మఖిలపురాణ
సూచితంబైనది సుచరిత్ర, కలదు,
సర్వలక్షణముల సంపూర్ణుడైన
యుర్వీసు రేంద్రుని నొకని వరించి,
సన్నుతి శుచి ఋతుస్నానంబు చేసి-
యున్న నీకోడండ్రయొద్దకుఁ దెచ్చి,
పుడమికిదిక్కుగాఁ బుత్త్రభిక్షంబు
నడిగించు ; గలిగెద రతనివీర్యమున.


కలరు నమ్ముము రాజకాంత లీరీతిఁ
గులమునిల్పినవారు కుంభినిమీఁద.”
ననిన శంతనుదేవి యంగీకరించి,
తనకుమారుని వ్యాసుఁ దలపోసి పలికె:
"కన్నియవయసునఁ గంటి నేఁబుత్త్రు ;
నున్నాఁడు మునిచంద్రుఁ డుత్త మోత్తముఁడు ;
[69]ఆరయఁబో నేల యన్యునొక్కరుని !
మేరువుపై నుండి మిన్నేల వెదుక !
శాంతిశీలుఁడు చాలఁజక్కనివాఁడు
కాంతిమతులఁజేరి కలిగించుసుతుల ;
ఆతఁడువ్యాసుండు ; మహామునిపుత్త్రుఁ ;
డితరుండుగాఁడు; నీవెఱఁగినవిధము.
అలయక నాయాజ్ఞ యమ్మహామౌని
తలఁదాల్చి పుత్త్రులదానంబొనర్చు.”
ననిన భీష్ముఁడులేచి యంజలిచేసి
కనుదోయిమోడ్చి చక్కఁగఁదూర్పునిలిచి :
"ఓంకారమయరూప, యోవ్యాసమౌని,
పంకజాసనునకుఁ బ్రతియైన స్వామి,
హరియుద్ధరించినయఖిల వేదములు
సరవి నేర్పఱచిన జగదేక హితుఁడ,
సావధానంబున సాత్యవ తేయ,
రావయ్య మీతల్లి రప్పింపుమనియె;
మునిచంద్ర, మునిసింహ, మునిసార్వభౌమ,
యనిమిషేశ్వరవంద్య, యరుగు దేవయ్య !"

వ్యాసుఁడు తల్లికిఁబొడసూపుట

అనిన, జేగురుకాల్వ లందును నిందు
[70]నినిచివ్రేలఁగవచ్చు నీలాద్రివోలె


మెఱుఁగుఁదీఁగెలతోడి మేఘంబుపోలె
చేఱపులై పింగళజట లుల్లసిల్ల,
ద్వైపాయనుఁడువచ్చి తల్లికిమ్రొక్కి :
'యేపనిగలిగెనోయెఱిఁగింపు; ' మనిన,
నప్పుడు గాంగేయుఁ డర్ఘ్యాదివిధుల
నప్పరాశరసూను నర్థిఁ బూజించి,
యున్న తాసనముపై నునిచి కీర్తించి,
కన్నులుచల్లఁగాఁ గనుఁగొనుచుండ
నా సత్యవతి వేడ్క నతనికిట్లనియె:
"వ్యాస, తలంపఁగా వచ్చితి నేఁడు ;
హరివోలె నందఱయంతరంగముల
చరితంబులెఱుఁగుదు సంయమితిలక !
ధర వచ్చివచ్చి శంతను [71]ననంతరము:
[72]పఱిపోవఁగానుండె భరతవంశంబు;
తనయులఁబడయఁ డితఁడు బ్రహ్మచారి ;
పనివడి గురునికై పట్టెనువ్రతము ;
కూలిరిద్దఱుపుత్త్రకులు ధురంధరులు;
వాలిన నాలోని వగలార్పవయ్య!
అంబుజముఖులు నీయనుజునిభార్య
లంబికాం బాలికలనియెడువార
లున్నారు; వారిలో నొకయింతియందు
మన్నించి యొక్క కుమారు నీవయ్య!
దేవరన్యాయంబు ధృతిఁజేయవచ్చు ;
నావల నీకంటె నర్హుండులేఁడు. "
అనిన, వేదవ్యాసుఁ డంబకిట్లనియె:
"విను మెఱుంగుదు లోకవిదితమీ తెఱఁగు;


పూఁబోఁడు లనుకూలబుద్ధి వారైన,
నేఁ బూని కావింతు నీప్రయోజనము.
క్షేత్రంబులోని విశేషంబువలన
క్షాత్త్రఁబుగలవాఁడు జనియించుఁ గొడుకు.
నెలకొని యొకయేఁడు నియమంబుసలిపి
నలినాక్షులున్నచో, న య న న్నీవు
తలఁపుము ; నేవచ్చి తల్లి, వారలకుఁ
గుణముసల్పఁగనోపు కొడుకుల నిత్తు."
ననినఁ గుమారుతో నతివయిట్లనియె:
“దినహానియేల ! ధాత్రికి రాజులేఁడు ;
నాకోడలున్న ది నాల్ నాళ్లుచేసి ;
యేకతంబున నీకు నేనుబుత్తెంతు
[73]ర. " మ్మని యంతఃపురమున కాతనిని
సమ్మతిఁగొనిపోయి, శయ్యపై నునిచి,
యంబికాంగనయున్న యావాసమునకు
సంబరంబున రాత్రి చనుదెంచి పలికె:
"ధర్మమార్గంబునఁ దరుణి, నీకొక్క
కర్మంబుచెప్పెదఁ గైకొనివినుము ;
నిరతసంతానంబు నిలుపుటకంటెఁ
బరమధర్మములేదు [74]పతి ధర్మవతికి.
రమణుఁగోల్పోయినరాచయిల్లాలు
విమలాత్ముఁడగు విప్రువీర్యంబు దాల్చి
సుతులఁగాంచుటమేలు; శ్రుతి పురాణముల
వితతమీయర్థంబు ; వింటిమెల్లెడల.
ఈరాత్రి యుదకంబు లింతి, నీవాడి,
సౌరభగంధంబు చల్లనిమడుఁగు


జాదులు ధరియించి ననుదెంతుగాక;
భూ దేవుఁడున్నాఁడు పువ్వుఁబార్పునను ;
అతండు వేదవ్యాసుఁ డతివ, మీబావ ;
యతిభక్తియొనరించి యడుగుము సుతుని. "
అనుటయు లజ్జించి యత్తకుత్తరము
వనిత యీనోపక విరుసఁగై సేసి,
రత్నదీపంబులు రమణీయధూప
యత్నంబుఁ గలిగినయచటికిఁ బోయి,
కపిలవర్ణంబైన గడ్డంబు ---------
దపసినల్లనిమేనుఁ దప్పకచూచి,
యొడలు [75]నిబ్బరికింప నొ డాడ నోడి,
వెడఁదకన్నులుమోడ్చి వెఱచుచునుండఁ,
దగినకార్యముదీర్చి ద్వైపాయనుండు
మగువ మక్కువఁబంచి, మఱునాఁడు ఱేపు
అంబికవృత్తాంత మడుగుచున్నట్టి
యంబతోనిట్లను : " నయ్యెఁగార్యంబు ;
పుడమియేలెడుభోగి భుజబలోన్నతుఁడు
కొడుకు జన్మించు నీకోడలియందు ;
ననుజూడనోడి యున్నతిఁగన్ను మోడ్చు
జననిదోషంబున జాత్యంధుఁడగును ;
అంబికాసంభోగ మభవుండు సేయ
లంబోదరుఁడుపుట్టె లలి వక్రముఖుఁడు ;
ఈయంబికయుఁ బుత్త్రు నిటుగనఁగలదు ;
చేయ నేమున్నది శివునాజ్ఞగాక !
ఏనుబోయెద" నన్న నింతిచింతించి:
"మౌనీంద్ర, పోకుము; మఱిపోదుగాని,


బాలికయైన యంబాలిక నేఁడు
నోలినంటుననుండి యుదకంబులాడె;
దానిఁ బుత్తెంచెదఁ దనయునొక్కరునిఁ
బూని దోషవిహీనుఁబుట్టింపుమందు. "
అనుచుఁ దొల్లిటియట్ల యామినివేళ
మునియున్నచోటికి ముద్దియ ననుప,
నదిపోయి మునిపుత్త్రునాకృతిఁ జూచి
బెదరి వెల్వెలఁబాఱ, 'వెఱవకు ' మనుచుఁ
గాలోచితముదీర్చి, ఘనుఁడు మర్నాఁడు
చాలవేడుకనున్న జననికిట్లనియె:

ధృతరాష్ట్రపాండురాజుల జననము

“అంబ, యంబాలిక [76]యందులోపమునఁ
గంబువర్ణుఁడుసువ్వె గలుగు నందనుఁడు ;
వెలవెలఁబాఱినవికృతికి నదియుఁ
దలఁప నూరకపోదు తల్లిదోషంబు."
అనిచెప్పిమునిపోవ, నంతఁ గోడండ్రఁ
గినిసి గర్భములురక్షింప నేమించె,
అంత వ్యాసులుచెప్పినట్ల నందనులు
కాంతల కిరువురు గ్రమముతోఁ గలిగి ;
రాజానుబాహువు లమరమార్తాండ-
తేజులునై యుండ దృష్టించి, యప్పు
డుప్పొంగి గాంగేయుఁ డోలి బ్రాహ్మణుల
రప్పించి ధనముధారలువోసి యిచ్చి,
పురము శృంగారింపఁబుచ్చి, సక్రమము
కరమొప్ప జాతసంస్కారముల్ చేసి,


దిననాథనిభులకు ధృతరాష్ట్రపాండు
లనియెడునామంబు లనువుగావించి
పెనుచుచో, మఱి యంతఁ బెద్దకోడలికి
ననఘ, పుప్పోదయంబైన యట్లైన,
మజ్జనదినమున మాపటివేళ
సజ్జననుతుఁ బరాశరసూనుఁ దలఁచి
రప్పించి : " పలుక నేరరు మఱఁదండ్రు;
తప్పిరి నినుజూచి; తమ కేలవెఱవ !
ఇంగితంబెఱిఁగి నిన్నించుక సేపు
శృంగారరసపూర్ణుఁ జూడలేరైరి.
ఊనంబుగలిగిన నుర్వీశునైన
మానవు లొక్కింత మతులఁగై కొనరు.
అనిచెదఁబ్రార్థించి యంబిక నేఁడు ;
తనయునొక్కని దివ్యతనయుఁగా నీవె!"
అనిచెప్పి యారాత్రి యాయింతి ననుప,
మునిఁబొందనేరక ముద్దియరోసి
తత్తరింపుచు డాఁగి, తనదాదికూఁతు
నత్తగానకయుండ నంపె; నంపుటయు,
నదివోయి తననేర్పులన్నియు మెఱసి
మదనుండుమెచ్చంగ మౌనిఁగూడినను,
దల్లికి ఱేపాడి తనయుఁడిట్లనియె:
"నుల్లోకవిజ్ఞాని యుదయించుఁ గొడుకు ;
[77]శూద్ర గాంచుటఁజేసి శూద్రుఁడౌఁ; గాన,
భద్రాంగి, కులము నిల్పఁగఁజాలఁ డతఁడు. ”


యముఁడు విదురుఁడై జనించుట

అనిచెప్పి మునిపోవ, నంత ----------
తనకర్మమహిమ నద్దాదికూఁతునకు
విదురుఁడై పుట్టిన, వేడ్క భీష్ము
ప్రిదులక నానాఁట [78]బెంచ జాలనని.
ధర శూద్రయోని నంతకుఁడుపుట్టుటకు
నరనాథ, విను కారణంబుచెప్పెదను.
ఒక్క భూపాలునియూరిచేరువను
మక్కువ నడవిలో మాండవ్యమౌని
తపమున్న చోటున, ధరణీశునగరి
విపులార్థములు చోరవీరులు దిగిచి,
యరుగుచు రాత్రి యయ్యాశ్రమభూమి
తెరువున నరుగుచో, ధృతి నంతలోనఁ
దలవరు లాచొప్పు తడవి యే తెంచి
తులువలఁ గానక ధూర్తులై గదిసి :
'మునినాథ, కానవేమ్రుచ్చుల ! ' ననినఁ,
బనివడి యామౌని పలుక కుండినను:
'ఇతఁడును, దొంగలు నేకమై నేఁడు
పతిసొమ్ముదెచ్చిరి ; పలుకులే ! ' లనుచు
జడలుకంపలఁబట్టి, జపమాలఁద్రెంచి,
మెడనల్గుగట్టించి, మిన్నక తిగిచి,
యంతరంబెఱుగనియాతతాయులకుఁ
జింతింపఁ బాపంబు సిద్ధించు [79]ననక
సందెఁద్రాడొనరించి, జనపతి [80]కడకు
నందఱుఁగొనితెచ్చి యతనిసమ్మతిని
శూలాగ్రమునవైవ, స్రుక్కక మౌని
వాలిన తనతపోవైభవంబొప్పఁ


జాకున్న, నాతనిసామర్థ్యమెఱిఁగి
భూ కాంతుఁ డామౌని భూమికి దెంచి ,
భూరి ప్రదక్షిణంబులుచేసి మ్రొక్కి
'నేరమి యోర్వవే నీవాఁడ' ననుచు
నుతియించి, యాకొఱ్ఱునోకుండఁ ద్రుంచి
యతనియల్కకుఁదప్పి యనిచిన, నరిగి
కుత్తుక నొకకొంత కోయంగరాక
బెత్తెడుకొఱ్ఱు నిల్చిన యాణెవలన
యానిమాండవ్యుఁడై యంత నామౌని
మానక తపముండి, మఱియొక్కనాఁడు
యమపురంబున కేఁగి యుమునకిట్లనియె :
"శమన, కొఱ్ఱెక్కింపఁజనున య్య నన్ను !
గలయంగ ధర్మాధికారిగా నిన్ను
నిలిపిన విధిఁగాక నిన్నాడఁగలదె!
ఏతప్పు నామీఁద నెన్నితి?" వనిన,
నాతఁడిట్లను: “ నన్ను ననఁబనిలేదు ,
ఎప్పుడుఁ బ్రాణుల నేఁ 'జొప్పఁగోసి
చొప్పఁగట్టినయట్టిచొప్పు' దీపింపఁ
గట్టుదు నిజనిజకర్మపాశముల ;
నిట్టుదూఱఁగఁ దగునే వట్టిదూఱు !
నీవు తూనీఁగల నీపిన్ననాఁడు
వావిరిఁ గొఱ్ఱులవైచితి గాన,
నాకర్మఫలమునే యనుభవించితివి;
మా కేమినా!" దన్న మాండవ్యుఁడలిగి:
‘యిలఁబుట్టి పదునాలుగేఁడులదాఁక
తలఁపంగనేరఁడు ధర్మంబునరుఁడు,
ఆలోనికర్మంబు లతనిఁ భావింపఁ
జాలవు; చేసితి సమయమేనిపుడు.


అంతయెఱుంగక యనుచితదండ
మంతక, నాయెడ నాచరించితివి ;
శూద్రుఁడవై పుట్టు క్షోణిలో. ' ననుచు
నుద్వృత్తకోపుఁడై యొనర శపించె.
అదికారణంబుగా నంతకుండిట్లు
విదురుడైఁ జన్మించె విను. " మని మఱియు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించెనని ప్రీతి వెండియుఁజెప్పె.
మానదుర్యోధన, మదన [81]సమాన,
మానవతీమాన్య, మదనాభిరామ,
రామణీయకధామ, రామాభిరామ,
రామాయణానంద, రక్షా ప్రసార, (?)
సారస్వతామోద, సత్యవిహార,
హార నూపుర కంక ణాంగద యోగ,
యోగనిర్మలభాగ, [82]యుచితసంభాగ,
భాగవతాధార, భాగ్యాప్తినీకు.
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీవ
శ్రుతిపాత్ర వల్లభనూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాస మొప్పె మూఁడవది.


__________
  1. సుధార (మూ )
  2. రూపంబున
  3. గోరించి
  4. ధారతో (మూ)
  5. యెనయంగనిది (మూ )
  6. గుణవంతులందరి
  7. వర్ణము (మూ)
  8. చైత్ర (మూ)
  9. సతికి
  10. గూర్పగల్గెడిని (మూ )
  11. బ్రహ్మవిండనంగనగణ్యుండనంగ. (మూ )
  12. గూడ (మూ)
  13. చెలిచేతను (మూ)
  14. నన్నతశాస్త్రవిధికి,
  15. బోధించు (మూ)
  16. నాతండెరింగి.
  17. సత్వాదబలిమియు సమయంబుగాన. (మూ )
  18. దనరక
  19. గూడి (మూ)
  20. ఇంకకొమారికయిల్లాలినీకు (మూ )
  21. మిదియును
  22. యఖిల
  23. సంభృతు లగుచు
  24. సామజకేళి
  25. వలసి (మూ)
  26. ఖండితైశ్వర్యులై కడునేలి భూమి
  27. నీతి (మూ)
  28. హితమత్తరంగ
  29. సభకు ఆహూత
  30. నీగిన (మూ)
  31. మెరయ (మూ)
  32. యిట్లనుప తత్వరి వాడు పోయి (మూ )
  33. గరిమకూర్మమొ మొగిళ్లొయెరుంగ.
  34. నేరము.
  35. చూపరులు.
  36. నమ్మరాదన రేని
  37. గ్రీష్పతి. (మూ)
  38. నెవ్వరు. (మూ)
  39. జారదు
  40. సతుల
  41. మొత్తెద. (మూ)
  42. ప్రమాణుఁడై. (మూ)
  43. దేహు-డె.
  44. వ్యూహతాసుకృతానుపవిష్టుఁడయ్యె.
  45. యోగపుకార్యంబు.
  46. రీతుల. (మూ)
  47. చాల్పునకు.
  48. నౌకలోపల నొక్క నౌప యిట్లునిచె.
  49. చెందసుఁడు. (మూ)
  50. మేలు.
  51. జయము.
  52. మాత్ర.
  53. అఖిల. (మూ)
  54. డున్న.
  55. లేమి. (మూ)
  56. మానెనా.
  57. అమగమై.
  58. నంగనిరంభటోయముల.
  59. వొప్పి. (మూ)
  60. జనులలో. (మూ)
  61. శుభముల. (మూ)
  62. చిరువులువోయివొరిగియునృపతు.
  63. దీనాళులై.
  64. ప్రీతుని.
  65. వెడఁగైన నమరి. (మూ)
  66. వమ్మయ్యె పనిగానువొక.
  67. డగ్గలరంగ. (మూ)
  68. ఒకటియు. (మూ)
  69. అరసిపోవఁగ నేల.
  70. నిలి. (మూ)
  71. నందనుండు.
  72. పరసిపోవుచునుండె. (మూ)
  73. రమ్మని యంత నంతఃపురమునకు.
  74. ప్రతిధర్మములకు. (మూ)
  75. "జలదరింప" అనుటమేలు. ప్రస్తుత పదము ఈయర్థముననే ప్రయోగింపఁ బడియుండును.
  76. యవనిలోపలను. (మూ)
  77. శూద్రి. (మూ)
  78. బెంపనాతండు.
  79. గాన.
  80. తోడ. (మూ)
  81. సరామ.
  82. ఉచితానుభాగ. (మూ)