ద్విపద భారతము - మొదటిసంపుటము/ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
చతుర్థాశ్వాసము
శ్రీసమాశ్రితనేత్ర, శృంగారగాత్ర,
ధీసార, సరసయాధిపుచౌడ, ధీర,
అసమానదానవిద్యావినోదముల
దెసల వర్తిల్లు మంత్రీ! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాది సన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె.
ఆరీతి నామధేయములు గావించి,
ధీరుఁ డానుతులకు దేవవ్రతుండు
వరుసతోఁ జౌలంబు వడుగులుఁజేసి,
గురుకళానిధులైన కుశలులచేత
నంగపూర్వకముగా నఖిలవేదములు,
సంగీతసాహిత్యచాతురితోడ
నస్త్రవిద్యలు, [1]వాహనారోహణములు,
శాస్త్రవురాణవాసన లాదిగాఁగ
నెఱిఁగింపఁజేసి, మహీరాజ్యమునకుఁ
దెఱఁగొప్ప నృపునిఁగా ధృతరాష్ట్రు నిలిపి,
హితవృత్తిఁ గార్యంబు లెఱిఁగించి, కొలువ
నతనికి విదురు సహాయుఁగా నిచ్చి,
యిమ్ముడెప్పరమైన నిందువంశమునఁ
గ్రమ్మఱ నొకరాజుఁ గల్పించెఁ [2]దాను
అగ్నియారినవేళ నరణి మథించి
యగ్నిహోత్రముసేయు యజమానురీతి.
ధర్మంబులన్నియుఁ దనకుఁ దోడుగను
ధర్మాత్ముఁ డితఁ డనఁదగి చరింపుడును,
బరభూమిపతుల కప్పంబులఁ గొనుచుఁ
దిరముగాఁ గృతయుగస్థిర[3]భూతి దనర,
సరసత ధృతరాష్ట్రుశాసనంబునకుఁ
దిరముగా జనుల వర్తింపఁజేయుచును,
అనఘు నాధృతరాష్ట్రు యౌవనారూఢుఁ
దనరఁ బెండిలిసేయఁ దలపోయుచుండఁ,
ధృతరాష్ట్రుఁడు గాంధారి నుద్వాహమగుట
బ్రబలుండు గాంధారపతియైనయట్టి
సుబలునికూఁతురు సురుచిరాకార
కమనీయరూపరేఖావిలాసముల
నమరకాంతల కెనయైనది యనియు,
గురుమతి నూర్వురు కొడుకులఁ బడయ
వరము వ్యాసునిచేత వడిఁ గాంచెననియు,
సొరిది నిత్తెఱఁగు భూసురులచే నెఱిఁగి
యరుదారమోదించి యప్పు డుప్పొంగి,
యాశాంతనయుఁడైన యాశాంతనవుఁడు
శైశవాంతరమున జనపతిఁ జూపి
విదురున కిట్లను : "విదుర, యీరాజు
సదమలతేజుండు, సత్యసంధుండు,
వెలయ మదించిన వేయిదంతులకుఁ
గలలావు గలవాఁడు, గాంభీర్యజలధి,
పెండ్లిచేసెదఁగాక పెక్కండ్రుసుతుల
నిండ్లునిండఁగఁ గాంచు నితఁడు మోదమునఁ;
గావున, నితనికి గాంధారు పుత్త్రి
దేవి గాఁదగు నెల్ల తెరవుల; మఱియుఁ
దనయులు నూర్వు రత్తరుణికిఁ దోతు
రని వింటి వ్యాసవరానుభావమునఁ;
దొయ్యలు లయ్యింతితోడఁబుట్టువులు
నెయ్యంబుగలవారు నధిసంఖ్యగలరు.
పుత్తమా! యచటికి భూసురోత్తముల
విత్తంబు లిచ్చి యావెలఁదుల నడుగ."
ననుటయు విదురుండు 'నదికార్య' మనినఁ,
బనివడి యెంతయు బ్రాహ్మణోత్తములఁ
గన్యకావరణంబు గావింపఁ బనుప,
సైన్యసహాయులై చనుదెంచి వారు
గాంధారు సుబలునిఁ గాంచి, కౌరవుల
బంధుత్వ మతని కేర్పడ మాటలాడి:
'సుతను గాంధారిని సుతను సుచరిత
ధృతరాష్ట్రు [4]కడిగి యాదేవవ్రతుండు
పుత్తెంచె; సోదరీపూర్వంబుగాఁగ
నిత్తుగా.' కనుటయు నిట్లను నతఁడు :
"కురువంశవిస్తారకుఁడు ధృతరాష్ట్రుఁ
డరయ నీకన్యకు నర్హుండు; గాన,
సచ్చరిత్రునకు నాజనవరేణ్యునకు
విచ్చలవిడితోడ విశ్వంబు మెచ్చ
నిచ్చితి;" నని తండ్రి యియ్యకొన్నంత,
మెచ్చక యచ్చోటి మేదినీజనులు
నతనిబంధువులును నట తమలోన
హితవేది గుజగుజ ని ట్లని రపుడు :
"అంగంబులందెల్ల నతిశయ ముత్త
మాంగ; మందును గన్ను లరయంగ మేలు;
జనులకు నిట్టిలోచనములు లేమిఁ
బెను [5]చిక్కులగు నిచ్చ; ప్రియతనూభవయు
గాంధారి సర్వలక్షణలక్షితాంగి
యంధున కక్కటా! యాలు కాఁదగునె!
ఈనాతి నంధున కీకున్న నేమి!
మానుగా మగపోఁడి మానంద మిడునొ!
భువిలోన మగవాఁడు పుట్టఁడొ కాక!
యవనీతలేశున కల్లుండు గాఁగ.
పడఁతిసౌందర్యంబు పతికట్టెదురను
అడవిఁగాచినవెన్నె లైపోవఁగలది!
ఈవల శకునియు నిట 'తండ్రిమాట
గావలె' ననుఁ; గాని, కాదనవెఱచు."
ననుటయు, గాంధారి యచ్చోటనుండి
మనుజులమాటకు మది నొచ్చి పలికె:
"క్షితిపతి [6]నన్ను నిచ్చితినన్నమాట
ధృతరాష్ట్రునకు నేను దేవి నై నట్ల;
పతి యతఁడేకాక, పరికింప [7]నాక
పతియైన, మఱి రతిపతియైన నొల్ల.
సింధురశతములఁ జెనకు బలాఢ్యుఁ
డంధుఁడై రాజ్యమదాంధుఁడు గాఁడు.
చతురుఁడు, జ్ఞానలోచనసహస్రాఢ్యుఁ,
డతని నూరక యంధుఁడన నెట్లువచ్చు!
ధృతరాష్ట్రునకులేనిదృష్టి నా కేల!
హితమతిఁ జూడుఁడీ యిందఱు!" ననుచు
బంగారుపట్టంబు పడఁతి దెప్పించి,
పొంగారువేడ్కఁ గప్పురము మెత్తించి,
సోగలై మెఱుఁగెక్కు సొబగుకన్నులను
బాగులై లేనవ్వు పర్వమై నిక్కు
చెంగావికొలుకుల సిగ్గుకందువలఁ
దొంగలిఱెప్పల దొరయునేత్రముల
మూయించెఁ; బతినింద మును జేసియున్న
దాయలనోళ్లెల్లఁ దా మూసె ననఁగ.
అప్పు డాగాంధారి నర్థిఁ బూజించి,
తప్పక పసిఁడియందల మెక్కఁ బనిచి,
తోయజాక్షుల దానితోడఁబుట్టువుల
నీయెడఁ దొమ్మండ్ర నిచ్చితిననుచు
జనపతి రప్పించి, శకునిఁ దోడంపి,
యనిచెఁ గాంచనకోట్లు నందఱ కొసగి;
యనిచినఁ గొనితెచ్చి, యాపగేయునకు
జనపతికూఁతుల శకుని చూపుటయు,
నొక్కలగ్నంబున నువిదలఁ బెండ్లి
యక్కొడుకునకును నతిభక్తిఁ జేసి,
గాంధారపతులకుఁ గట్నంబు [8]లీయ,
బంధుసామగ్రి యేర్పడ సంతసిల్లె.
ఘనుని నిశ్చలుని సంగ్రామభైరవుని
నిననిభతేజుని నింద్రవైభవుని,
శరనిధిగంభీరు సన్నుతాకారు
భరతవంశేశునిఁ బాండునిఁ జూచి :
‘యితనిచేఁ గురువంశ మెల్ల వర్ధిల్లు;
నితనిపెండిలి సేయ నెలమిమై వలయు'.
ననియని విదురాదియాప్తులతోడ (?)
ఘనుఁడు భీష్ముఁడు ప్రసంగముసేయుచుండె.
పాండురాజు కుంతిని వివాహమాడుట
అంతట, యదువంశ్యుఁడగు శూ -- సుతకుఁ
గాంతాలలామకుఁ గమలనేత్రకును
గుంతిభోజుఁడు తన్నుఁ గూఁతుగాఁ బెనిచి
సంతసింపఁగ నొప్పు సౌభాగ్యవతికిఁ ,
జెలఁగి దుర్వాసుఁ డిచ్చినమంత్రశక్తి
నెలమి మానవులకు నెఱుఁగరాకుండఁ
జండాంశువలన నచ్చపువజ్రకవచ
కుండలాలఁకృతు గురుయశోధనుని
ఘనుఁ గర్ణుఁ గని తనకన్యాత్వహాని
జనియింపకుండఁగఁ [9]జరియించుసతికిఁ,
బృథయనఁ గుంతినాఁ బెంపువహించి
ప్రథితనామంబులఁ బరగుకోమలికి
నలరు స్వయంవరమనువార్త పుడమి
వెలయంగ మ్రోయుట వేగుచే నెఱిఁగి,
యంతట నొక్కనాఁ డాపగేయుండు
కుంతిభోజునికూఁతుఁ గుంతియన్ దాని,
మద్రరాజతనూజ మాద్రియన్ దాని,
భద్రాత్ముఁడైన యాపాండురాజునకు
వీరస్వయంవరవిధిఁ దెచ్చి యిచ్చెఁ.
గోరి నూర్వురఁబెండ్లికూతుల మఱియు
నక్కడక్కడఁ దెచ్చిఁ యాంబికేయునకుఁ
దక్కక వంశవర్ధనకాంక్ష నిచ్చి,
పాండుని యువరాజ్యపట్టంబు గట్టె.
............ ................ ............ ..........
పాండురాజుదిగ్విజయము
చంద్రప్రకాశుఁడై జగతిపై నతఁడు
సాంద్రవైభవముల జనులెల్లఁ బొగడ
సుఖలీలఁ దనరుచు, శూరాగ్రగణ్యుఁ
[10]డఖిలదిగ్విజయార్థ మరుగంగఁ దలఁచి,
పటుమతిఁ జతురంగబలములు గొలువఁ,
గుటిలారి నరపాల కులశైల వజ్ర
[11]తులితుఁడై తొలితొల్లి తూర్పున కేఁగి,
బల[12]సమగ్రుల నరపతుల సాధించి,
యట దక్షిణమునకు నరిగి, మార్కొనిన
పటుభుజాబలుల భూపతుల నోడించెఁ;
బడమటి కరిగియు బహుధరాధిపులఁ
గడిమిమై నసమసంగరమున గెలిచె;
నుత్తరంబునఁ గల్గు నుర్వీశవరుల
నొత్తి యుద్ధంబున నుదుటెల్ల నణఁచి,
[13]యుల్లాసముననుండి యుర్వినల్దెసల
నల్లనల్లన నొత్తి యరుల సాధించి,
యక్కజంబుగ బల్మి నట వారిచేతఁ
బెక్కుగజంబులఁ, బెక్కుగుఱ్ఱముల,
రమణీయగతి నవరత్నరాసులను,
బ్రమదాజనంబుల, బహువస్తువితతిఁ
గప్పంబుగాఁదెచ్చె; గనకాంబ[14]రంబు
లుప్పతిల్లినమాడ్కి [15]నూరివారెల్లఁ
గ్రిక్కిఱియఁగ, నాంబికేయుండు ధనము
తక్కక వేడ్కతోఁ దనచేతికొలఁది
నాలయంబులకు, దేవాలయంబులకు,
బాలాది[16]వృద్ధాంతపౌరమండలికి,
బంధువర్గములకు, బ్రాహ్మణోత్తముల,
కంధాదిదీనుల, కతిథికోట్లకును,
బేదసాదలకుఁ, బెంపారబంధులకు,
నాదట సఖులకు, నాశ్రితావళికి,
బంధురాత్మకులకుఁ, బరహిత సత్య
[17]సంధ సత్పురుష సజ్జనవరేణ్యులకు
బాగొప్ప వెచ్చించి, పదియశ్వమేధ
యాగంబులను జేసి యది తెగకున్నఁ,
దమ్మునిశక్తికిఁ దలపులో మెచ్చి
యిమ్ముల ననురాగ మెసగంగ నుండె.
పురుకుత్స సగర పురూరవులాది
కురుమహీశులఁ బోలి కొమరు దీపించి,
యాపాండుఁ డంత నేకాతపత్త్రముగ
నేపారఁగా ధాత్రి యేలుచునుండె.
పాండురాజు శాపోపహతుఁడగుట
అంతఁ, జంద్రునిలోనిహరిణంబునైన
వింతగా నలయించి వెసఁ బట్ట నేర్పు,
నింగినైనను జొప్పు నెమకంగనేర్పు,
సింగమైనను వ్రేయఁ జిక్కిననేర్పు,
లలిఁ గాలినైనఁ గాల్నడఁగూడునేర్పు,
శిలనైన నొకనందు చేకొనునేర్పు,
నిలువున మ్రాఁకులై నిలువంగనేర్పుఁ
గలుగుకిరాతు లొక్కట నొక్కనాఁడు
కోకతాలికతలల్, కోర[18]చిందములు,
వాఁకైనయురితీఁగె, వట్టుబొంగులును,
నెఱయఁ జొత్తిల్లిననిడుదకన్నులును,
గఱకులై మిడిసిన కావిమీసములు,
నమలియీకెలు, నిల్వనాటినతలలుఁ,
జుమచుమనైన నెత్తురుచుక్కబొట్లుఁ,
[19]గంపులు పుట్టెడు కఱకందుమేను,
లంపచిప్పతోడ నలరుహస్తములు,
బీరనరంబులు, బిగువుపిక్కలును,
దోరవన్నియచెప్పుదోయినిఁ గలిగి,
వసుధకు డిగ్గిన వానకాళ్లనఁగఁ
గసరున నెసగుసాగర [20]వీచు లనఁగఁ
బొరిపొరి నేతెంచు భూతంబు లనఁగ
నరులచూడ్కికి వింత ననుప చేయుచును,
నినుపు పున్నమనాఁటి నెలలునుబోలె
ఘనపుండరీకభీకరకరు లగుచుఁ,
జౌలసంస్కారవిశాలురు పోలె
నాలోల కాకపక్షాంకితు లగుచుఁ,
బొనర మేడలమీఁది పురజనుల్ పోలె
ఘనజలమార్గవీక్షణపరు లగుచుఁ,
గనుఁగొన నుగ్రరాక్షసులును బోలె
ఘనరామలక్ష్మణాగ్రహయుక్తు లగుచుఁ,
దెమలనిమృగములఁ ద్రెవ్వనేయించు
తమకాన నందఱుఁ దమకాన నుండి
యరుదెంచి, పాండున కతిభక్తి మ్రొక్కి,
కరము చక్కనితూపు కానుక యిచ్చి,
[21]నాదారుటెఱుకుల కాధారమైన
యాధారుణీపతి కప్పు డిట్లనిరి :
"ఏమున్నయడవిలో నిభపురాధీశ,
భూమికివ్రేఁగైన భూరిజంతువులు
మాయలవులరాక మాయలఁబెట్ట,
నాయుగ్రవిధముల కాత్మలోవెఱచి
వచ్చినారము; నీవు వాని వధింప
విచ్చేయుటకు వేఁటవిన్నాణమునకు.
అందలిమృగముల యదటుగర్వములు
పొందుగా నవధరింపుము ; ధాత్రిఁ గొంత
త్రవ్వి, పాతాళవరాహంబుఁ దెచ్చి,
క్రొవ్వునఁ దమకదుపుఁ గూర్తుమన్నట్టు
లఱ్ఱులావెసగ మహావరాహములు
మిఱ్ఱుపల్లము గాఁగ మేదిని గ్రుచ్చి,
యెత్తిన బిగువున నించుకతడవు
నెత్తి భారముమాన్పు నిజము శేషునఁకు;
బులిరక్కసునిఁ జంపి పులితోలు గట్టి
పులినోరికండ యెప్పుడు వ్రేల నిఱికి
హరుఁ డున్నవాఁడని యాతనిమీఁది
[22]గుఱి కమార్గములందుఁ గూడెనో యనఁగ
బబ్బరింపుచు గుంపుబలసి గుబ్బులుగ
బెబ్బులు లుబ్బులు బెరయ వర్తించుఁ ;
జెలఁగుచు గుహలలోఁ జీకటి[23]వెడలి,
తల కేలు కాలు చైతన్యంబు వచ్చి,
యరిరాజచంద్రుని యచలాగ్రమెక్కి,
గుఱుతుగాఁ గుధరంబు గోరాడ ననఁగ
వెల్లమోరలతోడ వెదుళులు ప్రాఁకి,
భల్లూకములమూఁక భయము పుట్టించుఁ;
గొండలు గోరాడి, కొమ్ముల నొడల
గండెక్కి యెఱ్ఱరేగడిమన్ను మెఱయ,
మొసళులమడుగుల మునిఁగి, యాఁబోతు
లెసగి యల్లనమోము లెత్తి యల్లార్చి,
ముక్కులు బిగియించి ముదురూర్పుపుచ్చుఁ ;
జుక్కలగతి మిన్ను సోఁకుదుప్పులును,
లాసికటారికోలలు పట్టి యాడు
మాసటీలునుబోలె మసలక డాసి,
కొమ్ములరవళి దిక్కులఁ గప్పుదుప్పు
లిమ్ములఁ బోరాడు నిలపెల్లగిల్ల;
భువినుండి యొకయిఱ్ఱి పుటముగా నెగసి,
ప్రవిమలచంద్రులోఁ బడఁ దాటెఁ దొల్లి;
యంతవారము నేము నగుదుమన్నట్లు
వింతగా నిఱ్ఱులు వినువీథి దాటుఁ ;
బెరిగినపెక్కువఁ బెక్కుమెకములు
నురవడి మెఱయును నొక్కొక్కచోట;
నన్ని తూపులఁగాని యణఁగమన్నట్లు
మున్నాడి యేదులు ములుచూపు మాకు;
మూరిబోఁ బెరుగు చమూరుమృగంబు
లూరినచీఁకటి [24]నొంటిఁబోనీవు ;
కడఁతులలెక్క యెక్కడఁ బట్ట[25]వచ్చుఁ !
గడలేవు హరి ఖడ్గ కరి శరభములు;
సబలత వానిమాంసము చూచి డేగ
శిబిమాంస మడుగుట సిగ్గుగాఁ [26]దలఁచు;
నెఱయ నొక్కొక్కటి నెఱిచూపియున్న,
[27]నెఱి జగత్త్రయమును నీరసంబగును ;
ఓలి నొక్కొక్కటి యుగ్రతనెదురఁ,
గాలానలంబైనఁ గఱిబొగ్గువడును;
నెమ్మి నిన్నియుఁ గూడి నీటికి డిగిన,
నమ్మడుగునఁ జిక్కు నడుసును మీలు;
నవి రాజులునుబోలె నాత్మవైరమున
భువి భీతులునుబోలెఁ బూరిమేయుచును,
ధరఁ బక్షులునుబోలెఁ దగ [28]నెగురుచును,
బొరిపొరి మ్రుచ్చులుపోలెఁ ద్రవ్వుచును,
జెడనికాపులువోలెఁ జేనుప ట్టరసి,
కడుఁ [29]గొలంకులువోలెఁ గనుమలు త్రొక్కి,
[30]కూరిననెలవోలెఁ గొమ్ములు [31]పొదలి,
[32]కారుమొగిళులుపోలెఁ గంకుచు వచ్చి,
పెద్దకందయుఁబోలెఁ బిల్లలఁ బొదివి,
తద్ద ధూర్తులువోలె ధరకు వ్రేఁగగుచుఁ,
బుట్టజున్నులుపోలెఁ బుటపుట నగుచు,
నిట్టప్రౌఢలుపోలె నెందు వెల్వడక,
గడి భూమిప్రజవోలెఁ గడుబెదరుచును,
సుడి భిక్షకులువోలె శునకవైరమున,
నరఁటిమ్రాఁకులుపోలె నటపొరలెక్కి,
పొరిఁ గర్ణధారులుపోలె గాడ్పె [33]ఱిఁగి,
భువి విరహులుపోలెఁ బొదరిండ్లు దూరి
వివిధరూపులనుండు; వేయేలచెప్ప!
నాశచేసెదమన్న నడఁగవుమాకు;
మాశరమ్ములవాఁడి మాసె ర" మ్మనినఁ,
బాండుభూపతి వేఁటపై నాసపుట్టి
పొండు వచ్చెద నని బోయలఁ బనిచి,
యన్నకు నెఱిఁగించి యనుమతి వడసి,
సన్నుతిఁ దనమంత్రిసంఘంబుతోడ
గొల్లెనకంబాలు గొడుగులుఁ బడగ
లల్లికవలమోపు లమ్ములబండ్లు
మెత్తనిశయ్యలు మెఱుఁగుకొప్పెరలు
ముత్తియంబుల పవడముల పల్లకులును
బసిఁడిమంచములును బట్టు మేల్కట్లుఁ,
బొసఁగ సరాతులు బోనకావళ్లుఁ
బరిచారకులుఁ బాఁడిపసులు బియ్యములుఁ
బరిమళవస్తుసంపదలు నేతేరఁ,
జపలాక్షు లిర్వురు సంప్రీతిఁగొల్వ,
విపులయాత్రాభేరి వేయించి కదలి,
కరి రథ సుభ టాశ్వ ఘన [34] పాదధూళి
యరుణున కరుణత్వ మచ్చుగాఁబొదువ,
దారుణహిమశైలదక్షిణాటవుల
వీరప్రతాపుఁడై వేఁటలాడుచును,
వాహనంబులు వెంటవచ్చుటె గాని
సాహసంబునఁ బాదచారంబు గలిగి,
నదులైన నీఁదుచు, నగములమీఁదఁ
బొదలైన నెక్కుచుఁ, బులి పంది వెనుక
చఱినైన నుఱుకుచు, సాగనిపూఁట
[35]నెఱచైన నమలుచు నీరీతిఁ [36]దిరిగి,
తెరవేట వలవేట ధృతిజొంపువేట
మఱి [37]మఱివిడివేట మచ్చువేటయును,
గంటవేటయు వేడ్కగలకోలవేట
వెంటవేటయు నిడువేటయు నాడి,
యొఱపులై క్రొవ్వి మిన్నొరయుజంతువుల
నఱికివ్రేసియు, మఱి నాటనేసియును,
జించియు నొంచియు జీవనాళములు
త్రెంచియుఁ ద్రుంచియు ధృతినొక్కయెడల
నుంకించియెగసిన యుగ్రపుమృగముఁ
గొంకులునఱికియు, గొందిలోనిఱికి
గవినుండివెడలక గాఱించుమృగముఁ
దవిలిపట్టించియుఁ, దగులసేసియును,
జొంపులోపలదాఁటి సురిగినమృగముఁ
బుంపులుపుచ్చియుఁ, బోవనిచ్చియును,
తెంకిచేరక యొంటిఁదిరిగెడుమృగము
దొంకలుమూసియుఁ, ద్రోవ సేసియును,
వలఁజొచ్చిమించి యావల నేఁగుమృగము
నలి నడ్డగించియు, నడుముఁద్రుంచియును,
బిలమాక్రమించుచోఁ బిల్లలఁబొదివి
బలముననోండ్రించి పాఱినపంది
మననువట్టక టెంకిమగుడఁజేరినను,
గనికరంబున దానిఁ గాచిపుచ్చియును,
ఈరీతి వేఁటాడి యిభపురికతఁడు
తోరంపుమృగకోటిఁ దోడ్తోడ వేడ్క
నన్నకునిమ్మని యనిసిపుచ్చుచును,
విన్నాణమగువేఁట విడువంగలేక
యతిమృగయాసక్తి నాదశరథుఁడు
....... ........ ........ ......... ......... ........
....... .......... ......... ........... ........ .......
....... ......... ......... ........ ........ ........
ధర వేట మున్ను సప్తవ్యసనములు
[38]నిరవొప్పఁ గీడని యెదఁ గానలేక
తనపాలివిధి తన్నుఁ దవిలిప్రేరేప
ననఘ, కార్యాకార్య మది యెఱుంగకయు,
నిది చంపఁదగినది, యిది కావఁదగిన,
దిది యది యనుబుద్ధి యిసుమంతలేక,
యటపోయి యటపోయి యద్రులు గడచి,
కుటిలమహాటవీకోట్లును గడచి,
మునులున్నయాశ్రమంబులు పెక్కు గడచి,
యొనరఁ గార్యాంధుఁడై యొకనాఁటి వేఁట
లేడియిఱ్ఱియు రెండు లీలఁ గ్రీడింప
నోడక యేసిన, నుఱక మూర్ఛిల్లి
తెలిసి యొయ్యనఁ గన్ను తెఱచి యాయిఱ్ఱి
పలికె మానుషభాషఁ బార్థివోత్తముని :
"ఓపాండుభూవర, యోరాజచంద్ర,
యీ పాపమున కొడి యేల గట్టితివి !
పగఱపై నీబాణపస చూపలేక,
మృగములమీఁదనే మెఱసి చూపితివి.
పోలేక రతిసౌఖ్యములనున్న మమ్ము
నేల యేసితివి! యి ట్లేయంగఁదగునె!
మించి నీకు వధింప మృగములు లేవొ !
పొంచి మావిధమంత పొడగానవైతి.
తెగనేయుమృగమును, దెగనేయరాని
తగవెఱుంగక యేలదాయవై తిపుడు!
అలసి మేయుచునున్న యాఁకొన్న మృగముఁ,
జులకగాఁ బోలేక చూల్గొన్నమృగము,
నీరాసఁగా వచ్చి నిలిచిన మృగము,
నీరీతి రతికేళి నెనసినమృగముఁ,
మూలకు ముట్టుగా ముదిసినమృగముఁ,
బోలేక మృగములఁ బొదివినమృగము
బోయయు నేయఁడు; భూపాల, తగునె!
నాయంబు దప్పితి నాయెడాటమున.
తగునయ్య! యేను గిందముఁడను మునిని;
మృగమాత్రమని చూచి మేను మఱచితివి;
అతివయు నేనును హరిణరూపముల
రతిసల్పుచున్నవారము వేడ్క పుట్టి.
అది యెఱుంగక యేసి తకట! యోరాజ;
మొదలంట మాప్రాణములు నిల్వ విఁకను.
ప్రతిలేని యీపాపఫలమున నీవు
సతిఁ గూడినప్పుడె చత్తువుగాక;
మానినియును నీకు [39]మాద్రి సహాయ
మౌ." ననిశపియించి, యాలును దానుఁ
బరలోకగతుఁడయ్యెఁ; బాండురా జపుడు
తరుణులఁ జూచి, యెంతయుఁ జిన్నవోయి,
శరములుఁ జాపంబు జారంగ విడిచి,
తొరఁగెడుకన్నీటితో వెచ్చనూర్చి,
యనలసంస్కారంబు లామృగంబులకు
నొనరించి, సరసిలో నుదకంబు లిచ్చి,
'యధమత్వ [40]మీగతి నందితి' ననుచు
విధి నాత్మదూఱుచు వేదనతోడఁ
గొండొకద వ్వేఁగి [41]గొంతులఁ బలికె :
“పొండు మి మ్మనిపెదఁ బురవరంబునకు;
నత్తల సేవించి యట నుండుఁ డీరు;
తత్తరించినఁగాదు; తప్పెఁగార్యంబు;
మనచేత మునులును మరణంబుఁ బొంది
మనకును నొకకీడు మఱి చేయకుండ్రె!
ఇంక నెక్కడిరాజ్య! మిం కేటిసుఖము!
ఇంక నా కీశాప మేమిటఁ దిరుగు!
వలనొప్పఁ గౌరవాన్వయపయోరాశి
బలమఱి యీశాపబడబాగ్ని నింకె!
........ ...... ...... ....... ....... ....... .......
కడ తేరె నీశాపకాలాహిచేత.
నే నింక భోగంబులిన్నియు విడిచి,
మానావమానముల్ మమతయు విడిచి,
సకలపాపంబులసమితియు విడిచి,
ప్రకటితనిజకర్మఫల మాసవడక,
యడవిని నిత్యఫలాహారనియతిఁ
గడపెదఁ గాలంబు కడముట్ట నిపుడు ;
పుడమి యేలఁగ నాకు బుద్ధిగా; దింకఁ
గడుఘోరతపము నేఁ గావింతు నిచటఁ;
గాన, మీకిప్పుడు కానల నవయఁ
గానేల! చనుఁడింకఁ గరిపురంబునకుఁ;
జని, యెల్లవారి కీచందమంతయును
వినిపింపు." డనిన, నవ్వెలఁదు లి ట్లనిరి:
"పాయనోవము నిన్ను బాండుభూపాల!
యేయనువుననైన నేము విచ్చెదము,
అకట! శంతనువంశ మణఁగినచోట
నొకభాగ్యమహిమచే నుదయించి తీవు.
కులము నిల్పెదవని కోరియుండంగఁ
గలిగెనే నీ కిట్టి కారణావస్థ!
ఏమి చేసిన నాఱు నీపాతకంబు!
........ ......... .......... ......... ........
రతిలేక యుండవు రాత్రి యెన్నఁడును;
రతి చేసి తనియవు రమణ, యెన్నఁడును.
పరఁగ నిప్పటినుండి బ్రహ్మచర్యంబు
చరియింపనోపుదే జగదీశ నీవు!
ఇది పురాతనదోష మే మనఁగలదు!
విదితాత్మ, నీ వింక వినుము మామాట ;
శైలాటవుల నొంటిఁ జరియింపవలదు
లాలితజటలవల్కలములుఁ దాల్చి :
యడరి వానప్రస్థ మనునాశ్రమమున
నడపుము మమ్మును నరనాథ, కూడి.
ప్రాణేశ, ని న్నేము పాయుదుమేని,
ప్రాణంబులును మమ్ముఁ బాయు నాక్షణమె.
సతితోడ రామభూజనపతి గూడి
ధృతిపట్టి యడవి వర్తింపఁడే మున్ను!
అటుగాక, నిను బాసి హస్తినాపురికిఁ
బటుభంగి నరుగంగఁ బదము లెట్లాడుఁ!
బొనరంగ మధ్యాహ్నమున నిట గ్రుంకి,
యనలుని వ్రేల్చుచు నతిథిఁ బూజించి,
జలములఁ బితరుల సంత[42]సపెట్టి,
నిలువవె! మాకును నీడ యయ్యెదవు. "
అని పాదయుగళిపై నబలలు పడినఁ,
దనకరంబుల నెత్తి ధారుణీశ్వరుఁడు :
"మీరు చెప్పినయట్లు మృగనేత్రలార,
కోరి వర్తించెదఁ గొంక నేమిటికి!
పాయక హృదయంబు పదిలమౌ నేని,
మేయాశ్రమంబైన నేమియుఁ గాదు.
మనవెంట వచ్చినమంత్రులనెల్ల
ననిచెద వస్తువాహనములతోడ.
పోయినవారలు భూనాథుతోడ
నాయున్న యునికి విన్నపము చేసెదరు;
పూనెదఁగాక తపోభార." మనుచు
మానినీసహితుఁడై మానవేశ్వరుఁడు
జడలు వల్కములు శాంతిమైఁ దాల్చి,
యడలుచునున్న సైన్యము వీడుకొల్పి,
తమభూషణంబులుఁ దమవస్త్రములును
గ్రమముతో భూసురగణముల కిచ్చి,
తక్కినధనములు తనయన్న కప్పు
డక్కజంబుగఁ బంపి, యతినిశ్చయముగ
నిందుబింబాస్యల నెలమిఁ దోకొనుచుఁ
గందమూలముల నాఁకలి దీర్చుకొనుచు
మునుకొని యుత్తరముఖముగాఁ గదలి,
మునులెల్ల విస్మయంబుగఁ జూచి పొగడ
నయగుణోజ్జ్వలుఁ డంత నాగశైలమును
రయమున నట చైత్రరథమును గడచి,
తొలఁగక చనిచని తుహినాద్రి దాటి,
యలఘుపుణ్యుఁడు గంగ నట యుత్తరించి,
సురసిద్ధసేవ్యమై సొం పగ్గలించి
ధరనొప్పు గంధమాదనమున కరిగి,
గురుమతితో హంసకూటంబు గడచి,
పాండురాజు శతశృంగమందుఁ దపమొనర్చుట
యల్లన శతశృంగమను గిరిచేరి,
చల్లని నవపర్ణశాల గావించి,
యందు దేవేంద్రాదు లచ్చెరువంద
నందంద తపము సేయఁగ, నొక్కనాఁడు
పిన్నలయ్యును శాంతిపెరిగినమునులు,
నెన్నియుగంబులో యెఱుఁగని మునులుఁ,
గన్నున హరిఁగాని కాననిమునులు,
హరి వచ్చి 'వర' మన్న నడుగనిమునులు,
హరిరూపు హరురూపు నందినమునులుఁ,
బెంపార మఱియును బెద్దలౌ మునులు,
గుంపులుగుంపులై కోటిసంఖ్యములు
పుణ్యులు, ఘనులు, సభ్యులు, యశోధనులు,
గణ్యులు, విబుధలోకస్తోత్రమతులు,
సత్యసంధులు, మహేశ్వరపదధ్యాన
నిత్యులు, వరతపోనిధులు మోదమునఁ
బోవఁగాఁ, బొడగాంచి భూపాలకుండు
దేవీసహాయుఁడై తెరువునఁ గూడి
వారివెంటనె పోవ, వారు వీక్షించి
భూరాజుగాఁ దలపోసి యిట్లనిరి:
"ఎవ్వరు నీ! వేల యిట్లు మావెంట
దవ్వని తలఁపక తలఁగి వచ్చెదవు?
నెలఁతలు రాలేరు నిలువు మిచ్చోటఁ;
దెలియు మింతటినుండి దేవమార్గములు :
సురమునీంద్రుల మేము; సురలకుఁ గాని
నరులకు మావెంట నడచిరారాదు."
అనుటయు, దీనుఁడై యప్పాండురాజు
తనపేరు చెప్పి యందఱకుఁ గేల్మొగిచి :
"యేనును వచ్చెద హితపుణ్యులార,
మానిను లలసిరి మముఁ గూర్చుకొనుఁడు.
నారు లెన్నఁడుఁ దొల్లి నడచినవారు
గారు; త్రోవల [43]చక్కిగరగరగాదు.
ఏమితీర్థంబుల కేఁగుచున్నారు?
హేమాద్రి కేఁగుచో నెఱిఁగింపుఁ”. డన్న
మౌనులు పలికిరి మనుజేశుఁ జూచి:
"కానఁబోయెద మేము కమలసంభవునిఁ;
బోయి, యమావాస్యపుణ్యకాలమున
నాయన సేవింతు రమరులు మునులు.
ఇంద్రాదిలోకంబు లిన్నియుఁ గడచి
చంద్రవంశాధీశ, చనవలె మాకు.
ఎంతవారలకైన నింతటినుండి
సంతతిలేనిచోఁ జనుదేరరాదు.
లోలత నొకబ్రహ్మలోకంబయేల !
యేలోకమున[44] లే దపేతపుత్త్రునకు.
సంతానలాభంబు జననాథతిలక,
చింతింపు; మది నీకు సిద్ధింపఁగలదు.
వరసుతుల యమ వాయు వాసవాశ్వినుల
వరమునఁ గాంచెదు వంశవర్ధనుల".
అని నిల్పి పోయిన, నాతండు మరలి
చనుదెంచి, ఖిన్నుఁడై సతిఁ గొంతిఁ బలికె :
"మానిని, చూచితే! మనల నేర్పఱచి
మౌనులు పోయిరి మఱి కూడనీక.
ఉన్నతి సంతానమొకటి తప్పించి
యన్నిభోగంబులు ననుభవించితిమి
కలదొకొ పుత్త్రునిఁ గన్నారఁ గానఁ!
గలకంఠి, యట్టేల గలుగుఁ బాండునకు!
పుత్త్రలాభములేనిబొంది నాబొంది,
ధాత్రి నుండిన నేమి! తప్పిన నేమి!
సంతతి గలదని స్వర్గలోకమున
కింతి, పోదముగాక యిందఱియట్ల.
ధృతి 'నపుత్త్రస్య గతిర్నాస్తి' యనెడు
శ్రుతివాక్యమున్నది శూలమై చెవుల.
ఎంతతపంబున నేధర్మములను
నింతి, గల్గఁగ నేర విహపరోన్నతులు.
అది విచారించి, మీయందు నందనుల
ముదమునఁ బడయంగ మొగి నాకురాదు.
మృగశాపభయ మాత్మ మెఱయుచున్నదియు ;
[45]సుగతి నాకిక యెట్లు చొప్పడఁగలదు!
క్షేత్త్రజన్యాయంబు చింతించి, నీవు
పుత్త్రులఁ బడయుము భువి నిందరాదు.
నాయాజ్ఞ సేయుము నాతి, పుణ్యంబు
వేయిచోట్లను నేను వింటి నాక్రమము,
ప్రబలధర్మములకుఁ బ్రబల మీచంద;
మబల, నీ వింక నాయనుమతంబునను
దలఁపఁగ ధర్మసంతతి గాంచితేని,
పొలుపార నాకబ్బుఁ బుణ్యలోకంబు.
లనువార దేవరన్యాయంబునందు
ఘను శ్వేతకేతునికథయును వినవె!
ఏము జనించితి మీప్రకారమున;
భామిని, పిలుతునా! బ్రాహ్మణు;" ననినఁ :
“బతివి నీవైయుండ భరతవంశేంద్ర,
యితరుని మనసులో నెట్లు నిల్పుదుము!
పతి యేమి చెప్పినఁ బని వడి సేయ
కతివల కుండుట యధికపాతకము,
తలఁప, నీవలననె తనయులు మాకుఁ
గలుగు నుపాయంబు గావింపు; మిదియె
తపము సేయుట; మేలు దపమునఁ దొల్లి
[46]వపితాశ్వు సతికి దైవం బిచ్చె సుతుల,
'పుత్త్రులు దేవాంశమునఁ బుట్టఁగలరు
ధాత్రి నీ ' కన్నారు తపసులు వినవె!
నీ వేమి చెప్పిన నీ చెప్పినట్లు
గావింతు; మిం తేల కడఁక [47]నీ కిపుడు!
తమకింపవల." దని తరుణి యాడుటయు,
రమణుఁ డిట్లను: "నోర్వరా దంతతడవు;
తనువు లెవ్వఁడు నమ్మెఁ! దలఁచిన ట్లగునె!
'దినహాని శుభములు దిను' నని వినవె!
ఇంతి, సేయుదుగాక యేఁ జెప్పినట్లు;
కాంత, వేగమె పిలు ఘను నొక్కమునిని;
మానినిఁ బనిచి కల్మాషపాదుండు
పూని వశిష్టుచేఁ బుట్టించె సుతుని;
మామతేయునిఁ దెచ్చి మగువతోఁ గూర్చి,
యామగధుఁడు తొల్లి యాత్మజుఁ గాంచె;
సందేహ మేటికి సాధ్వి నీ?" కనిన,
నిందువంశ్యునిఁ జూచి యిందీవరాక్షి :
ధర్మజు జననము
"యేవేల్పుఁ దలఁచిన, నేతెంచి నాకు
నా వేల్పు నందనుండై యుదయించు.
మంత్రంబు గాంచితి మనుజేంద్ర, తొల్లి ;
తంత్రజ్ఞ, యేవేల్పుఁ దలఁపుదు?" ననిన,
వాడినసస్యంబు వాన గన్నట్లు
చేడియమాటకుఁ జెలఁగి పార్థివుఁడు :
"సుందరి, సుతుమోముఁ జూడ నేఁ గంటిఁ;
గిందవుశాపాగ్ని కిందవునింక.
[48]అందనిపండ్ల నే నందంగఁ గంటి;
విందవు నామాట వృథ సేయవైతి.
మందవు [49]మంత్రంబు మహిఁ బుణ్య[50]ఫలము
[51]మందుఁడ నాకుఁగా మగువ, నేర్చితివి.
సకలలోకముల కాస్పదమై, ధరిత్రి
సకలధర్మములకు సదనమై వెలసి,
సమవర్తనంబున సమవర్తి యనఁగ
నమరవేల్పులలోన నధికుఁడై మించి,
సకలజీవులయందు సమచిత్తుఁడైన
యకలంకుఁ దలఁపుమ యాత్మలోశముని.
పితృపతి యాతండు బిడ్డఁడై వెనుక
పితరులఋణమెల్లఁ బ్రియముతోఁ దీర్చు."
అనినఁ బ్రదక్షిణం బతనికి వచ్చి,
వనిత యాదుర్వాసుపరమంత్రమహిమ
నంతకుదెసకువై హస్తముల్ మొగిచి,
కాంత సద్భయ[52]యుక్తిఁ గడుభక్తితోడ
యమునిఁ బ్రార్థించిన, నారాత్రి వచ్చి
రమణికోరిన ధర్మ [53]రాజు నీ వలచి,
ముదమారఁగా యోగమూర్తి ధరించి,
సదయుఁడై వరమిచ్చి సమవర్తి యరిగె,
అరిగిన, నాతనియంశ[54]౦బువలనఁ
గరియాన యొకయేఁడు గర్భంబు దాల్చి,
ప్రోష్ఠపదంబునఁ బుణ్యమాసమున
జ్యేష్ఠాష్టమీరాత్రి సిద్ధయోగమునఁ
గుడికాలరేఖలై [55]గొడుగు కంబువును
బడగయు సామ్రాజ్యపద్ధతిఁ దెలుప,
భరత[56]వంశాంభోధిపంకజవైరి
నిరుపమకారుణ్యనిధి నిశ్చలుండు
ధర్మంబు రూపంబు దాల్చెనో యనఁగ
ధర్ము[57]నంశంబున ధర్మజుండనఁగఁ
బ్రభవించెఁ దనయుండు పంచగ్రహములు
శుభదృష్టిఁ గ్రుంకక చూచుచునుండ.
అప్పుడు సురలెల్ల నానందజలధిఁ
దెప్ప దేలిరి; మిగులఁ దెలిసె లోకములు;
దినపతి వెలుఁగొందె; దేవగానములు
విననయ్యె; నారదువీణ ఘోషించె ;
'పొదివినరణములో భూరివైరులకుఁ
జెదరక చంచలించక నిల్చుఁగాన (?)
నితఁడు యుధిష్ఠిరుం డీధాత్రి ' ననుచు
నతనికిఁ బేరిచ్చె నాకాశవాణి;
[58]తొడరిఁ 'యజాతశత్రుం డిత ' ౦డనుచు
నొడివిరి మునులు మనోవీథి నెఱిఁగి".
అని చెప్ప జనమేజయక్షమారమణుఁ
డొనరఁగ వ్యాసశిష్యునకుఁ గేల్మొగిచి :
"వనిత కామంత్రంబు వచ్చినతెఱఁగు
వినిపింపు." మని యడుగ వినిపించె నతఁడు :
కుంతి సౌరమంత్రోపాసన
"కుంతిభోజునియింటఁ గొండొకనాఁడు
కుంతి సన్మునులను గూర్చి, నిత్యంబు
హోన్నాణమున నెంతయొరసినఁ గూర
లన్నంబు పాయస మట్లు మాంసంబు
మొదలైన యిష్టాన్నములు వేడ్కఁబెట్టఁ,
బ్రిదులకు భోజనప్రియుఁడైన కతన
నొకనెల దుర్వాసుఁ డుండి భుజించి,
ప్రకటప్రియంబునఁ బల్కె నాసతికి :
“ఏను నీ కొకమంత్ర మిచ్చెదఁ గుంతి,
దానిసత్వమున బృందారకులైనఁ
దలఁచినఁ జనుదెంచి, తనయులై నీకు
నెలమిఁ బుట్టుదు." రని యిచ్చి పోవుటయు,
నామంత్రసామర్థ్య మరసెద' ననుచుఁ
గామిని యొకనాఁడు గంగకుఁ బోయి,
కర మర్థిఁ బొడుచుభాస్కరుఁ గోరి జపము
విరచింప, నతఁ డొకవిప్రుఁడై డిగ్గి
కదియుచో, లజ్జించి కరములు మొగిచి :
"యిది మంత్రసామర్థ్య మెఱుఁగలే నైతిఁ;
దప్ప నేటికి నేర్చుఁ దపసిమంత్రంబు!
ఎప్పటియట్లు నీ వేఁగవే దివికి!
కన్నియ నేఁ బుత్త్రుఁగనిన నవ్వుదురు;
మన్నించి పోఁగదే మార్తాండ!" యనుచు
నలినాక్షి ప్రార్థింప నవ్వుచు నతఁడు :
'పొలఁతి, యూర కవచ్చిపోరాదు నాకు.
కన్నెఱికము వెల్తిగాకుండ సుతుని
మన్నించి యిచ్చితి మది నియ్యకొనుము. '
అనుచు, సద్యోగర్భమనువిధానమునఁ
దనయుఁ దేజోమూర్తిఁ దనయంతవాని
నిచ్చి, కర్ణుండని యిలఁ బేరువెట్టి
[59]యిచ్చ దివాకరుం డేఁగిన, నింతి :
'తనయుని నక్కటా! తండ్రికిఁ జూపఁ
గొనిపోవలేదు; మక్కువఁ బ్రోవలేదు;
ఇల నాకు నక్కటా! యిటుమూఁగగన్న
కలయయ్యె; నూరకే గడఁగితి.' ననుచు
సహజకుండలములు, సహజవర్మంబు,
మహి నెవ్వరికిలేని మదనరూపంబుఁ,
గలిగినకర్ణు నక్కడఁ బాఱవైవఁ
దలఁపుపుట్టకయున్నఁ, దరళాక్షి కడకుఁ
గ్రందుగా నవరత్నఖచితమైనట్టి
మందసమొక్కటి మార్తాండుకృపను
ఏటివెంటనె వచ్చి యిక్కువ నిలువ,
....... ........ ........ ....... ....... .......
నాదిత్యసమవర్ణు నాకర్ణు నందు
నునిచి యంగన వోవ, నొయ్యన నదియుఁ
బొనరఁ జంపారాజ్యమునఁ బోవుచుండ,
కర్ణుఁడు సూతునకు దక్కుట
నాంబికేయుని మిత్రుఁడైన సూతుండు
కంబుకంఠులుఁ దాను ఘనజలక్రీడ
నుండి మందసఁ గాంచి యొయ్యనఁ దెచ్చి,
కుండలాంచితు నందుఁ గొడుకు వీక్షించి
మిన్నంది : 'యిదె నాకు మృడుఁ డిచ్చె సుతునిఁ;
దన్నితి ననపత్యతాదోషముఖము;
నీకున్న నెవ్వఁ డీయేఱులవెంట
నీక్రియ విడుచునే యిటువంటివాని!'
అని రాధ యనుదాని కాకర్ణు నొసగ,
వనిత చన్నులు చేఁపి వాని నేర్పునను
యౌవనప్రాప్తుఁగా నరసిన, నతఁడు
వేవేగఁ గృపునిచే విలువిద్య నేర్చి,
పోయి బ్రాహ్మణవేషమున రాము మొఱఁగి,
ధీయుక్తి సాధించె దివ్యబాణములు.
ఈ తెఱంగునవచ్చె నింతి కామంత్ర;
మాతరువాతివృత్తాంతంబు వినుము.
అంతన క్కడ మున్న యాపాండురాజు
చింతించి యనిచినసేనలు దొరలు
హస్తినాపురమున కడలుచుఁ బోయి,
వస్తువాహనములు వసుధాధిపతికి
నిచ్చి పాండునిచంద మెఱిఁగింప, నతఁడు :
"వచ్చె నాపద ; యిట్టివార్తయుఁ గలదె!
దిక్కెవ్వరున్నారు! తెఱచినయిల్లు
కుక్క చొచ్చినయట్లు కురుభూమి కింక
వత్తురు వైరులు; వారిపై నెవ్వ
రెత్తిపోయెడువార! లేఁగంటఁగాన.
వికటశాపాంధుఁడై విడిచి పోనేల!
యొకరీతి నాయొద్ద నుండినఁగాదె!
నాలుగుదిక్కులు నలువొప్ప గెలిచి,
యీలీల సంపద లిరవొందఁగలిగి,
కడపటఁ దనుబాసెఁ గడు[60]ఖేద మొదవఁ
బుడమి నాబ్రదుకంత భూజనుల్ నవ్వ.
రాజనుమాత్రుండె! రసికుఁ డాపాండు
రాజు; మావంశవర్ధనుఁ; డేడుగడయు.
అటువంటితమ్ముని నడవిమధ్యమునఁ
గటకటా! పోఁజేయఁగా విధి చేసె.
హా పాండుభూవర! హా గుణాధార!
హా పుణ్యఫలసార! యబ్ధిగంభీర!
అన్న! న న్నెవ్వ రిం కర్థి నొడలంటి
యెన్న నోమెడువార లెక్కడ గలరు!
నాపట్టుఁగొమ్మయ్యు, నాకన్నులయ్యు,
నాపుణ్యపదమయ్యు, నాతేజమయ్యు,
నాప్రతాపంబయ్యు, నాగర్వమయ్యు,
నాప్రాపు దాపునై నన్ను రక్షించి,
మన్నించి, తలిదండ్రి మఱపించి, నీవు
న న్నెట్లు పాసితి ననుఁగన్నతండ్రి!”
అని చాలభీతుఁడై, యంతఃపురమున
వనితలు వారింప వగచుచునుండె.
ఉన్నంత, ధర్మరా జుదయించువార్త
యన్నిదిక్కుల మ్రోసె; నట్లు మ్రోయుటయు,
కౌరవజననము
వ్యాసునివరమున వనిత గాంధారి
భాసురగర్భంబు పండ్రెండునెలలు :
మోచి, వేసరి: "యింక మోవ నే నోప;
నేచందమున మోతు నిది చాలవ్రేఁగు!
కన్నియవయసునఁ గడువేడ్క నేను
దన్ను నారాధింపఁ, దపసి వ్యాసుండు
'తనయుల నీ కిత్తుఁ దరుణి, నూర్వురను '
అనువరంబున కింతయాస నుండితిని.
ఏ నేమి పాపినో! యెందఱనైనఁ
గానంగ మీనునో కడునాసగాక!”
అని [61]కుంది, కుంతి తా నాత్మజు మున్ను
గనిన నెం[62]జెలిని నాకాంత రోషించి
ప్రేవులు పొదివింపఁ, బితరులు నవ్వ,
దైవ మంతట నవ్వ తనయులు నొవ్వ
ననయంబు తెగువతో నర్ధరాత్రమునఁ
దనకుక్షి కరములఁ దాటించుకొనిన,
మలఁగఁ బక్వముకానిమాంసపుముద్ద
గలఁగి ధారుణిఁ బాఱఁ, గడువేగ వచ్చి
ద్వైపాయనుండు గాంధారిఁ గోపించి:
"చాపలంబున నిట్లు సాధ్వి, చేయుదురె!
వరము బొంకైన నెవ్వారైన నగరె!
సరి, యిందు నందనశత, ముద్భవించు."
నని చెప్పి యా వేళ నలుగునఁ గోసి,
కనుఁగొన నూఱునొక్కటి పంచి వైచి,
కలసినవేదశాఖలఁ జిక్కుపుచ్చి
[63]చెలువారఁ బంచివైచిన పెద్దగాన,
నేతికుండలఁ బెట్టి నిత్యంబు నందు
శీతలజలములు చిలుక నేమించి
యేఁగిన, మఱియొక్క యేఁటికి వెనుక
వ్రేఁగున నొకకుండ విరియుచో, నందు
నండంబు పగిలిన యహివోలెఁ గ్రోధ
నుండగు దుర్యోధనుం డుదయించె.
నతఁడు పుట్టినవేళ నవని కంపించె;
హితవేది వర్షించె నెమ్ములవాన;
పగలు నక్కలు కూసె; భానుండు మాసె;
జగమెల్ల భేదించెఁ జండమారుతము.
అంత నొండొకభాండ మమ్మఱునాఁడు
వింతగా విరియుచో, వీక్షింప నపుడు
కామినీమదనుండు కౌరవవంశ
ధూమకేతువు పుట్టె దుశ్శాసనుండు.
భాండంబు లీరీతిఁ బ్రతిదివసంబు
నొండొండ పగులుచో నొప్పుగా నందుఁ
గర్ణ వికర్ణ దుష్కర్ణ జయంతు,
లూర్ణనాభుఁడు, సుబాహుండును, జిత్ర
దుర్మద దుస్సహ దుష్ప్రధర్షణులు,
దుర్ముఖ దుర్ధర్ష దుర్మర్షణులును,
విందానువిందాది వింశతి సహులు,
నందోపనందులు, నాగదత్తుఁడును,
జలసంధ సహులు, దుశ్శల శరాసనులు,
శల నంద వికటులు, సముఁడు దుర్జయుఁడుఁ,
గుండ మహాకుండ కుండోదరులును,
గుండజ దుర్మద కుండభేదనులు,
సనహుండు, దుర్విలోచనుఁ, డనామయుఁడుఁ,
గనకధ్వజుండు, విక్రాంతుండు, ప్రమధ
దండధరులు, మహోదరుఁ, డభయుండుఁ,
బండితభీతుండు, బహ్వాశి, పాశి,
దృఢధరుండును, దృఢాదిత్యకేతుండు,
దృఢవికటానన దీర్ఘబాహులును,
దీర్ఘభుజుండును, దీర్ఘజంఘలుఁడు,
దీర్ఘరోముఁడు, మఱి దీర్ఘకోపనుఁడు,
చిత్రసేన సుషేణ చిత్రదృక్కులును,
జిత్రవర్మ సువర్మ చిత్ర విచిత్ర
చిత్రాక్షులు, నమిత్రజిత్తనువాఁడు,
చిత్రబాహుండును, జిత్రకుండలుఁడు,
చిత్రాయుధుండును, జిత్రధ్వజుండు,
చిత్రాంగదుండును, జిత్రనేత్రుండు,
నుగ్రసాయకుఁడు, వ్యూఢోరు విరావు,
లుగ్రకర్ణోగ్రసేనోగ్రశ్రవసులు,
భీమ మహాబాహు భీమబాహులును,
భీమవిక్రాంతుండు, భీమవర్ణుండు,
సేనాధిపతి జయత్సేన సుహస్తు,
లానిషంగి, వివత్సుఁ, డపరాజితుండు,
నంతకాశనుఁడు, దురాచారయుతుఁడు,
నంత వికారాక్షుఁ, డాయలోలుపుఁడు,
గొనకొని వాతవేగుఁడు, సువర్చుండు
నన నూర్వు రుదయించి రనుపమబలులు.
ఆదివసంబున నంబికాసుతున
కాదట భార్య వైశ్యాపుత్రియందు
మతిమంతుఁడును, బుద్ధిమంతుఁడు, హితుఁడు,
చతురుండు, నయశాలి, సజ్జనో త్తముఁడుఁ,
బొదలు సుకీర్తినిఁ బొందు యుయుత్సుఁ
డుదయించె గుణవంతుఁ డుర్వీశుఁ డలర.
జనియించె భాగశేషంబున నొక్క
తనయ దుస్సలయనఁ దల్లి మోదింప,
నుతగతి నీరీతి నూటయొక్కండ్రు
సుతు లుదయించిరి సుకృతాధికమున.
అన్నిప్రకారంబు లటు మహాప్రేమ
తన్నాత్మ నలరింప ధరణిపాలుండు,
నలి జాతసంస్కార నామసంస్కార
ములు మునిసహితుఁడై ముదమొప్పఁ జేసి,
దాదులచేతికిఁ దనయవర్గంబు
నాదట నిచ్చుచో, నవసరం బెఱిఁగి
పదరక భీష్ముండుఁ బౌరులు బుధులు
మొదలైనవార లిమ్ముల నేఁగుదేరఁ,
బ్రాకటంబుగఁ గురుపతితోడ నప్పు
డేకాంతమున వచ్చి, యేపుమై నిలిచి
వెఱవక విదురుండు విభున కి ట్లనియె:
"ఎఱిఁగింతు నొకమాట యిది వేళగాన,
నెట్టన ధృతరాష్ట్ర, నీపెద్దకొడుకు
పుట్టినదినమున భూకంపమయ్యెఁ;
బరికింప నూఱుకంబంబుల మేడ
ధరఁగూలెఁ బ్రతిమలతఱచుతోఁగూడఁ;
దోచె వెండియుఁ బెక్కుదుర్నిమిత్తములు;
పూఁచి చెప్పఁగరాదు భూపాల, నీకు;
అవిరళగతి విను మదికారణముగ
నవిరళజనసంక్షయంబౌను; దీనఁ
గులమెల్లఁ దెగటార్చు [64]కుమతిగాఁగలఁడు;
వలవదు చంపవె వాని నొక్కరుని!
ఉన్నారు సుతులు యుయుత్సుండు నీకుఁ ,
జెన్నార [65]వేయిలోఁ జిదురును బోదు.
కాన, సుయోధనుకారణంబునను
బూని యపాయముల్ పుట్టకయున్నె!
పుత్త్రమోహము మాని, పొనర నీయగ్ర
పుత్త్రుని విడువుము భువియెల్లఁ బొగడ.
[66]నాకంటె నీ కిట్టు నలిఁ జెప్ప హితులు
భూకాంత, యెందును బుట్టుదు రింక!
అన్నవు; నీకు నే నర్థిదమ్ముఁడను;
మన్నించి యీమాట మది నియ్యకొనుము".
అనినఁ గోపాంధుఁడై యాయంధుఁడనియెఁ:
“దనయులఁ దునుమాడు తండ్రులు గలరె!
మునుమును బుట్టిన మోహంపుఁగొడుకుఁ
దునుమాడి బ్రదికెడి ద్రోహులుఁ గలరె!
ఇది యేమిమాటగా నిచ్చనో నాడి!
తది నీకుఁ బాడియే యకట! దుర్బుద్ధి!
వాక్రువ్వరాని యీవాగ్దోష మేను
నేక్రియఁ బాపుకో నెన్నుదు మదిని!
వినవచ్చుమాటలు వినవచ్చుఁగాక,
వినరానిమాటలు వినవచ్చు నెట్లు!
ఈతప్పు గాచితి నిఁకఁ దమ్ముఁ డనుచుఁ;
బాతకంబులఁ బల్కఁ బాడిగా దుడుగు".
అని విడనాడిన, నాబాలుచేతఁ
దనవ్రేఁగు దిగునని ధర సంతసిల్లె.
అంత నంతకుమున్నె యాపాండురాజు
గొంతి నుత్తమకాంతఁ గొనియాడి పలికె :
“వనిత, యీపుత్త్రుని వలనొప్పఁ జూచి,
యొనరంగ సంతోష ముబ్బచున్నదియు;
ఎలమి నెవ్వఁడు గల్గ నీజగత్త్రయము
...... ....... ........ ........ ........ ....... ........
ఒక్క సూనుఁడువలె నుల్లోకబలుఁడు
గ్రక్కున యత్నంబు గావింతుగాక;
భూరిహోమములేక పుత్త్రకామేష్టి
నీరూపమునను సన్నిధియయ్యె నాకు. "
భీమజననము
అనినఁ గుంతీదేవి 'యట్ల కా' కనుచు,
ననిలుని నారాత్రి యాత్మలోఁ దలఁచె.
తలఁచిన, నతఁ డెల్లతనువులయందుఁ
గలవేల్పుగాన నాక్షణమున వచ్చి,
మంత్రింప మనుజుఁడై మగువతో మదన
తంత్రమార్గమున నాతఁడు ప్రవేశింప
నింతి గర్భము దాల్చె; నేఁడు నిండుటయు,
నంతంత గ్రహములు ననుకూలగతుల
వింతయై వర్తింప, విపులప్రతాప
సంతతోత్సాహునిఁ జండతేజునిని,
ఆవాయుదేవుని యంశంబునందు
భావజాకారుని భామాలలామ
యొనర గాంధారి దుర్యోధనుఁ గనిన
దినమునఁ దనయు సుస్థిరతేజుఁ గనియె.
సురదుందుభులు మ్రోసె; సురపుష్పవృష్టి
కురిసె; వేదంబులు ఘోషించి పలికె;
భయమయ్యెఁ గిమ్మీరబకహిడింబులకు;
జయజయధ్వనియయ్యెఁ జదల నెల్లెడల;
తనయుని వీక్షింపఁ దా వచ్చె ననఁగ
ననుకూలపవమానుఁ డల్లన వీచె.
హేమకిరీటుల నితఁడు శాత్రవుల
భీమంబుగా నాజి భేదించుఁగాన,
నుతశక్తి భీమసేనుం డితఁ డనుచు
నతనిపే రెఱిఁగించె నాకాశవాణి.
భూతలాధిపుఁ డంతఁ బొంగుచు వచ్చి
సూతికాగృహములో సుతుమోముఁ జూచి :
'హస్తినాపురభాగ మన్న యీకున్న
నస్తమింపదు; వీని కది సాధ్య ' మనుచుఁ,
గౌంతేయుఁ బట్టంబుకట్టిన[67]కంటె
సంతోష మాత్మలో సంధిల్ల నుండె.
పురుఁడు వచ్చిననాఁడె పూఁబోఁడి యంత
సరసిలో మంగళస్నానంబు చేసి,
[68]నవరీతి నుదికిననారపుట్టంబు
సవతియిచ్చిన నది సంప్రీతిఁ దాల్చి,
యుడురాజశేఖరు నుపహారమునకు
నొడిపిలి పాయసం బొప్ప [69]వండించి,
భామిని మాద్రిచేఁ బట్టించుకొనుచుఁ
గోమలి సుతు నెత్తుకొని పెద్దవేడ్కఁ
బోవుచో, నొకశైలభూరిరంధ్రమున
నావలఁ బులియుండి యది మాంస మనుచు
ఘోషించి యది వేగ గొటగొటమనుచు,
భీషణగతితోడఁ బృథకడ కపుడు
గమికొన్నయాఁకటఁ గదియఁ బాఱుటయు,
బ్రమసి భీతినిఁ గూడి పాండునిదేవి
కొడుకు నచ్చట కొండ [70]గుండులమీఁదఁ
బడవైచె మూర్ఛచేఁ బరవశయగుచు;
వైచిన, నాభీమువజ్రకాయమున
నేచినఱాలెల్ల నిసుమయ్యె నందు.
ఆలోన ‘నోడకు' మనుచు భూపతియు
వాలిక విలు గుణధ్వని చెలంగించి,
దూలమువోని శార్దూలముఁ దునియ
వాలమ్ము లేసి, యవ్వసుధేశుఁ డంతఁ
బవమానసుతుమీఁదఁ బడియున్న కుంతి
నవమానవతి నెత్తి, నందను నెత్తి,
'తను వెంతగట్టియో తనయున! ' కనుచు
మనమున సంతోషమహిమ లింపొంద,
దేవాలయమునకుఁ దెఱఁగొప్ప నేఁగి,
యావేళ జగదంబ నర్చించి వేడ్క,
సతియును దానును సాష్టాంగమెఱఁగి,
స్తుతవచోరచనల స్తుతి చేసి రిట్లు :
"గౌరి, వారాహి, శాంకరి, దుర్గ, త్రిపుర
భైరవి, శక్తి, జపారత్నవర్ణ,
ఫాలాక్షి, మధుమతి, పరతత్వ, జనని,
కాళి, కంకాళి, హ్రీంకారి, రుద్రాణి,
భుజగభూషణుదేవి, పూర్ణేందువదన,
విజయ, శర్వాణి, దేవీ, జ్ఞానమూర్తి,
వారాహి, చాముండి, పరదివ్యమూర్తి,
ఘోరదంష్ట్రి , కరాళి, కోమలి, ముగ్ధ,
గీర్వాణి, శాంభవి, కీనాశవంద్య,
నిర్వాణసంధాయి, నిఖిలప్రదాయి!”
అనుచు నివ్విధమున నభినుతిచేసి,
తనదేవియును దాను ధరణినాయకుఁడు
నొయ్యన నటపాసి యొగినుండుచోట
నెయ్యంబుతో నుండె నెలఁతలుఁ దాను.
ఈరీతిఁ [71]బుత్త్రుల నెందు నేమఱక
గారవంబునఁ బెంపఁ, గరిపురినంత,
ధృతరాష్ట్రునకు వంశదీపకులైన
సుతులు నూర్వురు నొక్కసుతయును బుట్టి
యున్నవా రనువార్త యుర్విపై మ్రోయ
విన్నవాఁడై, పాండువిభుఁడు మోదించి,
శూలివిక్రములైన సూనులు తనకుఁ
జాలనితలఁపున సాధ్వి కిట్లనియె:
"తరుణి, విద్యలచేతఁ దనయులచేతఁ
ధరచేత సిరిచేతఁ దనియ రెవ్వరును;
ఇక్కగా నినువంటి యిల్లాలుగలుగఁ,
బెక్కండ్రు గావలె బిడ్డలు మనకు.
శతమఖు నమరేంద్రు శతకోటిధరుని
బ్రతిలేని యాదివస్పతియైన యట్టి
యింద్రు నారాధింపు; మిఁక నొక్కసుతుని
జంద్రవంశము నిల్పఁజాలినవాని,
మానితాటోపు సమంచితోత్సా[72]హు
[73]భానుసన్నిభ[74]దీప్తప్రభ గల్గువాని
నాచంద్రధరసురేంద్రాది దేవతలఁ
జూచి పోరాడ నిష్ఠురుఁడైనవానిఁ
గనుము; కాంచినదాఁక గౌరీవ్రతంబు
ఘనతరనిష్ఠతోఁ గమలాక్షి, నడుపు"
అని చెప్పి, తా నొకయైంద్రమంత్రంబు
మునులచే నుపదేశముఖమున నెఱిఁగి,
యరుదైన నిష్ఠతో నమరాధిపతికి
ధర నేకపాదుఁడై తపము సేయంగఁ,
బ్రత్యక్షమై వచ్చి పలికె వాసవుఁడు :
అర్జునుజననము
"సత్యశౌర్యుఁడు నీకు జనియించుఁగొడుకు;
ఎంతటివానిఁగా నీవు చింతించి
తంతటిగుణవంతు నతిరథశ్రేష్ఠు
నిచ్చితి." నని చెప్పి యింద్రుండు పోవ,
నచ్చట వ్రతము సమాప్తమై కుంతి
పతియాజ్ఞఁ దలమోచి, పస భక్తియుక్తి
హితమతి వేఱొండు నిచ్చలోలేక
మునియిచ్చుమంత్ర మిమ్ము లనుష్ఠించి,
తనమదిలోనున్న తాత్పర్య మెసగ
నమరేంద్రుఁ దలఁచిన, నారాత్రి వచ్చి
కమలాక్షికోరిక కరుణించి, యపుడు
వరదుఁడై పాండుభూవరుకూర్మిసతికి
వరపుత్త్రదానంబు వలనొప్ప నిచ్చి
పోయిన, నొకయేఁడు పూఁబోఁడి గర్భ
మాయతమతిఁ దాల్చి, యట యొక్కనాఁడు
ఉత్తరఫల్గుని నుడురాజు మెఱయఁ,
జిత్తరాగము సర్వజీవులఁ బొరయ,
విక్రమక్రమకళాన్వితసముద్భవుని
శక్రువంశంబున జగమెల్లఁ బొగడ,
జలజాక్షు రాముఁ గౌశల్య గన్నట్లు
కులదీపకునిఁ గాంచెఁ గొడుకు నుత్తముని.
అప్పుడు భాషించె నాకాశవాణి:
"యిప్పాండవుఁడు ధీరుఁ డింద్రసన్నిభుఁడు;
కార్తవీర్యార్జునుగతి నాజిలోన
మార్తుఱఁదెగటార్చు మహితాత్ముఁడగుట
నర్జుననామధేయంబున నమరి
నిర్జరాధిపునైన నిర్జించు నాజి :
భర్గుఁ దా నెక్కటిబవరాన గెలిచి,
మార్గణరాజంబు మహిఁ బొందఁగలడు;
బొందితోడనె యింద్రుపురమున కేఁగి,
యందు రాక్షసకోటి హరియింపఁగలఁడు;
అనలుని మెప్పించి, యరదంబు విల్లుఁ
దొనలు [75]రథ్యములుఁ గేతువుఁ గాంచఁగలఁడు;
ఇతఁడు రాజుల గెల్చి, యెలమి ధర్మజుని
నతివేడ్క రాజసూయంబు చేయించుఁ;
గతలేల! యితఁ డింద్రుఖాండవవనము
చతురుఁడై కాల్చు వాసవుని నోడించి;
యుత్తరఫల్గుని నుదయించెఁ గానఁ,
గ్రొత్తగా దితని ఫల్గునుఁడనఁ జెల్లు;
నితఁ డీశ్వరునిఁగూర్చి యెలమిమైఁ దపము
చతురుఁడై కావించు జగమెల్లఁ బొగడ. "
ననునంత దేవత, లఖిలసంయములు,
మనువిశ్వవసువులు, మారుతంబులును,
గరుడగంధర్వులు, గ్రహతారకాదు
లరుగుదెంచిరి కూడి యర్జునుఁ జూడ,
పాండురా జప్పుడు పరమమోదమున
దండప్రణామముల్ తగ నాచరించి,
యందఱఁగూర్చి : "కృతార్థుఁడనైతి;
నందనఫలసిద్ధి నాకబ్బె నేఁడు;
ఈకురుకులమెల్ల నేచి వర్ధిల్లె;
నాకు నెంతయుఁ గల్గె నాకలోకంబు;
కడువేడ్క వివిధలోకంబులవారిఁ
బొడ[76]గాంచుటాయెఁగా! పుత్త్రులఁ గనుట;
నెదురుగానట్టి మీ రేతెంతురట్టె!
పొదలు దివ్యుఁడఁగానె! బొందితో నేను."
అనుటయు, దేవత లతనిఁ గీర్తించి
చని రంత నిజనిజసదనంబులకును.
కుంతికి నీరీతిఁ గొడుకులు గలుగ
సంతతోత్సాహుఁడై, సంభ్రమం బెసగ
నంతట శతశృంగమందుఁ బాండుండు
సంతోషచిత్తుఁడై, సంయము లలర
సతులతో సుతులతో సతతంబు గూడి
యతివినోదములఁ బెంపలరుచునుండె.
ఆలోన మద్రరాజాత్మజ మాద్రి
భూలోకవినుతులఁ బుత్త్రులఁ దనకుఁ
బడయునుపాయంబు పరికింపలేక,
యెడఁదలోఁ బలుమాఱు నిట్లనితలఁచె:
"కోరినతనకోర్కి కొదవడకుండ
వారిజానన కుంతి వసుధేశుఁ డలర
సురుచిరాకారుల శూరుల ఘనుల
గురుమతితోఁ గాంచెఁ గొడుకుల ముగురి;
గాంధారి కొడుకులఁ గాంచె నచ్చోట
బంధురలీలలఁ బరఁగ నూర్వురను;
నుతికెక్కఁగా వారు నోచిననోము
నతివేడ్క నే నోమనైతినొకాక !”
అనితలపోసి యయ్యధినాథుకడకుఁ
జని, మాద్రి దుఃఖించి జానొప్పఁబలికె:
"ఆఁడుపుట్టువు పుట్టి యక్కట! నాకుఁ
బోఁడిగా లేదయ్యెఁ బుత్త్రలాభంబు;
కొడుకుల నాతోడికోడలు గాంచెఁ
గడువేడ్క నూర్వురఁ గ్రమము మీఱంగ,
కుంతీమహాదేవి కొడుకుల ముగురఁ
గంతుసమానులఁ గర మొప్పఁగాంచె;
నెక్కడి నాజన్మ! మెక్కడి బ్రదుకు!
అక్కట! వగలపాలైతి నే నిపుడు
పసపార్చి, చన్నిచ్చి, పలుమాఱుచీరి,
కొసరుచు ముద్దాడి, కోర్కి దై వార
నక్కున నురమున నత్తుచుఁ బెనుప
నొక్కఁడైనను నాకు నుదయింపడయ్యె!
కొడుకులు లేనట్టి గొడ్రాలిమనువు
అడవిఁగాచినవెన్నె లైపోవుఁగాదె!
మంత్ర మేమియు నేర; మాతోడ మదన
తంత్ర మీ వెఱుఁగవు; తనయుఁ డెట్లొదవు!
సవతియు నీవును జనఁ బుణ్యగతికి,
నవనీశ, నాకురా నభవుఁ డీఁడయ్యె!
దేవిచే మంత్రోపదేశంబు నాకు
దేవ, యిప్పింపఁగదే!" యన్న నతఁడు,
వేలెడునిడుపులై వ్రేలెడుకురులుఁ
దూలెడునడవులు దొక్కుమాటలును
ముద్దుగానొప్పెడి మూఁడేండ్లకొడుకు
నొద్దనె ధర్మజు నునిచినదానిఁ,
'జేతప్పి ప్రిదిలిన [77]చిన్నివ్రేఁకమున
ఱాతిచట్టువమీఁద రవమయ్యెఁదొల్లి;
ఇంతమహాసత్వు నిట్లుధరించు
నంతటిదానఁగదా!' యను వేడ్క
నెలమి నాభీము రెండేఁడులవాని
బల మొప్ప నూరులపైఁ దాల్చుదానిఁ,
గలశజుచే వీఁడు ఘనత పెంపొందఁ
గలఁడనంగను గుచకలశంబులోని
[78]పాలిచ్చె ననఁదోపఁ బరఁగు నొండొక్క.
బాలుఁ జన్నిచ్చుచు భరియించుదాని,
మిన్నంతవేడ్కతో మృదుశయ్యమీఁద
నున్న కుంతీదేవి నొయ్యనఁ గదిసి :
"యీమాద్రి రక్షింపు; మిది నీకుభరము;
[79]భామ, నీకెంతయుఁ బరమపుణ్యంబు;
[80]నీ కీమె చెల్లెలు; నీ కిట నెపుడుఁ
జేకొని శుశ్రూష చేయుఁ; గావునను,
ఇమ్ముగా ముని నీకునిచ్చినమంత్ర
మిమ్ము సత్కృపతోడ నెలమి నీ." వనుచు
మాద్రిచందము చెప్పి, మంత్ర మిప్పించి,
మాద్రికిట్లనియె నమ్మనుజనాయకుఁడు :
కవలజననము
"జగదేకవిఖ్యాతచరితు లశ్వినులు;
మగువ, నానాజ్ఞానమహితులశ్వినులు;
వారి నారాధింపు వచ్చెద." రనిన,
ధారుణీశునియాజ్ఞఁ దరళాక్షి మాద్రి
యిచ్చలోఁ దలఁచిన, నిరువురశ్వినులు
వచ్చి నిశావేళ వరమిచ్చిపోవ,
హిమకరనిభగర్భ మేఁడాది దాల్చి,
యమడలఁ గాంచె నయ్యశ్వినులందు.
విహితప్రతాపులు వీరలు నకుల
సహదేవులనుచుఁ బుష్కరవాణి పలికె.
ఘనతఁ పాండునిమనఃకమలంబు విరియ,
ననయంబు గొంతియు నాత్మలో నలరఁ,
గామునిశరములు కల్పవృక్షములు
నామహాదేవుని యయిదుమోములును
ఈరూపములఁ దాల్చి యిలఁ బుట్టెననఁగ,
భూరి తేజంబులఁ బొగడుదీపింప,
ధర్మ భీమ సుత్రామజ [81] యమలు
పేర్మి నానాటికిఁ బెరిగి పెంపొంది.
రీరీతి నందను లేగురు గలిగి
పౌరవకులకర్త పాండుభూభర్త
శతశృంగగిరిమీఁద సతులును దాను
వ్రతధారియైయున్న; వసుధలో నంతఁ
బడఁతులతోఁగూడఁ బాండుభూవిభుఁడు
అడవికి వేఁటమై నర్థిఁ బోవుటయు,
మృగశాపభయము గ్రమ్మిన రాజ్య ముడిగి
పొగడొందఁగాఁ దపంబునకు జొచ్చుటయు,
దేవతావరములఁ ద్రిదశేంద్రసముల
నేవురఁబుత్రుల నెలమిఁ గాంచుటయు,
విని వసుదేవుండు వేడ్కలువొదువఁ
దన [82]కూర్మి చెలియలిఁ దనకూర్చుమఱఁదిఁ
దనమేనయల్లుండ్రఁ దగమద్రసుతను
'గనుఁగొనిర ' మ్మని కశ్యపు ననుప,
నాపురోహితుఁ డేఁగి యఖిలతంత్రముల
నాపాండుభూవరు [83]నర్థి దీవించి,
వరరత్నభూషణావళులు వేర్వేఱ
నలిమీఱఁ జౌలోపనయనాదివిధులు
కొలఁది కగ్గలముగా గోర్కెనొనర్చి,
[84]విదితశౌర్యులకును వేదశాస్త్రములు
చదివింపుచుండె నాసంయము లలర.
వసంతోదయము
అంత వసంత మత్యనురక్తి జగము
లెంతయు నలరంగ నెలమిదై వార
[85]హత్తె భూభువనమం దఖిలజీవులకుఁ
జిత్తానురంజనశ్రీ యుల్లసిల్ల,
తరువులామధువునఁ [86]దలఁగుప్రాయములు
తిరిగివచ్చుట యెల్లదిక్కులఁ దెలిపె;
నలజీర్ణవర్ణంబు లనియెడు [87]నరలు
[88]తలఁగి శీతవ్యాధిఁ దగులుట [89]దెలిపెఁ;
[90]'గురుకుమారకుల కాకులపాటు గలుగు
నరయంగ నిటమీఁద ' ననిచెప్పుకరణిఁ,
దొడిమలతోనూడి తోడ్తోడ ధాత్రి
[91]నడరంగఁ దరులఁ గారాకులు డుల్లెఁ;
బొరిపొరిఁ బాండవాభ్యుదయంబునకును
బరికింప విదురాదిబంధుచిత్తంబు
విలసితంబుగఁ బల్లవించునీమాడ్కి
[92]లలి నంచుఁ దరులఁ బల్లవము లొప్పారె;
గోకిల శుక భృంగకులములఁ బిలువ
నాకులువెట్టిన ట్లాకులఁ బెట్టె;
సుమనోవిలాసభాసురలీలఁ జెలఁగి
సమబుద్ధిఁ గీర్తివాసనలఁ బాండవులు
అమరంగ నొప్పుదు రనుభంగిఁ దరులు
సుమనోవిలాసభాసురలీలఁ బొదివె ;
ఫలియించెఁ బాండుభూపతితపం బనఁగ
ఫలియించె వృక్షముల్ సాయకెల్లెడల;
మలయాచలంబున మలయుచుఁ [93]గదలి,
జలజాకరంబుల చలువ నోలాడి,
పరువెత్తి, యొయ్యన బలసి, పూఁబొదలఁ
బరగుపూమొగ్గలఁ బరువులెత్తించి,
తెలియఁబుష్పిణులైన తీగెజవ్వనుల
తలిరాకు చెఱఁగైనఁ దాఁకునో యనెడి
ఘనశంకఁ జరియించుకరణి గంధాద్రి -
యనిలుండు చల్లనై యల్లన వీచె;
వీఁగుచు లేఁగాలి [94]విటుతలమీఁద
నూఁగెడువిటపులయుపరిభాగముల
నొలికెడుగతి రాలె నుత్ఫుల్లకుసుమ
వలమానమకరందవరఘర్మజలము ;
వేఁట పాంథులమీఁద వెడలుచో మరుని
మీటైన గండుతుమ్మెద నల్లప్రజకుఁ
దావుకూళులుచూపు తావు లనంగఁ
గ్రోవులతావులు గూర్చె మధుండు ;
ఆవిరులందు నొయ్యన దూరిదూరి,
[95]క్రేవలరసము పుక్కిటఁ బట్టిపట్టి,
పొడబొట్లు పడకుండఁ బుప్పొడి యలఁది,
సుడిసి మై యెఱుఁగక సోలియాడుచును,
బలువిధంబులఁ [96]బాఱి, పంచమశ్రుతులు
పలికెడు చిలుకలబలగ మొప్పారె;
[97]చిగురాకు లారగించినచంచు వమరఁ,
బొగరెడులోచనంబులఁ గెంపు గదుర,
బలువడిఁ జిగురుజొంపములలోనుండి
కలయంగఁ గోకిలగము లెలుఁగించెఁ;
దెల్లఁగాఁ బూచినతిలకంబుమ్రోల
మొల్లంబుగాఁ [98]బూచి మోదుగు [99]పొదల
నాఁటియీశ్వరు[100]ఫాలనయనాగ్నిశిఖల
నాటిన మండు మన్మథుఁ దలఁపించెఁ;
బెక్కుతెఱంగులై బెరయుతావులకు
నెక్కడ మూఁగును మేది మే లనుచుఁ
జంచరీకములు బిసాటంబు దిరిగి,
నిల్చి యెందును వ్రాలనేరకయుండె;
గండుఁగోయిల జంకె గర్వంబు లుడిగి
మిండలఁగవయుకామినులకోపాగ్ని;
నడవుల వేఁట సేయను బుష్పధూళి
వడి మృగంబుల కొక్కవన్నియ దెచ్చెఁ;
గ్రమమొప్పఁ గమలాకరంబులై చాలఁ
గమలాకరము లొప్పెఁ గడురమ్య మగుచుఁ ;
దనదుబాణములను దైవంబులైన
ననుపమగతి శిరసావహింపంగఁ,
దనవిల్లు లోకముల్ దగఁ గొనియాడఁ,
దను నెల్లవారుఁ జిత్తజుఁడని పొగడఁ,
గడఁగి నిశ్చలకీర్తి గాంచిన [101]మరుఁడు
గడు వడిగల్గు చిల్కలరథం [102]బెక్కి,
యానలఁ గదలి, మీనాంకంబు మెఱయ,
వావిరిఁ గమ్మపూవాలమ్ము లేర్చి
దండెత్తి యామని తన [103]ముందుఁ నడవ,
నొండొండ జగముల నురుతేజ మెసగఁ,
గలఁగొని రతి[104] కేళిఁ గడఁకలు [105]మీఱి,
తల కురు లెఱుఁగక తడఁబడువారి,
సంగతిఁ గాంతలచనుగుబ్బలనెడి
లింగంబులను గౌఁగిలించినవారి,
మనలక సతులకమ్మనిమోపులనెడి
కసవుల మఱువక గఱచినవారి,
ననువారఁ దోయజాతాక్షులపిఱుందు
లను పుట్టలెక్కి పాయక యున్నవారి
మన్నించి, విజయుఁడై, మఱియు లోకమున
నున్న జీవుల నేయుచుండె నొండొండ.
చిత్తవికారంబు శివునంతవాని
హత్తఁజేసినయట్టి యాఋతువునను,
అట పాండుభూపాలుఁ డంగసంభవుని
పటుబాణపాతహృత్పద్ముఁడై యలసి,
మానంబు తన కనుమానంబుగాఁగ
నూనినవిరహాగ్ని నుడుకుచునుండి,
మాద్రివెట్టఁగరాని మానితాకార
మాద్రిపై మోహంబు మరలింపలేక,
శాపంబుకతముగా జనియించుభీతి
నేపార నలయుచు నిట్లున్నయంత,
పాండుని మరణము
వనజాక్షి మాద్రి భూవరునికట్టెదురఁ
దనరూపునకుఁ దగఁ దద్దయు వేడ్క
లేమ కుంతీదేవి లేనిప్రొద్దునను,
గాముఁ డోర్చినవాఁడు గానిప్రొద్దునను,
మెఱుఁగుఁజన్నులమీఁద మృగనాభి యలఁది,
నెఱిఁ గల్వరేకులనిగ్గు వట్టించి,
మొల్లమైఁగిడిన ముత్యాలమాఱు
మొల్లమొగ్గలు గ్రుచ్చి మొలనూలు గట్టి,
సొంపైన మెయిదీఁగె సొమ్ములమాఱు
సంపంగిరేకులు సంప్రీతిఁ దాల్చి,
తెగగలకస్తూరితిలకంబుమాఱు
మొగలిపుప్పొడి గోటిమొన నెత్తి దిద్ది,
జగియెక్కి మెఱుఁగులు [106]జీరులువాఱు
చిగురాకుచంద్రికచీర ధరించి,
పొన్నలుఁ బొగడలు బొండుమల్లియలుఁ
గ్రొన్ననలును గీలుకొప్పునఁ దురిమి
వనలక్ష్మిగతినున్న, వసుధాధిపతియు
నొనర డగ్గరఁబోయి యొరసుకయుండి,
గురుభక్తితో నంత గొంతి విప్రులకు
సరసాన్నములఁ దృప్తి సలుపుచునుండి
తన్ను నేమఱుట చిత్తములోన నెఱిఁగి,
క్రన్నన నప్పు డేకాంతంబునందు
దండితారాతి యుద్దండవిక్రముఁడు
పాండుభూపాలుండు భావజుకులికి,
సంయమియిచ్చినశాపంబు మఱచి,
సంయతహృదయ [107]విస్రబ్ధత మఱచి,
పొలుపారు వనపుష్పభూషణంబులను
లలిమీఱి భవపుష్పలతికచందమునఁ
జెలువారు నమ్మాద్రిఁ జెచ్చెరఁ గదిసి,
వలదని వారింప వలనొప్ప నతఁడు
ఆలింగనము సేయ, నబల వారించి :
"యేలయ్య! మఱతురే యిటు నిన్ను నీవు!
వనము నీయుద్యానవాటిఁ గాదు;
వనము నీదువిలాసవాసంబుకాదు;
మునులలోఁ గొందఱుమునులమై కాదె!
మన మున్నవారము మన మున్నతముగ!
పదరకు; రాకు; పైఁబడకు; పట్టకుము;
కదియకు." మనుచు నంగన పోవఁబోవ,
సలలితపల్లవశయ్యాతలమున
బలిమిమై నదరంటఁ బడఁతుకవెంటఁ
బట్టి, భావజకేళి భరితసామ్రాజ్య
పట్టాభిషిక్తుఁడై పాండుభూవిభుఁడు
ప్రాణంబు విడిచినఁ, బఱతెంచి కుంతి
ప్రాణేశ్వరునిమీఁదఁ బడి మూర్ఛనొంది,
దేవి మద్రకుమారి తెలుపఁగాఁ దెలిసి:
"యోవినిర్మలతేజ, యోపాండురాజ,
యోకురువర, ధీర, యోమహాశూర,
యోకరుణాకర, యోవీరవర్య,
ఎక్కడఁ బోయితే! యేను లేనైతిఁ!
దక్కక తాఁకెనే తపసిశాపంబు!
దిక్కులన్నియుఁ గెల్చి దివిజులు మెచ్చ,
నక్కజంబుగ ధనం బపరిమితంబు
తెచ్చి, యగ్రజుఁడైన ధృతరాష్ట్రవిభున
కిచ్చి యాగంబు సేయించితి వీవు.
నీయంతశూరుండు, నీయంతసుకృతి,
నీయంతకారుణ్యనిధి యెందుఁగలడు!
ఎక్కడి మధుమాస! మెక్కడిమాద్రి!
యెక్కడిసంభోగ! మిం దేమి గలదు!
పలుకు లేటికి, మాద్రిపైఁ గన్ను వేసి
మెలఁగుని న్నెఱిగియు మేము మఱచితిమి.
మునిశాపచరమసముద్రంబునందు
మునిగితే కురురాజ! మోహనాకార!
మొగి శాపబడబాగ్ని ముట్టిననీవు
జగదీశ, పోయితే జలధిగంభీర!
సంయమీశ్వరు శాపచటులాగ్నిచేత
నొయ్యనఁ జిక్కితే! యుడురాజవంశ!
[108]వనితేక్షణములను వలలోనఁ దవుల
ననిపెనే! సూనసాయకువేఁటకాఁడు;
అక్కాంతనెఱి[109]కురులను నురులందుఁ
జిక్కితే కౌరవసింహంబ! నేఁడు;
బ్రాహ్మణులకు నేడు పాయసాన్నములు
బ్రహ్మార్పణంబుగా భక్తి నేనొసగ,
నెడచూచి మఱిగదా! యిట్లు చేసితిని ;
పడఁతికై చావంగఁ బాడియే నీకు!
అసమాస్త్రుదివసంబు లంటిఁ గదయ్య!
యసము దింపక యుండుమంటిఁ గదయ్య!
ప్రాణేశ, న న్నీవు పాసిన వెనుక
ప్రాణంబు లేలొకో, పాయవు నన్ను!
తపసులు వెఱఁగందఁ దప మర్థిఁ జేసి,
విపులపుణ్యుల ధర్మవిదుల నందనుల
నమరులవరమున నర్థితోఁ గాంచి,
యమరలోకంబున కరిగితివయ్య!
సుతులఁ గాంచితి గాని, సుతు లుర్వి యేలఁ
గుతలంబు మెచ్చఁ గన్గొనఁ గానవైతి!
ఈయాత్మజుల నిప్పు డెవ్వరి కిచ్చి
పోయితివో! పాండుభూపాలతిలక!
ఇంక నెవ్వరు మాకు నిచ్చోటదిక్కు
ఇంకఁ బాలైతిఁగా యీశోకవహ్ని!
పరికింపజాల నీబాలుర విడిచి
యరుదెంతు నీవెంట." ననునంత, మాద్రి :
"ఇమ్మెయి మృగశాప మెఱిఁగియు నెఱిఁగి,
వమ్మైన నాబుద్ధి వరదఁబోవిడిచి,
యొడలు [110]మఱచినయట్టి యొప్పనిదానఁ;
గొడుకులఁ బెంపంగఁ గుంతి, యే నేర.
వసుధేశ్వరునకు నావలననగాదె!
యసువులు దొలఁగంగ నక్కటా! వలసె.
నా కెడ యిమ్మింక నలినాయతాక్షి
యీకురునాథుతో నేఁగెద నిపుడు ;
తనయుల రక్షింపు తరుణి, నీ వుండి;
నను బంపు నరనాథునకు సహాయముగ.
నితని నేమఱినట్లె యే నిల్తునేని,
సుతుల నేమఱుదును శూన్యాటవులను,
కావున, నామాట గాదన కిపుడు
వేవేగ నను బాండువిభుఁగూడ ననుపు."
అనుచు రాజేంద్రుశయ్యకు దాటుకొనిన,
మును లంత శోకాబ్ధి మునుఁగుచు వచ్చి
యెప్పుగా నందఱు నొగిఁగూడి, కుంతిఁ
దప్పక యూరార్చి తమలోన ననిరి :
ధరణీభరంబు బాంధవరక్షణంబు
నరయంగ విడిచి ఘోరాటవి చేరి,
తనకును శరణంబు తాపసు లనుచుఁ
జనుదెంచి తప మర్థిఁ జాలంగఁ జేసి,
సురలవరంబున సూనులఁ గాంచి
పరలోకగతుఁడయ్యెఁ బరికింప జగము ;
మనుజేశ్వరుఁడు నమ్మి మగువలుఁ దాను
మనలోపలనయుండ [111]మనబందు." వనుచు
మారెడు నేరెడు మామిడి మఱ్ఱి
యారావి శమి మోదుగాదిగా వెదకి
వట్టిపోయినతుండ్లు వారక తెచ్చి,
యొట్టి యయ్యిరువుర కుచితాగ్నియిచ్చి,
యయ్యస్థి నీటిచే నందంద తడిపి
చయ్యన నవదర్భశాఖలఁ బొదివి,
కుంతికిఁ గొడుకులకును శోకమార్చి,
యంత వారలతోడ నయ్యస్థి గొనుచు
నెచ్చట నిలువక యిభపురంబునకు
దెచ్చిరి పదియేడుదివసంబులకును.
పాండవుల హస్తిపురప్రవేశము
పౌరు లంతకుమున్ను పాండునందనులు
వారక చనుదెంచువార్తల కలరి,
చదురొప్ప నానందజలధి నోలాడి
కదియుచుఁ దమలోనఁ గడఁక నిట్లనిరి:
"పాండునిభాగ్యంబు పల్లవింపంగ,
నిండుగొంతెమకడుపు నిండి వెలుంగ,
వరమునఁబుట్టిన వంశవర్ధనులు
వరుస వచ్చుచునున్నవారు పో వీరు.
అందఱి లోపల నధికమై యగ్ర
మందున ధర్మరూపాకృతి దాల్చి,
జలనిధిపర్యంతసకలభూతలము
వెలయనేలెడుచిహ్న వెరవొప్పఁ గలిగి,
ప్రాకటంబుగ సౌర్వభౌముఁడై మించి,
యీకడ మనబోంట్లనెల్ల రక్షింప
నాకీశవైభవోన్నతితోడ మెఱసి,
జోకవచ్చెడు ధర్మసుతుఁ డల్లవాఁడె
ఆతని వెనుక మహాధురంధరుఁడు
భీకరాకృతితోడఁ బెంపగ్గలింప,
'ననిమొనఁ దనకెదురైనరాక్షసుల
గనియలు తునియలుగాఁ జేతు,' ననుచుఁ
గడఁగి కయ్యమునకుఁ గాలుదువ్వుచును
వడివచ్చుచున్నాఁడు వాఁడు భీముండు;
కడిమిపై రాము భార్గవరాముకరణి
గడిదేరి చాపసంకలితుఁడై మెఱసి,
వికటశాత్రవవేరువి త్తితఁ డనఁగఁ
బకపక నవ్వుచుఁ బావనివెనుకఁ
గనుఁగొని తమయన్నకనుసన్న మెలఁగ
వినయంబుతో వచ్చు విజయుండు వాడు;
మాద్రికుమారు లిమ్మహిఁ గరుణాస
[112]ముద్రులై వినయసమున్నతి వెలసి,
సలలితభూతభవిష్యద్వర్తమాన
కలితాత్ములై మించి కడఁకఁ బెంపొంది,
చనువొప్ప నకులుండు సహదేవుఁ డనఁగ
వెనుకొని విజయుని వెనువెంటఁ గొలిచి,
పనిగొన నఱలేనిభక్తి దీపింప
నొనరంగ వచ్చుచునున్నారు వారె.
ఈదివ్యపురుషుల నిటు గన్నకుంతి
యేదైవములకన్న నెక్కుడై మించి,
యల్లదె వచ్చుచు నట మనమీఁదఁ
జల్లనిచూపులు చల్లుచున్నదియు;
దేవమూర్తుల వారి దృష్టింత." మనుచు
వేవేగ నెదురేఁగి వీక్షించువారు,
నేవీథి వత్తురో యెఱుఁగరా దనుచు
నావీథి కావీథి కరిగెడివారు,
'రాజమార్గంబున రాఁబోవరాదు;
వాజులు రథములు వారణంబులును
సందడించెడు. ' నని సౌధంబు లెక్కి
కందర్పమూర్తులఁ గనుఁగొనువారుఁ,
జల్లగాఁ గస్తూరి జాజులుఁ గలిపి
చల్లెడువారునై సంభ్రమింపఁగను,
విదురుని భీష్మాదివృద్ధుల సతుల
నెదురుగాఁ బుత్తించి, యిభపురాధిపుఁడు
ఆడువారలు మోచు నందలం బెక్కి
పోఁడిగాఁ గుంతిఁ బూఁబోఁడి రాఁబనిచి,
పెద్దకొల్వున నుండి బిడ్డలరాక
తద్దయుఁ గోరుచోఁ, దాపసోత్తములు
పార్థులఁ దెచ్చి భూపతికి మ్రొక్కించి,
యర్థి నంతఃపురి కాకుంతిఁ బనిచి,
జగదీశుచేతఁ బూజలు వారు వడసి
తగినపీఠకములఁ [113]దమయంత నుండి:
" ఓన్యాయధృతరాష్ట్ర, యోధృతరాష్ట్ర,
ధన్యులు వీరె నీతనయులేవురును;
వరుస నంతక వాయు వాస వాశ్వినుల
వరములఁబుట్టినవంశవర్ధనులు ;
ఇతఁడు యుధిష్ఠిరుం; డితఁడు భీముండు;
ఇతఁ డర్జునుండు; వీరిరువురుఁ గవలు
[114]నకుల సహదేవ నామ నాయకులు;
ఒక భేదమును లేక యోముము వీరి;
నిరువురుమాద్రేయు లీపృథాపుత్రు
లరయ భూపతిచావ నరుదెంచినారు;
మాద్రి యూతనితోడ మరణంబుఁ బొందె;
ముద్రగా నిదె యస్థి మోచితెచ్చితిమి;
పట్టితి మొకరీతిఁ బడకుండఁ గుంతి;
నెట్టివారికి వలదే తల్లినీడ!
ఓసరింపక వారి కుత్తరక్రియలు
చేసి శిశువులఁ జేపట్టు మనుచు
జననాథునకుఁ జిత్తశల్యంబులైన
యనుజునిశల్యంబు లాపొంత నునిచి
మునులు పోయిన, రాజు మూర్ఛిల్లి తెలిసి,
తనయులు భీష్ముండుఁ దానుఁ దల్లులును
విదురుండు సచివులు ద్విజులు గాంధారి
మొదలుగాఁ గూడి తమ్మునకు వాపోయి,
భూదేవసహితుఁడై పురజనుల్ గొలువ
నాదేవనది కేఁగి, యమసూతి[115]చేత
నొద్ద వేదవ్యాసుఁ డొజ్జయై చెప్ప
ముద్దుతమ్మునిశల్యములు సంస్కరించి,
స్నానతర్పణములు శ్రాద్ధాదికములు
బూని నిర్వర్తించి పురమున కరిగి,
కొంత [116]దుఃఖంబాఱి కొత్తగా [117] నిండ్లు
కుంతికిఁ దత్పుత్త్రకులకుఁ [118]గట్టించి,
జలనిధివేష్టితసకలభూతలము
నలమి యేలుచునుండె'. నదియును గాక,
'వరున ధర్మజ భీమ వాసవి యమల
పరిచిత[119]కీర్తనప్రకరంబు వినిన,
ధర్మాభివృద్ధియు ధరఁ బాప[120]హతియు,
దుర్మదారిజయంబుఁ దోడ్తోనఁ గలిగి
రోగంబులెల్ల నారోగ్యమౌ' ననుచు
బాగుగా వేదంబు పలికెడుఁగాన,
సొరిదిఁ బుణ్యశ్లోకసుఖుల పాండవుల
చరితంబు లెంతేని సరి చెప్పవచ్చు;
నైనఁ గానిమ్ము, నాయాత్మలోపలను
నే నెఱిఁగినపాటి యెఱిఁగింతు వినుము;
అంతట నొక్కనాఁ డనఘుండు వ్యాసుఁ
డంతరంగంబున నానంద మొదవ
నరుదెంచి, వినతుఁడై యాసత్యవతికి
గర మర్థిఁ బలికె నేకాంతంబునందు :
"అతివ, యీసంసార మతిచంచలంబు;
మతిఁ దలంపఁగ నెండమావులయట్లు
జలతరంగములట్లు సంపదలెల్ల;
నలిఁ దలంపంగఁ బ్రాణము లస్థిరములు;
కాయంబు విద్యున్నికాయంబు తెఱఁగు ;
ప్రాయంబు లటు కతిపయదివసములు;
గతకాలమే మేలు కమలదళాక్షి!
గతమె [121]సౌఖ్యము వచ్చుకాలంబుకంటె.
కురుకులేశ్వరుపెద్దకొడుకు దుర్మార్గ
పరుఁడు, క్రూరుఁడు, మహాపాపమానసుఁడు;
వానితమ్ములు నట్టివారలు; గానఁ
బూని యాకురుకులంబునకుఁ జేటొదవు;
కర ముగ్రముగఁ బ్రజాక్షయమును గలుగుఁ ;
బొరిఁబొరి నేదలపోసిచూచితిని,
అనయంబు మఱి దాని నాంబికేయుండు
ననుభవించెడుఁ ; గాని, యట్టి[122]కార్యములఁ
జూడక యిఁక వీరిచోటు చాలించి,
కోడండ్రఁ దోడ్కొని, గురుబుద్ధితోడ
సుడియక విదురభీష్ముల కెఱింగించి,
యడవులఁ దపముసేయఁగ నేఁగుమమ్మ!
తపమునఁగాని, యెంతయును వేఱొండు
ఉపమల గతియుండ దూహింప.” ననుచు
నల్లన బోధించి, యంత వ్యాసుండు
తల్లిని మఱదండ్రఁ దపమున కనుప,
నరయ నమ్మునియాజ్ఞ నతివలు భక్తి
వెరవొప్పఁగాఁ దపోవేషంబు దాల్చి,
దారుణాటవినుండి తమతపోమహిమ
వారు ప్రాపించిరి వైకుంఠపదము.
ధృతరాష్ట్రుఁడిట నెల్ల దిక్కులనృపుల
కతిశయప్రాభవాయతఁ బెచ్చు పెరిగి,
'తనయులు, నాపాండుధరణీశసుతులు,
ననియెడు భావంబు లాత్మలో లేక
'కొడుకులు నూటయేగురు నా' కటంచు
నెడనెడ నాడుచు నెందు నేమఱక,
పెద్దగద్దియమీఁదఁ బేరోలగమునఁ
దద్దయుఁ బ్రియముతో ధర్మనందనునిఁ
దొడలపై నిడుకొని, దొరయ ధర్మంబు
లడుగుచు రాచకార్యంబు దీర్చుచును,
భీమార్జునులలావు పేర్మిమై గడఁగి
వేమఱు ఘనశత్రువిజయంబు [123]గనుచు,
నకులుని సహదేవు నన్నలచెంత
నకలంకమతికి [124]నందంద మెచ్చుచును
బాండునిమాఱుగాఁ బరికింపుచుండె.
బాల్య క్రీడలు, అసూయాంకురప్రాదుర్భావము
పాండుసూనులఁగూడి బాల్యంబునందు
దుర్యోధనాదులు తోడఁబుట్టువులు
గార్యార్థిమిత్రులై కడుఁబొత్తు గూడి,
సాముచోఁ జదువుచో జలకేళిచోట
వేమాఱు విలువిద్య వెసనేర్చుచోట
నిద్దఱిద్దఱు గూడి యే క్రియనైన
సుద్దుల మనుచుఁ బెన్నుద్దుల మనుచు
బయళుల నుప్పనఁబట్ట లాడుచును,
బ్రియము నటించుక పేరు లాడుచును,
దీపు [125]పుట్టఁగ బిల్లదీపు లాడుచును,
గోపురా నొడ్డనకోపు లాడుచును,
ఏటిలోతునఁ జొచ్చి యీఁదులాడుచును,
[126]ఏటిపారపుమ్రాఁకు లెక్కి యాడుచును,
బెరయ నొండొరుఁ బట్టి పెనుగులాడుచును,
దరమిడి [127]తగులునఁ దాఁకులాడుచును,
మఱియును శిశువులు మహి వేడ్కవుట్టి
నెఱి నాడుదెఱఁగులన్నియు నాడుచోటఁ,
బవనసూనున కోడి, పార్థున కోడి
కనలకుఁ బాండవాగ్రజునకు నోడి,
యోడినకోపాగ్ని నుల్లంబు గమరి,
యాడినపంతంబులన్నియుఁ దప్పి,
యనిలనూనుఁడు దమ కధికుఁడై యున్న
గనుఁగొనఁజాలక, కడు[128]నిగ్రహమున
నంతటఁ దెలియక, యాసుయోధనుఁడు
మంతనంబున మేనమామ కిట్లనియె:
“సులభసాధ్యులుగారు చూచితే శకుని!
బలవంతులెంతయుఁ బాండునందనులు;
వారిలోపల నెల్ల వాయునందనుఁడు
వారనికడిమి దుర్వారతేజుండు ;
మూర్తిమంతుఁడు; వీని మును జంపకున్న
ధార్తరాష్ట్రుల కెందుఁ దలలెత్తరాదు
పగవానిఁదెవులును బ్రబలకమున్న
తెగఁజూడకుండినఁ దెగును గార్యంబు.
ఇందఱుఁ జూడంగ నెకసక్కమునను
బొందేది మారుతపుత్త్రుండు మమ్ము
నిరుమూపు లెక్కించి యీఁదుచు, నడుమఁ
బరిహాసగతి ముంచుఁ; బ్రార్థింప విడుచు.
చలమున నేము వృక్షము లెక్కఁ జూచి
'ఫలములఁ దెండు కప్పములు నా' కనుచుఁ,
దనకురాల్పకయున్నఁ దరువులు పట్టి
పనివడి భీముండు పడరాల్చు మమ్ము.
పెక్కేల! యర్జునుపిడికిలి వీడ
నొక్కలేమైతిమి నూర్వురుఁగూడ.
నొగలఁడుధర్మసూనుఁడు; [129]వాదు కొయ్యఁ
దగవు చెప్పినయట్లు దండించు మమ్ము.
ఏపదార్థంబైన [130]నిమ్ముతోనిమ్ము
చూపుదిప్పక దాఁచి చూపకయున్న,
నెట్టి వివేకులో! యేతెంచి కవలు
పట్టిచూపుదు; రిట్టి బలియులుగలరె!
కన్నార ధర్మజుఁగన్న కన్నులకు
నన్ను రాజన నేలనమ్మికపుట్టు!
అటుగాన, నేయుపాయంబులనైనఁ
బటువృత్తి, బవనజుఁ బరిమార్పవలయు.
వాఁడొకఁ డీల్గిన వారిలావణఁగుఁ;
బోఁడిగా నేలుదు భువియెల్ల నేను."
దుర్యోధనుఁడు భీమునిఁ జంపఁ దివుఱుట
అన, వానిఁ దెగటార్ప ననవు చింతించి
పనిచిన, గురురాజు పవనజుఁ దొలుత
జలములు తమలోన జల్లుపోరాడి
యలసి నిద్రించిన యాసమయమునఁ
బట్టించి సంధులు, బలువుకంబమునఁ
గట్టించి యొకనాఁడు గంగఁ ద్రోసినను,
మునుఁగుచు నడుమ భీముఁడు నిద్ర దెలిసి,
తనువుననున్న బంధముతోడ [131]ల్లి
వెడలివచ్చిన, వాని వేగ నీక్షించి
గడులజ్జఁ బాల్పడి కౌరవేశ్వరుఁడు :
'జలధిముంచిననైన సర్వేశ్వరుండు
గలుగునాయుష్యంబుగలవాని' కనుచు
బలిమి వెండియు నొకపాములవానిఁ
బిలిపించి, పూజించి, ప్రియములు సెప్పి:
'బ్రహ్మమంత్రములైన బలిమిఁ గైకొనని
జిహ్మగముల నీవు చిక్కించితెచ్చి,
కఱపించి చంపుము ఘనుభీమసేను;
వెఱపించు నాతండు వేమాఱు మమ్ము.
పవమానుఁ గ్రోలెడు పామునోళ్లకును
బవమానసుతుఁ డెంత పట్టిచూడఁగను!”
అనుటయు, నొడంబడి యహితుండికుండు
ననిలజు నిద్రించునావేళఁ గదిసి,
యందియు నందని యాహారనియతిఁ
గుంది భీకరవిషాగ్నులఁ బొరయుచును,
గతకాల మెవ్వరిఁ గఱచుటలేక
పుతపుతవోయెడు బోసినో ళ్లమర,
మెఱయుచు రోఁౙు పాములచేత నతనిఁ
గఱపింపఁగాఁ, [132] బళ్లుగాఁడక యవియుఁ
దెఱగొప్పఁ జీనులు తేనియ [133]గుడిచి
గఱవనోపక [134]పాఱుగతిఁ బాఱఁదొడఁగె.
అంత మెల్లనఁజూచి యావజ్రతనుఁడు
పంతపుఁబాములఁ బట్టి చెండాడి,
యుర్విఁ బాములవాని నుదికిన ట్లుదికి,
నిర్వికారతనుండె. నెఱి మఱునాఁడు
అమరారి తొల్లి ప్రహ్లాదునిఁ జంప
నమరి యత్నము చేసి యలసిన ట్లలసి,
యట బాలశశిఫాల నడబాల బాలఁ
గుటిలకుంతలఁ బిల్చి [135]కొంక కిట్లనియె:
"పడఁతిరో! శిలమాఱుఁ బవనకుమారు
నడపవే! యొక్కమా ఱ[136]తిశోకమాఱు;
వడ్డించునావేళ వానియన్నమున
జిడ్డుగా నొకకొంత చిలుకవే విషము.
నీవు [137]పెట్టినకూడు నిజమని కుడుచు;
నేవెంట నాకును హితమతి వీవు.
అతనిఁ జంపినఁ జత్తు రఖిలపాండవులు;
క్షితియెల్ల నాకు నిచ్చినదాన [138]వౌదు."
అనుటయు నొడఁబడు నాయడబాల
యునికిని మునుపె యుయుత్సుం డెఱింగి,
వారివాఁ డయ్యును వాయుజుతోడ
నారీతి యెఱిఁగింప, నతఁ డాత్మగొనక
యడబాల యిడిన విషాన్నంబు గుడిచి,
యడరి రుద్రునిరీతి నఱిగించుకొనియె.
ఈరీతి భీముని నెల్లమార్గముల
వారక గరళంబు వరుసఁ బెట్టించి,
నిద్రింపఁ బాముల నెఱిఁ గఱపించి,
క్షుద్రుఁడై గంగలో సుడివడఁద్రోసి,
యేయుపాయంబుల నేచి వాయుజునిఁ
బాయక చంపునుపాయంబు లేక,
తఱివేచి యాసుయోధనుఁడు పాండవుల
కృపాచార్యుల వృత్తాంతము
అంతఁ, గృపాచార్యుఁడను విప్రధన్వి
కాంతాసమేతుఁడై కాంతిమిన్నంది
యరుదేరఁగా, భీష్ముఁ డతని రావించి,
[139]పురువంశవిధుచేతఁ బూజచేయించి :
"యెవ్వరు మీరు? ము న్నెచ్చోటివార?
లివ్విల్లు మీచేత నెంతయు నొప్పె;
నెఱుఁగుదురా దీని నేమైన?” ననినఁ
జిఱునవ్వు దళుకొత్తఁ జెప్పె నాకృపుఁడు :
"నరనాథ, గౌతమునకు నహల్యకును
శరచాపహస్తుఁడై జనియించినట్టి
వీరుండు మాతండ్రి విను [140]శరద్వంతు;
ధారుణి నతఁ డుగ్రతపము సేయంగ,
శతమఖుఁ డంతలోఁ జింతింపఁదొణఁగె: (?)
“ఇతఁడు కైదువుతోడ నిలఁ బుట్టి తొలుత,
నటమీఁదఁ దపముసేయఁగఁ జొచ్చె; దీన
నెటుహాని పుట్టునో! యిటునమ్మరాదు;
ఇంతట మాన్చెద నీతపం" బనుచుఁ
జింతించి యప్సరస్త్రీల రావించి,
జలపదియనుదానిఁ జక్కనిదాని
బిలిచి, యచ్చెలువతోఁ బ్రియములు సెప్పి :
"తరుణి, గౌతమపుత్త్రుతపము విఘ్నంబుఁ
బొరయింపు;" మని పంపఁ, బోయి యవ్వనిత
కలికి గాడ్పున మేను గందునో యనుచుఁ,
జిలుకౙంకెల నాత్మ చెదరునో యనుచు,
వింతఠావున దృష్టి వీఁగునో యనఁగఁ,
గాంతి మేదినిఁ గొంతగాఱునో యనఁగ,
సిగ్గులు నగవులుఁ జెనకుచూపులును,
నగ్గలికలు నేర్పు లలసయానములు,
మెలపులు గరిమలు మెచ్చకుండుటలుఁ
జెలుములు బలములుఁ జిడిముడిపడఁగఁ,
గుచములుఁ గచములుఁ గునిసియాడంగఁ,
బ్రచురమై రత్నహారము లొయ్యఁ దూలఁ,
గంగణఝణఝణత్కారంబు మెఱయ,
నంకించి యందియ లల్లన మొరయ,
విడువక చిఱునవ్వు వెన్నలగాయ,
నడు మసియాడంగ నడతెంచి వచ్చి,
యోడక నిలిచి యయ్యోగికట్టెదురఁ
బాడిన, శృంగారభావంబు పుట్టి
యుల్లంబు నుల్లంబు నొక్కటియైన,
ఝల్లన మదనరసంబు నెట్టవిసి
ధారాప్రవాహమై తపసికి వెడలి,
యూరక శరముపై నొలికి రెండయ్యె.
అందు నేనును నొక్కయాఁడుబిడ్డయును
ఇందువంశాధీశ, యెలమిఁ బుట్టితిమి.
ఆయెడ మాతండ్రి యచ్చోటు వాసి
పోయె; దేవస్త్రీయుఁ బోయె నద్దివికి.
అంత, వేటాడుచు నట వచ్చివచ్చి
శంతనుం డేమున్న చందంబు చూచి
కొని తెచ్చి పెనుచుచోఁ, గొంతకాలమున
కనఘుండు మాతండ్రి యట మమ్ము వెదకి
చనుదెంచి 'వీరు నాసంతాన' మనుచు
మనుజేంద్రునకుఁ జెప్పి మముఁ గొనిపోయి,
కృపుఁడనుపేరును గృపియనుపేరు
[141] నృప, మాకు నొనరించి నెమ్మి రక్షింప
నేర్చితి నతనిచే నిఖలశాస్త్రములు;
రాచచిత్తంబులు రానుండ నేర్తు;
నేలిన మేలు; నన్నేలుఁడు మీర;
లాలంబులోన సహాయమయ్యెదను."
అనిన భీష్ముడు పల్కు: “నాచార్య, నీవు
ధనువు నేర్పుదుగాక ధార్తరాష్ట్రులకు.
'ఎవ్వరుగలరొకో యిచ్చోట' ననఁగ
రువ్వున వచ్చితి రుత్త మోత్తములు.
వీరె కౌరవ్యులు; వీరె పాండవులు;
వీరె నానాదేశవిభుకుమారకులు;
బాలశిక్షకు మీరు ప్రౌఢులుగాన,
నీ లేతబిడ్డల కీడేర్పుఁ" డనుచు
భూమీశుననుమతిఁ బొలుపొంద నైదు
గ్రామంబు లతనికి గ్రాసార్థ మిచ్చి,
కరిముఖునకు [142]మోదకములు పెట్టించి,
కరిదంతముల విండ్లుఁ గనకలక్ష్యములుఁ
జక్కనిశరములు శస్త్రభేదములుఁ
జక్కనిజోళ్లు విచిత్రపుఁదొనలుఁ
చేయించి, చల్లని శ్రీఖండతరుల
నాయతమగు శాల లాయత్తపఱచి,
యాచార్యులకుఁ జీర లాభరణములు
దాఁచినరతిఁ గన్నుతనియంగ నిచ్చి,
నృపకుమారులనెల్ల నేర్వఁ బెట్టుటయుఁ,
గృపుకృపామహిమ మిక్కిలి గల్గి వారు
లక్ష్యంబు లేయుచు, లలనాకటాక్ష
లక్ష్యంబులై హస్తలాఘవం బొప్ప,
నూనెదట్లును మొలనూళ్లును బిగిసి
మేని క్రొమ్మించులు మెఱయ, నిత్యంబు
నభ్యసించినవిద్య లాపగేయాది
సభ్యులముందఱఁ జక్కఁజూపుచును,
మక్కువ నందఱు మహిమతో నప్పు
డక్కజంబుగ నేర్పు లమరఁజేయుచును,
జాపశిక్షాప్రౌఢి చాతుర్య గరిమ
యేపారఁ జెలఁగించి యెలమి మించుచును,
దమలోనియాగ్రహతము నొక్కనికిని
సమచిత్తులై శాంతి చాల నేర్పుచును,
ఓర్వలే కందులో నుగ్రించునతని
నుర్విఁ గృపాచార్యు కొనరఁ జెప్పుచును,
జెప్పిన గురుమూర్తిశిక్షల కులికి
ముప్పిరి నందఱు మొగి నొక్క టగుచు,
నూఱటయగు వేళ [143] నుబుసుపోకకును
బౌరులు వీక్షింప బాల్యంబు గానఁ
జెలువుగా ముత్యాలచెండు గట్టించి
కలసియాడుచు, మిన్నుగాఁడనేయుచును,
వ్రేసినఁ గ్రుంకిడి వెసఁ జెండు గొనుచు
డాసి క్రమ్మఱలేచి డాసిపోవుచును,
వెనుకొని వ్రేయుచు వెస నుర్వివ్రాలు
ఘనకందుకముఁ బాఱి గ్రక్కునఁ గొనుచు,
నారీతి వైచుచు నటవచ్చుచోటఁ
జేరి పైపైపడి చేతు లొగ్గుచును,
నెవ్వనిచేఁ జొచ్చె నింతలో వాఁడె
'గూడ నెవ్వఁడుపాఱి కూడిన వాఁడె
యీడువానికి' నని యి ట్లెన్నుకొనుచు
నాడుచో, నొక్కనాఁ దామేటిచెండు
మేడలపైఁ బాఱి మిద్దియ లెక్కి
పరిపూర్ణసితకరప్రభ లుల్లసిల్ల
నురవడి మెఱయుచు నొప్పార నదియు
వాటుకందక వచ్చి వడి నప్పురంబు
కోటవెల్పల వడిఁ గూపంబులోనఁ
బడిన, నందఱుఁ జెండుఁ బట్టి రాఁదివియ
నొడఁగూడమికిఁ జూచుచుండిరి కూడి.
ద్రోణుఁడు నూతఁబడిన కందుకము నుద్ధరించుట
అంత ద్రోణాచార్యుఁ డాలును దాను
సంతానతిలకు నశ్వత్థామఁ గొనుచు,
నిలుగుజన్నిదములు నీర్కావి [144]దోత్ర
మలికంపుఁగీల్కొప్పు నరపగడ్డంబు,
వెడఁదవక్షంబును విల్లునమ్ములును
[145]మెడపెంవునడరించు మేలుపచ్చడము
నందంద చూపట్ట నచటికి వచ్చి,
యందఱ దీవించి, యానూతిలోని
ఫణిఫణారత్నప్రభాభాసమాన
మణికందుకముఁ జూచి మందహాసమున
నిందఱ నిట్లను : "నిది యేమి! మీర
లిందువంశపురాజు! [146]లెంతకు లేరు!
కృపుడంటె మిమ్ము శిక్షించెడిగురువు!
కానవచ్చినసొమ్ము గైకొనలేరె!
కాన నెక్కడివారు ఘనశస్త్రధనము
భరమున నీబావిఁబడినకందుకము
వెరవునఁ గొనలేక వెడఁగులై యునికి
పౌరుషంబగునయ్య పార్థివావలికి!
నేరరే దీనికి నిజ మొక్కవెరవు?”
అనిన, నాతనిఁ జూచి యంద ఱిట్లనిరి:
చనునె! నీ కిట్లాడ జగతీసురేంద్ర!
పాతాళవివరంబుఁ బలె నున్ననూయి
భేతాళుఁడైనను భీతిల్లుఁ జొరఁగ.
చొచ్చిన వెడలెడుచొ ప్పెందులేదు;
పుచ్చనేరము; మాకుఁ బుచ్చియీ మీకుఁ
జొప్పడనైనను; జూత మావెరవు!
ఒప్ప నెంతయు దీని నొగిఁ దీసియిమ్ము
నీవిద్య”. ననుటయు, నృవకుమారకుల
భావించి ద్రోణుఁ డుద్భటవృత్తిఁ బలికె :
గురుఁడ విద్యలకెల్లఁ; గోదండగురుడఁ;
బరికింపుఁడీ నన్ను బటుబుద్ధు లగుచుఁ ;
సాయుడందఱు”. నని బాణంబు వింట
ధీయుక్తి సంధించి, దృష్టి సంధించి,
చెండు నాటఁగనేసి, చెలఁగి వేఱొక్క
కాండ మక్కాండపుంఖమున నాటించి,
యాతూపునకు నొక్కయస్త్రంబుఁ జొనిపి,
యాతూపు వేఱొక్కయలుగున నాటి,
యాయమ్ముపింజయు నట గాఁడ నొక్క
సాయకంబున నేసి [147]సరవి దీపింప,
వెండియు నీరీతి విశిఖంబు లేసి
కాండరజ్జువు చేసి, కలశసంభవుఁడు
ఈఁతనీళ్లమునింగి యేర్పడకున్న
నూతిలోపలిచెండు నుతగతిఁ దిగిచి
యిచ్చిన, వెఱగంది యిందువంశేంద్రు
లచ్చాపధరవర్యు నర్థితో మెచ్చి,
హర్షాద్భుతాక్రాంతులై కుమారకులు
శరగురుఁ దోడ్కొని సరవి నాచెండు
వడి గ్రుచ్చి పదిలమై వదలింపరాని
కడుకాండరజ్జువుఁ గైకొని వచ్చి
ధృతరాష్ట్రు కొలువులో దేవవ్రతాది
హితులముందఱఁ బెట్టి యెంతయుఁ జెప్ప,
సంతోషచిత్తుఁడై శాంతనవుండు
సంతుష్టుఁ గావించి శరగురు నపుడు :
"వెదకునౌషధలత వెసఁ గాలఁ బెనఁగె;
ముదమారఁ గడుదవ్వు [148]ములుగుచు నేగి
యాడఁబోయినతీర్థ మచ్చోటి కపుడు
వేడుక నెదురైనవిధ మయ్యె". ననుచు
వెనుకొని ద్రోణుని వేడ్కఁ బూజించి :
"యనఘాత్మ, మీ రెవ్వ రానతి యీవె!
ఆఖండపరశువో! యాఖండలుఁడవొ!
యేఖండమునఁ గాన మింతటివాని;
నెచ్చోట నుండుదు? రేది మీనామ?
మిచ్చోటి కేతేర నేమి కారణము?
విన వేడ్కయయ్యె మీవృత్తాంత.” మనినఁ
దనకునిచ్చినగద్దెఁ దగనుండి యతఁడు :
ద్రోణాచార్యవృత్తాంతము
వినవయ్య, మునిగోత్రవిఖ్యాతుఁ డనఁగఁ
దనరుభరద్వాజుతనయుండ నేను;
నాపేరు ద్రోణుండు; నరలోకవినుత!
యేపార విలువిద్య యెఱుఁగుదుఁ గొంత.
వరతనూజాతుఁ డశ్వత్థామ యనఁగఁ
బరఁగు నీతనిపేరు పార్థివ, వినుము.
శీతలజాహ్నవీసింధుసంగమున
మాతండ్రి యొకనాఁడు మజ్జనం బాడి
యచ్చోట వీక్షింప, హావభావములఁ
బచ్చవిల్తునిదీమొ! పసిఁడిపుత్తడియొ !
మొనసిన మెఱుఁగుల మొత్తమొ! కాక,
తనరారు లావణ్యధామమో! కాక,
దాఁచినవేడ్క ఘృతాచినా నొక్క
ఖేచరి తనజలక్రీడకు వచ్చి,
మునిఁగి లేచిన దివ్యమునిఁ గీరవర్ణు
ఘనుని భరద్వాజుఁ గానమిఁ జేసి
వలువూడ్చి ధరఁబెట్టి వారిలో నుఱకఁ,
.................................................
గదళికాకాండయుగ్మముఁ బోలు తొడలుఁ,
బదములకెంపులు భవ్యదీధితులు,
దెగగలకన్నులు దృష్టించి యలరి,
తగుతర్పణంబులతరవాయి మఱచి,
నియమింపనరిదైన నిజవీర్యధార
భయమున భూమిపైఁ బడనీక యపుడు
తొడఁగి తాఁ దెచ్చినద్రోణంబులోన
వీర, యే నిది యుద్భవించినతెఱఁగు ;
నారాక కిటు విను నాల్గుమాటలను.
పృషతుండునా నొక్కపృథ్వీశ్వరుండు
ఋషివేషధారియై ఋష్యాశ్రమముల
మెలఁగి, మాతండ్రితో మిత్రభావమునఁ
గలసి వర్తింపుచు, ఘనుఁ డొక్కనాఁడు
మిన్నేటిచేరువ మేనకాకాంత
పొన్నపూవులు గోయఁ బొడగాంచి సొక్కి:
యెవ్వరొకో! చిత్ర మీపువ్వుఁబోఁడి!
నవ్వకనవ్వెడు నవకంపు మొగముఁ,
ద్రచ్చివైచినయట్లు తలచుట్టుఁ దిరిగి
వచ్చినగతిస్తున్న వాలుఁగన్నులును,
గుంభికుంభకశాతకుంభకుంభములఁ
గుంభినిపైఁబోలు కుచకుంభయుగము,
మరుఁడు జయంబంది మహిమఁ బూరించు
కరశంఖగతి నొప్పు కలికికంఠంబుఁ,
బసనిమించుల మించు బంగారువన్నె
పసిమిగల్గినయట్టి బాహుమూలములు,
సులభ[149]నిమ్నగభర్త సుడివోలె మించి
నలికమై యున్నట్టి నాభిరంధ్రంబు,
సలలితగతి నాకసంబునుబోలి
కలదులేదనువాదు గలిగించు నడుము,
మదనునితేరి సమప్రభఁ బొలిచి
[150]పొదలు సైకతమును బోలిన పిఱుఁదుఁ,
గరికరంబుల గెల్చి కదళికాతతులఁ
బొరపొచ్చెములు సేయఁబూను పెన్దొడలు,
నరుణాంబుజమ్ముల కప్పులీఁజాఱు
నరుణిమమించిన యనుగుఁదమ్ములును,
గ్రొన్ననలకుఁబోక కొదమతుమ్మెదలు
తన్ను గొల్వఁగనొప్పు తనుసౌరభంబుఁ
గలిగియున్నది; దీనిఁగనిన నాయొడలు
గిలిగింతలెసగెడుఁ గృత్యమేలింక ! '
నని చూచి, మఱి చూచి, యందంద చూచి,
తనకు భరద్వాజుతరవాయి వచ్చి,
మగువఁజెందినచూడ్కి మరలంగఁదివియఁ
దెగువచాలక చిక్కి ధృతియెల్లఁ దూలి,
కడిమిమై మరుచేతికరవాలులీల
బెడఁగుగా జళిపించు పేర్మి దీపింపఁ
[151]గల్హారదళనేత్ర కడకంటిచూడ్కి
యొలసిముట్టినచిత్త ముత్తలంపడఁగ,
నఱిముఱి సూనాస్త్రుఁడనువేటకాఁడు
తెఱవరూపంబను దీమంబుఁ జొనిపి
కలకంఠి లేఁజూడ్కిగములను నురుల
నెలయింపఁ దగిలినయిఱ్ఱియుఁబోలెఁ,
దొలఁగఁజొప్పడక వందురి తొట్రుగొనుచుఁ,
దలకొన్నకలఁకతోఁ దగ నిల్వలేక
మదనాంబు వొలికిన, మహి నది చూచి
తుదకాలఁ బృషతుండు త్రొక్కెఁ; ద్రొక్కుటయు,
ద్రుపదుండు పుట్టె; నాద్రుపదుండు నేను
నుపమింప వయసున నొక్కపెద్దలము.
అంత, నాతఁడు పుత్రు నచ్చోట నునిచి,
శాంతిమైఁ దొంటిపాంచాలభూములకు
రాజుగాఁ బోయిన, రమణ నిర్వురము
నాజన్మసఖులమై యయ్యాశ్రమమునఁ
బెరిగితి; మింతలో బృషతుండుచావ,
సరి రాజ్యమౌనని చని ద్రుపదుండు
పాంచాల భూమికిఁ బ్రభువుగాఁ జనుచు
డించి [152]పోలే కూఱడించి నన్నపుడు :
“ద్రోణ, నీవును నేను దోడ్తోడ గలసి
ప్రాణంబు లేకమై బహుకాల మిట్లు
ఎడమడు వొక్కింతయేనియు లేక
యుడివోనికూర్మితో నుంటి మిన్నాళ్లు.
రమణమై [153]నొంటి నే రాజ్యభారంబు
గ్రమమున భరియింపఁ గారణం బేమి!
భాసురంబగు రాజ్యభాగంబు నేను
భూసురాగ్రణి, నీకుఁ బొసఁగ నర్పింతు.
మిత్రునభ్యుదయంబు మిత్రున కొసగఁ
బాత్రంబుగావున, బంధుయుక్తముగ
నవయనేటికి! నమ్ము నా వెంటరమ్ము :
సవరింతు నిన్ను నే సకలభోగముల.
రసికత నిటనుండి రానొల్లవేని,
పొసఁగినప్పుడె రమ్ము పూజింతునిన్ను".
అని పోయెఁ; బోయిన, నచ్చోట నేను
ధనువు నేర్చెదనని తలఁపులోఁ బుట్టి
యగ్నివేశుండను యమిచంద్రునొద్ద
నాగ్నేయసాయకంబాదిగా నెఱిఁగి,
విలువిద్యలందలి వినిధకృత్యములు,
నొలసిన బహువిధవ్యూహభేదములు,
నమ్మహామునిశిక్ష నాయుధాభ్యాస
మిమ్ముల నెఱిఁగి నే నెలమి దీపించి,
కృపునిసోదరి నంతఁ గృపియనుదానిఁ
[154]దపనీయ కమనీయ తను నొయ్యనడిగి
పెండ్లియాడితి; వీఁడె బిడ్డండునాకుఁ;
బెండ్లిప్రాయంబయ్యెఁ; బేదకాపురము;
[155]సర్వాంగములఁజూవె జనియించెఁ గొడుకు;
సర్వశాస్త్రంబులఁ జతురుఁడెంతయును.
ఇరువుర రక్షింప నేనోడి యంతఁ,
బరశురామునిఁ బోయి పసిఁడివేడినను,
అత: "డేను [156]ధనమును , నవనిచక్రంబు
హితమతి విప్రులకిచ్చితిమున్న;
యస్త్రంబులిత్తునో యర్థంబు మాఱు!
శాస్త్రజ్ఞ, యడుగుము చాలినవన్ని,
ఇరువదియొక్క మాఱేచి రాజులను
బొరిగొంటి నవియేమి పొల్లులుగావు".
అనిన, శిష్యుండనై యారాముచేత
జననాథ, గాంచితి శస్త్రాస్త్రవిద్య.
అదిగాక విను, మొక్కయయగారియొద్దఁ
జదురు నశ్వత్థామఁ జదువంగఁబెట్టఁ,
దనతోడి బాలురుఁ దానును గూడి
పనిగొన నక్షరాభ్యాసకాలమున
గురువుచే నంపించుకొని యిండ్లకేఁగి,
స్థిరమతితో వారు క్షీరాశనంబు
భుజియింపఁగాఁ జూచి బుద్ధిలోవగచి,
భజన నశ్వత్థామ పఱతెంచి, తనకు
వారారగించుకైవడిఁ బెట్టుమనుచు
ధారుణి మముఁ బెద్దతడవు ప్రార్థింప,
నప్పుడు లేమనునంధకారంబు
గప్పిన మదిలోనఁ గడుఁదత్తరించి,
కౌగిటఁగదియించి కన్నీరు దుడిచి,
మూగినవగలతో ముద్దుపాపనికి
బాలెందులేమికి భావించి వగచి:
"పాలకు నాల్గేనుపాఁడికుఱ్ఱలను
బాంచాలుఁడొసగక పాలుమాలెడినె!
'పంచియిచ్చెద రాజ్యభాగంబు నీకు'
నని బాల్యమునఁబల్కె నతఁడుమాతోడ;
మనమున నామైత్రి మఱవంగఁగలఁడె!
ఇల పంచియీకున్న నీమాత్రమైన
గలిమితో నొసగక గడవజాలెడినె!
బలిమి నాచెలికాఁడు పాంచాలవిభుఁడు
చెలువార రాజ్యంబుసేయుచున్నాఁడు;
కోరినంతర్థంబు కొదవడకుండ
బోరననిచ్చు నేబోయెదఁగాక".
ద్రోణుఁడు ద్రుపదుచే నవమానితుఁడగుట
అనిమదినూహించి, యతివయు నేను
దనయునిఁదోడ్కొని తగు ప్రయాణములఁ
బొలఁపొందఁ గాంపిల్యపురికి నేతెంచి,
పొలఁతినొక్కెడనుంచి పోవుచో, నెదుట
మణికిరీటోజ్జ్వల మకుటవర్ధనులు
ప్రణమిల్లి వినతులై బహుభంగిఁగొలువ,
[157]భండనాధ్యక్షు లప్రతిహతబలులు
దండనాయకులు నుద్దండతఁ గొలువ,
సందడి దొలఁగంగ జడియుచుఁ గదిసి
యందందుఁ బటువేత్రహస్తులు గొలువ,
నుడుగనిమదధార నుజ్జ్వలంబగుచుఁ
బొడవైన కొండలఁబోలుకుంభినులుఁ
గడిఁదివజ్రముకంటె గాడ్పునకంటె
బెడిదమై జవములఁ బేర్చునశ్వములు
సరవిమైఁ జూపట్టి సమదాళికమరి
యిరుదెస మొత్తమై యిమ్ములఁ గొలువ,
మెఱుఁగారు తొడవుల మించులేఁదొడల
నిఱుపేదనడుముల నిండి క్రిక్కిఱిసి,
కడుమించుకుచములఁ గంబుకంఠముల
సుడిబోలునాభుల సొబగుఁ బల్కులను
గమలాకరంబుల కాంతిఁగీడ్పఱచు
విమలాసనంబుల వెడఁదకన్గవలఁ
గుటిలాలకంబులఁ గొమరుదీపించి,
పటువైన మరుచేతిబాణంబులనఁగఁ
బొలుపారి విలసిల్లు పుష్పకోమలులు
లలితోజ్జ్వలాకార లావణ్యవతులు
కరకంకణంబులు కదిసి ఘోషింప
సరసత్వమునఁ జేరి చామరలిడఁగ,
దివ్యభూషణ మణిదీప్తులు వెలుఁగ,
భవ్యపుష్పంబులు భవ్యగంధములు,
గ్రమమునధరియించి, కనకాసనమున
నమరేంద్రువైభవంబలరఁ గూర్చున్న,
నుపకార మీవేళ నొదవు నాకనుచు
ద్రుపదునొద్దకుఁబోయి దుఃఖంబుద్రవ్వి :
"చెలికాఁడ, నీవాఁడఁ జేపట్టునన్ను;
నలఁగివచ్చితిఁ జూడు నాకుటుంబమ్ము!
నా పేరు ద్రోణుండు నరనాథచంద్ర,
యేపున నాకోర్కె యిచ్చి నన్ననుపు
పాలుద్రావెడి తోడిపడుచులఁ జూచి
బాలుఁ డశ్వత్థామ పాలు వేఁడినను,
నీయాన, వరిపిండి నీళ్లలోఁ గలిపి
చేయారనిత్తుము చెప్పెడిదేమి!"
అనవిని ద్రుపదుం డహా! యని నవ్వి,
తన రాజ్యమదమునఁ దగవేది పలికె :
"ఎక్కడిచెలికాఁడ! వేవలరాక!
యెక్కడికరుదేర! నిదియేమిపాఱ!
బక్కవు నీవెట్లు! ప్రభువ నేనెట్లు!
వెక్కిరించెడు వారి వీక్షింపవైతి!
కుంచెడు బియ్యంబుఁ, గూరగట్టయును,
బంచాంగపఠనంబుఁ బ్రాప్త౦బు నీకు.
ఎన్నఁటి చెలికాఁడ! వేనాఁటివాఁడ!
వెన్ననాతరమేడ! [158] నీతర మేడ!
నాసరివాఁడవే! నాతోడి చెలిమి
యోసరింపక చేయ నుర్విలోపలను!
వెనుక నెన్నఁడు నిన్ను విని యేనెఱుంగఁ;
గనియునునెఱుఁగమే! కాఱులాడెదవు;
కాన, నిప్పుడు రాచకార్యంబు గలదు;
జానొప్ప నెందైనఁ జయ్యనఁ జనుము.
చెలికాఁడ వెట్లైతి! చెప్పిడిదేమి!
కలలోననైనను గదిసి నీతోడ
భాషించియెఱుఁగము; పాలుమాలుదురె!
పోషణకిట్లాడఁబోలునె విప్ర!
ధనవంతుతో [159]జన్మదారిద్య్రునకును,
ఘనసత్వనిధితోడఁ గడఁగి మూర్ఖునకు,
రణబలోదగ్రుతో రణభీతునకును,
గుణగరిష్ఠునితోడ గుణశూన్యునకును
దలపోయఁ 'జెలికాఁడఁదా' ననఁదగునె!
చెలిమిగావింపను, జేరిభాషింప,
బలిమిఁబోరాడను, బాడినిబెనఁగఁ,
గలహింపఁ, ద్రోపాదఁ, గలసివర్తింప,
సమసత్వులైనను సమకూడుఁగా; క
సమ[160]విభవుల కేల సాంగత్య మొదవు!
ధరయెల్లఁ బాలింపఁదగు రాజ నేను;
బరికింపఁగాఁ బేదబాపఁడవీవు;
మిత్రుండననుమాట మిన్నకిట్లాడి,
శత్రుండవైతివి చనుమిందుఁ బాసి.
అదియేల! కార్యార్థమై నీచదశల
నొదవును సన్మైత్రి యొక్కొక్కయెడల;
భూపాలురకు నల్పపురుషులందైన
దీపించుశుభవేళఁ; దిరమానెయదియు!”
నని క్రూరచేష్టితుండై భూవిభుండు
తనసేవకులఁబంచి, తత్సభాస్థలము
'వెడలంగనడపుఁడీవిప్రుని' ననుచు
దడయక త్రోపించె ధర్మంబు వదలి.
త్రోచిన వెలువడి, [161]తోఁ దొట్రుకొనుచు,
నేచి క్రోధాగ్నిచే, నింతియు నేను
ననఘాత్మ, లజ్జించి యందఱిలోన,
ననువేది మనసు పదాఱింటవిఱిగి:
[162]"లేమిచే నెన్నఁడులేని దిచ్చటకు
గామించివచ్చితిఁ; గల్లచేసితిని;
వచ్చి యీతనిచేత వాసిపోవలసెఁ
జెచ్చర నేను జేసినకల్లవలన.
తలఁప, నిట్టిదకాదె! ధనహీనుఁడైన
దలిదండ్రులొల్లరు తనయునినైన.
ధనవంతుఁడైన నాతలివానినైన
వినయంబుఁ బ్రియముఁ గావింతురుప్రజలు.
“ధనము చుట్టఱికంబు; ధనము ధర్మంబు;
ధనమే రూపంబును; ధనమే కులంబు.
అదిగాన, ధనము లేదనుచు వచ్చినను
వదలక నన్నేల వాఁడు గైకొనును!
కాన, దీనికిఁ -[163]బ్రతీకారమ్ము నేను
బూనిసేయకయున్నఁ బొందునే యెలమి!
వీనిమాటలునమ్మి[164] యిష్టుండననుచు?
నేనేలవచ్చితి నీనీచుకడకు!
బొంకునకోర్చి యీభూపాధముండు
గొంగక యిట్లాడెఁ గ్రూరవాక్యముల.
పుడమీశులను నమ్మఁబోల దేభంగిఁ,
గడుపాపముల మూలకందంబులౌట;
బహురాజ్యమదమను పానంబు గ్రోలి
యహరహంబును మత్తులైయున్న కతన
నెదిరిని దమ్ము నిమ్మెఱుఁగరెన్నఁడును;
బొదలుజిహ్వకు నీచభోగ్యంబులైన
యన్నమదంబున నంధత్వమొంది.
కన్నులఁగానరు గానిచందముల;
ధనగర్వమునఁజేసి ధర్మవాక్యములు
మొనసిపల్కఁగలేరు మూగలోయనఁగ;
విభవత్రిదోషంబు విననీదు చెవుల
నభినవశుభమూలమగు యుక్తకథలఁ;
బరికించి త్రొక్కరు బహుధనాపేక్ష
[165]సారహీనులువోలె సన్మార్గపథము;
రాజుల నటుగాన రాదునమ్మగను.
భూజనాధిపులన్న బొంకులపొత్తు;
అరయ దుర్గుణముల కట జన్మభూమి;
దురితంబులకుఁ బ్రోవదొలఁగ రెన్నఁడును;
వారలచరితలు వాక్రువ్వనేల!
దారిద్య్రమతి [166]కష్టవృత్తి;
కులజుఁడు, పూజ్యుండు, గుణనిధి, ఘనుఁడు
చెలువుం, డుదారుండు, శిష్టవర్తనుఁడు
కర్తయు, భోక్తయు, ఘనతత్వనిధియుఁ,
గీర్తనీయుఁడు, మంత్రి, కేవలప్రభుఁడు
ననఁజాలు జగమునందర్థవంతుండు.
జనులకు నాయర్థసంచయంబెడలి
కులమును విద్యయుఁ గోటిగల్గినను,
నలవున శూరత నధికుఁడై యున్న,
నెరవుమిక్కిలియైన, విత్తహీనుండు
పురణింప జనులచేఁ బూజ్యుడుగాఁడు'
అనునీతిమార్గంబు లవి శిష్టమయ్యె ;
ధనగర్వమునఁగాదె! దగిలి యీఘనుఁడు
అసమానమగుమైత్రి యాత్మఁ గైకొనక
వెస నన్నుఁ గీడాడి వెడలఁద్రోపించె !
ఇమ్మహాపరిభవ మేభంగి నోర్తు!
నిమ్మహీపతీగర్వ మేభంగిఁ దీర్తు!
తనువునఁగాఁడిన దారుణాస్త్రముల
ననువున వెడలింప నానొప్పి యుడుగు;
మనముననాటిన మర్మవాక్యములు
విను మెన్నిభంగుల వేదనచెడవు,
గర్వాంధుఁడగువాని గర్వింపఁజాలు
నిర్వాహమునఁ బల్కు నెఱిదీర్పవలయు.
తా నెందుఁ జివ్వకుఁ దగదుచేఁజాప ;
మానక తనుదానె మాటవీడ్వడిన
నరులెవ్వరును దన్ను నమ్మకయుండ
భరమునఁ దఱివేచి భంజింపవలయు.
ఏరీతి వెడలింతు నీమనోవ్యాధి!
నేరీతి నీఁగుదు నీశత్రుఋణము!
అని వితర్కించుచు ననఘ, నామనము
ననుమానమొందుచు నలసి కుందుచును,
మదమెల్లనింకిన మదనాగమనగ,
నదటెల్ల నణఁగిన నర్తకుండనఁగ,
పటు[167]దండహతి రేగు పాపఱేఁడనఁగ,
జటలెల్లఁ బెఱికిన సింగమో యనఁగ
లేమికంటెను జావు లేదుపో! యనుచు,
నామహీశునిసభ నల్లన వెడలి
వచ్చితి”. ననిన భూవరుఁడు భీష్ముండు
ఇచ్చలో సంతోషమిగురొత్త ననియె:
"భావింప నేఁడు మాపాలిటి భాగ్య
దేవతవై యేఁగుదెంచితిచ్చటికి.
పాంచాలపతి మాకుఁ బగవాడుగాని,
మంచిమేలొనరించె మాయెడాటమున.
అతఁడాదరించిన నరుదేరుమీరు;
సుతులకు శరవిద్య చోద్యమై లేదు.
కినిసి చెప్పఁగలేఁడు కృపుడుమోమోడి;
ధనువునఁ దీర్పవే దయతోడ సుతులఁ;
బ్రీతితో మీరుకోరిన కోర్కు లెల్ల
నాతతంబుగ నిత్తు ననిశంబు మీకు.”
అని చెప్పి ద్రోణున కాపగేయుండు
కనకరత్నంబులు, గంధవైభవము,
నెన్నికకెక్కిన యేడు గ్రామములు,
సున్నపుమేడలసొంపొరునిండ్లు,
నరుదార నవరత్నహార కేయూర
వరభూషణాంబరావళు లాదిగాగ
బాఁడికుఱ్ఱులనిచ్చి, పసిఁడితేరిచ్చి,
[168]నాడెంబుగలరత్నహారంబులిచ్చి,
తరుణీమణులనిచ్చి, ధనువభ్యసింప
గురుమతినిచ్చెనుగురుకుమారకుల.
అతఁడంతఁ గృపునిచే ననుమతివడసి
సితపక్ష[169]సితవారసితకరర్క్షముల
నందఱఁగూర్చి, విద్యారంభవేళఁ
బొందుగా భూపాలఁబుత్త్రులఁబలికె :
ఇందఱుఁగడుశూరు, లిందఱుధీరు,
లిందఱు విలువిద్యయెఁఱిగినపిదప
నేనొకపనివుత్తు; నెవ్వఁడేనిందు
నూనినమతిఁ జేయనోపునె నాకు!
ఆపని నాచేతనగు; నైననేమి,
యోపిక మీకు నెట్లో చూత!" మనిన,
ధరణీశతనయులు తలలెత్త వెఱచి
గురునితో నొక్కపల్కునుబల్క వెఱచి
యొండరుమొగము లొండొండ చూచుచును
నిండారునిశ్చేష్ట నివ్వెఱఁగంది
యున్నచో, 'మీకోర్కి యొనరింతు ననుచు'
గ్రన్ననఁ బలికె నాఖండలాత్మజుఁడు.
అప్పుడర్జునుమెచ్చి, యతఁడు వారలకుఁ
జెప్పంగఁదొడఁగె నూర్జితచాపవిద్య,
చెలంగుకుమారుల శింజినీధ్వనులఁ
గలఁగెవారాసులు; కంపించెగిరులు;
పదఘట్టనల భూమి పగిలినట్లయ్యెఁ ;
జెదరె దిగ్గజములు సింహనాదముల.
గురుఁడంత నీరీతి గురుకుమారులకు
జిరగతి విలువిద్య చెప్పుచునుండ,
ఏకలవ్యుని ధనుర్విద్యాభ్యాసము
నడరి హిరణ్యధన్వనుచెంచురాజు
కొడు కేకలవ్యుండు కోర్కిదీపింప
నాకుమారులతోడ నతులితభక్తి
నాకడకేతెంచి, యరయంగ నపుడు
కలశజుఁగాంచి నిక్కపుభక్తిమ్రొక్కి
చెలుపొర నగ్గురుఁ జేరి యిట్లనియె:
"నీవేమికోరిన, నీకోరినట్లు
వేవేగ వొసగెద విలువిద్యఁ జెప్పు".
మనుచు.................................................
.................................................
దానును గురువుతో ధనువభ్యసింప
నానరేంద్రకుమారు లదియోర్వలేక :
"హీనజన్మున కేల యీమహావిద్య!
హానిపుట్టెడు వీని ననుపవే ద్రోణ!
సురలతో రాహువు సుధఁ ద్రోలవచ్చు"
కరణి వచ్చిన వీని గడపవే ద్రోణ! "
అనిన ద్రోణుఁడు వారియతులవాక్యములు
విని , బోయనీక్షించి వెరవొప్పఁ బలికె :
"వేదంబుసరి ధనుర్వేదంబు; దీని
రాదు చెప్పఁగను; గిరాతుండ వీవు;
కావున, నిది నేర్పఁగాఁజాల." ననిన,
భావించి యబ్బోయ వలికె నగ్గురుని :
“ నీరూపురచియించి, నిన్నాత్మనిలిపి,
యారయ విలువిద్యలభ్యసించెదను ;
ఇప్పుడనుజ్ఞయు నిమ్ము నా." కనిన,
నప్పుడనుజ్ఞయు నతఁడిచ్చి వేగ
ననఘుఁడై యబ్బోయ నర్థినంపుటయుఁ,
జనుదెంచి వాఁడొక్క శైలంబుపొంత
గురుమూర్తిమేనును గొమరొప్పఁ జేసి,
గరిడిలో విశ్వాసగతిఁ బ్రతిష్ఠించి,
దవ్వుల శిష్యుఁడై ధనువభ్యసింప,
నెవ్వరికంటె వాఁడెఱిఁగెను విద్య.
అటపల్కె నరుని నేకాంతంబ గురుఁడు :
"పటుతరశార్య, నీపై వేడ్క నాకు
నేపయ్యె; నాకోర్కి యెవ్వారుసేయ
నోపనితలఁపున నూరకుండినను,
నేను జేసెదనని యీవన్నమాట
యూనియున్నది నాకు నుల్లంబునందు.
నిక్కము, ధనువున నీకంటెనితరు
లెక్కుడులేకుండ నెఱిఁగింతువిద్య".
అని శీఘ్రసంధాన, మస్త్రకాలంబుఁ,
దనుదాఁకుశరములఁ దప్పించుననువు,
శత్రుని కోపప్రసాదచింతనము,
శత్రునివిలుఁ దేరు సమయించుననువు,
నందు నందఱకందఱైయుండు ననువు,
గొందిఁ గానఁగరాని గుఱి యేయుననువుఁ,
బొరిఁ బెక్కుముఖములై పోరాడుననువు,
.................................................
మొగ్గరంబులుచించి మోఁదిరాననువు,
నుగ్గుగా విఱిగియు నూల్కొనుననువు,
హల శూల ముసల ఖడ్గాదులఁ బెనఁగి
విలుఁ దేరు సమసినవేగసంధించు
ననువు లెవ్వరికంటె నతఁ డర్జునునకుఁ
బనివడి నేర్పె నభ్యాసకాలమున,
నరుఁడును గురుసూనునకు నీసువుట్ట
శరములు తనుదానె సాధించెఁ గొన్ని.
అదిచూచి యాచార్యుఁ డతనికేకతమ
పదరకయిట్లను : "భళిరె! నీవగుదు;
వతిరథశ్రేష్ఠుండవనవచ్చు నిన్ను;
[170]జతచేసితివి కొంత చెప్పనివిద్య
ర;"మ్మని సకలమంత్రంబులు సెప్పె.
సమ్మోహనాస్త్రంబు, జలదసాయకము,
గారుడశర, మంధకారబాణంబు,
సౌమ్యంబు, యామ్యంబుఁ, జక్రసాయకము,
ఘన శాత కర్కశ క్రకచోగ్ర భల్ల,
మెనయఁ గౌబేర మాహేశ్వరాంబకముఁ,
గాలాంత సంవర్తకాల బాణములు,
జాల నుష్ణానుష్ణ[171] జనకాస్త్రములును,
వారుణాస్త్రములును, వైష్ణవ దైత్య
మారుతాస్త్రములిచ్చి, మఱియు వేడుకను
బరిఘ గదాంకుశ ప్రాసాగ్ర ముసల
పరశు తోమర ఖడ్గ[172] భల్లనారాచ
ఘనభిండివాల ముద్గర కుంత చక్ర
[173]జనితకుఠారముల్, ఛురికాక్షురప్ర
వినుత నానాయుధ వితతులాదిగను
వినమితకృపనిచ్చె వెస నర్జునునకు.
అంత, వినోదార్థ మఖిలకౌరవులు
వింతగా నడవుల వేటఁబోఁదలంచి,
యడరంగ గురునిచే ననుమతివడసి,
తడయకందఱుఁగూడి తగబోవునపుడు,
లాలితంబుగ నేకలవ్యుని బాణ
జాలంబు లోలి లక్ష్యముఁ దాఁకునట్టి
చప్పుడాలించి యచ్చట వేటలాడి
తప్పకయ్యడవి నందఱు నొక్క తెగువ
దంటమృగంబుల ధరఁగూల్చుచోట,
నొంటి మైఁబడి తప్పి యొక శునకంబు
తప్పులోవలఁబోయి, తమవారిఁగాన
కప్పుడు వాపోయినట్టువాపోవ,
నేకలవ్యుఁడు దానియెలుఁగాలకించి,
దాఁకొని యోజనత్రయదూరుఁడయ్యు
నాదట నాధనునభ్యసింపుచును
మోదించి, చిఱునవ్వు మొలవంగ నపుడు
వాఁడిశరంబుల వాఁడేనుదొడిగి
పోఁడిమి [174] నేసెను బొచ్చెంబులేక
యనువార సారమేయము నోరుగాఁడఁ
దొనకోలలొకటిగ దూపిడ్డకరణి.
వేవచ్చి శునక మవ్వేషంబుతోడ
భూవరాత్మజులకుఁ బొడసూపుటయును,
దమవిద్య కుఱుచగాఁ దలపోసి, వారు
గుమిగూడి చొప్పుగైకొని పోయిపోయి,
హిమగిరిపొంత నయ్యేకలవ్యాఖ్యు
గమనీయభుజచాపు గరిడిలో నొంటి
నీక్షించి, వెఱఁగంది : "యెవ్వాఁడవీవు ?
శిక్షయెవ్వరిచేత [175]సిద్ధించె నీకుఁ?
దలఁపనచ్చెరు!" వన్నఁ, దలఁకక వాఁడు:
“కలశసంభవుచేతఁ గంటినీవిద్య ;
నేకలవ్యుండనేనెఱుకల ఱేఁడ ;
నేకలవ్యయమును నెఱుఁగఁ గయ్యముల ;
గోపినఁ జనుదెండు యుద్ధంబు సేయఁ
జాపహస్తులు మీరు సన్నద్ధు."లనిన
విన్ననై యందఱు వీగి, వెన్కకును
గ్రన్నన వచ్చిరి కరిపురంబునకు.
అంతట నొక్కనాఁడాబోయచరిత
మంతయు గురునకు నటయెఱింగించి,
యేకాంతమున నంత నింద్రతనూజు
డాకుంభజునిఁబల్కు: "నవధారు గురువ!
నాకంటెనెక్కుడు నరులలో వింట
లేకయుండంగ నిల్పెదనంటి విద్య:
నేకలవ్యునిఁ జెంచు నేముచూచితిమి;
నీకృప దానఁట నేర్చెనువిద్య!
నాకంటే నీకంటె నానాప్రకార
లోకులకంటె నుల్లోకుండువింట.
వాలుచునున్నాఁడు వాడు మీచేత;
నోలిమై విలువిద్య లొగి [176] నేర్చెనట్టె!
వారక యిటువంటివారు మీశిష్యు
లారయ నెందఱో! యవనిలోపలను;
అటుగాన, మీపల్కు లనృతంబులనుచు
నిటపల్కనోడుదు నేవిధంబులను.”
అనుటయు నుదరి యయ్యమరేంద్రతనయుఁ
దన వెంటరమ్మని తడయక గురుఁడు
అనఘ, శిష్యులుఁ దాను నప్పుడేపోయి
వనచరుఁగాంచిన, వాఁడాత్మఁబొంగి
గురునకునెదురేఁగి గురుభక్తి మ్రొక్కి ,
కరపద్మములుమోడ్చి కరమర్థి మీఱఁ
దేనియ ఫలములుఁ దెప్పించి, యపుడు
కానుకగానిచ్చి కరమర్థిఁబలికె
చేపట్టితివి నన్ను శిష్యునిఁగాఁగ;
నాపుణ్యమున వచ్చినాఁడవు వెదకి;
యిదెశస్త్ర, మిదెగాత్ర, మిదెకళత్రంబు;
మది నేదిగోరెదు మసలకయిత్తు;
గురుపూజ నా చేతఁగొందుగా," కనిన
గురుఁడింద్రజుఁడు మెచ్చుగుఱి వానికనియె:
"వనచరనాథ, నీవలచేతిలోని
పెనువ్రేలునాకిమ్ము ప్రియమార." ననిన,
నతఁడును : "నదియె మహాప్రసాదంబు
హితమతిఁ గై కొమ్మ యిచ్చెద." ననుచు
ననువుమీఱఁగ నలుఁగమ్మున వ్రేలు
దునియంగనొత్తి యాద్రోణునకిచ్చె.
అదికతంబుగఁ బోయె నధికుడైనరుఁడు
ముదమంది మదిఁగల [177]ముసురెల్లవిడిచి.
అతివేడ్క గురుడును నతనిఁదోడ్కొనుచు
హితమతినేతెంచి నిభపురంబునకు,
మఱి, వాఁడుఁ దర్జనీమధ్యమాంగుళుల
నిఱికించి బాణంబు లేయ సాధించె.
అర్థితో నారీతి నాచార్యవరుఁడు
పార్థుతోనాడినప్రతినచెల్లించి,
యరుదార ధర్మజుండాదిగాఁగలుగు
కురుకుమారులకేయఁ గొలఁదిగానట్టి
యరుదైన లక్ష్యంబు లర్జునుచేత
నురుమతి చేయించుచుండె; నాగురుఁడు
నాయుధవిద్యారహస్యమార్గంబు
లాయింద్రతనయున కన్నియుఁజెప్పి:
అస్త్రవిద్యాపరీక్షణము
చూచెదఁగాక శిష్యులదృష్టి ముష్టి
యేచందమో' యని యెన్నికచేసి,
యంతరిక్షంబున యంత్ర [178]కాకంబు
సంతతచలముగాఁ జక్కఁబన్నించి,
కోదండహస్తులఁ గురుకుమారకుల
నాదటరప్పించి యా పక్షిఁజూపి,
తొలుత నజాతశత్రునకిట్లువలికె:
"బలియుఁడ, కంటివే పక్షి[179]శిరంబు?
ననుజులఁగంటివే యాచూపులోన?
ననుఁగానవచ్చునా? నయనాంతవీథి. "
ననిన నాతడు: “కంటి నదెపక్షి శిరము
నినుఁగాననయ్యెడు; నృపులుఁదోచెదరు;
వీయుదునా పక్ష్మి నిలఁగూల" ననిన,
నాయనకోపించి యప్పుడిట్లనియె:
"నీవేయనేరవు; నీదృష్టి చెదరి;
నావిధంబులువేఱె; యవినీకు రావు. "
అని ధర్మసుతునని, యయగారితనము
తనరంగనిలిపి గాంధారేయుఁజూచి:
“యీవేమిపొడగాంచితెఱిఁగింపు; మనిన
నావీరుఁడును బల్కె యమసూతియట్ల,
భీమునడిగిన నట్లభీముండుచెప్పె;
నామాడ్కి, నందఱనడిగి ద్రోణుండు
కడవట నర్జునుఁ గార్ముకకుశలు
నడిగిన, నతఁడు లక్ష్యముచక్కఁజూచి :
“పూని పక్షి శిరంబుపొడగంటిఁ ; గాని,
యేను నీచెప్పినవేమియుఁ గాన ;
నేసెదఁ జూడుఁడీ యీ పక్షి." ననుచు
భాసురజవమొప్ప బాణంబువిడిచి,
చపలచిత్తమువోలెఁ జంచలంబైన
కపటకాకముతల ఖండించుటయును,
వాసవిఁబొగడ, నశ్వత్థామమొగము
వీసమంతై తోచె విలుకాండ్రుచూడ.
తోరంపుసిగ్గుతో దుర్యోధనుండు
భూరిరాత్రుల నిద్రఁబొరయక యుండె.
శరగురుం డెంతయు సంతోషమంది;
"సరిలేరు వింటికి జగమందునీకు;
నచలితదృష్టియు, నలవును, వెరవు
నుచితంబులై నీకునొగిఁ జెల్లు;ననుచు
నాచార్యుఁడర్జును హస్తకౌశలము
చూచి వేడుకనిచ్చె సునిశితాస్త్రములు.
తక్కినవారికిఁ దగినచందములఁ
గ్రక్కున విలువిద్య గఱపియున్నంత,
ధృతరాష్ట్ర గాంగేయ కృప సోమదత్తు
లతిమోదమొందంగ నక్కుమారకులు
శరగురుచేఁగన్న శస్త్రాస్త్రవిద్య
కరమద్భుతంబుగాఁ గడిమిఁజూపుటయు,
రాజశేఖరులెల్ల రమణమైఁదన్నుఁ
బూజింప నెంతయుఁబూజ్యుఁడై, గురుఁడు
వెండియు నొకనాఁడు విపులదోర్దండ
చండిమ చూతముసరసిలోననుచు
మకరంబులుండుమడుఁగున కేగి,
సకలశిష్యులుచూడ జలముచొచ్చుటయు,
నొకమహాగ్రాహంబు ఒడిసి పెందొడను
బ్రకటితదంష్ట్రలఁ [180]బట్టి, యాపట్టు
విడువకయుండిన, విడిపించుకొనఁగఁ
గడునేర్చియును శిష్యగణముతోనపుడు
విడిపింపుఁడోదీనివెరవుతో!' ననిన
విడిపింపనేరక వివశులైవారు
నేయఁగానెట్లొకొ యీతనికనుచు
నాయనువెఱుఁగక యందఱువీఁగి
యున్నచో, నర్జునుండొకమేటిరథము
పన్ని సూతుఁడుతేరఁ బటుగతినెక్కి,
శరచాప ముద్గర శక్తి వజ్రాది
పరశు తోమర ఖడ్గ పట్టిస ప్రముఖ
వివిధాయుధంబులు వెస సంతరించి
యవిరళగతిరాఁగ నతని వీక్షించి:
" పగతులిచ్చట లేరు పన్నిపోరాడ
మగంటిమిమెఱయ; నీమకరికిం తేల
తనకునుద్ధతి!" యనుధార్తరాష్ట్రులను
గనుఁగొని పార్థుండు కడఁకనిట్లనియె :
"శరగురుండల్పుండె! చర్చింపమనకు;
భరమున నాతనిఁబట్టినమొసలి
యలఁతులఁదీఱునే ! యనువులఁగాక !
వలయునిన్నియు". ననివాసవాత్మజుఁడు
వెసఁజేరి గురునకు వినయంబుతోడ
'మొసలిమిమ్మెచ్చోటముట్టెనో !' యనఁగ,
శోకాతురత్వంబు చొప్పడునట్లు
ప్రాకటంబుగ గురుప్రవరుఁడిట్లనియె:
మకరి పెందొడవట్టి మడుఁగులోపలికి
బెకలించుకొనిపోవఁ బెనఁగుచున్నదియు;
పదములుధరనూది, పదిలమేమఱక
యుదకమధ్యంబున నుండితి మింత;
అలయదునీటిలో నమ్మేటి మొసలి;
యలఁత మాకడరెడునటమున్న నీవు
విడిపింపు". మనుటయు వివ్వచ్చుడడరి,
కడునుగ్రచాపంబు గడఁక మ్రోయించి
పటుతీవ్రసాయకపంచకంబునను
దటుకున మకరంబుదవడలు చించి,
విడువనిమకరంబువెసఁజించి, యిభము
విడిపించినట్టి శ్రీవిష్ణువోయనఁగ
విడిపింప, రాహుచే విడివడ్డచంద్రు
వడువున విడివడివచ్చి ద్రోణుండు
'పాంచాలపతి పట్టుపడు వీని ' కనుచు
నంచితసంతోషుఁడైయుండెననుచు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించె" నని చెప్ప, వెండియు వారు
“అనఘాత్మ, తరువాత నై నవృత్తాంత
మనువొందఁజెప్పవే !" యని వేడు టయును,
బంచమవేద ప్రబంధైకనాథ,
పంచాక్షరీమంత్ర పావనమూర్తి
శాస్త్ర పురాణార్థ సార వివేక,
శస్త్ర ఖండిత శత్రు సైన్య ప్రపంచ,
సతతచాపాలంబ, సత్కీర్తిబింబ,
మతి ధైర్య నిర్జితామరమంత్రివర్య,
నుతధర్మ, నీకు మనోరథావాప్తి.
ఇదిసదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్ర వల్లభసూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యశ్వాస మొప్పె నాల్గవది.
+++++++++++++++
- ↑ వారణా
- ↑ గాన (మూ)
- ↑ భూమి (మూ)
- ↑ కడిగెను (మూ)
- ↑ చిక్కునకు
- ↑ నన్నును యిచ్చితినన్న
- ↑ నాకు (మూ)
- ↑ లిచ్చి (మూ)
- ↑ జనియించు (మూ)
- ↑ డిల
- ↑ తూలితుఁడ.
- ↑ సమగ్రతుల
- ↑ యుల్లంబురానుండి యుర్వి యెద్దెసల
- ↑ రాదు
- ↑ నూరనెల్లెడల (మూ)
- ↑ వృద్ధాంగ
- ↑ సంధుల సత్పురుష జనవరేణ్యులకు (మూ)
- ↑ పెందమాలు
- ↑ క్రంపలు బట్టిన
- ↑ వీథు లనఁగ (మూ)
- ↑ యాధార మెరుకకు నాధారమైన
- ↑ గురు
- ↑ వెర్కి (మూ)
- ↑ నొండు
- ↑ నేర్చు (మూ)
- ↑ దనుచు
- ↑ నెరి నెత్రయాగంబు నిరసంబులను
- ↑ నొరయు
- ↑ దొలంకులు
- ↑ కూడిన
- ↑ ఒదవి
- ↑ కోరమొగిలువోలె గొంకులుపట్టి.
- ↑ రిసి (మూ)
- ↑ రథ
- ↑ నెరుపనై
- ↑ దిగిచి (మూ)
- ↑ వొడునన్ వేట (మూ)
- ↑ నిలనొప్పఁగీడనియిల (మూ)
- ↑ మౌన (మూ)
- ↑ మీగితినందు నేననుచు.
- ↑ 'గొంతి' పదమును స్త్రీపర్యాయముగా వాడినాఁడనవలెను ; లేదా గొంతతో అన్నను సరిపడును. (మూ)
- ↑ బెట్టుచును (మూ)
- ↑ సద్ద
- ↑ లేదు పేద (మూ)
- ↑ సుదతి (మూ)
- ↑ 'వ్యుక్షితాశ్వుసతి' అని నన్నయ. ఆది. ప.
- ↑ గావుడును (మూ)
- ↑ యందనిపనులని నే చూడగంట్టి.
- ↑ పుణ్యంబు
- ↑ కథల
- ↑ మందవు
- ↑ భక్తి (మూ)
- ↑ రాజుని వలసి
- ↑ భాగమున
- ↑ గొడకకంభంబు
- ↑ వరశాన్వయ
- ↑ నంశంబున
- ↑ తొడగె (మూ)
- ↑ అచ్చ (మూ)
- ↑ ముదంబొదవ (మూ)
- ↑ గంటి
- ↑ జెలిమి
- ↑ జెలపాఱ (మూ)
- ↑ కోటి (కోతియని వ్రాసెనేమో)
- ↑ వెల్మిలో విగురునకు చోఁడు
- ↑ నాకంట నీకంట నలిచప్ప హితుండు (మూ)
- ↑ గంట్టె
- ↑ నవవార
- ↑ వడ్డించి
- ↑ గుడ్లల (మూ)
- ↑ భూమిని (మూ)
- ↑ హ
- ↑ బాహు
- ↑ దీప్తు (మూ)
- ↑ రథ్యంబు
- ↑ గాంచుటయును దా (మూ)
- ↑ చిన్న వేంకువను (మూ)
- ↑ పాలిచ్చెననబరగునొక్కొంటి.
- ↑ భామినికెంతయు
- ↑ నీ కిట చెల్లెలు (మూ)
- ↑ కవలు
- ↑ భ్రాత
- ↑ నర్థితో గాంచి (మూ )
- ↑ విదదశరధులకును.
- ↑ హత్తిభూర్భువనాలి నఖిలజీవులకు
- ↑ దలుకు
- ↑ నరులు
- ↑ తగిలి
- ↑ దెలిసి
- ↑ కురుకుమారులకు గులపాటుగలుగ.
- ↑ నలరంగ
- ↑ లలి దరులందు కుసుమము లొప్పారె (మూ)
- ↑ దగిలి
- ↑ విటువుల
- ↑ కేవిపులరసము
- ↑ బోలి (మూ)
- ↑ చిగురాకు లొగిమించుచెంచుక మెరసి
- ↑ జూచి
- ↑ మ్రోల
- ↑ యాల
- ↑ మధుడు
- ↑ బిచ్చె (మూ)
- ↑ విలోఁచిత
- ↑ కేల
- ↑ మాలి (మూ)
- ↑ జీరుకువాయ
- ↑ విసంభృత (మూ)
- ↑ వనితవీక్షేక్షణవలలోఁ దవుల
- ↑ గురులనురులచేత (మూ )
- ↑ మరువని యిట్టి (మూ)
- ↑ మనకుంబోదనుచు (మూ)
- ↑ ముద్రులై వెలసి సముద్రములై వెలసి (మూ )
- ↑ తరువాత (మూ )
- ↑ నకులుండు
- ↑ చెంత (మూ)
- ↑ దుఃఖించిరి
- ↑ నుండు
- ↑ గట్టింటి
- ↑ కీర్తిత
- ↑ హరము (మూ )
- ↑ సామై
- ↑ కారణము (మూ)
- ↑ నగుచు
- ↑ నానంద మిచ్చుచును
- ↑ బుట్టుచు
- ↑ ఏరిభారము (మూ)
- ↑ తగళ్ళెన
- ↑ సంభ్రమమున (మూ)
- ↑ నాదు
- ↑ నినుమతో
- ↑ నిల్లి (మూ)
- ↑ కాళ్ళుగాండక
- ↑ కుడువ
- ↑ జారు (మూ )
- ↑ కొరత
- ↑ రశోక
- ↑ చెప్పిన
- ↑ వీవు (మూ)
- ↑ పురవంశవిధి
- ↑ 'శరద్వంతుఁ'డని నన్నయ. (మూ )
- ↑ నృపుఁడు మా కొనరించి (మూ)
- ↑ మోదకము లెక్కించి (మూ )
- ↑ ఉబ్బసపోక (మూ )
- ↑ దొల్లున్
- ↑ మెడవంపులడరించు మేరుపచ్చడము
- ↑ లిందుకునేర (మూ )
- ↑ సరస (మూ )
- ↑ మునుగుచు (మూ)
- ↑ నిమ్నానగ
- ↑ పొదిసైకతము (మూ )
- ↑ కలహార (మూ )
- ↑ పోవక
- ↑ నిట (మూ )
- ↑ కమనీయ తపనీయధను నొయ్య నడిగి
- ↑ సర్వాంశయును
- ↑ ధనువును (మూ )
- ↑ ఖండనాధ్యక్షులై ప్రతిహతబలము (మూ)
- ↑ నీవనునదేడ (మూ)
- ↑ చెల్మి దారిద్రునకును
- ↑ వేళముల
- ↑ తొలి (మూ )
- ↑ లేమిచే నెన్నడు లేమియిచ్చుటకు
- ↑ ప్రతికార్యమ్ము నెలమి
- ↑ విష్కండ ననుచు (మూ)
- ↑ చేర
- ↑ కష్ణవృష్టి (మూ )
- ↑ తుండ (మూ)
- ↑ నాడెల్లచెయు రత్నహారంబు లిచ్చి
- ↑ శితవాతశితశరక్షముల (మూ)
- ↑ జతముచేసితివి కొంతచప్పనివిద్య (మూ)
- ↑ జనితా
- ↑ ప్రాసాగ్రముసల
- ↑ జనితకుఠారయుచెలికాక్షురంధ్ర (మూ)
- ↑ చేసిన
- ↑ శిక్షించె (మూ )
- ↑ నోర్చినట్టి (మూ)
- ↑ ముసటిల్ల (మూ )
- ↑ శారంబు
- ↑ పేక్ష (మూ )
- ↑ బట్టెబట్టుటయు (మూ )