Jump to content

దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/శ్రీ వీరేశలింగము పంతులు

వికీసోర్స్ నుండి

శ్రీ వీరేశలింగము పంతులు

అప్పటికి శ్రీ కందుకూరి వీరేశలింగపంతులుగారు రచియించిన వచనగ్రంథము తెలుగుభాషయందు ప్రజలలో నూతనాభిమానమును కల్పించెను. తెలుగువచనశైలికి ప్రధమభిక్ష వీరేశలింగంపంతులుగారిదనియే చెప్పవచ్చును. చిన్నయసూరి యనువారు నీతిచంద్రిక యనుపేర పంచతంత్రమునందలి సంధి విగ్రహములనే వివరించుచు నొక వచనగ్రంథమునువ్రాసిరి గాని అది సంస్కృతపదజటిలమగుటచే చదువరులకు కఠినముగ దోచుచుండెను. వీరేశలింగముగారు ఆవిషయమునే తమ పంచతంత్ర గ్రంథమునందు తేటయగు తెలుగుపదములను వాడుచు సులభముగ తెలియునట్లు వ్రాసిరి. వీరు ఆంగ్లేయమున షేక్స్పియరు రచించిననాటకములలోని కథలను పాత్రలపేర్లను కధాక్రమమును మనదేశమున కనురూపముగా మార్చి హృద్యముగ నుండునట్లు సులభశైలిని రచియించిరి. బాలురకు సుకరముగనుండుటకు తెలుగువ్యాకరణమును, శరీరశాస్త్రము, తర్కము, జ్యోతిశ్శాస్త్రముమొదలగు నవీనశాస్త్రగ్రంథములలోని విషయములను క్లుప్తపరచి లోకజ్ఞానము దేశమున వ్యాపించుటకై పుస్తకములు ప్రచురించిరి. ఇదిగాక వివేకవర్థినియను నొక పత్రికయు, చింతామణియను మాసపత్రికయు ప్రకటించి, దేశమున తెలుగుభాషా పరిచయము పెంపొందించుటయేగాక రాజకీయపరిపాలనావిషయములు, సాంఘికవిషయములును దేశవార్తలును ప్రకటించుచుండిరి. అప్పుడు చెన్నపట్టణములో ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్రపండితులగు కొక్కొండ వెంకటరత్నముపంతులు, నెల్లూరులోని మానేపల్లి పురషోత్తము అను మరియొక ఆంధ్రవిద్వాంసులు నుండిరి. ఈపండితులకును వీరేశలింగము పంతులుగారికిని భాషావిషయకమైన వాదప్రతివాదములు తీవ్రముగ జరుగుచుండెను. ఇవి పత్రికలలో ప్రకటితము లగుచుండెను. ప్రభుత్వోద్యోగులు చేయు అక్రమములు వివేకవర్థనిలో నిర్భయముగ విమర్శింపబడుచుండెను. సాంఘికదురాచారములును నైష్ఠికులమని పేరుపెట్టుకొన్నవారు కొందరు సమాజమున జరుపుచుండు దుశ్చేష్టలును బట్టబయిలు చేయబడుచుండెను. బాల వితంతువుల వైధన్యమువలన కలుగుచున్న యనర్థములు వివరింపబడుచుండెను. స్త్రీ పునర్వివాహములు వీరేశలింగముపంతులుగారు జరిపి, సంఘబహిష్కారమునకు పాత్రులై కష్టములపాలగుచుండుటచేత దేశమున ఈసంఘ సంస్కరణమునుగూర్చి గొప్పకలవరము సాగెను. ఆంగ్లేయవిద్యాధికులలో గొందరు సంఘసంస్కరణాభిమాను లేర్పడిరిగాని తక్కినవా రీ సంస్కరణపట్ల మిక్కిలి విముఖులైయుండిరి. మరియు ఆంగ్లేయవిద్యాధికులగు న్యాయవాదులకును ధనికులగు వైశ్యులు మొదలగువారికిని భోగముసానులతో బహిరంగసంబంధము లుండెను. పలువురు దానిని వారి గొప్పస్థితికి తగిననడవడిగ పరిగణించుచుండిరి. భోగముబాలికలు వ్యక్తురాండ్రగుటతోడనే కన్నెరికముపెట్టుట యొకగొప్పకార్యముగ ప్రజలు పరిగణించు దుస్థితి సంఘమున నేర్పడెను.

ఇట్లు దేశమున నడచుచున్న దుష్కార్యములును దురాచారములును బయటపెట్టుటకు వీరేశలింగముగారు మిక్కిలి వినోదములగు చిన్నకధలను కల్పించి, ప్రహసనములు వ్రాసి ప్రకటించుచుండెడివారు. సంస్కరణలవిషయమై పూర్వాచార పరాయణులగు పండితులకు, వీరేశలింగముపంతులుగారికిని రాజమహేంద్రవర మహాసభలలో వాదప్రతివాదములు పలుమారు జరుగుచుండెను. ప్రభుత్వోద్యోగులు చేయు అన్యాయములను వెలిబుచ్చటయందు పంతులుగారు మిక్కిలి శ్రద్ధయు పట్టుదలయు ప్రకటించుచుండిరి. రాజమహేంద్రవరములో ఒకడిస్ట్రిక్టుమునసబు లంచముపుచ్చుకొన్న కేసును పట్టియిచ్చుటకు వారు జరిపినచర్య పలువురు చాలకాలము ఆశ్చర్యముగ చెప్పుకొనుచుండిరి. ఆ మునసబు ఒకవ్యాజ్యములో పార్టీయొద్ద లంచముపుచ్చుకొని పక్షపాతము వహించి తీర్పు ఆపార్టీ కనుకూలముగ వ్రాసి ఆఫీసులో పెట్టెనట. ఆకేసులో ఎదిరిపక్షము ఆవ్యాజ్యములో మనసబు లంచముపుచ్చుకొని న్యాయవిరుద్ధముగ తీర్పువ్రాసినట్లు తెలిపినతోడనే పంతులుగారు జిల్లాజడ్జిగారి కీపక్షపాతమును విన్నవించిరి. జిల్లాజడ్జి మునసబుకోర్టుకు వచ్చునప్పటికి మునసబు తీర్పును తన ఆఫీసుపెట్టెలో పెట్టి తాళమువేసి కోర్టునుండి వెడలిపోయెను. ఆపెట్టెను కోర్టుజవాను మునసబుగారింటికి మామూలుప్రకారము తీసికొనివెళ్లుటకు సిద్ధముగా నుండెను. జిల్లాజడ్జి ఆపెట్టెకు తాళముపై సీళ్లువేసి మరునాడు దానిని తెప్పించి చూడవచ్చుననుకొని జవానుయొద్దనే యుంచి వెడలిపోయెను. జవాను మునసబుగారియింటికి పెట్టెను తీసికొనివెళ్లి జడ్జిగారు వేసినసీళ్లు చూపించెను. ఆపెట్టె కొయ్యదగుటచేత ఆరాత్రి దాని అడుగు చెక్కకు వేసినమరమేకులను మెల్లగ నూడదీసి, లోపల తాను వ్రాసిపెట్టిన తీర్పును చించిపారవైచి, రెండవపక్షమువారికే అనుకూలముగ తీర్పు మరియొకటి వ్రాసి ఆపెట్టెలో బెట్టి, ఊడదీసిన అడుగుచెక్కను మరల మరమేకులతోనే బిగించి, జడ్జి వేసినసీళ్లు చెడకుండ భద్రముగ నుంచెను. మరునాడు జడ్జి ఆపెట్టెను తెప్పించి తాళముతెరిపించి చూడగా తీర్పు వీరేశలింగముగారు చెప్పినప్రకారముగా గాక ఎదిరిపక్షముగనే వ్రాయబడియుండెను. వీరేశలింగముగారు మునసబు లంచము పుచ్చుకొనెననిచెప్పుటయే అన్యాయమైనట్లు ఏర్పడినది. పెట్టె అడుగుచెక్కను విప్పి ప్రాతతీర్పు చించివేసి క్రొత్తతీర్పు వ్రాసిపెట్టె ననుమాట పంతులు గారికి తెలియవచ్చినది. కాని యిది రుజువుపఱచుట అసాధ్యముగనేయుండెను. వారు నెమ్మదిగ యోచనచేసి, మునసబుగారి యింటిలో పనిచేయు పనికత్తెను పిలిపించి మునసబుగారి ఆఫీసు గది ప్రక్కను పారవేసియున్న కాగితపుముక్కల నన్నిటిని ప్రోవుచేసి తెప్పించిరి. వాని నన్నిటిని జాగ్రత్తగ చదివి అందలిఅక్షరములను సందర్భోచితముగ పదములుగ కూర్చి పదములను వాక్యములుగ జేర్చి మొత్తమున మొదటవ్రాసిన తీర్పు మరల రూపమెత్తించెను. ఈ ముక్కల నొకదానితో నొకటి అంటించి దానిని జడ్జిగారియొద్దకు గొనిపోయి చూపించెను. అది అంతయు మునసబు స్వహస్తముతో వ్రాసినదగుటచే మునసబుచేసిన దురంతమంతయు స్పష్టమయ్యెను. ఈవిషయమును విని, మునసబు ఆత్మహత్యచేసుకొని రాజదండన తప్పించుకొనెను. వీరేశలింగముగారి వాక్యముల సత్యము నిర్ధారణయగుటయేగాక అక్షరముల గూర్చువిద్యయందు వారికిగల ప్రావీణ్యము తేటపడెను. మరియు వారు దుర్మార్గులగు ప్రభుత్వోద్యోగులకు సింహస్వప్నముగ నుండిరి. వారి ప్రభావము దేశమున ఎల్లెడల వ్యాపించెను. ఆదినములలోనే న్యాపతి సుబ్బారావుపంతులుగారు జిల్లాకోర్టులో న్యాయవాదిగానుండి ఖ్యాతిగాంచి ప్రధానపురుషుడుగా పరిగణింపబడుచుండెను. వివేక వర్థని ప్రకటన మొదలగు కార్యములందును పునర్వివాహసందర్భములలోను వీరేశలింగముగారికి చేయూతనొసంగుచు వారితో మిక్కిలి మైత్రితో ప్రవర్తించుచుండిరి. వారితమ్మునికి వితంతువుతో వివాహము, తనకు తెలుపకుండ వీరేశలింగముగారు జరిపినందుకు వారిపై కోపించి అప్పటి నుండియు భేదభావముతో ప్రవర్తించుచుండిరని పలువురు చెప్పుకొనుచుండిరి.


రంగయ్య సెట్టి - మిల్లరు దొర

మేము బి. ఏ., క్లాసులో జేరునప్పటికి మామిత్రులగు విండ్లచెరువు రామయ్య, పిడతల సీతాపతయ్య, నాగపూడి కుప్పుస్వామయ్యగార్లు బి. ఏ. పరీక్షలయందు కృతార్థులైరి. విండ్లచెరువు రామయ్యగారు గుంటూరులో హిందూఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా జేరిరి. కుప్పుస్వామయ్యగారును, సీతాపతయ్యగారును సెకండుగ్రేడుప్లీడరీ నిమిత్తము చదువుచుండిరి. మరియు కుప్పుస్వామయ్యగారు కాళహస్తీలో జమీందారుగారి యింటిలో పిల్లలకు చదువుచెప్పు ఉద్యోగమును సంపాదించుకొనిరి. అదివరకు బి. ఏ., చదువుసమయముననే తండియారుపేటలో అబ్బయ్యనాయుడుగా రను నొక గొప్పవర్తకునియింటిలో ట్యూటరుగా నుండిరి. ఆయన అందువలన తండియారుపేటలో భార్యతో కాపురముచేయుచుండెను. ఒకప్పుడు ఏదో