దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/చెన్నపట్టణము - సంగీతసాహితులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరిచయము లేకపోయెను. ఇళ్లువదలి ఇతరగ్రామములో నివసించుట మాకు క్రొత్తయగుటచేతను చదువునందు శ్రద్ధ తక్కువగుటచేతను ముచ్చటగ తిరుగుచు కాలము గడపుటకు అభ్యాసపడితిమి. ముఖ్యముగా చెన్నపట్టణములో చదువవలెనను అభిలాష మొదటినుండి హెచ్చుగానుండుటచేత రాజమహేంద్రవరములో చదువుపై లక్ష్యములేకపోవుటవలన పాఠములు పట్టుపడలేదు. కాని ఏమో పెద్దక్లాసులో చదువుచున్నామని గర్వము మమ్ముల ఆవహించెనని చెప్పవచ్చును.

చెన్నపట్టణము - సంగీతసాహితులు

సంవత్సరాంతమున గుంటూరు నాటకసమాజమువారు రాజమహేంద్రవరములో నాటకప్రదర్శనము చేయుటకు వచ్చిరి గాన అందులో నాటకపాత్ర నేను వహింపవలసివచ్చెను. హరిశ్చంద్రనాటకమునకు పౌరులు మమ్ము హెచ్చుగా పొగడిరనితెలిపి యుంటిని. వారిలో అచ్చటి న్యాయవాదులలో ప్రముఖులుగా నుండిన మాకర్ల సుబ్బారావునాయుడుగారు నాయందెక్కువ అభిమానము వహించియుండిరి. ఈలోపల హనుమంతురావు, నేనును చెన్నపట్టణమున క్రైస్తవకళాశాలలో ప్రవేశించి చదువవలెనని నిశ్చయించుకొంటిమి. రాజమహేంద్రవరములో రెండవ సంవత్సరము చదువుటకై జీతముమొదలగువాని నిమిత్తము మా తండ్రుల నడిగి డబ్బు తెచ్చుకొని, శ్రీమాకర్ల సుబ్బారావు నాయుడుగారియొద్దకు బోయి, మేము చెన్నపట్టణ క్రైస్తవకళాశాలలో చదువనిశ్చయించుకొకొంటిమి గాన అచ్చట తగినవారికి సిఫారసుఉత్తరము వ్రాసియియ్యవలసినదని కోరగా క్రైస్తవకళాశాలలో ఉపాధ్యాయుడుగానుండి అచ్చట పరస్థలమునుండి వచ్చిన విద్యార్థుల భోజనాదివసతులను చూచుచుండు డబ్లియు. రామయ్యగా రనువారికి మమ్మునుగూర్చి సిఫారసుఉత్తరము ప్రేమతో వ్రాసియిచ్చిరి. అది తీసుకొని మేము కాకినాడలో ఎల్లోరా యను స్టీమరు నెక్కి చెన్నపట్టణమునకు పయనమైతిమి. ప్రొద్దుననే భోజనముచేసి బయలుదేరితిమి. సముద్రములో దాదాపు ఆరుమైళ్లదూరమున లోతునీళ్లలో స్టీమరు నిలచి యుండెను. కాన స్టీమరు నెక్కుటకు సముద్రములో చిన్నపడవల మీద పోవలసియుండెను. ఆపడవలనెక్కి కొంచెముదూరము పోవునప్పటికి నాకు ఒడలుత్రిప్పి డోకులు ప్రారంభమయ్యెను. ఎట్లో ప్రయాసతో స్టీమరు అందుకొని దానిపై టాపుమీద అనగా 'డెక్‌' మీదకు చేరితిమి. నాకు వమనము లెక్కువ అగుచుండుటచేత చాల బాధగానుండెను. ఆరోజంతయు ఆస్థితిలోనే యుంటిని. మరునాడు స్టీమరు బందరు రేవు చేరునప్పటికి డోకులు కొంత తగ్గుటచేత మిత్రులతో మాటలాడుటకు అవకాశము కలిగెను. నంబూరు తిరునారాయణస్వామి అనుమిత్రుడు మాతో రాజమహేంద్రవరమున మెట్రిక్యులేషన్ పరీక్షనిచ్చినవారిలో నొకడు. మేము చెన్నపట్టణమునకు బోవుటకు ముందుగ మాతోవచ్చి కలుసుకొనెను. అతనికిగాని హనుమంతురావుకుగాని ఈ ఒడలుత్రిప్పుట లేక సుఖముగనేయుండిరి. గుంటూరులో నుపాధ్యాయుడుగా నుండిన శ్రీఅభిరామయ్యరు అను నొక అరవబ్రాహ్మణుడు కొంత వయస్సుచెల్లినవాడు మాతో స్టీమరులో 'డెక్‌' మీదనే ప్రయాణికుడుగానుండెను. మేము సాహసించి చెన్నపట్టణములో చదువనిశ్చయించుకొన్నందుకు మమ్ము నభినందించెను. ఆకాలములో ఈప్రాంతములనుండి చెన్నపట్టణములో చదువబోవువారు మిక్కిలి అరుదుగా నుండిరి. అంతకు మునుపు గుంటూరులో మెట్రిక్యులేషన్‌లో కృతార్థులైనవారి సంఖ్య మిక్కిలి స్వల్పము. అందు పైపరీక్షకు చదివినవారొక్కరో యిరువురో యుండిరి. చెన్నపట్టణమునకు పోయినవారెవ్వరు లేరనియే చెప్పవచ్చును. కనుక మేము చెన్నపట్టణమునకు బోవుట సాహసకృత్యముగనే తలంచవచ్చును.

మూడవదినము ఉదయమున చెన్నపట్టణపు రేవునకు స్టీమరు చేరెను. నేను ప్రయాణములో రెండవరోజుమాత్రము పెరుగులో నానిన అటుకులు కొలదిగా తిని నీళ్లుత్రాగితిని. చెన్నపట్టణము చేరునప్పటికి శరీరము బలహీనముగానున్నను తేటచిక్కినది. ఉల్లాసముగాగూడ నుండెను. చెన్నపట్టణము వంటి మహాపట్టణమును దర్శించుట అదియె ప్రధమముగాన అంతయు విచిత్రముగను వినోదముగను గనుపించుచుండెను. మేము స్టీమరుదిగుటతోడనే కూలీలు మొదలగువారు మాటలాడు అరవభాష శ్రుతికటువుగ తోచెను. మేము రేవునొద్ద నుండి సరాసరి రాయపురములో శ్రీ డబ్లియు. రామయ్యగారి యొద్దకు బోయి మేము వచ్చినపని చెప్పి, మాకర్ల సుబ్బారావునాయుడుగా రిచ్చిన ఉత్తరము వారిచేతి కిచ్చితిమి. వారు దానిని చూచుకొని మమ్ము ప్రేమతో ఆదరించి లింగిచెట్టి వీధిలో విద్యార్థులవసతిగృహములో ప్రవేశమునకు చీటియిచ్చి మమ్ము ఎఫ్. ఏ. క్లాసులో చేర్చుకొనుటకు డాక్టరు మిల్లరు గారి కొకయుత్తరము వ్రాసియిచ్చిరి. అంతట మేము వసతి గృహము చేరి భోజనముచేసి కళాశాల ప్రిన్సిపల్‌గారైన డాక్టర్ మిల్లర్‌గారిని కళాశాలలోనే దర్శించి, డబ్లియు. రామయ్యగారిచ్చిన ఉత్తరము నిచ్చితిమి. వారు సంతసించి మీరు ఎఫ్. ఏ., జూనియర్‌లో చేరుట మంచిదని మాకు సలహానిచ్చిరి గాని మేము జూనియర్‌లో గతసంవత్సరమే యున్నాముగనుక ఈ సంవత్సరము సీనియర్‌లో చేర్చుకొనవలెనని కోరితిమి. అందుకు సమ్మతించి మమ్ము ఎఫ్. ఏ., సీనియరులోనే చేర్చుకొనెను.

పరస్థలమునుంఛి వచ్చిన విద్యార్థులనిమిత్తము మిల్లరుదొర 'స్టూడెంట్స్ హోమ్‌' అనుపేరుతో నొక విద్యార్థివసతిగృహమును తనస్వంతద్రవ్యముతో కట్టించెను. ఆగృహములో మేము చెన్నపట్టణమువెళ్లిన కొలదిదినములకే గృహప్రవేశము జరిపితిమి.

మేము మాపెద్దలతో చెప్పకే చెన్నపట్టణము ప్రయాణము చేసి, అక్కడ చేరినపిదప, కాలేజీలో చేరుచున్నాము గనుక సొమ్ముపంపవలసినదని ఉత్తరమువ్రాయగనే వారికి మే మిచ్చటికి బోవుట యిష్టము లేకపోయినను వెంటనే సొమ్ముపంపిరి. మాకు అన్నియు సుఖముగనే జరుగుచుండెను.

ఇంగ్లీషు, తెలుగు, చరిత్ర, శరీరశాస్త్రము మొదలగువానియందు అభిరుచికలవాడైనను లెక్కలనిన నాకు తలనొప్పి. కనుక బీజగణితము (Algebra) క్షేత్రగణితము (Geometry) (Trignometry) లలో పుస్తకములలోనిభాగము (Book work) మాత్రము గట్టిగా నేర్చుకొనుచుంటినిగాని (problems)ప్రాబ్లములు చేయుటలో బొత్తుగ నసమర్థుడుగ నుంటిని. ఈకారణముననో మరి జూనియర్‌క్లాసులో బాగా చదువని కారణముచేతనో ఆసంవత్సరము ఎఫ్. ఏ., పరీక్షలో నెగ్గలేదు. హనుమంతరావును తప్పిపోయినాడు. కాబట్టి మరల యఫ్. ఏ., సీనియర్‌లో చదువవలసివచ్చెను. ఈసారి పరీక్షలో ఇరువురము కృతార్థులమైతిమి. 1888 - వ సంవత్సరములో బి.ఏ. లో ప్రవేశించితిమి. నేను బి.ఎల్. చదువవలెనని దృఢనిశ్చయముతో నున్నాను. ఫిలాసఫీ (తత్త్వశాస్త్రము) అభిమాన విషయముగా నేను చదువుటకు నిర్ణయించుకొంటిని. హనుమంతురావు గణితములో ప్రవేశము గలవాడగుటచేత ఫిజిక్సు (physics) చదువుటకు నిశ్చయించుకొనెను. తిరునారాయణస్వామిగూడ క్రైస్తవకళాశాలలో జేరి ఎఫ్. ఏ. మొదటితరగతిలో ప్రవేశించినాడు. అప్పటికే వివాహితుడై యుండినందున తనకుటుంబమును రప్పించుకొని తండియార్‌పేటలో కాపురము ఏర్పరచుకొని యుండెను. మెట్రిక్యులేషన్‌లో మాతోడనే ఉత్తీర్ణుడైన నాసహాధ్యాయి కోడూరు చంద్రశేఖరము మిక్కిలి బీదవాడగుటచేత ఎఫ్. ఏ. లో జేరుటకు అవకాశము లేకపోయెను. కాని రెండుసంవత్సరములు గడచినపిమ్మట అతడు ఎట్టులో చెన్నపట్టణము జేరి తిరువళ్లి క్కెణిలో ఉద్యోగములలోనున్న తెలుగువారియిండ్లలో వారములేర్పరచుకొనియు, కొన్నిరోజులు స్వయముగ వంటచేసుకొని భోజనముచేయుచు ఎఫ్. ఏ. క్లాసులో క్రైస్తవకళాశాలలోనే చేరి చదువనారంభించెను. కాని జరుగుబాటు మిక్కిలి కష్టముగ నుండెను. మాటిమాటికి నన్ను కలియుచు తన కష్టములు చెప్పుకొనుచుండెను. నాకైనను మా తండ్రిగారు కావలసిన ఖర్చులన్నియు నియ్యజాలరని నేను డాక్టరు కుగ్లరును కోరియుండగా ఆమె నెలకు రు 7/- ల చొప్పున కొంతకాలము దయతో పంపుచుండెను. మరి కొంతకాలము చెన్నపట్టణములోనే యొక ఆంగ్లో - ఇండియనుకుటుంబములోని పిల్లకు ఉదయమున నొకగంట తెలుగుచెప్పుటకై నన్ను కోరి అందుక్రింద నాకు తానిచ్చుచుండిన రు 7/- లు జీతముగా చూచుకొనవలెనని ఆమె నిర్ణయించెను. ఆప్రకారమే ఆచిన్నదానికి తెలుగుచెప్పుచుంటిని. నా తండ్రిగారు నాకు కావలసినసొమ్ము పంపుచుండినందున నాకు వచ్చుచున్న రు 7/-లును చంద్రశేఖరమునకు ఇచ్చుచుంటిని. నాఅవసరనిమిత్తము అనిచెప్పి కుగ్లరుగారియొద్దనుంచి తెప్పించుకొనుచున్నసొమ్ము ఆమెకు తెలుపకుండ నే నితరుల కిచ్చివేయుట తప్పు అని తెలియకపోలేదు. నా కవసరములేదని ఆమెకు తెలిపినయెడల ఆమె దానిని పంపుటమానివేయుననియు, అప్పుడు నాస్నేహితునకు సహాయము చేయజాలననుమాటయే మనస్సున బెట్టుకొని ఆమెకు తెలుపకుండ గనే ఇట్లు వినియోగించుచుంటిని. కొంతకాలమునకు ఆమెకు ఎట్లో తెలిసి ఆమె సొమ్ముపంపుట మానివేసెను. కాని నేను దానిని మిక్కిలి కష్టమునకోర్చి చదువుచున్నవిద్యార్థియొక్క అవసరము నిమిత్తము వినియోగించితినని తెలుసుకొని కొంతవరకు నావిషయమై కలిగిన అభిప్రాయమును మార్చుకొనెను.

నేనును హనుమంతురావును మిల్లరుగారి విద్యార్థివసతి గృహములోనే నివసించుచుంటిమి. ఈ భవనము మూడంతస్తులు గలమేడ. దీనిలో టవరును, ఆటవరులో ఒకదానిపై నొకటిగా నున్న రెండుగదులు ఉండెను. ఈభవనములో సుమారు ఏబది మంది విద్యార్థులు ఎఫ్. ఏ. మొదలు బి.ఏ. తరగతులవారు మాత్రమే నివసించుచుండిరి. భోజనములకు వంటశాల, వంట బ్రాహ్మణులు ఏర్పడియుండిరి. ఇందు బ్రాహ్మణవిద్యార్థులు మాత్రమే నివాసముచేయుచుండిరి. తక్కినకులమువారికి ఫెన్సు విద్యార్థిగృహము మరియొకటి కొంతకాలమున కేర్పరచబడెను. మేము దిగువగదులలో నలుగురువిద్యార్థులకు సరిపోవున ట్లేర్పరచబడిన పెద్దగదిలో నుంటిమి. నెల 1కి ఒక్కొక్కరము ఒక్క రూపాయిచొప్పున అద్దెయిచ్చుచుంటిమని జ్ఞాపకము. భోజనమునకు నెల 1కి 10 రూపాయలు నిర్ణయమని జ్ఞాపకము. విద్యార్థి వలన వసూలుచేయబడిన మొత్తము అంతయు వసతిగృహమునకు వలయు ఖర్చులక్రిందనే వినియోగింపబడుచుండెను. ఈ వసతిగృహవచారణకర్తగా అయ్యాదొరఅయ్యంగారనువారు, కాలేజితో సంబంధించిన హైస్కూలులోని ఉపాధ్యాయులుగానున్నవారు నియమింపబడి పనిచేయుచుండిరి.

ఈ వసతిగృహములోనే చిత్తూరువా రిరువురు బి. ఏ. తరగతివిద్యార్థులు నివసించుచుండిరి. వారు తెలుగువా రగుటచేత మాకు వారితో చెలిమిచేకూరెను. వారిలో నొకరు విండ్లచెరువు రామయ్యగారు. వీరు చాల బక్కపలచగానుండెడివారు, కాని లెక్కలలో మంచిసమర్థులు. తక్కినవిషయములందును చురుకుగలవారే. రెండవవారు పిడతల సీతాపతయ్యగారు. ఈయన తెలివిగలవారు. తెలుగులయందు మంచి ప్రవేశముగలవారు. వీరిసహపాఠి నాగపూడి కుప్పుస్వామయ్య గారు వసతిగృహములో నుండక తండియారుపేటలో భార్యతో కాపురముచేయుచు కాలేజికివచ్చి చదువుచుండెడివారు. వారు అన్నివిషయములందును సమానమగు సామర్థ్యముగలవారు. వారు అరవవారయ్యును తెలుగుభాషయందు ఎక్కువ అభిమానము గలిగి అందు పాండిత్యము సంపాదించిరి. సీతాపతయ్యగారును కుప్పుస్వామయ్యగారునుగూడ తెలుగులో పద్యములు వ్రాయుచుండెడివారు. వీరుమువ్వురకు (chittoor trinity) చిత్తూరిత్రయమని మేము పేరుపెట్టితిమి. దినములు గడచినకొలది వారికిని మాకును ఎక్కువ స్నేహభావ మేర్పడెను. మాయందు వా రెక్కువ ప్రేమతో మెలంగుచుండిరి. మేము బి. ఏ. క్లాసులో చదువుకాలమునకు తిరునారాయణస్వామి ఎఫ్. ఏ. సీనియరులో చదువుచుండెను. ఈతనిభార్య గర్భిణియై యుండినందున ఆమెను పుట్టినింటికి పంపి మరియొకచోట భోజనముచేయుచుండెను. ఆకాలములోనే నాకు గుంటూరులో విద్యాగురువుగనుండిన శ్రీకొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెన్నపట్టణములో పచ్చయప్పకళాశాలలో తెలుగుపండితులుగా నియమింపబడుటచేత వారు తిరువళ్లిక్కేణిలో కాపురము చేయుచుండిరి. వారియింటిలో వారిబంధువు అమ్మాయమ్మగారు అను వృద్ధురా లుండెను. ఆమెయు తెలుగుకవిత్వమందు కొంతప్రవేశము కలిగినవా రగుటచేత మేము అప్పుడపుడు శాస్త్రిగారిని చూడబోయినపుడు ఆమెతోగూడ సంభాషించుచుంటిమి. తిరునారాయణస్వామి తెలుగుపద్యములు సుకరముగ వ్రాయుచుండెను. తాను వ్రాసినపద్యములను ఆమెకు చదివి వినుపించుచుండెను. ఇట్లుండగా అతనిభార్య ప్రసవించి కుమారునిగనె ననువార్త వచ్చినతోడనే పోయి తల్లిని బిడ్డనుచూడవలెనని ఆతురపడుచుండెను. ఆసమయమున నే నీపద్యమును

        అనుపమనిత్యసత్యవ్రత యంబుజలోచన కృష్ణవేణి ప్రా
        గ్వనిత యుదీర్ణతేజు రవి గాంచినయట్టుల దాను పుత్రునిన్
        గనె ననువార్త వీనుల కనంతము విందులుసేయుచుండగా
        మనమలరార జూచుటకు మాటికి కోరిక లీరికల్‌గొనెన్.

వ్రాసి అతని యాతురత వర్ణనచేసితిని. ఇదియే నేను నాజీవితమున వ్రాసిన మొట్టమొదటి పద్యము. తప్పులతడకయే యగును గాని నాకు పద్యములందుగల యభిరుచి కొంత కన్పడుచున్నదని చెప్పవచ్చును. ఆరోజులలో ముక్కుతిమ్మన్న గారి పారిజాతాపహరణమునం దెక్కువ యభిమానముండుటచేత దానియందలి కొన్ని పద్యములను కంఠస్థముచేసుకొని పాడుకొనుచుండెడివాడను. మరియు ఆకాలములో సంగీతమనిన నాకు ప్రేమ యధికముగ నుండెను. మావసతిగృహములో అరవదేశపువిద్యార్థులు పలువురుండిరి. వారిలో కొందరు కృతులుమొదలగునవి పాడుచుండిరి. వానిని వినుచుండుటయేగాని వారివలె పాడవలెనను పట్టుదల యేమియు లేకుండెను. తుదకు అరవభాషమాట్లాడుటకైన ప్రయత్నముచేయలేదు. అది వినుటకు కొంత కటువుగానుండుటచేత దానిపై బుద్ధిపోలేదు. ఆకాలమున దక్షిణదేశమున మిక్కిలి ప్రసిద్ధిగాంచిన సంగీతవిద్వాంసు లొకరు అప్పుడపుడు చెన్నపట్టణమునందు ధనాధికులయిండ్లలో పాడుచుండెడివారు. వారి గానము రెండుమూడుసారులు నేను వినుటకు బోయియుంటిని. వారిపాట వినుటకు వేలకొలదిజనులు మూగుచుండిరి. వారి కంఠధ్వని మిక్కిలి మనోజ్ఞముగ నుండెను. హెచ్చుస్థాయిని పాడుచుండు వారిపాట వీధులలో మూగియుండిన జనులకు సయితము వినవచ్చుచుండెను. చెన్నపట్టణమునకు వచ్చినపుడెల్ల వేలకొలది ద్రవ్యము ఆయన మూటగట్టుకొనిపోవుచుండెను. ఆయన కొంచెము పొట్టిగానున్నను స్ఫురద్రూపముగలిగి పవిత్ర చరిత్రముగలవాడని పేరుచెందెను. వారిపేరు జ్ఞాపకముచాలదు. ఏదో వాధ్యాయరు అని పిలిచెడివారు. మరియు ఏనాదిపిల్ల లను ఇరువురుస్త్రీలు పాటకచ్చేరీలలో మిక్కిలి హృద్యముగ పాడి పలువురచే మెప్పుగాంచుచుండిరి. వీరు పేరుకు పిల్లలుగాని వయస్సున యువతులే. పిమ్మటికాలములో పట్టణము సుబ్రహ్మణ్యము అయ్యరుగారిపాట ప్రఖ్యాతముగ చెప్పుకొనుచుండిరి. వారిపాట నేను వినుట సంభవించలేదు.

జావళులను కొందరు సంగీతపాటకులు పాడుచుండెడివారు గాని అవి సాధారణముగ గొప్పపేరు పొందినవిద్వాంసులు పాడుట లేదు. జావళీలలో కొన్ని అశ్లీలములుగా నుండునవిగాన నానాట వానిప్రచారము దేశమున తగ్గిపోయినది. త్యాగరాజకృతులే విశేషముగ ఖ్యాతిగాంచినవి. త్యాగరాజు తెలుగువాడయ్యు అరవదేశమున బుట్టి అక్కడనే ఈకృతులను వ్రాసి ప్రచారము గావించియుండుటచేత మహావిద్వాంసులు వారికృతులనే ముఖ్యముగ పాడుచుండిరి. తెలుగుదేశమున మువ్వగోపాలపదములు మొదలగువానిని భోగముమేళములలో పాడుచుండిరి. కాని త్యాగరాజకృతులుపాడుట మనవారికెవ్వరికిని ఆకాలమున అభ్యాసములేకుండెనని చెప్పవచ్చును. నేనెఱిగినంతలో గోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాలలో ప్రథమమున కృతులుపాడినవారు జంగం కోటయ్యగారు, హరిదాసులు కొందరు రామదాసుకీర్తనలు పాడుచుండిరి. ఉత్తరమున విజయనగర సంస్థానములో గొప్ప సంగీతపాటకు లుండిరని చెప్పుకొనుచుండిరి. అప్పటి విజయనగరసంస్థానాధీశుడు ఆనందగజపతిజమీందారుగారు చెన్నపట్టణమునకుపలుమారు వచ్చుచుండిరి. మరియు అక్కడ అప్పుడప్పుడు జరుగుమహాసభలకు వచ్చుచుండిరి. వారిస్వరూపము అత్యంత నిపుణుడగు శిల్పి చెక్కిన పచ్చనిబంగారుప్రతిమవలెనే యుండెను. వారి ముఖారవిందము ఎన్నిసార్లుచూచినను ఇంకను చూడవలెననియే కోర్కె పుట్టుచుండెను. తెల్లనిలాగును తెల్లని అంగరఖాను తొడిగి, దానిపైన నల్లనిపూసలుగల బంగారుతావళము మెడలో వేసుకొని, రవలు చెక్కిన తురాయిగల ఎఱ్ఱని టోపీ పెట్టుకొని సభలకు వచ్చుచు ప్రేక్షకుల కానందముగొల్పుచుండెను. ఆనందగజపతియను నామధేయము వారియెడ పూర్ణముగ సార్థకమయ్యెను. ఆకాలమున వారిరూపము చిత్రపటములలో వ్రాసి బజారులలో నమ్ముచుండిరి. వారు పండితులు, విద్యాభిమాను లగుటచేత గొప్ప విద్యాపోషకులై తమ యాస్థానమున సంస్కృతపండితులను, సంగీత పాటకులు మొదలగు కళానిధులను ఉంచుకొని వారిని పోషించి గౌరవించుచుండిరి. వీరికాలములోనే కాబోలు విజయనగరములో ఆంగ్లేయకళాశాల స్థాపింపబడినది. వీరు గొప్పరసికులని సయితము చెప్పుకొనుచుండిరి. గ్రాంటుడఫ్ అను నతడు మద్రాసుగవర్నరుగా నుండెను. ఆయనకు భార్యయు, వయస్సువచ్చిన కుమార్తెలు నుండిరి. ఆనంద గజపతి తరచు వారింటికి బోవుచు ఆడవారితో మిక్కిలి పరిచయముతో ప్రవర్తించుచుండెననియు గొప్పగా ద్రవ్యముగూడ నిచ్చుచుండెననియు చెప్పుకొనుచుండిరి.