దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/రంగయ్య సెట్టి - మిల్లరు దొర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆదినములలోనే న్యాపతి సుబ్బారావుపంతులుగారు జిల్లాకోర్టులో న్యాయవాదిగానుండి ఖ్యాతిగాంచి ప్రధానపురుషుడుగా పరిగణింపబడుచుండెను. వివేక వర్థని ప్రకటన మొదలగు కార్యములందును పునర్వివాహసందర్భములలోను వీరేశలింగముగారికి చేయూతనొసంగుచు వారితో మిక్కిలి మైత్రితో ప్రవర్తించుచుండిరి. వారితమ్మునికి వితంతువుతో వివాహము, తనకు తెలుపకుండ వీరేశలింగముగారు జరిపినందుకు వారిపై కోపించి అప్పటి నుండియు భేదభావముతో ప్రవర్తించుచుండిరని పలువురు చెప్పుకొనుచుండిరి.


రంగయ్య సెట్టి - మిల్లరు దొర

మేము బి. ఏ., క్లాసులో జేరునప్పటికి మామిత్రులగు విండ్లచెరువు రామయ్య, పిడతల సీతాపతయ్య, నాగపూడి కుప్పుస్వామయ్యగార్లు బి. ఏ. పరీక్షలయందు కృతార్థులైరి. విండ్లచెరువు రామయ్యగారు గుంటూరులో హిందూఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా జేరిరి. కుప్పుస్వామయ్యగారును, సీతాపతయ్యగారును సెకండుగ్రేడుప్లీడరీ నిమిత్తము చదువుచుండిరి. మరియు కుప్పుస్వామయ్యగారు కాళహస్తీలో జమీందారుగారి యింటిలో పిల్లలకు చదువుచెప్పు ఉద్యోగమును సంపాదించుకొనిరి. అదివరకు బి. ఏ., చదువుసమయముననే తండియారుపేటలో అబ్బయ్యనాయుడుగా రను నొక గొప్పవర్తకునియింటిలో ట్యూటరుగా నుండిరి. ఆయన అందువలన తండియారుపేటలో భార్యతో కాపురముచేయుచుండెను. ఒకప్పుడు ఏదో పండుగనాడు వారియింటికి నన్ను బిలుచుకొనిపోయి భార్యచేసిన భక్ష్యభోజ్యములను మిక్కిలి ప్రేమతో కుడువబెట్టిరి. అరవవారి యింట నేను భోజనముచేయుట కదియే మొదలు. కుప్పుస్వామయ్యగారు నన్ను తనకు నెడమప్రక్కను గూర్చుండబెట్టుచు అది వారియిండ్లలో సాంప్రదయముగ జెప్పిరి. కుప్పుస్వామయ్య అరవలైనను తెలుగుభాషయందువలెనే తెలుగువారి ఆచారముల పట్ల వారికి అభిమానము మెండు.

తాము అబ్బయ్యనాయుడుగారి పిల్లలకు ట్యూటరుపదవి మానుకొనిపోవునప్పుడు నన్ను ఆపనిలో ప్రవేశపెట్టుటకు తీసికొని పోయిరి. అప్పుడు ఇంగ్లీషుపాఠమును బాలురకు చెప్పుమని కోరిరి. నేను చెప్పి ముగించి యింటికివచ్చితిని. నేను (pudding) 'పుడ్డింగ్‌'అను పదమును 'పుడ్డింగ'నుటకుబదులు 'పడ్డింగ'ని ఉచ్చిరించితినట. అందువలన నన్ను ట్యూటరుగా నేర్పరచుకొనుట వారికి సమ్మతముగాకపోయెనని కుప్పుస్వామయ్యగారు నాతో నొచ్చుకొనుచు జెప్పిరి.

మేము ఎఫ్. ఏ. క్లాసులో చదువునపుడు 'మారన్‌'అను నొక ఉపాధ్యాయుడు ట్రిగ్నామెట్రీ బోధించుచుండెను. ఆయన చెప్పునదేదియు బోధపడకుండెను. ఆయనకు సహాయోపాధ్యాయు డొక యరవబ్రాహ్మణుడుకూడ ఆశాస్త్రమునే చెప్పుచుండెడి వాడు గాని ఆయన చెప్పుచుండగా విద్యార్థులు మితిలేని అల్లరి చేయుచుండెడివారు. ఆయనయును బోధనాశక్తియం దసమర్థుడే. కాబట్టి ఈశాస్త్రము బాగుగ బోధపడక మొదటిసారి ఎఫ్. ఏ. పరీక్షలో తప్పిపోవుట కలిగినది. బి. ఏ. క్లాసులకు రంగయ్యచెట్టి గారను నొక దక్షిణాదివైశ్యుడు ఉపాధ్యాయుడుగా నుండెను. ఈయన గణితశాస్త్రమునందు మంచి ప్రవేశముకలవాడని చెప్పుకొనుచుండిరి. ఆయన తెలుగువా డగుటచేత కాలేజిలో తెలుగు క్లాసులపై తనిఖీకి అప్పుడప్పుడు వచ్చుచుండెడివారు. గురుమూర్తిశాస్త్రులుగారు తెలుగుపాఠములు బోధించుచుండిరి. ఈయన వయోవృద్ధులు. వీరిమాట విద్యార్థులెవ్వరును లక్ష్యపెట్టుటలేదు. ఎప్పుడును క్లాసులో అల్లరి మిక్కుటముగా నుండెడిది. రంగయ్యచెట్టిగారు తనిఖీకివచ్చుసందడి తెలియగనే అందరు నిశ్శబ్దముగ నుండెడివారు. శాస్త్రిగారు ఏవేవో కధలుచెప్పి అందరిని నవ్వించుచుండిరి. ఒకనాడు 'మారన్‌' మాక్లాసుకు రాలేదు. క్లాసులో అల్లరి ఎక్కువగా నడచుచున్నసమయమున రంగయ్యచెట్టిగారు వచ్చిరి. వీరి దేహచ్ఛాయ నల్లగానున్నను సుందరరూపులు. తెల్లనిధోవతిగట్టి తెల్లనిలాంగుకోటు తొడిగి, సరిగంచుతలగుడ్డ పెట్టుకొని కాళ్లకు తిరుచునాపల్లిముచ్చలజోడు తొడుగుకొని ఏమియు చప్పుడుచేయకుండ నడచుచుండువాడు. ఈయన దుస్తు లేనాటి కానాడు ఇస్త్రీచేసిన మడతలే. వైష్ణవ నామములు దిద్దినముఖము, వంకరలుతీరిన నల్లనిమీసము ఆయన యాకృతికొకరీతి సొంపును గంభీరతను నొడగూర్చుచుండెను. ఈయన క్లాసునకు వచ్చి నేడు మీ పాఠ మేమి యని యడిగి, కుర్చీలో కూర్చుండి పాఠము చెప్పబోవుచుండగా బైనామినల్ థీరం చెప్పవలసినదని విద్యార్థులు కోరిరి. అంతట ఆ థీయరీని చాల నెమ్మదిగ అందరికిని సులభముగ తెలియునట్లు బోధించెను. అంతకుముందు అగమ్యగోచరముగనున్న ఆథీరము అరటిపండు లిచి చేతిలోపెట్టినట్లుండుటచే మిక్కిలిసంతోషముతో విని, వీరే మాకు బోధకులుగా నుండిన ఎంత బాగుండెడిదో గదా యని అనుకొంటిమి. ఉత్తరాది తెలుగువిద్యార్థులయందు వీరికభిమానము మెండు.

మా కళాశాలాభవనమును పెంపుచేయవలెనను సంకల్పముతో మార్చి, కట్టుచుండగా, ఆకస్మికముగ నొకనాడు గొప్ప తుఫాను వీచుటచే క్రొత్తగాకట్టుచున్న టవరు కూలి హాలుమీద బడి క్రిందిగదులనుగూడ నష్టపరచెను. వర్షము వరుసగ కొన్నిరోజులు మిక్కుటముగ కురియుచుండెను. సమీపమున నున్న యాండర్సన్ హాలులోనికి మాక్లాసు మార్చబడెను. చరిత్రపాఠము చెప్పు ఉపాధ్యాయుడు ఒకనాడు కళాశాలకు రాలేదు. విద్యార్థులు ఆనాడు చేసినఅల్లరి మిన్నుముట్టిపోవుచుండెను. మా ప్రిన్సిపాల్ డాక్టరు మిల్లరుగారు క్రొత్తకట్టడములు పడిపోవుటచే కలిగిన నష్టమునకు మిక్కిలిచింతాక్రాంతులై కళాశాలాభవనమందున్న సమయమున మాక్లాసులో విద్యార్థులుచేయు అల్లరి వారికి మిక్కిలి దుస్సహముగతోచి కోపోద్దీపితులై వర్షములో తడియుచు యాండర్సన్‌హాలులోనికి వచ్చిరి. మిల్లరు దొరగారు పొడవును పొట్టియునుగాని నడితరముఎత్తుగలిగి లావునుగాక సన్నమునుగాక తగినంత దృడకాయముకలిగి గుండ్రని ముఖమున, ముచ్చటగొలుపుమీసములతో శోభిల్లుచుండెను. ఆయన కనుబొమలపై వెండ్రుకలు ఇంచుక దట్టముగ పొడవు పెరిగి కోపమువచ్చినపుడు ముడిబడుచుండెను. గంభీరమగు వారి ముఖారవిందము చూచినంతనే గౌరవముకలుగుచుండును. ఆ నా డాయన యాండర్సనుహాలు వాకిలి దాటి లోపల అడుగుపెట్టి, (My Boys) మై బాయిస్ అని యొక కేకవేయుటతోడనే అల్లరి యంతయు చల్లారెను. ఆయన కోపోద్దీపితమైన ముఖమును జూచి అందరును భయమునొందిరి. (shame, my boys, shame)సిగ్గు, పిల్లలారా సిగ్గు అని నుడివి, శాంతించి నేడు మీ పాఠమేమి యని ప్రశ్నించగా గ్రీకులచరిత్రలో పిలపోనీషియన్ యుద్దము అని చెప్పగా విని ఆయుద్ధమునకు కారణములను విపులముగ విశదీకరించి ఆయుద్ధమున గ్రీకుసేన లెట్లుపోరాడెనో తెలుపుచు యుద్ధప్రచారమును వర్ణించి అనన్యమగు వారి వాగమృతమును వర్షించుటయేగాక ఆ చరిత్రాంశముల పరిజ్ఞానమును ప్రకటించిరి. తలవనితలంపుగ క్లాసుకు వచ్చి, ఏప్రయత్నమును లేకయే పిలపోనిషియన్ యుద్ధమునుగూర్చి ఇన్ని వివరములు ఇంత విపులముగ తెలుపుట మాకు మిక్కిలి ఆశ్చర్యమును కల్పించెను. వా రెప్పుడును కళాశాలలో షేక్సుపియరుపాఠముతప్ప మరియొకటి చెప్పెడి వాడుక లేదు. చరిత్రవిషయములో ఆయన కే జోక్యమును లేదు. వారు చెప్పిన దంతయు పూర్వ మెప్పుడో చదివినదైనను అంత బాగుగా చెప్పుట వారికిగల అసాధారణమగు జ్ఞాపకశక్తిని ప్రకటించెను. అట్టి జ్ఞాపకశక్తిచేతనే తన విద్యాశాలలో చదువు సుమారు రెండువేలమంది విద్యార్థులలో ప్రతివానిని పేరుపెట్టి పిలువనేర్చిరి.


____________