దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పడవ ప్రయాణము

వికీసోర్స్ నుండి

పడవ ప్రయాణము

మేము బి. ఏ. మొదటితరగతిలో చదువుచుండగనో ఎఫ్. ఏ. చదువుకాలములోనో ఒక్కవేసవిసెలవులలో కళాశాల మూయుటతోడనే బకింగుహాముకాలవ అను చెన్నపట్టణపు కాలవపై పడవలమీద చేబ్రోలుచేరి, అక్కడనుండి గుంటూరు చేరవచ్చునని యోచనచేసి పడవవారిని అడుగగా వారము రోజులలో వెళ్ళవచ్చునని వారు చెప్పినందున కొందరు విద్యార్థులము కలసి పడవనెక్కి ప్రయాణముచేసితిమి. (Lake Pulicut) ప్రళయకావేరి యని పిలువబడు ఉప్పునీటిమడుగును పడవదాటి పోయిన కొలది దినములనుండి మాకు ఈ ప్రయాణములో కష్టములు ప్రారంభమైనవి. వెంట తెచ్చుకొన్న లడ్లు, కారపుబూంది మొదలగునవి తినివేసితిమి. మాపడవలోనే యొక బ్రాహ్మణ వితంతువును ఆమెకుమారు డొకబాలుడును ప్రయాణము చేయుచుండిరి. ఆమె చాల బీదరాలు. ఆమె మాకు ప్రతిదినమును వండిపెట్టునట్లును మాకును ఆమెకును ఆమెకుమారునకును కావలసిన బియ్యము మొదలగు భోజనద్రవ్యము మేము తెచ్చి యిచ్చునట్లును ఏర్పాటు చేసుకొంటిమి. మే మెక్కినపడవగాక మరికొన్ని పడవలుగూడ మాపడవతోడనే ప్రయాణముచేయుచుండెను. ప్రళయకావేరి దాటినతర్వాత నొక మధ్యాహ్నమున నొక సరుగుతోటయొద్ద పడవలు ఆపివేసి, సమీపమున పల్లెలో కలాసులు వారివారి బసలకు భోజనమునకు బోయిరి. మేము తెచ్చుకొన్న బియ్యము మా కందరికి కావలసినవి కొలిచి ఆమె కిచ్చితిమి. సమీపగ్రామములో ఉప్పు, గూరగాయలు, మజ్జిగ దొరకునని ఆశతో ఒకరిద్దరు పోయిరి. మాకు వంటచేయుటకు ఒప్పుకొనిన ఆమె కాలువలో స్నానముచేసివచ్చునప్పటికి తోటలో నొకచోటస్థలము బాగుచేసి పొయ్యినమర్చి నిప్పు రాజబెట్టుడని ఆమె కోరినందున మేము రాళ్ళుతెచ్చి వానిని పొయిగా నమర్చి పుల్లలు వెతకికొనివచ్చి పొయిలో నుంచి నిప్పుపెట్టెలో పుల్లగీచి ముట్టించునప్పటికి పుల్లలు కాలుటయే గాక పొయిక్రిందను దానిచుట్టును నేలమీదనున్న సరుగుచెట్ల ఆకుమొదలగునవి భగ్గునమండి మంట నలుప్రక్కల బ్రాకనారంభించెను. అంతట చుట్టునున్న తుక్కును వెనుకకు నెట్టి మంట ప్రాకనీయకుండ చేసి మరల ఆ దుగ్గేమియు లేకుండ తీసివేసిన నేలపై పొయి నమర్చితిమి. తోట అంతట సుమారు అరగజము ఎత్తున పడియున్న సరుగుచెట్లఆకు అలము సులభముగ రవులుకొనిపోవుననుమాట గుర్తించక ఆదుగ్గుమీదనే పొయిపెట్టుట వలన ఈ యుదంతము సంభవించెను. కాని దైవానుగ్రహము వలన ఆమంటలు ప్రాకకుండచేయగలిగితిమని సంతసించితిమి. కూరలు మొదలగునవి తేవలెనని దగ్గరిగ్రామమునకు బోయినవారు ఉప్పుమాత్రము తెచ్చిరి. తక్కినవేవియు దొరకలేదు. కనుక ఏ మూడుగంటలకో పచ్చిపులుసుతో అన్నముతిని అంతట పడవనెక్కి ప్రయాణముచేసితిమి.

మాతోడ నొక వైష్ణవాచారిగూడ ప్రయాణము చేయుచుండెను. ఆయన ఆతోటలోనే చుట్టును గుడ్డలుకట్టి రహస్యస్థానము నేర్పరచుకొని కాలవలో స్నానముచేసి తిరునామములు దిద్ది, దడిలోపల సుఖముగ భుజించి మావంట పారంభ మగుచుండగనే వెలుపలకు వచ్చెను. బందరుకాపురస్తులు కట్టమూడి చిదంబరరావు అనువారు భార్యతోగూడ ప్రయాణము చేయుచుండిరి. వారికి కావలయువస్తువు లన్నియు జాగ్రత్తగ పట్నమునుండియే తెచ్చుకొనిరి గాన వారును త్వరలోనే వంటచేసుకొని భోజనముచేసిరి.

కాలువపొడవున పలుచోటుల సముద్రపుపోటుతో ఇసుక కొట్టుకొనివచ్చి దిబ్బలు పెట్టియుండుటచేత పడవలు తేలుటయే కష్టముగానుండెను. దిబ్బలమీద పడవలవారును మే మందరమునుగూడ కలసి పడవలను నెట్టుచు దాటించవలసివచ్చుచుండెను. ఇందువలన ప్రయాణము సాగక దినములు గడచిపోవుచుండెను. నిత్యమును పచ్చిపులుసు మెతుకులే గతియయ్యను. అవియేనియు ఒక్కపూటమాత్రమే. ఇట్లు మేము క్రొత్తపట్టణము నొద్దకు వచ్చునప్పటికి పదునైదురోజులు పట్టెను. ఆయూరు చేరుసరికి మట్టమధ్యాహ్న మాయెను. కాలువకును ఊరికిని చాలదూరము అయినను ఏపూటకూలిబసలోనో భోజనము చేయవచ్చునను ఆశతో ఎండచే తల మాడుచున్నను కాళ్లు కాలుచున్నను ఊరికి చేరితిమి. ఆయెండకు తాళలేక పిట్టయొకటి చెట్టునుండి జారిపడెను. అట్టియెండలో మేము ఊరుచేరినను ఒక అమ్మ ఇంత అన్నముపెట్టి ఏదోపచ్చడివేసి నీళ్లమజ్జిగతో సరిపుచ్చెను. పడవప్రయాణమిక చాలునని బండిచేసుకొని చినగంజాము చేరి అక్కడనుండి మరియొకబండిమీద ఎట్లో గుంటూరు చేరునప్పటికి ప్రాణములు శల్యగతములై యుండుటచేత మాతండ్రిగార్లు మమ్ముజూచి మిక్కిలి భయపడిరి. ఎట్లో కొన్నివారములకు నెమ్మదిగ మామూలుమనుష్యులము కాగలిగితిమి. ఆకాలములో రైళ్లులేని కారణమున బందరో, కాకినాడో చేరుస్టీమర్లు దొరికినప్పుడే ప్రయాణముసాధ్యమగుటచేత అట్టిప్రయాణమును వ్యయప్రయాసలతో కూడియుండుటచేతను గుంటూరు చెన్నపట్టణములమధ్య రాకపోకలు మిక్కిలి కష్టసాధ్యముగనుండెను.

ఈచెన్నపట్టణపు కాలువమీదనే నేను గుంటూరుమిషన్ హైస్కూలులో చదువుచున్నకాలమున మేడముబ్లావాట్‌స్కియును, కల్నల్ ఆల్‌కాట్‌గారును చేబ్రోలుచేరి, చేబ్రోలునుండి గుంటూరువచ్చిరి. ఆదినములలో కాలువ దిబ్బలువేయక మంచి స్థితిలో నుండెనేమో. థియసాఫికల్ సొసైటీ అనగా దివ్యజ్ఞాన సమాజ మప్పుడే యాయూర స్థాపించబడెను. అప్పుడు గుంటూరులో మాడభూషి వేదాంతం వెంకటాచార్యులుగారు అను గొప్పసంస్కృతపండితు లొక రుండిరి. వారు ఏకసంధాగ్రాహి యని పేరుపొందిరి. ఏవిషయమైనను ఒక్కసారి చదివినను వినినను దానిని ఏమియు మరచిపోక అంతయు పాఠముగ చెప్పగల బుద్ధి సామర్థ్యము వారి కుండెను. మాడము బ్లావట్‌స్కీగారు రుషియాదేశవాసి యగుటచే ఆమె దేశభాషలో నేదియో చెప్పిన దానిని ఆపండితుడు విని వెంటనే తప్పులేకుండ ఒప్పజెప్పెనట. ఈయన మరియొకసారి జిల్లాకోర్టులో నూజవీడు జమీందారీ కేసులో సాక్షిగ విచారించబడెను. అప్పుడు చాలదీర్ఘమగు వాజ్మూలమునిచ్చియుండెను. దాని నంతయు తాను చెప్పినది చెప్పినట్లు మొదటినుండి తుదివరకు మరల ఏకరువుపెట్టెనని సాధారణముగ చెప్పుకొనుచుండిరి. వీరు ఇప్పుడు గుంటూరులో వకీలుగానున్న శ్రీ మాడభూషి వేదాంతం నరసింహాచార్యులుగారి పెంపుడుతండ్రి. అట్టి మహాపండితులు ఈకాలములో కనబడుటలేదు.

వివాహము

మేము బి. ఏ. చదువుట ప్రారంభించినపిమ్మట నాకు వివాహముచేయవలెనని మాతండ్రిగారు ఉద్దేశించుకొనిరి. మెట్రిక్యులేషనులో చేరకపూర్వమే సంబంధములు వచ్చుచుండెను గాని మాపిల్లవాడు చదువుకొనుచున్నాడు గనుక వివాహము చేయతలచలేదని పంపివేయుచుండిరి. కాని ఇప్పుడు ఇంటిలో మేనత్త అబ్బాయికి వివాహముచేయు మని చెప్పసాగినది. కనుక తగిన సంబంధమునిమిత్తము కొన్ని గ్రామములకు బోయి, తుదకు వంగోలు సమీపమున లింగమగుంట అనుగ్రామములో లింగమగుంటవారిపిల్లను జూచివచ్చిరి. కొలదిరోజులకు ఆపిల్లమేనమామ గారును మరియొకబంధువును మాయింటికి వచ్చి, సంబంధము నిశ్చయించుకొని పిల్లకు వివాహము తిరుపతిలో మ్రొక్కుబడి యుండుటచే అక్కడనే చేయవలసియుండునని చెప్పివెళ్ళిరి. ఆపిల్లకు తండ్రిగారు కొలదిసంవత్సరములక్రిందటనే గతించిరి. తల్లియును, ఎనిమిదేండ్లవా డొకతమ్ముడు నుండిరి. లింగమగుంటవారిది వంగవోలుతాలూకాలో పేరుపొందిన వంశము. ఈపిల్ల తండ్రిపేరు కోదండరామయ్యగారు, వారితండ్రి కోటయ్యగారు. ఆగ్రామకరిణీకమువారిదే. వారు భారీవ్యవసాయదారులు. స్వంతముగాని, ఇతరులవలన కవుళ్లుపొందిన మాన్యములుగాని రెండువందల ఎకరములవరకు నుండెడిది. అన్నదానమునకు