దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/మెట్రిక్యులేషను పరీక్ష
మెట్రిక్యులేషను పరీక్ష
గవర్నమెంటుహైస్కూలులో చదువుకొనుచుండు మల్లాది సోమయాజులుగూడ ఆయేడు మెట్రిక్యులేషన్ చదువుచుండెను. ఈ సోమయాజులే నాటకశాలలో హాస్యముచెప్పు విదూషకుడుగ నుండుటచే నాకు స్నేహితుడు. ఈతడు నాకంటె రెండుమూ డేండ్లు పెద్ద. హనుమంతురావని పైనచెప్పబడిన గవర్నమెంటుపాఠశాలావిద్యార్థి నాయీడువాడే.
ఈ ప్రాంతముల మెట్రిక్యులేషన్‌పరీక్షనిచ్చువారు మచిలీపట్టణ కేంద్రమునకే పోవుచుండిరి. కాని సోమయాజులును మరికొందరు మిత్రులును గలసి మచిలీపట్టణముకంటె బాగుండుననియెంచి రాజమహేంద్రవరకేంద్రమునకు దరఖాస్తులు పెట్టుకొనిరి. నాచేతను నాకు సహపాఠిగానున్న కోడూరి చంద్రశేఖరముచేతను ఆ కేంద్రమునకే దరఖాస్తులు పెట్టించిరి. ఈ చంద్రశేఖరము అనునతడు పాతగుంటూరులో అతని పెదతల్లిగారి యింటిలో భోజనముచేయుచు మాయింటిలోనే నిదురించుచు నాతో మిక్కిలి స్నేహముగ మెలగుచుండెను. అతనికి చదువుటకు పుస్తకములు లేకపోయినను నాపుస్తకములనే తీసికొని చదువుకొనుచుండెను. ఇతడు కొలదికాలము గవర్నమెంటుపాఠశాలలో చదివి పిమ్మట మిషన్‌పాఠశాలలో చేరెను. గవర్నమెంటుపాఠశాలలో నున్నపుడు హనుమంతురావుతో పరిచయమేర్పడెను. నంబూరి తిరునారాయణస్వామి యను మరియొకవిద్యార్థి పాతగుంటూరులో బందుగులయింటిలో నుండి గవర్నమెంటుపాఠశాలలో మెట్రిక్యులేషన్ చదువుచుండెను. తరచు మాయింటికి వచ్చుచు నాతోడను చంద్రశేఖరము తోడను కలసి చదువుకొనుచుండెను. షికారుబోవుచు ముచ్చటలు చెప్పుకొనుచు మైత్రితో కాలము గడుపుచుండెడివారము. ఈవిద్యార్థియు రాజమహేంద్రవరమునకే దరఖాస్తు పెట్టుకొనెను.
ఇట్లు రాజమహేంద్రవరములో పరీక్షనిచ్చుటకు నిశ్చయించుకొన్న వారందరమును అష్టదిక్పాలకులవలె ఎనిమిదిమందియును కలిసి యొక్కసారిగనే రాజమహేంద్రవరము చేరి, అచ్చట ఇన్నీస్‌పేటపెద్దవీధిలో రెండుమూడు కొట్లను అద్దెకు తీసికొని నివసించుచు పూటకూలిబసలో భోజనముచేయుచుంటిమి. అప్పుడు మేము వెలుపలకుపోయినపుడెల్ల అందరము కలిసియేపోవుచుంటిమి. ధోవతులు కట్టుకొని తెల్లలాంగుకోట్లు తొడిగి, ఎఱ్ఱటోపీలను ధరించి, యేగుచుండుమమ్ము చూచువారలకు వినోదముగానుండి "మీ రేవూరి వా"రని ప్రశ్నించు చుండిరి. మాసంగతి ఆపట్టణమున పలువురు విచిత్రముగ చెప్పుకొనుట సంభవించెను. గుంటూరుజిల్లా కార్మూరి అగ్రహారములో సుప్రసిద్ధులగు వఠ్యంవారి కుటుంబముతో సన్నిహితబాంధవ్యము గలిగిన శ్రీ వావిలాల వాసుదేవశాస్త్ర బి. ఏ. గారు రాజమహేంద్రవర గవర్నమెంటుకళాశాలలో ఉపాధ్యాయులుగా నుండిరి. వారికి గుంటూరివారియెడల సహజముగ అభిమానము కలదు. మరియును మాకు విద్యాగురువులగు కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు మిక్కిలి సమీపబంధువగుటచేత మా గుంటూరువిద్యార్థులయెడ వారికి హెచ్చుగా ప్రేమభావము కలిగెను. మేము వసతిగా ఏర్పరచుకొనిన కొట్లును వారింటికి సమీపముననే యుండెను. కావున మా బసయొద్దకు వచ్చి మా క్షేమసమాచారములు విచారించుచుండిరి. పరీక్షలు పూర్తియైనపిదప మమ్ముల నందరిని వారియింటికి భోజనమునకు బిలిచి పిండివంటలతో విందుగావించిరి.
రాజమహేంద్రవరమున పరీక్షనిచ్చినవారిలో నొక్కరు తప్ప తక్కిన మేమందరము పరీక్షలో కృతార్ధులమైతిమి.
మేము రాజమహేంద్రవరములో శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు స్త్రీపునరుద్వాహములు చేయుటను గూర్చి విని వారియింటనే వారిదర్శనము చేసియుంటిమి. కాని అప్పటికి సంఘసంస్కరణముమొదలగు ఉద్యమములవిచారణ గాని వారు వ్రాయుచున్నగ్రంథములనుగూర్చిన విచారణగాని మా కెవ్వరికిని పట్టలేదు. ఈమెట్రిక్యులేషనుపరీక్ష నిమిత్తము రాజమహేంద్రవరమునకు పోవుటయేగాక అంతకు రెండుసంవత్సరములముందు కొండుభొట్లసుబ్రహ్మణ్యశాస్త్రిగారు నన్నును, నాసహాధ్యాయుడు చెన్నూరిప్రకాశమును, అప్పటికి మిషనుపాఠశాలలో క్రింది క్లాసులోచదువుచుండిన కొలచిన అప్పయ్యదీక్షితు లనువిద్యార్థిని గూడతనవెంటబెట్టుకొని రాజమహేంద్రవరము తీసికొనివెళ్ళిరి. మధ్యదారిలో ఏలూరులో వారిబందుగులయింట నొకటిరెండు రోజులుండినపిమ్మట రాజమహేంద్రవరము తీసికొనిపోయిరి. శాస్త్రులవారు తమకుటుంబముతోగూడ బయలుదేరిరి. అప్పుడు గుంటూరునుండి బెజవాడకు బోవుటకు రెండెద్దులబండియే సాధనము. ప్రయాణీకులు ఉండవల్లిరేవునొద్ద చక్రాలబోటుమీద నెక్కి కృష్ణ దాటి బెజవాడ చేరుచుండిరి. మేమును ఆప్రకారమే ప్రయాణముచేసి, పడవమీద కృష్ణకాలువపైన ఏలూరువరకు బోయి, అక్కడ మరియొకపడవ నెక్కి రాజమహేంద్రవరమునకు పయనమైతిమి. కాని ఒకరాత్రివేళ మేము ఎక్కిన పడవకళాసులు మమ్ము మరియొకపడవలోనికి మా సామానులతోగూడ మారవలసినదని బలాత్కరించుటచే తప్పనిసరియై ఆ బోట్ల ఖామందులదే మరియొక పడవలోనికి సామానులు మార్చుచుంటిమి. అప్పయ్యదీక్షితులు ఒకకాలు మేము యెక్కియుండిన పడవపడిచెక్కమీద బెట్టి ఆ రెండవపడవ పడిచెక్కమీద రెండవపాదమును బెట్టి నిలువబడి ఒకపడవలోనుండి సామానులు రెండవపడవలోనికి అందించుచుండెను. ఇట్లు అందించుచుండగా ఆనుకొనియున్న రెండుపడవలు కొంచెము దూరమైపోవుటచేత రెండుపడవలమధ్య సందు ఎక్కువవెడల్పై కాలుజారి అప్పయ్యదీక్షితులు కాలువలో రెండుపడవలసందున పడిపోయెను. చీకటిగ నుండెను. పడవక్రిందికి అతడు మునిగిపోయెనేమోయని గొప్పభయము తోచెను. దైవానుగ్రహము వలన ఎట్లో పడవకళాసులు నీళ్ళలోనుండి అతనిని లేవనెత్తిరి. ఇట్లు ప్రాణోపద్రవముతప్పినది. ఈ అప్పయ్యదీక్షితులు శ్రౌతస్మార్తకర్మలు నేర్చినపిమ్మట ఇంగ్లీషుచదువుటకు ప్రారంభించినాడు. ఫస్టుఫారములో ప్రవేశించునప్పటికి ఆయనవయస్సు పదునారేండ్లు. నేను ఈ మొదటితరగతిలో పదమూడవఏట ప్రవేశించితిని. కనుక ఆయన నాకంటె పెద్దవాడు, పొడవరి, దృడకాయుడు. క్లాసులో మిక్కిలి బుద్ధిశాలియని పేరుపొందెను. హెడ్‌మాష్టరు వెంకటసుబ్బారావుగా రతనిప్రజ్ఞకు మెచ్చుకొనుచుండెడివారు. కావున ఇట్టియుపద్రవము సంభవించినందుకు శాస్త్రిగారు మిక్కిలి భయాక్రాంతులైరి. కాని ఉపద్రవము తప్పినపిమ్మట ఇతడు గొప్పవాడుకానున్నాడని యోచించి సంతసించిరి. మరునా డుదయమున రాజమహేంద్రవరమురేవు చేరితిమి. శాస్త్రిగారు వారిబందుగులయింటిలో బసచేసిరి. మాకును అక్కడనే భోజనముపెట్టించిరి. వారు ఆ పట్టణములో ప్రముఖులను చూడబోయి మమ్ములనుగూడ తమతో తీసికొనిపోవుచుండిరి. శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారియింటికి పోయియుందుముగాని వారి నప్పుడు దర్శించినట్లు జ్ఞాపకములేదు. వావిలాల వాసుదేవశాస్త్రిగారప్పుడు గ్రామమున లేరు. సోమంచి భీమశంకరముగారనువారు శ్రీ వీరేశలింగముపంతులుగారికి కుడిభుజముగానుండి స్త్రీపునర్వివాహములు జరుపుటలో మిక్కిలి ధైర్యముతో చేయూత నొసంగుచుండిరి. స్త్రీలు పునర్వివాహముచేసుకొనుట తలిదండ్రులకుగాని బందుగులకుగాని తెలియకుండగనే నడిచిపోవుచుండెను. కాన ఆస్త్రీలను వారియిండ్లనుండి బయలుదేరతీసి రాజమహేంద్రవరములో శ్రీ పంతులవారియొద్దకు భద్రముగ గొనివచ్చి వారికి నొప్పజెప్పుటలో అతినైపుణ్యముతో కృషి చేయుచుండిరి. ఆ భీమశంకరముగారిని చూచినట్లు జ్ఞాపకము కలదు. ఈ ఉద్యమమును దూషించువారు ఇట్లు స్త్రీలను రహస్యముగ తీసికొనివచ్చుట గొప్పతప్పుగా భావించుచుండిరి. మరియు మేము అచ్చటికి వెళ్ళినది. డిశంబరుశలవురోజులగుటచేత కళాశాలయు, పాఠశాలలును మూసివేయబడియుండెను. రాజమహేంద్రవరముదగ్గర గోదావరి రమారమి ఆరుమైళ్ళ వెడల్పుగలిగి విశాలముగనుండుటచేత అది అఖండగోదావరియని పిలువబడుచున్నది. గోదావరిగట్టుపై నిలిచి చూచినయెడల ఆదృశ్యము నేత్రానందముగావించుచుండెను. ధవళేశ్వరముదగ్గర ఆనకట్ట అప్పుడు చూచినట్లు జ్ఞాపకములేదు. సారంగధరమెట్ట రాజమహేంద్రవరముదగ్గరనే యున్నట్లు తెలిసికొంటిమి. రాజమహేంద్రవరములో నున్నరోజులలోనే యొక్కనాటిరాత్రి శాస్త్రిగారిస్నేహితునియింట జంగము కోటయ్యగారు అను సంగీతవిద్వాంసుడు ఫిడేలువాయించి పలువుర నానందపరచెను. ఆయన బందరుకాపురస్థుడు. దక్షిణదేశముపోయి ఫిడేలు వాయించుటయు, పాడుటయు క్రొత్తగా నేర్చుకొని వచ్చి పాట కచ్చేరీలు చేయుచుండెను. అదియే ఆయనపాట మేము వినుటకు ప్రారంభము. అంతమాత్రముగ హృద్యమైనపాట అదివరకు మేము వినియుండలేదు. మరలివచ్చునపుడు తిరుగ ఏలూరులో దిగిపిమ్మట పడవమీద బెజవాడచేరితిమి. బెజవాడనుండిగుంటూరు వచ్చునపుడు మధ్య ఒకరాత్రి మంగళగిరిలో బసచేసి తెల్లవారుఝామున బయలుదేరి గుంటూరు చేరితిమి. నేను మిషన్ పాఠశాలలో చదువుచున్నకాలములోనే నా పెదతమ్ముడును తెలుగుచదువు ముగించి ఇంగ్లీషుచదువు ప్రారంభించెను. నా చిన్నతమ్ము డింకను తెలుగుబడిలోనే చదువుచుండెను.
కుగ్లరు దొరసాని - క్రైస్తవ మతాభిమానము
మెట్రిక్యులేషన్‌పరీక్షనిమిత్తము రాజమహేంద్రవరము వెళ్ళినవారము గుంటూరుచేరినపిదప పరీక్షాఫలితములు తెలియవచ్చులోపల నాజీతమం దొక చిన్న చిత్రకథ నడచినది. నా చెలికాడగు కోడూరుచంద్రశేఖరము జ్వరపడి యేదియో యొక వాతప్రకోపమున నొకరాత్రివేళ మాటపడిపోవుటచేత వారి బందుగులు మిక్కిలి భయముచెంది మాయింటికి వచ్చి నన్ను నిద్రలేపి డాక్టరు కుగ్లరుదొరసాని నెట్లయిన తీసికొనిరావలసినదని మిక్కిలి ఆతురతతో చెప్పసాగిరి. డాక్టరు కుగ్లరుదొరసాని కొలది మాసములక్రిందట అమెరికానుంచి మిషనరీగా వచ్చి ఈ యూరిలో ఇండ్లకుబోయి ఉచితముగ రోగులకు చికిత్సచేయుచుండెను. సమర్ధురాలని అప్పటికే పేరుపొందెను. కాబట్టి ఎట్లయిన ఆమెను తీసికొనివచ్చి ఆమెచేత చికిత్సచేయించిన యెడల చిన్నవాడు దక్కునను ఆశతో నన్ను కోరిరి. నాకు ఆమెతో నెంతమాత్రమును పరిచయములేదు.