దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కుగ్లరు దొరసాని - క్రైస్తవ మతాభిమానము

వికీసోర్స్ నుండి

దిగిపిమ్మట పడవమీద బెజవాడచేరితిమి. బెజవాడనుండిగుంటూరు వచ్చునపుడు మధ్య ఒకరాత్రి మంగళగిరిలో బసచేసి తెల్లవారుఝామున బయలుదేరి గుంటూరు చేరితిమి. నేను మిషన్ పాఠశాలలో చదువుచున్నకాలములోనే నా పెదతమ్ముడును తెలుగుచదువు ముగించి ఇంగ్లీషుచదువు ప్రారంభించెను. నా చిన్నతమ్ము డింకను తెలుగుబడిలోనే చదువుచుండెను.


కుగ్లరు దొరసాని - క్రైస్తవ మతాభిమానము

మెట్రిక్యులేషన్‌పరీక్షనిమిత్తము రాజమహేంద్రవరము వెళ్ళినవారము గుంటూరుచేరినపిదప పరీక్షాఫలితములు తెలియవచ్చులోపల నాజీతమం దొక చిన్న చిత్రకథ నడచినది. నా చెలికాడగు కోడూరుచంద్రశేఖరము జ్వరపడి యేదియో యొక వాతప్రకోపమున నొకరాత్రివేళ మాటపడిపోవుటచేత వారి బందుగులు మిక్కిలి భయముచెంది మాయింటికి వచ్చి నన్ను నిద్రలేపి డాక్టరు కుగ్లరుదొరసాని నెట్లయిన తీసికొనిరావలసినదని మిక్కిలి ఆతురతతో చెప్పసాగిరి. డాక్టరు కుగ్లరుదొరసాని కొలది మాసములక్రిందట అమెరికానుంచి మిషనరీగా వచ్చి ఈ యూరిలో ఇండ్లకుబోయి ఉచితముగ రోగులకు చికిత్సచేయుచుండెను. సమర్ధురాలని అప్పటికే పేరుపొందెను. కాబట్టి ఎట్లయిన ఆమెను తీసికొనివచ్చి ఆమెచేత చికిత్సచేయించిన యెడల చిన్నవాడు దక్కునను ఆశతో నన్ను కోరిరి. నాకు ఆమెతో నెంతమాత్రమును పరిచయములేదు. కాని ధైర్యముచేసి అర్ధరాత్రివేళయైనను నొక్కడనే యూలుదొరగారి బంగళాయొద్దకు బోయి, మేడమీద పడుకొనియున్నవారిని గట్టిగా కేకలువేసి లేపి, చంద్రశేఖరము ప్రాణాప శిష్టుడుగానున్నసంగతి చెప్పి కుగ్లరుదొరసానిగారిని తీసికొనిరమ్మని అతని బంధువులు తెలిపి రని పలికితిని. అంతట యూలుదొర, దొరసానిగారిని నాతోకూడ అప్పుడు ఊరివెలుపల నొక మిషన్‌బంగాలాళో నివసించుచున్న కుగ్లరుదొరసానియొద్దకు బంపెను. ఊలుదొరసాని కుగ్లరుగారిని లేపి విషయములు తెలియజెప్పగా వెంటనే నేను తెచ్చిన యొంటెద్దుబండిమీద పాతగుంటూరువచ్చి, రోగిని చూచునప్పటికి అతనికి బొత్తిగా మాటపడిపోయి, మనుష్యులను గుర్తించుట దుస్సాధ్యముగ నుండెను. అప్పు డామె ఇన్‌జెక్షన్ ఇచ్చినపిమ్మట కొలదినిముషములకు తెలివివచ్చి రోగి మెల్లగ మాటలాడ నారంభించెను. అందరికిని ధైర్యముకలిగెను. ఆమె ఇంటికి వెళ్లెదనని పోబోవుచుండగా ఆతని బంధువులందరును తగిన ఔషధ మిచ్చి జాడ్యము నయము చేయవలసినదని ఆమెను కోరిరి. ఆమె "నేను చెప్పినప్రకారము పథ్యపానములు జరిపి క్రమముగ ఔషధసేవచేయుట ఇచ్చట నెవ్వరికిని అభ్యాసములేదు. చెప్పినప్రకారము నడిపించనిచోట ఔషధమిచ్చుట ప్రయోజనములేదు" అని చెప్పివేసెను. ఆమెకు అప్పటి కింకను తెలుగుభాష రాదు. నేనే ఆమె చెప్పినమాటలను తెలుగులో రోగిదగ్గరనున్న బంధువులకు తెలియజెప్పితిని. అంతట వారు ఆమె చెప్పినప్రకారమే క్రమముగా ఔషధసేవయు, పథ్యపానములును నడిపెదమనియు, ఆమెయే ఔషధమీయవలెననియు ప్రార్థింపసాగిరి. ఆమె తుదకు నన్ను బిలిచి నీవు క్రమ ప్రకారము నడిపించుటకు పూచీపడినయెడల నేను మందిచ్చెదనని నుడివినందున నే నందుకు సమ్మతించితిని. ఆమె ఔషధమిచ్చుట ఆనాడే ప్రారంభించెను. నిత్యమును రోగిస్థితిని తెలిపి, ఆమెవద్ద నుండి ఔషధము తెచ్చి, రోగి కిచ్చి, అది క్రమముగా నాతడు సేవించునట్లుచూచుచు ఆమె చెప్పినప్రకారము పథ్యపానములు అతనిబంధువులు జరుపునట్లు జాగ్రత్తతో పరికించుట నావిధిగా భావించితిని. ఇట్లొక్కనెల దినములపైకాలము ప్రాత:కాలము, సాయంసమయములందును తప్పక డాక్టరు కుగ్లరుగారి బంగళాకు పోయివచ్చుచు, ఆబంగళాలో ఆమెతో కలిసి నివాసముచేయుచున్న మరికొందరు మిషనరీలు వారి బాలబాలికలతో దినదినము సాయంకాలమున అందరునుగూడి దైవప్రార్థనలు జరుపుట చూచుచు, వారి సంభాషణలు వినుచు, కొంతవరకు క్రైస్తవ మతప్రభావమును పరికించగలితిని. అందు ముఖ్యముగ డాక్టరు కుగ్లరుదొరసానిగారి దైవభక్తియు, ఉదారస్వభావమును, త్యాగశీలమును నాహృదయమున క్రైస్తవమతముపై నభిమానము కల్పింపసాగెను. సాయంకాలము జరుపుచుండిన ప్రార్థనలలో వారితోకలిసి ప్రార్థనచేయుచుంటిని. ఇట్లు కొంతకాలము ఔషధసేవ చేయగా నామిత్రుడు చంద్రశేఖరము ఆరోగ్యవంతుడయ్యెను. ఇందువలన నా మనస్సున కెంతయు ఆనందముగలిగెను. డాక్టరుగారితో చెప్పినప్రకారము ఔషధసేవ మొదలగునవి జరిపించగలిగితినిగదా యని సంతుష్టినొందితిని. డాక్టరు కుగ్లరుగారును నాయెడ సదభిప్రాయము ప్రకటించుచుండిరి. నామిత్రునికొరకు ఔషధమునిమిత్తము ఆమైంటికి వచ్చుచు బోవుచున్న రోజులలో నొకదినము సాయంకాలము ప్రొద్దు గ్రుంకినపిమ్మట క్రొత్తగుంటూరులో నొక బాలింతకు నేదియో జాడ్యము ఉపద్రవముగ నున్నదని ఆమెబంధువులు డాక్టరుగారితో చెప్పుకొని, ఆమెను రోగియొద్దకు తీసుకొనివెళ్ళవలెనని వచ్చి, ఆమెతో మొరపెట్టుకొనుచుండిరి. నేను అప్పుడు అచ్చటనే యుండుటచేత వారిమాటలను ఇంగ్లీషులో డాక్టరుగారికి స్పష్టముగ తెలిపినవెంటనే ఆమె మిక్కిలి ఆతురతతో బయలుదేరి వారు తెచ్చిన బండిపై వెడలిపోయెను. ఆమెకు బాధనొందు దీనులపైగల దయార్ద్రహృదయమును గమనించి నేనును కొంతసేపటికి ఆ బాలింతయున్న ఇంటికి చేరితిని. బాలింత యున్నది చిన్న పెంకుటిల్లు, అది వీధి నానుకొనియున్నది. బాలింతయున్నగదియు ఆ వీధివైపుననే యున్నది. ఆ గదికి కిటికీలు లేవు. ఒక్కటే ద్వారము. ఆ గదిలో నొకకుంపటిలో కుమ్ము పెట్టినందున ఆకుమ్ము కాలినవాసన చుట్టును ఆవరించినది. పొగ గదియంతటను నిండినది. గాలి దూరనిచోటగుటచేత ఆగదిలోనికి బోవుటయే మిక్కిలి కష్టముగనుండెను. అయినను దేనిని లక్ష్యముచేయక డాక్టరుగారు గదిలో ప్రవేశించి, బాలింతను పరీక్షించినపిమ్మట గదిలోపలనుండి వెలుపలకు వచ్చుటతోడనే నేను రోగిస్థితి యెట్లున్నదని అడిగితిని. చాల ఉపద్రవస్థితిలో నున్నదనియును తా నచ్చటనే రోగియొద్ద కనిపెట్టుకొని యుండెదననియు చెప్పి, ఆమె ఇంటికి బోయి బట్లరుతో పాలుగాని మరియేదియైన ఆహారముగాని తీసుకొని తన కిమ్మని చెప్పవలసినదని నన్ను కోరెను. అప్పటికి రాత్రి ప్రొద్దు కొంత గడచినది. క్రొత్తగుంటూరు చిన్న బజారులో నున్న ఆరోగి యింటివద్దనుండి ఊరివెలుపల దూరమున ఆమె బంగళాకు అనగా కొరిటిపాడురోడ్డుప్రక్క ఇంగ్లీషుచర్చికి దక్షిణముననున్న రోడ్డుమీద కొంతదూరము పడమటకు బోయినపిమ్మట అప్పుడు 'రావుదొర' అను మిషనరీపేరున పిలువబడు బంగళాకు అనగా ఇప్పుడు స్టాన్లీబాలికాపాఠశాల యున్నచోటికి పోవలసివచ్చెను. చీకటిలో నొంటరిగ మనుష్యసంచారములేని ఆరోడ్డుమీదపోవుట చిన్నవాడనగు నాకు భయముగ తోచవలసినదేగాని నా కేమియు అట్టిభయము తోచలేదు. మహోపకారబుద్ధితో, మురికికూపముగ నున్న గదిలోనికి బోయి అసహ్యించుకొనక శాంతముతో రోగిని పరీక్షించి ప్రాణోపద్రవస్థితిని బరికించి కూర్చుండుటకు కుర్చియైనను లేక రోగి ప్రక్కనే నేలను గూర్చుండి, మానవసేవ చేయు ఆ మహనీయురాలికి అంత మాత్రముగనైన నే నుపకరించగలిగితి నను సంతోషోత్సాహములతో బంగళాకు బోయి బట్లరుతో ఆమె చెప్పినమాట చెప్పి నేను పాతగుంటూరులో మాయింటికి చేరి భోజనముచేసి నిదురించితిని. తెల్లవారవచ్చుచుండగనే మెలకువ వచ్చుటచేత ఆబాలింత ఎట్లుండెనో, డాక్టరుగారు రాత్రి యెట్లుగడపిరో తెలుసుకొనవలెనని వెంటనే బయలుదేరి రోగియున్న యింటికి బోవునప్పటికి యింటివారు పెద్దగ నేడ్చుచుండిరి. బాలింత అంతకుముందే చనిపోయెననియు, డాక్టరుగారు రాత్రియంతయు ఔషధము లిచ్చుచు రోగి ప్రాణము పోవువరకు నుండి అప్పుడే వెడలిపోయెననియు విచారింపగా తెలిసినది. చనిపోయిన బాలింత పదునారు సంవత్సరముల బాలిక. డాక్టరుగా రెంత శ్రమచేసినను మృత్యువాతబడెనని చింతించితిని. ఉచితార్థముగ కేవల పరోపకారబుద్ధితో ఎంతటి శరీరకష్టమునకైన యోర్చి, దృఢ వ్రతయై మానవసేవజేయుట కామె క్రైస్తవమతస్థురాలగుటయే కారణముగ దలంచితిని. ఇందువలన నాహృదయమునందు క్రైస్తవమతాభిమానము గాఢమగుచుండెను. ఇదిగాక మాకు మిషన్‌పాఠశాలలో నుపాధ్యాయులుగా నుండిన ప్రభల రామచంద్రయ్య బి. ఏ. గారు దక్షిణాదినుంచి వచ్చిన బ్రాహ్మణుడు, కొలది సంవత్సరములకు మునుపే భార్యసమేతముగ క్రైస్తవ మతములో కలసెను. గుంటూరులో తహశీలుదారుగా నుండిన చేవెండ్ర వెంకటచలముపంతులుగారును క్రైస్తవమతమును స్వీకరించిరి. కనుక నేనుమాత్రము క్రైస్తవుడ నేల కాగూడ దను ప్రశ్న నన్ను బాధించగా చివరకు క్రైస్తవమతములో చేరవలెనని నిశ్చయించుకొని శ్రీరామచంద్రయ్యగారియొద్దకు పోయి, నాకోరికను తెలిపితిని. కాని నన్ను ప్రోతహింపక "బాగుగ ఆలోచించుకొని చేరవలెను. ఇంతలో తొందరపడనేల" అని వాక్రుచ్చిరి. మరియొక క్రైస్తవపెద్దమనుష్యునియొద్దకు గూడ పోయి వారితో ముచ్చటించితిని. ఆయనయైనను ప్రోత్సాహము చేయలేదు. నాకుమాత్రము ఉత్సాహము తగ్గలేదు. గాన క్రైస్తవ మతములో కలియవలెనని దృడనిశ్చయముచేసుకొని యూలుదొరగారియింటికి పోతిని. యూలుదొరసాని వారిబంగళావెలుపల వరండాలో ఆసీనయైయుండెను. ఆమెతో నాకోర్కె తెలుపుటతోడనే మిక్కిలి సంతోషముతో లేచి నా జంధ్యము తీసివేయమని నాతో చెప్పుచు లోపల గదిలో ఎదియో వ్రాసుకొనుచున్న యూలుదొరగారియొద్దకు పరుగెత్తుకొనిపోయి నేను క్రైస్తవమతమును స్వీకరించుటకు వచ్చితినని పరమోత్సాహముతో చెప్పెను. ఆయన వెలుపలకు వచ్చి, నన్ను ప్రశ్నిం చగా నేను క్రైస్తవుడనుకావలెనని దృఢసంకల్పముతో వచ్చినానని చెప్పితిని. క్రైస్తవమతమునందు గాఢమగువిశ్వాసముకలదా యని ప్రశ్నించి, కలదు కలదని నేను గట్టిగ చెప్పినపిదప తాను మోకరించి, నాహృదయమున నిట్టిమార్పు కలిగించినందుకు దేవుని కృతజ్ఞతతో స్మరించుచు తమ మతమునందు నాకు విశ్వాసము మరింత కలుగజేయుమని ప్రార్థించెను. నేనును ఆయనతో కలసి ప్రార్థించితిని. యూలుదొరసానిగూడ ప్రార్థనలో పాల్గొనెను. కాని మధ్యమధ్య ఆమె నాజంధ్యము వెంటనే తీసివేయమని మిక్కిలి ఆతురతతో చెప్పుచుండెను, గాని యూలుదొరగారు ఆమెను తొందరించవలదని వారించి, క్రైస్తవమతమునందు నీ వింకను గాఢమగువిశ్వాసము కలుగనట్లు ప్రార్థించుము అని నాకు చెప్పై నన్నింటికి బోయి మరునాడు రమ్మని పంపివేసెను. ఇంతలో నెట్లో నేను క్రైస్తవమతములో కలియబోవుచున్నాననువార్త యూరంతట వ్యాపించెను. మాతండ్రి మిక్కిలి దు:ఖాక్రాంతుడై నే నెక్కడికి బోయినదియును తెలియక నానిమిత్తము ఊరిలో వెదకుచుండెను. నే నింటికి చేరునప్పటికి ఆయనయు చేరెను. నన్ను కూర్చుండబెట్టి నాతండ్రియు, నాతమ్ములును నాచుట్టును కూర్చుండి చింతాక్రాంతులై పరితపింపసాగిరి. "నాయనా! ఎప్పుడును నిన్ను నాప్రాణమునకు ప్రాణముగ జూచుకొనుచుంటిని. మీతల్లి పోయినదిమొదలు నీకొరకు నే నెన్నికష్టములు పడుచుంటినో నీ వెరుగవా? నీ కేమి కొరతగావించితిని? నీకొరకు నాప్రాణములనైన ఇచ్చుటకు సిద్ధముగనున్న నన్ను విడిచిపోయెదవా? ఈ చిన్నతమ్ములను విడనాడెదవా? ఎందుకు దేవుడు నీ కిట్టిబుద్ధి పుట్టించె"నని మిక్కిలి దు:ఖింపసాగెను. నాతమ్ము లిరువురును ఏడువసాగిరి. నాకును ఇదంతయు భరించరాని దు:ఖముకల్పించెను. ఇంతలో నావిద్యాగురువులు మిక్కిలి గౌరవపాత్రులు అయిన కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారును మరికొందరు ఉపాధ్యాయులును మాయింటికి దయచేసి నన్ను ఏల ఈపనికి బూనితివని హెచ్చరించుచు నీకు క్రైస్తవమతము మిక్కిలి మంచిదని విశ్వాసము కలిగిన కలుగవచ్చును. మన హైందవమత మెట్టిదో విచారించితివా? ఏమియైన గ్రంథములను చదివితివా? పెద్దలతో ముచ్చటించితివా? మన పెద్దలంద రాచరించిన మత మెట్టిదో తెలుసుకొనకుండ పరమతమును స్వీకరించుట వెఱ్ఱితనముగాదా? నీ వింకను చిన్నవాడవు. ముందింకను మనశాస్త్రములను చదివి మనమతమునందలి గుణాగుణములు తెలుసుకొని పిమ్మట పరమతముసంగతి విచారించవచ్చునుగాని మనమతముసంగతి ఏమియు తెలియక అన్యమతములో కలియుట బొత్తుగా సరిగాదని వారు నాకు హితోపదేశముగావించిరి. ఈహితోపదేశమును దానికంటె నాతండ్రిగారియొక్కయు నాతమ్ములయొక్కయు దు:ఖతాపములు నామనస్సును త్రిప్పివేసెను. అప్పటికి క్రైస్తవమతములో ప్రవేశించుట మాని మనమతవిషయము ఆలోచించు కొనెదగాక యని మనస్సును శాంతింపచేసుకొంటిని.

మరునాడు అనుకొనినట్లు యూలుదొరగారియింటికి వెళ్లుటకు ముఖము చెల్లకుండెను. అంతగాఢముగ క్రైస్తవమతమునందు విశ్వాసముకలదని చెప్పిన నేను ఈనాడు ఆయనతో నేమని చెప్పగలనని తర్కించుకొనుచు వారియొద్దకు పోవుటమానితిని. కాని మూడవనాడు వారియొద్దకు బోయి, నామనస్సున కలిగినమార్పు స్పష్టముగ చెప్పివేయుటయే యుక్తమని వారియింటికి వెళ్లితిని. నిన్న నేల రాలేదని వారు నన్నుప్రశ్నించిరి. జరిగినవిషయములను మనవిచేసితిని. అదంతయు శాంతముగా విని "మంచిది నీవు క్రైస్తవుడవు గాకపోయినను మంచిహిందువుగా నుండు" "Be a good Hindu" మని నాకు ప్రేమతో హితోపదేశము గావించిరి. అప్పుడు నిజమైన ఆయనగొప్పతనము నాకు మరింత విస్పష్టమయ్యెను. ఆ శాంతమును, ఆఉదారభావమును ఆయనపై నాప్రేమగౌరవముల వేయిరెట్లు హెచ్చుగావించెను. మానవులలో నిట్టిమహాపురుషులు అరుదనియు ఆదర్శప్రాయులనియు యెప్పుడును తలంచుచుంటిని.


ఎఫ్. ఏ. చదువు

అంతట కొలది దినములకే పరీక్షాఫలితములు తెలియవచ్చెను. నేనును నామిత్రులు పలువురును కృతార్థులమైతిమని ఊరంతట చెప్పుకొనుచుండిరి. ఆనాడు మెట్రిక్యులేషనుపరీక్షలో ఉత్తీర్ణులగుట మిక్కిలి అపరూపముగ తలంచుచుండిరి. సుమారు ఇరువదివేలజనులతోగూడిన గుంటూరుప్రజలలో మాయశస్సుప్రాకిపోయెను. హనుమంతురావు ఒక్కడుమాత్రము ఫస్టుక్లాసులో ఉత్తీర్ణుడయ్యెను. పరీక్షాఫలితములు తెలిసినపిమ్మట యఫ్. ఏ., పరీక్షకుగూడ చదువవలెననియే నాకు ఉత్సాహముండెను. మా తండ్రిగారు భారమువహించుట కష్టమని కొంత సంశయించెను. కాని తుదకు సమ్మతించెను. గుంటూరులో కాలేజి లేదుకాబట్టి