దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఎఫ్. ఏ. చదువు
మూడవనాడు వారియొద్దకు బోయి, నామనస్సున కలిగినమార్పు స్పష్టముగ చెప్పివేయుటయే యుక్తమని వారియింటికి వెళ్లితిని. నిన్న నేల రాలేదని వారు నన్నుప్రశ్నించిరి. జరిగినవిషయములను మనవిచేసితిని. అదంతయు శాంతముగా విని "మంచిది నీవు క్రైస్తవుడవు గాకపోయినను మంచిహిందువుగా నుండు" "Be a good Hindu" మని నాకు ప్రేమతో హితోపదేశము గావించిరి. అప్పుడు నిజమైన ఆయనగొప్పతనము నాకు మరింత విస్పష్టమయ్యెను. ఆ శాంతమును, ఆఉదారభావమును ఆయనపై నాప్రేమగౌరవముల వేయిరెట్లు హెచ్చుగావించెను. మానవులలో నిట్టిమహాపురుషులు అరుదనియు ఆదర్శప్రాయులనియు యెప్పుడును తలంచుచుంటిని.
ఎఫ్. ఏ. చదువు
అంతట కొలది దినములకే పరీక్షాఫలితములు తెలియవచ్చెను. నేనును నామిత్రులు పలువురును కృతార్థులమైతిమని ఊరంతట చెప్పుకొనుచుండిరి. ఆనాడు మెట్రిక్యులేషనుపరీక్షలో ఉత్తీర్ణులగుట మిక్కిలి అపరూపముగ తలంచుచుండిరి. సుమారు ఇరువదివేలజనులతోగూడిన గుంటూరుప్రజలలో మాయశస్సుప్రాకిపోయెను. హనుమంతురావు ఒక్కడుమాత్రము ఫస్టుక్లాసులో ఉత్తీర్ణుడయ్యెను. పరీక్షాఫలితములు తెలిసినపిమ్మట యఫ్. ఏ., పరీక్షకుగూడ చదువవలెననియే నాకు ఉత్సాహముండెను. మా తండ్రిగారు భారమువహించుట కష్టమని కొంత సంశయించెను. కాని తుదకు సమ్మతించెను. గుంటూరులో కాలేజి లేదుకాబట్టి బందరో, రాజమహేంద్రవరమో, చెన్నపట్టణమో పోవలసి యుండెను. చెన్నపట్టణములో క్రైస్తవకళాశాల ప్రసిద్ధమైనదిగా చెప్పబడుచుండెను. ఆకళాశాలలో చేరి చదువవలెనని కుతూహలము హెచ్చుగానుండెను. కాని, చెన్నపట్టణము చాలదూరమగుటచేతను, ఆకాలమున రైళ్లు లేవు గనుకను అచ్చటికి బోవుట చాలప్రయాసగా నుండెను. పెద్దపట్న వాసమగుటచే ఖర్చులును హెచ్చుగానుండునను కారణముచేత మాతండ్రిగారికి చెన్నపురికి పంపుట కిష్టములేకుండెను. యూలుదొరగారు చెన్నపట్టణములో క్రైస్తవకళాశాలకు బోయి చదువవలెననియు, అట్లయిన నెలకు పదిరూపాయలు ఉపకారవేతనము ఆకళాశాలవా రిచ్చునట్లు సిఫారసుచేసెదననియు గట్టిగా చెప్పుచుండెను. నాకు అంతవరకు మిషన్‌స్కూలులో జీతముఇచ్చుట అవసరములేకుండ ఉపకారవేతనము బహుమానముగా నియ్యబడుచుండెను. పుస్తకములకు దప్ప మరి ఏమియు నావిద్యకై ఖర్చులుపెట్టవలసిన ఆవశ్యకము లేకుండెను. చెన్నపట్టణము కాలేజిలోగూడ ఉపకారవేతనము లభించుట మేలుగనేయుండునుగాని నాకు క్రైస్తవమతాభిమానము వలన లోగడ నడచినకథ గమనించి మాతండ్రిగారు క్రైస్తవ కళాశాలకు నన్ను బంపుటకు బొత్తుగా సమ్మతించకుండిరి. చివరకు రాజమహేంద్రవరము బోవుటకే నిశ్చయించుకొంటిని. హనుమంతరావు అక్కడికే సిద్ధమయ్యెను. కాబట్టి ఉభయులము కలసి రాజమహేంద్రవరము బోయి అక్కడ గవర్నమెంటు కళాశాలలో యఫ్. ఏ., తరగతిలో ప్రవేశించితిమి. మెట్‌కాఫ్. యమ్. ఏ., అను ఆంగ్లేయవిద్యాపండితుడు ఆకళాశాలకు ప్రిన్సిపాల్‌గానుండి ప్రసిద్ధిగాంచెను. ఆయన రూపమున నొడ్డుపొడవు గలిగి యించుక లావుగా నుండుటచేత పొట్టిగానున్న ట్లగపడుచుండెను. షేక్‌స్పియర్ నాటకమును, గ్రీకు, రోమనుచరిత్రలును మాకు జెప్పుచుండెను. ఈయన చాల సత్స్వభావముకలిగి విద్యార్థులయెడ దయతో మెలంగుచు శ్రద్ధతో పాఠముల బోధించుచుండెను. కళాశాలను కట్టుదిట్టములతో నడిపించుచు విద్యార్థులను అదుపాజ్ఞలలో నుంచి వారి శ్రేయస్సును గోరుచుండెను. సాయంకాలము ఆటలలో బాలురతోగూడ పాల్గొనుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు బాలురను ఆయాటలలో తన వీపుపై నెక్కించుకొనుచుండెను. ఇందువలన విద్యార్థులు వారియెడ ప్రీతితో, భక్తితో మెలగుచుండిరి. పాఠములు బోధించు సమయమున సందర్భముల ననుసరించి అప్పుడప్పుడు చిన్నకధలను చెప్పి విద్యార్థులకు సంతసమును ఉత్సాహమును కల్పించుచుండెను. వీరినిగూర్చి ఒకకధ చెప్పుకొనుచుండిరి.
వీరు రాజమహేంద్రవరములో పడమర యూరివెలుపల ఇంచుకదూరమున నొక చిన్నతిప్పపై నున్నబంగాళాలో కాపురముండిరి. ఒక సెలవుదినమున ఆబంగాళా ప్రహరీగోడ పోయినచోట నొంటరిగనే తనచేతులతో మట్టిగలిపి రాళ్లువేసి పూడ్చుచుండెనట. ఆసమయమున ఆయనయొద్ద చదువుకొనిన ప్రాత విద్యార్థి, తహశీలుదారియుద్యోగమును పొందినపిదప ఆయన దర్శనమునకై పోయెనట. అప్పుడు మెట్‌కాఫ్‌గారు తాను చేయుచున్న మట్టిపని చేయుచునే ఆవిద్యార్థితో సంభాషణజరుపుచు ఇంచుక దూరముననున్న ఒకరాతిని అందియ్యమని ఆవిద్యార్థిని కోరెను. అంతట ఆ తహశీలుదారు తనతోవచ్చినజవానును ఆరాయి దొరగారికి అందించుమని చెప్పెను. ఇంతలో మెట్‌కాఫ్ గారు"రాయితెమ్మని నిన్నుకోరినానుగాని నీబంట్రౌతును కోరలేదు. నీకు అది చేయుట అగౌరవముగ తోచినదా" యని చెప్పుచు తాను స్వయముగనే ఆరాతిని తెచ్చుకొనెనట. అంతట తహశీలుదారు సిగ్గుపడి క్షమాపణగోరెను.
కాలుచేతులతో పనిచేయుట తప్పుగాదని యిట్లు ఆయన బోధించెను. కాయకష్టముచేయువారు తక్కువవారనియు విద్యలు సంపాదించి యుద్యోగముచేయువా రెక్కువవారనియు నేటికిని మనదేశమున తలంచుచుండుట శోచనీయము.
ఆకాలములో వస్తువులు అగ్గువగను డబ్బు అరుదుగ నుండుటచేత పూటకూలిబసలలో భోజనము పూటకు మూడణాలకంటెను తక్కువగ నుండెను. రాజమహేంద్రవరములో నేనును హనుమంతురావును కళాశాలకు సమీపముననే నొకపూట కూలిఅమ్మవారియింట నెలకు రు 7 ల చొప్పున మూడుపూటల భోజనమున్ను వారవారమును తలంటకును ఏర్పాటుచేసుకొని మరియొకయింటిలో అద్దెకు గదితీసుకొని చదువుకొనుచుంటిమి. కళాశాలలోని ఉపాధ్యాయులలో సుందరరావుగారు ఆంగ్లమును, నాగోజీరావుగారు గణితమును బోధించుచుండిరి. వీ రిరువురును ఎఫ్. ఏ. సీనియర్, బి. ఏ., తరగతుల కే చదువుచెప్పుచుండెడీవారు. కాన మాకు వారితో బరిచయములేకుండెను. శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు ఆంధ్రపండితులుగా నుండిరి. కాని వారైనను మాతరగతి కేపారమును చెప్పుటలేదు గాన మాకు పరిచయము లేకపోయెను. ఇళ్లువదలి ఇతరగ్రామములో నివసించుట మాకు క్రొత్తయగుటచేతను చదువునందు శ్రద్ధ తక్కువగుటచేతను ముచ్చటగ తిరుగుచు కాలము గడపుటకు అభ్యాసపడితిమి. ముఖ్యముగా చెన్నపట్టణములో చదువవలెనను అభిలాష మొదటినుండి హెచ్చుగానుండుటచేత రాజమహేంద్రవరములో చదువుపై లక్ష్యములేకపోవుటవలన పాఠములు పట్టుపడలేదు. కాని ఏమో పెద్దక్లాసులో చదువుచున్నామని గర్వము మమ్ముల ఆవహించెనని చెప్పవచ్చును.
చెన్నపట్టణము - సంగీతసాహితులు
సంవత్సరాంతమున గుంటూరు నాటకసమాజమువారు రాజమహేంద్రవరములో నాటకప్రదర్శనము చేయుటకు వచ్చిరి గాన అందులో నాటకపాత్ర నేను వహింపవలసివచ్చెను. హరిశ్చంద్రనాటకమునకు పౌరులు మమ్ము హెచ్చుగా పొగడిరనితెలిపి యుంటిని. వారిలో అచ్చటి న్యాయవాదులలో ప్రముఖులుగా నుండిన మాకర్ల సుబ్బారావునాయుడుగారు నాయందెక్కువ అభిమానము వహించియుండిరి. ఈలోపల హనుమంతురావు, నేనును చెన్నపట్టణమున క్రైస్తవకళాశాలలో ప్రవేశించి చదువవలెనని నిశ్చయించుకొంటిమి. రాజమహేంద్రవరములో రెండవ సంవత్సరము చదువుటకై జీతముమొదలగువాని నిమిత్తము మా తండ్రుల నడిగి డబ్బు తెచ్చుకొని, శ్రీమాకర్ల సుబ్బారావు నాయుడుగారియొద్దకు బోయి, మేము చెన్నపట్టణ క్రైస్తవకళాశాలలో చదువనిశ్చయించుకొకొంటిమి గాన అచ్చట తగినవారికి