Jump to content

దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/మిషను పాఠశాల

వికీసోర్స్ నుండి

మిషను పాఠశాల

నేను చదువుకొనుచున్న మిషన్‌పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అమెరికాదేశమునుంచి వచ్చిన యొక పాదరి. ఆయన పేరు డాక్టర్‌యూలు. వీరుమిక్కిలి దైవభక్తిగలవారు. నీతివర్తన యందు ఈడులేనివారు. అసిధారావ్రతచర్య నడుపు మహార్య శ్రేణిలోచేరిన మహానుభావుడు. క్రీస్తుసిద్ధాంతములను తదేక నిష్ఠతో ఆచరింప ప్రయత్నించుచుండెడివాడు. ఇట్టి సత్పురుషునియొద్ద నేను విద్యాభ్యాసము బడయుఅవకాశము కల్పించినందుకు ఇప్పటికిని పరమేశ్వరుని కృతజ్ఞతతో తలచుచుందును. నా జీవితములోని నైతికవిషయములందు తండ్రిగారును ఈ విద్యాగురువులగు యూలుదొరగారును నాకు మేలుబంతులు. వారు పెట్టిన ఒరవడిని నేను అనుదినము ననుసరించి ప్రవర్తింప ప్రయత్నించినాను. తక్కిన పాఠములవలెనే క్రైస్తవ మతగ్రంధమగు బైబిలుపాఠమును క్రమముగ పఠించెడివాడను. సామాన్యముగ తక్కిన విద్యార్థులకంటె శ్రద్ధతో చదువుచు, చురుకుగానుంట గమనించి, నాయందు ఉపాధ్యాయులు ప్రేమ పూరితులై యుండిరి. ప్రధమఫారములలో చదువు ప్రారంభించినప్పుడే శ్రీ నారప్పగా రను నొకౌపాధ్యాయులు నన్నెక్కువ ఆదరించుచుండిరి. వారింటికి బోయి రాత్రివేళ అక్కడనే చదువుకొనుచుండెడివాడను. వారింటిలో ఆడవారుసహితము నన్నాదరణతో చూచుచుండెడివారు. పైతరగతులలోనికి వచ్చిన కొలదియు నావిషయము శ్రీ ఊలుదొరగారు ఎక్కువగ పరికించుచుండిరి. నన్నొకక్రైస్తవవిద్యార్థి అకారణముగ కొట్టినందున నేను ఊలుదొరగారితో చెప్పుకొంటిని. ఆ కుర్రవానిని బిలిచి, చేయిచాపించి అరచేతిలో బెత్తముతో పదిదెబ్బలుకొట్టిరి.

మాచిరాజు సుబ్బారావను నా సహాధ్యాయి గజ్జితో తరగతిలో అందరితో కలసి కూర్చొనుచుండగా నేను ఊలుదొరగారితో చెప్పుటతోడనే ఆయన తరగతిలో చివరను ఇతరవిద్యార్థులతో కలియకుండ నిందుక దూరమున నాతని కూర్చుండచేసెను.

నే నొకప్పుడు జబ్బుపడి, దేహమున నీరుజూపి, బడికి పోవుట కొన్నిదినములు మానవలసివచ్చెను. అప్పు డొక దినమున ఊలుదొరసాని మాయింటికి వచ్చి, నాస్థితి చూచి, నన్ను గవర్నమెంటుఆస్పత్రికి తీసికొనివెళ్ళి, అక్కడి డాక్టరుతో చెప్పి, నాకు మందిప్పించెను. ఆ ఔషధముతో నాకు ఆరోగ్యము కలిగి తిరిగి బడికిపోవుట కవకాశముకలిగినందున ఊలుదొరగారును ఆయనభార్యగారును మిక్కిలి సంతసించిరి. దైవానుగ్రహమున వారికి నాపై నిట్టి అభిమానము గలిగెను.

నేను అయిదవతరగతిలో చదువుచుండగా రివరెండుపాలు అను నొకక్రైస్తవుడు హెడ్‌మాష్టరుగా నుండెను. అగ్రహారీకులగు మాచిరాజువారికుటుంబములో చేరిన కృష్ణమూర్తియు సుబ్బారావు అను ఇరువురుబాలురుగూడ విద్యార్థులుగా నుండిరి. వీరిలో మొదటివాడు మాకు పైతరగతిలోనూ, రెండవవాడు మాతరగతిలోనూ చదువుచుండిరి. వీరు చక్కని రూపములకు దోడుగా విలువగల దుస్తులుధరించి, తాము గొప్పవారమను గర్వముతో వర్తించుచుండిరి. తెలివితేటలుగూడ వీరి కుండెను. వీరియందు మా హెడ్‌మాష్టరుగారికి అభిమానము. వారిని మెచ్చుకొనుచుండెడివారు. ప్రతిఆదివారమును ఈసోదరు లిర్వురును హెడ్‌మాష్టరుగారింటికి పోయి, వారితో సరససల్లాపములు గావించుచు వినోదముగ కాలముగడుపుచుండిరి. బడిలోగూడ హెడ్‌మాష్టరుగారు తమవాడైనట్లు, సంభాషణలవలనను, నడవడివలనను బయలుపరచుచుండిరి. ఇట్లుండ క్లాసుపరీక్షలు సమీపించినవి. రాబర్టు అను నా సహాధ్యాయి యొకడు బడిలోనుండి వెలుపలకు నన్ను బిలిచి, రహస్యముగ నిట్లనెను. " మన హెడ్‌మాష్టరుగారు మాచిరాజు సుబ్బారావుకు, ఆయన అనుకొన్న పరీక్షాప్రశ్నలు ముందుగనే చెప్పినాడట. ఇది మిక్కిలి అన్యాయముగదా! ఈసంగతి నీవు ఊలుదొరగారికి తెలుపవలెను. వారు విచారణచేసినయెడల నిజము బయటపడును" అని నన్ను బలవంతపరచెను. నేను అందుకు సమ్మతించి, ఊలుదొరగారితో "పరీక్షాప్రశ్నలు ముందుగనే హెడ్‌మాష్టరుగారు తమకభిమానపాత్రులైన సుబ్బారావునకు, ఆయన అన్నగారికి చెప్పినారని అనుకొనుచున్నారు. వారిరువురును ప్రతిఆదివారము హెడ్‌మాష్టరుగారి యింటికిబోయివినోదములతో కాలముపుచ్చుచుండురు" అనినేను మనవిజేసితిని. అంతట ఆయన కొన్నిరోజులు విచారణజేసి హెడ్‌మాష్టరు రివరెండుపాలుగారిని ఉద్యోగమునుండి బర్తరపు చేసిరి. ఇంత కఠినమైనశిక్ష విధింతురని మే మెవ్వరము అనుకొన లేదు. మాకును ఈచర్య మిక్కిలి సంతాపము కల్గించెను. పాలుగారు బడివిడిచిపోవురోజున బడిలోనిబాలుర నందరిని సమావేశపరచి తా నేపాపము నెరుగననియు, ఎవ్వరో దుర్మార్గులు చేసినపితూరీనిబట్టి అక్రమముగా తన్ను ఉద్యోగమునుంచి తొలగించుట కలిగినదనియు, ఇట్టి ఘోరకృత్యమునకు పూనిన వారికి తనకువలెనే అపకారముజరిగినప్పుడుగాని, తాను పడుచుండు పరితాపము తెలియదనియు, పరమదయాళుడగు దేవుడు వారిని క్షమించుగాక యనియు, ప్రార్థించుచు కన్నుల నీరుగార్చి, దు:ఖించెను. ఆయన చేసిన భాషణ యంతయు నన్నుగూర్చి చేసినట్లును, నేనే ఆ గొప్పయపకారియైనట్లును మిక్కిలి పరితపించితిని. హెడ్‌మాష్టరుగారు పక్షపాతము వహించి ఆబాలురకు ప్రశ్నలు ముందుగనే చెప్పియేయుందు రనువిషయము నిజమే అనుకొన్నను ఇంతకాఠిన్యము దొరగారు వహింతురని ఎప్పుడును తలచియుండలేదుగాన పాలుగారు అప్పుడు చెప్పిన వాక్యములు మనస్సున సూదులుగ్రుచ్చినట్లు బాధించినవి. నే నిట్టిపితూరి ఊలుదొరగారితో నెందుకు చేసితినాయని పశ్చాత్తాపము నొందితిని గాని, ఏదియో గొప్పతప్పు లేకుండిన ఊలుదొరగారివంటి నీతివర్తనుడు ఇట్టి శిక్షవిధించియుండరని మరల హృదయమున సంతుష్టిచెందితిని.

రివరెండుపాలుగారిస్థానే రెంటాల వెంకటసుబ్బారావు బి. ఏ. బి. యల్. గారిని నియమించిరి. వీరు చాల సమర్థులనియు నెలకు రు 150లో, రు 200 లో జీతముమీద వారీపనిని కంగీకరించిరనియు, ఒకటిరెండు సంవత్సరముల కాలమునకు మాత్రమే వా రీయుద్యోగము స్వీకరించిరనియు చెప్పుకొనిరి. ఈ సుబ్బారావుగారు Physics, Chemistry పాఠ్యపుస్తకములలోని విషయములను పాఠకులకు సుబోధకమగునట్లు పుస్తకములుగా ప్రకటించి, దేశ మంతట ఖ్యాతిగాంచియుండిరి. ఇంగ్లీషు వ్యాకరణము మొదలగువానికిసయితము Made Easy series సులభసంగ్రహరూపావళులను ప్రకటించుచుండిరి. ఇట్టి విద్యాగరిష్ఠులు మాకు హెడ్‌మాష్టరుగా వచ్చినందుకు విద్యార్థులగు బాలురము మిక్కిలి సంతోషించితిమి. నే నప్పుడు మెట్రిక్యులేషన్‌క్లాసులో బ్రవేశించితిని. కనుక మాకు ముఖ్యముగ సుబ్బారావుగారే పాఠములను చెప్పుచుండిరి. చెప్పునపుడు విషయములు సుకరముగ బోధపడుచుండెను.

వీరు ఇంచుక కోపస్వభావులగుటచేత తప్పులుచేసిన విద్యార్థులను బెత్తముతో కఠినముగ కొట్టుచుండిరి. వీరికాలమున బాలు రందరు ఎక్కువ భయము కలిగి మెలగుచుండిరి. పాఠశాలయెడల ప్రజలకు కొంత గౌరవము హెచ్చెను. కాని మిషన్ వారు వీరికి హెచ్చుజీత మిచ్చి భరింపజాల రనుట స్పష్టముగనే యుండెను. వీరు మనశక్తికి మించినవా రని ఊలుదొరగారే యనినట్లు చెప్పుకొనుచుండిరి.

శ్రీ సుబ్బారావుగారు హెడ్‌మాష్టరుగా మా పాఠశాలకు వచ్చిన మొదటిసంవత్సరముననే 1883 డిసెంబరులో నేనుమెట్రిక్యులేషన్ పరీక్షనిచ్చితిని. గుంటూరులో గవర్నమెంటు హైస్కూలు ఒకటి కొత్తగా వెలసినది. ఆ పాఠశాలకు శింగారవేలు మొదలియారుగారు హెడ్‌మాష్టరు. వీరు మిక్కిలి సమర్థులు. ఊలుదొరగారివలెనే నీతివర్తనులగు సాధుపురుషులు. వీరు కొంతకాలము గుంటూరు మునిసిపాలిటీకి ఛెయిర్మనుగా నుండి మంచివారని శ్లాఘ్యతగాంచిరి. ఆ పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదువుబాలురలో శేడింబి హనుమంతరావు అను చిన్నవాడు మంచి తెలివిగలవాడని చెప్పుకొనుచుండిరి. మే మొకరినిగూర్చి యొకరు వినుచుంటిమేగాని ఇరువురము కలుసుకొనుటమాత్రము సంభవించలేదు.