దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/నాటకములు - వేషధారణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాటకములు - వేషధారణ

ఆ దినములలోనే ధార్వాడనాటకసంఘము గుంటూరులో నాటకములను ప్రదర్శించి ప్రేక్షకుల నెక్కువగ నాకర్షించి గొప్పగా ధనము నార్జించెను. వీరు వీధులలో నాటకములు ఆడక పెద్ద పాకవేసి ఆపాకలో నాటకరంగమేర్పరచి దానిలో పలు రంగుల తెర లమర్చి అలంకరించి ఆకర్షణీయముగ జేసియు, నాటకపాత్రలకు వీధినాటకములలోవలె మోటుగా కిరీటములు, భుజకీర్తులుమొదలగు నలంకారములుచేయక వారివారి స్థితుల ననుసరించి సహజముగ ప్రజలు ధరించు దుస్తులను ధరింపజేసి వచనశైలిని సామాన్యముగ నొకరితోనొకరు మాట్లాడినట్లే నాటకప్రదర్శనము గావించుచుండిరి. ఇందులో శృంగారము, క్రోధము, శోకము మొదలగురసములు మిక్కిలి నిపుణముగ సహజముగ ప్రకటితమగుచుండెను. శోకమును పాడుచు, ప్రదర్శించుట సహజానుభవమునకు విరుద్ధముగ దోచకమానదు.కాబట్టి సహజమార్గమున శృంగారాదిరసములను ప్రదర్శించుట యను నూతనపద్ధతి పలువురకు ఆనందము గొల్పుచుండెను.

ఈ నాటకసంఘము ఆంధ్రదేశములో చాల స్థలములందు ప్రదర్శనములుగావించి ప్రఖ్యాతిగాంచెను. కావున వచనముననే కొన్ని నాటకములు వ్రాసి, సిద్ధముచేసి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొందరు విద్యార్థులను నాటకములందు ప్రీతిగలవారిని చేర్చి, సొమ్ముసంపాదింపవలెనను ఉద్దేశ్యముతోగాక, కేవలము ఆత్మానందమునిమిత్తము ప్రజలనానందింపజేయుటకు నుద్దేశించి గుంటూరు హిందూనాటక సమాజమను నొకసమాజమును స్థాపించిరి. శ్రీరామజననము, సీతాకళ్యాణము, ప్రహ్లాదనాటకము, హరిశ్చంద్రోపాఖ్యానము, మొదలగునాటకములు వేసవిసెలవులలో వరుసగ కొన్నిసంవత్సరములు ప్రదర్శింపజేయుచువచ్చిరి. వీరిరచనలు రసపూరితములై మిక్కిలి జనరంజకములుగనుండెను. కొందరు సమర్థులగునటులు నేర్పడిరి. తగినస్థలములో పాకవేయుట, తెరలుసిద్ధముచేయుట నాటకపాత్రలకు కావలసిన దుస్తులు అలంకారములు మొదలగుపనులు సర్కారు కచ్చేరీలలో గుమాస్తాలుగానుండిన పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యగార్లును, గుంటూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగానున్న భాగవతుల చెన్నకృష్ణయ్యగారును చాల శ్రద్థతో జరుపుచుండిరి. శ్రీ మల్లాది సోమయాజులు, ఇవటూరి వియ్యన్న గార్లును విదూషకవేషమున మిక్కిలి సమర్థులు. ప్రతినాటకమునందు నాయకపాత్రకు కలపటపు నరసింహము అను నొక విద్యార్థి సమర్థుడుగనుండెను. ఈయన బందరులో పిమ్మట కొంతకాలమునకు శెకండుగ్రేడు ప్లీడరుగ పనిచేసిరి. నాకు ప్రతినాటకమందును ముఖ్యమగు స్త్రీపాత్ర నియమించిరి. చెన్నూరు సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ యను మరియిరువురుగూడ స్త్రీవేషములు వేయుచుండిరి. వారివేషములు ఎక్కువ అందముగ నుండెడివిగాని వారిలో కధనడిపించు సామర్థ్యము కొంత కొరవబడియుండుటచేత నన్నే ప్రధానస్త్రీపాత్రగా నేర్పరచ వలసివచ్చినది. ఆకృతిగూడ పాత్రోన్నతికి అనుకూలముగనే యుండి ప్రసంగములలో సందర్భోచితముగ రసపోషణచేయుచు ప్రేక్షకుల హృదయముల నాకర్షించుచుంటినని పలువురు నన్ను మిక్కిలి అభినందించుచుండిరి. మంగళపల్లిశాస్త్రి యను నొకరు నాటకములలో విశ్వామిత్రవేషమును, రౌద్రరసప్రధానమగు ఇతరవేషములను వేయుచుండిరి. ఇతని ప్రసంగములు మిక్కిలి శ్లాఘ్యములుగ నుండెడివి. మొత్తమున ఈనాటకసంఘమున చేరినవా రందరును సమర్థులని పేరుపొందినవారు. ఈ నాటక సంఘము గుంటూరులో ఫస్టుకంపెనీ అని పిమ్మట కొన్ని సంవత్సరముల వరకు పేరుగాంచెను. పిమ్మట మరియొకసంఘము మేర్పడుటచేత దీనిని అట్లు ప్రజలు పిలువనారంభించినారు. మేము ఈ సంఘము నడిపినంతకాలము ద్రవ్యాపేక్షలేక కేవలము వినోదముగనే నడిపించియుంటిమి. ఒక్కసారి రాజమహేంద్రవరములో మా నాటకసంఘము హరిశ్చంద్రనాటకము ప్రదర్శించెను. మొదటిసారి ఆనాటకము వేసినరోజున ఎవ్వరో పాకపై నిప్పువేయుటచేత ప్రేక్షకులలో కలవరముకలిగి పాకలోనుండి వెలుపలకు తప్పించుకొనిపోవలెనను తొందరలో నొకరినొకరు త్రొక్కుకొనుట, కొందరికి గాయములగుట మొదలగు ప్రమాదములు సంభవించినవి. కాని రెండవసారి వేసిననాటకము చాల జయప్రదముగ నడిచెను. అక్కడ ప్రధానన్యాయవాదులలో నొకరైన మాకర్ల సుబ్బారావునాయుడుగారును గవర్నమెంటు కాలేజిలో లెక్చరరుగానున్న శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రిగారు మొదలగు పురప్రముఖులు నాటకముదర్శించి పాత్రల సామర్ధ్యమును మిక్కిలి పొగడిరి.

నాటకములలో పాత్రవహించిన కారణమున చిన్నతనము నుండియే గుంటూరుపట్టణమునందు సామాన్యముగ నన్ను పలువురు గుర్తించుచుండిరి.

ఇట్లు నాటకములలో పాల్గొనుచున్న కారణమున నా బడిలో పాఠములకు లోటురాకుండ చక్కగనే చదువుచు పరీక్షలలో మెప్పుగ కృతార్ధతచెందుచు ప్రతిసంవత్సరము వార్షికోత్సవ సభలలో బహుమతులను పొందుచుండుటచేత మా తండ్రిగారికి నాటకములలో తిరుగుట ఇష్టములేకపోయినను నాకు ఆవిషయమున ఎట్టి అడ్డుపాటును గావించినవారుకారు.