దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఇంగ్లీషు చదువు

వికీసోర్స్ నుండి

ఇంగ్లీషు చదువు

ఇక నాచదువువిషయమై కొంత సమస్య యేర్పడెను. ఇంగ్లీషువిద్య చెప్పించుటయా, లేక పార్షి చదివించుటయా? కొన్ని దినములు మఖ్‌తబ్ అనగా ఉర్దూపాఠశాలకు పంపిరిగాని కొలది దినములలోనే అచ్చటనుండి మార్చి ఇంగ్లీషుబడికి పంపించిరి. అదియొక ప్రైవేటుగ్రాంటుస్కూలు. గోవిందరాజు సూర్యనారాయణ రావుగారు ప్రధానోపాధ్యాయుడుగానుండి బాగా చదువునేర్పువారని పేరుగాంచెను. ఈపాఠశాలలో నాకంటె చాల పెద్దవారు, పదునారు పదునేడేండ్లు వయస్సుగలవారుగూడ చదువుచుండిరి. ఒక్కొక్కప్పుడు ఈబాలురను బెత్తముతో వీపుమీద మాష్టరుగారు బాదుచుండ చిన్నబాలురము మిక్కిలి భయపడుచుంటిమి. ఆదినములలో విద్యార్ధులను బెత్తముతోకొట్టుట చదువులపంతుళ్ళకు అభ్యాసము. ఇంగ్లీషు బళ్ళలో బెంచిఎక్కించినిలువబెట్టు మరియొక శిక్షగూడ వాడుకలోనుండెను. తెలుగుబడిలో చదువునప్పుడు పంతులుబడిలో లేనపుడు పిల్లలు అల్లరిచేయుచుండిరి. పంతులుగారు ఇంటిలోపలినుండి కోపముతోవచ్చి కేకలువేయుచు బెత్తముతోనందరిని వరుసగ బాదుచుండెడివారు. దైవవశమున నేనుమాత్రము బెత్తపుదెబ్బలు తినుట ప్రాప్తించ లేదు. నాపాఠములు ఏమరుపాటులేక చదివి ఒప్పజెప్పుచుంటిని. కనుక నాయందు వారు దయతోనుండెడివారు. ఒకటిరెండు సంవత్సరములు ఈసూర్యనారాయణగారిస్కూలులో చదివినతర్వాత మిషన్‌హైస్కూలులో మూడవక్లాసు అనగా ఇప్పటి ఫస్టు ఫారమునకు సరిపోవు తరగతిలో ప్రవేశపెట్టిరి. ఈపాఠశాల పాతగుంటూరునుంచి కొత్తగుంటూరువచ్చు రోడ్డుమీదనె యుండెడిది. కావున నేను పోయివచ్చుటకు సుకరముగనుండెను.

ఇక్కడ చదువుచుండగా మాతండ్రి ఉదయమున ఇంట వంటచేసి భోజనముచేసి, మాతమ్ముని బడికిపంపి తాను బజారునకు పోవుచు ఇంటితాళముచెవి నా బడిదగ్గరకు వచ్చి నా కిచ్చిపోవుచుండిరి. నేను బడివిడిచినపిదప పదిగంటలకు ఇంటికిపోయి మాతమ్ముడును నేనును కలిసి అన్నముతిని మధ్యాహ్నము రెండు గంటలవరకును ఉండి మరల నిరువురమును అన్నముతినిపిమ్మట తమ్ముని బడికిపంపి నేను బడికిపోవుచుండెడివాడను. మరల సాయంకాలము ఇంటికిచేరి చీకటిపడునప్పటికి దీపమువెలిగించి యింటిలో నుండలేక మే మిరువురమును తలవాకిట గూరుచుండి మాతండ్రిగారిరాకకు ఎదురుచూచుచుండువారము. ఒక్కొక్క సారి లోపలికిబోయి అమ్మా యని పిలిచి ఏడ్చుచు మరల వెలుపలకువచ్చుచుండువారము. మానాయనగా రింటికివచ్చినపిమ్మట ప్రొద్దుటివంటపదార్ధములనే మువ్వురమును తిని పరుండెడివారము. ఈరీతికష్టములు ఏడుసంవత్సరములు పడినపిమ్మట మా మేనత్తగారు తనంతటతానే మాయింటికి వచ్చినందున అప్పటినుండి మానాయనగారికి ఇంటిపనులభారము తప్పెను. మేమందరము కొంతసౌఖ్య మనుభవించితిమి. నేను నాబడిలో చక్కగ పరీక్షలలో కృతార్థుడనగుచుండుటయేగాక తరగతిలో మెరుగుగ నుండుటచే జీతమీయనక్కరలేకుండ ఉపకారవేతనము నిచ్చుచుండిరి. ఇదిగాక కొన్ని పుస్తకములును బహుమతిగ నిచ్చుచుండెడివారు. ఏటేట జరుగువార్షి కోత్సవసభలలో బాలురచేత పద్యములు పాడించుచు వినోదసంభాషణలు (Dialogues) చేయుచుండిరి. ఒకసారి మరియొకవిద్యార్థితో నట్టి సంభాషణ గావించుటలో నేను రోకంటిపాటవలెగాకుండ సహజరీతి భాషించుటచేత సభ్యు లంద రానందమొందిరి. అప్పుడు మాకు ఆంధ్రోపాధ్యాయులుగానుండిన శ్రీ కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొన్ని నాటకములు తెలుగున వచనశైలిని వ్రాసి వానిని ప్రదర్శింపవలెనని కుతూహలపడుచుండిరి. వారు అందుకు నాటక పాత్రలుగ మార్చతలచినవారిలో నన్నుగూడ చేర్చి ప్రోత్సహించిరి.

అదివరకు దేశములో వీధినాటకములు సామాన్యముగ నాడుచుండిరి. చాలవరకు ఈ నాటకములలో దరువులుపాడుచు నృత్యముచేయుచుండుటచేత సంగీతము ప్రధానముగ నుండెను. ఈ నాటక బృందములలో చాలవరకు బ్రాహ్మణులే చేరియుండిరి. వీరిలో కొందరి నడవడి చెడ్డదిగ నుండెను. అందువలన భాగవతులు అంతగా గౌరవపాత్రులుగ నెంచబడకుండిరి. కాని కూచిపూడి భాగవతులనువారు ఈప్రాంతమున మిక్కిలి పేరు పొందిరి. వీరిలో భరతనాట్యము, అభినయ శాస్త్రములందు ప్రవీణులై పేరెక్కినవా రుండిరి.

నే నప్పటికి మిడిల్‌స్కూలుపరీక్షలో కృతార్ధుడనై యుండియుందును. అది ఇప్పటి ఫోర్తుఫారమువంటిది.