దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము

వికీసోర్స్ నుండి

పితృవియోగము

నేను అరండల్‌పేట కాపురము చేయనారంభించినప్పటి నుండి మాతండ్రిగారు నాయొద్దనే యుండి పంచలో ఆనుడుకుర్చీ మీద కూర్చుండి తెలుగుఅర్థములుగల భగవద్గీతాగ్రంధము చేతబట్టుకొని చదువుకొనసాగిరి. పెద్దలైనకొలది వారియందు ఉదారభావములు హెచ్చగుచుండెను. తనక్రింద నుంచుకొన్న వెయ్యి రూపాయలలో మాయింటియొద్ద వీధిలో సర్వజనులకు నుపయోగించున ట్లొక నీటికొళాయిని కట్టుటకు సుమారు మున్నూరు రూపాయలుదానమిచ్చిరి. తక్కిన ద్రవ్యమునుగూడ కొత్తగుంటూరులో కూరలమార్కెటుకు సమీపమున పశువులు నీరుత్రాగునిమిత్తము తొట్టెకట్టించవలెనని సంకల్పించిరిగాని మునిసిపాలిటీవారు అభ్యంతరముచెప్పుటచే ఆప్రయత్నము సాగకపోయెను. ఇంతలో మాతండ్రిగారి కొకమధ్యాహ్నము ఆకస్మికముగ మూత్రవిసర్ఝన కట్టుబడిపోయెను, సూదిగ్రుచ్చి నీరుడుతీయవలసివచ్చెను. డాక్టర్లు దానిని నివారణచేయలేకపోయిరి. చికిత్సచేయవచ్చిన డాక్టరు మాయింటికి చిరపరిచితులుగాన ఆయనతో "ఈసారి నన్ను లేవదీయుటేనా" యని మాతండ్రిగారు హాస్యముగ బలికిరి. వేడినీళ్ళుబోసిన గంగాళములో కూర్చుండబెట్టి చూచితిమి. కాని మూత్రముకాలేదు, మృత్యువు ఆసన్నమైనదని యెఱిగియేకాబోలును కుమారులు మువ్వురును బిలిచి తామీలోకమును విడిచిపోవుచున్నా మనియు, మీరు మువ్వురు అన్యోన్యప్రేమతో మెలగుచుండు డనియు చెప్పి, నాతమ్ము లిద్దరికి నన్ను నమ్మి ప్రవర్తించవలసినదని నుడివిరి. "నాన్నా మీకు ఏమైన కోర్కెలుగలవా" యని నేను ప్రశ్నించితిని. తన కింక యీలోకమున కావలసిన దేదియు లే దని గట్టిగా బలికిరి. అంతట ప్రక్కకు తిరిగి కన్నులుమూసుకొని పరుండిరి. రాత్రి తొమ్మిదిగంట లాయెను. నేను భోజనముచేసి, లోగడ రాత్రులలో నిద్రలేకపోవుటచే ప్రక్కపై బరుండి నిదురించజాలక మరల వారియొద్దకు బోయి నాయనా అని కొంచెము బిగ్గిరగా పిలచితిని. అంతట వెల్లకిల దిరిగి మాట్లాడప్రయత్నించినను నోరుతెరచుటకుసాధ్యముకాదయ్యెను. పండ్లుకరచుకొనిపోయియుండెను. అంతట తేనె తెచ్చి, నావ్రేళ్ళతో పండ్లపై నెమ్మదిగ రుద్దుటతోడనే "రామరామ"యని ప్రాణములువిడిచిరి. వారు నిత్యమును నిద్రలేచునపుడు రామరామ యనుకొనుట అభ్యాసము. అటులనే అంతవరకు జ్వరవేదనవలన కన్నులుమూసుకొని పరుండినవారు నేను పిలచినతోడనే మేల్కొని, రామరామ యని దీర్ఘనిద్రచెందిరి. వారి అంత్యక్రియలు మిక్కిలి భక్తిశ్రద్ధలతో మా తమ్ములును నేనును నెరవేర్చితిమి. ఇం దొకవిశేషము విచిత్రముగ గాన్పించును. నేటి ఆంగ్లేయవిద్యాధికులు నవ్విపోదురని యెరిగియు జరిగినయదార్థము వివరింతును. పండ్రెండవదినమున పిండము వేసినప్పుడు కాకులుగాని గ్రద్దలుగాని దానిని ముట్టలేదు. ఎంతతడవు దూరముననుండి వేచియున్నను అవి బెదరిలేచిపోవుటేగాని సమీపింపవాయెను. అంతట నన్ను మాతమ్ములను తండ్రిగారిని స్మరించి వారి కెదియో కొదువుగానున్నట్లు కనబడుచున్నదిగాన దాని నెరవేర్చెదమని నమస్కరించవలసినదని పలువురు నుడువసాగిరి. వారు చనిపోకపూర్వము తమ కేవిధమైన కోర్కెలు లేవని ప్రత్యుత్తర మిచ్చియుండిరిగాన మేము నెరవేర్చకలిగిన దేదియు లేదని చెప్పుచు మనసున తలంచుకొని "తప్పులుచేసిన క్షమించు" మని నమస్కరించితిమి. ఆప్రకారమే మామువ్వురిభార్యలు నమస్కరించిరి. నేను వారి అస్తులను గంగలో కలిపెదనని సహితము నమస్కరించితిని. కాని కాకులు ఇంకను దూరముననే యుండెను. ఇంతలో నారెండవతమ్ముడు మేము యాత్రలకు బోయినపుడు తన్ను దిగవిడిచి పోతిరని నిష్ఠురముగ మాతండ్రిగారితో ముచ్చటించినట్లును అప్పుడు "నీవు పోవుతరుణ మొకటి రాగలదులే అప్పుడు పోవచ్చు" నని మాతండ్రిగా రనినట్లును చెప్పెను. అంతట నేను కాశికి వెళ్లునపుడు తమ్ముడు హరినారాయణనుగూడ తీసికొనివెళ్ళెదనని నమస్కరించితిని. వెంటనే కాకులును గ్రద్దలును గుంపులుగుంపులుగ వచ్చి పిండద్రవ్యమును తినిపోయెను. కనుక మరణానంతరము జీవులేదో సూక్ష్మరూపమున నుందురనుట కిది యొక దృష్టాంతము.

మాతండ్రిగారు చనిపోయినపిమ్మట దివ్యజ్ఞానసమాజములోని ప్రముఖు లొకరు వచ్చి వేటపాలెముబంగళాను చూచి అందు స్త్రీలవిద్యాసంస్థను స్థాపింతు మనిరి. బంగళా మొదలగు ఆస్తి అంతయు తమకు సంపూర్ణముగ నిచ్చివేయవలెననిరి. ఆ పద్ధతులు నాకు అంగీకారము కాకుంటచే వారిప్రయత్నము ఆగిపోయెను. మిస్‌టెనెంటు అను నొక ఆంగ్లేయస్త్రీ ఈప్రాంతమున సంచారముచేయుచు వేటపాలెము బంగళాకు వచ్చి, అచ్చట స్త్రీల విద్యాసంస్థ స్థాపించుటకై విజయనగరం మహారాణిగారి వలన లక్షరూపాయలవిరాళమును సముపార్జించెద నని చెప్పి విజయనగరమునకు వెళ్ళెనుగాని ఆమెప్రయత్నమును సఫలము కాలేదు.

నేను అంతకుమునుపే పునహానుంచి గుంటూరు వచ్చిన తోడనే "శారదనికేతనము" అనుపేరుతో వేటపాలెములో నాబంగళాలో విద్యాసంస్థ స్థాపింతుననియు స్త్రీవిద్యాభిమానులు సానుభూతిసహాయము లొసంగవలెననియు కోరుచు ఒక కరపత్రమును ముద్రించి, ఆంధ్రదేశమున ప్రముఖులైనవారి కందరికి పంపియుంటిని. అనేకులు ప్రోత్సాహవచనములతో ప్రత్యుత్తరములు వ్రాసిరి. పిమ్మట లక్ష్మీనారాయణగారిని మునగాల జమీందారుగారియొద్దకు బంపి వారికి దివానుగా నున్న శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారిద్వారా ప్రయత్నముచేసి, నాలుగువేలరూపాయలవిరాళమును వాగ్దానముచేయించుకొని, జాబితాలో ప్రప్రధమమున వారిసంతకముచేయించితిని. పిమ్మట న్యాపతి సుబ్బారావు, శెడింబి హనుమంతరావు, వేమవరపు రామదాసుగార్లు మున్నగు ప్రముఖ న్యాయవాదులచేతను, గుంటూరులో రాయసంవెంకటశివుడు, చట్టి నరసింహారావు మొదలగు స్నేహితులచేతను జాబితావేయించితిని. దాదాపు ఇరువదివేలరూపాయలవరకు జాబితామొత్తముఏర్పడెను. కానిలక్షరూపాయలు జాబితామీద పూర్తియగువరకు ఒక దమ్మిడియైనను వసూలు చేయగూడదని నియమముపెట్టుకొని గ్రామములో కొందరు ప్రముఖులను జూచి అనుకొన్నప్రకారము లక్షరూపాయలు పూర్తిచేయగల ననుధైర్యము నా కుండెను. ఈసంస్థను నపుడు వారినిగూర్చి ఆలోచింపబనిలేదనియు నామిత్రుడు చెన్నాప్రగడ భానుమూర్తిగా రుండనేయుండిరనియు తలంచితిని. శ్రీ కర్వేపండితులు ఒకఉపాధ్యాయురాలి నెట్లును పంపెదమనిరి గాన నాయుద్యమము సాగునను ధైర్యము నా కేర్పడెను.

ఇట్లు శారదానికేతనోద్యమమునడచుచుండ, మాతండ్రిగారి అస్తులను గైకొని నేనును నాతమ్ముడును కాశికి వెళ్ళితిమి. కాశీనుంచి మరలివచ్చునప్పటికి నిడదవోలులో కొన్ని ఆంధ్ర మహాసభలు సమావేశము గానుండెను. గుంటూరు, కృష్ణా, గోదావరిమండలముల కాంగ్రెసుమహాసభయు, సంఘసంస్కరణ మహాసభ, ఆంధ్రఆస్తికమహాసభలును అక్కడ జరుగుటకు నేర్పాటులుజరిగెను. నిడదవోలులో కోవూరుబసివిరెడ్డి యనువారు చదువనువ్రాయను నేర్చియుండకపోయినను గొప్ప వర్తకముచేసి చాలసొమ్ము గడించి యుండిరి. ఆయనకుమారుడు చంద్రారెడ్డి విద్యనేర్చినవాడు. ఆంధ్రదేశాభ్యుదయయోద్యమములం దభిమానముకలవాడు. ఈసభలను ఆయన నిడదవోలుకు ఆహ్వానించి పందిళ్ళు, పాకలు వేయించి, భోజనాదివసతులు ఏర్పరచెను. ఆయాసభలకు సంబంధించిన మహానాయకు లందరును అచ్చట చేరుటచే ఆంధ్రదేశమున ప్రసిద్ధికెక్కిన పురుషులును, స్త్రీలును గూడ నొకరినొకరు గుర్తెరుంగుట కపూర్వవకాశము కలిగెను.

కాంగ్రెసుసభకు వచ్చినవారిలో రాజమహేంద్రవరమువారు గుంటూరు, కృష్ణా, గోదావరులకు మూటికి నొక్కకాంగ్రెసుసంఘము నేర్పాటుచేయనుద్దేశించిరి. అప్పటి కామూడు జిల్లాలకు శాసనసభలో నొక్కరినే సభ్యునిగా నంగీకరించు చుండిరి కావున ఈమూడు నొక్కటిగా నుండుట యుక్తమని వారి అభిప్రాయము. గుంటూరుజిల్లానుంచి వెళ్ళిన మేము కృష్ణాజిల్లాసంఘమునుండి విడిపోయి ప్రత్యేకగుంటూరుజిల్లా సంఘముగ నేర్పడవలెనని యుద్దేశించుకొనియుంటిమి. చివరకు మాయుద్దేశమే సభలోఅంగీకరించబడినది. ఆ కాంగ్రెసు సభలోనే ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గురించి తీర్మానము తెచ్చిరిగాని అధ్యక్షులుగానున్న శ్రీ వేమవరపు రామదాసుపంతులుగారు విషయనిర్ణయసభలో ప్రవేశపెట్టబడలేదుగనుక ఆతీర్మానము చర్చకుపెట్టుట సరికాదని నిరాకరించిరి.

మరునాడు గోదావరికాలువలో గుంటూరుమిత్రులు కొందరము స్నానముచేయుచుండగా యువకులలో నొకరగు చట్టి నరసింహారావుగారు "ఈసమయమున ఆంధ్రప్రముఖులందరు ఒక్కచో జేరుటచే పరస్పరపరిచయము లేర్పడెనుగదా! ఇటులనే ప్రతిసంవత్సరము ఆంధ్రజిల్లాలవా రందరు గూడి ఆంధ్రమహాసభ సల్పుట బాగుండు" నని పల్కెను. నేనును ఆవాక్యములు విని బాగుగనే యుండునని మారుపల్కితిని. అంతకంటె ఆవిషయమై ఎక్కువగా సంభాషణ ఏమియు జరుగలేదు.

కాంగ్రెసుసభలకు సామాన్యముగ హాజరుగాని ఆంధ్రప్రముఖులు ఆసభకు విచ్చేసిరి. ఆసభలో ఆంధ్రులను బర్మా యుద్ధమునాటినుండి సేనలో చేర్చుకొనగూడ దనునిషేధమును గర్హించుచు, దానిని తొలగించవలె నను తీర్మానము ప్రధానముగ చర్చించబడెను. అది ప్రభుత్వపుటుత్తరువును విమర్శించుట గావున కొందరికి జంకుకలిగెను. అదివరకు రాజకీయసభలకు బోకుండువారికి మరింత వ్యాకులతకల్గెను. నేనాతీర్మానమును గూర్చి విమర్శించుచు ఆంధ్రుల పౌరుషధైర్యసాహసములును, యుద్ధనైపుణ్యమును పూర్వరాజన్యులకాలములోను ఆంగ్లేయసైనికప్రచారములలో సహితము ప్రస్ఫుటములై యున్నవనియు ఎవ్వరో యొక సేనాని పాక్షికబుద్ధితో వ్రాసినవ్రాతల నాధారముచేసుకొని ముందువెనుకలు యోచించకుండ చేసిన నిషేధపుటుత్తరువు న్యాయవిరుద్ధమేగాక మొక్కబోవని శౌర్యవీర్యదర్పములుగల ఆంధ్రజాతిని సైనికదళములలో జేర్చరా దనుట కేవలము వివేచనారాహిత్యమును ప్రకటించుచున్నదనియు, బక్క బాపడనైన నేనుగూడ రణరంగమున అప్రతిమానప్రతాపమును ప్రకటింతుననియు వీరావేశముతో పల్కినపల్కులకు మహాసభలో కరతాళధ్వనులు మిన్నుముట్ట చెలరేగెను. మిత్రు లనేకులు నన్ను అభినందనవాక్యములతో ప్రస్తుతించిరి. విజయనగర కళాశాలాధ్యక్షులగు కిళాంబిరామానుజాచార్యులుగారు నా యొద్దకు వచ్చి, తమ యానందమును వెలిబుచ్చిరి.

ఇట్లు సభ లన్నియు ముగిసినపిదప ఇండ్లు చేరితిమి. కొలదిదినములకు గుంటూరులో న్యాయవాదిగా నుండి మునిసిపాలిటీకి అధ్యక్షులుగా కొంతకాలము పనిచేసి పట్టణములో పలుకుబడిగలిగిన శ్రీ వింజమూరి భావనాచార్యులుగారి యింటి యొద్ద కొందరు యువకులు చేరి నాకు కబురంపిరి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారును, చల్లా శేషగిరిరావుగారును, జొన్నవిత్తులగురునాధముగారును అక్కడ హాజరైనవారిలో ముఖ్యులు. లక్ష్మీనారయణగారు గుంటూరుజిల్లా సత్తెనపల్లితాలూకా వేమలూరిపాడుకాపురస్థులు, సెకండుగ్రేడుప్లీడరీలోకృతార్థులై గుంటూరులోనే న్యాయవాదిగా నుండిరి. రాజకీయ, సాంఘిక సంస్కరణములందు ఉత్సాహముతో పనిచేయుచు వితంతూద్వాహములు జరిపి సంఘబహిష్కరణవలన పడరాని ఇడుములకు నోర్చి, పిమ్మట ఇంగ్లాండునకు బోయి, బారిష్టరుపరీక్షలో కృతార్థులై, హైకోర్టులో పనిచేయుచుండిరి. వీరికి యువకులలో హెచ్చుపలుకుబడి కలదు. జొన్నవిత్తుల గురునాధముగారు కృష్ణాజిల్లావారు. బి. ఏ. పరీక్షయందు కృతార్థులై ఆంగ్లేయభాషారచనయందు సామర్థ్యము, భారతదేశ రాజకీయవిజ్ఞానము, దేశభక్తియు, త్యాగబుద్ధియు, కల్గిన ఉత్సాహమూర్తి. తరచు "హిందూ" మొదలగు ఇంగ్లీషుపత్రికలకు వ్యాసములు వ్రాసి పంపుచుండెను. కురుపాంజమీందారుగారియొద్ద స్వల్పకాలము కార్యదర్శిగ నుండి, వారిమార్గములు తనకు కుదరక ఆఉద్యోగమును వదలి స్నేహితులసహాయముతో గాలిజీవనము చేయుచుండెను. చల్లా శేషగిరిరావుగారుకూడ ఉత్సాహశీలియగు యువకుడు. దేశాభిమానిపత్రికకు వ్యాసములువ్రాయుచు రాజకీయములలో అభినివేశము ప్రకటించుచుండెను.

ఆనాడు జరిగిన సంభాషణలలో ఆంధ్రజిల్లాలను చెన్నపురిరాష్ట్రమునుండి విడదీసి, ప్రత్యేకరాష్ట్రముగా నిర్మాణము చేయవలసినదనియు, రాష్ట్రాంగములైన హైకోర్టు, రెవిన్యూబోర్డు మొదలగున వన్నియు ప్రత్యేకముగ నేర్పడవలెననియు, అందుకు దగిన ఆందోళన సాగించవలెననియు ప్రస్తావించి, నన్ను ఆవిషయమైన భారమును వహింపవలసినదని కోరిరి. కాని నాకు వారిసంభాషణ ఆవేశపూరితమై అత్యాశలతో గూడినదిగా గన్పట్టెను. అంతటి మహత్కార్యము దుస్సాధ్యముగ గాన్పించెను. అందనిమ్రానిపంద్ల కఱ్ఱులుసాచినట్లే యని తలంచితిని. కాని వారితో బొత్తుగ నేకీభవించనని మాత్రము చెప్పజాలకపోతిని. అంతటి యుత్సాహముతో నున్నవారి మనస్సులను మరల్చుట సాధ్యముకాదని తోచెను. ఈయుద్యమము పలువురకు వెఱ్ఱి ప్రయత్నముగ తోచును. ఇప్పటి కది ఎట్లున్నను ఏనాటికైన సాధించదగినదని నాకు స్పష్టముగనే యుండెను. కావున వారితో నేనిట్లు పల్కితిని. "ఈయుద్యమము భగీరధప్రయత్నమువంటిది, వినినవారికి వెఱ్ఱిగా కాన్పించకమానదు. మనలో ప్రముఖులైన వారికి మిక్కిలి అయిష్టము కల్పించవచ్చును. అందరిని కూడ దీసుకొనిగాని ఉద్యమము బలముగసాగి ఫలింపజాలదు. ముందుగనే ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకై ప్రయత్నించి పలువురను బెదరగొట్టక ఆంధ్రులు, దేహ బుద్ది, విద్యాపాటవమును ఆర్థికబలము నైతికబలము పెంపుజేసికొని, సర్వతోముఖమగు అభివృద్ధిపొందుటకు వలయుమార్గములను నిర్ణయించుటకు, ఆంధ్రులెల్లరు మేల్కొని ఐక్యముతో ప్రయత్నించుట అవసరముగాన ఆంధ్రమహాసభను స్థాపించి ఏటేట మహాసభలు ముఖ్యస్థానములలో జరుపుటయుక్తమని, అందులకువలయు ప్రచారము సాగించవలయు ననియు నాఅభిప్రాయము తెలిపితిని. వారిలో తీవ్రవాదులుకొందరు కొంతవడి భిన్నాభిప్రాయములు వెలిబుచ్చి వ్యతిరేకవాదన సాగించిరి. కాని తుదకు అందరమును నేను సూచించినమార్గమే యుక్తమని నిర్ణయించుకొంటిమి. అంతట ఆంధ్రోద్యమము అనుపేరుతో చిన్నపొత్తమును తెలుగునను, ఇంగ్లీషునగూడ నేను వ్రాసి, సిద్ధముచేసితిని. ఈప్రయత్నమున జొన్నవిత్తుల గురునాధముగారు తోడయ్యెను.

ప్రథమాంధ్రసభ

1913 సంవత్సరము వేసవిసెలవులలో బాపట్లలో గుంటూరుజిల్లాకాంగ్రెసుమహాసభ జరుపుటకు నిర్ధారణ కాబడెను. అక్కడ ఈభారమును వహించినవారిలో, నా చిరమిత్రుడు చోరగుడి వెంకటాద్రిగారు ముఖ్యులు. ఈయన బాపట్లలో న్యాయవాది. హాస్యరసప్రాధానముగా ప్రసంగించు నేర్పరి. దేశహితైకకార్యములందు దీక్షతో కృషిచేయుచుండెను. కాబట్టి ఆంధ్రమహాసభ జిల్లాకాంగ్రెసుసభతోగూడ జరిపించవలెనని సన్మానసంఘమువారు అత్యుత్సాహముతో అంగీకరించి వెంకటాద్రిగారిని అధ్యక్షులుగా వరించిరి. నిడదవోలు తీర్మానము ననుసరించి ఏర్పడిన గుంటూరుజిల్లాసంఘమునకు నేను అధ్యక్షుడను. కావున గుంటూరుజిల్లాకాంగ్రెసుసభయు దాని వెంటనే ప్రధమాంధ్రమహాసభయును బాపట్లలో సమావేశపరుపబడునని పత్రికలలో ప్రచురింపబడెను. ఆంధ్రోద్యమ గ్రంధములు విరివిగ దేశములో పంచిపెట్టబడెను.

భాష ననుసరించి బంగాళము, బేహారు వేరుపరచి ప్రత్యేకరాష్ట్రములుగ నేర్పరచిననాటనుండి గుంటూరులో ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి (Young men's Literary Association)