దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ప్రథమాంధ్రసభ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రోద్యమము అనుపేరుతో చిన్నపొత్తమును తెలుగునను, ఇంగ్లీషునగూడ నేను వ్రాసి, సిద్ధముచేసితిని. ఈప్రయత్నమున జొన్నవిత్తుల గురునాధముగారు తోడయ్యెను.

ప్రథమాంధ్రసభ

1913 సంవత్సరము వేసవిసెలవులలో బాపట్లలో గుంటూరుజిల్లాకాంగ్రెసుమహాసభ జరుపుటకు నిర్ధారణ కాబడెను. అక్కడ ఈభారమును వహించినవారిలో, నా చిరమిత్రుడు చోరగుడి వెంకటాద్రిగారు ముఖ్యులు. ఈయన బాపట్లలో న్యాయవాది. హాస్యరసప్రాధానముగా ప్రసంగించు నేర్పరి. దేశహితైకకార్యములందు దీక్షతో కృషిచేయుచుండెను. కాబట్టి ఆంధ్రమహాసభ జిల్లాకాంగ్రెసుసభతోగూడ జరిపించవలెనని సన్మానసంఘమువారు అత్యుత్సాహముతో అంగీకరించి వెంకటాద్రిగారిని అధ్యక్షులుగా వరించిరి. నిడదవోలు తీర్మానము ననుసరించి ఏర్పడిన గుంటూరుజిల్లాసంఘమునకు నేను అధ్యక్షుడను. కావున గుంటూరుజిల్లాకాంగ్రెసుసభయు దాని వెంటనే ప్రధమాంధ్రమహాసభయును బాపట్లలో సమావేశపరుపబడునని పత్రికలలో ప్రచురింపబడెను. ఆంధ్రోద్యమ గ్రంధములు విరివిగ దేశములో పంచిపెట్టబడెను.

భాష ననుసరించి బంగాళము, బేహారు వేరుపరచి ప్రత్యేకరాష్ట్రములుగ నేర్పరచిననాటనుండి గుంటూరులో ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి (Young men's Literary Association) సాహిత్యసంఘ సమావేశములలో చర్చించబడుచుండెను. 1911 లోనే న్యాపతి నారాయణరావు అనువారు భాషననుసరించి బేహారురాష్ట్రమువలెనే ఆంధ్రరాష్ట్రమునుగూడ నిర్మింపవలెనని వ్రాసినలేఖ పత్రికలలో ప్రకటించబడెను. యువకులలో జరుగుచున్న ఈఆందోళననుబట్టియే నిడదవోలుకాంగ్రెసుసభలో ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చిన తీర్మానము ప్రవేశపెట్టుటకు యత్నముజరిగెను. అప్పటినుండి పత్రికలలో ఆంధ్రరాష్ట్రమును గూర్చిన వాదప్రతివాదములు ప్రకటింపబడుచుండెను. కాని, ఆంధ్రోద్యమ మను పుస్తకమును వ్రాసిన నాకు ఆంధ్రరాష్ట్ర విషయమునుగూర్చి పత్రికలలో వ్రాయుట అభిమతముగాకుండెను. అదిగాకనేను ఆంధ్తోద్యమమునకు కార్యదర్శిగా వ్యవహరించుచుండుటచే ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున జోక్యముచేసుకొనుట ఉద్యమవ్యాప్తికి కొంతవిఘాతముగనుండును. ఈ కారణమునుబట్టియే జొన్నవిత్తుల గురునాధముగారును ఆసమస్యనుగూర్చి పత్రికలకువ్రాయలేదని తలంచుచున్నాను. కాని, ఆంధ్రులలో ఆంధ్రరాష్ట్రముపట్ల ఉత్సాహము పెరిగిపోవుచుండెను.

బాపట్లలో ఆంధ్రమహాసభకు చెన్నపురిశాసనసభలో పేరుపొందిన శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు అధ్యక్షతవహించుట కంగీకరించిరి. నన్ను సన్మానసంఘాధ్యక్షునిగా నెన్నుకొనిరి. బాపట్లలో జిల్లాకాంగ్రెసుసభ పూర్తియైనమరునాడే ఆంధ్రమహాసభ సమావేశమయ్యెను. ఆంధ్రదేశమునందలి ప్రముఖులు అనేకులు సభకు విచ్చేసిరి. ప్రభుత్వోద్యోగులుకూడ వచ్చియుండిరి. వారిలో శ్రీ దివాన్‌బహద్దరు ముట్నూరు ఆదినారాయణయ్య గారు సెటిల్మెంటుశాఖలో ఉన్నతోద్యోగిగా నున్నవారుగూడ సమావేశములో నుందిరి. ఈ ప్రేక్షకులతో క్రిక్కిరిసి సభ మహదానందము గొల్పుచుండెను. సభాధ్యక్షులగు నరసింహేశ్వరశర్మగారిని, రాజ్యపట్టాభిషేకమునకు గొనివచ్చు రాచకుమారునివలె పుష్పమాలాలంకృతుని గావించి మంత్రాక్షతలు సల్లి, కుంకుమాంకితునిజేసి, మంగళవాద్యముతో ఊరేగించు కొనుచు సభాస్థలికి తీసుకొనివచ్చితిమి. వేదవచనములతో, గీతములతో సభారంభము జరిగెను. అనంతరము నేను సన్మాన పత్రమును చదివినపిమ్మట అధ్యక్షుని ఎన్నికజరిగెను. అంత సభాసదులు ఆనందపూరితులై, అత్యుత్సాహముతో కరతాళధ్వనులు చేయుచుండ అధ్యక్షులు దీర్ఘము, గంభీరమగు నుపన్యాసమిచ్చిరి. అందు ఆంధ్రదేశవైశాల్యమును, ఆంధ్రులు దేశదేశముల వ్యాపించుటయు నుగ్గడించి, పూర్వాంధ్రరాజుల శౌర్యప్రతాపముల వర్ణంచిరి. తుదకు ఆంధ్రరాష్ట్రనిర్మాణమును గూర్చి సూచనమాత్రముచేసి తమ యభిప్రాయమును స్పష్టీకరించక ఉపన్యాసము ముగించిరి. పిమ్మట ఆంధ్రరాష్ట్రనిర్మాణావశ్యకమునుగూర్చి యొక తీర్మానము వేమవరపు రామదాసుపంతులుగారు ప్రవేశపెట్టిరి. ఆతీర్మానము సభలో గొప్ప కలకలము పుట్టించెను. దానికి అనుకూలురు పలువు రుండినను ప్రతికూలురులో దేశమందలి ప్రముఖులగువా రుండిరి. న్యాపతి సుబ్బారావుపండితులు, మోచర్ల రామచంద్రరావుపంతులు, గుత్తి కేశవపిళ్ళె మొదలగువారు ప్రతికూలాభిప్రాయములు ప్రకటించి యుండిరి. సుబ్బారావుపంతులుగారు చెన్నపురి శాసనసభయందును కేంద్రశాసనసభలోను సభ్యులై ప్రఖ్యాతిగాంచిరి. కాంగ్రెసుమహాసభకు గౌరవకార్యదర్శిగ చిరకాలము పనిచేసిరి. శ్రీ కేశవపిళ్ళెగారు గుత్తిలో న్యాయవాదిగానున్నను మిక్కిలి పలుకుబడి సంపాదించి శాసనసభలో సభ్యత్వముబడసి, రాయలసీమలో ప్రాధాన్యము వహించియుందిరి. మోచర్ల రామచంద్రరావుగారు చెన్నపురి శాసనసభలో ప్రఖ్యాతి వహించినారు. ప్రభుత్వమువారిచే మన్ననబడసినవారు. అప్పటికాలములో ఆంధ్రదేశమున ఈమువ్వురిని మించినవారు రాజకీయములలో లేరు కావున వారిఅభిప్రాయమును ముందే తొలగత్రోసినచో ఆంధ్రోద్యమమునకే విఘాతము సంభవించుననుట స్పష్టమే. దేశమున ఈవిషయమున చీలికలు బలమగును. ముట్నూరి ఆదినారాయణయ్యగారు ఆంధ్రరాష్ట్రతీర్మానమును ప్రతిఘటించుచు దీర్ఘముగ నుపన్యసించిరి. వారు చేసిన ఆక్షేపణలలో ముఖ్యమైనదేమన ఆంధ్రమహాసభోద్దేశములలో ఆంధ్రరాష్ట్ర విషయము లేదనియు ఆంధ్రుల పురోభివృద్ధియే సామాన్యముగ వక్కాణించియుండుటచే తమవంటివారు సభలో పాల్గొనుట సంభవించెననియు, ముందు తెలుపకయే ఈతీర్మానము ప్రవేశపెట్టుట క్రమముగాదనియు వాదించిరి. రామచంద్రరావుపంతులు మొదలగువారు అమోఘమగు దేశసేవయొనర్చినవారగుటవలన వారి సమ్మతిగూడ సమకూర్చుకొనుట అవసరమని కూడ నయవచనములతో ప్రసంగించిరి. ప్రజాభిప్రాయము తెలుసుకొనకయే యిట్టి తీర్మానము చర్చించుట అసమంజసమని ఆక్షేపించిరి. తొలుతనే భేదాభిప్రాయములు చెలరేగుట వలన అపుడపుడే మొలకెత్తిన ఆంధ్రోద్యమము మాసిపోవునేమోయని మిక్కిలి భీతినొందితిని. కావున వాదోపవాదములు ముదరక మునుపే లేచి, ప్రజాభిప్రాయమును సమకూర్చుకొనకయే ఈతీరుమానమును ప్రవేశపెట్టుట సరికా దను వాదన సమంజసముగ నున్నదనియు, మనలో ప్రముఖుల యుద్దేశములను గూడ పాటింపవలసియున్నదనియు నుడివి, రాష్ట్రనిర్మాణము ఆంధ్రులపురోభివృద్ధికి అవసరమని నమ్మువాడనైనను అందు విషయమున ప్రజలలో ఆందోళనగావించి అంగీకారమును చేకూర్చుకొనుట యుక్తమనియే నేను నాఅభిప్రాయమును వెలిబుచ్చితిని. ఒక సంవత్సరకాలము ఇట్టి ప్రచారము దేశమంతట గావించి, మన ప్రముఖులనుగూడ సమ్మతిపరచి, ముందు సంవత్సరము ఈతీర్మానమును ప్రవేశపెట్టవచ్చునని పలికినమీదట సభలో నామాటలు అంగీకృతముగ గన్పడినందున ఆంధ్రోద్యమ స్థాయిసంఘమువారిని దేశమున ప్రచారముసల్పి ఏకాభిప్రాయమును సమకూర్చుడని కోరుచు తీర్మానము సవరణకాబడి మహాసభచే నంగీకరించబడెను.

1913 డిశంబరులో ఆంధ్రదేశములో రాయలసీమలో ప్రచారనిమిత్తము శ్రీ పట్టాభిసీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావుగార్లును నేనును ప్రచారసంఘముగా నేర్పడి పర్యటనజేయ నారంభించితిమి. నంద్యాలలో దేశపాండ్య సుబ్బారావుగారిని కలుసుకొని ఆయూరిలో మహాసభసమావేశపరచి ఉపన్యసించితిమి. పిమ్మట గుత్తి కేగితిమి. ఊరివెలుపల పెద్దసత్ర మొకటి కలదు. ఆసత్రములో మాకు భోజనమజ్జనాదులకు వసతిఏర్పరచిరి. గుత్తిలోపల ప్రవేశించుటకు ఇరుప్రక్కల నెత్తగు రాతిగోడలుగల పురాతన దుర్గ ద్వారముగుండ మెలికలుదిరిగి వెళ్ళవలసి యుండెను. మాతో దేశపాండ్య సుబ్బారావుగారు గుత్తికోట పట్టుకొనబోవుచున్నామని హాస్యవచనములు బల్కుచుండ మేము ఆపురమును జేరితిమి. ఆసాయంకాలమే మహాసభ సమావేశపరచబడెను. శ్రీ కేశవపిళ్ళెగారు అధ్యక్షతవహించిరి. ఆంధ్రుల పూర్వ వైభవమును, ఇప్పటి దుస్థితియు వర్ణించి, ఆంధ్రరాష్ట్రనిర్మాణావశ్యకము దాని ప్రయోజనములును వివరించుచు మాలో ఒకరివెనుక నొకరము ఉపన్యసించితిమి. కేశవపిళ్ళెగారు నయవచనములతో మమ్ము సన్మానించుచు పల్కి, మాఉపన్యాసములనుగూర్చి ముచ్చటించిరి. రాబోవు ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహించవలెనని కోరగా సంతోషముతో నంగీకరించిరి. మేము మరునాడు బయలుదేరి కడప, అనంతపురము, బళ్ళారి, హిందూపురముమొదలగు పట్టణములలో మహాసభలుగావించి ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి ప్రచారము చేసితిమి. బళ్ళారిలో లక్ష్మణస్వామి మొదలియారుగారు అధ్యక్షతవహించి మాఉపన్యాసమునందలి తెలుగుభాషనుమాత్రము ప్రస్తుతించి, ప్రత్యేక రాష్ట్రనిర్మాణవిషయమును పూర్ణముగ ఖండించిరి. ఇచ్చటతప్ప తక్కినచోట్ల ప్రజాభిప్రాయము అనుకూలముగనే యుండెను. కేశవపిళ్ళెగారు సానుభూతివచనములు పలికి, రాబోవుసభకు అధ్యక్షతవహించుటకు సమ్మతించినందున రాష్ట్రనిర్మాణవిషయమున అనుకూలురేయని యెంచి, పత్రికలకు వ్రాసితిమి. ఆయన వెంటనే తనయభిప్రాయము వ్యతిరేకముగ నున్నదని ప్రకటించిరి. ఇది మా కొకకొంత ఆశ్చర్యమును కల్పించెను. పిమ్మట పెనుగొండగ్రామమునకు బోయితిమి. శ్రీ శివశంకరపిళ్ళె యను నొకన్యాయవాది గుత్తిలో కేశవపిళ్ళెగారి వలెనే పలుకుబడి కలిగి, కాంగ్రెసువ్యవహారములలో నచట శ్రద్ధవహించుచుండెడివారు. వారితో పరిచయముచేసికొని నెల్లూరు జేరి అక్కడ మహాసభ సమావేశపరచితిమి. ఇచ్చటి ఆంగ్లేయవిద్యాధికులకును చిత్తూరులోనివారికిని చెన్నపట్టణమునం దభిమాన మెక్కువగానుండి, చెన్నపట్టణము ఆంధ్రములో చేర దనుతలంపుతో ఆంధ్రరాష్ట్రనిర్మాణముపట్ల వైముఖ్యముండెను. కాని సామాన్యజనుల అభిప్రాయము అనుకూలముగనే యున్నదని గుర్తించితిమి. తిరుపతి, చిత్తూరుపట్టణములందు దక్షిణాదిఅరవవైష్ణవులు, ఆంగ్లేయవిద్యాధికులు సహజముగ అరవదేశాభిమానులై యుండుటవలన వారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు వ్యతిరేకాభిప్రాయములు వెలిబుచ్చుచుండిరి.

2 బెజవాడ

__________

వేసవికాలము తిరిగివచ్చునప్పటికి బెజవాడలో రెండవ ఆంధ్రమహాసభ సమావేశమగునట్లు నిర్ణయించబడెను. బెజవాడలో శ్రీ పెద్దిబొట్ల వీరయ్యగారు, శ్రీఅయ్యదేవర కాళేశ్వరరావుగారు, అయ్యంకి వెంకటరమణయ్యగారు మొదలగు దేశాభిమానులు ఆంధ్రమహాసభను బాపట్లలోకంటె నెక్కువ వైభవముతో జరుపవలెనని కొన్నివేలరూపాయలు చందాలు వసూలుపరచి, పెద్ద పాక యొకటి సభాస్థానముగను, మరికొన్ని యితరపాకలు ప్రతినిధులనిమిత్తమును, వంటలు, భోజనముల నిమిత్తము మరికొన్ని పర్ణశాలలు నేర్పరచిరి. కాని తలవని