దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/శారదా నికేతన సంకల్పం
గారితో పరిచయ మప్పటినుండియే ప్రారంభమయ్యెను. 1911లో కాబోలును, నాకు వ్రణములేచి చాల ప్రమాదస్థితికి తెచ్చినది. అప్పుడు నాబ్రతుకు దుర్ఘటమని పలువురకు తోచెను. పట్టణములోని ప్రముఖులు పలువురు నన్ను జూచుటకువచ్చి యోదార్చుచుండిరి. నా విద్యాగురువగు యూలుదొరగారుకూడ నన్ను చూచి చాల సంతాపముపొందెను. దైవానుగ్రహమువలన ఆవ్రణము పక్వమైన పిదప సులభముగ శస్త్రముచేయుటతో నివారించినది.
శారదా నికేతన సంకల్పం
ఆ వేసవిలో గుంటూరునందుండజాలక వాడరేవులో మాబంధువులయింటికి బోయి వేసవికాలము గడిపితిమి. అప్పుడు వేటపాలెములో కాపురముచేయుచున్న లక్ష్మీనారాయణ అను నొక బ్రాహ్మణుడు అవివాహితుడు, కాంగ్రెసుసభలకు వచ్చుచు సాంఘికసంస్కరణాభిలాషిగా నుండి, ఆయూరి యూనియన్ వ్యవహారములలో, స్కూలువ్యవహారములలో జోక్యము కలిగించుకొని పనిచేయుచుండెను. ఆరోజులలో వేటపాలెములో రోమన్ కాతలిక్కులు మతప్రచారము నిమిత్తము ఒక ఆంగ్లేయ పాఠశాలను స్థాపించి, దాని నిమిత్తము ఊరివెలుపల ఎత్తైన స్కూలుభవనమును, చిన్న బంగళాయును మరికొన్ని చిల్లర కట్టడములను కట్టించిరి. రెండుమూడు చిన్న బావులు, పెద్ద దొరువులు త్రవ్వించి కొన్ని చెట్లు వేయించి ఆప్రదేశమును రమణీయము గావించిరి. కొన్నిసంవత్సరములు గడచినపై వారి మతప్రచారము సన్నగిలిపోయెను. అంతట ఆస్కూలుభవనమును బంగళాను, దానిచుట్టునున్న స్థలమును బేరముపెట్టిరి. దూరమున ఊరివెలుపల నుండుటచేతను స్మశానభూమిసమీపమున నుండుటచేతను ఆభవనములపై నెవ్వరికిని వ్యామోహము కలుగలేదు. లక్ష్మీనారాయణగారు నావద్దకు వచ్చి ఆభవనములు స్వల్పధరకు లభించునని తెలిపిరి. అంతకుమునుపే పునహాపట్టణములో కార్వేపండితులు స్థాపించిన ట్లొక మహిళావిద్యాలయము స్థాపనచేయవలె నను ఆశయము నాహృదయమున నుండెను. ఈభవనము లందుకు ఉపయోగించు నని ఎంచితిని. తుదకు నాలుగువేలరూపాయలకు విక్రయించుటకు మిషనరీలు సమ్మతించిరి. నేను గుంటూరుబ్యాంకులో అప్పుతీసికొని వారికి చెల్లించి, క్రయదస్తావేజు రిజిష్టరుచేయించుకొంటిని. ఆభవనములు మొదలగు వానిని చూచుచుండుటకు లక్ష్మీనారాయణగారినే విచారణకర్తగా నేర్పరచి, ఆతోటలో చెట్లకు నీళ్ళుపోసి పెంచుట కొక తోటమాలిని నియమించితిని.
పిమ్మట లక్ష్మీనారాయణగారిని వెంటబెట్టుకొని పునహా పట్టణములో మహిళావిద్యాలయమును దర్శించి, కార్వేపండితులతో ముచ్చటించి, విద్యాలయము నదుపుటనుగూర్చి వారి సలహా పొందితిని. వారు నాప్రయత్నమునకు మిక్కిలి సంతసించిరి. వారి విద్యాలయములో శిక్షితమైన సమర్ధురాలి నొకరిని మావిద్యాలయప్రధానగురుస్థానము వహించుటకు పంపవలెనని కోరితిని. వా రందుకు సమ్మతించిరి. ఆసమయముననే ఫర్గూసన్ కళాశాలను దర్శించి, ప్రధానాచార్యులైన పరంజేపే గారిని కలుసుకొని, సంభాషించితిని. అఖిలభారతసేవాసంఘము నకు బోయి అచ్చట నున్నవారితో ముచ్చటించితిని. అపుడు గోక్లేగా రచట లేరు. కార్వేగారు విద్యార్థి భోజనశాలలో మాకొరకు విందుగావించిరి. పళ్ళెములలో భోజనముచేయుట వారికి ఆచారము. మనము పెండ్లిరోజులలో వియ్యాలవారి విస్తళ్ళచుట్టు మ్రుగ్గులువేసి ఊదుబత్తీలు వెలిగించినట్లు పళ్ళెములచుట్టును మ్రుగ్గులువేసి ఊదుబత్తీలు వెలిగించిరి. ఇట్టి మర్యాదలను వారిచేనంది వారు కట్టించిన మహిళాకళాశాలా భవనము, వితంతుశరణాలయము, భోజనవసతిగృహములు మొదలగు కట్టడములు దర్శించి, వాని కొఱకు లక్షలకొలది ద్రవ్యమును వసూలుచేసి విద్యాదానముచేసి స్త్రీల అభ్యున్నతి నిమిత్తము అనన్యమగు కృషిసల్పిన మహాత్యాగియగు కర్వేపండితుని సెలవు పుచ్చుకొని మరల గుంటూరు చేరితిమి.
పునహాపట్టణములో శ్రీమహాదేవగోవిందరేవడేగారి భార్య వారిగృహమునే విద్యాశాలగ మార్చి, వయస్సువచ్చిన గృహిణులకును వితంతువులకును సామాన్యవిద్యతో పాటు ఎంబ్రాయిడరీ, లేస్ మొదలగు చేతిపనులను నేర్పుచుండిరి. మేము ఆసంస్థను దర్శించినపుడు రేవడేగారిభార్య కందుకూరి వీరేశలింగముపంతులుగా రుండిన తెలుగుదేశమువారు మమ్ము శ్లాఘించుట ఎంతమాట" యని పంతులుగారిని ప్రశంసించెను. పిమ్మట శ్రీ పండితభండార్కరుగారి యింటికి బోయి వారినిగూడ సందర్శించితిమి. వారు మాతో ముచ్చటించుచు "మీప్రాంతము నుండి వేదపండితుడు లిచ్చటికి వచ్చుచుండెడివారు ఇప్పు డెవ్వరు నంతగ గానుపించుటలే" దని వక్కాణించిరి. వారిసంఖ్య తగ్గిపోవుచున్నదని మేము బదులు చెప్పితిమి. విద్యాధికులగు యువకులు కొందరు అచట చేరి కావించుచున్న చారిత్రాత్మక పరిశోధనలనుగురించి వారు మాకు తెలియజెప్పిరి.
ఈమధ్యకాలములో చెన్నపురిశాసనసభలో నొక విచిత్రోదంతము నడిచెను. గుంటూరు, నెల్లూరుజిల్లాలలో మెట్ట భూములు వర్షాభావముచే ఫలించక ప్రజలు మాటిమాటికి క్షామబాధచే పీడితులగుచుండుటచే కృష్ణానదికి గుంటూరుజిల్లాలోని తెలుకుట్లగ్రామమునకు దిగువను ఆనకట్టకట్టి అక్కడనుండి కాలువలు త్రవ్వి, పినాకినిపంటకాలువలలో కలిపి, రెండుజిల్లాలును సుభిక్షముగావించుటకు "కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు" అనుపేరుతో నొకసన్నాహము ప్రభుత్వము సాగించెను. చాల విమర్శలు జరిగినపిమ్మట ఏడుకోట్లరూపాయలు దాని వ్యయమునకు నిర్ణయింపబడెను. ప్లానులు అంచనాలు అంగీకృతములై పనులు కొలదిదినములలో ప్రారంభింతురని ప్రజలు ఉవ్వెళ్లూరు చుండిరి. ఇట్టిసమయమున దక్షిణమున మెట్టూరుదగ్గర కావేరినదిమీద ఆనకట్టకట్టుట కొక ప్రణాళిక నాలుగుకోట్లరూపాయల వ్యయముతో సిద్ధముగానున్నదిగావున ముందు దానినిపూర్తిచేసి ఆమీద హెచ్చుఖర్చులు పెట్టవలసిన కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు సాగించవచ్చునని చెన్నపురిశాసనసభలో తీర్మానించబడినది. అప్పుడు పానుగల్, బొబ్బిలిరాజాగార్లు మొదలగు జస్టిసుపార్టీ ప్రముఖులు ఆంధ్రులై యుండియు దాక్షిణాత్యులకు లోబడిరి. మెట్టూరు నాలుగుకోట్లనుకొన్నది పదునాలుగుకోట్లకు మించివ్యయమైనను సాగినది. కృష్ణారిజర్వాయరుప్రాజెక్టు మూలబడి పోయినది.