Jump to content

దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు మునిసిపాలిటీ

వికీసోర్స్ నుండి

గుంటూరు మునిసిపాలిటీ

ఈ యుదంతము జరిగినపిమ్మట కొలది దినములకు అరండల్ పేటలో నెలకు రు 30/- ల అద్దెకొకయింటిలోచేరితిమి. ఈ యింటికి మిక్కిలి సమీపమున నామిత్రులు న్యాపతి హనుమంతరావుగారు క్రొత్తగా కట్టుకొనిన యింటిలో కాపురము చేయుచుండిరి. వారు యం. ఏ పరీక్షయందుకృతార్థులై సెకండరీప్లీడరుపరీక్ష నిచ్చి గుంటూరు డిస్ట్రిక్టుమునసబుకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచుండిరి. న్యాపతివారిది వ్యాపారులలో పేరుపొందినకుటుంబము. ఆస్తి నానాటికి తీసికట్టయినను వీరినాటికి నలుబది యకరముల ఫలవంతమైన భూస్థితి యుండెను. వీరు స్వభావముచే చాల శాంతులు. వీరియింట పలువురు పేదవిద్యార్థులు నిత్యమును భోజనముచేయుచుండిరి. దివ్యజ్ఞానసమాజములో వీరు సభ్యులు. ఆసిద్ధాంతములను ఆచరణలో పెట్టవలెననుశ్రద్ధవీరికి హెచ్చు. ఇంచుక పరిచయము గలవా రెవ్వరెదురుపడినను (Brother) సోదరా ! యని ఇంగ్లీషుతో సంబోధించి కుశలప్రశ్నలడిగి సంభాషించిననేగాని వదలెడివారు కారు. దివ్యజ్ఞాన సమాజ సంబంధపు బను లేవి వచ్చినను బాధ్యతబూని నిర్వహించుచుండిరి. గ్రామగ్రామము తిరిగి సొమ్ము ప్రోవుచేసి సమాజమందిరనిర్మాణము గావించిరి. పట్టణములో ప్రజలకు వీరియెడ మిక్కిలి అనురాగగౌరవములు గలవు.

పట్టణపరిపాలకసంఘములో సభ్యులై వీరు శ్రద్ధగా తమ విధుల నెరవేర్చుచుండిరి. నేను వీరి యింటిసమీపమున చేరిన పిదప అగ్రహారపుసభ్యత్వము ఖాళీఅయినందున దానికి నన్ను అభ్యర్థిగా నిలుమని ప్రోత్సహించి కృషిసల్పిరి. అగ్రహారములో చాలమంది వైశ్యవర్తకులు వోటర్లుగా నుండుటచే ప్రత్యర్థియైన వైశ్యప్రముఖుడే జయమునొందెను. కొలదికాలమునకు అరండల్‌పేట స్థానము ఖాళీ పడినది. అంతకుమున్ను సభ్యులుగా నున్న ఏకా రామయ్య పంతులుగారు మంచి పలుకుబడికలవారు. నాయడ అభిమానముగలవారు. నన్ను తమస్థానమున నుండుమని ప్రోత్సహించిరి. అందుకు సమ్మతించి అభ్యర్థిగ నిలచితిని. ప్రత్యర్థు లెవరును లేరుగాన సభ్యత్వము సుకరముగ లభించెను. శ్రీ పి. వెంకటరెడ్డిగా రను వైశ్యులు మునిసిపల్‌సంఘమునకు అధ్యక్షుడుగ నుండిరి. ఆయన గుంటూరు క్రైస్తవకళాశాలలో ఉపాధ్యాయులు. అంతకుముందు వైశ్యు లెవ్వరు నాపదవి నలంకరించలేదు. కాబట్టి పలువురు పట్టుబట్టిఆస్థానము ఆయనకు లభింపచేసిరి. ఆ ప్రయత్నమున నేను కొంత పాల్గొంటిని. న్యాపతి హనుమంతరావుగారు సహాయాధ్యక్షులుగా నెన్నుకొనబడిరి. హనుమంతరావుగారు సహజశ్రద్ధతో పనులు నిర్వహించుచుండిరి. రానురాను వెంకటరెడ్డిగారు ఇతరవ్యాసంగములలో బడి అధ్యక్షధర్మముల నుపేక్షచేసిరి. మునిసిపాలిటీపనులు చాల దురవస్థలోనికి వచ్చెను. ప్రభుత్వము మునిసిపాలిటీని ఏల రద్దుచేయకూడదో సంజాయిషీ ఇయ్యవలసినదని ఉత్తరువుచేసిరి. ఆసందర్భమున హనుమంతరావుగారు ఛైర్‌మన్ డెలిగేటుగా నియమింపబడిరి. అప్పుడు నేను సహాయాధ్యక్షపదవికి సంబంధించినపనులు నెరవేర్పవలసివచ్చెను. ఈమార్పు లన్నియు ప్రభుత్వపు టుత్తరువు వచ్చుననగా ఏర్పడినను లోగడకాలమున జరిగినలోపము లన్నిటికిని మేమే బాధ్యులమైనట్లు తెలియనివారు తలంచుటయే గాక మాకాలములోనె మునిసిపాలిటీ రద్దుపరచబడిన దను అపకీర్తి పొందవలసివచ్చునేమో యను భయము మాకు కలిగెను. మునిసిపల్‌రికార్డులు పరిశీలించినయెడల రద్దుపరచవలసినంత దోషములు కనుపడవు. కావున లోగడ రికార్డు లన్నియు చదివి, ప్రభుత్వముచేసిన యాక్షేపణల కన్నిటికి సమాధానములతో నివేదిక వ్రాయవలసిన బాధ్యత నాపై బడుటచే కొన్నిదినములు తదేకదీక్షగా నివేదిక తయారుచేసితిని. అప్పుడు గుంటూరు డిప్యూటీ కలెక్టరుగా నున్న శ్రీ జయంతి రామయ్యపంతులుగారు మాకు విశేషముగ తోడ్పడిరి.

ఈ జయంతి రామయ్యపంతులుగారు న్యాయదృష్టియు సమర్ధతయుగలవారు. శాసనములు చదువుటయందు సమర్ధులు. ఆంధ్రసాహిత్యమునెడ దేశచరిత్రమునందు మిక్కిలి అభిమానము కలవారగుటచే తాము ఉద్యోగము చేసిన జిల్లాలలో శాసనములను బయలుపరచి వాని ప్రతులను ఆర్కియాలజికల్ శాఖకు పంపుచుండిరి. ఆంధ్రసాహిత్యసంఘమునకు కొంతకాలము అధ్యక్షులుగ నుండిరి. శ్రీ పిఠాపురముసంస్థానాధీశులు సాగించిన ఆంధ్రనిఘంటుప్రయత్నమున వీరే ప్రోత్సాహకర్తలు. ఆనిఘంటు విచారణకర్తలుగా గూడ నుండిరి. చెన్నపురిప్రెసిడెన్సీమాజస్ట్రేటుగా గూడ పనిచేసిరి. వీరు ఆంధ్రదేశములో పేరెక్కిన ప్రముఖులు. వారు నాయెడ కొంత అభిమానము జూపుచుందిరి.

నేను తయారుచేసిన నివేదికను రామయ్యపంతులుగారు బలపరచుచు ప్రభుత్వమునకు నివేదిక పంపుటతో ప్రభుత్వము సమాధానముచెందెను. మునిసిపల్ వ్యవహారములు మామూలుగ నడచిపోయెను. ఛైర్‌మన్ వెంకటరెడ్డిగారు చాలకాలము రోగపీడితులుగా నుండి చనిపోయిరి. ఇట్లు ఖాళీపడిన ఛైర్‌మన్ పదవికి నేను నిలువవలెనను కోర్కె జనించెను, గాని హనుమంతరావుగారికి ఆపదవియెడల విశేషవ్యామోహము కలిగియుండుటచే నేను నాకోర్కెను విడనాడి, ఆయన యుండుటయే యుక్తమని తలంచితిని. తుదకు "పొగాకునాయుడుగా" రని పేరుపొందిన యతిరాజులునాయుడుగారు ఛైర్‌మన్‌గా అధికసంఖ్యాకులచే నెన్నుకొనబడిరి. ఆకాలములోనే శ్రీ. ఎస్. శ్రీనివాస శాస్త్రిగారు గుంటూరువచ్చిరి. వీరు తర్వాత (Servants of india society) అఖిలభారత సేవాసంఘమునకు అధ్యక్షులై గొప్ప గౌరవము బడసి, సర్, రైటి ఆనరబిల్ బిరుదములు బడసిరి. వీరు తిరువళ్ళిక్కేణిహైస్కూలులో ప్రధానోపాధ్యాయులుగా నున్నకాలములో శ్రీ గోపాలకృష్ణ గోక్లేగారు వీరి ఆంగ్లేయభాషాపాండిత్యమును లోకవిషయపరిజ్ఞానమును, అసమానమగు వక్తృత్వశక్తిని గమనించి తాము స్థాపించిన అఖిలభారత సేవాసంఘములో సభ్యులుగా చేరునట్లు ప్రోత్సాహించిరి. ఆదినములలోనే గుంటూరుకు వచ్చి రెండుమూడు దినములు మాయింటనే అతిధిగా నుండిరి. అప్పుడు వారి గౌరవార్ధ మొక అల్పాహారవిందు నేర్పాటుచేసి న్యాయవాదులలో ప్రముఖులగువారి నందరిని పౌరనాయకులను సమావేశపరచితిని. అప్పుడు శాస్త్రిగారు ఉపన్యాసములో నన్నుగూర్చి ప్రశంసించుచు మునిసిపాలిటీలో నన్ను సభ్యునిగా నెన్నుకొని నాచే సేవచేయించుకొనుట యుక్తమని వక్కాణించిరి. నాకు శాస్త్రి గారితో పరిచయ మప్పటినుండియే ప్రారంభమయ్యెను. 1911లో కాబోలును, నాకు వ్రణములేచి చాల ప్రమాదస్థితికి తెచ్చినది. అప్పుడు నాబ్రతుకు దుర్ఘటమని పలువురకు తోచెను. పట్టణములోని ప్రముఖులు పలువురు నన్ను జూచుటకువచ్చి యోదార్చుచుండిరి. నా విద్యాగురువగు యూలుదొరగారుకూడ నన్ను చూచి చాల సంతాపముపొందెను. దైవానుగ్రహమువలన ఆవ్రణము పక్వమైన పిదప సులభముగ శస్త్రముచేయుటతో నివారించినది.

శారదా నికేతన సంకల్పం

ఆ వేసవిలో గుంటూరునందుండజాలక వాడరేవులో మాబంధువులయింటికి బోయి వేసవికాలము గడిపితిమి. అప్పుడు వేటపాలెములో కాపురముచేయుచున్న లక్ష్మీనారాయణ అను నొక బ్రాహ్మణుడు అవివాహితుడు, కాంగ్రెసుసభలకు వచ్చుచు సాంఘికసంస్కరణాభిలాషిగా నుండి, ఆయూరి యూనియన్ వ్యవహారములలో, స్కూలువ్యవహారములలో జోక్యము కలిగించుకొని పనిచేయుచుండెను. ఆరోజులలో వేటపాలెములో రోమన్ కాతలిక్కులు మతప్రచారము నిమిత్తము ఒక ఆంగ్లేయ పాఠశాలను స్థాపించి, దాని నిమిత్తము ఊరివెలుపల ఎత్తైన స్కూలుభవనమును, చిన్న బంగళాయును మరికొన్ని చిల్లర కట్టడములను కట్టించిరి. రెండుమూడు చిన్న బావులు, పెద్ద దొరువులు త్రవ్వించి కొన్ని చెట్లు వేయించి ఆప్రదేశమును రమణీయము గావించిరి. కొన్నిసంవత్సరములు గడచినపై వారి