దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/సొంతవ్యవహారములు
కృష్ణాజిల్లాకాంగ్రెసుసంఘమునుండి విడిపోయి, గుంటూరుజిల్లాలోని కాంగ్రెసువాదులు గుంటూరుజిల్లాసంఘము ప్రత్యేకముగ నేర్పరచవలెనని ఉద్యుక్తులగుచుండిరి.
సొంతవ్యవహారములు
ఒకనాడు పాతగుంటూరు వెళ్లునప్పటికి నాతమ్ములిరువురును బిగ్గరగ అరచుచు తగవాడుచుండుటయేగాక ఒకరినొకరు కొట్టుకొనబోవుచుండిరి. నే నప్పు డిరువురను విడిపించి అట్లు బజారున బడుట అవమాన మని చెప్పి శాంతింపజేసితిని. కాని వారిరువురమధ్య సరిపడక మధ్యమధ్య తగవులాడుచునేయుండిరి. వారి భార్యలమధ్య మనస్పర్ధ లేర్పడెను. మా తండ్రిగారికి వీరిర్వురు నొకచోట కాపురముచేయజాల రని తోచెను. కుటుంబపు టాస్తిని పంపకముచేసి వేరింటికాపురములు పెట్టుటకు నిర్ధారణచేసుకొనిరి. "నీ వేమనియెద" వని నన్ను ప్రశ్నించిరి. నేను వారితో నేకీభవించితిని. భాగములు పరిష్కరించుటకు నా భార్యమేనమామగారైన మద్దులూరి సీతారామయ్యగారిని పిలిపించవలసినదని వారు సెలవిచ్చిరి. నా తమ్ముని భార్య నా భార్యకు పెదతల్లికుమార్తెయే గాన సీతారామయ్యగారు నాచినతమ్మునకు అనుకూలురే. పెదతమ్ముడు సూర్యనారాయణ చిన్నవానికంటె కొంతపరిజ్ఞానము కలవాడు కాన సీతారామయ్యగారి మధ్యవర్తిత్వము నంగీకరించెను. కుటుంబపు టాస్తిలో నాకు భాగము పంచనక్కరలేదు, తమ్ము లిరువురకే సమముగా పంచివేయవలసినదని మాతండ్రిగారితో చెప్పితిని. వా రందుకు సమ్మతించక తమ ఆస్తిలో నేను భాగము తీసికొనితీరవలెనని పట్టుపట్టిరి. నేను స్వార్జితముగా సంపాదించిన సొమ్ముగూడ ఆస్తి మొత్తములో చేర్చి యావదాస్తియు మూడు భాగములుగా పంచవచ్చునని సీతారామయ్యగారిచే నాకు తమ అభిప్రాయము తెలిపిరి. అందుకు నేను సమ్మతించితిని. వన్‌లైఫు ఇన్సూరెన్సు కంపెనీవలన నాకు రెండుసంవత్సరములలో రానున్న రు 3000/- లును, ఏలూరు జ్యూట్‌మిల్లులో భాగములు వెల రు 1000/- లును, మరి యితరబాపతులు కలసి నాయాస్తి రు 6000/- ల మొత్తముతేలెను. ఆమొత్తముతో యావదాస్తి రు 30000/- లుగా నిర్ధారణచేసిరి. ఒక్కొక్కరికి రు 10000/- ల చొప్పున భాగనిర్ణయము గావించిరి. ఇందు కుటుంబముతాలూకు ఇల్లు నాభాగమునకే చేర్చిరి. ఇంటియావరణమునకు తూర్పువైపున నున్న ఖాళీస్థలమును అందున్న పంచపాళీయు నా పెదతమ్ముని కిచ్చిరి. నాచినతమ్మునకు ఒక ఖాళీస్థలమును, ఇంటిక్రింద కొంతసొమ్ము నేను ఇచ్చులాగున నిర్ణయముచేసిరి. భూములుమాత్రము ఉత్తమమధ్యమములు నిర్ణయించి పంచిపెట్టిరి. రుణములు వసూలుపఱచి, వచ్చినసొమ్ములో ఎప్పటి దప్పుడు భాగముల వరుస తీసుకొనుచుండులాగున ఏర్పరచి, బాకీలు వసూలుచేయు బాధ్యత నాపై నిలిపిరి. ఇతరగ్రామములలోని భూములు జాయింటుగానే ఉంచుకొని, అయివేజుమాత్రము సమానభాగములుగా ప్రకృతమునకు పంచుకొనులాగున వీలువెంబడి అవియును పంచుకొనునట్లు నిర్ణయించిరి. మాతండ్రిగారు వెయ్యిరూపాయల బాకీ యొక్కటీ వారిక్రిందనే యుంచుకొనిరి. నాభాగమునకు వచ్చినయింటిలో నాచిన్నతమ్ముడు కాపురముండెను. పిమ్మట తనస్థలములో డాబాయిల్లు కట్టుకొనెను. అది కట్టుకొనుచుకూలీలకు సొమ్ముచెల్లించవలసినపుడు నాయొద్దకు వచ్చి, ఆసొమ్ము నిమ్మనికోరుచుండెను. నే నప్పుడు విరివిగ సంపాదించుకొనుచుంటిని గాన అడ్డుచెప్పక ఇచ్చుచువచ్చితిని. ఆప్రకారము సుమారు వేయిరూపాయలవరకు తేలెను. నే నది మరల పుచ్చుకొనవలె నను అభిప్రాయముతో నియలేదు. భూముల విచారణ నేనే జరుపవలసివచ్చెను.
అయిలవరములో మాతండ్రిగారు ఆయూరి ఆచార్యుల వారికి పెట్టిన రుణముక్రింద మాకు కొంతభూమి సంక్రమించెను. ఆ ఆచార్యులు దుర్వ్యసని. మానాయనగారు వారి వర్తనము విచారింపక వడ్డీకి ఆశపడి సుమారు రు 6000/- ల వరకు రుణముపెట్టిరి. అంత మొత్తమునకు ప్రామిసరీనోట్లుమాత్రమే వ్రాయబడియుండెను. ఇది యంతయు నేను బందరులో నున్నకాలమున నడిచినది. మాతండ్రిగారికి ఈబాకీ రాబట్టుట కష్టసాధ్యముగ తోచి నేను గుంటూరు వచ్చినపిమ్మట నాకు తెలుపుటచే నేను ఆచార్యులగారి గ్రామమునకు వెళ్ళి విచారించగా ఆయన మాతండ్రిగారిచే బాకీ పెట్టించిన ఒక ఆసామీకి స్వాధీనుడై వర్తించుచున్నాడని తెలిసినది. ఆయనతాలూకు భూమి ధూళిపూడిలో నొకవర్తకునకు తాకట్టుపెట్టినట్లుగూడ తెలియ వచ్చినది. ఆచార్యులుగారు ముఖముతప్పించుచు కనపడకుండెను. ఆయనతల్లిగారిని పిలిపించి ఆమెతో చెప్పియు, స్నేహితుడైన ఆసామీసహాయముతో ఆచార్యులవారిని రప్పించియు, మరి కొంత సొమ్ము తల్లిగారికిని ఆచార్యులగారికిని ఇచ్చునట్లు ఏర్పా టుచేసుకొని, వారి కుటుంబముతాలూకు భూములు విక్రయము వ్రాయించుకొనుట సంభవించెను. దస్తావేజు మాఅన్నదమ్ములు ముగ్గురిపేరను రిజిష్టరుచేయించబడెను. ఇట్లు వ్యవహారము పూర్తియైనపిమ్మట ఆచార్యులవారిభార్యయు, ఆమెతండ్రియునువచ్చి, జీవనముజరుగుట దుర్లభముగ నున్నదని చెప్పి ఆమెకు మనువర్తి రావలసియున్నదని పేచీలుపెట్టసాగిరి. భర్త దుర్వ్యసనియై, ఆమె జీవనమునకు తండ్రిగారి యిల్లు చేరవలసిన దుస్థితి కలుగుట గుర్తించి ఆమెకును కొంత సొమ్మిచ్చి, సమాధానపరచి పంపితిని. అప్పటి ధరలనుబట్టి ఇది దండుగవ్యవహారముగనే కనుబడెనుగాని అల్లరిపాలుగాకుండ వచ్చినంతవరకే చాలునని సంతుష్టిచెంద కల్గితిమి. ధూళిపూడిఆసామీకి ఇవ్వవలసిన తాకట్టుబాకీ క్రమేణ మేమే చెల్లించితిమి. ఈ పరిష్కారము 1908లో మేము పంపిణీలు చేసుకొని పారీఖత్తు రిజిష్టరుచేసుకొన్నపిమ్మటనే జరిగెను. కనుక ఈభూమియు జాయింటుగనే యుండి అయివేజుమాత్రము మూడుభాగములుగా పంచుకొనుచుంటిమి.
ఈ 1908 లోనే నేను మాతండ్రిగారితోడను నాసంసారముతోగూడ కాశీయాత్రకు వెళ్ళి, కాశీ గయా ప్రయాగ జగన్నాధాది తీర్థస్థానములనుదర్శించివచ్చితిని. మాతండ్రిగారి కప్పటికి డెబ్బదిఎనిమిది సంవత్సరములున్నను ఆ తీర్థయాత్రలయందలి భక్తిచే ఆయాస మనుకొనక నదులలో స్నానములుచేయుచు ఎంతదూరమైనను కాలినడకనే పోవుచు శ్రద్ధతో దేవసందర్శనములుచేయుచు మిక్కిలియోపికతో తిరిగిరి. 1909లో రామేశ్వరమునకు బోతిమి. శ్రీరంగము ముక్కోటిఏకాదశినాటికి చేరితిమి. రేపకడనే చేచి స్నానములుచేసి రంగనాధదేవాలయమునకు పోయి, ద్వారదర్శనము చేయగలిగినందుకు మాతండ్రిగారు మిక్కిలి సంతసించిరి. స్వామిని ఎంత దర్శించినను తృప్తిలేకుండెను. ఎవ్వరో యొక ఉదారపురుషుడు ఆయనను తన చేతులతో పట్టి లేవనెత్తి దర్శనము చేయించెను. రామేశ్వరములో పదిదినములు నిలచితిమి. ఒకనాడు మధ్యాహ్నము భోజనమైనపిదప ఆ రామేశ్వరము దీవియగుటవలన మే మున్న తీరమువైపుగాక మరియొక తీరమువైపు పోవలెనని యుద్దేశించి యొంటరిగనే ఒక రోడ్డువెంట నడువసాగితిని. కొంతదూరము పోయినపిదప నొక ప్రక్కను చెట్లు గుబురుగా నున్న యడవి కనుపడెను. అం దొక కాలిదారిని బట్టి కొంతదవ్వు పోవునప్పటికి గొప్పయెడారి పొడసూపెను. అందు పెద్ద యిసుకతిన్నెలు గానవచ్చెను. అం దొక తిప్ప నెక్కి నలుప్రక్కలు బరికింప మానవు లెవ్వరును గానరారైరి. అప్పటికి భానుబింబము పశ్చిమాద్రిని గ్రుంకుచుండెను. దూరమున శ్రీ రామేశ్వరదేవాలయశిఖరము బంగారు రేకులు పొదగబడియున్నందున ఆసాయంసంధ్యాతపమున తళతళమెరయుచుండెను. ఆయెడారిలో నిర్జనప్రదేశమున నేకాంతముగ నుండుటచే కొంచెము గుండె జంకుబారెను. గాని అంతలో దైర్యము బూని సర్వత్ర వ్యాపించియున్న పరమేశ్వరుని ధ్యానించి పరవశుడనై బిగ్గరగ "దేవా పరమేశ్వరా" యని పిలిచి నమస్కరించి సంతసించితిని. అంతట తృటికాలమున కలిగిన ఆనందానుభవమును జ్ఞాపకముతెచ్చుకొనుచు వచ్చిన దారినే అడవిలో నడిచి బసకు చేరితిని. అపూర్వమగు ఆ మహదానందమును నేను పిమ్మట రచియించిన "శ్రీవేంకటేశ్వరానందలహరి" యను పుస్తకములో వర్ణించితిని. 1908 కి ముందే రాయప్రోలు వెంకటరమణయ్యశాస్త్రిగారు అనగా రాయప్రోలు యజ్ఞనసోమయాజులుగారి తండ్రిగారు నాకు చిరపరిచయులుగానున్నందున నొకదినము నాయొద్దకువచ్చి నీకు భగవద్గీత భాష్యముతోగూడ చదివిచెప్పవలె నను సంకల్పము కలదనిరి. నేను మిక్కిలి సంతోషముతో చదివెద నని నుడివితిని. ఉదయమున 6 గంటలకే లేచి స్నానమాడి మడివస్త్రము ధరించి పూజాద్రవ్యములతో సిద్ధముగా నుండవలెననియు తా నప్పుడు వచ్చి, యొకగంటకాలము భగవద్గీతాపఠనము గావించెదననియు చెప్పిరి. అప్పటికి నాకు పుట్టినపిల్లలలో మొదటపుట్టిన ఆడపిల్లమాత్రమే మిగిలియుండెను. ఈగ్రంధకాలక్షేపమున నీకు సత్సంతానప్రాప్తికలుగునని శాస్త్రిగారు వాక్రుచ్చిరి గాని నాకు అట్టి విశ్వాసము లేకపోయినను భగవద్గీతాపాఠము అవసరమును యుక్తము నని తలంచి వారు నియమించిన ప్రకారము ప్రతిదినము ఉదయమున ఆనందగిరిభాష్యముతో గూడిన గీతాగ్రంధము నొక పీటమీదపెట్టి పూజించి, పిమ్మట ఉపనిషత్తులందలి ప్రథమశ్లోకములుపఠించి, గీతాశ్లోకములను భాష్యముతో గూడ చదువుచుంటిమి. ఆప్రకారము పదునెనిమిదిఅధ్యాయములు చదివి ముగించినపిదప నొకరోజున సమారాధనచేసి శాస్త్రిగారిని వారి భార్యగారినిగూడ బిలిచి, నూత్నవస్త్రము లొసగి, గురుదక్షిణయు నిచ్చితిని.
కొంతకాలమునకు బిమ్మట నాభార్య ఆడశిశువును గనెను. భగవద్గీతాపఠనమున శ్రద్ధావిహీనుడగుటచే ఆడశిశువు కలిగినదని శాస్త్రిగారో వారిభార్యగారో యనినట్లు గాలివార్త యొకటి వింటిని. ఒకరోజున ఆ శిశువు ఇంచుక జబ్బుచేసి పొట్ట ఎగురవేయుచున్నందున సమీపమున నున్న ఆయుర్వేదవైద్యుని పిలిపించి చూపించితిని. సదాపాకు తెప్పించి, రసముతీసి పొంగించి ఇచ్చినచోలతగ్గగలదని సలహాయిచ్చెను. ఇంతలో నెవ్వరోచెన్నపట్టణమునుండి కాంగ్రెసునిమిత్తము చందాలు వసూలుచేయుటకు వచ్చి, నన్ను కలుసుకొని, తన్ను గృహస్థులయొద్దకు తీసుకొని వెళ్లుమని కోరినందున నేను వారిని వెంటబెట్టుకొని యూరిలోని కేగితిని. ఇంటికి వచ్చునప్పటికి పదిగంటలు మిగిలినది. పిల్ల ఆడుకొనుచున్నదిగాని పొట్టమాత్రము ఎగురవేయుచునేయున్నది. ఉదయమున వైద్యుడు చెప్పినవైద్యము చేయకపోతినని కొంత వ్యాకులము నొందితిని. ఇంతలో డాక్టరు కుగ్లరుదొరసాని వచ్చెను. నాభార్యకును ఆమెతో చాల పరిచయముగలదు. మాయెడల ఆమె స్నేహభావముతో మెలంగుచుండెను. ఆమె లోపలకు వచ్చినతోడనే పిల్లనుచూపించితిని. "నేను పిల్లను తీసికొనివెళ్లి చికిత్సచేసి మరల ఇప్పుడే పంపెద"నని తల్లినిగూడ తనబండిపై కూర్చుండబెట్టుకొని ఆస్పత్రికి తీసికొనివెళ్ళెను. పిల్లతో నాభార్య మరలివచ్చునుగదా యనుకొంటినిగాని ఎంతకాలముచూచినను రాలేదు. సాయంకాలము ఆరుగంటలవరకు చూచి ఆస్పత్రికి పోవునప్పటికి ఒకగదిలో పిల్ల ఒక తొట్టెలో పండుకొనియున్నది. దగ్గర కూర్చున్న తల్లి కండ్ల నీరు గార్చుచు దు:ఖపడుచున్నది. పిల్ల స్పృహతప్పియున్నది. పిల్లకు చికిత్సచేయుటలో ఆకురాతితో పండ్లురాచిరట. రక్తము కారినది. దానిమీద వాతముగ్రమ్మి పిల్ల యిట్టి దుస్థితికి వచ్చినదని తల్లి చెప్పినది. ఆగదిలో మరెవ్వరును లేరు. కుగ్లరు మొదలగువా రందరు ప్రార్థననిమిత్తము చర్చికి వెళ్లిరని తెలిసినది. కొంతతడ వైనపిమ్మట కుగ్లరుదొరసానివచ్చి పిల్లకు ఏదో ఔషధమిచ్చెను. ఆరాత్రి యంతయు పిల్లను తనయొడిలో బెట్టుకొని ఆమె చాల వ్యధనొందినది. మేము దు:ఖముతో ఏమగునో యను భయము పొందితిమి. ఆమె పిల్లనిమిత్తము ఈశ్వరప్రార్థనచేసి "నీచిత్తము నెరవేరుగాక" యని ముగించెను. పిల్ల బ్రతుకు నను ఆశ లేనట్లే కనబడెను. కాని ఆమె పిల్లను తెల్లవారువరకు తన తొడపై నిడుకొనియే మావలెనే వ్యాకులచిత్తముతో బాధపడుచుండెను. తెల్లవారినపిమ్మట "ఇక పిల్ల బ్రతుకనేరదు గాన తీసుకవెళ్లవలసిన"దని చెప్పుచు, ఇంకను ప్రాణముండుటచే ఆవరణలో ఇంచుక పెడగా నున్న యింటిపంచలో పెట్టుకొనవచ్చు నని డాక్టరుగారు చెప్పిరి. అప్పటికి మాతండ్రిగారు మొదలగు బంధువులు వచ్చి చేరిరి. పిల్ల యింకను ప్రాణముతోనే యుండినందున మరల డాక్టరుగారు తనంత తానే వచ్చి పిల్లను ఆస్పత్రికి కొనిపోయి ఏదో చికిత్స కొంత చేసెను. మధ్యాహ్నమువేళకు పిల్ల చనిపోయినది.
డాక్టరుగారు సదుద్దేశముతోనైనను చికిత్సలో కొంత పొరపాటు చేసిరి. పిమ్మట ఆమెకు వశము తప్పిపోయినది. పశ్చాత్తాపముతో రాత్రియంతయు కన్నువాల్చక చికిత్సచేసి, మధ్యాహ్నమువరకును తాను చేయకలిగిన చికిత్సచేసినందుకు ఆమెయెడ కృతజ్ఞతాభావము కల్గెనుగాని ఆమె చేసిన చికిత్సలో లోపముచేసె నను విరుద్ధభావము నాకుగాని నా భార్యకుగాని కలుగలేదు. కాని ప్రొద్దుట ఆడుకొనుచున్నపిల్ల మధ్యాహ్నమగునప్పటికే స్పృహతప్పిపోయి మరునాటికి మరణించినందున ఆకస్మికముగ కలిగిన ఈవిపత్తు మా మనస్సులను దు:ఖమున ముంచివేసెను.