దశావతారచరిత్రము/కథాప్రారంభము

వికీసోర్స్ నుండి

దశావతారచరిత్రము

కథాప్రారంభము



రమణాంగుష్ఠశిఖరీంద్రమథితావరణపయోధిజసుధారస మనంగ
భువనరక్షణసదాశివసిద్ధయోగీంద్రసంభృతసిద్ధరసం బనంగ
భూరిమేఘాళివిస్ఫుటపత్రపుష్కరాళిందపూరితమకరంద మనఁగ
ధరణీవధూమహీధరపయోధరభాగలక్షితక్షౌమచేలం బనంగఁ


తే.

దనరు గంగాతరంగిణీతటమునందు, వెలయుఁ ద్రిభువనవిఖ్యాతవిభవవిజిత
దేవతాపురభోగవతీపురక్ష, మాపనానాపురము హస్తినాపురంబు.

83


శా.

క్ష్మారామామణిహారవల్లు లన గంగాకుల్య లేపార ము
క్కారుంబండుఁ బ్రశస్యసస్యములు రంగద్భీష్మనూక్షీరపా
నారూఢోత్తమసత్త్వహస్తిహయముఖ్యంబు లగు న్జాహ్నవీ
తీరావాసపవిత్రులై ప్రజలు నెంతే మింతు రప్ప్రోలునన్.

84


ఉ.

అప్పురిగొప్పయుప్పరిగలందు వసించిన ముగ్ధకాంత లీ
యొప్పెడిచందమామ కిది యొప్పునె తప్పని పైఁటకొంగులం
దప్పక రాచి చూచి తమునవ్వెడి ప్రౌఢలహాసకాంతులే
యప్పుడుఁ గప్పు గప్పినఁ గృతార్థుల మంచు హసింతు రెంతయున్.

85


చ.

ఎలమి విమాన మెక్కి చరియించుచు నంబరవీథిఁ దెచ్చుకో
లలుకను రంభ వచ్చి పురమందలి మేడలపైఁడిబొమ్మలం
[1]గలసి యటూరకున్నఁ గలఁక న్నలకూబరుఁ డేమి నేరమే
పలుకవె యంచు బొమ్మచెయి వట్టిన రంభ నగుం గిలాకిలన్.

86


చ.

శతమఖువారణేంద్ర మతిశక్తి నిజాకృతిఁ జూచి కొమ్మలన్
రతనపుఁగోటఁ గ్రుమ్మినను రాలెడుకెంపు లగడ్తలోఁ బడం
జతనము మీఱ నెత్తి కడుసంతస మొప్పఁగ నెత్తిఁ బన్నగ
ప్రతతులు దాల్చుఁగాక మఱి పాముల కేడవి జాతిరత్నముల్.

87


ఉ.

పట్టణమధ్యభాగపరభాగమణీమయమందిరంబులం
గట్టినటెక్కెపుందుదలు గాడఁగ బెజ్జము పుట్టెఁ దమ్మిపూఁ

జుట్టుములోనఁ గానియెడ శూరులు నాకముఁ జేరఁ బోవఁగాఁ
బుట్టుట యెట్లు త్రోవ పరిపూర్ణదినేశ్వరమండలంబునన్.

88


చ.

శుకముఖ్యద్విజకీర్ణతత్పురవనక్షోణీజపాలీఫల
ప్రకరస్యందిరసైకతుందిలితమై పాథోదబృందంబుధా
త్రికి వర్షించును గాక యున్న లవణాబ్ది న్నీరమున్ గ్రోలి వా
ర్షుకము ల్దియ్యనినీరమున్ గురియునే చోద్యంబుగా కెయ్యెడన్.

89


సీ.

ఒకవటుండే చాలు నకలంకవేదశాస్త్రనిరూఢి బ్రహ్మ నధఃకరింప
నొకరాసుతుఁడె చాలు నుద్వేలశక్తి దిక్పాలురఁ గదిమి కప్పములు గొనఁగ
నొకవైశ్యసుతుఁడె చా లురుసంపదల ధనాధిపు నాదిభిక్షుమైత్రికిని జొనుప
నొకశూద్రసుతుఁడె చా లుర్వీతలం బెల్ల బహుసస్యమయముగాఁ బయిరు సేయ


తే.

నొకరథము సాలుఁ గనకాద్రి కొడ్డు సూప, నొకగజము చాలు దిక్కరిప్రకర మెదుర
నొకహయము సాలు రవిహయాత్యుద్ధతిఁ గన, నొకభటుఁడె చాలు రుద్రుతో నొరయ నచట.

90


చ.

ఎక్కుడు మోహదృష్టి రతి నిచ్చఁ దలంపక వచ్చి వేఁడినం
జక్కనివాఁడు గాఁ డనుచుఁ జక్కెరవిల్తుని మెచ్చ రన్నచో
నక్కడి వారకామినుల యందము వారి విటాళిచందము
న్నిక్కము సన్నుతింప నలనీరజగర్భున కైన శక్యమే.

91


గీ.

అప్పురంబున కధిపతి యై ధరిత్రి, పాలన మొనర్చు నేకాతపత్రముగను
భామినీజనమోహనపారదృశ్వ, మృదులతనుమేజయుఁడు జనమేజయుండు.

92


చ.

ప్రతిదినముం బ్రభాతమునఁ బాఠకగీతుల వీతనిద్రుఁడై
క్షితిసురపాళితో నరిగి చెంతఁ బొసంగెడి గంగలో సమం
చితమతి నిత్యకృత్యము లశేషముఁ దీరిచి గాఁగ పంకజ
ప్రతతులఁ బూజ సేయు నరపాలుఁడు కృష్ణు నభీష్టదైవమున్.

93


తే.

ఆమహీపతి యొకనాఁ డహర్ముఖంబు, నందు నెప్పటికరణి జాహ్నవిని నిత్య
కృత్యములు దీర్చి నగరికి నేగుదెంచి, కొలువుసింగారమై కంతుచెలువు మెఱసి.

94


సీ.

నిండుఁగొల్వునను గూర్చుండ ధర్మజుతోడఁ గార్యము దెలిపెడిగౌరవంబు
దుర్యోధనాదు లాందోళ మొందఁగ విశ్వరూపంబు సూపెడుప్రోడతనము
సంగరంబున ధనంజయరణస్థాయియై ధవళాశ్వములఁ బట్టుదంటతనము
వైరాటిసూతికాద్వారంబునను జక్రహస్తుడై గాచిన యట్టి మహిమ


తే.

తెలియ శ్రీకృష్ణమూర్తిఁ జింతించినట్టి, కొలువుకూటంబులోపల నలువు మీఱ
భద్రపీఠికఁ గొల్వుండెఁ బాండవాన్వ, యుండు జనమేజయక్షమాఖండలుండు.

95


వ.

అయ్యవసరంబున.

96

శా.

శ్రీశంపాయతలోచనారమణచారిత్రాపగాసంభవ
శ్రీశైలంబగు థాతురాగజటలున్ శృంగారనిష్యందనీ
కాశప్రక్రియ జన్నిదంబు లతివక్షస్పూర్తి శోభిల్లఁగా
వైశంపాయనుఁ డేగుదేర భవనద్వారంబునం జూచుచున్.

97


క.

దౌవారికవరుఁ డొక్కఁడు, వేవేగ న్వచ్చి విన్నవించిన గురునిం
దేవేంద్రుఁ డెదురుకొనుగతి, భూవరశాసనుఁడు వినయమున సత్వరుఁడై.

98


సీ.

సౌవిదల్లులు చేరి సముఖా యనఁగ గద్దె డిగునంతలోన దుండీరుఁ డిడిన
నెఱమించుచండవన్నియచెక్కడపుబొమ్మ చికిలిదంతంపుపాదుకలు దొడిగి
పాండ్యుఁ డడ్డము పట్టు పావడ మఱుఁగున లాటభూభర్త గాళాంజివూన
గండూష మొనరించి కర్ణాటపతిచేతిపావడం దడియొత్తి పసిఁడిసరిగె


తే.

చలునదుప్పటివలెవాటు వెలయ రాజ, సమున నెదురేగి యల్లంత సంయమీంద్రుఁ
గాంచి కైదండయును బాదుకలును వదలి, హర్షభయభక్తివినయంబు లతిశయిల్ల.

99


క.

గోత్రప్రవరలు నొడువుచు, గోత్రేంద్రుఁ డురోవిలిప్తకుంకుమపంకా
చిత్రితధాత్రీతలుఁ డై, తత్రభవన్మౌనిరాట్పదంబుల కెరఁగెన్.

100


సీ.

రాజితాష్టాంగవజ్రచ్చటాచకచకల్ పొదలి ప్రక్షాళనాంబువులు గాఁగఁ
గమనీయతరమౌక్తికశ్రేణిధళధళల్ నవకుందసుమపూజనంబు గాఁగ
నిర్దోషనీలమాణిక్యాళినిగనిగ ల్మంజుళధూపధూమములు గాఁగ
రమణీయతరపద్మరాగధగద్ధగ ల్నలువొందు నీరాజనంబు గాఁగ


తే.

భ్రమరఘంటారవాన్వితప్రసవదామ, సుమరసం బుపహారమై సొంపు నింప
మనుజపతి కన్న మున్ను దన్మౌళిమౌళి, మౌనిమౌళికిఁ బూజావిధాన మొసఁగ.

101


చ.

“శ్రీరస్తు క్షితినాథ తే” యని మునిశ్రేష్ఠుండు దీవింపఁగా
నారాజన్యుఁడు లేచి [2]సంభ్రమముతో నమ్మౌనిచూడామణి
న్రారాజన్మణిపీఠిపై నునిచి యర్ఘ్యం బాదియౌ పూజచే
నారాధించి ప్రహృష్టమౌనిఁ గని ధన్యం మన్యచిత్తంబునన్.

102


మ.

వ్రతితిలకా భవత్పదపరాగము సోఁకఁ బవిత్రమయ్యె నా
యతనము మిమ్ముఁ గొల్వఁగఁ గృతార్థుఁడ నైతి ఫలించె నింక నా
యతనము లెల్ల నాంతరతమోపహనూరులు గారె మీరు సం
తతశుభదాయకంబులు గదా మహదాగమనంబు లెయ్యెడన్.

103


మ.

శతవర్షంబు లరోగదివ్యతనులై సామ్రాజ్యసంపన్ను లై
సుతులం బౌత్రుల మిత్రులం గని కడున్ శుద్ధాత్ములై యందనా
హతమౌ మోక్షము గాంచ నేది సులభోపాయంబు నా కానతి
చ్చి తగన్ ధన్యునిఁ జేయు మీ చరణము ల్సేవింతు మౌనీశ్వరా.

104

తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యమ్మునివరుండు, క్ష్మారమణ యైహికాముష్మికంబు లింత
సులభములె యైన వినిపింతుఁ దెలివి గాఁగ, నప్రమత్తుఁడవై విను మాదరమున.

105


ఆ.

మేదినీశ వినుము “నాదత్తముపతిష్ఠ, తే” యనంగఁ గర్మదృఢత లేక
యిహసుఖంబు గల్లు నెట్లు “జ్ఞానాన్మోక్ష”, మనఁగ నజ్ఞుఁ డెట్టు లందు ముక్తి.

106


క.

గుణజలనిధిగహనా “క, ర్మణోగతి” యనంగ సులభమాకర్మము దా
రుణము “శుకో ముక్తే” యని, గణుతింపఁగ నెటులు ముక్తి గల దన్యులకున్.

107


తే.

కానఁ గర్మంబు లాత్మవిజ్ఞానసరణి, దుర్లభములు విశేషించి దుష్టమైన
కలియుగమువేళ నెటువలెఁ గలుగు నైన, నొకయుపాయంబు దెల్పెద యుక్తముగను.

108


ఉ.

కృష్ణదశావతారములు కేవలభక్తిని విన్న సజ్జనుల్
జిష్ణుసమానవైభవము జెంది యిహంబున నంతమీఁదటన్
వైష్ణవధామ మొందుదు రవశ్యము వశ్యము సుమ్ము రెంటికిన్
గృష్ణకులీన యన్న నృపకేసరి యెంతయు సంతసంబునన్.

109


తే.

పద్మనాభుండు పాండవపక్షపాతి, యందు మిక్కిలి విజయున కనుఁగు గానఁ
దత్కథలె విందుఁ గృష్ణావతారపూర్వకముగ వినిపింపు మవతారకథల ననిన.

110


శా.

శ్రీకల్యాణగుణంబుల న్సమతచేఁ జెన్నొందియు న్భక్తర
క్షాకౌశల్యముఁ దెల్ప ధర్మసుతు రాజ్యశ్రీయుతుం జేసి యెం
తే కుంతీసుతపక్షపాతి యనుకీర్తిస్ఫూర్తి వర్తిల్లు నా
శ్రీకృష్ణుండు కృపాకటాక్షమున రక్షించు న్బుధవ్రాతమున్.

111


సీ.

ధరణీశ కృష్ణావతారంబు మున్నుగా వినిపింపు మని దన్ను వేఁడినాఁడ
వవతారములలోన నాకృష్ణచరితంబు గణియింతు రందు నొక్కటిగ బుధులు
బలభద్రుచరితంబు దెలిపినపిమ్మట నుడివెదఁ దదనుజన్ముని చరితము
మానసం బలరార మత్స్యకూర్మవరాహనారసింహాద్యవతారకథలు


తే.

వినుము క్రమమున వీనులవిందు గాఁగ, నీసమంచితభక్తి వర్ణింప వశమె
తపము ఫలియించె జన్మంబు ధన్యమయ్యె, గలిగె భాగ్యంబు శ్రీవిష్ణుకథలు దెలుప.

112


క.

అని పులకాంకురములు మై, దనరఁగ మోదాశ్రు లొలుకఁ దన్మయచితంతం
బున నలరుచు వైశంపా, యనముని దెలుపంగఁ దొడఁగె నధిపతి వినఁగన్.

113

  1. గలుసుక యూరకున్నఁ
  2. సమ్మదముతో