దశావతారచరిత్రము/1. మత్స్యావతారకథ

వికీసోర్స్ నుండి

1. మత్స్యావతారకథ

గీ.

పంటవాల్గంటి గబ్బిగుబ్బలఁ జెలంగు, తళ్కుబిగిచిల్కపచ్చఱాతాళిఁ బోలి
పచ్చగందని పైరుల నిచ్చమెచ్చు, దెచ్చు హెచ్చుగ ద్రావిడదేశ మధిప.

114


క.

ఆదేశము సురపురవిభ, వాదేశము నృపతివితరణైశ్వర్యజిత
శ్రీదేశము కలుషానిల, కాదేశము నెగడుఁ బొగడి నలవియె యెందున్.

115


సీ.

సతతంబు నభ్రంకషంబులై కనుపట్టు ధాన్యరాసులఁ జూచి తలఁకి యేమొ
జపతపస్వాధ్యాయచతురులై తగుమహీసురులధైర్యముఁ జూచి స్రుక్కి యేమొ
పైఁటచా టెఱుఁగక ప్రబలుద్రావిడవధూకుచకుంభములఁ జూచి కొంకి యేమొ
యభవునియాజ్ఞ వింధ్యాద్రి మెట్టిన కుంభసంభవునాగతి జడిసి యేమొ


తే.

కాక భూపాలుచేవాలు కఱుకువాలు, కఠినశితకోటిశతకోటిఁగాఁ దలంచె
నేమొ లేకున్న నచట మహీధరములు, పోఁక లంతైనఁ బొడసూపఁబోకయున్నె.

116


ఉ.

సాలములో యనందగురసాలములం బరిపాకలీలచే
రాలు మెఱుంగుముత్తియపురాలు ఖగంబులగుంపు దోలఁగా
యేలలుగంగ వానిఁగని యేలలు వాడుదు రందు నధ్వగు
ల్బాళిగొనంగ శాలివనపాళికహాలికబాలికామణుల్.

117


ఉ.

బాలరొ పుష్పమంజరులపై భ్రమరంబులు వ్రాలె నధ్వగా
వ్రాలినచో నుపద్రవకరంబులు గావని వాని మాన్పఁగా
నేలని నేర్పుమీఱ వచియింతురు పల్కులఁ దేనె లొల్కఁగా
హాలికబాలికామణు లుదంచితశాలివనాంతరంబులన్.

118


శా.

శ్రీమత్తాదృశదేశవల్లభుఁడు లక్ష్మీనాథపాదాబ్జసే
వామాద్యద్భ్రమరంబరాతినృపదీవ్యద్భర్మకోటీరకో
టీముక్తాయిత వామపాదనఖకోటిజ్యోతిసత్యవ్రత
క్ష్మామానిన్యధినాథుఁ డొప్పు క్షితిరక్షాదక్షకాజేయుఁ డై.

119


సీ.

తనప్రతాపము సముద్దండశాత్రవకోటి గడిసీమఁ దోరణ కట్టికొనఁగఁ
దనకీర్తి బహుసముద్రద్వీపములు దాఁటి చక్రవాళాద్రిపైఁ జౌఁకళింపఁ

దనకటాక్షము దిగంతరయాచకశ్రేణి రూఢి కెక్కఁగఁ గుబేరులను జేయఁ
దనచీటి యష్టదిక్తటులేలు వేల్పు[1]రాజులపాగలం దురాచెల్వు చూప


తే.

నతఁడు చెల్వొందుఁ బరకిరీటాగ్రఖచిత, పాకభిన్నీలమౌక్తిపద్మరాగ
షట్చరణచక్రచక్రాంగచక్రవాక, యుగపదాశ్రితపాదాబ్జయుగళుఁ డగుచు.

120


క.

ఆసత్యవ్రతభూవర, శాసనుఁ డొకనాఁడు వేఁగుజామున ఘనగ
ర్జాసమసమధికవంది, శ్రీసూక్తుల మేలుకాంచి చిత్త మెలర్పన్.

121


క.

హరి మదిఁ దలఁచుచుఁ బ్రాతః, కరణీయచికీర్షవిబుధగణసంయుతుఁ డై
స్వరధిపనిభవైభవభా, స్వరత న్ఘనవాహ మెక్కి చనఁ జన నెదుటన్.

122


క.

హేళికులాగ్రణి యగునృప, మౌళి గనుంగొనియె ధరణిమహిళాసుమనో
మాలిక పోలికఁ దగ్గుకృత, మాలిక యనునదిని మదిఁ బ్రమద ముదయింపన్.

123


క.

కనుఁగొని హరి దిగి విబుధుల, రని కొనియాడుచును వింటిరా యీతటినిం
గనుఁగొను పుణ్యుఁడు మిక్కిలి, కనుఁగొను నెన్నుదుట నెన్నఁగాఁ దరమగునే.

124


క.

కృత మాచరించు భూరిసు, కృతమానిన భాగ్యశాలికిం గలుగుం దు
ష్కృతమాలిక నడంపంగల, కృతమాలిక మునుఁగ దొరకునే యన్యులకున్.

125


తే.

అనుచు ననుచు ముదంబున నంబుజాప్త, నిభవిభుఁడు మేదినీవిభుఁ డభిమతార్థ
దాయి తటినికి డిగ్గి హృత్తటిని భక్తి, పూర్ణతరముగ సంకల్పపూర్వకముగ.

126


క.

మజ్జన మొనరించెను ధీ, మజ్జననుతు లెసఁగ నృపతి మహి మహితముగా
మజ్జననము గావింపు న, మజ్జననీతటిని యని సమంజసభక్తిన్.

127


తే.

మజ్జన మొనర్చి యిటుల నమ్మనుజవిభుఁడు, కాల్యకరణీయములు దీర్చి గంధసింధు
రజవసైంధవపృథుహేమరథసుయోధు, లెలమి నెలవంక వలవంక బలసికొలువ.

128


తే.

నగరి కేతెంచె నిట్టు లన్వహము తటినిఁ, గాల్యకరణీయములు దీర్చుకతన నతని
మదిని వైరాగ్య మొదవ సామ్రాజ్యతంత్ర, ములకుఁ దనమంత్రులనె స్వతంత్రులను జేసి.

129


క.

కృతమాలికాతటంబున, క్షితిపతి సలిలాశి యగుచుఁ జేసె న్దప మా
శతమఖముఖబర్హిర్ముఖు, లతివిస్మయ మంద మాధవార్పితబుద్ధిన్.

130


క.

ఒకనాఁ డుదయక్ష్మాభృ, న్మకుటస్ఫుటపద్మరాగమణినా దిననా
యకుఁ డలర నృపతి మురభం, జకునకు నర్ఘ్యం బొసంగు సమయమునందున్.

131


క.

నునుగరులు దళుకుమీసలు, మినుమినుకను కన్నుదోయి మిహికుందనపుం
దనువుంగల యొకమీనము, దనయంజలిఁ దవుల నృపుఁ డుదకము న్విడిచెన్.

132


క.

తను నటుల నీటఁ ద్రోచినఁ, గని మీనం బనియె రాజ కారుణికుఁడ వం
చును నిన్ను నమ్మి చేరితిఁ, జనునే నట్టేటఁ ద్రోయ శరణాగతులన్.

133

సీ.

శ్రీరామచంద్రుఁడు చేపట్టఁడాయెనా శరణుఁజొచ్చిన విభీషణునిఁ దొల్లి
శిబిచక్రవర్తి రక్షింపఁడే మును దన్నుఁ జేరినపక్షి దాక్షిణ్యగరిమ
నచ్ఛభల్లముఁ బ్రోవఁడా తొల్లి బెబ్బులిపాలుగాకుండ నృపాలసుతుఁడుఁ
దనశరీర మొసంగి వనచరునొక్కని దయగావదే కపోతంబు దొల్తఁ


తే.

గాన శరణాగతులఁ బ్రోచుకంటెఁ బుణ్య, మేది మేదినిలోన నన్నేది యింక
నాదిరాజన్యకీర్తులఁ బ్రోది సేయు, ధర్మగుణసాంద్ర సత్యవ్రతక్షితీంద్ర.

134


క.

సకలం బెఱిఁగినయాదిమ, శకులం బటులనిన రాజచంద్రునిచిత్తం
బకలంకమయ్యు నించుక, వికలముగా నిట్టులను సవిస్మయుఁ డగుచున్.

135


మ.

శరణన్న న్విడ నిన్ను నేను శఫరీ సామాన్యబుద్ధి న్నిరా
దరతం ద్రోచితి వేళగామి నిదియే తప్పంచు నీ వెంచి ని
ష్ఠురతం బల్కితి పాడియే దెలుపుమిచ్చో నేభయంబయ్యె న
న్శరణొందం బనియేమి నావలన రక్షాసిద్ధి నీకెట్లగున్.

136


తే.

అనుచుఁ బలికిన జనపతి మనుచు వేడ్కఁ, బెనుచువాలుగ మేలుగాఁ గనుచు ననియె
నుదకమునఁ దత్తరింపుచు నున్న నన్నుఁ, జూచి భయమేమి యనుటగా చోద్య మయ్యె.

137


సీ.

కూర్మికిఁ గూర్మి చేకుఱునె నోరికిఁజిక్క నెగడుము న్నెగడుపై నెగడుచుండ
మొసలికి మొసలియే దెసలఁ జేరఁగరాదు పాముల బాములఁ బడుట కడిఁది
కరటి మర్కటి గాదె పట్టినచోటు గప్పలు గొప్పలు గలవు మ్రింగ
బకము లంబకము లెప్పటికి మాపై నిల్పు మీలముచ్చులు ముచ్చు లేల విడుచుఁ


ఆ.

గన్నతల్లి కన్నఁ గరుణలే దొకవేళఁ, బట్టిపట్టిఁ తివియుఁ బార్థివేంద్ర
గండకముల కిట్టిగండము ల్గలవిఁకే, మనఁగవచ్చు నెట్లు మనఁగవచ్చు.

138


తే.

అటులుగాన నిరంతర ప్రాప్తశైత్య, తరళతరవారిధార సాదనలు సేయు
మీనుపిల్లలజన్మంబు మే లనంగఁ, బడునె పరికింప విషములో బ్రతుకు గాదె.

139


క.

కాన నిరుపద్రవంబగు, చో నను విడిపించి తేని సులభముగాఁ జే.
కోనగు నాచంద్రార్కం, బైనసుకృత మనిన నృపతి యతివత్సలుఁ డై.

140


తే.

అధికనైష్ఠికవృత్తి మన్మథునిఁ గెలిచి, డాలుగైకొన్న జోళమండలవిభుండు
డాసి యన్నది యుదకమండలములోనఁ, దలఁకు మీనంబుఁ దనకమండలము సేర్చి.

141


సీ.

తనయాశ్రమమున కల్లనఁ దెచ్చి రాజర్షివల్లభుఁ డాశ్రమమెల్లఁదీఱ
సతతపయోధార సమకూర్చి భూమిలో నేఁటఁ బెంచినవారిఁ బూఁట బెంచె
ననుమాట నిజముగా నెనరుతోఁ బోషింప శిశుక మారాత్రిలోఁ జిత్రముగను
బలిసి భూమండలాఖండల కొండిక కుండికనుండఁగూడ

తే.

దింతనిర్బంధమైనచో నెటుల నోర్తు, నింక నొండొకవిరివియౌ నెడవసింపఁ
జేయు మెందైన నందైన చింతదీఱ, విశ్రమించెద నన్నఁ బృథ్వీవరుండు.

142


ఆ.

గండకంబు వేఱుకడ వసింపఁగఁజేయు, మన్నమాట గడవ కాక్షణంబ
కడువశంవదుండు గావున నొకగొప్ప, కడవలో వసింపఁగా నొనర్చె.

143


క.

ఘటిఘటియించిన రెండవ, ఘటీనే యండజము ఘటినిఁ గలయ బలిసియా
ఘటమున నుండుటకుందు, ర్ఘటమై యున్నది యటంచుఁ గడుదీనంబై.

144


ఆ.

మీన మడుగుటయును మేదినీంద్రవతంస, మడుగులకును బ్రేమ మడుఁగు లిడుచు
నఖిలధీవరజన మడుగు గానఁగలేని, మడుగులోన నించ మహిమమించ.

145


మ.

మడుగు న్నిండఁగనిండి గండకమనున్ క్ష్మామండలాధీశ యి
క్కడ నుండం దరమే జడాశయము యోగ్యంబౌనె నావంటి యె
క్కుడురూపంబున మించువాని కిటఁ గైకోవయ్య విస్తారమౌ
కడ నిల్పం గదవయ్య యార్తజనరక్షాదక్షదీక్షానిధీ.

146


క.

నావుడుఁ గడువిస్మయమున, భూవరుఁ డొండొకప్రదేశము మదిఁదలఁచుచు
న్వేవిధముల నిదియేతగు, నీవేళకటంచు నిశ్చయించి రయమునన్.

147


మ.

అలరించె న్లవణాంబుధి న్మొదట నే యారౌరశుద్ధోదకం
బులవార్ధి న్గడవైచె ధాత జడజోద్భూతుండురా యంచులో
కులు నిందింపఁ గలంగి యన్నలువదిక్కూలంకషోర్మిచ్ఛటల్
గలయం దజ్జలరాశిముందిడియెనాఁగా నొప్పు గాసారమున్.

148


తే.

చేర్చి సుఖముండు మనిన రాజీవమనియె, సదయు రాజవతంసునిన్ సన్నుతింప
నల్ల రాజీవగర్భున కైనఁ దరమె, శ్రితనరాజీవ ద్రవిడధాత్రీకళత్ర.

149


క.

అని పొగడుచు నొకదినమున, ననిమిషకులచక్రవర్తి యాకాసారం
బును నాక్రమించి వేఱొ, క్కనివాసముఁ జేర్చు స్వైరగతి విహరింపన్.

150


మ.

అనిన న్భూవిభుఁ డొండుచో టగునె మీనావాస మింకం దగు
న్ఘనఝంఝానిలసంఘసంఘటితసంఘర్షాఖలాశావిలం
ఘనజంఘాలతరంగరంగతలరంగత్పాండుడిండీరచం
దనసందీప్తవిలాసముద్రము సముద్రంబే యటంచు న్మదిన్.

151


క.

జడరాశిం బడవైచిన, మిడుకుచు నప్పుడమిఱేని మీనంబనియె
న్గడనేఁటికి నేటికి దిగ, విడిచెదు నమ్మితిని గావవే దయమీఱన్.

152


ఆ.

బాళిఁ జిలుకఁ బెంచి బాపురుగానికి, నొప్పగించురీతి నుచిత మగునె
యిన్నినాళ్లుఁ బ్రోచి యిప్పుడు జలరాశి, మొసలివాతఁ ద్రోయ వసుమతీశ.

153


క.

జలరాశిఁ దిమితిమింగిల, ములు నాఁదగుమీనసత్వములు వినలేదే
కులశైలసుతుఁడు జలచర, ములతో రావెడల నుమియుఁ బునుకలతోడన్.

154


క.

తాదృశమీనంబులు న, న్నే దెస వసియింపనిచ్చు నిట దిగవిడువం

గా దెసఁగిన కారుణ్యము, నాదెస నుంపంగదయ్య నరనాథమణీ.

155


మ.

అనిన న్నివ్వెఱఁగంది భూవిభుఁడు నాహా యిట్టిమీనంబులం
గనినామో వినినామొ యెందయిన లోకత్రాణపారిణుఁ డ
వ్వనజాక్షుం డిటువంటిరూపమున సేవల్దాఁ బ్రసాదింపఁగాఁ
జనుదేఁ బోలు నటంచు నించుక మది స్సందేహముం జెందుచున్.

156


మ.

వలరాటెక్కెపుమీనవో సురలఁ బోవన్మించు మీనంబవో
తెలియ న్వానికి నైన నీబలిమి సందేహంబు నేఁ గొల్చు న
జ్జలజాక్షుండవొ ఫాలచక్షుఁడవొ సాక్షాద్బ్రహ్మవో తెల్పు మీ
వలవంత ల్పచరింప నేల కుహనావైసారిణగ్రామణీ.

157


క.

అన నేనేమీనముగా, ననఘాత్మ స్వభావమీన మని యెన్నుము నీ
వనుమానము మానుము ననుఁ, జనుమానముతోడఁ బ్రోవు జా గేమిటికిన్.

158


తే.

విషధిలోపలఁ జాలరి వేటకాండ్ర, వలకుఁ జిక్కిన గాలంబు వంచికొనిన
గారవెట్టిన నేరీతిఁ గడవనేర్తు, నాకు గతి యొండుగలదె నా నరవరుండు.

159


తే.

అనియె నీవు స్వభావమత్స్యంబ వైన, జాలరులు నిన్నుఁ బట్టంగఁజాల రెందు
నీయధీనంబు గాలంబు నీకు భయము, సేయనోపునె పరులకుఁ జేయునట్లు.

160


క.

నీవలకుఁ జిక్కె లోకము, లీవల నీవలకుఁ జిక్కుదేజలరాశి
న్నీవలకుం జక్కు దుగా, కేవలనం గేవలంబె యీ నీమహిమల్.

161


తే.

పృథివి సంసారమన గారఁబెట్టఁజాలు, నీదుమాయావిలాసంబు నిఖిలజనుల
నందఱకు నీవ గతిగాక యన్యుఁడొకఁడు, నీకు గతి యౌనె సకలలోకైకనాథ.

162


క.

యోజనలేటికి నీవ ప, యోజనయనమూర్తివే ప్రయోజనమున కీ
యోజ నటించెదు దినశత, యోజనమాత్రంబు పెరుఁగ నోపుదు చెపుమా.

163


శా.

శ్రీనారీకుచకుంభికుంభయుగళాశ్లేషంబొ బ్రహ్మాదినా
నానాకేశనమస్క్రియాదరమొ వీణామౌనిలోకాగ్రణీ
గానాకర్ణనమో వధూనటనశృంగారావలోకంబొ యీ
మీనాకారము దాల్పనేమిపని స్వామీ నా కెఱింగింపవే.

164


సీ.

కలిమిగుబ్బెతమిన్న గబ్బినిబ్బరపుబ్బుగుబ్బలో జక్కవగిబ్బజోడు
తెలిదమ్మివిరియింటి తెలిగంటికెంపువాతెఱసొంపొ పవడంపుతీవగుంపు
లెడఁదకాఁపురపుపుత్తడిబొమ్మనిడువాలుగన్నులో యీవాలుఁగన్ను లరయ
ననవింటిదంటఁగన్నమిటారినూగారు తీరులో యీనాచుతీవగుమురు


తే.

ఏల భ్రమసితి వీవార్థి నేమిగంటి, తేలియాడెడు మీనంబు తెఱఁగుపూని
యౌర తెలియకయంటిగా కయ్య నీమ, హత్త్వ మెఱుగంగ శక్యమే యజునకైన.

165


క.

నే నొకనెపమున నైనను, మానక నినుఁ గొల్చినాఁడ మక్కువ నాపై
నూనుము “సఖ్యం సా ప్తప, దీనం" బని మున్ను విందు దీనశరణ్యా.

166

క.

మునుపటిభవమున నేఁజే, సినపుణ్యమువలన మిమ్ము సేవింపఁగఁ గం
టిని మాయలేటి కింకిట, వినిపింపఁ గదయ్య నీదు వృత్తాంతంబున్.

167


మ.

అనినం గైతవమత్స్యమూర్తి [2]కరుణాయత్తైకచిత్తంబు మీ
ఱ నను న్భూవర యాత్మతత్వము పరబ్రహ్మంబుగా నెమ్మనం
బునఁ జింతింపుము సంశయింప కిఁకనేమో యంచు నీచర్య కే
ననుమోదించి యనుగ్రహించితి నభీష్టార్థంబు నీ కయ్యెడున్.

168


సీ.

వినుము సత్యవ్రత వినయగుణాన్విత భావికార్యము తేఁటపఱుతు నీవు
కనుఁగొనుచుండు మింకను నేఁడు మొదలుగా నేడుదినంబుల కిప్పయోధి
భువనముల్ త్రిభువనంబులను లోఁ గొను నేలనన్న నానాఁటికి నబ్జభవుని
రేయైన నతఁడు నిద్రించుఁ గావున దాని కెడఁద భయంపడ కెనయ నప్పు


తే.

డోషధీబీజరాసుల యోడ నీకు, పంపుచున్నాఁడ నోడక యందుసప్త
ఋషులతోఁ గూడి వసియింపు మెపుడు నాదు, భక్తజనమున కెందు నాపదలు లేవు.

169


తే.

అనుచు నానతి యిచ్చి మాయావిసార, మూర్తి యంతర్హితుండైన మ్రొక్కి నృపతి
యెంత దయగలవాఁడు సర్వేశ్వరుండొ, హో యటంచును నిష్టతో నుండు నంత.

170


సీ.

ప్రథితసుమేధుఁడై పరగుసుమేధుండు విరజుఁడై శాంతిచే వెలయు విరజుఁ
డాభాహవిష్మంతుఁ డగుహవిష్మంతుండు నుత్తము డైనట్టి యుత్తముండు
వనజాక్షపదభక్తవనమధుండగు మధుం డఘపారదమహాగ్ని యైనయగ్ని
ద్వంద్వసహిష్ణుఁడై తగిన సహిష్ణుండు ననఁదగు సప్తర్షు లమితహర్షు


తే.

లగుచు వచ్చిరి లవణమహాంబురాశి, వేల దర్భశయానుఁడై విభుఖగేశ
యాను నతివేలభక్తిభాగనఘజనకృ, పాలు హరిఁ గొల్చు ద్రవిడనృపాలుకడకు.

171


ఆ.

అట్టు లరుగుదెంచి నట్టియయ్యతులకు, నతులగతుల మతులు నతులు చేసి
యతివినీతి, నున్న క్షితితలపతిధృతి, మతిని మెచ్చికొనుచు మౌను లనిరి.

172


క.

శతవర్షంబుల నుండియు, క్షితి వర్షము లేని కతన శిథిలంబగు చో
నతివృష్టి మించె జలనిధి, గతి దృష్టించితివె ముజ్జగంబులు ముంచున్.

173


తే.

ఇందు నెవ్వరిఁ గనుఁగొన మిజ్జగంబు, నందు నాశ్చర్యమయ్యెనో యవనినాథ
యేకతంబున వారాశి సైకతమున, నేకతంబున నున్నాఁడ వెఱుఁగఁ జెపుమ.

174


ఉ.

నావిని తావినీతి జననాయకుఁ డిట్లను మౌనులార రా
జీవమొకండు మొన్న ననుఁ జిత్రము గా బ్రమియించి యంతటన్
భావికథ ల్సవిస్తరతఁ బల్కి పయోధి మునుంగకుండ నే
నావఘటింతు నీకు మునినాథులతో వసియింపు మత్తరిన్.

175

తే.

అంచు ననుమించు వేడుక నానతిచ్చి, గోచర మగోచరంబైనఁ గొంతధైర్య
శాలినై యుంటిఁ దన్నిదర్శనముఁ గోరి, నేఁడు మీదర్శనమున సందియము దీఱె.

176


మ.

అనిన న్సంతసమూని మౌనిజను లాహా యింక నెట్లో కదా
వనధు ల్ముంపఁగఁ జాగె ముజ్జగము లేవంక న్వసింపంగవ
చ్చునటంచుం గడుఁదత్తఱించినతఱిం జోద్యంబుగా నీడకుం
జనుదెంచుం దరియంచుఁ బల్కితిఁ దరింపన్వచ్చు నిచ్చోనృపా.

177


క.

అని పలుకుచు నుండఁగ న, వ్వననిధి ఘనఘోష మడర వలమానతరం
గనికాయంబులఁ బొదువఁగఁ, గని కాయం బదర లేచి గ్రక్కున వారల్.

178


సీ.

పటుదీర్ఘతరజటాపటలంబు ముడివీడి కన్నుల కడ్డమై గప్పికొనఁగ
భయవేగసంచలత్పాణిపరిస్ఫుటస్ఫటికాక్షమాలిక ల్జాటిపడఁగఁ
గాషాయపటములు గటితటంబుల నూడి త్రొక్కుడుపాటుచేఁ దునియుచుండఁ
జాలినొందుచు నెత్తఁజాలక వచ్చుచో ఘనకమండలువు లక్కడనె చిక్క


తే.

జడిమ నడుగులు దడఁబడ నుడుగ కూర్పు, లడక బడిబడి బడలిక లొడలఁ బొడమఁ
గడలికడనుండి మగిడి క్రేఁగంటిదృష్టి, యిడుచుఁ బాఱుచు జడదారి యొడయ లపుడు.

179


శా.

"అస్మాన్ పాహి భయాతురాం స్త్రి జగతీమాప్లావయద్వారిధి
ర్విస్మార్యా సఖలు త్వయాదయ మితో విష్ణో భవాన్ రక్షకః
తస్మా త్త్వాం శరణంగతా అగతికా భావంత ఏతేభృశం
కస్మాదేవ ముపేక్షసే” యని మును ల్గార్పణ్య మేపారఁగన్.

180


తే.

మొఱలు పెట్టుచు శరనిధి మఱలిమఱలి, కాంచుచో నిదె యోడని కదియఁ జనుచుఁ
దెలియ వీక్షించి యదిగాదు జలము గ్రోలు, జలద మిది యని మదిలోన జలదరింప.

181


మహాస్రగ్ధర.

కనియె న్భూపాలుఁ డంత న్ఘనతరసముదగ్రస్వకీయాగ్రభిద్య
ద్వవరుడ్దర్భాండభాండావరణపరిపతద్వారిధారాళి శంకా
జనకాసంఖ్యాతసూత్రోజ్జ్వలదృఢగుణవృక్షచ్ఛటాకించిదాకం
పనలీలాకృన్నభన్వత్పటకటపటలప్రస్యదం బైన నావన్.

182


క.

కని యిట్లను మునులారా, కనుఁగొంటిరె దివ్యరత్నకమనీయంబై
కనకన వెలుఁగుచు నిదిగోఁ, గననయ్యెం గనకతరణి గరుడధ్వజమున్.

183


క.

అనునంతలోన దరికిం, జనుదెంచిన యత్తఱి ససంభ్రమముగ న
మ్మునినాథు లెక్కి రొండొరు, లనువడిఁ జేయూఁతగా హళాహళి మీఱన్.

184

తే.

ఎక్కి మనలను దరి సేర్ప నీశ్వరునికె, భారమవుఁ గాన దరి సేర్చె నావ యనుచు
విడిచి కాషాయవస్త్రము ల్బెట్టువిసరు, గాలి నెండించుకొనుచు నాకలమునందు.

185


సీ.

కలధౌతనిర్మితోజ్జ్వలశిరోగృహములు దీపితమాణిక్యదీపతతులు
రమణీయవైడూర్యరచితపర్యంకముల్ సౌవర్ణమణిమయజాలకములు
పృథులగోమేధికపీఠికాపేటిక లకలంకనవవజ్రముకురసమితి
మానితముక్తావితానవితాన మాయతపుష్పరాగభద్రాసనములు


తే.

విద్రుమస్తంభములు నీలవేదు లమర, గాంగజలపూర్ణఘనకాచఘటచయంబు
విత్తనము లోషధులుఁ దక్కు వివిధవస్తు, జాలములు సూచిసూచి యాశ్చర్యమునను.

186


శా.

ఓహో కంటిరె వారిరాశిసలిలం బుద్వేలమై శైలసం
దోహాగ్రంబులు దక్కఁ దక్కిన పురాదు ల్ముంచె నందు న్సుప
ర్వాహార్యాగ్రమె కాని కాన మితరం బాహా విమానస్వయం
గ్రాహగ్రాహము లెచ్చరించెను భువఃక్రాంతిన్ విజృంభించుచున్.

187


తే.

తరణి మెఱుఁగారు గారుడధ్వజము గాంచి, కలఁగి పరువిడంచిలువపగ్గములు సడలి
పఱచుహయముల సారథి పట్టలేమిఁ, దత్తరించుచునున్నది తరణిరథము.

188


తే.

ఔర సకలంకమైనట్టి యబ్జమండ, లము సభృంగాబ్జమండలభ్రమ గడంగి
జలధి జలకరితుండంబు సాచి తివియు, నేమనఁగవచ్చు మత్తుల కెఱుక గలదె.

189


క.

మహిజనులఁ బీడఁ బెట్టెడు, గ్రహములఁ బీడింపఁదొడఁగె గ్రాహము లివిగో
సహజ మగుసత్త్వసంపద, నహహా యాకారవృద్ధి నధికము లగుటన్.

190


తే.

మాయురే తోయనిధిలోన మకరమీన, కర్కటకరాసులొండొండ గగనమకర
మీనకర్కటరాసుల మించువేడ్కఁ, గౌఁగిలించె సజాతీయగౌరవమున.

191


తే.

అదరిపాటున వారాశియుదుటు సూచి, మిగులభయమునఁ దమతమ మెఱుఁగుబోండ్లు
చేరి తముఁ దామె కౌఁగిటఁ జేర్ప సౌఖ్య, వార్ధిఁ దేలె మహర్లోకవాసిజనము.

192


తే.

ఇదియుఁ గనుఁగొంటిరే చిత్ర మిట్టివేళ, భైరవభుజాగ్రశూలాగ్రభాసి కాశి
కానఁగా నయ్యె మోక్షలక్ష్మీనివాస, నాళసమ్మేళితారవిందమ్మురీతి.

193


శా.

ఆశాలంఘనజాంఘికోజ్జ్వలతరంగాభంగనానాపయో
రాశివ్యాపృతవిష్టపత్రయచతుర్వక్త్రీయనక్తంబున

న్నాశంబొందక తేజరిల్లె సకలౌన్నత్యంబు సూచించుచున్
గాశీపట్టణవైభవంబుఁ బొగడంగా శక్యమే యేరికిన్.

194


క.

అని యొండొరులు వచించుచుఁ, గనఁగ మహర్లోక మవధిగా నీచందం
బున ముజ్జగములు దనలోఁ, గొనుచు న్హరిఁ బోలు నయ్యకూపారమునన్.

195


సీ.

వడి నీరువడిఁ జిక్కువడి చక్రవాళాద్రి క్షణమాత్రమునఁ బ్రదక్షిణము సేయు
నతిరయస్ఫూర్తిచే నరుగుచో నాడాడ నగశృంగములు ఘణిల్లనఁగఁ దాఁకు
ఘనవర్తులావర్తగర్తభాగముల దిర్దిరను గుమ్మరసారెరీతిఁ దిరుగు
శతయోజనాయతోన్నతమహాపాఠీనసంఘసంఘటితఘర్ష మున వదరు


తే.

జలధి యుల్లోలకల్లోలములను దగిలి, యట్టె యెగయుచు డిగుచును బొట్టిపిట్ట
పగిది మెలఁగెడునావలోపల వసింప, భయపడుచు నుండునంత లోపలనె యెదుట.

196


సీ.

తనభయంకరవాలవినిపాత మమరేంద్రకరవాలహతి యంచు గిరులు వడఁకఁ
దనమస్తకోర్ధ్వరంధ్రవినిస్రుతాంబువు ల్పునరుత్పతద్గంగపొలుపు దెలుపఁ
దనవక్త్రబిలము సొచ్చినమహాతిమితిమింగిలతద్గిలంబు లంగిటను వెడలఁ
దనపార్శ్వభాగసంధర్షణంబున ద్వీపకోటులు నుగ్గులై నీటఁ గలయఁ


తే.

దనమహోద్దండనాసికాదండమునను, ఖండఖండంబులై యహిగ్రాహకమఠ
కర్కటీనక్రముఖజంతుకాండ మగల, జలధి విహరించు నొక్కమత్స్యంబుఁ గనిరి.

197


చ.

కని యిది యేమి యద్భుత మొకానొకనాఁడును జూడ మిట్టిజీ
వనచర మింక దీనిఘనవాలము సోఁకినయంతఁ దున్కలై
చను గిరులైన నీతరణిచందము నెన్నఁగనేల యంచు నె
మ్మనము గలంగి చూచుతఱి మానవనాథుఁడు వారి కిట్లనున్.

198


క.

ఓహో భయపడ నేటికి, నూహించితి నాఁటియండజోత్తమ మిది సం
దేహింపకుండి మనకున్, సాహాయ్య మొనర్ప వచ్చె జలనిధి ననినన్.

199


తే.

మౌనివరు లిట్టులనిరి యోమానవేంద్ర, నీవు సేసినభక్తి కెంతేని మెచ్చి
సకలవేదాంతములకుఁ గోచరముగాని, యాదితత్త్వంబు గోచర మయ్యె నిపుడు.

200


క.

ననఁగూడి తుంగ దలకె, క్కినవిధమున నిన్నుఁ గూడి కేశవమూర్తి
న్గనుఁగొంటి మింక నీహరి, వినుతింపుమటన్న ధరణివిభుఁ డుత్సుకుఁడై.

201


క.

చూచితిరే శ్రీహరిమా, యాచాతురి హేమమీనమై జలధిచల
ద్వీచీడోలాకేళీ, వైచిత్రిం జెలఁగుప్రాభవము మునులారా.

202


సీ.

అంభోధివరుఁడు వియన్నదీకన్యకపై నించు ముత్తేలప్రా లనంగ
వైమానికాంగనాసీమంతములఁ బొల్చు సోగవజ్రఁపుఁజేరుచుక్క లనఁగ
గగనలక్ష్మీవేణికాభారమును మించునిగ్గుక్రొవ్విరిజాజిమొగ్గ లనఁగ
నభిమతవిజయయాత్రారంభమున దిశాలలనామణులు జల్లులాజ లనఁగఁ

తే.

గంధిమధ్యాంబుచక్రచంక్రమణనిపుణ, కపటపాఠీనరాజజాగ్రన్మహోగ్ర
దీర్ఘవాలాగ్ర వినిహతోత్క్షిప్యమాణ, లోలకల్లోలజలబిందుజాల మమరె.

203


సీ.

అనిమిషేంద్రం బౌటన సురరోషరసాత్తరక్తసహస్రనేత్రము లనంగఁ
దనగృహంబునకు వచ్చెనటంచు వరుణుండు పూజ సేసిన పైఁడిపువ్వు లనఁగ
రత్నాకరాంతకభ్రమణవిస్ఫురణచే మైనంటి కనుపట్టు మణు లనంగ
రాజీవనామవిభ్రాంతితో మైవాలి కదలనిచక్రవాకము లనంగఁ


తే.

బృథులశతకోటిశితకోటిశృంగనిహతి, నెనయు జగడంబు పగడంపుతునుక లనఁగ
శాంబరీమత్స్యమూర్తిదేహంబునందుఁ, బొలుచు రంగారుబంగారుపొడలబెడఁగు.

204


క.

అని యనితరమతిఁ బొగడుచు, జనపతి వందన మొనర్ప జలజాక్షుఁడు మె
ల్లనఁ గ్రిందికిఁ జని నావం, దనమై ధరియించె భక్తతత్పరుఁ డగుచున్.

205


సీ.

తనక్రేవఁ గనుపట్టు ధరణీధ్రములఁ గిట్టు సెలసి కొమ్మునఁ గొట్టుఁ దలఁగఁబెట్టుఁ
బొడువఁగా నడతెంచుజడచరంబులఁ గాంచు నిడుదకోఱలఁ జించుఁ గడుపు పెంచు
వెనక బారులు దీర్చుఁ బెనుగ్రాహముల నోర్చు ఘనవాల మల్లార్చుఁ గడఁకఁ బేర్చుఁ
బ్రక్కలయం దబ్బురంబుగాఁ బెల్లుబ్బుఁ దరగలఁ బడగెబ్బు గరులదొబ్బుఁ


తే.

గాయకాంతులఁ దిమిరనికాయములకుఁ, బగలు గావించుచును బట్టపగలు సేయు
సారమున మించు మాయావిసారమూర్తి, యించు వేడుకదరి ధరియించునపుడు.

206


సీ.

భోగభాగాభోగభాగనర్ఘ్యచిరత్నరత్నదీప్తులు తమిస్రంబు నొడియఁ
దారతారస్ఫారదారుణాపారభూత్కారము ల్విషములు గ్రక్కుచుండ
నీలజాలవిశాలనీలశోభావాలమృదునేత్రములు మిఱుమిట్లు గొల్ప
దండభృద్దోర్దండమండనాయితగదాదండచండోద్దండదంష్ట్ర లమర


తే.

జగతిభారంబు సైరింపఁజాలు టుడిగి, యంబునిధిఁ దేలియాడు శేషాహి యనఁగ
ధవళతరదేహధగధగద్ధగలు మెఱయఁ, గదియ నేతెంచు నొకభుజంగంబుఁ గనిరి.

207


తే.

కాంచి యిఁక నేమి సేయుద మంచు గరుడ, మంత్రము జపించుచుఁ జలించు మౌనివరుల
వెఱవ నేటికి నిదియును విష్ణుదేవు, ననుమతంబునఁ జనుదెంచె ననుచు లేచి.

208


తే.

ఆనరేంద్రుఁడు భీషణాత్యంతదీర్ఘ, కాలసర్పంబు రజ్జువుగా ఘటించి
మీనశృంగంబునను నావ మెదలకుండ, గట్టిగాఁ గట్టివైచి యుత్కంఠ మెఱయ.

209


చ.

కరములు మోడ్చి ఫాలఫలకంబునఁ జేర్చి విశాలలోచనాం
బురుహముల న్మరందములఁ బోలి ముదశ్రులు జాలువార సు
స్థిరతరభక్తి భూపతి నుతించె దినాంతనటన్మృగాంకశే
ఖరమకుటీతటీరటితగాంగ [3]కృపీటఘుమంఘుమార్భటిన్.

210

సీ.

జయవియన్మణిఘృణిస్థగితగాఢతమిస్ర జయచంద్రకిరణదంష్ట్రాసహస్ర
జయచంచలాతిచంచలదీర్ఘలాంగూల జయభయంకరముఖశ్మశ్రుజాల
జయమస్తకోత్పతత్సలిలసిక్తవిమాన జయవృష్టితృప్తప్రజావితాన
జయనిర్జరేంద్ర వజ్రకఠోరతరశృంగ జయలక్షయోజనోచ్ఛ్రయశుభాంగ


తే.

జయమహాచక్రచంక్రమాచరణదక్ష, జయతరంగవిలంఘనచటులపక్ష
జయవిగాహప్లవోద్దామసత్త్వభూమ, జయహిరణ్మయపృథురోమసార్వభౌమ.

211


మ.

తళుకుంజాయకడానిమైపొడలు నిద్దామీసలు న్వేయికో
ఱలు గాటంపుగరు ల్ధగద్ధగితనేత్రంబు ల్మహేంద్రాయుధో
జ్జ్వలశృంగంబును దీర్ఘపుచ్ఛము మహాసత్త్వంబు హేమాద్రికిం
దులయౌ దేహము గల్గునిన్ను భజియింతు న్దంభమీనాధిపా.

212


తే.

చంద్రుసైఁదోఁడు పూఁబోఁడి జళుకుఁదళుకు, వాలుగన్నుల బెళుకుల వైపు సూపు
వాలుఁగన్నుల వలపింపవలయు ననియొ, దేవమాయపుమీన వైతివి పయోధి.

213

నాగబంధము

మ.

సమధిక మైనప్రేమఁ దగ సాగరమధ్యములోన నాగబం
ధమున నటించు భీమజవనాదకనత్కనకాంగధామవి
భ్రమఘనమీనమై మునులపాలన సల్పుచు వీఁకఁబూనవా
యమరఁగ నేము సాధునిగమాగమగమ్య నదీనజాసఖా.

214


మ.

స్వవిధం బంతయుఁ గాననీక బహుళాజ్ఞానాంధకారంబు క
న్గవఁ బైకొన్నఁ బదార్థతత్త్వ మెఱుఁగంగాలేని మా కిట్టిచో
రవికోటిప్రతిభావిశేషముల నశ్రాంతంబు విశ్రాంతమౌ
భవదీయాకృతి చూసిప్రోవు కుహనాపాఠీనచూడామణీ.

215


క.

మీనావతారమున స్వా, మీ నావఁ దరింపఁజేసి తీజలరాశి
న్నే నిన్నుఁ బొగడఁ [4]గలనే, మీనమ ననుఁ జేరి ప్రోవుమీ నలినాక్షా.

216


మ.

జడుఁ డజ్ఞానమున న్సుఖంబనుచు సంసారాంధకారంబునం
బడి దుఃఖంబుల వెంబడింబడి సుఖంపన్లేక వేసారి నీ
యడుగు ల్చి త్తములోఁ దలంచి నుతిసేయ న్వానికారుణ్యపుం
గడగంటం దిలకించి ప్రోతువు జగత్కల్యాణసంధాయకా.

217


క.

నే నెవ్వఁడ నాకీయ, జ్ఞానం బేమిటికి వచ్చెసంసృతిదుఃఖం
బేనాఁడు వాయు మోక్షం, బే నెన్నఁడు గాంతుఁ దెల్పవే కరుణాబ్ధీ.

218


క.

నావిని సత్యవ్రతధా, త్రీవిభుఁ గరుణాకటాక్షదృష్టిం గని రా
జీవాయితపాండరరా, జీవాయతలోచనుఁడు వచించె మృదూక్తిన్.

219

క.

నేను న్నీ వనుటయె య, జ్ఞానం బందుననె గలిగె సంసృతియా య
జ్ఞానము దెగ నదియుం దెగు, జ్ఞానము సమకూరు మోక్షసౌఖ్యము దొరకున్.

220


క.

విను మిది రజ్జువు ఫణిగా, దని తెలిసిన భయము నుడుగు నటువలె జీవుం
డనుగాను బ్రహ్మ మని తెలి, సిన నిర్భయుఁ డగుచు ముక్తిఁ జెందు నరేంద్రా.

221


క.

విను బ్రహ్మానందము తెలి, సినవాఁ డెందులను భయముఁ జెందఁ డనంగా
వినవే శ్రుతివాక్యంబుల, ననఘా తత్ప్రీతిఁ జెంద నర్హము గాదే.

222


సీ.

బహుజన్మముల సాధుపరిచర్య చేసినఁ బుణ్యపురాణార్థముల నెఱుంగుఁ
బుణ్యపురాణార్థముల నెఱింగినయంత సత్కర్మ మెప్పుడు సలుపుచుండు
సత్కర్మ మెప్పుడు సలుపుచునుండిన మత్పాదభక్తి యాత్మను జనించు
మత్పాదభక్తి యాత్మను జనించినమాత్రఁ గొనసాగి జ్ఞానంబు కుదురుపడును


తే.

జ్ఞానమునఁ బూర్వకర్మసంచయము లెల్లఁ, దీఱు నప్పటికర్మము ల్ద్వేషహితుల
కగును బ్రారబ్ధ మనుభూతమగుచుఁ దెగిన, జనుఁడు గైవల్యసామ్రాజ్యసౌఖ్య మొందు.

223


తే.

అని మఱియు సాంఖ్యయోగక్రియాదిబోధ, సాధకం బైన సపురాణసంహితాక్ర
మము సవిస్తరముగ సంశయములు దీఱ, యముల కెఱిఁగించుచున్న యయ్యవసరమున.

224


శా.

అబ్రంబైన భుజాబలద్రఢిమ వాహగ్రీవుఁ డత్యంతసు
ప్తబ్రహ్మాస్య సమీరనిస్సృతములౌ తమ్ముం బ్రమోషించి య
య్యబ్రాశిం జొఱఁబారుచో శ్రుతులు హాహాకారము ల్మీఱఁగా
నబ్రహ్మణ్యము వెట్టినం గపటమత్స్యం బేగెఁ దద్రక్షకున్.

225


సీ.

కమలజాతభవాండకర్పరం బొరయంగ మెఱుఁగుబంగరుచాయమేనిఁ బెంచు
బిరుదువజ్రపుగండపెండారమై మీఱుకొమ్మున శేషాహి గ్రుచ్చి యెత్తు
దిక్కుంభికుంభము ల్వ్రక్కలై ముక్తాఫలములు పై కెగయ వాలమునఁ గొట్టు
బడబానలము దపింపఁగఁ జేయు రూక్షవీక్షణముల విస్ఫులింగములు దాల్చు


తే.

భావిమంథమహీధరభ్రమణరీతిఁ, దెలుపుపొలుపున గిరగిరఁదిరుపుగట్టు
నబ్ధి నేకాంతలీలావిహారలోలుఁ, డైనహాటకకపటపాఠీనవిభుఁడు.

226


క.

అని తెలిపిన వైశంపా, యన శమధనలోక నిర్జరాధిపుతోడన్
జనమేజయవిభుఁ డనియె, న్వినయము రెట్టింప మిగుల విస్మితుఁ డగుచున్.

227


శా.

ఓవాచంయమిచంద్ర సంద్రములు నేఁ డొండైనవేళన్ హయ
గ్రీవుం డెక్కడనుండె నేకరణిఁ జేరె న్సత్యలోకంబు రా

జీవోత్పన్నుఁ డెఱుంగకుండ నిగమస్తేయంబు గావించి వాఁ
డేవంక న్వసియించెఁ దెల్పఁగదవే యేతత్పురావృత్తమున్.

228


క.

అన వైశంపాయనముని, విన విన నిం పొంద నిట్లు వినిపించె ఘనా
ఘనఘనరవగౌరణలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్.

229


క.

మును చాక్షుషమన్వంతర, మునను హయగ్రీవనామమునఁ దగుదనునం
దనుఁ డతిఘోరతపశ్చ, ర్యను హరు సంతుష్టుఁ జేసి యాహరుకరుణన్.

230


క.

వనరాశి భువనమోహన, మను నగరం బొకటి దానవాధ్యక్షత్వం
బును నిర్జరవరజిత్వర, ఘనబాహుబలంబుఁ గాంచి కదనోన్ముఖుఁ డై.

231


క.

రుషితుఁడుగా గిరి గుహలం, దుషితత్త్వము గన్నసురల కుచితంబయ్యె
న్దుషితత్వము పరు విడు నని, మిషపతియు మనోజవాఖ్య మించవహించెన్.

232


వ.

ఇట్లు దురతిక్రమనిర్వక్రదోర్విక్రమంబున శక్రాది సకలలోకపాలకులంబు
వికలంబు గావించి తదీయపదంబు లాక్రమించి వారలు దనపదంబు లాశ్రయింప
భువనత్రయం బేకాతపత్రంబుగాఁ బాలించుచుండి యొక్కనాఁడు.

233


చ.

హరిహయవహ్నిసౌరిదనుజాప్పతి వాయు కుబేర శంకరుల్
సరసత గొల్వుమ్రొక్కు లిడ స్వామి పరా కవధారు దేవ హె
చ్చరిక యటంచుఁ గంచుకులు సారెకు నూరెల నుగ్గడింపఁగా
నురుమణిపీఠి నిండుకొలువుండి నిశాచరనాథుఁ డిట్లనున్.

234


క.

ధీరహితులఁ దనమంత్రులఁ, జేరంగాఁ బిలిచి యతివిజృంభితవర్షా
ప్రారంభాంభోధరగం, భీరవచోగుంభనంబు మించ వచించెన్.

235


తే.

అఖిలదిక్పాలకాధిపత్యంబు మనకుఁ, జెల్లుచుండఁగ నిది యేమి క్షితిదివిజులు
యాగభాగంబు లర్పింప రంచు నొకని, శాచరునిఁ బంప వాఁడు యాజకులకడకు.

236


క.

చని “యింద్రాయస్వాహ”, యనుచుఁ బురోడాశ మిచ్చు నవసరమున హో
తను జెయివట్టి యహో నిలు, మని గద్దించుచును బలికె నందఱు వినఁగన్.

237


శా.

సౌవర్ణాచలధైర్యకల్పితతపశ్చర్యాసహర్షీభవ
జ్జీవంజీవసుహృత్కళాధరవరశ్రీదర్పభీతామనా
క్సేవాసాంజలితానమద్ధరిహయగ్రీవుం డనాఁగా హయ
గ్రీవుం డేలెడు ముజ్జగంబులు గనత్కీర్తిప్రతాపంబులన్.

238


సీ.

జేజే యనుచు మ్రొక్కు జేజేలరాయఁడు వేఁడికోనని చూచు వేఁడివేల్పు
దండంబు ధరియించు దండపాణి తదాజ్ఞ దా నవుదలఁ దాల్చు దానవుండు
చేతులు మొగించి ప్రచేతుండు భజియించు గతి నీవె యని సదాగతి చరించు
ధర్మువంచు మనుష్యధర్ముఁడు ప్రార్థించు శంకచే శరణొందు శంకరుండు


తే.

జలధి సొరబారు హరియును జడధి యగుచు, గట్టుమెట్టును బులితోలు గట్టుదంట
దెసలదొరలకె యిటువంటిదెసలు దొరలఁ, గలరె పరు లింక నతనితోఁ గలని కెదుర.

239

క.

ఓవిప్రులార వినుఁడీ, నావచనము నేఁటినుండి నన్నేలు హయ
గ్రీవునకు యాగభాగము, లీవలయు న్వహ్నిముఖుల కీవల దనినన్.

240


సీ.

ఏమేమి తాఁగాక యిఁక నెవ్వరున్నారు యాగభాగంబుల కనెడువారుఁ
దన కేల వచ్చె నింతమదాంధకారంబు తనువొల్లఁ డేమొకో యనెడివారు
సలుకక దుర్భాషలాడెడి దూతజిహ్వయె చీల్పవలయుఁబో యనెడివార
లెంతవింతలు పుట్టె నిది యేమి హేతువో యంచుఁ జిత్తమునఁ జింతించువారు


తే.

నొదిగి యేమనకూరక యుండువాఁర, లేమియుత్తర మంచు నూహించువారు
నగుసదస్యులలోఁ గొంద ఱార్యు లిట్టు, లనిరి సమయోచితంబుగా దనుజుఁ జూచి

241


తే.

నీవు సెప్పినబుద్ధి యెంతేని లెస్స, కాదనఁగ రాదు మాకు లోకముల కెల్ల
నేత గాఁడె హయగ్రీవనిశిచరేంద్రుఁ, డైన నొకమాట గల దెట్టు లనిన వినుము.

242


క.

వేదోక్తవిధిని మేమా, యాదివిజుల కొఱకె యిత్తు మధ్వరభాగం
బేదిక్కున స్వాతంత్రం, బేదీ మా కనిన దనుజుఁ డేగి రయమునన్.

243


శా.

ఆవార్త ల్వినిపింప దైత్యపతి రోషావేశ ముప్పొంగ నా
హా వేదంబుల యాగభాగము లమర్త్యశ్రేణికేగాని మా
కేవంకం బనిలేక యుండునటుగా నేర్పాటు గావించెఁ గా
నీ వేగంబ హరించి తచ్ఛ్రుతులు భగ్నీభూతము ల్సేసెదన్.

244


తే.

అరయఁగాఁ గశ్యపబ్రహ్మ కగ్రమహిషి, యైన దితిపుత్రులము గాన నాదిదేవ
తలము మే మట్టిమాకు నధ్వరములందు, భాగములు లేమిదేమి పాపంబుగాదె.

245


తే.

అహహ సత్రంపుఁగూటికి నమరవరులె, కాని మే మర్హులము గామెకాయటంచుఁ
[5]బరిహసించుచు నత్యంతపరుషరోష, రసకషాయితనేత్రుఁ డై యసురవిభుఁడు.

246


ఆ.

ఇంక నేఁడు మొదలు నెవ్వరు వేదముల్, [6]దలఁతు రట్టివారు దండ్యు లగుదు
రనుచుఁ జాటఁబంచె నఖిలలోకంబుల, దానవులకుఁ గలదె ధర్మచింత.

247


వ.

అంత.

248


క.

ఆవార్త లెల్ల నారదు, చే విని వీఁ డెంత దుడుకు చేసె నటంచున్
భావంబు గలఁగ శుక్రుఁడు, [7]వేవేగ న్వచ్చె దైత్యవిభుసభఁ జేరన్.

249


క.

వచ్చిన మునిపతితోఁ దన, ముచ్చట దనుజుండు దెల్ప మునిపతి దనలో
నచ్చెరువందుచు నిదియే, మిచ్చఁ దలంచితివి దానవేశ్వర చెపుమా.

250


తే.

అక్కటా స్వయంవ్యక్తము లైనశ్రుతుల, నౌనుగాదనఁ దగునె యయ్యజునకైన
సురలయందును ధర్మ మసురులయందుఁ, గలుషమును గల్గ మీకు భాగములు గలవె.

251

క.

కలకాలము పరకాంతలఁ, గలయందలఁచుటలు హింసగలగుణ మయ్యెం
గలవే ధర్మంబులు మీ, కలకలహములందెకాక యసురాధీశా.

252


తే.

అనిన నాగ్రహ మొదవ లోనడఁచి నెలవి, వారఁగా నవ్వి దైతేయవీరుఁ డనియె
నెంతమా టానతిచ్చితి రే నెఱుంగ, నే సుధాంధులధర్మంబు లింత యేల.

253


సీ.

అమరనాయకుఁ డహల్యాకాముకుఁడు గాఁడె శిఖి ఋషిస్త్రీల కాశింపలేదె
సతతంబు యముఁడు హింసకుఁ బాలుపడఁడె రాక్షసులలోపలివాడు గాఁడె నిరృతి
వీర్యంబు ఘటములో విడువఁడే వరుణుండు పననుండు గన్నెలఁ బట్టలేదె
శివ కపరాధంబు సేయఁడే ధనదుండు భర్గుం డొనర్పఁడె బ్రహ్మహత్య


తే.

హరియు భృగుపత్ని నొంపఁడే యజుఁడు గూఁతుఁ, గలయఁడే శశి గురుకాంతఁ గలసికొనఁడె
యింక శుద్ధాత్ము లగువేల్పు లేరి వేలు, మడఁచి యెఱిఁగింపుఁ డెఱిఁగిన మౌనివర్య.

254


తే.

తాము చేసినయవి యెల్ల ధర్మములఁట, మేము చేసిన దఘమఁట మేలుగాదె
యేకరణి వచ్చె వారల కింతయగ్ర, గణ్యతయు మాకు నింత లాఘవము జగతి.

255


ఉ.

ఎక్కడిధర్మ మేటిశ్రుతు లింకన నేటికి నేను రాజునై
పెక్కువ ముజ్జగంబులు నభేద్యపరాక్రమలీల నేల న
న్నెక్కుడుభక్తితోఁ గొలువ నిచ్చెదఁ గోరినవారికోరిక
ల్దక్కిన నోర్తుఁగాని పరదైవముల న్భజియింప నోర్తునే.

256


తే.

మీరు విచ్చేయుఁ డనుచు సమృద్ధిరోష, మెసఁగ డిగ్గన లేచి యయ్యసురవిభుఁడు
నగరిలోనికిఁ బోవ దానవగురుండు, నచ్యుతుఁడె చక్కఁబెట్టెడు ననుచుఁ జనియె.

257


సీ.

మునివృత్తి “నో” మని ముక్కు పట్టి జపంబు చేయఁ డొక్కరుఁ డేని జిత్తశుద్ధి
“నగ్నయేస్వాహా” యటంచు వేలిమియందు నొకఁడైన యాహుతి నొసఁగఁబోఁడు
“హరిరోహరి” యటంచు నాయాయిపుణ్యతీర్థంబుల నొకఁడైనఁ దానమాడఁ
డుపదేశ మొనరింప రొగిఁ “దత్త్వమసి” యంచు సామవేదంబుల సరవినొడివి


తే.

భూసురులలోన నింతేల భుక్తివేళ, నైనఁ “జిత్రాయనమ” యని యన్న మిడ ర
దేమి జెలువుదు నింక శ్రీరామరామ, తలఁప దోసంబు నాఁటిదుర్దశలతెఱఁగు.

258


తే.

లేశమాత్రంబు ధర్మంబు లేనికతన, జను లనావృష్టి నతివృష్టి సమయ విలయ
సమయ మగుటయు జలధు లైక్యమును జెండ, భువనమోహన మసురపుంగవుఁడు చేరి.

259


మత్తకోకిల.

ఇంక నా కిది వేళయంచు ననేకసంగరరంగని
శ్శంకబాహుమహస్సనాథుల సైన్యనాథులఁ బుత్రులం

బంకజాక్షులఁ గార్యదక్షుల బంధులం దగువారలం
గొంక కప్పురి నిల్పి దానవకుంజరుండు మదాంధుఁడై.

260


సీ.

మందులముడితాట మలఁచివేసినసిగఁ బొల్పుగానఁగనీని బొమిడికంబు
పరులకుఁ దాను గన్పడకుండ ఫాలభాగమునఁ బెట్టినయట్టి కావిబొట్టు
నెడవంకఁ బచ్చరాపిడివంకిఁ బొంకించి చారికట్టిన నీలిచాయదట్టి
వలకేలఁ బిడెము డాపలికేలఁ గేడెంబు నంగంబునందు వజ్రాంగిజోడు


తే.

మీఱ మఱియును దైతేయచోరభటుఁడు, కుఱుచకన్నపుఁగత్తి సొక్కుపొడిబరణి
మూలిక ల్మణు ల్వాకట్టు మొదలుగాఁగఁ, జోరసంగ్రహణీయవస్తువులు గొనుచు.

261


వ.

ఇత్తెఱంగున నత్తురంగగ్రీవుం డుత్తరంగితోత్సాహసాహసంబులు మనంబునం
బెనంగొన నభంగతిమిరభంగచంగన్మణిస్థగితగోపురం బగుపురంబు వెలువడి
నలుగడలం గడలి విలోకించుచు నొకించుక గొంచక రసాతలశ్రూయమాణ
విరించిచంచలలోచనాకరాంచలసమంచితవిపంచికారవవంచనాచుంచు
చంచత్తరంగాయమాననాగకన్యకానన్యసాధారణానూనగానతానమానం
బులకుం జొక్కుచు మయమాయానియమితోపరిహరిత్పరిచ్ఛదవితానాయి
తతోయధిం జొచ్చి ఘనాఘనఘనాపఘనజవజాయమానపవమానదోధూయ
మానజలచరవర్గం బగుబాహుద్వయద్వయసమార్గంబు పట్టిపోవుచు నాడా
డ సభ్యవహారంబులకై విహారంబులు సలుపు విహారంబుల కరతలప్రహారం
బులం జమున కుపహారంబులు సేయుచు వక్త్రంబు లగునక్రంబుల చక్రంబుల
నాక్రమించి చక్కు సేయుచుఁ గులాచలచక్రక్రమవక్రచంక్రమవిక్రమాభితః
క్షుభితసర్వతోముఖత్వరితసర్వతోముఖపరిపతజ్జలచరగ్రసనవ్యననవ్యగ్రపరి
వృతాయమాననానామహామీనాననంబులు సొచ్చి యుదరంబులు వ్రచ్చి
యు గాఢతరకంచుకవ్యూఢోరుస్తటి ఘణిల్లన మైనాకాదికులపర్వతంబులం
దాఁకుచు నిజావలోకనభయపలాయమానమానుషీవితానంబు లనవసరపదవి
లగ్నవిద్రుమలతావలయపతితజలమాణవకులం గనుంగొని హసించుచు నఖండ
గండతలమండనాయితపిచండిలమదప్రచండసముద్దండంబు లై యొండొండ
భండనంబులు సల్పుచుఁ గాండవేదండకాండప్రకాండంబుల నడుమఁదూఱి హ
రిదంతదంతిదంతురితకాంతిమంతంబులగు తదీయదంతిదంతంబులం బెకల్చి వరు
ణాంభోజనయనాకుచకుంభవిజృంభమాణావష్టంభసంరంభంబు లగుకుంభం
బుల మౌక్తికంబు లెడల వ్రేయునెడల జడిసి పరువిడ బెడిదమగు ఘీంకారం
బుల నంకురించిన శంకాతంకంబుల వడంకుచుఁ దమతమయంగనామణు లొసం
గుహఠాలింగనంబుల నుప్పొంగు జలమానుషకుమారవర్గంబుల మ్రొక్కులు

గైకొంచు నెడనెడం ద్రోవకడ్డంబై మెలంగు జలభుజంగంబులం గనుంగొని
దుశ్శకునంబని తలంచుచుఁ జేనొడిసి జిరజిరం ద్రిప్పివైచునెడ ఫణామణులు చె
దరి విస్ఫులింగంబులగములవలెఁ జూపట్టి యేపట్టున నిలువంజాలక మూలమూల
లకరుగు మకరకర్కటకాదిజంతుసంతానంబుల కగుబడబానలసంతాపంబునకుఁ
గొంత చింతించుచు భవిష్యత్కమఠధృతమందరవసుంధరాధరసూచకంబు ల
గుచు గిరులక్రింద నందందఁ గ్రందుకొనుకూర్మంబులు గ్రుంగ శృంగంబుల
మెట్టి లంఘించుచు ఘృతపరిఫ్లుతసముజ్జ్వలదౌర్వజ్వలనజ్వాలికాసంతాపశర్క
రాయితేక్షురసవ్యంజనసమంజసంబు లగుదుగ్ధంబులు గ్రోలుచుం దనివి సాలక
లవణరససంమిశ్రంబు లగుదధిఖండంబుల మెసంగుచు శుద్ధోదకంబుల గండూ
షించుచు హేలావధారితహాలారసపానవేలావిలోలాయితకాలానలకీలాకుల
సమాకులాభీలారుణశోభాలవాలవిశాలలోచనగోళంబులు ద్రిప్పుచు సోలు
చు జంబూప్లక్షాదిద్వీపవృక్షద్విత్రిమాత్రావశిష్టశాఖావలంబనంబునం గొంతవి
శ్రాంతుం డగుచు దివాకరమార్గంబు నిర్గమించి సుధాకరపథం బంటి తారాపథం
బున కెగసి బుధాదిగ్రహంబుల నతిక్రమించి ధ్రువమండలంబు దండకుం జేరి
మహర్లోకపథంబునం బయలుదేఱి [8]ప్రాప్తసంయుగవిలయసమయసముత్క్షిప్త
సప్తసప్తిదీప్తితతప్తు లగుచు నుపరిలోకంబులు వలసలు చేసి మరలి తమతమ
యగారంబులం జేరువారి నాలోకించుచు దాహాదివర్జితులై విరాజిలు వైరాజ
లోకంబగు జనర్లోకంబుఁ బ్రవేశించి యవ్వల శతానందనందనసనకసనందనాది
మునిబృందారకమునిబృందసహస్రారవిందబంధుబంధురప్రభాదురవలోకం బగు
తపోలోకం బస్తోకప్రయత్నంబునం గడచి యాకడం జనిచని.

262


సీ.

కడవన్నెతళుకుబంగరుకోట కెంజాయ సంజకెంజిగిరంగు సవదరింపఁ
దోరంపు ముత్యాలతోరణంబుల కాంతి చొక్కమౌ చుక్కల టెక్కు సూప
జేజేలరాఱాల చెలువంపుగృహపాళి కటికిచీకటిగుంపు గరిమనింప
రాణించు జాతివజ్రాల మేడలడాలు పండువెన్నెలచెన్ను పరిఢవిల్ల


తే.

వివిధమాణిక్యదీపము ల్వెలుఁగుచుండ, స్మరరణశ్రాంతమిథునలోచనసరోరు
హములు ముకుళింప నైశధర్మముల నొందు, సత్యలోకంబు గనుఁగొనె దైత్యవిభుఁడు.

263


చ.

కనుఁగొని విశ్వకర్మకరకౌశలి మెచ్చుచు రాజవీథులం
జనిచని ముందట న్వెలి హజారము వెల్వడి వచ్చుచున్న యా
సనకసనందనప్రముఖసంయములం గని పెద్దకొల్వు దీ
ఱె నలువయంచు నెంచి నడురేయి నిశాంతము సొచ్చి యచ్చటన్.

264

సీ.

ఉపసృష్టి క్రమమెల్ల నొప్పించి బహుమానమంది వచ్చిన కర్దమాదిఋషుల
జనులకర్మశరీరసంఖ్య లెల్ల దినాంతకము వేసి లిఖియించు కరణికులను
దమతమయాధిపత్యములు దీర హజారమందుఁ గాపున్న యింద్రాదిసురుల
వినికి వేళ యటంచు వీణలతంత్రులు సారించుతుంబురునారదులను


తే.

దానవరుసల పెంచు గంధర్వగాయ, కులను జతగూడునట్టువకొలమువారిఁ
గాసెగట్టు వియచ్చరకంబుకంధ, రలను జూచుచుఁ గక్ష్యాంతరములు గడచి.

265


సీ.

తోరంపుసాంబ్రాణిధూపధూమము గట్టు పగదాయబాబాలబారు దీర్ప
బంధురమురజధింధింధిమిధ్వానంబు బహుళగర్జావిజృంభణము నెఱప
వేలుపుమిన్నల వివిధభూషణకాంతి శక్రచాపస్ఫూర్తి సవదరింపఁ
దిరుపులగట్టు బిత్తరులమైఁదీఁగెలు గ్రొక్కారుమెఱుఁగులకోపుఁ జూపఁ


తే.

బుష్పవర్షంబు వడగండ్లపొలుపు దెలుప, సారమృదుగీతికామృతాసార మెసఁగ
వర్షవేళను బోలు నవ్వనజభవుని, నాట్యశాలను దడసె దానవవిభుండు.

266


ఆ.

అజుఁడు గొలువుదీరి యంతిపురంబున, కరుగుదనుక నొక్కయరుఁగుగప్పు
రాలత్రోవఁ గానరాకుండ డాఁగి యా, వెనుక మెల్లన వలఁజనుచు నెదుట.

267


తే.

భానుపరిపూర్ణనీహారభానుచిత్ర, భానుభానుమహోజనిస్థానదృశ్య
మానమాణిక్యదేదీప్యమాన మైన, కాళికాగేహపాళి వీక్షించికొనుచు.

268


సీ.

శారికాకలకంఠసగుణనిర్గుణవాదనిర్ణయప్రవణవాణీశుకంబు
రథవియోజితమనోరథమనోజ్ఞవిహారహారివాహనరాజహంసకులము
నశ్రాంతవికచహేమాంభోజవిహరమాణాజ్ఞాతవిరహిరథాంగయుగము
భారతీగళరవాభ్యసనలీలాలోలకవకివకలరవకలరవంబు


తే.

గురుకుచాహాసపుషితచకోరకంబు, గానవిద్రవమాణశృంగారసౌధ
చంద్ర తాంబుకణపాయిచాతకంబు, నగుచుఁ జెల్వొందు కేలీగృహంబునందు.

269


మ.

తళుకుంజప్పరకోళ్లమంచమున నిద్దాజాజిపూసెజ్జపైఁ
బలుకుంజిల్కలకొల్కి రాచిలుక బాబాసాహిబూనెయ్యపుం
గలనన్ సౌఖ్యము గాంచి మైబడలఁగా గాటంపునిట్టూరుపు
ల్వొలయ న్నిద్రితుఁడైన పద్మభవు నాలోకించి యాలోపలన్.

270


తే.

అతులమాణిక్యదీపము లార్పరామిఁ, దనదు నెమ్మేనిచాయ నత్తఱి శయించి
యున్నయుడిగెపుపూఁబోండ్లయొడలిమీఁదఁ, బాఱనియ్యక యొకయోరఁ జేరవచ్చి.

271

మ.

అతులంబై తగు బ్రహ్మవర్చ సము డాయన్రామిఁ బొంచున్నచో
నతివేలాయితనాసికానుషిరయాతాయాతనిశ్వాసమా
రుతసంక్షుబ్ధచతుర్ముఖంబులను మూర్తు ల్దాల్చి వేదాళిని
స్రుతయైనన్ హరియించె దక్షణమ రక్షోభర్త విభ్రాంతుఁడై.

272


సీ.

హీరకుట్టిమభూము లిసుకనేల లటంచు గట్టఁగా నడుగులు పెట్టవెఱచుఁ
బచ్చరాకట్నంబు పచ్చికపట్లని వెడవెడ మునివ్రేళ్ల నడచిపోవు
నిలువుటద్దంబుల నీడలు పరికించి పరులంచుఁ జేకత్తి పదిలపఱుచుఁ
దానువచ్చినతోవ గానక తలబొప్పిగట్టిఁగాఁ గుడ్యభాగములఁ దాఁకుఁ


తే.

దడఁబడుచు నిద్రపోయెడి తలిరుఁబోండ్ల, పాదముల మెట్టుఁ గాని మున్పంటిధైర్య
మూనలేఁడయ్యె విను మెంతవానికైన, దొంగతన మన్నయప్పుడె దొడరుభయము.

273


మత్తకోకిల.

అంత నొక్కక్రమంబునం దనుజాధినాథుఁడు భారతీ
కాంతుకేళిగృహంబు వెల్వడి కంధిగర్భముఁ జేరఁబో
నెంతయు న్మొఱవెట్టె వేదము లీశ్వరా మము దేవతా
హంతచేఁ బడకుండఁ బ్రోవవె యంచు బెట్టుగ భూవరా.

274


తే.

అప్పు డచ్చెరువందుచు నంబురాశి, దరినినుండెడి సప్తర్షివరు లిదేమి
యార్తనాదంబొ కపటమీనావతార, తేటతెల్లమిగా మాకుఁ దెల్పవలయు.

275


ఉ.

నావుడు శాంబరీశఫరనాయకుఁ డిట్లను మౌనులార వా
ణీవిభుఁ డిఫ్డు మైమఱచి నిద్దుర వోవఁగఁ జూచి యాహయ
గ్రీవుఁడు చోరవృత్తిని హరించి తముం గొనిపోవుచుండఁగాఁ
గావఁగ దిక్కు లేమిఁ గడఁక న్మొఱవెట్టఁదొడంగె వేదముల్.

276


ఉ.

కావున మ్రుచ్చురక్కసునిఁ గ్రక్కున నొక్కట నుక్కడంచి వే
దావళి నుద్ధరించి క్షణదాంతవినిద్రితుఁడైన బ్రహ్మ కీఁ
బోవలెనంచు మించుజలమున్ బలముం గలముం బయోధి నెం
తేవడి మీఱడించి దురతిక్రమవేగపరాక్రమంబునన్.

277


మ.

సమయాంభోనిధిఁ జొచ్చి చండతరచంచద్వాల మల్లార్చుచున్
సమరోజ్జృంభితజంభశాసన భుజాస్తంభాగ్రదంభోళి దు
ర్దమశృంగంబున వేదచోరపురవప్రశ్రేణికల్ నుగ్గునూ
చముగాఁ దాఁకె సుధాశనాసహనయోషాగర్భనిర్భేది యై.

278


మ.

అటులం దాఁకిన యంత దంతికరలూనాబ్జంబు చందంబునన్
స్ఫుటితం బైనపురంబు వేవెడలి రక్షోవీరు లీక్షించి యె
చ్చొటలే దిట్టికడానిచోఱ యిది గొంచుంబోయి చేకాన్కగా

ఘటియింపందగు దైత్యనేత కని దోర్గర్వం బఖర్వంబుగన్.

279


తే.

గాలములు వైచువా రది కాదటంచుఁ, బెనువలలు వేయువా రవి పనికిరావ
టంచు వడిగా రచెక్కకై యరుగువారు, నైన యసురుల కనియె నమ్మీనమూర్తి.

280


ఉ.

ధీవరులార గాలము తుదిం బలంబుగ నెఱ్ఱగ్రుచ్చి మీ
రీవగ వైచినం దగుల నేటికి నేఁటికి వింతమాంసమున్
గావలెనంచు వచ్చితిని గావుననేవలెనన్న మీ హయ
గ్రీవుని గ్రుచ్చి వైవుఁడు హరింపుదు నంతట మిమ్ముఁ జేరుదున్.

281


ఉ.

ఇంత ప్రయాస మేల చనుఁ డిప్పుడ యంచును వారు సూడఁ దా
నింతయి యంతయై వెనుక నేనుఁగయంతయి కొండయంతయై
యెంతయుఁ బెద్దయై కడలియెల్లెడ నిండి సహస్రయోజనా
క్రాంతతనూవిలాసమునఁ గన్పడఁ జూచి నిశాటసైనికుల్.

282


క.

నరభక్ష్య మైనమీనము, నరభోజనభక్ష్య మౌ ననఁగఁ జిత్రం బే
పరికించెద మిట నేఁడా, సురపతి నిను దినుట నీ వసురపతిఁ దినుటల్.

283


మ.

పదరం గారణ మేమి యంచు దనుజు ల్బాహాబలప్రౌఢిచేఁ
గదల న్మోఁదుచు నీఁటెలం బొడుచుచున్ ఖడ్గంబులం జించుచుం
గదియ న్గన్గొని మత్స్య మొక్కపరి శృంగం బట్టిటుం ద్రిప్పఁగా
నుదరంబుల్ శిరముల్ దెగంబడిరి దైత్యు ల్వేనవే లొక్కటన్.

284


శా.

ఆవార్తల్ హతశేషసైనికులచే నాలించి సేనాని దా
నీవేళం జని దానిఁ దెత్తునని వే యేతేరఁ ద ద్వాలలీ
లావిక్షిప్తమహానగాళిపయి వ్రాలం గూలె సైన్యంబుతో
దేవారాతివరూథినీవిభుఁడు మధ్యేరాజమార్గంబునన్.

285


వ.

అంత.

286


శా.

వాలోత్క్షిప్తగిరు ల్సురారివురిపై వ్రాల న్విశీర్ణంబు లై
రాలె న్గోపురముల్ గృహంబు లురిలెం బ్రాసాదముల్ నుగ్గులై
తూలె న్గోటలు మ్రగ్గె సౌధములు దోడ్తో ఛిన్నభిన్నంబు లై
వ్రీలె న్మండపపంక్తు లొడ్డగిలె నావిర్భూతఘోషంబునన్.

287


తే.

వానిలోపల నొక్కపర్వతము వచ్చి, తాను గొలువున్న కేళిసౌధమునఁ బడినఁ
బెగిలి పైఁబడఁ జేతులఁ బట్టి యవల, వైచి వెల్వడివచ్చి నిశాచరుండు.

288


తే.

అగమురాఁ గారణం బేమి యనుచు మంత్రి, జనుల నడిగిన వారలు వినయమునను
దేవ యొక పైఁడిచోఱ యీదీవి చేరి, విస్మయము సేయుచున్న దీవివిధగతుల.

289

సీ.

తిమితిమింగిలముఖ్యదీర్ఘమత్స్యంబులఁ గొమ్మునఁ గుదులుగాఁ గుచ్చి యెత్తు
దనసంతతికి మేతఁగొనివచ్చురీతి దిక్కరిశరీరంబుల గరులనాను
దృఢవాలమున గట్టు లెగయంగఁ గొట్టుచుఁ గేలిమైఁ గందుకక్రీడ సలుపు
నుగ్రసత్త్వాహార ముపశమించుటకు నా బడబానలము గ్రోలి పాఱవిడుచు


తే.

నాశరచ్ఛేదనముఁ దృణప్రాయముగను, జలుపు టేవింత యదియె కావలె నటన్న
గుటుకుమనకుండ బ్రహ్మాండకోటి మ్రింగి, సప్తజలధులు ద్రావదే క్షణములోన.

290


క.

అని మంత్రులు వినిపించిన, విని నవ్వుచు లేచి దైత్యవిభుఁ డది యేదీ
కనుఁగొందము గా కని తను, దనుజులు గొలువంగ వార్ధితటగతుఁ డగుచున్.

291


మ.

కనియె న్దానవసార్వభౌముఁ డెదుటం గల్పాంతపాథోధిరా
డనుగామీనము సాధులోకవిపదాయాసచ్ఛిదావ్యాజసం
జనితోద్యత్కరుణాధృతాయతతరీసప్తర్షిభూమీనము
న్ఘనదంష్ట్రాంగవిభాజితాయుతతమీకామీనము న్మీనమున్.

292


చ.

కని యిది మీను గాదు లయకాలమహాబలనీయమాన కాం
చనకుధరంబ యంచు మది సందియమందుచుఁ గాలరుద్రశూ
లనిభసహస్రదంష్టలు జ్వలద్బడబానలకీల లోలిలో
చనములు ధూమకేతుసదృశంబగు వాలము చూచి నివ్వెఱన్.

293


మ.

ఇది మీనంబగునైన నేమి యసిచే నింతింతగాఁ ద్రుంతునో
కుదియంగొట్టుదునో గద న్నిశితమౌ కుంతంబునం గ్రుచ్చి యె
త్తుదునో మీఁదికి నిప్పుడంచు మిగుల దుర్వారగర్వాంధుఁడై
కదియంజూచి మృషాఝషాధిపుఁడు జాగ్రద్వాల మల్లార్చుచున్.

294


తే.

శార్ఙ్గలీలావినిర్ముక్తశరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేయుశౌరి
శార్ఙ్గలీలా వినుర్ముక్త శరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేసె నపుడు.

295


ఉ.

ఓరినిశాచరాధమ పయోరుహగర్భుఁడు నిద్రవోవఁగా
నూరక యేల తెచ్చితివి యుత్తమవేదము లందు నేమిచే
కూరెను నేఁడు నీ కకట క్రోఁతికి మానిక మేల గూలఁగాఁ
గారణముంటఁ జేసి చెడుకార్యము చేసితి వింతె యిమ్మెయిన్.

296


క.

అన విని నీవా యెవరో, యనియుంటిని మంచికార్యమాయెను నేఁ జే
సినపుణ్యంబునఁ గా నినుఁ, గనుఁగొనఁగాఁ గలిగె నింతకాలంబునకున్.

297


శా.

నే నేదిక్కునఁ జూతునో యనుచు నెంతేభీతి వారాశిలో
మీనంబై మిడుకంగఁ జొచ్చితి వయో మేలే హరీ దీనికిం
కే నేమందును డాఁగఁబోయినఁ దలారిల్లయ్యె నేఁ డేడకుం
బోనౌఁ జిక్కితి వంటయింటిశశమై బోనంపుఁ బెన్గూటికిన్.

298

చ.

ఇదె కనుఁగొమ్మటంచు నిటలేక్షణరూక్షకటాక్షవీక్షులన్
గుదిగొని నిప్పు లుప్పతిల ఘోరతరభ్రుకుటీకరాళమై
వదనము భానుమండలము వైఖరి జేగుఱుచాయ మించఁగా
గదఁగొని త్రిప్పివైచె లయకాలమహోద్ధతి [9]తీరుమీఱఁగన్.

299


తే.

ఆగదాదండ ముద్దండమగుచుఁ దాఁకి, తోఁక వెండ్రుక యైనను దులుపదయ్యె
నేమి చెప్పుదు బృథురోచనామధేయ, మపుడు సార్ధకమయ్యె మత్స్యంబునందు.

300


వ.

అంత.

301


మ.

ఘనరోషంబున మీనమూర్తి నిజశృంగం బెత్తి తీరస్థుఁడై
మనుజాశిప్రభు నేయఁగాఁ దెగియె రంభాస్తంభముంబోలి త
త్తను వచ్చో నరుణోదయం బయినచందంబొప్ప రక్తౌఘము
ల్వనధిం దేలె వినిద్రతం దగెఁ జతుర్వక్త్రాబ్జము ల్బ్రహ్మకున్.

302


తే.

నిదుర మేల్కొని వేదము ల్నెమకి కానఁ, జాల కంభోజభవుఁ డబ్ధిఁ దేలియాడు
మీనమూర్తిఁ గనుంగొని మేనువొంగఁ, జేరి ప్రణమిల్లి సన్నుతి చేసె నిట్లు.

303


శా.

శ్రీమీనాకృతయే నమోభగవతే సృష్ట్యాదిసంధాయినే
హైమాహార్యరుచే హృతానతశుచే సారావపాథోముచే
సాముద్రాంబువిహారిణే దితిజనుస్సంహారిణే హారిణే
స్వామి న్పాహి కృపాహి తే హితతరా సర్వేషు దేహి శ్రుతీః.

304


మ.

అని వర్ణించు సువర్ణగర్భునకు వేదాళిం బ్రసాదించి గ్ర
క్కనఁ ద్రైలోక్యము సృష్టి సేయుమని శ్రీకాంతుండు పంప న్హసా
దని వాణీశ్వరుఁ డాగమోక్తముగ సూర్యాచంద్రతార స్దావం
బునుభూమిన్నభము న్సృజించెను యథాపూర్వంబుగా నంతటన్.

305


క.

అనఘుండగు సత్యవ్రతు, మనుపట్టము గట్టె శౌరి మన్ననఁ జతురా
ననుఁ డాతఁడె వైవస్వతుఁ, డను పేరంగలిగి యిప్పు డలరె న్మిగులన్.

306


మ.

మనుజాధీశ్వర యిందిరారమణు శ్రీమత్స్యావతారంబు భ
క్తిని విన్నట్టి కృతార్థు లుత్తమరమాదీర్ఘాయురారోగ్యము
ల్గని సత్యవ్రతసార్వభౌమునిగతిం గల్పాంతరస్థాయికీ
ర్తిని జెన్నొందుదు రజ్జనాభుకరుణాదృష్ట్యైకపాత్రంబు లై.

307


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

308


మ.

తనయాగ్రేసర రామదాసవిలసత్సాహిత్య హృష్యన్మనో
వనజాశంకరదాస గానకలనా వైయాత్యవీణానువా

దనసమ్మోదన పద్మనాభపరితోదారార్థశృంగారఖే
లనపద్యాదకరంగశాయి మధురాలాపప్రియంభావుకా.

309


క.

లక్ష్మాంబికామనోహర, లక్ష్మీకరుణాకటాక్ష లక్షణలీలా
లక్ష్మణవాణీవైభవ, లక్ష్మణపూర్వావతార లలితా౽కారా.

310


కవిరాజవిరాజితము.

ధనపతితారణ దుర్మదతారణ దానయుతారణరంగహరా
ఘనగిరివారణ గర్జితవారణ గంధిలవారణ మధ్యపురా
యనమవిచారణ హర్షితచారణ యంబుజచారణ కాంతిఝరా
వినమితకారణ వీరనికారణ విక్రమకారణ ధైర్యధరా.

311


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట్ర
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణమాచంద్ర రామమంతీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.

1. మత్స్యావతారకథ సమాప్తము.

  1. వేల్పువజ్రీలపాగలఁ దురాచెల్వు
  2. కరుణైకాయత్తచిత్తంబు
  3. ఝరారవగౌరవోక్తులన్
  4. గలనెయ, నేమని ననుఁ జేసి ప్రోవవే నలినాక్షా
  5. నపహసించుచు నత్యంత హర్ష రోష
  6. దగఁ బఠించువారు
  7. వేవేగమ కదలి దైత్యవిభుసభఁ జేరెన్
  8. ప్రాక్తనయుగవిలయ
  9. మీఱవైచినన్