దశావతారచరిత్రము/పీఠిక-2

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

దశావతారచరిత్రము

పీఠిక




కరమత్స్యకూర్మకిటిసింహవటూత్తమరామబుద్ధక
ల్క్యాకృతుల న్వచోమరధరార్భకవాసవసంశ్రవార్కకా
మాకుముదాప్తభృజ్జయకృతావనుఁ డై తగువేంకటేశుఁ డెం
తే కృపఁ బద్మనాభసచివేశ్వరుకృష్ణసుధీంద్రుఁ బ్రోవుతన్.

1


ఉ.

పాణితవాణి పంకరుహపాణి రమాఘనవేణి నిత్యక
ల్యాణము పచ్చతోరణములం దిగి తామరతంపరై కవి
ప్రాణపదంబు తా మగదలాన్వయకృష్ణసుధీంద్రచంద్రక
ల్యాణమణీగృహంబున నిరంతరము న్వసియించుఁగావుతన్.

2


శా.

అంతర్వాణులు రీణు లంచను నపఖ్యాతి న్నివారించెఁ గా
సంతోషంబున వస్తువాహనము లశ్రాంతంబుఁ దా నిచ్చి మా
కింతేచాలు నటంచు సంతసముతో నింపొందు నాభారతీ
కాంతుం డీవుతఁ గృష్ణమంత్రిమణి కాకల్పంబు దీర్ఘాయువున్.

3


మ.

తతయుక్తిన్ ఘనశబ్దము ల్వెలయ నర్థవ్యంజకప్రక్రియల్
తతి నానద్ధత మించఁ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీ
పతిచారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీ
సతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాటింపుతన్.

4


ఉ.

సప్తఋషీంద్రు లెల్ల బుధజాలము మెచ్చఁగఁ బార్వతీచకో
రాప్తముఖీవివాహమున 'సద్య భవే త్తవ సర్వమంగళా
వాప్తి' యటంచుఁ బల్క దరహాసము పూను శివుండు సత్కృపై
కాప్తతఁ బద్మనాభసచివాగ్రణికృష్ణసుధీంద్రుఁ బ్రోవుతన్.

5

మ.

తనగంభీరతచేత నిర్జలతఁ జెందం జేసి వారాశి డాఁ
గినమైనాకునిఁ బైటవైవక జగధేయప్రదానంబు వా
హినుల న్నించె నటంచు సమ్ముదముతో నింపొందు శైలేంద్రనం
దన యిచ్చున్ దయఁ బద్మనాభఘను కృష్ణస్వామి కైశ్వర్యముల్.

6


మ.

తళుకుంబంగరుమేను వజ్రమయమౌ దంతంబు హస్తంబునం
దళుకున్ముత్తెపుమోదకంబు దగ శృంగారంబుగాఁ జేసి ని
చ్చలుఁ బూజించుటచేఁ బ్రసన్నుఁడయి నిష్ప్రత్యూహసంసిద్ధిచే
వెలయించు న్ధృతి నేకదంతుఁడు గృపావేశంబుతో నెప్పుడున్.

7


మ.

భవతేజంబునఁ బుట్టి రామభజనాపారీణుఁ డై పద్మసం
భవసామ్రాజ్యరమాధురంధరతకై భాసిల్లియు న్నిత్యస
త్యవిశేషస్థితి సద్విరోధివిషయధ్వాంతార్కబింబాకృతిన్
భువిలో మంతున కెక్కి నట్టి హనుమంతుం గొల్తు నిష్టాప్తికిన్.

8


మ.

ఘనశబ్దేభ ముదీర్ణవర్ణమణిప్రేంఖద్ధాటిఘోటంబు చం
కనదర్ధం బతిహృద్యపద్యభటసంఘాతంబు లోకైకరం
జనశృంగారవధూక మైనకవితాసామ్రాజ్య మేలంగ నే
ర్చినవిద్వత్కవిరాజరాజుల వచశ్శ్రీ నెంచి ప్రార్థించెదన్.

9


మ.

పదలాలిత్యము లేమి ఖంజులును శబ్దజ్ఞానవిజ్ఞానసం
పద లేమిన్ బధిరు ల్పదార్థములఁ గాన్పన్ లేమి జాత్యంధులు
న్మృదుత న్వేఁడిన నుత్తరం బొసఁగలేమి న్మూఁగలౌ వారి దు
ర్మద మేమాత్ర మదేల తాదృశకవిమన్యు ల్వివాదార్హులే.

10


సీ.

శ్లేషాదిపదములు చెలువు సూపఁగఁ బదవాక్యార్థదోషము ల్వర్జములుగ
విమలకైశిక్యాదివృత్తులు దనర వైదర్భ్యాదిరీతులు దళుకు నెఱప
సరసరత్యాదికస్థాయిభావములు శృంగారాదిరసములక్రమము మెఱయ
భావవిభావానుభావసాత్త్వికభావసంచారిభావము ల్మించుగులుక


తే.

విలసదుపమాద్యలంక్రియ ల్వింతఁ దెలుప, లలితముగఁ బాకములు సేయ లక్ష్యశయ్యఁ
గవిత రచియింపనేర్చు సత్కవికిఁ గాకఁ, గాకవుల కేది లోకవిఖ్యాతకీర్తి.

11


వ.

అని క్రమంబున విశిష్టేష్టదేవతానమస్కృతియు సుకృతిజనపురస్కృతియు దుష్కృ
తితిరస్కృతియుం గావించి చమత్కృతి మత్కృతి నిర్నిమిషాయత్తచి త్తం
బుతో నున్నయవసరంబున.

12


సీ.

తనదుకీర్తి సరోజధామకు భువనజాతమ్ములు భువనజాతములు గాఁగఁ
దనప్రతాపాగ్ని కుద్ధతనృపాలపతంగమండలంబు పతంగమండలముగఁ

దనదయాశరధిరత్నమునకు మార్గణౌఘంబులు మార్గణౌఘములు గాఁగఁ
దనదుయౌవనవసంతవిజృంభణమునకుఁ గలకంఠికలు గలకంఠికలుగఁ


తే.

బ్రబలు మగదల పద్మనాభ ప్రధాన, పూర్వజన్మసహస్రసంపూర్ణరచిత
పుణ్యపరిపాకఫలరూపబుద్ధిశాలి, మహితగుణపాళి కృష్ణయామాత్యమౌళి.

13


వ.

వెండియు నఖండనవఖండధరణీమండలభరణప్రచండమనీషాదండితపుండరీకకుండ
లీంద్రుండును నిజకటాక్షవీక్షాయత్తచిత్తనిర్వర్తితప్రతివసంతయాగకుండలీంద్రుం
డును,మహోదారధీరతావధీరితసుధారతాధారతాపాత్రగోత్రుండును గాశ్య
పగోత్రుండును, సగణితరమణీయగుణమణిస్యూతిక్రియానుగుణాయతానవద్యవి
ద్యానిషద్యాయితవిద్వత్కవికల్పితహృద్యవేద్యగద్యపద్యసూత్రుండును నాపస్తం
బసూత్రుండును, నప్రతిమానప్రతీకబలవిజితసార్వభౌముండును మగదలసార్వ
భౌముండును, నిర్వేలవిభవవిజితపవిత్రుండును నార్వేలకులపవిత్రుండును, సక
లజనస్తుత్యపాతివ్రత్యనిత్యాంతరంగమాంబాప్రతిబింబరంగమాంబామనఃపద్మ
పద్మబాంధవపద్మనాభప్రథానవతంసనందనుండును దద్జ్ఞానవరతవినుతజ్ఞానసనం
దనుండును, సతతసత్కీర్తిపరాయణాదినారాయణాదిసోదరుండును కృపాతా
మరసోదరుండును నగుకృష్ణమంత్రిచంద్రుం డొకానొకనాఁడు కొలువుశృంగా
రంబై యతిశీతలక్షమాతలోదరీహృదయతలనిదర్శనాయమానమానితయామినీ
కాంతాకాంతకాంతకాంతవేదికాంతరంబును, నక్షీణయశోహర్యక్షసముత్పాటి
తానీతహరిదంతదంతావళదంతకర్ణేజపదంతపాంచాలికాసమంచితకాంచనస్తంభ
సహస్రసంభావితంబును, జామరకళాచికాకనకభృంగారతాలవృంతహాటకవీ
టికాపేటికాదిధారివధూటికాకోటికాప్రతిబింబాడంబరసచిత్రవిచిత్రనీరంధ్రమ
ణిప్రభానీరంధ్రకుడ్యభాగంబును, నన్యరాజన్యకన్యకాహస్తకమ్రతరసామ్రాణిధూ
పధూమస్తోమశ్యామభూమాభిరామభ్రమరలలామప్రకామకామప్రదామోద
మేదురజలజాతకేతకీసౌగంధికబంధురితవితానప్రతానంబును, జటులతరస్ఫటికప
టలప్రకటితసోపానరుచితరంగితాభంగురగంగాతరంగిణీతరంగాంతరంగరంగజ్జల
సారంగశృంగారపారంగతమౌక్తికమత్తేభప్రభాసమానోభయపార్శ్వంబును,
నూతనతానమానగాయినీగానద్రవమాణవలభీవలభిదుపలజలబిందుసందోహసం
దేహదోహళతదంతదంతురతంతన్యమానచంచచ్చంచలాచంచలచామీకరచల
దళాంచలసమంచితముక్తామణితోరణంబును, రణాంగణభయానకజయానకాగ
ణ్యథాణంధణ్యాకర్ణనోదీర్ణకర్ణవిత్రస్తలీనమత్సమస్తదేశాధినాథవక్షస్థలీవిన్యస్త
నిస్తులకస్తూరికాలేపనానురూపముక్తారంగవల్లికాటోషప్రదీపితప్రతిబింబితరూపా
జీవికాంభోజనయనాశాతకుంభకుంభకుచకుంభికుంభవిజృంభమాణతారావతార
తారతారహారమనోహరప్రాంగణంబును, బద్మాప్తరుచిపద్మాచ్చదపద్మపద్మరాగసరా
గవిటంకానురాగపారావారాపారదృశ్వాపారపారావతారావకూటంబు నగుకొ

లువుకూటంబునంబొడవు కెంపుసొంపునింపువినుకెంపునుడికింపువిడికెంపురవచెక్క
డంపుకడవన్నెపసిఁడిగద్దియ నధివసించి, కరివేల్పుముద్దియ చెలంగుముద్దియ యాట
పట్టువిరిగద్ధియపైఁ బెద్దగొలువుండు తెఱగంటిపెద్దతో నుద్దియై, ప్రచండతరమా
ర్తండమండలంబున నిండుకొలువుండు పుండరీకనయనుని గండుమిగిలి చింతామ
ణిభద్రపీఠంబున సుఖాసీనుం డగునాఖండలు మెండు కొల్ల లాడి ధాతుపుంజంబు
కెంజిగి రంజిల్లు నుదయగిరి నుదయించు పరిపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుడంబరం
బు విడంబించుచు నోలగంబై పొడగను పాండ్యతుండీరచోళనేపాళగౌళకర్ణాట
కరహాటభోటాదిదేశాధినాథులప్రధానులయెడ బహుమానంబును, బైగోవర
క్కంగుపారసీమక్కామలాకాదినానాంతర్ద్వీపధరణీపతు లంపినపట్టంపుటేనుం
గులు, పట్టుచుట్టలుఁ, బచ్చకప్పురంబు మొదలగు పరిమళంబులుఁ, బడమటిపన్నీ
రుచెంబులుఁ, బంచవర్ణపుఁజిలుకలుఁ, బటీరతరుఖండంబులు, స్ఫటికపుగిండ్లు,
పగడపుఁగోళ్ళపట్టెమంచంబులు, పఱపుగలకుంకుమపుపఱపులు, పసిఁడిప్రతి
మలంబోలు పరిచారికాజనంబులు మొదలుగాఁగలుగు కానుకలు గన్గొనుపట్లం
బరాకును, వందిమాగధపఠ్యమానబిరుదగద్యపద్యాకర్ణనంబున సలజ్జావలోకనం
బును, బాంధవజనంబులయెడ వినయంబును మిత్రులపై ననురాగంబును, భేదా
భేదంబులు వాదించువిద్వజ్జనంబుల కెల్ల ననుకూలంబుగా నేకోత్తరం బోసంగు
నెడఁ బాండిత్యంబును, బ్రకృతిపురుషవివేకంబు ప్రసంగించుసాంఖ్యసంఖ్యావత్ప్ర
సంగంబున నంగీకారంబును, యోగశాస్త్రంబుల ననుభవంబును, దర్కకర్క
శోక్తుల దరస్మితంబును, గణాదేశ్వరప్రతిష్టాపనంబున సమాదరంబును, నిరీ
శ్వరకర్మవాదుల మంగళాచరణాదిప్రసంగంబున సర్వేశ్వరత్వంబు సాధించు
మేధావిశేషంబును, నానాదిగంతాగతకవీశ్వరఘటితనిజనామాంకితబిరుదా
వలీచక్రవాళభోగావళీత్యాగఘోషణాయక్షగానోదాహరణతారావళీశత
కాదికవితారచనావిశేషంబుల రసజ్ఞతయుం, బ్రవీణవైణికవీణాశ్రవణానురాగ
రాగమేళలయస్ఫురితశిరఃకంపనానువాదంబున నానందంబును, మానికపుఁగం
బంబుల దండనుండు చికిలిదంతంపుబొమ్మ లూడిగంపుఁజక్కెరబొమ్మ లని యో
సరిలు ద్వీపాంతరజనంబుల ముగుదతనంబునకు నగుతమచక్కనినగవు చొక్కపుఁ
జీవిచక్కెరని సొక్కి మెక్క నుంకించుచు ఱెక్కలార్చుకేళికాశుకంబుల కుత్సుకం
బుగ సుధామధురాధరబింబంబులఁ గూడికొను వారవిలాసినులవిలాసంబు లవ
లోకించునెడ నుల్లాసంబునుం జెల్వొందం గొల్వున్న యవసరంబున.

14


క.

నను సంస్కృతాంధ్రభాషా, వినుతు దినైకప్రబంధవిరచనదక్షుం
గనుఁగొని యిట్లని పలికె, న్వినయంబు నయంబు హెచ్చ విబుధులు మెచ్చన్.

15


సీ.

శ్రీరామకరుణారసారూఢసంస్కృతప్రాకృతాద్యష్టభాషాకవిత్వ
తత్త్వసంవేదివి ధరణిదేవుల తిమ్మయామాత్య పౌత్రుండ వన్నదాన

ముఖ్యనానాదానముదిత భూసురచంద్ర నాగప్రధానేంద్రనందనుఁడవు
పణియమాంబాగర్భపాథోధిచంద్రుఁడ వాత్మవిద్రఘునాయకాద్యనుజుఁడ


తే.

వాప్తుఁడవు గాన వేఁడెద నందముగను, గృష్ణునిదశావతారము ల్గృతి యొనర్చి
యంకితము సేయు మాకుఁ బ్రఖ్యాతి నీకు, మహితగుణసాంద్ర రామయామాత్యచంద్ర.

16


వ.

అని కనకాంబరాభరణగ్రామబహుగ్రామసమేతంబుగాఁ గర్పూరతాంబూలంబు
సమర్పించినం గైకొని కౌతుకతరంగితాంతరంగంబుతోఁ గృతినాయకుని వంశా
వతారం బభివర్ణించెద.

17


సీ.

శ్రీకరవేదాంతసిద్ధాంతవైఖరీపారదృశ్వలు పరబ్రహ్మ మనియు
సృష్టిప్రధానప్రకృతితత్త్వవిజ్ఞానపరు లైనసాంఖ్యులు పురుషుఁ డనియుఁ
గ్రతుముఖ్యనిర్మలకర్మప్రవర్తనహితులు మీమాంసకులీశుఁ డనియుఁ
పంచనంస్కారవద్భక్తిప్రపత్త్యుదంచితపాంచరాత్రులు శేషి యనియు


ఆ.

మఱియు ధన్యులయిన మాధ్వు లంతర్యామి, యనియు నెట్టిదేవు నాశ్రయింతు
రట్టిదేవదేవుఁ డాదినారాయణుఁ, డఖిలజనముఁ బ్రోచు నాదరమున.

18


తే.

[1]భువనజాతాశ్రయం బౌట భోగిశయను, నుదరతలమున నీరజ మొదవె దానఁ
గలిగె బ్రహ్మరజోయుక్తిఁగారణాను, గుణము కార్యం బగుట యెట్లొకో గణింప.

19


తే.

బ్రహ్మకు జనించెను మరీచి బ్రహ్మవర్చ, నకృతఘర్మమరీచిలోచనమరీచి
యతని కుదయించెఁ గశ్యపుఁ డనభివిదిత, గోత్రదాయకుఁ డయికులగోత్రధృతిని.

20


శా.

శ్రీమత్కాశ్యపగోత్రవారిధి జనించెం బూర్ణసోమాకృతిన్
సోమామాత్యుఁడు సత్కళావిలసనాస్తోకావలోకంబు శ్యా
మామోదంబుఁ గలప్రసక్తకమలోదారప్రచారంబు ని
త్యామందప్రమదాశ్రయద్బుధకుమారాసక్తియు న్మీఱఁగన్.

21


సీ.

రసమంటె ననుచు నీరసముతోడఁ బుటంబు వేయ మేరువుఁ జేరె విశ్వకర్మ
రాయంచఁ దేనేమిరా యం చమర్షియై సాదితో వాదించె షణ్ముఖుండు
నారదకలను గన్నార దర్శింతురే యని తుంబురుని వేఁడె నమరవిభుఁడు
నలువదనంబుల నలువొందుశివుఁ డెందుఁ గలిగె నంచు విరించిఁ గనిరి మునులు


తే.

మహితమగదలసోమనామాత్యసోమ, రామణీయకయుతకీర్తిరామరుచిర
రుచినిచయ మెల్లదిక్కులఁ బ్రచుర మయిన, బ్రమసి తెలియంగఁజాలక ప్రౌఢు లయ్యు.

22

క.

సోముఁడు గావున గౌరీ, భామినిఁ జేకొనియె ననుచుఁ బ్రజ లెన్నఁగ నా
సోమామాత్యశిఖామణి, ప్రేమంబున గౌరమాంబఁ బెండిలి యయ్యెన్.

23


క.

గౌరమ సుగుణావళి బా, గౌరమ మహిమహిళ నగుక్షమాన్విత యయ్యున్
గౌరమనోహరకీర్తులు, గౌరమ హసియింపఁగా జగన్నుతలీలన్.

24


తే.

గౌరియందుఁ గుమారునిఁ గనియె సోముఁ, డౌర యచ్చెరు వని జను లనఁగ సోమ
మంత్రి గౌరమయందుఁ గుమారుఁ గనియెఁ, దిమ్మనామాత్యచంద్రు సుధీఫణీంద్రు.

25


శా.

ఏమే జాన్హవి యేమి రాఘవ యదేమే వైరి నెన్నేవు నీ
వేమీ నానవతిం [2]గణించెద వదేమీ నీవు కాళిందివా
యౌ మే నేటికిఁ దెల్లనాయె జలధీంద్రా తిమ్మమంత్రీశ్వర
శ్రీమత్కీర్తులు గ్రమ్మఁగా ననిన నాశ్లేషించు హర్షంబునన్.

26


క.

తిమ్మనమంత్రీంద్రుఁడు ల, క్ష్మమ్మను వరియించి కనియె నాశ్రితజలరు
ట్సమ్మోదనచాతుర్యర, విమ్మాన్యదయాప్రచారు వేంకటధీరున్.

27


చ.

మగదలతిమ్మధీరునికుమారుని వేంకటమంత్రి నెన్నఁ బ
న్నగపతి శక్తుఁ డౌనె తదనారతకల్పితదానవాహినీ
లగనసమృద్ధసస్యఫలలాభములన్ సకలప్రజావ్రజం
బగణితభోగ మొంద [3]వృథలౌఁ జెఱుపు ల్దొరువు ల్ప్రవర్షముల్.

28


సీ.

అగ్రహారంబుల నలరించె ధారుణీరమణీకుచాగ్రహారములు గాఁగ
దానము లొనరించె ధరణి నిర్జరభూరిదారిద్ర్యహరణ[4]నిదానములుగ
నర్థులఁ బోషించె ససమానచీనిచీనాంబరదానకృతార్థులుగను
బంధుల రక్షించే సింధుబంధుసుతాదృగంతబంధుకృపాబంధులుగను


తే.

మంత్రిమాత్రుండె మానినీమానమథన, మదనసమమూర్తి హరిదంతమధురకీర్తి
[5]వినతనృపపాళి మర్దితవిమతపాళి, మహితరుచిహేళి వేంకటామాత్యమౌళి.

29


క.

పద్మాధరణుల నేలిన, పద్మాక్షునిలీల [6]వెలసె భాసురతేజ
స్పద్మము వేంకటధీమణి, పద్మాంబిక వేంకటాంబ భార్యలు గాఁగన్.

30


తే.

ఔర వేంకటవిభుద్వితీయద్వితీయ, యద్వితీయగుణస్ఫూర్తి నతిశయించి
యద్వితీయేందు హసియించు నళికరేఖ, వశమె యావేంకటాంబచెల్వంబుఁ బొగడ.

31


సీ.

విబుధేంద్రమాతయై ప్రబలె నాయదితి దాఁ గశ్యపుసంగతి [7]గాంచు టెట్టు
లతిసువర్ణాఢ్యత నందె నాభారతిపతి హయంబులఁ బట్టఁ బనుపు టెట్లు
స్నేహంబు గలిగె నాక్షితిభృత్కుమారి యీశ్వరుతల జడగట్ట నరయు టెట్లు
విభవంబుఁ జెందె నాఋభురాజగేహిని గనుమూయ నెడలేక మనుట యెట్లు

తే.

మతము గాదిది విబుధేంద్రమాత యనిన, నతిసువర్ణాఢ్య యనిన స్నేహవతి యనిన
విభవవతి యన్న మగదల వేంకటాంబ, గాక యితరల కెవ్వి యీగౌరవములు.

32


క.

ఆవేంకటాంబగర్భసు, ధావార్ధి జనించి రమరధరణీరుహసు
శ్రీ వెలయఁగ నేగురుసుతు, లావిర్భావాదివితరణాన్వితు లగుచున్.

33


ఉ.

తిమ్మన వీరరాఘవసుధీమణీ కేశవమంత్రి దాతృతా
హమ్మతి పద్మనాభసచివాగ్రణి నారణశౌరి వారిలోఁ
దిమ్మన పాండితీగతి నుతింపఁగ శక్యమె భోగివల్లభుం
గిమ్మననీఁడు వాదములకే చనుదెంచిన యుక్తిశక్తులన్.

34


సీ.

సంగీతపుంభావశారద సాహిత్యతత్త్వాద్యతనకాళిదాసుఁ డతుల
వితరణైదంయుగీనతపనతనయుండు [8]భూతదయాదృతభూతలుండు
భక్తిప్రహృష్టనాభౌసరోజుఁడు శాశ్వతైశ్వర్యపాణౌకృతాద్రిసుతుఁడు
దిక్కూలముద్రుజదేదివద్ఘనకీర్తిజాగ్రజ్వషంతపశౌర్యశాలి


తే.

వీరవేంకటపతిరాయవిభువతంస, భావితోభయచామరభద్రదంతి
దంతపల్యంకికాదిసన్మానఘనుఁడు, ధీమరున్మంత్రి మగదలతిమ్మమంత్రి.

35


ఉ.

తిమ్మనమట్ల తేనియలు తేరగఁ బల్కఁగ నేర్చు బంధుజా
తిమ్మనఁ జూచుఁ బ్రోచు నతిథిప్రకరమ్ములఁ గైటభాభియా
తి మ్మనసారఁ గొల్చు నతిధీరత వేంకటమంత్రి పుత్రుఁడౌ
తిమ్మనమంత్రిపాటి జగతీస్థలిలోపల మంత్రి గల్గునే.

36


తే.

అట్టితిమ్మనమంత్రి వెంగాంబయందుఁ, గనియెఁ దిరువేంగళాంబనాఁ గన్యలక్ష్మి
చెలువునను శ్రీనివాసార్యుచెట్టపట్టి, [9]కనియె నాదెప్ప రంగప్ప ననఘమతుల.

37


తే.

వీరరాఘవమంత్రికి వీరరాఘ, వుండె సరిగాక ధర మానవుండు సరియె
శౌర్యగాంభీర్యసౌందర్యసౌకుమార్య, కార్యచాతుర్యధుర్యతౌదార్యములను.

38


మ.

తరమే వేంకటమంత్రికేశవుమహోదారత్వ మెన్న న్నిరం
తరముం దానజలైకవర్షకఘనానందం బతం డొందఁగాఁ
బరమంత్రీశ్వరకీర్తిహంసికలు విభ్రాంతంబులై యేడకో
యరిగె న్మానసవాసముం గనక యత్యాశ్చర్య మౌనేకదా.

39


సీ.

మాననీయనరేంద్రమంత్రాచరణవేళ ఫణినాయకుఁడు తడఁబడకయున్న
విబుధవల్లభసభావిద్యాప్రసంగతి గురుడు చార్వాకంబు గోరకున్న
నతిశయాళుతఁ గాంచునవసరంబున బ్రహ్మ యాగమపాళిఁ బోనాడకున్నఁ
దత్త్వవివేకచింతనవేళఁ బురవైరి సర్వజ్ఞగతినె గాంచకయె యున్న

తే.

సాటి యనవచ్చు మగదలశాసనాంక, వేంకటామాత్య మకరాంకపంకరహిత
పంకజగృహాజనకనిష్కలంకపూర్ణ, చంద్రునకుఁ బద్మనాభసుధీంద్రునకును.

40


సీ.

ప్రతిఘటించిన నెంతబలవంతులను బటాపంచగాఁ దఱిమించుప్రౌఢిమంబు
నమ్మితి మన్న నెంతటిదరిద్రుల నైన శ్రీలచేఁ జెల్వొందఁజేయుకరుణ
మతభేద మన్నచో మతిమంతు లౌనన నైకమత్యము సేయునలఘుబుద్ధి
వలయునటన్న భూవరుల చెంగటఁ గార్య మెంతయైనను నిర్వహించునేర్పు


తే.

విద్య వినయంబు తాదృశవిభవమునను, శాంతి యేపట్ల ధైర్యంబు సరసమృదుల
భాషణంబులు గల్గి వైభవము మీఱఁ, బ్రబలు మగదల పద్మనాభప్రభుండు.

41


సీ.

మంత్రీశ్వరుఁడు గాన మౌళిపై వలగొన్న భాగీరథి యనంగఁ బాగ దనర
రామకథాసుధారసము బుగ్గలఁ బోలి కట్టాణిగొప్పచౌకట్లు మెఱయఁ
గనకంబుఁ గెలుచునంగంబు తేజములీల నేకరంగికబాయి యింపు గులుకఁ
బైకొన్న యాదిమప్రభులకీర్తులరీతి వలిపెపైఠాణిదువ్వలువ వెలయ


ఆ.

గుణములను బోలి వృత్తానుగుణము లయిన, కంఠమాలిక ముత్యాలకడియములును
మొదలుగాఁ గల భూషణంబులు వెలుంగఁ, బ్రబలు మగదల పద్మనాభప్రభుండు.

42


సీ.

అపరిహాస్యంబుగా నన్యమతంబులయందు శంకఘటించునౌఘళంబు
నలరామకథల పాయసనిభాగంబుల నేకరీతిగ నిర్వహించుపటిమ
జీవకర్మానాదిభావ మీశ్వరసమత్వము గ్రమంబునఁ దెల్పు తత్త్వసరణి
ఘనభర్తృహరిశతకత్రయంబునఁ బ్రతిశ్లోకంబునను వింతఁజూపు సొబగు


తే.

మఱియుఁ జాటువులందు రామాయణాది, బహువిధగ్రంథములయందుఁ బ్రాజ్జు లెన్నఁ
బూర్వసిద్ధాంతపక్షము లొసఁగఁజేయు, భళిర మగదల పద్మనాభప్రభుండు.

43


సీ.

దరముతోఁ దుహినకందరముతో గిరిశనూపురముతోఁ బచ్చకప్పురముతోడ
రసముతో ధవళసారసముతో శివమహాననముతో నుషితమానసముతోడ
శరముతో మరుజాజిశరముతో ముత్తేలసరముతో దేవతాసరముతోడ
భవునితో నజతనూభవునితో రేవతీధవునితోఁ గుముదబాంధవునితోడ


తే.

దోడునీడయి క్రీడించు వేడు కలరఁ, బ్రౌఢ గావున మగదల పద్మనాభ
సచివమూర్ధన్యబహుదానజాయమాన, కీర్తికాంతాలలామ దిగ్విజయధామ.

44


చ.

మగదల పద్మనాభునిసమస్తగుణవ్రజముం గణింపఁ గా
నగణిత మౌట నూరక గుణాకరుఁ డంటిని దొంటివారలున్
నగుణుఁడు పద్మనాభుఁ డని సన్నుతి సేయుటె కాని తద్బహు
ప్రగుణగుణంబులు న్వరుసఁ బాయక యన్నియు నెన్న నేర్చిరే.

45

తే.

జలధిమధ్యస్థుఁ డాతఁడు జలధితీర, వాసి యితఁ డనునొకమాట వాసి గాక
పద్మనాభుండు మగదల పద్మనాభుఁ, డఖిలలోకావనమున నన్యోన్యసములు.

46


ఉ.

[10]కోసలరాజకన్యకయె కుంభినిలోపల వేంకటాంబయై
భాసిలఁ బద్మనాభుఁడయి ప్రాగ్రఘువీరుఁడు పుట్టెఁ గానిచో
మాసము తార లగ్నము సమస్తశుభగ్రహవీక్షణంబు లొం
డై సరివచ్చువేళ నుదయంబగునో విబుధాళిఁ బ్రోచునో.

47


మ.

ధనదోదారుఁడు పద్మనాభ సచివాధ్యక్షుండు పక్షంబుతో
ననఘాత్యుత్తమదొడ్లప్రతికులజుం డైనట్టిధర్మప్రధా
నునికామాక్షమకుం జనించి బుధరాణ్ణుత్యస్ఫురల్లక్షణా
వనియౌ రంగమఁ బెండ్లియాడె మహితైశ్వర్యం బవార్యంబుగన్.

48


సీ.

పతిభక్తిచే నరుంధతి యుద్ది యనవచ్చుఁ దను వ్రేలఁ జూపించికొనకయున్న
దాక్షిణ్యమున శైలతనయ జోడనవచ్చు నీశువిగ్రహమున నెనయకున్న
క్షాంతిచే ధారుణి సరి యనవచ్చు ధాతను జేరి మొఱపెట్టుకొనకయున్న
మతిమహత్త్వమున భారతి సాటి యనవచ్చుఁ బ్రజలనోళ్లకు నెల్ల రాక యున్న


తే.

గాక యితరధరాతలకాంత లెనయె, యంచు జను లెంచ నంచితోదారసుగుణ
మణిగణంబుల కెల్లయై మనుముఖాబ్జ, రచితశశిబింబ మగదల రంగమాంబ.

49


సీ.

ఏసాధ్వి [11]పెరటిలో నెలదోఁటఁ గని వజ్రనందనవని నిందనం బొనర్చు
నేయంబ పెండ్లిండ్ల కిప్పింపఁగా బ్రహ్మచారులు కఱవైరి జగతిలోన
నేతల్లి వడ్డింప నింపుతో భుజియించు జనులకు మాతృవిస్మరణ మొదవు
నేయమ్మ దయఁ బాలువోయింపఁ బురబాలు రాయురారోగ్యభాగ్యములు గాంతు


తే.

రట్టిలోకైకపావని యఖిలవిమల, గుణకలాపావని తటాకకోటిభాగ
సుప్రతిష్ఠితపావని క్షోణి వెలయు, రక్షితమహీసురకుటుంబ రంగమాంబ.

50


ఉ.

శ్రీయలమేలుమంగవలెఁ జెన్నగురంగమగర్భవార్ధిచం
ద్రాయితవేంకటేశసచివాగ్రణి కృష్ణసుధీవరుండు నా
రాయణమంత్రిశేఖరుఁడు రామవిభుండును వేంకటేశుఁ డ
త్యాయతకీర్తిశాలు లుదయంబయి రాశ్రితకల్పశాఖులై.

51


సీ.

శ్రీవరేశ్వరులకుఁ గోవెల లూరూరఁ గట్టించె నేమంత్రి ఘనత మెఱయ
నాకాశిసేతుమధ్యస్థపుణ్యస్థలుల్ సేవించె నేమంత్రి ఠీవి వెలయ
ఖ్యాతి కెక్కఁగ దీర్ఘికాతటాకంబులు త్రవ్వించె నేమంత్రి తఱుచుగాఁగ
సకలమార్గంబులఁ జల్లగా వనములు వేయించె నేమంత్రి వేడ్క మీఱ


తే.

నతఁడు చెలువొందు నన్నదానాదిసకల, దానవిద్యాపరాభూతధనవిభుండు

నూత్నదేదీప్యమానభానుప్రభుండు, నవ్యవిభవుండు నారాయణప్రభుండు.

52


సీ.

అతనుండు మొదల హ్రస్వాకారుఁ డౌటచేఁ జెలువంబునను సాటిసేయరాదు
గురుఁడును సర్వలఘుత్వ మొందుటఁ జేసి యాయతమతి సాటి సేయరాదు
రవిఁ గడపట వివర్ణంబు గాంచుటఁ జేసి స్థిరతేజమున సాటి సేయరాదు
శారదాబ్దం బపశబ్దం బగుటఁ జేసి చిరకీర్తితో సాటిసేయరాదు


తే.

సాటియే నేఁటి యొకపాటిసచివకోటి, వైరిగిరిశతకోటికి వచనవిభవ
భవతులాకోటికి వితీర్ణిపాండితీని, రస్తచింతామణికి నారనార్యమణికి.

53


మ.

అగధీరుం డగునారనార్యుఁ డవురా యాసానబూదూరిలోఁ
దగవిశ్వేశ్వరు నన్నపూర్ణ నట చెంతం డుంఠి విఘ్నేశ్వరు
న్నిగమస్తుత్యుని క్షేత్రపాలు మణికర్ణిం గల్గఁగాఁ జేసె విం
తగ సాధుల్ఫలదాత్రి భావనయకాదా యంచుఁ గీర్తింపఁగన్.

54


సీ.

వనిలోన స్త్రీమాట విని యన్న కొకవంత దెచ్చిన లక్ష్మణదేవుఁ దెగడి
తనవింటిబ్రద్దఁ దిట్టెనటంచు నగ్రజు దూషించినట్టి పార్ధుని హసించి
యన్నపక్షము వారి నటు డించి తా నొకపక్షమౌ పుండరీకాక్షు నవ్వి
మును దా గురుద్రోహమునకు లోనై యగ్రభవునకుఁ జేర్చిన లవునిఁ దెగడి


తే.

హర్ష మొసఁగుచు మాఱుమాటాడ వెఱచి, యన్నపక్షము దనపక్ష మై చెలంగ
బహుళసుకృతంబు లొనఁగూర్చి ప్రబలుఁ బద్మ, నాభుననుజుండు నారాయణప్రభుండు.

55


శా.

ఆనారాయణమంత్రిశేఖరుఁ డమిత్రాంభోదపాళీజగ
త్ప్రాణుండౌ కురుగోటిమాధవయకు న్రామక్కకుం బుత్రియై
తోనం దిమ్మయవీరరాఘవముఖుల్ దోఁబుట్టులై వర్తిలన్
శ్రీనారీమణిఁబోలు వెంకమ వరించె న్వేడుక ల్మించఁగన్.

56


తే.

అసము వొసగంగ మఱియు రాయసము చెలవ, యార్యమౌళికి నారాయణమ్మ కాత్మ
జాతయైనట్టి నరసమ్మ సమత మించు, మమత వరియించె నారనామాత్యవిభుఁడు.

57


సీ.

తనయాశ్రితుల సంపదలఁ జూచి ధనభర్త ధనవాంఛ శివుఁగూర్చి తపము సేయఁ
దనవిలాసము గనుంగొని నీటు వెట్టెడు సూనాస్త్రురతియును చుక్కు రనఁగఁ
దనదానజలవార్ధిఁ గని యుల్కినయగస్త్యుఁ గడల దాపసుల కేరడము లాడఁ
దనవైభవమును జూచినవార లింద్రుఁ డం చొరులతోఁ బన్నిదం బూనికొనఁగఁ


తే.

బ్రబలు దేశాధినాథనబాబుసాహి, బూవితీర్ణసువర్ణజాంబూనదాంబ
రాసమగ్రామబహుమానభాసమాన, నవ్యవిభుఁ డాదినారాయణప్రభుండు.

58

సీ.

నీరాకరము లెల్ల క్షీరాకరము లయ్యెఁ దటినులు గీర్వాణతటిను లయ్యె
ధేను లెల్లను గ్రామధేనువు లయ్యెను మ్రాఁకులు దెఱగంటి మ్రాఁకు లయ్యె
నగము లెల్లఁ దుషారనగము లయ్యెను బన్న గంబులు దొలిపన్నగంబు లయ్యె
మునులెల్ల నారదమును లైరి గగనవిహారులు భుజగేంద్రహారు లైరి


తే.

యౌర మగదల వంశరత్నాకరాధి, నాథచంద్రాదినారాయణప్రధాన
చంద్రనిస్తంద్రతరకీర్తిసాంద్రరుచులు, మించి లోకత్రయం బాక్రమించుకతన.

59


తే.

అనఘుఁ డయ్యాదినారాయణార్యమౌళి, ఘనుఁడు రాచూరి వేంకటేంద్రునకుఁ గోన
మకును సుతయైన తిమ్మాజమను వరించి, కనియె భాస్కరదాసాదితనుజమణుల.

60


ఉ.

హాటకదాతయౌ మగదలాధిపకృష్ణునిదానవాహినీ
ఝాటము చేత నుబ్బుచును సర్వజనస్తవనీయత న్నిరా
ఘాటగభీరతాగుణము గాంచిన స్రుక్కుచునుండఁగాఁ జుమీ
పోటును బాటునంచు జనము ల్గణియించును వారిరాశికిన్.

61


తే.

గరిమ నఱువదినాలుగుకళలఁ బొసఁగి, యెసఁగు మగదల కృష్ణమంత్రీంద్రవదన
మునకుఁ బదియాఱుకళలచేఁ దనరునబ్జ, మండలము జోడె పాదాభ నుండుఁగాక.

62


సీ.

అమరంగఁ దా నంబరము గప్పుకొను నెట్టు కవుల కీయఁడు మేఘుఘనత యెంత
తాను రత్నోర్మిక ల్దాల్చు నెవ్వనికీఁడు పాథోధినాథుని ప్రభుత యెంత
గంధంబు గను నొసంగదు ద్విజశ్రేణికిఁ గల్పవృక్షము కల్పకత్వ మెంత
సుమనోవతంస మౌచును బుణ్యజనుల కీ దనిమిషేంద్రమణిరాతన మదెంత


తే.

భువిఁ జతుర్విధశృంగారములు సమిత్ర, బంధుకవిధీరజనముగాఁ బ్రౌఢి మీఱఁ
బూను మగదల కృష్ణప్రధానభాను, నిరుపమౌదార్యలీల వర్ణించువేళ.

63


మ.

తలపం గర్ణుఁ డపార్థదాతయె యపాత్రత్యాగిమూర్ధన్యుఁ డా
బలి వ్యర్థంబగు గల్పకంబు ఫలియింప న్మేఘుఁడుం దారవో
తలమాత్రంబు ధనం బొసంగఁడు గదా తద్దానము ల్మెత్తునే
యలఘుప్రౌఢిదుఁ బద్మనాభఘను కృష్ణామాత్యుఁ గీర్తింపుచోన్.

64


సీ.

రాజరాజసుహృద్ధరాజరాజముఖీవిరాజరాజన్ముఖప్రభల నేలి
పారిజాతకపాదపారిజాతరిపుద్విపారిజాత[12]శ్రీలఁ బ్రతిఘటించి
హరికాండగంగాలహరికాండజకులేంద్రహరికాండదీప్తుల నతకరించి
ఘనసారశారదఘనసారసజవాహఘనసారకాంతులఁ గడకుఁ దఱిమి


తే.

కలశజలనిధిహలధరజలజతుహిన, విమలమలయజసురగజవిశదకమల
కుముదసముదయధవళిమరమణఁ దాల్చి, యెసఁగె మగదల కృష్ణమంత్రీంద్రుకీర్తి.

65


సీ.

తల్లిదండ్రులు ముకుందద్రోహు లంచును బాథోధిలోపలఁ బ్రభవ మొంది
పాథోధిలోపలఁ బ్రభవింపఁ బంకజాతావాసయై క్షితి నవతరించి

క్షితిజయై పతివివాసితయౌట వలన వైదర్భభూవిభున కావిర్భవించి
వైదర్భియై మహీవరులసన్నిధిని గోపాలకబాలకాపహృత యగుచు


తే.

వెనుకఁ దపములచేఁ గొండవీటి సిద్ధి, రాజఘనుకనకాంబగర్భమునఁ బొడమి
కృష్ణనిభుఁడైన మగదల కృష్ణవిభునిఁ, జేరి కొదలేక తనరు లక్ష్మీమృగాక్షి.

66


తే.

గుణసముద్రుండు గణుతింపఁ గొండవీటి, సిద్ధిరాజేంద్రుఁ డెల్ల నశీతకరుఁడు
లక్ష్మి లక్ష్మమ్మ సౌభాగ్యలక్షణములఁ, గృష్ణదేవుఁడు మగదల కృష్ణవిభుఁడు.

67


ఉ.

నారదమౌని యేమి సురనాథ విశేషము లేమి వింటిరో
సారసగర్భుచెంగటను శారద లేదఁట యెందు నిల్చెనో
యారసిచూడుఁడా మగదలాన్వయదుగ్ధపయోధిరాజమం
దారము కృష్ణమంత్రిరసనాస్థలి నిల్చెను యుక్తమే కదా.

68


సీ.

శ్రీవిరాజితుఁడైన సిద్ధిరాజేంద్రుఁడు శ్రీకృష్ణదేవుని చెలువు గుల్క
ననిశంబు రుక్మిణియై మించుకనకాంబ భోజమహీరాజుపుత్రిఁ బోలఁ
గులరూపసౌభాగ్యగుణములఁ బెద్దయౌ కోనాంబ రతిదేవి కోపు చూప
[13]నాశ్రితదోషాపహరుఁ డైనయెల్లన యనిరుద్ధవిఖ్యాతి ననుసరింప


తే.

భామినీజనమోహనాంబకవిలాస, వైఖరులఁ గాంచి మన్మథువలెఁ జెలంగుఁ
గొండవీటికులాంభోధికువలహితుఁడు, మత్యహీశ్వరుఁ డెల్లనామాత్యవరుఁడు.

69


సీ.

శ్రీరామచరణరాజీవకైంకర్యతత్పరరంజనుఁడు రామదాస ఘనుఁడు
దాక్షిణ్యనైపుణ్యరక్షితానేకసత్కవితంత్రి శంకరదాసుమంత్రి
యనవద్యహృద్యవిద్యాప్రౌడిఁ బద్మగర్భనిభుండు బద్మనాభప్రభుండు
నలకూబరజయంతనలవసంతలతాంతసాయకాకృతి రంగశాయిసుకృతి


తే.

వివిధరాజద్గుణకదంబ వేంకటాంబ, నుత్యనయశాలి రఘుపత్యమాత్యహేళి
ధన్యజనమాన్య సీతాభిధానకన్య, జనన మొందిరి కృష్ణధీసచివమణికి.

70


సీ.

దేవిదేవరఁ బొలిఠీవిమై వర్ధిల్లి తల్లిదండ్రియు సంతతంబుఁ బ్రోవ
శ్రీరాము ననుసరించిన లక్ష్మణునిభక్తి సహజుండు సౌభ్రాత్రసరణి నెఱప
హరినిఁ జెందినలక్ష్మికరణి సద్ధర్మిణి చిత్తానుగుణలీలఁ జెలువు చూప
జలధిసంతానంబు నలువున నౌదార్యకలితమై పుత్రవర్గంబు మెలఁగ


తే.

నల్లసౌభరీనడవడి యైనవీని, కెనయె యంచు జగజ్జనం బెల్లఁ బొగడ
సిద్ధసంకల్పుఁడై సుఖశ్రీల వెలయు, జిష్ణువిభవుండు మగదల కృష్ణవిభుఁడు.

71


సీ.

చంద్రికపూవన్నె జిలుగురుమాలుపై జాతిమిన్నులతురా చౌకళింప
నగుముద్దుమోమున మృగనాభితిలకంబు గులుకుడాల్సిరులు ముంగురుల నెరయఁ
వళుకుఁగిరీటిపచ్చలకు జోడై తేట నునుపాలకాయయొంటులు పొసంగఁ
గమికెఁడుముత్యాలకంఠమాలికఁ గూడి నీలంపుదుమ్మెదతాళి మెఱయఁ

తే.

గుందనపుఁదళ్కు నెఱపూఁతగంద మమరఁ, దగటుఁ చెఱుగులఁ జెంగావి సొగసుఁ జూపఁ
జిల్కసామ్రాణి తేజివజీరుఁ గేరు, కృష్ణమంత్రీంద్రుచెలువు వర్ణింపఁ దరమె.

72

షష్ఠ్యంతములు

క.

ఈదృశగుణహారునకును, దాదృశనయమార్గసంతతవిహరునకున్
స్త్రీదృఙ్నవమారునకున్, సౌదృగ్జనవినుతభక్త్యజకుమారునకున్.

73


క.

ధీరునకుఁ గీర్తిఘటజల, ధీరునకు భుజప్రతాపధృతసర్వవిరో
ధీరునకుఁ బాలితాఖిల, ధీరునకు సుధారసోన్నతీధీరునకున్.

74


క.

సకలకలాపావనునకు, సుకవికలాపావనునకు శ్రుతిచాతుర్య
ప్రకలితధీరక్షణునకుఁ, [14]బ్రకటితధీరక్షణునకుఁ బద్మాక్షునకున్.

75


క.

ధృతిబందీకృతనానా, క్షితిధరశంకావిధాయిశృంఖలితమదో
న్నతగజపూర్ణాంగణునకు, రతిరాజసమానరూపరమ్యగుణునకున్.

76


క.

చరణానతశరణాగత, భరణాతతవత్సలత్వపాత్రునకు సదా
భరణాయితకరుణాయుత, తరుణాయత విమలకమలదళనేత్రునకున్.

77


క.

మగదలకులధన్యునకు, జగదేకవదాన్యునకు ద్విషద్ధరణీభృ
ద్దిగధిపమూర్ధన్యునకున్, జగతీమాన్యునకు వినుతసౌజన్యునకున్.

78


క.

భద్రశ్రీమిహికాదిమ, భద్రశ్రీవరకరాబ్దఫణిప బిడౌజో
భద్రశ్రీకంధరబల, భద్రశ్రీనిధియశోవిభవభద్రునకున్.

79


క.

ఇంద్రశిలాతంద్రకళా, సాంద్రవిలాసాఢ్యకనకసౌధోన్నతికిం
జంద్రమణీరుంద్రఘృణీ, చంద్రతృణీకరణచంద్రశాలాతతికిన్.

80


క.

మంత్రి యుగంధరునకుఁ బర, [15]మంత్రికృతాంతునకు దివిజమంత్రినిభునకున్
మంత్రిశరచ్చంద్రునకు, న్మంత్రిమృగేంద్రునకుఁ గృష్ణమంత్రీంద్రునకున్.

81


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నేరచియింపంబూనిన రసికజనకంఠాభరణ శ్రీకృష్ణదశావతారచరిత్రమహాప్రబంధపవిత్రముక్తాదామంబునకు విచిత్రకథాసూత్రం బెట్టిదనిన.

82
  1. భువనజాతాస్పదం
  2. గణించితివి యేమీ
  3. వితతా
  4. విధాన
  5. విజిత
  6. మెఱసె
  7. 'గాంచుడెట్లు; పనుపుడెట్లు' అనియు కలదు.
  8. భూసురత్రాకృతభూమితలుఁడు
  9. గనియె రంగప్ప నాదెప్ప
  10. కోసలరాజనందనయె
  11. పేరిటియెలదోఁటఁ
  12. శ్రీలనవఘళించి
  13. నాశ్రితోషాకరుం డగుచిన్నయల్లన
  14. అకలంకయశోవిరాజతారాధ్యునకున్
  15. మంత్రివిభాళునకు