దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/సత్యాగ్రహపుట్టుక

వికీసోర్స్ నుండి

12

సత్యాగ్రహ పుట్టుక

యూదుల ఆనాటకశాలలో 1906 సెప్టెంబరు 11వ తేదిన భారతీయుల సమావేశం జరిగింది. ట్రాన్స్‌వాల్ రాజ్యపు పలుపట్టణాలనుంచి ప్రతినిధుల్ని ఆహ్వానించాము. అయితే అప్పుడు తయారుచేసిన తీర్మానాల భావం నేనుకూడా పూర్తిగా తెలుసుకోలేకపోయానని చెప్పవచ్చు. ఆతీర్మానాల్ని అంగీకరిస్తే కలిగే పరిణామాల్ని కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను సభ జరిగింది. నాటకశాలలో అడుగుపెట్టడానికి చోటుదొరక లేదు. అంతజనం వచ్చారు. ఏదోక్రొత్త పనిచేయాలి, ఏదోక్రొత్త పనిజరుగుతుంది అనే భావం అందరి ముఖాన స్పష్టంగా నాకు కనబడింది. ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షలు శ్రీ అబ్దుల్‌గినీ సభకు అధ్యక్షత వహించారు ట్రాన్స్‌వాల్‌లో నివసిస్తున్న భారతీయుల్లో వారు పాతవారు. వారు మహమద్ కాసింకమరుద్దీన్ అనుపేరుగలు ప్రసిద్ధవ్యాపారికి భాగస్వామి జోహన్స్‌బర్గ్‌లో గలవారి శాఖకు మేనేజరు చాలా తీర్మానాలు ప్యాసయ్యాయి కాని నిజమైన తీర్మానం ఒక్కటే "ఎన్ని ప్రయత్నాలుచేసినా యీ బిల్లు అసెంబ్లీలో ప్యాసైతే భారతీయులు ఓటమిని అంగీకరించకూడదు. అందువల్ల కలిగే కష్టనష్టాల్ని ధైర్యసాహసంతో ఎదుర్కొవాలి " ఇది అతీర్మాన సారాంశం

ఈ తీర్మానాన్ని నేను సభకు వినిపించి దాన్ని గురించి వివరించాను సభశాంతితో నా ప్రసంగం విన్నది. హిందీలోను, గుజరాతీలోను సభాకార్యక్రమమంతా నడిచింది. కనుక భారతీయులకు అర్థం కాలేదనుటకు వీలులేదు. హిందీ, గుజరాతీ రాని తెలుగు, తమిళభాషీయులకు ఆభాషలు తెలిసిన వారు పూర్తిగా వివరించి చెప్పారు. నియమప్రకారం తీర్మానం సభలో ప్రవేశపెట్టాము అనేక మంది వక్తలు ఆ తీర్మానాన్ని సమర్థించారు. వారిలో సేఠ్ హాజీహబీబ్ అనువారు ఒకరు వారు దక్షిణాఫ్రికాలో చాలకాలాన్నుంచి వుంటున్నారు. వారి ప్రసంగం చాలా తీవ్రంగా సాగింది. ఆవేశంతో పూగిపోతూ ఆయన "అల్లా సాక్షిగా మనం యీ తీర్మానాన్ని అంగీకరించాలి యీ బిల్లు ముందు తలవంచడం నామర్దాపని అందువల్ల నేను ఖుదా పేరట ప్రమాణం చేసిచెబుతున్నాను. ఈ చట్టం ముందు నేను తలవంచను ఈ సభకు వచ్చిన వారంతా ఖుదా పేరిట ఒట్టుపెట్టుకొని యీ తీర్మానాన్ని అంగీకరించాలి " అని ఉద్బోధించాడు

చాలామంది తీర్మానాన్ని సమర్థిస్తూ తీవ్రంగా మాట్లాడారు. సేఠ్‌హాజీహబీజ్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఖుదా పేరట ఒట్టు అనే సరికి నేను ఉలిక్కిపడి జాగ్రత్త పడ్డాను. అప్పుడు నాకు నా బాధ్యత, భారత జాతి బాధ్యత ఏమిటో అర్థమైంది. యిప్పటివరకు భారతీయులు చాలా తీర్మానాలు చేశారు అనుభవం గడించిన తరువాత వాటిలో మార్పులు కూడా చేశారు తీర్మానాలు అంగీకరించిన వాళ్లలో చాలామంది శ్రద్ధ వహించలేరు యివన్నీ ప్రపంచంలో సామాన్యంగా జరుగుతూ వుంటాయి. అయితే యిలాంటి తీర్మానాలు వచ్చినప్పుడు ఎవ్వరూ దేవునిపేరు స్మరించరు. నిజానికి సామాన్యంగా మనం అంగీకరించే తీర్మానాలకు, భగవంతునిపేరిట అంగీకరించే తీర్మానాలకు తేడా వుండకూడదు. బుద్ధిమంతుడు ఆలోచించి ఒక నిర్ణయం చేసినప్పుడు దానిమీద నిలబడుతాడు జారడు దేవుణ్ణి సాక్షిగా పెట్టి చేసిన ప్రతిజ్ఞకు సామాన్యంగా అంగీకరించి చేసే ప్రతిజ్ఞకు పెద్ద తేడా వుండదు అయితే ప్రపంచం సూక్ష్మ సిద్ధాంతం మీద ఆధారపడి నడవదుకదా! అది యీ రెండిటీకి మధ్య పెద్ద తేడావున్నా దాని నమ్ముతుంది. భగవంతుని పేరిట ప్రతిజ్ఞచేసి జారిపోయినవాణ్ణి ప్రపంచం హర్షించదు. దీని ప్రభావం మనిషి మనస్సుపై అమితంగా పడుతుంది కోర్టుల్లో ప్రమాణం చేసి ఆబద్దం చెబితే అతడికి శిక్ష పడుతుంది

ఇటువంటి ఎన్నోభావాలు నా బుర్రలో మెసిలాయి ఎన్నో అనుభవాలు పొందాను ప్రతిజ్ఞల తీయని ఫలితాన్ని కూడా జీవితంలో అనుభవించాను అట్టి నేను దేవుని పేరు వచ్చేసరికి ఉలిక్కిపడ్డాను. అందువల్ల కలిగే పరిణామాల్ని ఉహించుకున్నాను నాకు ఉత్సాహం, ఆవేశం రెండూ కలిగాయి నేను ప్రతిజ్ఞ చేద్దామని యితరుల చేత చేయిద్దామని ఆసభకు వెళ్లలేదు కాని సేర్ చేసిన సూచన నాకు నచ్చింది. అయితే అతడి మాటల్లో గల గూడార్థం జనానికి చెప్పాలని నాకు అనిపించింది. అర్థంచేసుకొని ప్రతిజ్ఞచేయమని అందరికీ చెప్పాలని అనిపించింది. అందరము అట్టి ప్రతిజ్ఞచేయలేకపోతే భారత జాతి, యింకా చివరిమెట్టు చేరలేదని భావించవలసి వస్తుంది కదూ! నేను సభాధ్యక్షుణ్ణి హబీబ్ ప్రసంగంమీద మాట్లాడుటకు అనుమతికోరాను. ఆయన అనుమతి యిచ్చాడు. లేచి నిలబడి మాట్లాడాను జ్ఞాపకం వున్నంతవరకు వివరం క్రింద తెలుపుతున్నాను

"ఇప్పటివరకు మనం అనేక తీర్మానాలు అంగీకరించాం కాని యివాళ అంగీకరించబోయే తీర్మానానికి గతంలో అంగీకరించిన తీర్మానాలకు విధానంలో పెద్ద తేడా వున్నది. దీన్ని అంతా జాగ్రత్తగా గమనించాలి. ఈ తీర్మానం ఎంతో గంభీరంగా వున్నది. దీన్ని సంపూర్తిగా అమలుపరిస్తేనే దక్షిణాఫ్రికాలో మన వ్యక్తిత్వం లేక మన ఉనికి నిలచి వుంటుంది. మన మిత్రుడు తీర్మానం చేయవలసిన విధానాన్ని క్రొత్త పద్ధతిలో సూచించాడు. నిజానికి నేను యీ పద్ధతిలో తీర్మానం అంగీకరించాలనే భావంతో సభకు రాలేదు. ఈ శ్రేయస్సంతా సేర్ హాజీహబీబ్‌కు లభించాలి దీని బాధ్యత కూడా వారి మీద వుంచాలి యిందుకు వారిని నేను అభినందిస్తున్నాను వారి సూచన నాకు బాగా నచ్చింది. వారి సూచనను మీరంతా అంగీకరిస్తే తీర్మానం అమలుచేయుటకు మీరంతా బాధ్యత వహించాలి ఆ బాధ్యతను మీరంతా అర్థం చేసుకోవాలి జాతిసేవకుడుగా, కార్యకర్తగా ఆబాధ్యతను మీకు తెలియజేస్తున్నాను

మనమంతా ఒకే సృష్టికర్తను విశ్వసిస్తున్నాము. మహమ్మదీయులు అతణ్ణి ఖుధాఅని అంటున్నారు. హిందువులు ఈశ్వరుడు అని అంటున్నారు ఈశ్వరుణ్ణి సాక్షిగా వుంచి మనం ప్రతిజ్ఞ చేస్తే అది సామాన్యమైన విషయంకాదు. ఈ విధంగా ప్రతిజ్ఞచేసి దాన్ని ఆచరణలో పెట్టక పోతే జాతికి. ప్రపంచానికి. ఈశ్వరునికి ద్రోహం చేసిన వారమవుతాము ఆషామాషీగా ప్రతిజ్ఞ చేసిన దాన్ని అమలు చేయనివాడు జాతి, సమాజం, ఈశ్వరుని ముందు అపరాధి అవుతాడు. సత్తురూపాయికి విలువలేకపోగా దాన్ని దగ్గర దాచినవాడు శిక్షకూడా పొందే అవకాశం అట్లే అబద్దపు ప్రతిజ్ఞ చేసేవాడికి విలువవుండదు. ఇహలోకంలోను, పరలోకంలోను శిక్ష పొందుతాడు సేర్‌హాజిహబీబ్ అటువంటి గంభీరమైన ప్రతిజ్ఞ చేయమని సూచిస్తున్నారు ఈ సభలో అర్థంచేసుకోలేనివాడు, ఒక్కడుకూడా లేడు. మీరంతా ప్రౌడులు అనుభవజ్ఞులు మీరు ప్రపంచాన్ని చూచారు. మీలో చాలామంది జాతికి ప్రతినిధులు మీలో చాలామంది బాధ్యత గల పనులు నిర్వహించారు అందువల్ల తెలియక యిట్టి ప్రతిజ్ఞ చేశానని చెప్పి తప్పించుకునేందుకు వీలులేదు. "ప్రతిజ్ఞలు, వ్రతాలు ఎంతో మహత్తరమైన సమయంలోనే చేస్తూవుంటాం ఆషామాషీగా ప్రతిజ్ఞలు చేసేవాడు వాటిమీద నిలబడలేడు దక్షిణాఫ్రికాయందలి భారతీయులకు మంచి పరీక్షా సమయం యిప్పుడే వచ్చింది యిప్పుడువేసే ప్రతి అడుగు స్థిరంగా, యోచించి గట్టిగా వేయాలి దానికి కూడా ఒక హద్దువున్నది. ఆహద్దును మనంచేరుకున్నాం ప్రభుత్వం సభ్యత యొక్క హద్దును దాటింది. యిప్పుడు మనం నోరు మూసుకొని కూర్చుంటే, త్యాగాలకు సిద్ధపడి దురన్యాయాన్ని ఎదుర్కోకపోతే పిరికివాళ్లం, పనికిమాలిన వాళ్లం అయిపోతాం యిప్పుడు ప్రతిజ్ఞను అర్థంచేసుకొని చేయాలి. ప్రతివ్యక్తీ ఎవరికి వారు యిట్టి శక్తి నాకు వున్నదా లేదా అని స్వయంగా అలోచించుకోవాలి. ఆమలుచేయగలమని ధైర్యంవుంటేనే ప్రతిజ్ఞచేయాలి ఆడంబరంకోసం యిలాంటి ప్రతిజ్ఞచేయకూడదు మనయీ ప్రతిజ్ఞయొక్క ప్రభావం స్థానిక ప్రభుత్వం, పెద్ద బ్రిటిష్ ప్రభుత్వం భారతప్రభుత్వం మీద ఏమిపడుతుంది అని ఆలోచించకూడదు. ప్రతివ్యక్తి గుండెమీద చేయివేసుకొని తనను తాను పరీక్షించకోవాలి మనస్సాక్షిగా శక్తి వుందనితోస్తే ప్రతిజ్ఞ చేయాలి అప్పుడే ప్రతిజ్ఞ సత్ఫలితాలనిస్తుంది

"ఇక దీని పరిణామాల్ని గురించి కూడా రెండు మాటలు చెబుతాను ఈ తీర్మానం చిత్తశుద్ధిగా అంగీకరించే ధీశాలురైన భారతీయుల సంఖ్య అధికంగా వుంటే, అంతా తమమాట మీదగట్టిగా నిలబడి బిల్లును వ్యతిరేకిస్తే యీ బిల్లు ప్యాసుకాదు. ప్యాసైనా వెంటనే రద్దు చేయబడుతుంది బిల్లును వ్యతిరేకించడం వల్ల మనం ఎక్కువకష్టాలు పడవలసిన అవసరం కలుగకపోవచ్చు. అయితే ఏదో జరుగుతుందని ఉహించి మనం ప్రతిజ్ఞ చేయకూడదు. మనం సాగించేపోరాటాం వల్ల రెండు కటు పరిణామాలు కలుగవచ్చు. వాటిని మీముందు చెప్పతలుస్తున్నాను. మనందరం ప్రతిజ్ఞ చేశాం అనుకోండి అంతా కలిపి మనం 3000 మందిమి వున్నాం. మిగతా 10వేల మంది భారతీయులు ప్రతిజ్ఞ చేయకపోవచ్చు. అప్పుడు ప్రారంభంలో మనం నవ్వుల పాలవుతాం అంతేగాక ప్రతిజ్ఞ చేసిన వారిలో కూడా కొందరు పిరికితనంతో వెన్నుచూపవచ్చు జైళ్లకు వెళ్ల వలసి రావచ్చు. అక్కడ అవమానాలు సహించడం అవసరం కావచ్చు. ఆకలి, చలి, ఎండల్ని జైళ్లలో అనుభవించవచ్చు. దౌర్జన్యాలకు అలవాటుపడ్డపోలీసు అధికారులు మనల్ని బాదవచ్చు. జుల్మానాలు విధించవచ్చు. మన ఆస్థిపాస్తులు వేలం కూడా వేయవచ్చు. యివాళ మనదగ్గర డబ్బు పుష్కలంగా వున్నా రేవు దరిద్రులం కావచ్చు యీ దేశాన్నుంచి మనల్ని బహిష్కరించవచ్చు. ఆకలిదప్పికలతో మనలో కొందరు. జబ్బు పడవచ్చు. కొందరు చనిపోవచ్చు. అందువల్ల ఉహించ గలిగినన్ని కష్టాల్ని సహించడానికి మనం సిద్ధపడాలి. అప్పుడే ప్రతిజ్ఞ చేయాలి. ఈ పోరాటం వల్ల ఏమి జరుగుతుంది అని ఎవరైనానన్ను అడిగితే భారతీయులంతా ఏకమై యిందుకు నడంబిగించి పోరాడితే తక్షణం సత్ఫలితం లభించి తీరుతుందని చెబుతాను మనలో చాలామంది కష్టాలకు తట్టుకోలేక జారిపోతే పోరాటం చాలాకాలం సాగవచ్చు. పిడికెడుమందైనా చివరివరకు త్యాగాలు చేయడానికి సిద్ధపడితే అంతిమ విజయం మనకు లభించి తీరుతుందని నానిశ్చితాభిప్రాయం

"ఇక నావ్యక్తి గత బాధ్యతనుగురించి రెండు మాటలు చెబుతాను ఒకవైపున ప్రమాదాల్ని గురించి హెచ్చరిస్తూ వున్నానంటే మరో వైపున ప్రతిజ్ఞ చేయమని ప్రోత్సాహిస్తున్నానన్నమాట నాబాధ్యతను గుర్తిస్తున్నాను ఆవేశంలో యిక్కడఅంతా ప్రతిజ్ఞచేసి తరువాత నిర్బలులై జారుకొంటే, బహుకొద్దిమంది మాత్రమే అగ్నిపరీక్షకు సిద్ధపడవచ్చు. అట్టిస్థితిలో సైతం నా లక్ష్యం ఒక్కటే

"ప్రాణాలుపోయినా సరే చట్టం ముందు తలవంచను" అలా జరగదు అనే రంగంలోకి దిగుదాం కాని, అట్టి స్థితివచ్చిందనే అనుకోండి, అంతా తప్పుకున్నారనుకోండి. నేనొక్కణ్ణే మిగిలానని అనుకోండి, అయినా నేను నాప్రతిజ్ఞమీద నిలబడతాను నాయీ మాటను మీరంతా తెలుసుకోండి యిది అభిమానంతో చెప్పేమాటకాదు. ఈ సభలో కూర్చున్న భారతీయ నాయకులకు యిది నా హెచ్చరిక అని మనవి చేస్తున్నాను. నన్ను ఉదాహరణగా పేర్కొని మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీకు స్థైర్యం లేకపోతే ప్రతిజ్ఞచేయకండి మరొక్క విషయం యిష్టంలేకపోతే దీన్ని వ్యతిరేకించండి కాని చేసే పనిమాత్రం త్రికరణశుద్ధిగా చేయండి “ఎవరు ఏంచేసినా సరే నేను మాత్రం చివరివరకు పోరాడుతాను అనే దృఢనిర్ణయంతో యీ ప్రతిజ్ఞచేయండి

ఈ విధంగా చెప్పినేను కూర్చున్నాను ఎంతో శాంతివహించి జనం నామాటలు విన్నారు. యితర నాయకులు కూడా మాట్లాడారు. అందురూ తమ బాధ్యతను, శ్రోతల బాధ్యతను గురించి మాట్లాడారు. తరువాత సభాధ్యక్షుడు లేచి నిలబడ్డారు. వారు స్థితిని సమీక్షించారు. చివరికి అంతాలేచి నిలబడి దేవుణ్ణి సాక్షిగా వుంచి క్రింది విధంగా ప్రతిజ్ఞ చేశారు “బిల్లు ప్యాసైచట్టం అయితే మేముదాని ముందు తలవంచము" అదీ ప్రతిజ్ఞ ఆదృశ్యాన్ని జీవితంలో మర్చిపోలేను జనంలో ఉత్సాహం ఉరకలేసింది. రెండో రోజున ఏదో ప్రమాదంజరిగి యూదుల ఆ నాటకశాల తగులబడిపోయింది. మూడో రోజున జనం యీ వార్తతో నా దగ్గరికి వచ్చారు. యిదిశుభ శకునం అని అంతా అనడం ప్రారంభించారు. నాటకశాల భస్మం అయినట్లే యీబిల్లు కూడా భస్మం అయిపోతుందని అంతా అన్నారు. యిటువంటి వాటి ప్రభావం ఎన్నడూ నామీద పడదు. అందువల్ల నేను ఏమీ మాట్లాడలేదు. ప్రజల్లోగల భావాన్ని తెలుపడంకోసం యీ విషయం యిక్కడ వ్రాశాను. భారతజాతి చూపిన ధైర్యసాహసాల్ని వచ్చే ప్రకరణాల్లో మీరు గ్రహిస్తారు

పైసభ జరిగిన తరువాత కార్యకర్తలు ఊరుకోలేదు. ఎన్నో సభలు జరిపారు. ప్రతిసభలోను జనం చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రికలలో ఖూనీ (రక్తపు) చట్టం చర్చకు ముఖ్య విషయం అయిపోయింది

రెండో వైపున స్థానిక ప్రభుత్వాన్ని కలియుటకు ఏర్పాట్లు జరిగాయి. ఒక ప్రతినిధి బృందం అధినివేశ రాజ్యాల మంత్రి శ్రీ. డంకల్‌ను కలుసుకునేందకు వెళ్లింది. మిగతా విషయాలతోబాటు జాతి తీసుకున్న ప్రతిజ్ఞను గురించి కూడా వారికి చెప్పారు, ప్రతినిధిబృందంలో ఒక సభ్యుడైన సేర్ హాజీహాబీబ్ "ఎవరైనా ప్రభుత్వాధికారి నాభార్య దగ్గరికి వచ్చి వ్రేళ్ల ముద్రలు వేయమని అంటే వాణ్ణి వెంటనే కాల్చి చంపివేస్తాను కాల్చుకొని నేను చస్తాను" అని అన్నాడు. కొద్దిసేపు మంత్రి హబీబ్ ముఖం వంక చూచాడు. అసలు యీ చట్టాన్ని స్త్రీలకు వర్తింపచేయాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నది యిప్పుడే నేను మాట యిస్తున్నాను స్త్రీలకు సంబంధించినంత వరకు చట్ట నింబంధనల్ని రద్దుచేస్తాము ఈ విషయమై మీ భావాల్ని ప్రభుత్వం అర్థం చేసుకున్నది మీ భావాన్ని గౌరవించితీరుతాం మిగతా నిబంధనల విషయమై ప్రభుత్వం గట్టిగా వున్నది. వుంటుందికూడా జనరల్ బోధా జాగ్రత్తగా యోచించి యీ బిల్లును అంగీకరించమని కోరుతున్నారు. తెల్లవాళ్ల కోసం ప్రభుత్వం యీ చట్టం అవసరమని భావిస్తున్నది. నిబంధనల విషయంలో మీరేమైన సలహాలు యివ్వదలిస్తే యివ్వండి మీకు మంచిది" అని చెప్పాడు. ప్రతినిధి బృంద సభ్యులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక విషయాలు మంత్రి ఎదుట పేర్కొన్నారు. వాటన్నింటిని గురించి నేను యిక్కడ వ్రాయడం లేదు. గత ప్రకరణాల్లో వాటి వివరాలు వ్రాశాను స్త్రీలను చట్టాన్నుంచి మినహాయించి నందుకు కృతజ్ఞులం కాని చట్టాన్ని మేమెవ్వరం అంగీకరించేది లేదని చెప్పి అంతావచ్చి వేశారు. భారతస్త్రీల మినహాయింపును గురించి చర్చ ప్రారంభమైంది పోరాటంవల్ల కలిగిన శుభపరణామమని కొందరన్నారు కాని ప్రభుత్వం మాత్రం పోరాటానికి వెరిచి మినహాయించలేదు. స్వతంత్రంగా యోచించి యీ నిర్ణయంగైకొన్నదని ప్రకటించింది. కాకతీయంగా యిది జరిగినా భారతీయులు మాత్రం యిది ఉద్యమ ఫలితమేనని భావించారు వారి ఉత్సాహం ఇనుమడించింది

ఈ జాతీయ ఉద్యమానికి ఏం పేరు పెట్టాలి, అని ఎవ్వరం అప్పుడు ఆలోచించలేదు. అప్పుడు నేను "పాసిప్ రెసిస్టెన్స్' అని పేరుపెట్టాను పాసివ్‌రెసిస్టెన్స్‌కు గల గూఢార్థం ఏమిటో నేను యోచించలేదు. అయితే నూతన సిద్ధాంతానికి యిది ప్రతీక అని అనుకున్నాను. ఉద్యమం విజృంభించినప్పుడు పాసిప్ రెసిస్టెన్స్ శబ్దంవల్ల చిక్కులు పెరిగిపోయాయి ఇంతపెద్ద ఉద్యమానికి ఇంగ్లీషు పేరు పెట్టినందుకు సిగ్గుపడ్డాను. యీ ఇంగ్లీషు శబ్దాలు భారతజాతి పెదవులపై ఆడలేవు. అందువల్ల మంచి భారతీయ భాషా శబ్దం సూచించమని ఇండియన్ ఒపీనియన్‌లో ప్రకటించి అందుకు బహుమాసం కూడా ప్రకటించాను కొన్నిపేర్లు నాదగ్గరకి వచ్చాయి ఉద్యమ స్వరూప వివరమంతా స్పష్టంగా ప్రకటించాను శ్రీమగన్‌లాల్ గాంధీ “సదాగ్రహం" అని పేరు సూచించారు. వివరం వ్రాస్తూ భారతీయుల ఆగ్రహం అనగా పట్టుదల, నద్ అనగా శుభంకరమైనది. కనుకదీన్ని సదాగ్రహం అని వివరించారు. యీ పేరునాకు నచ్చింది. కాని నేను చేర్చాలనుకున్న విషయం యిందులో రాలేదని అనిపించింది. అందువల్ల నేను 'ద'ను 'త' చేసి అందు'య' చేర్చాను అంటే ఆవిధంగా సత్యాగ్రహం అయిందన్నమాట సత్యంలో శాంతి యిమిడి వుంటుంది. ఏ విషయం పైనా ఆగ్రహం అనగా పట్టుదలపట్టితే శక్తి ఆవిర్భవిస్తుంది. అందువల్ల ఆగ్రహం అనుశబ్దానికి బలాన్ని యిచ్చి భారతీయుల యీ మహోద్యమానికి నేను సత్యాగ్రహం అని పేరు పెట్టాను అంటే సత్యము, శాంతికి రెండిటితో ఆవిర్భవించే బలం అన్నమాట. యీ విధంగా సత్యాగ్రహశబ్దాన్ని గురించి వ్యాఖ్యానించాను పాసివ్ రెసిస్టెన్స్ అను ఇంగ్లీషు శబ్దాన్ని తొలగించిచేశాను ఇంగ్లీషులో వ్రాసిన వ్యాసాల్లో సైతం పాసివ్ రెసిస్టెన్స్ అనుశబ్దాన్ని వాడుటం తగ్గించివేశాను సత్యాగ్రహశబ్దాన్ని వివరించే ఇంగ్లీషు శబ్దాన్ని ప్రయోగించడం ప్రారంభించాను. ఈ విధంగా సత్యాగ్రహం అను పేరు యొక్క పుట్టుక జరిగింది. ఈ చరిత్రను పొడిగించుటకు ముందు పాసివ్‌రెసిస్టెన్స్ మరియు సత్యాగ్రహం అను రెండు శబ్దాలకు మధ్యగల భేదాన్ని తెలుసుకోవడం అవసరం తరువాత ప్రకరణంలో యీ భేదాన్ని తెలుసుకుందాం




13

సత్యాగ్రహం-పాసివ్‌రెసిస్టెన్స్

బారతీయుల జాతీయ ఉద్యమం తీవ్రరూపం దాల్చే కొద్దీ ఆంగ్లేయులకూడా ఆకర్షితులయ్యారు. ట్రాన్స్‌వాల్ యందలి ఇంగ్లీషు పత్రికల వాళ్లంతా ఖూనీ చట్టాన్ని సమర్థిస్తూ, ఇంగ్లీషువాళ్ళంతా దాన్ని సమర్దిస్తూ వుండేవారు. అయినా భారతీయులు ఏమైనా వ్రాసిపంపితే తమ పత్రికల్లో తప్పక ప్రకటిస్తూవుండేవారు ప్రభుత్వానికి భారతీయులు పంపే ఆర్జీలను పూర్తిగా ప్రచురిస్తూ వుండేవారు పూర్తిగా ప్రకటించని వాళ్లు సారాంశమైనా తప్పకప్రకటిస్తూ వుండేవారు భారతీయులు జరిపే మీటింగులకు తమ విలేకర్లను పంపుతూ వుండేవారు విలేకర్లను సంపనివాళ్లు మనం సభావిశేషాలు వ్రాసి పంపితే ప్రకటించేవాళ్లు

ఇంగ్లీషు పత్రికల సౌహర్ధ్రతతో కూడిన యీవ్యవస్థ భారతజాతీయ ఉద్యమానికి ఎంతో సహయం చేసింది. ఉద్యమం ప్రారంభించిన తరువాత ఆంగ్లేయులు కూడా అందుపాల్గొనసాగారు అట్టి అగ్రగణ్యుల్లో జోహన్స్‌బర్గుకు చెందిన ఆంగ్లలక్షాధికారి శ్రీ హాస్కిన్ ఒకరు వారిహృదయంలో రాగద్వేషాలు లేవు ఉద్యమం ఆరంభించిన తరువాత వారు నా దగ్గరకు రాసాగారు జోహన్స్‌బర్గ్‌లో జమిస్టన్ ఒక ఉపనగరం అక్కడి ఆంగ్లేయులు నా ఉపన్యాసం వింటామని వార్త పంపారు. ఒక సభ జరిగింది. శ్రీ హాస్కిస్ ఆ సభకు అధ్యక్షత వహించారు. నేను ఉపన్యాసం యిచ్చాను సభలో శ్రీ హాస్కిన్ భారతీయుల ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూ నన్ను పరిచయం చేస్తూ ట్రాన్స్‌వాల్ భారతీయులు న్యాయంకోసం ప్రయత్నించి విఫలురైపాసివ్ రెసిస్టెన్స్‌ను ఆశ్రయించారు. వాళ్లకి ఓటింగు అధికారంలేద వారి సంఖ్య స్వల్పం (వాళ్లు బలహీనులు) వాళ్ల దగ్గర ఆయధాలులేవు. అందువల్ల