తోలుబొమ్మలు

వికీసోర్స్ నుండి


జంఘాలశాస్త్రి ఇట్లు పలికెను.


"నిన్నరాత్రి తోలుబొమ్మలయాటలోనికి బోయితిని. తోలుబొమ్మలవాండ్రు పడమటిదేశము ఉండి వచ్చిరి. బొమ్మలు మిగుల బెద్దవి. ఈగ్రామమున ననేకస్థలములందు బొమ్మలాట కీర్తనములు జరిపిరి. "బొమ్మల నాడించుటయందు మిగుల నేర్పుగలవా"రని వాడుక గ్రామమంతయు వ్యాపించినది. వారిలో బాట పాడువ దొక్కయాడుది యున్నది. అది జీడిగింజకంటె నల్లనిది. దాని ముఖాగ్రమున దలవెండ్రుక లెచ్చట నారంభమైనవో తెలియదు. "తడిమినను దెలియవా?" యని వాణీదాసుడు సన్నజేయుచున్నాడు కానీ యతిప్రాసములకు నిత్యము తడుముకొను నలవాటున్న యాతడే యట్లు చేసి సందేహనివారణము చేసికొనవచ్చును. అది వఱడువలె నెండియున్నది. కాని, దానికంఠరవ మమృతప్రవాహము. గ్రామమున రాత్రివేళయం దదియేమూల బాడుచున్నను గ్రామ మంతయు దానికంఠము వినిపించును. చెక్కు చెదర లేదు. నలి తొలి లేదు. బొంగు జీర లేదు. అపస్వరము వెలితి లేదు. 'కై' మనిన నక్షత్రమార్గమున గఱ్ఱు మని తిరుగుచుబలిటీలు గొట్టును. సంగతులపై సంగతులు, పూలుచల్లినట్లది వర్షించును. పేకజువ్వవలె గాత్రపువిసరులు రయ్యి మని యొకసారి తారకమున కంటియక్కడ నొక్కసారి టప్పుమని యాగి రప్పుమని మిక్కిలి వింతరంగుల పసపుబుడ్లను ద్రిమ్మరించును. చెంబులో గ్రచ్చకాయలు పోసి త్రిప్పినట్లు కంఠరవము గలగల లాడును గాని బాస మంచిది కాదు. భాగవతపు బద్ధతి. దక్షిణపుయాస-లేదు. లేతముదుళ్ల విచికిత్స-లేదు. ఎగుడు దిగుడుల తరంగభంగి-లేదు. జారువరవికల పట్టు విడుపులు-లేవు. సాపుసంతనల సమీచీనత-లేదు. సన్నపోగరపని కాదు. పెద్దబాడిదెపని. ఒక్కటే "కై" ఒక్కటే 'రై' కొంతసేపు వినినతోడనే చెవులు రింగురుమనసాగును. బొమ్మలాట యైనపిమ్మటనైన రెండుపూటలవఱకు చెవిలోని "గుంయ్" వదలదు.


నిన్న నేను దొమ్మిదిగంటలు కాకుండనే యాట జూడబోయితిని. స్థలవిశాలతకొఱకు సంతబయట నాట నియమింపబడినది. ఓ! ఏమి ప్రజ! ఇసుక వైచిన రాలకుండున ట్లున్నారు. వందలకొలది బొరుగూళ్లబండ్లు సంతబయలుచుట్టు దింపబడియున్నవి. వ్రేళ్లసందున వ్రేళ్ళిమిడినట్లు జనులు దగ్గఱగ దగ్గఱగ బిగించుకొని కూరుచుండియున్నారు. కిటకిటలాడుచు బెటపెట లాడుచున్నారు. నాకు స్థలము దొరకలేదు. అందుచే గొంతసే పొకచోట వంగి, కొంతసేపు నిలువబడి, కొంతసేపు ముంగాళ్లపై నానుకొనియుండి వేడుక చూచుచుండగ వెనుకవారి చూపున కడ్డు వచ్చితి నని కఱ్ఱపోటులతో మోకాలిత్రోపులతో నన్నటనుండి వారు త్రోచివైవ వేఱొకస్థలమునకు బోయి యక్కడగూడ బదప్రహరణమో పాదరక్షప్రహరణమో పొందుట సిద్ధింప మఱియొకచోటికి బోవుచు నిట్లు సంతబయలంత సమయానుసారముగ సంధి సంధి పోట్లసలుపుతో సంచరించితిని. కాదు. సంచరింప జేయబడితిని. ఎన్నియోబొమ్మలను ముగ్గురో నల్వురో తెరలోపల నాడించుచుండ నొక్కబొమ్మను వీరందఱు తెరవెలుపల నాడించుచున్నారు. ఇంత శ్రమపడి బొమ్మలాట నేల చూడవలయు నని మీరు నన్నడుగుదురేమో! జనులు విశేషముగ జేరియుండినచోటికి బోవుటకు నాకు మొదటినుండియు నుత్సాహము. జనుల ముఖభేదముల బరిశీలించుట, కంఠరవములను శోధించుట, మాటలతీరులను గనిపెట్టుట, వానికిగారణములగు హృదయరసములను విమర్శించుట, స్వభావభేదములను గుర్తెఱుగుట-యిట్లు ప్రకృతిజ్ఞానమును సంపాదించుటయే నాముఖ్యోద్దేశము. పందిటిక్రింద నాడింపబడుచున్న నిర్జీవపు దోలుబొమ్మలను జూచుటకై పోయినవడగాను. బయటనాడుచున్న ప్రాణమున్న తోలుబొమ్మలయాట జూడ బోయితిని. అందుచే సంతబయలంత తిరుగుట కష్టమయినను నా కుత్సాహముగనే యుండెను. వారి కాలిపోటులు నారక్తమాంసములలో గొంతసేపు మాత్రమే నిలుచును గాని వారిప్రకృతుల కలపుబోటులు నాహృదయఫలకమున జిరకాలము నిలుచునుగాదా?