తెలుగు శాసనాలు/జినవల్లభుని కుర్క్యాల శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14. జినవల్లభుని కుర్క్యాల శాసనము.

ఇది కరీంనగరు జిల్లాలో కుర్క్యాల గ్రామము వెలుపల ఒక కొండపైన జినవిగ్రహములు, చక్రేశ్వరి యను శాసనదేవి ప్రతిమలకు క్రింద వ్రాయబడిన సంస్కృత, కన్నడ, తెలుగు పద్యములతో గూడిన శాసనము. ప్రసిద్ధ కన్నడ కవియగు పంపని తమ్ముడు జినవల్లభుడీ శాసనమును వ్రాయించెను. ఇందే పంపని పూర్వులు తెలుగు దేశములోని కమ్మనాటి (గుండ్లకమ్మ తీరము) లోని వంగిపఱ్ఱు ప్రామమునకు చెందిన వారనియు, వేములవాడ చాళుక్య రాజుల ఆశ్రయమునుబట్టి సబ్బిమండలము చేరిరనియు తెలియుచున్నది. పంపడు కన్నడమున విక్రమార్జున విజయము, ఆదిపురాణము అను ఉద్గ్రంథములను రచించి ఆభాషయందాదికవి యని ఖ్యాతినొందెను. అతడు తెలుగున కూడ నేమియైన స్వల్పకావ్యములు రచించెనేమో తెలియదు. కాని అతని సొదరుడీ శాసనమును రచించెనని చెప్పవచ్చును. తానుకూడ గొప్ప విద్వాంసుడనని ఇందాతడు చెప్పుకొనెను. తెలుగులో నన్నయకు పూర్వము కంద పద్యములున్నట్లు ఇంతవరకు తెలియదు. ఇందు మూడు కందపద్యములు కలవు. ఇవి జినవల్లభుని రచనయనియే చెప్పదగును. ఈ శాసనము సుమారు క్రీస్తు. 945 అని చెప్పవచ్చును. అంటే నన్నయ కంటె సుమారు నూరు సంవత్సరములు ముందుది. తెలుగులో మనకిప్పటికి తెలిసిన మొదటి కందపద్దెము లివియే.