Jump to content

తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 1

వికీసోర్స్ నుండి

ప్రకరణం 1

ఆంధ్రం, తెనుగు, తెలుగు

- జి. ఎన్. రెడ్డి

1.0. మన భాషకు ఈనాడు ఆంధ్రం, తెనుగు, తెలుగు అని మూడు పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. సంస్కృత గ్రంథాల్లో ఆంధ్ర శబ్దం ఆంధ్రకు రూపాంతరంగా కన్పిస్తుంది. తెలుగు కావ్యాల్లో తెనుంగు, తెనుఁగు, తెలుంగు, తెలుఁగు, త్రిలింగ అనే పదాలు భాషాపరంగా ప్రయోగంలో ఉన్నాయి. తమిళంలో తెలుగు భాషకు పేర్లుగా వడగు, వడుగ పదాలు గ్రంథస్థమైనాయి.1 పోర్చుగీసు వారు తెలుగువారిని 'జెంతియె' (Gentio) అనీ, తెలుగు భాషను 'జెంతూ ' (Gentoo) అనీ, 16, 17 శతాబ్దాలలో వ్యవహరించినారు.2 మొత్తం మీద మన భాషను తెలిపే పదాలు: అంధ్ర, ఆంధ్ర, తెనుంగు, తెనుఁగు, తెలుంగు, తెలుఁగు త్రిలింగ, వడగు, వడుగ, జెంతూ. ఏకార్థబోధకాలైన ఈ పదాల చరిత్రనూ, రూపనిష్పత్తినీ, పరస్పర సంబంధాన్ని పరిశీలిద్దాం.

1.1. అంధ్ర, ఆంధ్ర : ఈ రెండు పదాలు రూపాంతరాలైన సంస్కృత పదాలు. ఇవి సంస్కృతంలో అతి ప్రాచీన కాలంలో జాతిపరంగా ప్రయోగింపబడి ఉన్నాయి. శునశ్శేపుని తమ జ్యేష్ఠభ్రాతగా అంగీకరించడానికి నిరాకరించిన మొదటి యాభైమంది పుత్రులనూ అనార్యజాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబాది దస్యులలో కలసి పొండని విశ్వామిత్రుడు శపించి బహిష్కరించినట్లు ఐతరేయబ్రాహ్మణంలో (క్రీ. పూ. 600) ఒక ఐతిహ్యం ఉంది.3 మనకు తెలిసినంతవరకు ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో మొట్టమొదటి ప్రయోగం ఇదే. మ్లేచ్ఛులైన ఈ అయిదుజాతుల వారూ ఆర్యావర్తానికి సరిహద్దు ప్రాంతాల్లో ఆనాడు నివసిస్తున్న ద్రావిడులో ముండా ప్రజలో అయిఉండవచ్చు. భాతరదేశానికి ఆర్యులు అగంతకులనీ, ముండా ప్రజలూ, ద్రావిడులూ వారికి పూర్వముండిన ఆదిమవాసులనీ చరిత్రకారుల నిర్ణయం. కాబట్టి ఆంధ్రులు ఆనార్యు లైన ద్రావిడులలో ఒక తెగవారని అభిప్రాయపడవచ్చు. ఆంధ్రుల ప్రశంస వ్యాస మహాభారతంలో కూడా కన్పిస్తుంది. మయసభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓడ్ర, ఆంధ్రరాజులు ధర్మరాజును కొలిచినట్లు వర్ణింపబడింది.4 మనుస్మృతిలో కారావరవస్త్రీకి వైదేహునకు జన్మించిన నిషాదులు ఆంధ్రులని చెప్ప బడింది.5 నాట్యశాస్త్రంలో భరతుడు (క్రీ. శ. ప్రారంభకాలం) పాత్రోచిత భాషను గురించి చర్చిస్తూ బర్బర, కిరాత, ఆంధ్ర, ద్రమిల ప్రభృతి జాతులకు శౌరసేని మొదలైన ప్రాకృతాలను ఉపయోగించరాదని సూచించి ఉన్నాడు.6 వాయు పురాణంలో ఆంధ్రరాజులైన ఆంధ్రభృత్యుల పేర్లూ, వారి పరిపాలనా కాలం వివరించబడి ఉన్నాయి.7 ఆంధ్రభృత్యులే శాతవాహనరాజులు. వారి పరిపాలనా కాలం క్రీ. పూ. 230 క్రీ. శ. 225 అని చరిత్రకారుల నిర్ణయం. సంస్కృత భాగవతంలో శుకుడు హరిస్తుతి గావిస్తూ కిరాతహూణాంధ్ర పుళిందాది జాతులు తమతమ పాపాలనుండి విముక్తి పొందడానికి హరిని ఆశ్రయించినారని వర్ణించినాడు.8 చంద్రగుప్తమౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకురాయబారి మెగస్తనీను (క్రీ. పూ. 400) మౌర్యుల తర్వాత ఆంధ్రులు ఎన్నదగిన చతురంగబలం గల వారని ప్రశంసించి ఉన్నాడు.9 అశోకుడు వేయించిన కొన్ని శాసనాల్లోకూడా ఆంధ్ర ప్రజల ప్రసక్తి కన్పిస్తుంది. అశోకుని 13వ ధర్మలిపి శాసనంలో ఆంధ్రు లతని సామ్రాజ్యంలోని వారనీ, అతని ధర్మబోధలను అనుసరిస్తున్న వారనీ ప్రశంసించబడింది.10 కువలయమాల అనే ప్రాకృత గ్రంథంలో ఉద్యోతనుడు (కీ. శ. 9వ శతాబ్దం) ఆంధ్రులు ఆందమైనవారనీ, ఆహార విహార ప్రియులనీ అభివర్ణించి ఉన్నాడు.11 ఈ విధంగా ఆంధ్రశబ్దం ఐతరేయ బ్రాహ్మణకాలం నుండి జాతివాచకంగా గ్రంథస్థమై ఉంది.

1.2. సంస్కృత వాజ్మయంలో అంధక ఆంధ్రక జాతుల ప్రశంస కూడా కన్పిస్తుంది. వ్యాస మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరానికి విచ్చేసిన వారిలో అంధకులుకూడా ఉన్నట్లు వర్ణించబడింది.12 పాండవులు వనవాసానికి వెళ్ళిన వార్తవిని వారిని దర్శించడానికి భోజులు, వృష్ణులు, అంధకులు వెళ్ళినట్లు తెల్ప బడింది.13 భాగవతవురాణంలో అంధకులు యాదవజాతికి చెందిన ఒక తెగవారనీ, ద్వారకానగర సంరక్షకులనీ పేర్కొనబడి ఉన్నది.14 మత్స్యపురాణంలో అంధ కాసురుని సంతతి అంధకులని ఒక ఐతిహ్యం ఉంది.15 వ్యాసభారతంలో అరణ్యపర్వ కథాభాగంలో శ్రీకృష్ణుడు ధర్మజుని ఓదారుస్తూ, రాజసూయయాగ సమయంలో ధర్మజుని సేవించడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓడ్ర, చోళ , ద్రావిడులతో పాటు ఆంధ్రకులు కూడా ఉన్నట్లు స్మృతికి తెచ్చినాడు.16 కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రకులు; పులిందులు, కిరాతులు మొదలైన మ్లేచ్ఛజాతులవారు కౌరవపక్షంలో యుద్ధం చేసినట్లూ, వారు పరాక్రమవంతులై నట్లూ వర్ణించబడింది.17 శాంతిపర్వంలో భీష్ముడు ధర్మరాజుకు సర్వభూతోత్పత్తిని గురించి చెబుతూ దక్షిణాపథంలో జన్మించిన పుళింద శబరాది జాతులలో ఆంధ్రకులు ఒకరని పేర్కొన్నాడు.18

1. 3. సంస్కృత గ్రంథాల్లో జాతి వాచకంగా ప్రయోగించబడిన అంధ్ర, ఆంధ్ర, అంధక , ఆంధ్రక పదాలు ఏకజాతి వాచకాలే అని అభిప్రాయపడవచ్చు. ఈనాడుకూడా బీరారు ప్రాంతంలో 'అంధ' అనే ఒక అనార్యతెగవారున్నారు, అంధ యొక్క ప్రాకృత రూపాంతరమే అంధక ఆనీ, దాని సంస్కృ త రూపమే 'అంధ్ర' లేదా 'ఆంధ్ర' అనీ బరో (T. Burrow) అభిప్రాయం.19

1.4. ఇంతవరకు పేర్కొన్న గ్రంథస్థాధారాలను బట్టి ఆంధ్రజాతిని గురించి ఈ కింది అభిప్రాయాన్ని ప్రతిపాదించవచ్చు: ఆంధ్రులు ఆనార్యులు. ఆర్యుల్లో కొందరికి వీరితో సాంకర్యం ఏర్పడింది. ఆంధ్రులు సంకరజాతి వారని చెప్పడానికి మనుస్మృతి కూడా ఒక ఆధారం. శబర, పుండ్ర, పుళింద, కిరాతాది మ్లేచ్ఛజాతులలో ఆంధ్రులను కూడా జమకట్టి ఉండడం గమనించదగిన విషయం. ఆంధ్రశబ్దానికి సంస్కృతంలో వేటకాడు అనే ఒక అర్థం ఉంది.20 సంగం యుగానికి సంబంధించిన తమిళ గ్రంథాల్లో తెలుగువారిని 'వడుగర్' అని పేర్కొంటూ వారు వేటకుక్కలతో సంచరించేవారని వర్ణించబడింది, ఆర్యుల ప్రాబల్యాన్ని ఎదుర్కోలేని ఆంధ్రులు దక్షిణాపథానికి తరలివచ్చి రాజ్యాన్ని స్థాపించుకొని ఆ ప్రాంతంలోని ప్రజలతో కలసి ఉండవచ్చు. పాలకులైన వారిపేరే ఆ దేశానికి, ప్రజలకూ, భాషకూ కాలక్రమంలో సిద్ధించి ఉండవచ్చు.

1.5. ఆంధ్రశబ్దం జాతివాచకంగానే కాక దేశవాచకంగా కూడా ప్రాచీన సంస్కృత వాఙ్మయంలోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను దక్షణ దిశకు పంపుతూ వారు వెదకవలసిన రాజ్యాలలో ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్యాది దేశాలను పేర్కొని ఉన్నాడు.21 దక్షిణదిగ్విజయయాత్రా సందర్భంలో సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆంధ్రదేశం కూడా ఉన్నట్లు వ్యాసభారతాన్నిబట్టి తెలుస్తుంది.22 భాగవతపురాణంలో బలికుమారులు ఆరుగురు తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకొన్నారని, వారిలో ఆంధ్రుడనేవాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించినాడనీ ఒక ప్రశంస ఉంది.23 బౌద్ధవాఙ్మయంలోని అంధరట్ట (< ఆంధ్రరాష్ట్ర) అనే పదం ఆంధ్రదేశ సూచకమే. శివస్కంధవర్మ మైదవోలు శాసనంలో (క్రీ. శ. 234) “అందా పథీయో గామో విరిపరమ్" అను వాక్య భాగాన్ని బట్టి ఆంధ్రపదం దేశవాచకమని తెలుస్తుంది.24 మల్లిదేవనందివర్మ దానశాసనంలో (క్రీ. శ. 340) "ఆంధ్రమండలే ద్వాదశ సహస్రగ్రామ సంపాదిత సప్తార్ధ లక్షవిషయాధిపతేః" అన్న వాక్యంలోని ఆంధ్ర శబ్దం కూడా దేశ వాచకమే.25 వరాహమిహిరుని బృహత్సంహితలోని (క్రీ.శ. 600) "కౌశిక విదర్భ వత్పాంధ్రచేదికాశ్చోర్వితండకాః" అనే వాక్యంలోకూడా ఆంధ్ర పదం దేశవాచిగా వాడబడింది. చారిత్రక యుగంలో ఆంధ్రపదం దేశపరంగా అనేక గ్రంథాల్లోనూ, శాసనాల్లోనూ కన్పిస్తుంది. కాబట్టి, మొదట జాతివాచక మైన ఆంధ్ర శబ్దం తర్వాత దేశవాచకంగా ప్రయుక్తమైందనీ, అది క్రీస్తు శకానికి పూర్వమే దేశవాచకంగా కూడా సంస్కృత గ్రంథాల్లోకి వ్యాప్తికి వచ్చిందనీ, నిస్సంశయంగా చెప్పవచ్చు.

1.6. మనకు తెలిసినంతవరకు సంస్కృత వాఙ్మయంలో 11వ శతాబ్దానికి పూర్వం ఆంధ్రపదానికి భాషావాచిగా ప్రత్యక్ష ప్రయోగంలేదు. కాని, భరతుని నాట్యశాస్త్రంలో నాటకంలో ఉపయోగించదగిన 'విభాషలు' ఏడు విధాలనీ, అవి శకార, అభీర, చండాల, శబర, ద్రమిల, ఆంధ్ర, వనచరుల వ్యవహారంలోనివనీ సూచించబడింది.26 నన్నయభట్టు రచించిన నందంపూడి శాసనంలో ఆంధ్రశబ్దం, భాషావాచిగ మొట్టమొదటి సారిగా ప్రత్యక్షమవుతుంది. ఈ శాసనంలో నారాయణ భట్టును “యస్సంస్కృత కర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసు కవిరాజశేఖర ఇతి ప్రథితః సుకవిత్వ విభవేన" అని నన్నయ ప్రశంసించి ఉన్నాడు. ఈ ఆధారాన్ని బట్టి ఆంధ్రపదం 11వ శతాబ్దం నాటికి భాషాపరంగా రూఢి కెక్కిందని, ఖచ్చితంగా చెప్పవచ్చు.27 ఆంధ్రశబ్దచింతామణి కర్త నన్నయభట్టు అని అంగీకరిస్తే ఆంధ్ర శబ్దాన్ని బాషాపరంగా శాసనంలోనే కాక గ్రంథంలో కూడ నన్నయ. ప్రయోగించినట్లు చెప్పవచ్చు. ఆంధ్రభాషాభూషణకర్త అయిన కేతన తెనుఁగు, తెలుఁగు పదాలతో బాటు ఆంధ్రశబ్దాన్ని కూడా భాషాపరంగా ప్రయోగించి ఉన్నాడు. తన లక్షణ గ్రంథానికి పెట్టిన పేరులోనే కాకుండా గ్రంథంలో కూడా ఆంధ్ర శబ్దాన్ని వాడి ఉన్నాడు. తెలుగులో గ్రంథరచన ప్రారంభమైన కాలం నుండి ఆంధ్ర శబ్దాన్ని భాషాపరంగా కవులూ, పండితులూ వాడినారని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఈ విధంగా మొదట జాతివాచకమైన ఆంధ్రశబ్దం తర్వాత దేశబోధ కంగానూ, అటుపిమ్మట భాషావాచిగానూ వ్యాప్తిలోనికి వచ్చిందని నిర్ణయించ వచ్చు. ఈనాడు కూడా ఆంధ్రశబ్దం జాతి, దేశ, భాషలను సూచించడానికి వాడ బడుతూ ఉంది.

తెనుంగు, తెనుఁగు, తెనుగు; తెలుంగు, తెలుఁగు, తెలుగు ;

1.7. తెనుంగు, తెనుఁగు - ఈ రెండురూపాలు భాషాపరంగా నన్నయ భారతంలో మొట్టమొదటిసారిగా గ్రంథస్థమై ఉన్నాయి, తెలుగు ధ్వనిపరిణామంలో హ్రస్వం మీది పూర్ణబిందువుకు లోవం విభాషగా కావ్యభాషలో కన్పించడం వల్ల తెనుంగు, తెనుఁగు రూపాంతరాలే. నన్నయలో తెనుంగుకు ఒక ప్రయోగం, తెనుఁగుకు ఒక ప్రయోగం మాత్రమే ఉన్నాయి.

సారమతి, గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తిలో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుఁడయ్యె జగద్ధితంబుగాన్ . 28

జననుత కృష్ణద్వైపా
యనముని వృషభాభాహితమహాభారత బ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుఁగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్.29

నన్నెచోడుని కుమారసంభవంలో తెనుంగు పదానికి రెండు ప్రయోగాలు కన్పిస్తాయి.

మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశి కవితఁ బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్.30

సరళముగాగ భావములు జానుఁ దెనుంగున నింపు పెంపుతోఁ
బిరిగొన వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థము లొత్తగిల్ల బం
దురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వ రసంబునఁ గందలళింప న
క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణంసాయన లీలఁ గ్రాలఁగాన్ .31

నన్నయ, నన్నెచోడులు తెలుంగు, తెలుఁగు రూపాలను ప్రయోగించలేదు. పాలకురికి సోమన తెనుంగు, తెలుఁగు పదాలను భాషాపరంగా ప్రయోగించి ఉన్నాడు.

ఉరుతర గద్యపద్యోక్తుల కంటె-సరసమై పరగిన జానుఁ దెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ - గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ
దెలుఁగు మాటలనఁగా వలదు. వేదముల. కొలఁదియ కాఁజూడుఁ డిలనెట్టులనిన32

తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో 'తెలుగు కవిత్వము,'33 'తెలుఁగుఁబడి'34 భారతావతారికలో 'తెనుంగుబాస',35 'తెనుఁగుబాస36 అని ప్రయోగించి ఉన్నాడు. తెలుంగు, తెలుఁగురూపాలు తెనుంగు, తెనుఁగులవలె రూపాంతరాలు. 13వ శతాబ్ధం, నుండి భాషాపరంగా వీని ప్రయోగం కావ్యాల్లో సర్వసాధారణంగా కన్పిస్తుంది.

1.8. భాషావాచియైన తెనుఁగు, తెలుఁగు - ఈ రెండురూపాలు భిన్న పదాలా లేక ధ్వనుల మార్పువల్ల ఏర్పడిన రూపాంతరాలా అని పరిశీలించవలసి ఉంది.

తెనుఁగు : తెనుఁగు తద్భవమనీ ఇది త్రినగశబ్ద భవమనీ కొందరు ఊహించినారు. ఇది ఊహయేకాని నిజముకాదు. (చూ. చిలుకూరి నారాయణరావు, ఆం. భా. చ. ప్రథమభాగం (1936), పు. 32) తెనుఁగు దేశ్యపదమనీ, దిగ్వాచి అనీ సోమయాజిగారి అభిప్రాయం (చూ. గంటిజోగి సోమయాజి, ఆం, భా. వి. (1947), పు. 29-32). తెనుంగు, తెనుఁగు శబ్దాలలోని -ంగు -ఁగు ప్రత్యయ భాగం (పోల్చిచూడు : వడగు, బడగు, DED4267 : కిలక్కు DED 1348; కుటకు, కొడగు DEP 1374), 'తెన్‌' శబ్దము దిగర్థమున్న ద్రావిడ పదాంశం (చూ. DED 2839). తెలుగుభాషలో తెన్ శబ్దం నేటి వ్యవహారం నుఁడి తొలగి పోయింది కాని, తెమ్మెర, తెన్నేరు, టెంకాయ, తీరు తెన్నూ, దిక్కూ. తెన్నూ ఇత్యాది సమాస రూపాల్లో మాత్రం నిలచి ఉంది. సాధారణంగా ఒక సమాజంలో ఒక భాష రూపొందే ప్రాథమిక దశలో ఆ భాషకు నామకరణం జరగదు. ఈనాడు కూడా కొన్ని అనాగరిక భాషలకు ఆ భాషా వ్యవహర్తలలో ప్రత్యేకమైన పేర్లు, లేని స్థితి కన్పిస్తుంది. ఒక భాషా సమాజంలోనే ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతం వారిని సూచించవలసి వచ్చినప్పుడు దిక్కులను బట్టి తూర్పువారనీ, పడమటివారనీ, ఉత్తరాదివారనీ వ్యవహరించడం సాధారణంగా కన్పిస్తుంది. ప్రాచీన ద్రావిడభాషా సమాజంలోని వారు దక్షిణప్రాంతపువారిని దక్షిణదిగ్వాచి యగు 'తెన్ " శబ్దముచే 'తెనుంగు' అని నిర్దేశించి ఉండవచ్చు. ఆ ప్రాంతపు మాండలికం ప్రత్యేక భాషగా పరిణమించినపుడు ఆ ప్రజలను నిర్దేశించిన తెనుఁగు వారి భాషకు పేరుగా కూడా ఏర్పడి ఉండవచ్చు. ద్రావిడ ప్రజలు ప్రాచీనకాలంలో భారతదేశమంతా వ్యాపించి ఉండినవారే. కాబట్టి ఆనాడు ఉత్తర ద్రావిడప్రజలు దక్షిణ దిక్కులోని వారిని 'తెన్' శబ్దంతో నిర్దేశించి ఉండవచ్చు. అనడం అసంగతం కాదు, తమిళదేశానికి ఉత్తరాన ఉన్న తెలుగువారిని 'వడుగర్' అని, తెలుగు భాషను 'వడుగ' అనీ తమిళులు ప్రాచీనకాలంనుండి వ్యవహరించి ఉండడం పై అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఇటువంటిదే 'కొడగు' పదం కూడా.

1.9. తెలుఁగు : తెలుఁగు అనేశబ్దం భాషాపరంగా సంస్కృత గ్రంథాల్లో కన్పించడం లేదు. వాయుపురాణంలో మాత్రం 'తిలింగా' అనే పదం ఒక జనపదానికి పేరుగా పేర్కొనబడినది.37 కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానంలోని విద్యానాథుడు (క్రీ. శ. 13 వ శతాబ్దం) శ్రీశైలదాక్షారామ కాళేశ్వరములలోని శివలింగముల వలన తెలుగు దేశానికి త్రిలింగమనే పేరు ఏర్పడిందని 'ప్రతాపరుద్రీయం'లో తెల్పి ఉన్నాడు.38 విన్నకోట పెద్దన (క్రీ.శ. 14వ శతాబ్దం) కూడా ఆంధ్ర దేశానికి త్రిలింగదేశమనే పేరు కావ్యాల్లో ప్రయుక్తమై ఉన్నట్లూ, తెలుఁగు త్రిలింగ శబ్దభవమైనట్లూ, కావ్యాలంకార చూడామణిలో తెల్పి ఉన్నాడు :

ధర శ్రీపర్వతకాళే
శ్వరదాక్షారామసంజ్ఞ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగ దేశమనఁ జనుఁ గృతులన్

తత్త్రిలింగపదము తద్భవం బగుటచేఁ
దెలుఁగుదేశ మనఁగఁ దేటపడియె
వెనుఁకఁ దెనుఁగుదేశమును నండ్రు కొంద ఱ
బ్బాస పంచగతులఁ బరఁగుచుండు39

త్రిలింగపదం దేశవాచకంగా బ్రహ్మాండ పురాణంలోనూ, స్కాందపురాణంలోనూ, గ్రంథస్థమై ఉన్నట్లు చిలుకూరి వీరభద్రరావుగారు ఆంధ్రుల చరిత్ర ప్రథమభాగంలో తెల్పి ఉన్నారు.40 రాజశేఖరుని విద్ధసాలభంజికలో (క్రీ. శ. 10 వ శతా.) "జయతు జయతు త్రిలింగాధిపో దేవః"41 అని ఒక ప్రయోగం ఉంది. పురాణాల కాలాన్ని ఇదమిత్థంగా నిర్ణయించడం కష్టం. వాటిలో ఆర్వాచీనాలైన ప్రక్షిప్త భాగాలెక్కువ. 'తెలుగు' త్రిలింగ శబ్దభవం కాదనీ, తెలుగు యొక్క సంస్కృతీ కృతరూపమే త్రిలింగమనీ కొమర్రాజు లక్ష్మణరావుగారు నిరూపించి ఉన్నారు. (లక్ష్మణరాయ వ్యాసావళి, పు. 122 - 26). 'తెలుఁగు' త్రికళింగ శబ్దభవమనీ, ధ్వనిపరిణామం వల్ల అది త్రికళింగ> తి ఆలింగ> తెలింగ > తెలుంగుగా మారిందనీ కొందరి ఊహ. (గం. జో. సోమయాజి, ఆం. భా. వి., పు. 21-2). ఈ అభిప్రాయానికి సహేతుకమైన ఆధారాలు లేవు.

తెనుఁగు, తెలుఁగు రూపాంతరాలే కాని భిన్నధాతుజాలు కావు. ద్రావిడ భాషల్లో న/ల వినిమయం; -ణ--, --ళ~>--న-, -ల-- లు గానూ మారిన సందర్భాలున్నాయి (DED4524) . ఈ మార్పు మూల ద్రావిడంలోనే జరిగినట్టు భద్రిరాజు కృష్ణమూర్తి నిరూపించి ఉన్నారు.42 ఈనాడు కూడా కొన్ని ప్రాంతాల గ్రామీణుల వ్యవహారంలో తెలుగులో న, ల-ల వినిమయం కన్పిస్తుంది. మునగ- ములగ, చెనగు - చెలగు, మునుకోల - ములుకోల, జన్మం--జల్మం, లేద- నేదు, లాగు-నాగు మొదలైనవి. కాబట్టి తెలుఁగు త్రిలింగ శబ్దభవంకాదనీ, దేశ్యమైన తెనుఁగు యొక్క రూపాంతరమే తెలుఁగు అనీ, ఈ రెండు రూపాలూ ప్రాచీన కాలం నుండీ తెలుగు దేశంలో వ్యవహారంలో ఉన్నాయనీ నిర్ణయించవచ్చు.

1.10. దేశిపదాలను సంస్కృతీకరించడమో, లేదా వాటికి సంస్కృత సంబంధమైన కృతకవ్యుత్పత్తిని కల్పించడమో పండితుల సంప్రదాయం. ఇందుకు కారణం 'జనని సంస్కృతంబె సకలభాషలకును' అను నమ్మకమే, సంస్కృత భాషాభిమానం కొద్దీ ఓరుగల్లును ఏకశిలానగరమనీ, పెనుగొండను ఘనగిరి అనీ, కందుకూరును స్కంధపురి అనీ, చెయ్యేరును బాహుదా నది అనీ - ఈ విధంగా దేశి పదాలను పండితులు సంస్కృతీకరించి ప్రయోగించిన సందర్భాలు చాలాఉన్నాయి. తమిళ శబ్దాన్ని ద్రవిడ లేదా ద్రమిల అనీ, కరినాడు శబ్దాన్ని కర్ణాట అనీ (కర్ణయోః ఆటతీతి కర్ణాటకం), అత్తిరాల గ్రామాన్ని హత్యరాల అనీ, నార్త్ సింహాచలాన్ని నారదసింహాచలమనీ దేశ్యపదాలకు సంస్కృత భాషానురూపాలు సృష్టించబడి ఉన్నాయి. ఇటువంటిదే తెలుఁగు నుండి ఏర్పడిన త్రిలింగ శబ్దం. తెలుగు దేశంలో తెలగలు, తెలగాణ్యులు అనే తెగల వారిపేర్లను త్రిలింగ శబ్ద భవాలుగా నిరూపించలేము కదా ! అసలు తెలుగు దేశానికి త్రిలింగదేశమనే పేరు కొన్ని గ్రంథాల్లోనే కాని లోకంలో వ్యవహారంలో ఉన్నట్లు కన్పించదు. శైవమతం ప్రాబల్యం వహించిన కాలంలో పండితులు తెలుంగును త్రిలింగగ మార్చి ప్రయోగించి ఉండవచ్చు. 1.11. ఈ వ్యాసంలో ఇంతవరకు చర్చించిన విషయ సారాంశం ఇది:

(1) ఆంధ్రులు ఆర్య అనార్య మిశ్రజాతి. వీరు ఉత్తరార్యావర్తం నుండి దక్షిణాపథానికి వచ్చి గోదావరి ప్రాంతంలో రాజ్యాన్ని స్థాపించుకొని అక్కడి ప్రజలతో కలిసిపోయినారు.

(2) జాతివాచకమైన ఆంధ్రశబ్దం క్రమంగా దేశవాచకంగానూ, భాషావాచకంగానూ రూఢిలోకి వచ్చింది.

(3) తెనుఁగు దేశ్యమైన దిగ్వాచి.

(4) తెలుఁగు శబ్దం తెనుఁగు శబ్దానికి రూపాంతరమే కాని త్రిలింగ శబ్ద భవం కాదు.

జ్ఞాపికలు

1. తమిళంలో సంగం సాహిత్యములో (కీ. శ, ప్రారంభం) కుఱుందొగై (పద్య సంఖ్య 11), అగవానూర్ (పద్యసంఖ్య 107), నఱ్ఱిణై ప్రద్య సంఖ్య 212 -- గ్రంథాల్లో వడుగర్ (ఉత్తరదేశస్థులు) అనగా 'తెలుగువారు' అను పదప్రయోగ ముంది. జయగొండార్ (11వశతాబ్ది) రచించిన కళింగత్తుప్పరణిలో తెలుంగరు (పద్య సంఖ్య 469), వడుగు (పద్య సంఖ్య 43) తెలుగుభాషలో ప్రయోగింప బడింది.

2. “Gentoo. From Portuguese gentio, a gentile or heathen. The name formerly applied by Europeans to the natives of the country, especially to the Teloogoo people, for when the Portuguese arrived the Teloogoo Raj of Vijayanugger was dominant over great part of the peninsula". Manual of the Administration of the Madras presidency, Vol. III. Madras (1893).

3. “తస్యహ విశ్వామిత్ర స్యైకళతం పుత్రా ఆసుః ; పంచాశత్ ఏక జ్యాయాంసో మధుచ్ఛందసః, పంచాశత్ కనీయాంసః; తద్వైజ్యాయాంసో నతే కులమ్ మేనిరే, తాన్ అనుబ్యాజహారన్ తాన్‌వః ప్రజా భక్షిస్తేతి ఏతేంధ్రాః పుండ్రాః శబరాః పుళిందా మూతిబా ఇత్యుదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనామ్ భూయిష్టాః"

(ఐతరేయ బ్రాహ్మణమ్ Asiatic Society of Bengal (1906), 7వ సంచిక , 3వ అధ్యాయం, 6 వ ఇండం).

4 “

.... ...... ...... ...... ...... ‌‌‌‌...... ......
..... ....... ....... ....... ....... ........
తథాంగ వంగౌ సహ పుండ్రకేణ
పాండ్యోఢ్ర రాజౌచ సహాంధ్రకేణ”

(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ ప్రథమ సంస్కరణం, సభాపర్వం, 4వ అధ్యాయం, శ్లో. 24).

5

"కారావరో నిషాదాత్తు చర్మకారః ప్రసూయతే
వైదేహికా దంధ్రమేదౌ బహిర్గ్రామ ప్రతిశ్రయౌ"

(మనుస్మృతి, నిర్ణయసాగర్ ప్రెస్, బొంబాయి (1920), 10 వ అధ్యాయం, శ్లో. 36).

6

“సబర్బర కిరాతాంధ్ర దమిలాద్యాసు జాతిషు
నాట్యప్రయోగే కర్తవ్యం పాఠ్యం భాషా సమాశ్రయమ్"

(అప్పారావు, పోణంగి నాట్యశాస్త్రము (ఆనువాదము ! నాట్యమాలా ప్రచురణ 1, హైదరాబాదు (1959), 17 వ అధ్యాయం, పుట 486)

7. వాయుపురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు, పూనా (1905). 45-127.

8

"కిరాత హుణాంధ్ర పుళింద పుల్కసా
ఆభీర కంకా యవనాః కషాదయః
యే౽న్యేచ పాపా యదుపాశ్రయాశ్రయా
శ్శుధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః

శ్రీమద్భాగవతమ్ , వావిళ్ల ప్రతి, మద్రాసు (1941), ద్వితీయ , స్కంధం, 14 వ అధ్యాయం, శ్లో 18).

9. “Next come the Andhras, a still more powerful race which. possess numerous villages and thirty towns defended by walls and towers and which supplies its king with an army of 100000 infantry, 2000 cavalry and 1000 elephants".

(మెగస్తనీసు : 'Macerindle's Magasthenes, Indian Antiguary (1877), v0l. VI, pp. 337-339.)

10. "ఏవమేవ ఇహరాజ విషయేషు యవన కమ్భోజేషు, నాభకే నాభపంక్తిషు, భోజసితి నిక్యేషు ఆన్ధ్ర పులిన్దేషు • సర్వత్ర దేవానాం ప్రియస్య ధర్మానుశిష్ట మనువర్తనే" (Edicts of Asoka. Ed., G. Srinivasa Murthy and A. N. Krishna Aiyanagar, పు 47.)

11

"పియ మహిళా సంగామే సుందర గత్తేయ భోయణేరోద్దే
అటు పుటు ర టుం భణంతే ఆంధ్రే కుమారో నలో యేతి"

ఉద్యోతనుని కువలయమాల. (చూ. వ్యానసంగ్రహం పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, ప్రాకృత గ్రంథకర్తలు, ప్రజాసేవ)

12

“హలాయుధ స్తత్ర జనార్దనశ్చ
వృష్ణ్యంధకా శ్చైవ యథా ప్రధానమ్
ప్రేక్షాం న్మిచక్రు ర్యదుపుంగవాస్తే
స్థితాశ్చ కృష్ణస్య మతే మహాంతః

(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ , ప్రథమ సంస్కరణం, ఆదిపర్వం , 186 వ అధ్యాయం శ్లో. 6).

13

“భోజాః ప్రవ్రజితాన్ శ్రుత్వా వృష్ణయ శ్చాంధ కై స్సహ
పాండవాన్ దు:ఖ సంతప్తాన్ సమాజగ్ముర్మహావనే"

వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ , ప్రథమ సంస్కరణం, ఆరణ్యపర్వం, 12 వ అధ్యాయం, శ్లో. 1,)

14

భాగవత పురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు: పూనా (1905).
1-11-11.


15

మత్సపురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు, పూనా (1905).
179-7-37.


16

"యత్ర సర్వాన్ మహీపాలాన్ శస్త్రతేజో భయార్దితాన్
సవంగాంగాన్ సపౌండ్రో ఢ్రాన్ నచోళ ద్రావిడాంధ్రకాన్"

(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్, ప్రథమ సంస్కరణం, ఆరణ్యపర్వం, (51వ అధ్యాయం, శ్లో. 22)

17

“ఆంధ్రకాశ్చ పుళిందాశ్చ కిరాతా శ్చోగ్రవిక్రమాః
మ్లేచ్చాశ్చ పార్వతీయాశ్చ సాగరానూపవాసినః"

(వ్యాసభారతమ్, గీతాప్రెస్, గోరఖ్‌పూర్, ప్రథమ సంస్కరణం, కర్ణపర్వం, 73వ అధ్యాయం, శ్లో. 20).

18

“దక్షిణాపథ జన్మానః సర్వే నరప రాంధ్రకాః
గుహాః పుళించాః శబరశ్చుచుతా మద్రకైస్సహ"

(వ్యాసభారతమ్, గీతాప్రెస్, గోరఖ్‌పూర్) ప్రథమ సంస్కరణమ్, శాంతిపర్వం, 207వ అధ్యాయం, శ్లో. 42).

19. Burrow, T., Collected papers on Dravidian Lingnistics, Annamalai University, pp. 334-336 (1988)

20. "ఆంధ్రము. From (andhra, san, hunter).

".... In pooranic times a dynasty of Andhra, Kings reigned in Northern India, probably Dravidian or some kindred race. The Andrae are represented by Pliny, after Megasthenes, as a powerful people, and the Aadre Indi have a place in the peutinger tables amongst the few Indian nations of which the author of those tables had heard. They were however placed by error north of the Ganges. Hwen-thsang makes Au-to-lo one of the southern kingdoms, and this has been held to mean Andhra......."

Manual of the Administration of the Madras Presidency. Vol. III, Glossary, Madras (1893).

21

“తథా వంగాన్ కళింగాంశ్చ కౌశికాంశ్చ సమస్తతః
  అన్వీక్ష్య దణ్డకారణ్యం సపర్వత నదీగుహమ్
  నదీం గోదావరీం చైవ సర్వమేవాను పశ్వత
  తథైవాంధ్రాంశ్చ పుణ్డ్రాంశ్చ చోళాన్పాణ్డాంశ్చ కేరళాన్"

వాల్మీకి రామాయణమ్ . వావిళ్ళరామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు (1954), కిష్కంధాకాండము, 41వ అధ్యాయము. శ్లో. 11, 12).

22

“పాండ్యాంశ్చ ద్రవిడాంశ్చైవ సహితాంశ్చోఢ్ర కేరళైః
ఆంద్రాం స్తాలవనాంశ్చైవ కళింగా నుష్ట్రకర్ణికాన్"

(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్, ప్రథమ సంస్కరణం, సభాపర్వం, 31వ అధ్యాయం. శ్లో 71).

23

“అంగవంగ కళింగాంధ్ర సింహ పుండ్రాం ధ సంజ్ఞితాః
  జజ్ఞిరే దీర్ఘ తపసో బలే! క్షేత్రే మహీక్షితః
  చక్రు స్ప్వనామ్నా విషయాన్ షడిమాన్ ప్రాచ్యగాంశ్చతే"

భాగవతపురాణమ్ , వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు: 9వ స్కంధం, 23 ఆధ్యాయం, శ్లో, 5, 6)

24. E. I. Vol. VI. p. 88.

25. Indian Antiquary, Vol, XV, p. 176. 26. శకారాభీర చండాల శబర ద్రమిలాంధ్రజాః హీనా వనేచరాణాంచ విభాషా నాటకే స్మృతాః” (అప్పారావు, పోణంగి, నాట్యాశాస్త్రము (అనువాదము) నాట్యమాలా ప్రచురణ 1, హైదరాబాదు (1959), 17 వ అధ్యాయం, వుట 487)

27. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక, రాజమండ్రి, పు. 114-115.
28. నన్నయ, శ్రీమదాంధ్ర మహాభారతము, వావిళ్ల ప్రతి, ఆదిపర్వము, పద్యసంఖ్య 1-26.
29. పై. ఆది పర్వము, 1-16.
30. నన్నెచోడుడు, కుమారనంభవము, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురణ, పద్యసంఖ్య 1-23.
31. పై. 1-35.
32. పాల్కురికి సోమన, బసవపురాణము, ఆంధ్ర గ్రంధమాల, మద్రాసు, ద్వితీయ ముద్రణం (1952), పుట 4.
33. తిక్కన, నిర్వచనోత్తర రామాయణము, వావిళ్ల ప్రతి, మద్రాసు, 1-7.
34. ఫై. 1-8.
35. తిక్కన, శ్రీమదాంధ్ర మహాభారతము, వావిళ్ల ప్రతి, మద్రాసు, విరాటపర్వము, 1-7. 36. పై. 1-18.
37. వాయుపురాణమ్ - ఆనందాశ్రమసంస్కృత ప్రచురణలు, పూనా (1905) 45-111. 38. విద్యానాథుడు, ప్రతాపరుద్రీయము, నాటక ప్రకరణము, శ్లో. 44. 39. విన్నకోట పెద్దన, కావ్యాలంకార చూడామణి వేదం వేంకటరాయశాస్త్రి & బ్రదర్స్, మద్రాసు 1 (1968), పు. 192.

40.

"శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం
              ప్రాకారంతు మహత్‌ కృత్వా త్రీణి ద్వారాణి చాకరోత్
              ... ... .... .... ...
              ఆవసత్త త్ర బుషిభిః యతో గోదావరీతటే
              తత్కాల ప్రభృతి క్షేత్రం త్రిలింగ మితి విశ్రుతం”
             (బ్రహ్మాండ పురాణమ్)

14.                                                తెలుగు భాషా చరిత్ర
                                                                 
         కర్ణాటాశ్చైవ త్రైలింగ మూర్ఖరా రాష్ట్ర వాసినః
         ద్రావిడాః  ద్రావిడాః పంచ వింధ్య దక్షణ వాసనః
    (స్కాంద పురాణమ్)
                                                                        
 41. రాజశేఖరుడు, విద్ధసాల భంజిక, నాల్గవ అంకం. 
 42.  1.93. There was in PDr. an alternation between -n-and-1-, So wherever we have an alternation -n-/-1- in Telugu, we can normally trace it to PDF. alteration *-n-/*1- which was also widely represented in the other South Drauidian languages"
          1.95. "The alternation of -1-/-n- operates dialectatly to a great extent in Modern Telugu, but in the early speech it was very much restricted. However there is evidence to show that there was -n-/-1- alternation in PDr. which is seen in many cases in Ta. The following Te. form witb -n- has an alternant in -1- in the transitive, reflecting a similar alternation in the parent speech, capa "to go'. to elapse, tr. calupu 'ti pass (timey)' Krishnamurti, Bh. TVB, p. 41.