తెలుగువారి జానపద కళారూపాలు/సుద్దులు చెప్పే గొల్లసుద్దులు

వికీసోర్స్ నుండి

సుద్దులు చెప్పే గొల్లసుద్దులు

గొల్లసుద్దులను చెప్పే వారు గొల్లలను మాత్రమే యాచిస్తారు. యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణ లీలలు కాటమ రాజు కథ మొదలైన వాటిని

సుద్దులవారు ప్రచారం చేస్తూ వుంటారు. ఈ ప్రచారకులు ఆంధ్రదేశమంతటా వున్నారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు హంస వింశతిలో గొల్లసుద్దులను ఈ విధంగా వర్ణించాడు.

పద్యం:

కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు వ్రాతల కృష్ణ లీలలం
గ్రమ్ము గుడార్లు వీరుడగు కాటమరాజు కథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖ పట్టిడి కట్టురుమాలలున్నెటా
సొమ్ములు నావముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చిరెంతయున్.

గుడ్దలమీద బొమ్మల కథలు:

గొల్లసుద్దుల వారి కథా వివరాన్నీ, పెద్ద పెద్ద వస్త్రాలపై చిత్రించి బొమ్మల సహాయంతో కథలు చెపుతారు. వీరి మాదిరే తెలంగాణాలో పాండవులనే తెగ వారు భారత కథల్ని చీరలపై చిత్రించి పెద్ద పెద్ద బొమ్మల సహాయంతో ప్రజానీకానికి పాడి వినిపిస్తారని డా॥ బి.రామరాజుగారు వారి జానపద గేయ సాహిత్యంలో తెలియజేసారు.

పై పద్యంలో వివరించిన మాదిరి కొమ్ముల్నీ వీరణాలనూ వాయిస్తారు. వీరణం పెద్ద డోలు వంటిది. కొందరు శంఖాలను కూడా పూరిస్తారు. గొల్లలలో అనేక తెగల వారు వున్నప్పటికీ ఆధిక సంఖ్యలో వున్నవారు ఎఱ్ఱ గొల్లలే. వీరి ప్రధానమైన వృత్తి ఆవుల మందలనూ, గొఱ్ఱెల మందలనూ పెంచుతారు. యాదవులకు ప్రధాన దేవతయైన గంగమ్మకు జాతర్లు మొదలైన వుత్సవాలు చేస్తూ వుంటారు. అలాంటి వుత్సవాలు దొనకొండ, అలవలపాడు, మొదలైన చోట్ల జరుగుతున్నాయి. దర్ట్సన్ పండితుడు ఈ గంగ పూజల్నీ వీరుల పూజలుగా పేర్కొన్నాడు.

గొల్లలు సాధారణంగా అందరు వైష్ణవులే. అయినా వీరిలో కొందరు శైవులు కూడా వున్నారు. సంఘంలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్యజాతుల తరువాత గొల్లలే అధికులని చెపుతారు. రెడ్లు, వెలమవారు, గొల్లల సరసన కూర్చుని తినడానికి వెనుకాడరు. యాదవులకు అంతటి స్థానముందని గుర్తించారు.

గొల్లలలో కొన్ని తెగలున్నాయి. వారిలో ఎఱ్ఱ గొల్లలు అందరికంటే శ్రేష్టులు. గొల్లసుద్దులు చెప్పేవారు ఎఱ్ఱ గొల్లలే. గొల్లల వృత్తి మేకలను పెంచటం, గొల్లసుద్దులను భిక్షాటనగా ఉపయోగిస్తారు కూడా. వీరు కూడా గొల్లసుద్దుల్లో హరి హరి నారాయణా ఆఁ. అంటూ పల్లవిని కొంత మంది వాడుకోవటం కూడా కద్దు.

ఉదాహరణకు:

గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెరుక
గొఱ్ఱెల గోత్రాలు గొల్లల కెరుక
వీరి వారి గోత్రాలు తోడేళ్ళ కెరుకో హరి, హరి.

అంటూ సంఘంలో వున్న చెడును తొలగించటానికి ఈ పద్ధతిలో కొందరు, విడిగా సుద్దులు చెపుతారు. ఈ సుద్ధులకు ప్రత్యేకమైన ఛందస్సు వుండదనీ, దానికి కూనపదమనీ, జానపద ఛందస్సుతో పదం చాల ప్రసిద్ధమైనదనీ తాళ్ళపాక అన్నమయ్య క్షేత్రయ్య సేనయ మంత్రి మొదలైన వారు ఈ పదరచనలో ప్రసిద్ధులనీ, ఈ పదాలలో కూడ అనేక రకాలున్నాయనీ, అందులో ఒకటి కూన పదమనీ, కూనపదమంటే చిన్న పదమనీ శ్రీ రాంబట్ల కృష్ణమూర్తి గారు నాట్యకళ, జానపద సంచికలో వివరించారు.

గొల్ల సుద్దులన్న ఎక్కువగా కూన పదాలు గానే వుంటాయి. ఈ పదాన్ని ప్రధాన గాయకుడు ఆలపిస్తే ప్రక్కనున్న ఇద్దరు వంతలూ, ఆ పదాన్ని ఆఁ అంటూ సాగ తీసి చెవికి చేయి కప్పి పాడ్తారు. ఈ పదాల్ని గొల్లలు గొఱ్ఱెలను కాస్తూ వాటిని రాత్రిళ్ళు తోడేళ్ళు బారి నుండి కాపాడటానికి రాత్రి తెల్లవార్లూ పాడుతూనే వుంటారు.

హరి హరీ నారయుడ
ఆది నారాయుడ
కరుణించి మమ్మేలు
కమల లోచనుడ.

అంటూ ప్రారంభించి కృష్ణ గాథలు చెపుతారు. యాదవుడి గోవులను, మాధవుడు గాయంగ మాధవుడు మచ్ఛావతారమైనాడు. అని దశావతార సంకీర్తన పాడుతారు.

గొల్లసుద్దుల ప్రారంభంలో కథకులు రంగ స్థలం మీదికి సరాసరి రారు. ప్రేక్షకుల మధ్య నుంచే ఆమూల నుంచి ఒకరు, ఈ మూల నుంచి ఒకారు టుర్ కీ అంటూ గొఱ్ఱెలను అదిలించినట్లూ, తప్పిపోయిన గొఱ్ఱెల కోసం వెతికినట్లు, తోడేళ్ళను కేకలతో అదరగొట్టినట్లు హడావిడి చేసి రంగం మీద కొస్తారు.

వచ్చిన తరువాత వారూ వీరూ వచ్చారా అని పరామర్శ చేసి హాస్యపు ఛలోక్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుని నృత్యంతో కథను ప్రారంబిస్తారు. వంతశ్రుతినే కథకుడు శ్రుతిగా ఆధారం చేసు కుంటాడు. ఒకప్పుడు

వీణలను ఉపయోగించే వారట వాయిద్యంగా. ఆ వీణ ఎటువంటిదో మనకు ఆధారం లేదు. ఆ తరువాత చేకోలను ఉపయోగించేవారు. వీరి కథల్లో పెద్ద డోలు కూడ వుంటుంది. ఇక వేష ధారణలో కథకునికి పెద్ద తలపాగా, వెండి బిళ్ళల మొలత్రాడు, చెవులకు దిద్దులు, చేతులకు తెల్లని మురుగులు, భుజంమీద గొంగడి చేతిలొ పెద్ద కఱ్ఱ వుంటుంది. సుద్ధులు మనకు తేలికగా అగుపించినా అందులోనే మనకు వేమనగారు పద్యాల్లో వున్నంత అర్థ స్ఫూర్తీ, తర్కమూ సిద్ధాంత సమన్వయంతో ద్వంద్వాత్మకంగా వుంటాయి.

గొల్ల కలాపం:

సుద్దులకూ గొల్ల కలాపానికి సంబంధం లేక పోయినా, గొల్ల కలాప ప్రాముఖ్యంతో యాదవుల గొప్ప తనాన్ని తర్కంతో నిరూపిస్తారు. అయితే కూచిపూడి వారూ, మారంపల్లి దేవదాసీలూ ప్రదర్శించే గొల్లకలాప ఇతి వృతానికీ దీనికీ సంబంధం లేదు. గొల్ల కలాపం కులవ్వవస్థమీద తిరుగుబాటు, అ తిరుగుబాటుకు పురాణాలనే ఆయుధంగా త్రిప్పుతారు.

కలాపాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు. యాదవుని గోవులు కాచిన మాధవుడు యాదవుడే కదా? ఆ మాధవుడు పాలకడిలో యోగ నిద్రలో వున్నప్పుడు అతని నాభి కమలంలో పుట్టిన బ్ర్ఫహ్మ ఎవడు? యాదవుడే కదా? ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టి బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు పుట్టిన క్షత్రియులు వగైరా ఎవరు? యాదవులే కదా? అందుకని ఈ మనుషులందరిదీ ఒకటే కులం, ఒకటే కులం, యాదవ కులంలో అందరూ ఎఱ్ఱ గొల్లలే అని పురాణ తర్కంలో సిద్ధాంతీకరిస్తారు.

యాదవుల కళా రూపాలు:

తెలంగాణా యాదవుల్లో కథలు చెప్పేవారు రెండు మూడు రకాలుగా వున్నారు. పురుషుడు ఆడ వేషం వేసుకుని కాళ్ళకు గజ్జెలు కట్టి ఒగ్గు చేత బట్టి, పెద్ద డోలుతో పెద్ద తాళాలతో, వంతల సహాయంతో నృత్యం చేస్తూ కథను ముగిస్తాడు. వీరు ముఖ్యంగా "బల్ గురి కొండయ్య" కథ చెపుతారు. మరి కొంత మంది వృద్ధులైన కథకులు ఎల్లమ్మ కథను చెపుతూ జీవిస్తారు.

ఇల యాదవుల్లో కుర్మోళ్ళు అనే మరో తెగవారు వీరన్న కథ చెపుతారు.

వీరుగాక గొల్ల భాగోతులు అనేవారు వేరేవారున్నారుల్. వీ డాంజ్ఞియా, చంద్ర కాంత, మాంధాత, చిరుతొండ, విప్రనారాయణ లాంటి వీథి నాటకాలు ఆడతారు.

మరో తెగ 'మంది హెచ్చు వాళ్ళు ' వీరు చెక్క బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్ని అవసరాన్ని బట్టి చూపిస్తూ, కదలిస్తూ, రాగాలు తీస్తూ కథలు చెపుతారు. వారు చెప్పే కథలు పెద్దిరాజు కథ, కాటమరాజు కథ, గొల్లకరివెళ్ళరాజు యుద్ధం చెపుతారని లక్ష్మీకాంత మోహన్ గారు వ్రాస్తున్నారు.

సుద్దుల కథలు:

సంప్రదాయ బద్ధంగా గొల్లలు చెప్పే సుద్దులు కథల్నీ రాజకీయ ఉద్యమంలో ప్రచార సాధనంగా వుపయోగించారు. అలా ఉపయోగించిన వారిలో ప్రథములు ఆంధ్ర ప్రజా నాట్యమండలి వారు. తెలంగాణా విప్లవాన్ని గురించి, బుర్రకథను రచించిన తిరునగరి రామాంజనేయులు గారు 1952 లో 'రాష్ట్ర వాంఛ' అనే సుద్ధుల కథను, ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని కోరుతూ వ్రాయబడిన కథ ఇది. కాటమ రాజు కథల బాణీలో గొల్ల సుద్దులను చక్కగా వర్ణిస్తూ వ్రాయబడింది.

ఈ కథకు మంచి ప్రచారం వచ్చింది. నవయుగ పబ్లిషింగ్ హౌసు వారు దీనిని 1953 లో అచ్చు వేశారు.

అలాగే రామాంజనేయులు గారు "మన్యం విప్లవం" అనే పేరుతో అల్లూరి సీతారామ రాజు కథను కూడ సుద్దుల కథగా రచించారు. ఇది అముద్రితంగా వుండి పోయినా బహుళ ప్రచారం పొందింది.

అలాగే వారణాసి సత్యనారాయణశాస్త్రి గారు 1954 లో సతీ ముసలమ్మ కథను గొల్ల సుద్దుల బాణీలో వ్రాశారు. ఇది కూడ అముద్రితంగానే వుండి పోయింది.

ఆసాదుల ఆరాధనా చిందులు

ఆంధ్ర అరాయల సీమ, తెలంగాణా జిల్లాలలో మాల మాదిగ కులాల వారు విస్తారంగా వున్నారు. మాల కులంలో మాల దాసరులున్నట్లు, మాదిగ కులంలో ఆసాదులనే వారు ఒక తెగకు చెందిన వారు. అయితే రాష్ట్ర వ్వాపితంగా మాల దాసరులు లేనట్లే ఈ ఆసాదులు కూడా రాష్ట్ర వ్యాపితంగా లేరు. ఒక వేళ వున్నా వారి ప్రాముఖ్యం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగరికత చెందిన సర్కారు ప్రాంతాల్లో ఈ తెగ అంతగా కనిపించడం లేదు. వెనుక బడిన తెలంగాణా, రాయల సీమ ప్రాంతాల్లో మాత్రం ఆసాదులూ, వారి ఆచార వ్వహహారాలూ, కళా ప్రదర్శనలూ జరుగుతూనే వున్నాయి.

ఆసాదులూ, అమ్మవారి జాతర్లు:

ముఖ్యంగా రాయల సీమలో "ఆసాదులనే వారు మాదిక కులంలో ఒక తెగగా ప్రాచుర్యం పొందారు. ఆసాదులంటే మాల మాదిగ కులాలలో పూజారి వర్గానిని చెందిన వారని" ఆరుద్ర గారు అంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఒకనాడు విరివిగా జరిగే అమ్మవారి జాతర్ల సందర్భంలో దున్నపోతుల్నీ, మేక పోతుల్నీ, బలి ఇచ్చే ముందు అమ్మవారిని స్త్రోత్రం చేస్తూ మాల ఆసాదులు పాటలు పాడుతూ వుండగా, మాదిగ ఆసాదులు చేడిక వాయిస్తూ వుంటే, మాతంగ కన్యలలో ముఖ్యులైన వారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించ లేదంటూ అడ్డమైన తిట్లు తిడతారు. మరికొన్నికోరికలు కోరుతారు. కోపంతో భక్తుల్నికొడతారు. భక్తులు పూనకంలో వున్న అమ్మ వారిని శాంతింప చేస్తారు. పూనకం దిగిన తరువాత అమ్మ వారి మీద పాటలు పాడుతూ ఆవేశంతో చిందు నృత్యం చేస్తారు. మాదిగ ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు. సమాజంలో వీరిని హీన జాతిగా పరిగణించినా, అగ్ర కులాల్లోలేని విలక్షణమైన ఆచారాలు వీరి కున్నాయంటారు. అవి చిందుల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ తెలుస్తుంది వీరి చరిత్రం. దీనిని ఆది ఆంధ్ర కర్ణాటక సంస్కృతిగా గుర్తించ వచ్చు. దక్షిణ దేశంలో శాక్తేయ మతం అనవచ్చు.

గ్రామ దేవత, పెద్ద స్వామి:

గ్రామాలలో వర్షాలు కురవనప్పుడూ, కలరా, మశూచి మొదలైన అమ్మవారు సోకినప్పుడూ, పల్లెలలో ఆసాదుల చిందులు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరమూ ఉగాది మరుసటి రోజున గ్రామ దేవత పెద్ద స్వామికి మేలుకొలుపు పాటలతో చిందు నృత్యాలు ఆవేశంగా గేయాలు పాడతారు.

పౌర్ణమి రోజున పెద్ద స్వామిని, కాపుల ఇళ్ళ దగ్గరకు తీసుకు వచ్చి బలి ఇవ్వబోయే పోతునూ, బోన కుండను, గంట దుత్తను ఆసాదుల చిందులతో గుడి దగ్గరకు వచ్చి తమ జవనికల్ని ఉధృతంగా వాయిస్తూ, కాపుల పూర్వీకు లందరినీ పేరుపేరునా స్తుతిస్తారు. గుడి దగ్గరకు వచ్చిన కుమ్మరి పూజారి కాపుల వస్తువుల నన్నిటినీ అక్కడ పెట్టి గ్రామ ప్రజల ముందు చిందులు వేస్తాడు.


ఆసాదుల బృంద నృత్యం:

సామాన్యంగా ఆసాదుల బృందంలో ముగ్గురుంటారు. అందరి వద్దా వాయిద్యాలు వుంటాయి. ప్రధాన నాయకుడు పాడితే మిగతా ఇద్దరూ చిందులు వేస్తూ వంత పాడతారు. పాట పాడుతూ వలయాకారంగా తిరుగుతూ వెనుకకూ ముందుకూ అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను త్రొక్కుతారు. ఒక ప్రక్క వాయిద్య మ్రోగుతూనే వుంటుంది. నాయకుడు చేతిని వూపుతూ చూపుడు వ్రేలును చెవిలో పెట్టుకుంటూ లయాన్వితంగా రాగం తీస్తారు. పాదలు పైకెత్తి ముని కాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు పోయి నమస్కారం చేస్తాడు.

కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు నేత్రానందంగా నృత్యం చేస్తారు. వారి ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చిన వారి చేత వేపాకులు తినిపించటం, కల్లు ముంత లోని కల్లును వేప ముంతతో అందరి మీదా చిలకరించటం గ్రామాన్ని రక్షించమని గాయకుడు దేవతల్ని ప్రార్థిస్తూ వచ్చి చిందులు వేస్తూ గేయాలనూ, కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానం చేసే కథా గేయాలు, పెద్దమ్మ కథ _చల్లారమ్మ కథ _ యల్లమ్మ కథ వీరు చక్కగా అలంకరించుకుని గ్రామ ప్రజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేస్తారు. గ్రామ ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట చెపుతారు.

కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్పగలరు. కథ చెప్పే ప్రతి రోజూ, పెద్దమ్మ స్వామికి పూజలు చేస్తూ, ఆ మహాదేవిని కొలుస్తూ గ్రామస్థుల చేత కొలిపిస్తూ గ్రామాన్ని కాపాడమని ఆసాదుల మధ్య వర్తులుగా గ్రామ ప్రజల ఆర్తనాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా వుంటున్నారు.

వేషధారణ:

ఆసాది కథకుకు మోకాలి దాకా పంచ కట్టి, కథ చెప్పే వ్వక్తి కథకుడు మాత్రం నల్ల కోటు ధరించి, ఎర్ర పాగా చుట్టి వెనుక కుచ్చు వదిలి, నడుము కట్టుతో నుదుట బంగారు బొట్టు పెట్టి చేతిలో వేప మండల్ని పట్టుకొని ఝుళిపిస్తూ కథలు చెపుతారు. కథా ప్రారంభంలో పెద్ద స్వామికి నైవేద్యం పెట్టె సందర్భంలో వారు కల్లు త్రాగుతారు.

ఒక వేళ గ్రామస్థులు కథలు చెప్పించక పోతే ఉగాది మరుసటి రోజున తప్ప కుండా చిందులు వేస్తారు. అందుకే వారిని ఆయగా ళ్ళంటారు. దేవత సమక్షంలో జంతువుల బలి సమయంలో, ఈ విధంగా పాడుతారు.
పెద్దమ్మ తల్లికి :

పూజ చేతామురో యమ్మ - పెద్దమ్మ తల్లికి
పూజ చేత్తామురో - పున్ని మంతులు మీరు
మల్లి పూవులు దెచ్చి - మనసార వెల్లుదాము
బాగుగా బలిపిల్లలు గొట్టి - కర్మ పోతులను
కడగా కొట్టి ఆసాది వాండను - ఆటలాడమని
సన్నమేళముల సందడి చేయమని
సకియలారో, పెద్దమ తల్లికి జూజ చేద్దాము
రోయక్క; కొండ చక్కెర, కర్జూరములు, మంచి తేనియో
మా పెద్దమ్మ స్వామికి పలము రుసుములు పూజ సేత్తము.

అంటూ సుబ్బారావు పేటకు చెందిన మాదిగ నాగన్న పాడిన పాట. ఇది అనంతపురం జిల్లాలో ధర్మవరం తాలూకాలో వున్న ఆసాదుల కళారూప మిది.

ఆదిమ వాసులకు అద్దం పట్టే గిరిజన కళారూపాలు


తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్రదేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే.

గిరిజనుల కళా రూపాలు:

ఆంధ్రదేశంలో అటు రాయల సీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని ప్రదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది గిరిజన జాతులున్నాయనీ, వీరి జనాభా పదమూడు లక్షలనీ, డి.ఆర్. ప్రతాప్ గారి వ్వాసానికి ఆధారంగా నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

అదిలాబాదు జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, ప్రధానులు, ఆంధ్రులు ముఖ్య జాతులు.

నాయిక పోడులు ప్రధానంగా కరీం నగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం , ఉభయ గోదావరి జిల్లాల ఏజన్సీ ప్రాంతాలలో కోయలు, కొండ రెడ్లు ఎక్కువ.

విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల గొండ ప్రాంతాలలో బగతలు, కొండ దొరలు, వాల్మీకులు, మూల దొరలు, సామంతులు, గదబలు, మమ్మరలు, కోటియాలు ఎక్కువ కనిపిస్తారు.