తెలుగువారి జానపద కళారూపాలు/ఆసాదుల ఆరాధనా చిందులు

వికీసోర్స్ నుండి

ఆసాదుల ఆరాధనా చిందులు

ఆంధ్ర అరాయల సీమ, తెలంగాణా జిల్లాలలో మాల మాదిగ కులాల వారు విస్తారంగా వున్నారు. మాల కులంలో మాల దాసరులున్నట్లు, మాదిగ కులంలో ఆసాదులనే వారు ఒక తెగకు చెందిన వారు. అయితే రాష్ట్ర వ్వాపితంగా మాల దాసరులు లేనట్లే ఈ ఆసాదులు కూడా రాష్ట్ర వ్యాపితంగా లేరు. ఒక వేళ వున్నా వారి ప్రాముఖ్యం అంతగా కనిపించడం లేదు. ముఖ్యంగా నాగరికత చెందిన సర్కారు ప్రాంతాల్లో ఈ తెగ అంతగా కనిపించడం లేదు. వెనుక బడిన తెలంగాణా, రాయల సీమ ప్రాంతాల్లో మాత్రం ఆసాదులూ, వారి ఆచార వ్వహహారాలూ, కళా ప్రదర్శనలూ జరుగుతూనే వున్నాయి.

ఆసాదులూ, అమ్మవారి జాతర్లు:

ముఖ్యంగా రాయల సీమలో "ఆసాదులనే వారు మాదిక కులంలో ఒక తెగగా ప్రాచుర్యం పొందారు. ఆసాదులంటే మాల మాదిగ కులాలలో పూజారి వర్గానిని చెందిన వారని" ఆరుద్ర గారు అంటున్నారు. ముఖ్యంగా గ్రామాలలో ఒకనాడు విరివిగా జరిగే అమ్మవారి జాతర్ల సందర్భంలో దున్నపోతుల్నీ, మేక పోతుల్నీ, బలి ఇచ్చే ముందు అమ్మవారిని స్త్రోత్రం చేస్తూ మాల ఆసాదులు పాటలు పాడుతూ వుండగా, మాదిగ ఆసాదులు చేడిక వాయిస్తూ వుంటే, మాతంగ కన్యలలో ముఖ్యులైన వారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలో అమ్మవారి కోరికలు చెల్లించ లేదంటూ అడ్డమైన తిట్లు తిడతారు. మరికొన్నికోరికలు కోరుతారు. కోపంతో భక్తుల్నికొడతారు. భక్తులు పూనకంలో వున్న అమ్మ వారిని శాంతింప చేస్తారు. పూనకం దిగిన తరువాత అమ్మ వారి మీద పాటలు పాడుతూ ఆవేశంతో చిందు నృత్యం చేస్తారు. మాదిగ ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తారు. సమాజంలో వీరిని హీన జాతిగా పరిగణించినా, అగ్ర కులాల్లోలేని విలక్షణమైన ఆచారాలు వీరి కున్నాయంటారు. అవి చిందుల్లోనూ, మాటల్లోనూ, పాటల్లోనూ తెలుస్తుంది వీరి చరిత్రం. దీనిని ఆది ఆంధ్ర కర్ణాటక సంస్కృతిగా గుర్తించ వచ్చు. దక్షిణ దేశంలో శాక్తేయ మతం అనవచ్చు.

గ్రామ దేవత, పెద్ద స్వామి:

గ్రామాలలో వర్షాలు కురవనప్పుడూ, కలరా, మశూచి మొదలైన అమ్మవారు సోకినప్పుడూ, పల్లెలలో ఆసాదుల చిందులు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరమూ ఉగాది మరుసటి రోజున గ్రామ దేవత పెద్ద స్వామికి మేలుకొలుపు పాటలతో చిందు నృత్యాలు ఆవేశంగా గేయాలు పాడతారు.

పౌర్ణమి రోజున పెద్ద స్వామిని, కాపుల ఇళ్ళ దగ్గరకు తీసుకు వచ్చి బలి ఇవ్వబోయే పోతునూ, బోన కుండను, గంట దుత్తను ఆసాదుల చిందులతో గుడి దగ్గరకు వచ్చి తమ జవనికల్ని ఉధృతంగా వాయిస్తూ, కాపుల పూర్వీకు లందరినీ పేరుపేరునా స్తుతిస్తారు. గుడి దగ్గరకు వచ్చిన కుమ్మరి పూజారి కాపుల వస్తువుల నన్నిటినీ అక్కడ పెట్టి గ్రామ ప్రజల ముందు చిందులు వేస్తాడు.


ఆసాదుల బృంద నృత్యం:

సామాన్యంగా ఆసాదుల బృందంలో ముగ్గురుంటారు. అందరి వద్దా వాయిద్యాలు వుంటాయి. ప్రధాన నాయకుడు పాడితే మిగతా ఇద్దరూ చిందులు వేస్తూ వంత పాడతారు. పాట పాడుతూ వలయాకారంగా తిరుగుతూ వెనుకకూ ముందుకూ అడుగులు వేస్తూ వంగుతూ లేస్తూ చేతులను ఆడిస్తూ గజ్జెల కాళ్ళతో చిందులను త్రొక్కుతారు. ఒక ప్రక్క వాయిద్య మ్రోగుతూనే వుంటుంది. నాయకుడు చేతిని వూపుతూ చూపుడు వ్రేలును చెవిలో పెట్టుకుంటూ లయాన్వితంగా రాగం తీస్తారు. పాదలు పైకెత్తి ముని కాళ్ళమీద అరచేతితో కొడుతూ పెద్దమ్మ స్వామి దగ్గరకు పోయి నమస్కారం చేస్తాడు.

కథకుణ్ణి అనుసరిస్తూ వంతలు నేత్రానందంగా నృత్యం చేస్తారు. వారి ముగ్గురి నాట్యమూ త్రిమూర్తుల నృత్యంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో కొందరికి పూనకం వస్తుంది. పూనకం వచ్చిన వారి చేత వేపాకులు తినిపించటం, కల్లు ముంత లోని కల్లును వేప ముంతతో అందరి మీదా చిలకరించటం గ్రామాన్ని రక్షించమని గాయకుడు దేవతల్ని ప్రార్థిస్తూ వచ్చి చిందులు వేస్తూ గేయాలనూ, కథా గేయాలనూ పాడుతారు. ముఖ్యంగా వారు గానం చేసే కథా గేయాలు, పెద్దమ్మ కథ _చల్లారమ్మ కథ _ యల్లమ్మ కథ వీరు చక్కగా అలంకరించుకుని గ్రామ ప్రజల ముందు, ఆరు బయలులో ఆహ్లాదంగా నృత్యం చేస్తారు. గ్రామ ప్రజలు ఎంతగానో ఆనందిస్తారు. సంతోషంగా వారికి కానుకలు ముట్ట చెపుతారు.

కథను మూడు రోజులు మొదలు తొమ్మిది రోజుల వరకూ పొడిగించి చెప్పగలరు. కథ చెప్పే ప్రతి రోజూ, పెద్దమ్మ స్వామికి పూజలు చేస్తూ, ఆ మహాదేవిని కొలుస్తూ గ్రామస్థుల చేత కొలిపిస్తూ గ్రామాన్ని కాపాడమని ఆసాదుల మధ్య వర్తులుగా గ్రామ ప్రజల ఆర్తనాదాన్ని దేవతకు అందచేసే మాతలుగా వుంటున్నారు.

వేషధారణ:

ఆసాది కథకుకు మోకాలి దాకా పంచ కట్టి, కథ చెప్పే వ్వక్తి కథకుడు మాత్రం నల్ల కోటు ధరించి, ఎర్ర పాగా చుట్టి వెనుక కుచ్చు వదిలి, నడుము కట్టుతో నుదుట బంగారు బొట్టు పెట్టి చేతిలో వేప మండల్ని పట్టుకొని ఝుళిపిస్తూ కథలు చెపుతారు. కథా ప్రారంభంలో పెద్ద స్వామికి నైవేద్యం పెట్టె సందర్భంలో వారు కల్లు త్రాగుతారు.

ఒక వేళ గ్రామస్థులు కథలు చెప్పించక పోతే ఉగాది మరుసటి రోజున తప్ప కుండా చిందులు వేస్తారు. అందుకే వారిని ఆయగా ళ్ళంటారు. దేవత సమక్షంలో జంతువుల బలి సమయంలో, ఈ విధంగా పాడుతారు.
పెద్దమ్మ తల్లికి :

పూజ చేతామురో యమ్మ - పెద్దమ్మ తల్లికి
పూజ చేత్తామురో - పున్ని మంతులు మీరు
మల్లి పూవులు దెచ్చి - మనసార వెల్లుదాము
బాగుగా బలిపిల్లలు గొట్టి - కర్మ పోతులను
కడగా కొట్టి ఆసాది వాండను - ఆటలాడమని
సన్నమేళముల సందడి చేయమని
సకియలారో, పెద్దమ తల్లికి జూజ చేద్దాము
రోయక్క; కొండ చక్కెర, కర్జూరములు, మంచి తేనియో
మా పెద్దమ్మ స్వామికి పలము రుసుములు పూజ సేత్తము.

అంటూ సుబ్బారావు పేటకు చెందిన మాదిగ నాగన్న పాడిన పాట. ఇది అనంతపురం జిల్లాలో ధర్మవరం తాలూకాలో వున్న ఆసాదుల కళారూప మిది.

ఆదిమ వాసులకు అద్దం పట్టే గిరిజన కళారూపాలు


తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్రదేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే.

గిరిజనుల కళా రూపాలు:

ఆంధ్రదేశంలో అటు రాయల సీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని ప్రదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది గిరిజన జాతులున్నాయనీ, వీరి జనాభా పదమూడు లక్షలనీ, డి.ఆర్. ప్రతాప్ గారి వ్వాసానికి ఆధారంగా నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

అదిలాబాదు జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, ప్రధానులు, ఆంధ్రులు ముఖ్య జాతులు.

నాయిక పోడులు ప్రధానంగా కరీం నగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం , ఉభయ గోదావరి జిల్లాల ఏజన్సీ ప్రాంతాలలో కోయలు, కొండ రెడ్లు ఎక్కువ.

విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల గొండ ప్రాంతాలలో బగతలు, కొండ దొరలు, వాల్మీకులు, మూల దొరలు, సామంతులు, గదబలు, మమ్మరలు, కోటియాలు ఎక్కువ కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు, సవరలూ మాత్రమే కొండ ప్రాంతాల్లో వున్నారు. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులలో నూ, మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ పీఠభూమి ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు.

రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారులు, వీరినే సుగాలీలనీ, లంబాడీలనీ, లబానీలు అని కూడ పిసుస్తారు.

ఇక ఎరుకలు, ఏనాదులు మైదాన ప్రదేశాలలోనే నివాసాలు ఎర్పరుచుకున్న వారున్నారు.

గిరిజనులకు సంవత్సరం పొడుగునా వ్వవసాయమే జీవనాధారం. గోండులు, కోయలు, బగతలు, వాల్మీకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం చేసుకుంటారు.

కొండ రెడ్లూ, కొండ దొరలూ, సామంతులూ సవరలూ నిలకడగా ఒక చోట కాక తమకు తోచిన ప్రదేశాలలో పోయి వ్వవసాయం చేసుకుంటారు.

ఇక కోయలు, బగతలు, వాల్మీకులు, కొలాములు, నాయక పోడులు, కోటియాలు, మూఖదొరలు మొదలైన గిరిజన జాతులు కూడ పోడు వ్వవసాయం ద్వారా, అదనపు ఆదాయాల కోసం ప్రయత్నిస్తారని డి.ఆర్. ప్రతాప్ గారు వ్రాశారు. అలా గిరిజనులు జీవిత విధానలను సాగించుకుంటూ ఆనందం కోసం, సంగీతాన్ని నృత్యాన్ని వాయిద్యాన్నీ జోడించి ఎన్నో కళా రూపాలను సృష్తించుకున్నారు.

గోండుల గుసాడి నృత్యం:

అదిలాబాదు జిల్లా రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోద్చి చేసిన కష్టం, ధాన్యం లక్ష్మిగా నట్టింట చేరి వుంటుండి. గోడు లందరూ ఆట పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభ మౌతాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు. కొమ్ములూదుతూ, తప్పెట్లు వాయిస్తూ యాత్రలు సాగిస్తారు. గోండుల పురాణ గాథలలోని "దండారియారౌడ్, సిసిసెర్మారౌడ్" అనే కథా నాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు.

గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుసాడి నృత్యం ఒక భాగం. గుసాడి నృత్యంలో ఎందరో పాల్గొన వచ్చు. దీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం జరుగుతుంది, పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభ మౌతుంది. చతుర్దశి వరకూ జరుగుతుంది.

గుసాడి నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పించంతో తయారు చేసిన తలపాగా. ఇదులో గొర్రెపోతు కొమ్ములను కూడ అమర్చుతారు. కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు. మేక తోలు కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు, డప్పు, తుడుము, పిప్రే, బాకా, కలికొయ్ (తప్పెట) మొదలైనవి వాద్య బృందానికి హుషారు నిస్తాయి. సంగీత వాయిద్యాలను, గుసాడి నృత్య పరీకరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు.

దండారి కోలాట నృత్యం:

మరింత లయబద్దమూ, క్రమబద్ధమూ అయిన దండారి నృత్యం గుసాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుసాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుసాడి అంటే అల్లరి అని అర్థం. దండారి నృత్యం గుమేలా అనేది బుర్రకథ డిక్కి శబ్దాలకు అనుగుణంగా లయబద్ధమై ఉంటుంది.

వలయాకారంగా చేరే దండారి బృందం లోపలి వైపుకు తిరిగి నిలుచుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, అడుగులు వేసి నప్పుడల్లా కుడి పాదాన్ని ఏదమ కాలు మీదికి వూగిస్తుండడంతో నృత్యం ప్రారంభమౌతుంది. ప్రతి నర్తకునికి చేతిలో రెండు కోలాటం కర్రలు వుంటాయి. నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానితో మరొక దానిని తాకిస్తారు. తరువాత కుడి వైపున వున్న నర్తకుని కర్రను కొడతారు. ఇలా అడుగులు వేస్తూ కోలాట మాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవత లందరికీ ప్రణమిల్ల డానికి ఇలా నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవతలకు మ్రొక్కిన తరువాత వలయాన్ని సరి చేసుకుని కర్రలను పాదాల వద్ద వుంచి, పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం చరణాన్ని ముగ్తించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ బృంద గానం చేస్తారు.

దందారీ నృత్యంలో, గుసాడీల ప్రవేశం:

పై విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుసాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు. తలకు నెమలి పించాలను ధరించి, కృత్రిమ గడ్డాలు మీసాలు, శరీరం పై మేక చర్మమూ