తెలుగువారి జానపద కళారూపాలు/ఆదిమ వాసులకు అద్దం పట్టే గిరిజన కళారూపాలు

వికీసోర్స్ నుండి

ఆదిమ వాసులకు అద్దం పట్టే గిరిజన కళారూపాలు


తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్రదేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే.

గిరిజనుల కళా రూపాలు:

ఆంధ్రదేశంలో అటు రాయల సీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని ప్రదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది గిరిజన జాతులున్నాయనీ, వీరి జనాభా పదమూడు లక్షలనీ, డి.ఆర్. ప్రతాప్ గారి వ్వాసానికి ఆధారంగా నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

అదిలాబాదు జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, ప్రధానులు, ఆంధ్రులు ముఖ్య జాతులు.

నాయిక పోడులు ప్రధానంగా కరీం నగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం , ఉభయ గోదావరి జిల్లాల ఏజన్సీ ప్రాంతాలలో కోయలు, కొండ రెడ్లు ఎక్కువ.

విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల గొండ ప్రాంతాలలో బగతలు, కొండ దొరలు, వాల్మీకులు, మూల దొరలు, సామంతులు, గదబలు, మమ్మరలు, కోటియాలు ఎక్కువ కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు, సవరలూ మాత్రమే కొండ ప్రాంతాల్లో వున్నారు. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులలో నూ, మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ పీఠభూమి ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు.

రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారులు, వీరినే సుగాలీలనీ, లంబాడీలనీ, లబానీలు అని కూడ పిసుస్తారు.

ఇక ఎరుకలు, ఏనాదులు మైదాన ప్రదేశాలలోనే నివాసాలు ఎర్పరుచుకున్న వారున్నారు.

గిరిజనులకు సంవత్సరం పొడుగునా వ్వవసాయమే జీవనాధారం. గోండులు, కోయలు, బగతలు, వాల్మీకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం చేసుకుంటారు.

కొండ రెడ్లూ, కొండ దొరలూ, సామంతులూ సవరలూ నిలకడగా ఒక చోట కాక తమకు తోచిన ప్రదేశాలలో పోయి వ్వవసాయం చేసుకుంటారు.

ఇక కోయలు, బగతలు, వాల్మీకులు, కొలాములు, నాయక పోడులు, కోటియాలు, మూఖదొరలు మొదలైన గిరిజన జాతులు కూడ పోడు వ్వవసాయం ద్వారా, అదనపు ఆదాయాల కోసం ప్రయత్నిస్తారని డి.ఆర్. ప్రతాప్ గారు వ్రాశారు. అలా గిరిజనులు జీవిత విధానలను సాగించుకుంటూ ఆనందం కోసం, సంగీతాన్ని నృత్యాన్ని వాయిద్యాన్నీ జోడించి ఎన్నో కళా రూపాలను సృష్తించుకున్నారు.

గోండుల గుసాడి నృత్యం:

అదిలాబాదు జిల్లా రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోద్చి చేసిన కష్టం, ధాన్యం లక్ష్మిగా నట్టింట చేరి వుంటుండి. గోడు లందరూ ఆట పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభ మౌతాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు. కొమ్ములూదుతూ, తప్పెట్లు వాయిస్తూ యాత్రలు సాగిస్తారు. గోండుల పురాణ గాథలలోని "దండారియారౌడ్, సిసిసెర్మారౌడ్" అనే కథా నాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు.

గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుసాడి నృత్యం ఒక భాగం. గుసాడి నృత్యంలో ఎందరో పాల్గొన వచ్చు. దీపావళి నెలలో సాంప్రదాయకమైన ఈ నృత్యం జరుగుతుంది, పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభ మౌతుంది. చతుర్దశి వరకూ జరుగుతుంది.

గుసాడి నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పించంతో తయారు చేసిన తలపాగా. ఇదులో గొర్రెపోతు కొమ్ములను కూడ అమర్చుతారు. కృత్రిమ గడ్డాలు మీసాలతో వేషం కడతారు. మేక తోలు కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు, డప్పు, తుడుము, పిప్రే, బాకా, కలికొయ్ (తప్పెట) మొదలైనవి వాద్య బృందానికి హుషారు నిస్తాయి. సంగీత వాయిద్యాలను, గుసాడి నృత్య పరీకరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు.

దండారి కోలాట నృత్యం:

మరింత లయబద్దమూ, క్రమబద్ధమూ అయిన దండారి నృత్యం గుసాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుసాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుసాడి అంటే అల్లరి అని అర్థం. దండారి నృత్యం గుమేలా అనేది బుర్రకథ డిక్కి శబ్దాలకు అనుగుణంగా లయబద్ధమై ఉంటుంది.

వలయాకారంగా చేరే దండారి బృందం లోపలి వైపుకు తిరిగి నిలుచుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ, అడుగులు వేసి నప్పుడల్లా కుడి పాదాన్ని ఏదమ కాలు మీదికి వూగిస్తుండడంతో నృత్యం ప్రారంభమౌతుంది. ప్రతి నర్తకునికి చేతిలో రెండు కోలాటం కర్రలు వుంటాయి. నర్తకులు తమ చేతుల్లోని రెండు కర్రలను ఒకదానితో మరొక దానిని తాకిస్తారు. తరువాత కుడి వైపున వున్న నర్తకుని కర్రను కొడతారు. ఇలా అడుగులు వేస్తూ కోలాట మాడుతూ నర్తకులందరూ వంగి కర్రలను నేలకి తాకించి నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవత లందరికీ ప్రణమిల్ల డానికి ఇలా నాలుగు దిక్కులకూ అడుగులు వేస్తారు. దేవతలకు మ్రొక్కిన తరువాత వలయాన్ని సరి చేసుకుని కర్రలను పాదాల వద్ద వుంచి, పాటకు అనుగుణంగా చేతులతో చప్పట్లు కొడతారు. ఒక బృందం చరణాన్ని ముగ్తించగానే రెండవ బృందం రెండవ చరణాన్ని అందుకుంటూ బృంద గానం చేస్తారు.

దందారీ నృత్యంలో, గుసాడీల ప్రవేశం:

పై విధంగా దండారీల నృత్యం కొనసాగుతుండగా నలుగురైదుగురు గుసాడీలు హఠాత్తుగా దండారీల వలయంలోకి చొచ్చుకుని వస్తారు. తలకు నెమలి పించాలను ధరించి, కృత్రిమ గడ్డాలు మీసాలు, శరీరం పై మేక చర్మమూ ధరించి వచ్చే గుసాడీల చేతుల్లో కర్ర లుంటాయి. మెడలో గవ్వల హారాలూ, తుంగ కాయల హారాలూ వుంటాయి. నడుముకు మణి కట్టుకూ - చిరు గజ్జెలు వుంటాయి. కంటి చుట్టూ తెల్ల రంగు పూసు

కుంటారు. మొలకు నారింజ రంగు లంగోటీలు తప్పించితే శరీరం పై మరే ఇతర అచ్ఛాదన ఉండని గుసాడీల వేషం వింతగా వుంటుంది. శరీరం పైన నలుపు చారల చుక్కలతో ఇంత వింత అలంకరణాలు వుంటాయి. గుసాడీలు ప్రవేశించ గానే దండారీలు చెల్లా చెదురౌతారు. ఇది ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది.

సామంతుల మయూర నృత్యం:

సామంతులు మాత్రమే ఈ మయూర నృత్యం చేస్తారు. సామంతులనే గోండులని కూడ అంటారు. సామంతులు ఎంతో వెనుకబడిన గిరిజనులు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలోని దుర్గమ్మ కొండ ప్రాంతపు అడవుల్లో ఈ గిరిజనులు కనిపిస్తారు. సామంతులు తరతరాలుగా కాపాడుకొంటూ వస్తున్న సాంస్కృతిక సంపదలో మయూర నృత్యం ఒక భాగం. గోండుల వివాహ సందర్భాలలోనూ, ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర పర్వ దిన సందర్భంలోనూ, సాధారణంగా ఈ మయూరి నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో పిరోడి అనే మురళి కాళ్ళకు కట్టుకునే గజ్జెలు ముఖ్యమైనవి.

సామంతులు ఖరీదైన వస్త్రాలంకరణలు జోలికి పోరు. తెల్ల ధోవతి కట్టుకుంటారు. నర్తకు లందరూ పాదాలకు గజ్జెలు కట్టుకుంటారు. వీటిని సామంతులు "ముయ్యంగ" అంటారు. తలకు తోయంగ అనే తలపాగా ధరిస్తారు. తుంగ గడ్డితో చేసిన పొగాకు రంగుల గుడ్డ పేలికలను కుచ్చులుగా కడతారు. నడుము వంచినప్పుడు పింఛము విప్పిన నెమలి వలె కనిపించేటట్టు నెమలి పింఛముల గుత్తిని నడుముకు వెనుక బిగించుకుంటారు. మొదట నర్తకులందరూ రెండు వరుసలలో నిలుచుంటారు. నోటితో నెమలి అరుపును పోలిన శబ్దం చేస్తారు. వలయాకారంగా నిలిచి నాట్యం చేస్తున్న మయూరం పద్ధతిలో మోకాలిపై ముందుకు వంగుతారు. భూమాతకు సూర్య భగవానుడికి మ్రొక్కి నృత్యం ప్రారంభిస్తారు.

జోడియా:

అనే ఈ గిరిజన నృత్యాన్ని కొండ్య మట్టియా, జోడియా అనే జాతుల వాళ్ళు చేస్తారు. ఈ నృత్యాన్ని పులకమ్మ, గంగా దేవి, గసురమ్మ మొదలైన పండుగల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసే బృంద నృత్యం. పది అడుగుల కర్ర మీద ఇద్దరు నిల్చోగా మిగతా బృందం నాట్యం చేయడం దీని ప్రత్యేకత.

పూల పండ్లు:

ఇది శ్రీకాకుళానికి చెందిన సవర జాతి చేసే గిరిజన నృత్యం. దీన్ని పెళ్ళిళ్ళ సందర్భంలో, దేవీ పూజల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసే బృంద నృత్యం. కోలాటం కూడ శ్రీకాకుళానికి చెందిన సామంతుల జాతివారు చేసే నృత్యం. ఇది పెళ్ళిళ్ళ సందర్భంగా కేవలం పురుషులు చేసే నృత్యం.

చెంచు నృత్యం:

మహబూబ్ నగర్ కు చెందిన చెంచు జాతి వాళ్ళు, పెళ్ళిళ్ళ సందర్బంగా చేసే నృత్యం. ఇది ఆడ మగ కలిసి చేసే నృత్యం.

లంబాడి:

లంబాడి హోలీ నృత్యం నల్లగొండకు చెందిన లంబాడీ జాతి వారు హోలీ పండుగ సందర్భంలో చేస్తారు. దీన్ని హోలీ నృత్యం అని కూడా అంతారు. ఇది స్త్రీ పురుషులు కలిసి చేసే నృత్యం.

కోయ నృత్యం:

ఇది ఖమ్మం జిల్లాకు చెందిన కోయ జాతి వారు విత్తనాలు నాటే సందర్భంలో చేసే నృత్యం. వరి పంట చేతికి వచ్చిన సందర్భంలో చేసే నృత్యం, ఇది కూడ స్త్రీ, పురుషులు కలిసి చేసే నృత్యమే.

లంబాడి నృత్యం:

దీనిని రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ ప్రాంతపు లంబాడీలు చేస్తారు. ఇది పండుగల సందర్భంగా ఆడవాళ్ళు చేసే బృంద నృత్యం. ఈ నృత్యాలను గిరిజనులు చేసేటప్పుడు తుటుంపర్ర, వెట్టి, డప్పు మొదలైన తోలు వాయిద్యాలను "బాంసారి కొమ్ము, సన్నాయి మొదలైన వాయిద్యాలూ, కిన్నెర మెట్ల, కినెర, డోలు కామారో ఇత్యాది తీగ వాయిద్యాలు ఎక్కువగా వాడుతారు. అలంకరణ దుస్తులు, సాంప్రదాయ పద్ధతుల్లో వుంటాయి.

కొండ రెడ్ల కళా సంస్కృతి:

ఆంధ్ర దేశంలో ఆయా ప్రదేశాల్లో వున్న కళారూపాలు మాత్రమే వెలుగులో కొచ్చాయి. అలా వెలుగులోకి వచ్చి ప్రచారమై ప్రజల నాకర్షించినవి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆంధ్ర దేశంలోనే ఎక్కడో మారు మూల గిరిజన ప్రాంతాల్లో వున్న కళా రూపాలు మాత్రం ఆంధ్ర ప్రజల కెవ్వరికీ తెలియకుండా అజ్ఞాతంగానే వుండి పోయాయి.

అక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. ఈ నాగరిక ప్రపంచానికే దూరమైన అజ్ఞాత జీవితాలు వారివి. అమాయక ప్రజలు నిర్మలమైన మనస్సులు, నిష్కల్మష హృదయాలు, మాయా మర్మాలు తెలియని వారు. వారూ వారి జీవితం, జీవితానందం కోసం వారి ఆచారాలూ, ఆధ్యాత్మిక చింతనలూ, ఆరాధనలూ, వినోద ప్రదర్శనాలూ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ ప్రాచీన సంస్కృతిని రక్షిస్తూ మారు మూల కొండల్లో, అడవుల్లో వుంటూ జంతువులతో పాటు వారూ పరిమిత కుటుంబాలుగా బ్రతుకుతున్నారు.

అలా బ్రతికే వారు నాగరికత ప్రపంచానికి అతి దగ్గరగా వున్నారు. అలా తూర్పు గోదావరి జిల్లాలో అటు రాజమండ్రికీ, ఇటు భద్రాచలానికీ దగ్గరగా వున్న మారేడి మిల్లి __ అడ్డ తీగల మొదలైన సమితుల్లో అధిక సంఖ్యాకులుగా వున్నారు. వీరి మాతృ భాష తెలుగే. అయితే కొంచెం యాసగా వుంటుంది. ప్రధానంగా వీరు పోడు వ్వవసాయం చేస్తున్నప్పటికీ వేటాడటం, చెట్లు నరకటం, చేపలు పట్టటం వీరి జీవనాధారం. చెట్ల వేళ్ళూ , ఆకులూ, జీలుగ బెరడూ మామిడి జీడి వీరి ఆహార పదార్థాలు.

కొండ రెడ్లు పంటలు బాగా పండాలనీ, తమకు వ్వాధులు రాకుండా కాపాడమనీ రక రకాల దేవతలు కొలుస్తారు. వీరి పండుగలలో మామిడి కోత పండుగ, భూదేవి పండుగ, గంగమ్మ దేవత పండుగ ముఖ్యమైనవి. ముత్యాలమ్మ, గంగమ్మ, గంటమ్మ, సరెలమ్మ, పాండవులను వీరు అతి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

మామిడి కోత నృత్యం:

కొండ రెడ్లకు అత్యంత ప్రీతి కరమైనవి మామిడి పండ్లు. మామిడి పండ్లు ఆ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. మామిడి పండ్లు కోసే ముందు కొండ రెడ్లు ఆనందోత్సవం జరుపు కొంటారు. తప్పెట్ల వాయిద్యాల శబ్దానికి అనుగుణంగా లయ బద్ధమైన నృత్య చేస్తారు.

రాత్రి పూట ఈ నృత్యం ప్రారంభ మౌతుంది. మొదట వాయిద్యాలను నెమ్మదిగా మ్రోగిస్తారు. ముగ్గురు నలుగురు స్త్రీలు చెట్టపట్టలు వేసుకుని చేతుల్లో గల గల శబ్దం చేసే ఎండు కాయల గుత్తులను ధరించి నృత్యంలో పాల్గొంటారు.

సామూహిక నృత్యం:

వారు చేసే నృత్యంలో స్త్రీలూ, పురుషులూ ఒకే సారి నృత్యంలో పాల్గొంటారు కాని జంటలుగా కలవరు. రంగ స్థలం చుట్టు ఎడమ చేతి వాలుగా ప్రదక్షిణం చేస్తూ నృత్యం కొనసాగిస్తారు. నృత్యం పతాక సన్నివేశానికి వచ్చినప్పుడు సైతం స్త్రీలు పురుషులూ వేరు వేరుగానే నృత్యం చేస్తారు. స్త్రీలు పాదాన్ని నేలకు తాకించుతూనే నాలుగు అడుగులు ముందుకు వేస్తారు. ఇలా ముందుకు వెళ్ళడం ఒక ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. కుడి పాదాన్ని ఐ మూలగా నాలుగడుగులు ముందుకు వేసి,నొక అడుగు అదే పద్ధతిని వెనక్కు వేస్తారు. వలయాకారంలో చేరి ఒకే సారి అందరూ కేంద్ర స్థానానికి వచ్చి మళ్ళీ పోవడం, చేతులు ఊపుతూ అర చేతుల్లో వున్న గలగలలాడే వాయిద్య విశేషాలతో శబ్దం చేయడం ఈ నృత్యానికి హంగును చేకూర్చుతుంది. కాళ్ళను ఎడంగా వుంచి కుడి పాదం మీద అదేలా దూకడం, అటు తర్వాత కుడి పాదం వెనక్కూ ఎడం పాదం ముందుకూ వచ్చేటట్టు మరో గెంతు గెంటడం కూడ ఒక విశిష్టమైన నర్తన విధానం.

పురుషుల నృత్యం:

పురుషుడు అడుగులు చేసే పద్ధతి స్త్రీల కంటే భిన్నంగావుంటుంది. నాట్యం చేస్తున్న బృందం తో పాటు వాద్య కారులు ప్రక్కగా వెంట వెంటనే ముందుకు అడుగులు వేస్తారు. ప్రారంభంలో మట్టుకు వాయిద్యాలను పట్టు కున్న కళాకారులు రంగ స్థలం మధ్య కనిపిస్తారు. అడుగు ముందుకు వేసేటప్పుడు మొదటి కుడి పాదం వేసి ఆ తరువాత ఎడమ పాదాన్ని కుడి పాదం మడమ దాకా ముందుకు తీసుకు వస్తారు. ఆ విధంగా మళ్ళీ కుడి పాదంతో అడుగు వేయడానికీ వీలు కలుగు తుంది. ఈ నృత్యం వాయించే రెండు రకాల చర్మ వాద్యాలూ అడుగులు వేసేటప్పుడు లయ బద్ధంగా చేయడానికి తోడ్పడుతాయి.

వాయిద్యాలను మరింత వేగంగా వాయించిన కొలది నాట్యంలో ఉత్సాహం కూడ పెరిగి మరింత చురుకుగా సాగుతుంది. అర్థరాత్రిలోగా విందులు ముగించి, స్త్రీలూ, పురుషులూ పిల్లలూ మళ్ళీ నృత్యం ప్రారంభిస్తారు.

ముత్యాలమ్మనూ, కొండ దేవతలనూ ఆహ్వానిస్తూ సుదీర్ఘమైన పాటలు పాడుతారు. కొండ రెడ్లకు ఈ పాట ఎంతో ఉత్సాహాన్నీ ఉద్వేగాన్ని కలిగిస్తుంది.

సన్నివేశం పతాక స్థాయిని అందుకునే సమయానికి పాట పూర్తి అవుతుంది. ఉదయం పది గంటల వరకూ, అలసట వచ్చేంత వరకూ నృత్యంచేసి ఎవరికి వారు వెళ్ళి పోతారు. గ్రామ మంతా నిశ్శబ్దమైపోతుంది.

మూఢ నమ్మకాలు:

వ్యాధులూ, మరణమూ, వృద్ధాప్యం మొదలైనవి, దైవాను గ్రహం, చేతబడి, మంత్ర తంత్రాల వల్ల వస్తాయని వీరికి గట్టి నమ్మకం. అందుకే జంతువులను విపరీతంగా దేవతలకు బలి ఇస్తారు. వీరిలో నిర్భంధంగా స్రీని ఎత్తుకు వచ్చి వివాహం చేసుకునే పద్దతి ఇప్పటికీ వుంది. పెళ్ళిళ్ళకు స్త్రీ పురుషులు సాంప్రదాయ నృత్య గానాలు చేస్తారు. రాజుల పండుగా, గంగాలమ్మ పండుగా, గూపెమ్మ కొలువులలో వీరు దేవతలను ఆహ్వానిస్తూ నాట్యం చేస్తారు. రాజుల పండుగల్లో వారు పాండవులను ఆహ్వానిస్తారు.

రాజుల పండుగలో
లేలేలేల లేలెమ్మరో ఓ లేల
లేలేలేల లేలెమ్మరో ఓ లేల

అన్న రీతీలోనూ


పెళ్ళిళ్ళలో

లచ్చు కొడలయ్య కోడలా
లచ్చీర బాల కోడలా

అన్న పాటను వీరు పాడతారు. వీరి జీవితంలో మాట కంటే పాటే ప్రధానం. గంగాలమ్మ పండగలో ఓ అత్త కోడలిని ఇలా అంటుంది.

గైరికీపిట్ట కన్నుల దానా కోడలా, కోడలమ్మా
కారు పంది ముక్కు దానా కోడలా, కోడలమ్మా

అని పరిహసిస్తుంది