తెలుగువారి జానపద కళారూపాలు/అరకులోయలో, ఆదిమవాసుల నృత్యాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అరకులోయలో, ఆదిమవాసుల నృత్యాలు


మన ప్రాచీన సంగీత నృత్యాలు రూపు మాసి పోకుండా కాపాడిన ఖ్యాతి జానపదులకు దక్కుతుంది. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యం అత్యంత ముఖ్యమైనది.

రమణీయ ప్రకృతి:
TeluguVariJanapadaKalarupalu.djvu

అరకు లోయ రమణీయమైన ప్రకృతికి నిలయం. విశాఖపట్టణం జిల్లాలో సముద్ర మట్టానికి నాలుగు వేల అడుగుల ఎత్తున వున్న ప్రాంత మిది. సంవత్సర కాలంలో ఎక్కువ కాలం వాతావరణం ఆహ్లాదకరంగా చల్లగా వుంటుంది. అనుకూల వాతావరణం వల్ల కాఫీ తోటలు, నారింజ తోటలు ఏపుగా పెరుగుతాయి. రకరాకల కూరగాయలు పండిస్తారు. అనేక గిరిజన జాతులు అరకు లోయ అంతటా కనిపిస్తారు. వీరందరూ ఆంధ్రదేశంలో వున్న ఎక్కువ మంది ఒరియా భాషను మాట్లాడుతారు. అయితే వీరు మాట్లాడే భాష స్వచ్ఛమైన ఒరియా భాష కాదు. వీరిలో వాల్మీకి బగట, బోండ్, కొండదార, కోటియా ప్రధానమైన గిరిజన జాతులు.

ఈటెల పండగ:

అరకు లోయలో అత్యంత ప్రధానమైన ఆనందోత్సవం, చైత్ర మాసంలో జరుగుతుంది. చైత్ర పర్వం, లేక ఈటెల పండుగ సందర్భంగా ఈ ఆనందోత్సవం జరుగుతుంది. పండుగ రోజుల్లో పురుషులు ఈటెలతోనూ, విల్లంబులతోనూ జంతువులను వేటాడుతారు. అందువల్ల దీనిని ఈటెల పండుగ అంటారని ఆంధ్ర ప్రభుత్వ గిరిజన సాంస్కృతిక సంస్థవారు (నాట్య కళ జానపద కళల సంచికలో ఉదహరించారు.)

చైత్ర మాసంలో గిరిజనులు చైత్ర పర్వం చేసు కుంటారు. అన్ని తెగల వారూ మహోత్సాహంతో ఉత్సవంలో పాల్గొంటారు. అందరూ ఒక చోట చేరి విందులు చేసు కుంటారు. యువతీ యువకులు ఒళ్ళు తెలియని ఆనందోత్సాహాలతో తెల్ల వార్లూ సంగీత నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. అన్ని వయసులవారూ రోజుల తరబడి అడవులలో గడుపుతూ తృప్తిగా వేటాడతారు. వేట నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చేటప్పుడు, పురుషులను స్త్రీలు పరాభవిస్తారు. పర్వ దినాలలో ఒక గ్రామానికి చెందిన వారు మరొక గ్రామానికి వెళ్ళి, దింసా నృత్యంలో పాల్గొంటారు. పర్వ దినాలలోఒక గ్రామంవారు, మరో గ్రామం వారిని ఆహ్వానిస్తారు. అలా వచ్చే వారికి విందులు ఏర్పాటు చేస్తారు. ఇలా అందరూ కలిసి నృత్య వినోదాల్ని జరుపు కోవడాన్ని "నంకిడి కెల్చారు" లేక "కిందిరి కెల్చార్" అంటారు. చైత్ర పర్వం ఈ విధంగా వారి మద్య సఖ్యతును పెంపొందిస్తుంది.

దింసా నృత్యం:

అరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులూ, యువకులూ, ధనికులూ, పేదలు అనే తేడా లేకుండా, అన్ని వర్గాల వారు దింసా నృత్య కార్య క్రమాలలో పాల్గొంటారు. కష్ట జీవు లైన గిరిజనులకు, ఈ కార్య క్రమాలు అంతులేని ఆనందాన్నిస్తాయి. దింసా నృత్యం అందరినీ అలరించడమే కాక, గ్రామీణ ప్రజల మధ్య సఖ్యతనూ, సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది. దింసా నృత్యాన్ని చైత్ర పర్వం లోనూ, వివాహ సమయం లోనూ, పండుగ పర్వ దినాలలోనూ ప్రదర్శిస్తారు.

దింసా నృత్యంలో విలక్షణమైన, సంగీత వాయిదాలున్నాయి. "తుండి " , "మోరి","కిరిడి" "తుడుము" డప్పూ మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో లయ బద్ధంగా సాగుతుంది. ఈ నృత్యంలో కళాకారుల్ని ఉత్తేజ పర్చ టానికి మధ్య మధ్య ... జోడుకొమ్ము బూరలను ఊదుతారు. స్త్రీ పురుషు లందరూ సాంప్రదాయక మైన ఆభరణాలు ధరించి, రంగు రంగుల దుస్తులను అలంక రించుకుని నృత్యానికి హాజరౌతారు. దింసా నృత్యం ఎనిమిది రకాలున్నాయి.

బోడె దింసా:

బోడె అంటె ఘనమైనదని అర్థం. గ్రామ దేవత అయిన "నిసాని దేవత" పూజ సమయంలో ఈ నృత్యం చేస్తారు. కనుక దీనిని బోడె దింసా అంటారు. అన్ని వాయిద్యాలూ వుధృతంగా వాయిస్తూ వుండగా ఈ నృత్యం ప్రారంభమౌతుంది. కుడివైపున పురుషులూ, ఎడమ వైపున స్త్రీలూ వరుసగా నిలుస్తారు. వీపుమీద ఒకరి చేతులు మరొకరు దృఢంగా పట్టుకుంటారు. వరుసలో కుడి వైపున మొదటి నిలిచే వ్వక్తి కథా నాయకుడు, నెమలి ఈకల పించాన్ని పట్తుకుని లయ బద్ధంగా అడుగులు వేస్తూ, నృత్యాన్ని నిర్వహిస్తాడు. అలాగే ఎడమ వైపు చివర నుండే వ్వక్తి కూడ కథానాయకుడికి తోడుగా నృత్యాన్ని నిర్వహిస్తాడు. అందరూ వర్తులాకారంగా తిరుగుతూ ...మధ్య మధ్య, హుషారుగా, హేయ్, హేయ్, హోయ్, హోయ్ అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ, చివరికి బారుగా నిలుచున్న స్థితికి చేరుకుంటారు.

గుండేరి దింసా:
TeluguVariJanapadaKalarupalu.djvu

గుండేరి ఒక స్త్రీ పేరు. ఈ నృత్యంలో పాల్గొనే పురుషుడు తనతో కలసి అడుగు వేయవలసిందిగా ఒక పాట రూపంలో, మహిళా బృందాన్ని ఆహ్వానిస్తాడు. అందు వల్లనే ఈ నృత్యాన్ని "గుండేరి నృత్యం" అంటారు. ఈ నృత్యంలో వెనకకూ ముందుకూ ధృఢంగా అడుగులు వేస్తూ కదం త్రొక్కుతూ గుండ్రంగా తిరుగుతారు. ఉత్సాహ ఉద్వేగాలతో చేసే నృత్య మిది ... అలాగే ఒరియాలో గొడ్డిబేట నృత్యముంది. గొడ్డి అంటే చిన్న రాళ్ళు. బేట అంటే ఏరుట అనే అర్థం. ఈ నృత్యంలో గిరిజన బృందాలు, రాళ్ళను ఏరుతున్నట్టుగా తలను దించుతూ, పై కెత్తుతూ నర్తిస్తారు. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ పాతిక అడుగులు ముందుకు సాగి, అదే పద్ధతిలో వెనక్కు వస్తారు. ఇలా నాలుగైదు సారులు వెనకకు ముందుకూ సమన్యయంతో అడుగులు వేస్తారు.

పోతార్ తోలా:

పోతార్ అంటే అడుగులు, తోలా అంటే సేకరణ. ఈ నృత్యంలో సగం మంది ప్రక్క ప్రక్కన ఒక వరుసలో నుంచుంటారు. వెనుక ఉన్నవారు, ముందున్న వారి భుజాలపై చేతులు వుంచుతారు; కుడి వైపుకూ, ఎడమ వైపుకూ, ఒక్కసారిగా తలను త్రిప్పుతూ బృందం యావత్తు ముందుకు వెడతారు. అడవిలో ఆకులు ఏరడాన్ని ఈ నృత్యం సూచిస్తుంది. అరకు లోయలో గిరిజనుల అడ్డ ఆకులను సేకరించడం ఒక చిన్నవృత్తి. సేకరించిన ఆకులను సంతలో అమ్ముతారు.

బాగ్ దింసా:

భగ్ అంటే ఒరియాలో "బెబ్బులి" అని అర్థం. అడవిలో భయంకరమైన జంతువులలో పెద్దపులి ఒకటి. పెద్ద పులి కనిపిస్తే ఎలా పారి పోవాలో చిన్న పెద్ద అందరూ తెలుసు కోవాల్సిన అవసరం వుంది. బాగ్ దింసా నృత్యం దీనిని తెలియజేస్తుంది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచుకుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు.

వివిధ రకాలు:

నాటికారి, కుందాదింసా, బాయ దింసా అనే నృత్యాలు కూడా వున్నాయి. నాటికారి నృత్యం ఒక్కక్కరే చేసే నృత్యం, ముఖ్యంగా వాల్మీకి జాతి వారు. దీపావళి పండుగ రోజు నృత్యం చేస్తారు. మిగతా పండుగల సమయంలో ఇతర జాతులు కూడ నృత్యంలో పాల్గొంటారు. అలాగే కుందా దింసా. కుందా అంటే ఒకరి నొకరు భుజాలతో తోసుకోవడం అని భావం. ఈ నృత్యంలో లయబద్ధంగా ఊగుతూ, ఒకరి నొకరు భుజాలతో తోసుకుంటారు.

TeluguVariJanapadaKalarupalu.djvu
పథోర్ తోలా నృత్యం

బాయా దింసా నిసాని దేవత పూనినపుడు గణాచారి చేసే నృత్యమిది. బాయా అంటే పూనకం. గణాచారిని ఒరియాలో "గురుమాయీ" అంటారు. ఎవరైనా పూనినపుడు గ్రామస్తులందరు ఆ వ్వక్తి చుట్టూ చేరి తలలు వంచి నిలుస్తారు.

అలాగే "గురుమాయి" భవిష్యత్తులోజరగనున్న సంఘటనలను చెపుతారు. గూడెంలో ఎవరెవరు ధర్మం తప్పి చరించినది బయడ పెట్టడం కూడా జరుగుంది. ఇలా చెప్పే జోశ్యాలలో చాలవరకు నిజం కావడం విశేషం. జాన పదులు పూనకం వచ్చిన వ్వక్తిని అనుకరిస్తారు. గనుక ఈ నృత్యాన్ని బాయాదింసా అని వ్వవహరిస్తున్నారు. పూనకం తొలగే వరకూ ఈ నృత్యం కొనసాతుంది. (ప్రభుత్వ గిరిజన సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో)

మధురాలు:

మధురమైన పాటల్నీ, ఆటల్నీ, నృత్యాలను చేస్తూ కాల గడిపే మధురాలు, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో, అడవుల్లో, కొండల్లో ఈ మధురాలు ఎక్కువగా నివసిస్తున్నారని, విద్యారణ్యగారు ఆంధ్రపత్రికలో ఉదహరించారు. వారి జీవన సరళీ, అచార వ్వవహారాలు, వేష భాషలూ అన్నీ గిరిజన జీవితానికి దగ్గరగా వుంటాయి. వీరు అన్ని విధాలా, లంబాడీలను పోలి వున్నప్పటికీ వీరికి వారికీ చాల తేడా వుంది.

వీరు సంచార జాతులనీ, ఉత్తర ప్రదేశం నుండి వచ్చారనీ అంటారు కానీ, మేను ఇక్కడి వారమేనంటారు మధురాలు. అదిలాబాద్ జిల్లలోని ఉట్నూరు, "భోద్" అడవుల్లో ఎక్కువగా కనిపించే మధురాల జీవన విధానం వేష భాషలు విచిత్రంగా కనిపిస్తాయి. అందంలోనూ, వస్త్ర ధారణ లోనూ, ఏ ఇతర జాతి స్త్రీలకూ తీసిపోరు.

వీరు మొగల్ చక్రవర్తి ఔరంగ జేబు కాలంలో సైన్యానికి ఆహారం అందించే వారని, ప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త గిరిజనుల ఆరాధ్య దైవం "హేమండార్సు" అంటారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

మధురాల సిరోజాల అలంకరణ ఎంతో రమణీయంగా వుంతుంది. స్త్రీలందరూ మామూలుగా సిగలు చుడతారు కాని మధురాలు పొడుగాటి కొమ్ములాగా అలంకరిస్తారు. ఈ అలంకారం చూడ ముచ్చట గానేవుంటుంది. జీవిత సరళిలో, వేష ధారణలో దగ్గర సంబంధాలున్న లంబాడీలు, ఇంతకు పూర్వం, మధురాలతో సంబంధాలు లేక పోయినా, ఇటీవల కాలంలో వీరిరువురి మధ్యా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి.

ఇష్టమైన గోకులాష్టమి:

మధురాలకు గోకులాష్టమి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ పర్వ దినాల్లో "లెంగినాఖేల్" అనే ఆటను తమతమ గూడేలలో ఆడుతూ వుంటారు. మగవారు తప్పెటల్నీ, డోలక్ లనూ,నగారాలనూ వాయిస్తూ వుంటే, మహిళలు లయ బద్ధంగా చప్పట్లు చరుస్తూ, అడుగులలో అడుగులు వేస్తూ, వలయాకారంగా, గుండ్రంగాతిరుగుతూ, కృష్ణ సంకీర్తనాన్ని ఆశువుగా ఆహ్లాదంగా వివరిస్తారు. అయితే స్త్రీలు ప్రదర్శించే నృత్యంలో పురుషులు పాల్గొనే అవకాశముండదు. అందుకు కారణం, పది సంవత్సరాల వయసున్న బాలుడు కృష్ణుని పాత్ర ధరిస్తే, స్త్రీలంతా గోపికల నాట్యవిన్నాసాన్ని చేస్తారు. ఆ కారణంవల్ల వారి వారి పురుషులకు ఈ నాట్యంలో తావువుండదని మధురాలు చెపుతారు.

వీరు దసరా, దీపావళి, సంక్రాంతి పందుగలను వైభవంగా జరుపుకుంటారు. ఆటపాటలతో, ఆనందడోలికల్లో ఊగుతారు.

ముఖ్యంగా "ఖద్ డమారణ్" అనే కన్యల పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది తెలంగాణాలో బహుళ ప్రచారంలో వున్న బతుకమ్మ పండగకు చాల సన్నిహితంగా వుంటుందట. అయినా అది ఒక ప్రత్యేక కళారూపంగా వుంటుందట.

గోండ్లు మొదలైన గిరిజనుల మాదిరే చక్రాల బళ్ళను ఉపయోగిస్తూ ఉన్న వనరులతో వ్వవసాయం చేసుకుంటూ జీవిస్తారు. వీరు స్నేహానికి ప్రాణమిస్తారు.