తెలుగువారి జానపద కళారూపాలు/గిరిజనుల సంగీత వాయిద్యాలు

వికీసోర్స్ నుండి

గిరిజనుల సంగీత వాయిద్యాలు


అంధ్రదేశంలో అనేక జానపద కళా రూపాలతోపాటు, అడవుల్లో కొండల్లో నివసించే గిరిజన ప్రాంతాల్లో నివశించే గిరిజనులకు కూడ సంస్కృతీ పరమైన అనేక నృత్యాలూ గేయాలూ, అనేక వాయిద్య పరికరాలు వున్నాయి.

వీటిని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ విభాగమైన గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ, వ్వవహారాల సంస్థ పరిసోధనాత్మకమైన కృషి చేస్తున్నదనీ, గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సమగ్ర పరిశోధన విశేషమనీ, సంస్కృతీ చిహ్నాలైన వస్తువుల్ని సేకరించటం అవసరమనీ, అవి గిరిజన సంస్కృతిని తెలుసు కోవడం కోసం ఉపయోగపడతాయనీ, అందుకోసం కృషి జరుగుతూ వుందనీ, ఆ కృషిలో భాగంగా యం.ఎ. రవూఫ్ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో గిరిజనుల సంగీత వాయిద్యాలను గురించి వివరించారు.

సంగీత వాయిద్యాలు

గుమేళా:

గుమేళా అనే ఈ వాయిద్యాన్ని కుమ్మరి మట్టితో తయారు చేస్తారు. లోపలి భాగం అంతా డొల్లగా వుంటుంది. స్థూపక ఆకారంలో వుంటుంది. ప్రక్కన మేక చర్మంతో సాగదీసి బిగిస్తారు. దండారి నృత్యం జరిగే సమయంలో గోండు జాతి వారు ఈ వాయిద్యాన్ని అద్భుతంగా వాయిస్తారు.

డగ్గుడు:

అలాగే డగ్గుడు అనే వాయిద్యాన్ని సవర జాతి వారు ఉపయోగిస్తారు. ఈ వాయిద్యం యొక్క ఆకారం మద్దెలలా వుంటుంది. దీనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సవరలు వారి జాతిలో ఎవరైనా మరణించినప్పుడు సంతాప సమయంలో దీనిని వాయిస్తారు. అలాగే పితృ దేవతలకు శ్రాద్ధ ఖర్మలు జరిపే ఆగుగామా సమయంలో ఉపయోగిస్తారు.

కిరిడి:

ఈ వాయిద్యాల పేర్లే ఎంతో ఆసక్తి గలిగించేవిగా వున్నాయి. కిరిడి వాయిద్యం మట్టితో తయారు చేయబడే డ్రమ్ము వాయిద్యమిది. పై భాగాన మేక చర్మాన్ని అమరుస్తారు. రెండు చిన్న కఱ్ఱ పుల్లలతో మోరీ బాణికి అనుగుణంగా ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.

తప్నా:
రెండు అడుగుల వ్వాసం కలిగిన ఒక్ కొయ్య చట్రానికి, ఎండబెట్టిన మేక చర్మాన్ని, గట్టిగా లాగి బిగిస్తారు. డప్పు, డంగ్, అనే రెండు చిన్న పుల్లలతో అదిలాబాద్ జిల్లాలో వున్న రాజగోండులు దీనిని వాయిస్తారు.
కోయ నర్తకుడు


తుడుము:

అర్థ గోళాకారంలో వుండే మట్టి తో తయారు చేయ బడ్డ వాయిద్య మిది. పైన మేక చర్మాన్ని భిగించి కడతారు. అర్థ గోళం పైభాగం పైన తోలు పట్టీలు చర్మాన్ని బిగించి వుంచుతాయి. తాళ్ళ చుట్టుపైన ఈ వాయిద్యాన్ని వుంచి, తోలు పట్టాలతో వాయిస్తారు. ముఖ్యంగా దింసా నృత్యాలలో దినిని ఉపయోగిస్తారు. సామంత జాతివారూ, గోండులూ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా వాడుతారు.

వెట్టె లేక, తురుబులి:

అదిలాబాదు జిల్లా గోండులు ఉపయోగించే వాయిద్యమిది. దీనిని తురుబులి అనీ, వెట్టె అనీ అంటారు. కుండ మట్టితో గాని ఇనుముతో గాని, కొయ్యతో గాని దీనిని పళ్ళెం తయారు చేసి పైన చర్మాన్ని బిగిస్తారు. ఈ చర్మం వ్వాసం సాధారణంగా పది అంగుళాల కంటే ఎక్కువే వుంటుంది. సన్నని రెండు పుల్లలతో దీనిని వాయిస్తారు.

డోలు:

దారువుతో డొల్లగా చేసిన ఈ వాయిద్యానికి రెండు వైపులా జింక చర్మాన్ని గాని మేక చర్మాన్ని గాని ఉపయోగిస్తారు. వెదురు ముక్కలూ, తాళ్ళతో ఈ చర్మాన్ని బిగువుగా వుంచుతారు.

టాబోర్:

ఈ వాయిద్యం రెండు ప్రక్కలా వాయించ వలసిన వాయిద్యమిది. స్థూపాకారంలో వుండే ఈ వాయిద్యం మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా వుంటుంది. చట్రాన్ని మట్టితో చేసి కాలుస్తారు. రెండు ప్రక్కలా అనువుగా మేక చర్మాన్ని అమర్చి బిగించుతారు. తోలు పట్టీలతో ఈ రెండు వైపుల చర్మాన్ని బిగించ టానికి వీలుంటుంది. ఈ వాయిద్యాన్ని కేవలం వ్రేళ్ళతో వాయిస్తారు. ముఖ్యంగా ... ఆరకు లోయలో దీనిని అన్ని జాతుల వారు వాయిస్తారు.

రెండవ రకం డోలు:

ఇది కూడ పైన వివరించిన డోలు లాంటిదే. మెడకు తగిలించుకుని, డోలును పొట్టకు ఆనించి ఒక చేతితో వెదురు పుల్ల తోనూ, మరో చేతి వ్రేళ్ళతోనూ అప్పుడప్పుడు అర చేతితోనూ వాయిద్యాన్ని సాగిస్తారు.

గోగోడ్ - రాజన్:

ఈ వాయిద్యాన్ని శ్రీ కాకుళం జిల్లాలో వున్న సవరలు ఉపయోగించే సంగీత వాయిద్యమిది. మామూలు కొబ్బరి చిప్పను ఈ వాయిద్యానికి స్వర పేటికగా ఉపయోగిస్తారు. తొండ చర్మాన్ని స్వర పేటికపై బిగిస్తారు. 12 నుంచి 16 అంగుళాల వెదురును ఒక చివర కొబ్బరి చిప్పను మేకుతో బిగిస్తారు. వెదురుకు రెండవ చివరన రెండు మేకులు త్రిప్పడానికి వీలుగా వుంటాయి. స్వర పేటికపైన సన్నని కొయ్య ముక్కను వుంచి, దానిపై నుండి రెండు తీగలను మేకులకు కట్టి ఉంచుతారు. మేకులను త్రిప్పడం ద్వారా తీగబిగుతును ఎక్కువ చేయవచ్చు. విల్లువలె తయారు చేసిన కమానుతో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు.

పారా:
సామూహిక నృత్యం

ఇది మద్దెల వంటి పొడవు మాత్రం రెండు అడుగులు వుంటుంది. దీనికి కూడ రెండు వైపులా మేక చర్మాన్నే బిగించి వుంచుతారు. రెండు వైపులా వ్రేళ్ళతోనే వాయించు తారు. అదిలాబాదు జిల్లా రాజా గోండులు ఈ వాయిద్యాన్ని ఉపయోగిస్తారు.