తెలుగువారి జానపద కళారూపాలు/శివమెత్తించే వీరశైవుల వీరభద్ర విన్యాసాలు

వికీసోర్స్ నుండి

శివమెత్తించే వీరశైవుల వీరభద్ర విన్యాసాలు


ఆంధ్రదేశంలో వీర శైవ సంప్రాదాయం వారు ఎక్కువ మంది ఈ వీర భద్ర వినాస నృత్యాలు చేస్తూ వుంటారు. ఈ విధానాన్ని వీర భద్ర పళ్ళెం పట్టట మంటారు. అంతే కాక శైవ మత సంప్రదాయంగల పద్మసాలీల దేవుడైన

వీరావేశంతో నారసాలు పొడుచుకోవడం
భావనాఋషి వుత్సవాలలోనూ,  విశ్వ బ్రాహ్మణుల వీర భద్ర స్వామి వుత్సవాలలోనూ,  ఈ నృత్య విన్యాసము జరుగుతూ వుంటుంది. 
ఖడ్గ విన్యాసం:

పైన వివరించిన వుత్సవాలలోనే గాక పెద్ద పెద్ద జాతర్ల సందర్భాలలో కూడ ఈ వీరభద్ర నృత్య విన్యాసం జరుగుతూ వుంటుంది. ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి ఉక్కిరి బిక్కిరి అయ్యేలాగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద _ అబబబబ _ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని దక్షుని దండకం ఈ విధంగా ప్రారంభిస్తాడు.

దక్షయజ్ఞ దండకం:

దక్షుండు యజ్ఞంబు ..................॥శరభ॥
తలపెట్ట నందులో దశ్శరభ..................॥శరభ॥
బ్రహ్మదేవుని గుండె ......................॥శరభ॥
భగ్గుమనియె శరభ ......... ............॥శరభ॥
వింటిరా సురులార శరభ
విన్నపం బొక్కటి శరభ
కలగంటి ఈ రాత్రి శరభ
కల్లగాను కల్లగానూ అగగగగ, శరభ అశ్శరభ

 మహిమీద పార్వతి శరభ
మాయమై పోయెనని శరభ
పరమేశ్వరుని హోమము శరభ
భగ్గుమనియ శరభ

 చెమట బట్టగ తీసి శరభ
చట్రాతిపై వేసి శరభ
వరేశ్వరుడు బుట్టె శరభ
విశ్వమునకు శరభ
పట పటా బ్రహ్మాండ వలము లన్నియు .........॥శరభ॥
కొట్టె గద దక్షుని......... ॥శరభ॥
తోలెగ దరివుల ......... ॥శరభ॥

దండించ వైరుడు......... ॥శరభ॥
నీమిండ డనగ......... ॥శరభ॥
మొక్క జొచ్చితిమి గదా మోసపోయితిని......... ॥శరభ॥
వెన్ను గల అన్నకు శర......... ॥శరభ॥
ఏనుగు తల బుట్టెనని........... ॥శరభ॥
గుడి మీద తాతకు........... . ॥శరభ॥
గొఱ్ఱె తల ఇంపాయె............ . ॥శరభ॥
పరుల గుణవిహార......... ... .॥శరభ॥
కోసూరి వీరభద్ర................ . ॥శరభ॥
అదదద, అగగగ, అదదద, అగగగ
శరభ, దశ్శరభ, అశ్శరభ, శరభ, శరభ

అంటూ ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరా వేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతనుగాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్య గాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానాహంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ వుత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా వూరంతా ఊరేగుతూ ఒక్కొక్క మజలీ వద్దా... అంటే నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా వుత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు.

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాస ముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నాలుకపై నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా వుత్తేజంగానూ, భయంకరం గాను వుంటుండి. ఖడ్గ నృత్యంఅయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచు కుంటాడు. నారసాలంటే రెండు మూడు రకాలుగా వుంటాయి.

ఏకనారసం _ కంటి నారసం _ గొంతు నారసం _ శిరసు నారసం_ శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా వుండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. వుద్రేకంలో వున్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతి కిస్తారు. నృత్య కారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగి నట్టు వీరాధి వీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

రాయలసీమలో:

ముఖ్యంగా రాయల సీమలో తమతమ ఇలవేల్పుల మీద చదివే పద్యాలకు ఖడ్గాలని అంటారు. వీరభద్ర ఖడ్గాలు, చౌడమ్మ ఖడ్గాలూ మొదలైనది. ముఖ్యంగా వైశ్యులు కన్యకా పరమేశ్వరినీ, సాలెవారు చౌడేశ్వరినీ, విశ్వబ్రాహ్మణులు కాళికా శక్తినీ, కురుబలు,కురుములు వీరభద్రుని కొలుస్తారు.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం చదువుతాడు.

చౌడమ్మ ఖడ్గం:

చౌడమ్మ ఖడ్గం రాయల సీమలో ప్రచారంలో వున్నదనీ, దీనిని పూరించిన వారు, బీరే బాలప్ప, తొగట వీరక్షత్రియ అనీ, చేనేత వృత్తి వారనీ, అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలుకా, పెద కాకుంట్ల గ్రామస్థులనీ తూమాటి దోణప్ప గారు నివేదిస్తున్నారు.

ఆహహా శాంభవే..... ఆహహా శాంభవే
వీభూతి ఒక చేత ... వీరంగ మొక చేత
ఘన ఘనా గంటలే ... ఘల్లుమనగా
చక్రంబు త్రిప్పితే భూచక్ర గొడుగులు
చుక్కలన్నీ గూడి ప్రగ్గడిల్లా
అహహా నీమాయలు నెలకొంటినే నైక తాంబా
సరస సద్గుణ నికురాంబ శ్రీ శారదాంబా.

అంటూ స్త్రోత్రాలను చేస్తారు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, దీనిలో భక్తి భావమూ, శైవమత ప్రచారమూ ఇమిడి వున్నాయి.

ఇలాంటి ఖడ్గ నృత్యాలు దక్షిణ దేశంలో తిరువాన్ కూరులో వున్నాయి. ఈ నృత్యాన్ని "పాతాయం" అని పిలుస్తారు