తెలుగువారి జానపద కళారూపాలు/వీరశైవపు వీరముష్ఠి వారు
వీరశైవపు వీరముష్ఠి వారు
ఈ నాటికీ బిక్షుకులై తిరిగే వీరముష్ఠి వారు ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నారు. ఏనాడు వీరశైవం ఏయే ప్రాంతాల్లో విజృంభించిందో ఆనాటి నుంచీ ఈ వీరముష్టులు ప్రచారలో వున్నారు.
వీరముష్టి, వీరభట, భద్ర పాద మొదలైన పేర్లన్నీ వీర ముష్టులకు చెందుతాయి. ముష్టి అంటే పిడికిలి అనీ, వీరులైన యోధులనీ, వీరభిక్షుకులనీ, వీరశైవ భిక్షుకులనీ, వీరముష్టి వారికి అర్థం చెప్పు వచ్చునని డా॥ బి. రామరాజు గారు వారి జానపద గేయ సాహిత్యంలో ఉదహరించారు.
వీరు వీరశైవ వాఙ్మయానికి సంబంధించిన గేయాలనూ, శైవభక్తుల గాధలనూ, కన్యకా పరమేశ్వరీ కథలనూ చెపుతూ వుంటారు. వీరు ముఖ్యంగా శైవభక్తులైన జంగాలనూ, వైశ్యులనూ ఎక్కువగా యాచిస్తారు. కాని ఈనాడు వారు అక్కడక్కడా వున్న కొద్ది మంది అందరినీ యాచిస్తున్నారు.
ఒకప్పుడు వీరు ఎవరినైతే యాచించే వారో వారే వీరిని మక్కువగా ఆదరించే వారు.
ముఖ్యంగా వీరు వైశ్యులనే ఎందుకు యాచిస్తారో రామరాజు గారొక ఇతిహాసాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు.
వీర ముష్టులు వైశ్యులకు ఇలవేల్పైన కన్యకను, రాజరాజు బలాత్కరించి పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సైన్యంలో నున్న వీరముష్టులూ, ఆయన పల్లకీని మోసే బోయలుగా వున్న వీరముష్టులు కావాలని కొంత ఆలస్యం చేయటం వల్ల కన్యకా, ఆమె వంశీయులూ అగ్ని గుండంలో ఆహుతి అవటానికి అవకాశం చిక్కీందనీ, అలా ఆలస్యమే చేయకపోయినట్లైతే, కన్యకను రాజరాజు చెరబట్టి వుండే వాడనీ, ఈ విధాన వీరముష్టులు వైశ్య జాతికి మహోపకారం చేశారనీ, ఈ కారణాన వైశ్యులు వీరముష్టులను గౌరవించి వారికి పారితోషికములు ఇస్తారనీ ఐతిహ్యం.
వీరముష్టులు గానం చేసే పాటలన్నీ కన్యకా ఇతి వృత్తానికే సంబంధించిన వని "అయ్యల రాజు నారాయణా మాత్యుడు" వీర ముష్టులను గురించి ఆయా రచనలో ఉదహరించాడు.
వీరముష్టుల యొక్క జన్మ వృత్తాంతం గురించి ఒక వింత కథ ప్రదారంలో వున్నట్లు కూడ రామరాజు గారు వివారిస్తున్నారు. ఎప్పుడో వీరభద్రుడు దక్షాధ్వర, ధ్వంసము చేసే సమయంలో, వీరభద్రుని శరీరంనుంచి స్రవించిన చెమట నుండి ఈ జాతివారు జన్మించారట. వీరభద్ర, భిక్షుకు, విభూతి పిండాల వంటి గోత్ర నామాలు వీరశైవాన్ని చెపుతూ వున్నాయి. వీరిలో కొంత మంది జంగాలుగా మారారు. వీరముష్టులకు గురువులు ఆరాధ్య బ్రాహ్మణులని చెపుతారు. వీరముష్టులు మారెమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ మొదలైన గ్రామదేవతలను కూడ పూజిస్తారు.
ముఖ్యంగా వీరు గంభీర ధ్వని నిచ్చే జేగంట శంఖం, తప్పెటా వాయిస్తూ భిక్షమెత్తుతారు. వీరముష్టుల్లో ఆవేశ పరులైన కొందరు బుగ్గలకు నారసాలను పొడుచుకోవడం, నాలుకల్ని తెగకోసుకోవడం మొదలైన భయంకరమైన ఆవేశాన్ని ప్రదర్శి స్తారు. లింగ ధారులు తప్ప మిగిలిన వారందరూ మద్య మాంసాలను ఆరగిస్తారు. వీరు గడ్డాలనూ, మీసాలనూ పెంచుతారు, క్షురకర్మ చేయరు, వీరముష్టులైన వీరు యాచిస్తే, వీరి స్త్రీలు, చాపలు అల్లడం పచ్చ బొట్లు పొడవడం మొదలైన పనులు చేస్తారు. బ్రాహ్మణులు, వైశ్యులు, జంగాలు, బలిజలు మొదలైన వారి ఇళ్ళలో తప్పా వీరు మరెక్కడా భోజనం చేయరు.
ఆవేశపరులైన వీరముష్టులు వీరావేశంతో కర్రసాములు కూడా చేస్తూ వుంటారు. తాషామర్పా వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేస్తూ, కర్రసాములో ఆరి తేరిన ఇరువురు ఇరు ప్రక్కల నుంచి కర్రలను చేత బూని గిర గిరా త్రిప్పుతూ అమిత పౌరుషంతో ఒకరి మీదికి మరొకరు కర్రను విసురుతూ ఆ కర్ర విసురుకు రెండవ వ్వక్తి తప్పుకుని ఎదురు దెబ్బ తీస్తూ, వాయిద్యానికి అనుగుణంగా, వాయిద్య వేగంతో పాటు కర్ర త్రిప్పుతూ, తమతమ ప్రజ్ఞలను చూపిస్తూ, చూపరులను
వుత్తేజపర్చి, వారిలో ఉద్రేకాన్ని కలిగిస్తారు. పల్లెలలో సహజంగా జరిగే ఉత్సవాలలో ఈ వీరముష్టులను ప్రదర్శనాలలో ప్రవేశ పెడతారు. వీరు కర్రసాములో, ఎంతటి అసాధ్యులో, కత్తిసాములోనూ అంత అసాధ్యులే.