Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/గడగడ లాడించే కాటమరాజు కొమ్ము కథలు

వికీసోర్స్ నుండి

గడగడ లాడించే కాటమరాజు కొమ్ము కథలు

కాటమరాజు కథలను ఎక్కువగా కొమ్ములవారు పాడుతూ వుంటారనీ, వీరు మాదిగలలో ఒక తెగ అనీ, కథా స్థానమైన కనిగిరి సీమలో కొమ్ములవారే కాక, గొల్లలలో పూజ గొల్లలు కూడ ఈ కథను పాడుతున్నారనీ, అంతే గాక కందుకూరు తాలూకాలో పికిలివారనే వారు పాడుతున్నారని, వీరు కూడ గొల్లలేననీ,

అలాగే విశాఖపట్టణ ప్రాంతాలలో పొడపోతుల వారనే వారు, కాటమరాజు కథలను గానం చేస్తున్నారనీ వీరి కులమేదో తెలియదనీ.

అలాగే రాయలసీమ ప్రాంతంలో భట్టువారు (మాదిగలు) ఎఱ్ఱగొల్లలూ, తెలంగాణాలో ఎఱ్ఱగొల్లలూ, మందుచ్చువారూ, బీరన్నల వారూ, యాదవ కథలను చెపుతూ వుంటారనీ, కనిగిరి సీమలో కాటమరాజు కథలను పాడే పూజ గొల్లలను యాచకులు అని పిలుస్తూ వుంటారనీ వీరినే తెలంగాణాలో తెరచీరభక్తులని పిలుస్తారనీ పంపాద్రి కథను రచించిన మల్లయ్య కవి, కృత్యవతరణికలో తెరచీర భక్తులను స్మరించాడనీ కాటమరాజు కథల గ్రంథంలో 28 వ సూచికలో డా॥ తంగిరాల సుబ్బారావు, డా॥ చన్నప్రగడ తిరుపతిరావు గార్లు ఉదహరించారు.

కాటమరాజు కథా ప్రసక్తి:

కాటమరాజు కథలు, కథా ప్రసక్తి, శాసన ప్రమాణంగావుంది. కాటమరాజుకు నల్లసిద్దికీ జరిగిన యుద్ధాన్ని గూర్చి మెకన్ జి స్థానిక చరిత్రలు పద్దెనిమిదవ సంపుటంలో విపులంగా వుంది. కాటమరాజుకు పెద్ద గోవులమంద వుంది. ఆ మందను మేపటానికి పాలకొండ, నల్లమల అడవుల్లో మేతకు తోలుకు పోయేవారు. వర్షాలు లేక పోవటం వల్ల మేత లేక నెల్లూరు మండలానికి వచ్చి నల్లసిద్ధి చోళ మహారాజునకు పుల్లరిగా తమ మందలోని కోడె దూడల్ని ఇచ్చేటట్లు స్థానిక చరిత్రలో వుంది.

వీరికీ యుద్ధం జరగటానికి మూడు కారణాలను వివరించారు.

1. నెల్లూరు సీమలో కూడ మేత కరువు రావటం వల్ల నెల్లూరు రాజ్యంలో పంట పొలాన్నీ కూడ మేప సాగాడు. ఇది నల్లసిద్ధికి కోప కారణమైంది.

2. అడవుల్లో వున్న క్రూర మృగాల్ని యాదవులు వేటాడటం వల్లను మందల్ని విస్తారంగా ఆడవుల్లో ప్రవేశపెట్టటం వల్ల మృగసంతతి నశించింది. అది కూడ ద్వేషానికి కారణమైంది.

3. ఇది కాక మనుమసిద్ధి రాజు ఉంపుడు కత్తె పెంపుడు చిలుకను కాటమరాజు తండ్రి పోలుర్రాజు బాణంతో కొట్టి చంపటం వల్ల సిద్ధి తన మనుషులతో కాటమరాజు ఆవుల మందల్ని చంపించాడు. దానితో కాటమరాజు పుల్లరివ్వటం మానేశాడు. అందువల్ల ఇరువురి మధ్య యుద్ధం జరిగింది.

కొమ్మువారు:

కొమ్ముల వారనే వారు గంగ దర్శనానికి సంబంధించిన మాదిగలు. వీరు తాము జాంబవంతుని తెగకు సంబంధించిన వారమని చెప్పుకుంటూ వుంటారు. వీరినే చిత్తూరు జిల్లాలో బట్టువారని పిలుస్తారు.

కొమ్ముల వారు యాదవుల్ని యాచిస్తారు. వారి గోత్రాలను చెపుతూ కాటమరాజు కథల్నీ, విష్ణు భాగవతమనే నామాంతరం గల కంసుడు కథను వీరు చెపుతారు. వీరి ప్రదర్శనలో "వీరణాన్నీ" "తిత్తినీ" "తాళాల్నీ" "కొమ్ముల్నీ" ఉపయోగిస్తారు. కాటమరాజుకు సంబంధించిన కథలన్నీ వీరి దగ్గర తాళపత్ర గ్రంథరూపంలోనూ కంఠస్థంగానూ వున్నాయి.

యాదవులకు గంగ ఆరాధ్య దైవం. గంగ జాతర్లలో కొమ్ములను గావుపట్టి ఊదుతారు. తానకముల్ని పాడటం, కాటమరాజు కథలను చెపుతూ వుంటారు.

కాటమరాజు సైన్యంలో ప్రత్యేకంగా గోసంగిదళం వున్నట్లు వీర గాథలలో చెప్పబడింది. దాని నాయకుడు బీరినీడు. ఈతను మాతంగి వీరుడు. ఈతని సంగతి వారే ఆ నాటినుండి ఈ నాటి వరకూ ఈ గాథలను గానం చేస్తున్నారనీ తంగిరాల వారి ఊహ; వారినే ఈనాడు కొమ్ముల వారని పిలుస్తున్నారు.

ఎఱ్ఱగడ్డ పాటి పోట్లాట తరువాత "భక్తిరన్న" బీరి నీడు సంతతి వారైన మాదిగలను పిలిచి యాదవ కథల్ని లోకంలో వ్వాప్తి చేయటానికి అనుమతి ఇచ్చాడనీ చెపుతారు.

కొమ్ములవారి ప్రదర్శన:

కొమ్ముల వారు ఏ యాదవుని ఇంటి ముందు కథ చెపుతారో, ఆ యాదవుడు వీరిని సన్మానించి తీరాలి. ఒక వేళ వారు అలా చేయక పోతే ఆతని ఇంటి ముందు ఒక గుడారాన్ని వేస్తారట. అలా చేయటం భక్తిరన్న శాసన మేనట. గుడారాన్ని, వేసినా, కొమ్ముల వారిని సన్మాని చక పోతే, ఆ గుడారాన్ని భక్తిరన్న కూల్చి వేయమన్నాడు. అలా గుడారాన్ని కూల్చటం వల్ల ఆ యింట్లో వున్న యాదవులందరూ నశించి పోతారని భక్తిరన్న శాపమట. అందువల్ల యాదవులు కొమ్ముల వారిని అమిత భక్తితో ఆదరిస్తారట.

కాటమరాజు కథలు పాడే వారికి అచార ప్రకారం ముఖ్యమైన ఆరు వస్తువులుండాలి. అవి గుడారు, కొమ్ము, "వీరణం", "బొల్లావూ","వీరద్రాడు", "బసవ దేవుడు" మొదలైనవి.

గుడారు:

ఏ ప్రదేశంలో కథను చెప్పాలనుకున్నారో ఆ ప్రదేశంలో పెద్దగుడారం వేస్తారు. ఆ గుడారం లోపల గోడలకు యాదవుల కైవశమైన గంగ,కాటమరాజు కథలోని ప్రధాన ఘట్టాలను రంగుల్లో చిత్రించబడిన పెద్ద పెద్ద గుడ్డలను అతికిస్తారు. ఈ గుడ్డలకు తెరచీరలని పేరు. ఈ తెరచీరలను బట్టే ఈ గాధాకారులకు తెరచీర భక్తులని పేరు.

కొమ్ము:

కొమ్ము అంటే ఇత్తడితో చేయబడిన కొమ్ము లాగా వంకరగా తిరిగి వుండే గొట్టాన్ని కొమ్ము అని పిలుస్తారు. కథను ప్రారంభించే ముందూ,

గోత్రాలను చెప్పే ముందూ, తానకములు పాడుతూ వున్నప్పుడూ ఈ కొమ్ముల్ని వుత్తేజంతో ఊదుతారు. ఈ కొమ్ముల ధ్వని శంఖారావం మాదిరిగా వుద్రేకాన్ని కలిగిస్తుంది. కొమ్ముల శబ్ధం వూరందరికీ వినబడుతుంది, ఈ నాదాన్ని విన్న వెంటనే ఎక్కడివారు అక్కడికి చేరుకుంటారు. కొమ్ము ధ్వని పిలుపు లాంటిది . కొమ్ములను ఊదే వారవటం వల్ల వీరిని కొమ్ముల వారని పిలవటం అలవాటై పోయింది.

వీరణాలు:

అంకమ్మ కథల్లోనూ, పల్నాటి వీర కథలలోనూ ఉపయోగించే పంబజోడు వంటివే ఈ వీరణాలు. ఇవి రెండుగా వుంటాయి. ఒకటి వేప చెక్కతో గాని, రేల చెక్కతో గాని చేయబడతాయి. రెండవది ఇత్తడితో తయారు చేస్తారు. రెంటి యొక్క శబ్దంలోనూ వైవిధ్యముంటుంది. కొయ్యతో చేయబడిన వీరణ శబ్దానికీ, ఇత్తడితో చేయబడిన శబ్దానికి వ్వతాసముండి, రెం‍డు శబ్దాల కలయిక,కథకు సరి జోడుగా వుంటుంది.

బొల్లావు:

ఎఱ్ఱగడ్డపాటి పోట్లాటలో పాల్గొన్న ఒంటి కొమ్ము బొల్లావు యొక్క బొమ్మ ఇది. దీనిని చెక్కతో గానీ, ఇత్తడితో గానీ తయారు చేస్తారు. తానకములు పాడునప్పుడు దీనిని నెత్తిపై పెట్టుకుని శివమెత్తినట్లు గంతులు వేస్తారు.

వీరద్రాడు:

వీరద్రాడు అంటే వీరత్రాడు. తిరుపతమ్మ దేవర పెట్టి ముందు దేవర పాత్ర ధారి తాడును ఝుళిపించటం మనకు తెలుసు. ఈ వీరద్రాడు పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు జరిపిన శివ నందుల కోట యుద్ధంలో యాదవు లతనికి తోడ్పడ్డారట. అందువల్ల యాదవులకు శివ నందుల కోటలో లభించిన గుడారు, వీర త్రాళ్ళు, గంగ, పోతురాజుల విగ్రహాలు బహూకరించారట. తానకాలు పాడేటప్పుడు, శివమెత్తి గంతులు వేసే వారు. వీర త్రాళ్ళతో కాళ్ళమీదా, చేతుల మీదా కొట్టుకుంటారు. ఈ వీర త్రాళ్ళు మూడు ముళ్ళతో వుండే బారిడేసి పగ్గాలు.

బసవ దేవుడు:

ఎఱ్ఱగడ్డపాటి పోరులో యాదవులు ఒరిగారనే వార్తను దొనకొండకు తెచ్చిన వాడు బసవదేవుడు. ఈ బసవదేవుని విగ్రహాన్ని కూడ గాధాకారులు దగ్గరుంచుకుని పూజిస్తారు.

కథకుల వేష ధారణ:

కాటమరాజు కథలను గానం చేసేటప్పుడు వీరణాలనే కాక, వారి శ్రుతి కొరకు తోలు తిత్తిని, లయకు తాళాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధాన కథకుడు నిలువు టంగీ పన్నెండు మూరల తలపాగా, కాళ్ళకు గజ్జెలు, నడుముకు నడికట్టు, చేతిలో పిడి గుడ్డ మాత్రం వుంటాయి. గంగతర్కం పాడేటప్పుడు, ఒకరు గంగ వేషాన్నీ, పరి ఒకరు కాటమరాజు వేషాన్నీ ధరించి ఎదురెదురుగా నిలబడి, చేతిలో కత్తి పట్టుకుని, ఆ కత్తి చివర ఒక నిమ్మ పండును గుచ్చి కాళ్ళలు గజ్జెలు కట్టుకుని, గంతులు వేస్తూ, కత్తిని త్రిప్పుతూ, రెండు పాత్రలూ వాదించుకుంటూ నటిస్తారు.

ప్రధాన కథకుడుతో పాటు వంతలు ముగ్గురుంటారు. వీరిలో ఒకడు కత్తిని పడతాడు. రెండవ వాడు వీరణాలను వాయిస్తాడు. మూడవాడు తాళం వేస్తాడు. ఈ ముగ్గురిలోనూ ఇద్దరు కథకు వంతగా ఆ కొడతారు. కాటమరాజు కథకులు పాడే పాట ఈ క్రింది విధంగా వుంటుంది.

గంగపాట:

గంగను కొలిచేరూ, ఏరువ
గంగను కొలిచేరూ
ఆకసాన సళ్ళాడు తురగా
గంగను కొలిచేరు, పాలేటి
గంగను కొలిచేరు.

అలాగే బొల్లావు పాట:

కనక రాళ్ళ బోటి మీద
కనక వర్షమూ ఆవుకు
కనక వర్షమూ.
ఉద్దాగేరి ముద్దాపసుపు
ఆవుకొచ్చెనూ
బొల్లావు కొచ్చెను.

అలాగే పాపనూక సువ్వి పాట.

సువ్వి సువ్వన్నలార, సువ్వన్నలార
సువ్వన్న పాపమ్మ వేయన్న పాడు
మచ్చావతారుడే మా ఆవులన్న
హెచ్చుగా దక్షిణాది ఆవుల మేపు
పచ్చొడ్లు నేదంచి పాలెసరబెట్టి

పాయకానే జూతు పాలేటి త్రోవ
కట్ట మీదంగళ్ళు గంగ రేగుల్లు
ఘనమైన గుడి వాడు గంగ పుట్టిల్లు.

ఇలా సాగుతుంది పాట. మనుమసిద్ధి రాజుకో, నల్లసిద్ధి రాజుకో, వారి రాజ్యంలో కాటమరాజు అవుల మందల్ని మేపుకున్నందుకు పుల్లరి

ఇవ్వక పోవటం వల్ల చెలరేగిన వివాదం యుద్ధంగా మారింది. ఆ యుద్ధంలో అటు రాజులూ, ఇటు యాదవ సామంతరాజులూ పాల్గొని ఎందరో వీర మరణం చెందారు. వారి యొక్క కథలు 32 వెలువడ్డాయి. వాటి సారాంశమే ఈ చారిత్ర. అయితే కాటమరాజుకీ, నెల్లూరు మనుమసిద్ధికీ యుద్దం జరిగినట్లు ముప్పై రెందు కథలలోనూ ఏ ఒక్క కథలోనూ మనుమసిద్ధి ప్రసక్తి లేదు.

అయితే కాటమరాజుతో పోరిన రాజు నల్లసిద్ధి రాజు అతని తమ్ములు, పాపసిద్ధి, ఎఱ్ఱసిద్ధి,కొండికసిద్ధి, కొమరసిద్ధి మొదలైన రాజులని వీర గాథలలో వుంది. కాటమరాజుతో పోరాడింది మనుమసిద్ధితోనో నల్లసిద్ధితోనో అనే విషయం చారిత్రికులు నిర్ణయించాలి.

పొడపోతుల వారు:

విశాఖపట్టణ ప్రాంతంలో యాదవులకు గురువులుగా చెప్పబడే ఒక ప్రత్యేకమైన తెగ వుంది. వీరిని పొడపోతులవారు అని పిలుస్తారు. వీరు కొమ్ములవారి వంటి వారేమో తెలియదు. కాని యాదవ కులానికి చెందిన వారు మాత్రం కారు, యాజకులు గాను, గురువులు గాను

వున్న వీరిని యాదవులు ఎక్కువగా గౌరవిస్తారు. ఈ పొడపోతులవారు, యాదవులకు గోత్రాలు చెప్పి, కాటమరాజు కథల్ని పాడతారు. ఈ పొడపోతుల వారు తూర్పు గోదావరి మండలంలో వున్నారు.