తెలుగువారి జానపద కళారూపాలు/దేవతల కొలుపుల సంబరాలు
దేవతల కొలుపుల సంబరాలు
ఈనాడు దేవతల కొలుపులు అన్ని గ్రామాల్లోనూ అంతగా జరగకపోయినా అక్కడక్కడ వెనుకబడిన ప్రాంతాల్లో దేవతల మొక్కు బడులు, జాతర్లు సంబరాలు జరుగుతూ వుంటాయి. వీటిని ఉగాది, సంక్రాంతి మొదలైన పండుక దినాల్లో జరుపుతారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు అర్పిస్తారు. గరగలు ఘటాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఇంటింటికీ త్రిప్పుతారు. డప్పుల మీద సప్తకాళ వాయిద్యాన్ని మాదిగలు వాయిస్తూ వుంటే, గరగలను ఎత్తుకున్న చాకళ్ళు (రజకులు) లయబద్ధమైన చిందులతో, తన్మయత్వంతో నృత్యం చేస్తారు. ఆ సందర్భంలో వాయించే డప్పు వాయిద్యం ఈ విధంగా సాగుదుతుంది.
- తాళం వరుసలు:
త ఝుణక, ఝుణక, ఝుణకా
తద్దివిత - ధివిత, తకతా
కితతక - కిటతక - కిటతక
తాం - ధోం - తక్కిట కిటతక
ఝంతరి కిటతక - ధుంతరి కిట తక - ధుంతరికిటతక
అని డప్పుల మీద పలికిస్తూ, మధుర భావాలు ఒలికిస్తూ, భక్తి తన్మయత్వంతో ప్రజలను ముగ్దుల్ని చేస్తూ, వారి హృదయాలను రాగ రంజితం చేస్తూ వుంటారని ఒక సందర్భంలో కీ॥శే॥ నేదునూరి గంగాధరంగా రన్నారు.
- నమ్మకాల మొక్కుబడులు:
గ్రామాల్లో విపరీతంగా వచ్చే కలరా మశూచికం, గొడ్ల జబ్బులకు, పంటల నాశనానికి కారణం, అమ్మవార్లనీ, అమ్మవార్లకు మ్రొక్కు తీర్చకపోతే అశాంతి అనీ, మ్రొక్కుబడి తీరిస్తే పాడి పంటలు గ్రామం సుభిక్షంగా వుంటుందనీ, గ్రామస్తులు నమ్మకం కొద్దీ మ్రొక్కుతూ వుంటారు. ఆ మ్రొక్కుబడులు తీర్చడానికే, అమ్మవారైన గ్రామ దేవతను తృప్తి పరచడానికే, ఈ జాతర్లూ, కొలువులూ, మ్రొక్కుబడులూ కోలాహలంగా చేస్తూవుంటారు. ఇలా మ్రొక్కుబడులను తీరిస్తే గ్రామ పొలిమేరల్లో అమ్మవారు గ్రామ రక్షణ కోసం కాపలా కాస్తుందని గ్రామస్తుల గాఢ నమ్మకం. ఆ నమ్మకం తోనే అమ్మవారి విగ్రహాలను నెలకొల్పి, నిత్యమూ పూజిస్తూ వుంటారు. కాని ఊరి ప్రజలందరూ ఆపద వచ్చినప్పుడు మాత్రమే పొలిమేరల్లో వున్న అమ్మవారికి జాతరచేస్తారు. అమ్మవారి పూజారి అనూచానంగా వస్తున్న ఆచారం ప్రకారం, ఆ రోజంతా ఉపవాసం చేసి, పొలిమేర గంగాణమ్మను తెచ్చి ప్రాతిష్ట చేస్తాడు. ఆ సందర్భంలో అమ్మవార్ల కథలను ప్రచారం చేసే పంబల వారు ఈ విధంగా పాటలు పాడుతారు.
- పంబల వారి పాటలు:
గుమ్మడి పూవొప్పునే గౌరమ్మ
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పూవు మీద
వాలిన చిలకలు వైకో గబ్బలు
ఘంట చిరిమువ్వల గైరమ్మ - నీ సుతుడేడే
వాడిన పువ్వులు ఒడిలో బోసుక
వాడలు వెతికితే లేడమ్మా
సరి, మేడలు వెతికిన రాడమ్మా॥
అంటూ, ముత్తైదువులు పసుపు, కుంకుమలను పళ్ళెములలో నుంచి సంప్రదాయ బద్ధంగా వస్తున్న చేతులను ఊపుకుంటూ చిరు నృత్యం చేస్తూ వస్తారు.
అమ్మవారిని పూజించి, ఊరిలో ఊరేగించి, తిరి పొలిమేరకు పంపే రోజున పెద్ద జాతర చేస్తారు. ఈ జాతర సమయంలో ఒక పందిని భూమిలో పూడుస్తారు; దాని మీదగా గ్రామంలో వున్న పశువుల నన్నిటినీ తోలుతారు. వంశాచారంగా వస్తున్న మాదిగ వాడు, బొద్దు మీసంతో, విరబోసిన తలస్తో, వికటాట్టహాసంచేస్తూ కళ్ళెఱ్ఱ చేసి వంటి కంతా పసుపు పూసుకుని పదునైన పెద్ద ఖడ్గాన్ని చేత బట్టి ఎనుబోతు మెడ క్రింద పంగల కఱ్ఱను పోటీ గా పెట్టి,ఈ విధంగా ప్రారంభిస్తాడు.
- పాట ప్రారంభం:
ఓరి, ఆది మూలము బ్రహ్మ
విష్ణు విగ్రహము మీద, ఆనంద మాడు వాడెవ్వడురా.............. ॥ఓరి॥
అఖిల దేవతలకు అభమయిచ్చిన వాడు
అలనాడు గోపంగి నేనేనురా, లింగతాలిల్లే తాలిల్లే..................... ॥ఓరి॥
మింటి దిక్కున జూచి, మీసంబు వడిసి
ఒంటిదున్నా తల నరికేనురా
కొంకాక చిందూలు - గోవింద గంతూలు
శంకలేకా బలి చల్లీతిరా - లింగతాలిల్లే తాలిల్లే.............................. ॥ఓరి॥
అండాండమను బిరుదు దాసాది నాపేరు
పిండాండమను బిరుదు కాసె పోసి
అండ పిండ బ్రహ్మాండముల కెల్లను
మెండుండు దైబాల - మెండాడు రా లింగ...... తాలెల్లె తాలిల్లె ...... ॥ఓరి॥
అని భీకరంగా పాడుతూ, చిందులూ వేస్తూ ఒక్క వ్రేటుతో ఆ దున్నపోతు మెడను నరికి వేస్తాడు. ఆ రక్తంతో ఆన్నాన్ని తడిపి, కుంభరాసిపోస్తారు. రక్త వర్ణమైన ఆ కుంభాన్ని ఒక తట్టలోకి ఎత్తి, దానిపై నరికిన దున్న పోతు తలను పెట్టి, తట్టను వెట్టి వాడి తల మీద పెట్టి ఘటాల వాడు డప్పుల వాయిద్యాన్న నుసరించి గణాచారిలా ఆవేశంతో
గంతులు వేస్తూ భీకరంగా కేకలు వేస్తూ గ్రామ పొలిమేరల్లో నాలుగు దిక్కులు పొలిగంగను విడిచి రక్తపు అన్నాన్ని వెదజల్లుతారు. గ్రామ దేవతలను పొలి మేరలో పెడతారు.