తెలుగువారి జానపద కళారూపాలు/వీథి నలంకరించిన వీథి నాటకం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వీథి నలంకరించిన వీథి నాటకం

ఈ నాటకాలంటే పురాతన కాలంనుంచీ ప్రజా సామాన్యం అభిమానాన్ని చూరగొన్న నాటకాలు ముఖ్యంగా దేశి నాటక సంప్రదాయాలు, చాలవరకు శివకవుల ఆధ్వర్యంలోనే వర్థిల్లాయి. కారణం శైవమతం విజృంభించిన రోజుల్లో శైవమత సంప్రదాయలను ప్రజా సామాన్యానికి విశద పరచడానికి అనేక విధాలయిన ప్రచార సాధనాలను ఉపయోగించారు. శివకవులే అటువంటి రూపకాలను వ్రాయడము వారే వాటిని వ్వాప్తిలోకి తేవడం వల్ల దేసి సంప్రదాయపు కళాఖండాలన్నీ శైవ మతస్థుల సొమ్మని చెప్పవచ్చు.

పంక్తి బాహ్యులు:

ఆర్య సంప్రదాయ ప్రకారం నటులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటి వారికి సంఘంలో గౌరవ మరాదలు శూన్యం. కాని శైవమతాన్ని అవలంబించిన వారుగాని, వివిధమైన జాతి మత విచక్షణ లేని జంగాలు గాని ఇటువంటి నిర్ణయాలను విధి నిషేధాజ్ఞలు పాటించ లేదు. అంతే కాక శైవమతాన్ని అవలంబించిన అగ్ర వర్ణములైన బ్రాహ్మణాది కులముల వారికి కూడ ఏవిధమైన పట్టింపులు లేకపోవడం వల్ల అగ్ర జాతుల వారందరూ దేశి నాటకాలను ప్రదర్శించారు. శైవ భక్తులైన జంగాలు మొదలైనవారు శివ సంబంధమైన నాటకాలను ప్రదర్శించారు. నాటకాలు ఆడటంలో జంగము వారు ముఖ్యులు. కృష్ణదేవరాయల కాలంలో వున్న బైచరాజు వేంకటనాథ కవి పంచతంత్రంలో కడివోని తెఱనాటకపుటూరి జంగాలు అని వ్రాశారు.

వీథి ప్రాముఖ్యం:

ఆనాడు వినోద కార్య క్రమాలన్నీ వీథుల్లోనే జరుపబడేవి. మహాభారతం, రామాయణం, గరుడపురాణం, బసవపౌరాణం మొదలైన పురాణ గాథలు చదవటం, తేటతెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్పడం ఆచారంగా వుండేది. గ్రామాలలో గ్రామ రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు మొదలైన వారు వీటిని నిర్వహించేవారు.

ఆనాడు తగూలు, పంచాయితీలు, అన్నీ వీథుల్లోనే జరిగేవి. ఆనాడు వీథికి అంతటి ప్రాముఖ్యముండేది. వీథుల్లోనే వీథి బడులు పెట్టి చదువు చెప్పే వారు. భాగవతులు మొదలైనవారు ఎవరు వచ్చినా నడివీథిలో కార్యక్రమం జరిగేది. వివాహానంతరం ఊరేగింపులు, మేజువాణీలు, దేవదాసి నృత్యాలు వీథుల్లోనె జరిగేవి జాతర్ల ఉత్సవాలూ, ఊరేగింపుళూ, ఆటపాటలూ అన్నీ వీథుల్లోనే జరిగేవి. వీథికి అంతటి ప్రాముక్యముండేది. వీథుల్లో నాటకాలు ఆడేవారు గనుక వీథి నాటకాలనీ ప్రదర్శించేవారిని వీథిభాగవతులని పిలిచేవారు.

రంగస్థలం:

క్రీ.శ. 16 వ శతాబ్దం నుండి ఆంధ్ర దేశంలో ఎక్కువగా యక్షగానాలు రచించ బడ్డాయి. ఆనాటికే దోర సముద్రపు నటులు, కూచి పూడి భాగవతులు, జంగాలు మొదలైన వారందరూ, వివిధ రకాలుగా వీథి నాటకాలను, తెరనాటకాలను, బయలాటలను ప్రతి వూరిలోనూ ప్రసిద్ధంగా ప్రదర్శించేవారు.

దేశి నాటకాలను విశేషంగా ప్రదర్శించారనీ యక్షగానాల్లో నాటకోచితమైన రచనా విధానాలు ప్రవేశ పెట్టబడ్డాయనీ, అందుకు తార్కాణం సుగ్రీవ విజయమేననీ, సుగ్రీవ విజయం నాటకంలో ఆయా పాత్రల్లో కొందరు పాటలు పాడేవారనీ, తక్కిన సంధి వచనాలు మొదలైనవి ఒకరిద్దరు సూత్రధారులు పఠించడం వల్లనూ సుగ్రీవ విజయం లాంటి యక్షగానం వీథి నాటకంగా ప్రదర్శించేవారనీ నేలటూరి వెంకట రమణయ్యగారి లాంటి చరిత్రకారులు సూచిస్తున్నారు.

తంజావూరు రాజులు:

17 వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో యక్షగానానికి కూచిపూడి కలాపంతో సంబంధం కలిగి ఆనాటినుంచీ యక్షగానాలలో వివిధ ప్రక్రియలను ప్రవేశ పెట్టారు.

18 వ శతాబ్దం నాటికి ఆంధ్రదేశపు యక్షగానాల మీద, కొన్నిటి పైన మార్గ నాటకాల ప్రభావం కూడ గోచరించింది.

17 వ శతాబ్దం ఉత్తరార్థంలో అధునిక నాటక రంగ ఛాయలు కూడ యక్షగానాలమీద బడడంతో వీథి నాటకరంగం విపరీతంగా అభివృద్ధి చెందింది. దీనితో అనాదిగా వస్తున్న యక్షాగాన ప్రదర్శనా ప్రక్రియ అభివృద్ధి సన్నగిల్లుతూ వచ్చింది.

17 వ శతాబ్దంలో తంజావూరులో యక్షగానాలకు రాజాశ్రయం లభించింది.

రాజులు రచించిన యక్షగానాలు:

రఘునాథనాయకుడు, విజయ రాఘవ నాయకుల కాలంలో నాటక శాలలు వెలిశాయి. ఈ రాజులు స్వయంగా యక్షగానాలనే రచించారు. కాని విజయ రాఘవ నాయకుని ఆస్థానంలో ఎక్కువ ప్రోత్సహింపబడి వీథినాటకం వైఖరిలో అభివృద్ధి చెందింది. ఉదాహరణకు విజయరాఘవుని "పూతనాపహరణం" "ప్రహ్లద చరిత్ర" మొదలైన వాటిలో రంగ ప్రయోగ సూచనలు అనేకం వున్నాయి. ప్రహ్లాద చరిత్రలో నాటకాలను గురించి, విదూషక ప్రశంసలూ వున్నాయి. దీనిని బట్టి, యక్షగానాలు రంగస్తల మెక్కి వీథినాటక వైఖరులను అందంగా సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు.

యక్షగానం కూచిపూడి భాగవతుల మొదలైన వీథి నాటక ప్రదర్శకుల దృష్టి నాకర్షించిన తరువాత అది వీథినాటకంగా వర్థిల్లి జక్కుల వారితోనే ఆ సంబంధం తెగిపోయింది.

నాటకీయత కలిగి వీథుల్లో ప్రదర్శించడం వల్ల, అటువంటి వాటికి వీథినాటకాలనే పేరు వచ్చింది. తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ ఈ వీథి నాటకాలకు "బయలాటలనీ" తెరుకూత్తు అని పిలువబడుతున్నాయి.

వీథి నాటకం లాక్షిణికుల నిర్వచనం:

గ్రామాల్లో సామాన్య ప్రజలకు వీథి నాటకాలు; బహురూపాలు మొదలైన తెర నాటకాలు ప్రదర్శించినట్లు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణలో ఉదహరింప బడింది.

జంగాలు తెరనాటకాలాడినట్లు "బైచరాజు వేంకటనాథ కవి పంచతంత్రం లోనూ, అయ్యల రాజు నారాయణకవి "హంస వింశతి" లోనూ ఉదాహరించారు.

వీధిని గురించి భరతుడు భరత నాట్య శాస్త్రంలో దేశి రూపకాల వర్ణనలో కథ కల్పితమనీ, రెండు మూడు పాత్రలు కలిగిన ఏకాంతమనీ, నటునికి శృంగారసం ప్రధానమనీ ప్రస్తావన, ముఖ నిర్వహణ సంధులు వుండాలనీ, గీత నృత్తాదులతో కూడిన ప్రశంసలు ఉండవచ్చుననీ బాణంవలె ఇది వర్ణన ప్రధానమనీ, వ్యాఖ్యానించారు.

ధనికుడు వీథి నాటకాన్ని గురించి, వీథులలోని మార్గపంక్తులవలె తీర్చబడిన వీధి అంగములు కలవని నిర్వచించారు. వీథి నాటక లక్షణాన్ని గూర్చి ప్రతాపరుద్రీయంలో బాణంవలె సంధ్యంగము లుండి కైసికీ వృత్తి శృంగార పరిపూర్ణత ఉద్ఘాత్యకాది వీథ్యంగములు కలిగి యుండుట వీధి లక్షణంగా జెప్పబడింది.

ప్రసిద్ధి చెందిన వీథినాటకాలు:

16 వ శతాబ్దంలోని తాయి కొండ నాటక సమాజంలో ఒక స్త్రీ పాత్రను స్త్రీయే ధరించి నట్లు తెలుస్తూ వుంది. తాయి కొండ నాటక సమాజం __యక్షగాన సమాజమని ఊహించటానికి అవకాశం లేదనీ, అది ఒక వీథి నాటకమే అయి వుంటుందనీ యస్వీ. జోగారావుగారు,తమ యక్షగాన వాఙ్మయంలో తెలియచేసారు.

18 వ శతాబ్దంలో కూచిమంచి జగ్గకవి చంద్రశసిరేఖా విలాపం__ అడు భాగవతుని జూడ గడ్డము మూలి నున్నగా గొరిగించుకొన్నావారు అనే దానిని బట్టీ, తురుగా రామకవి ఒక చాటువులో బాగోతుల బుచ్చిగానిని స్త్రీ పాత్రధారిగా పేర్కొనడాన్ని బట్టీ.

స్త్రీ పాత్రలు, పురుషులే:

నాటి నుండి నేటివరకు కూచిపూడి వారు స్త్రీ పాత్రల్నీ పురుషులే ధరిస్తున్నారు. కూచిపూడి నటుల్ని సంబోధించడంలో "భామా వేషగాడనీ" "రాణి వేషగాడనీ""ఆడవేషగాడనీ" పిలవడాన్ని బట్టి యక్షగానాల అనంతరం ఆయా నాటక సమాజాలు, వీథి నాటక సమాజాలు, వీథి నాటకాలు ప్రదర్శించినట్లు విదితమౌతూంది.

కూచిపూడి మేళాల్లో ప్రసిద్ధమైనది ఆనాడు సిద్ధేంద్ర యోగి మేళం. అంతకు పూర్వం 18 వ శతాబ్దంలో భాగోతులల బుచ్చిగాని మేళం, 19 వ శతాబ్దంలో రాయలసీమ లేపాక్షి మేజులపల్లి, తాడి పత్రి మేళాలు, 19, 20 వ శతాబ్దాల మధ్య, నెల్లూరు మండలంలో, వడకండ్ల రామకృష్ణయ్యాగారి మేళాలు - "విశాఖపట్నం" "నరసింగపల్లీ" "కళ్ళేపల్లి" "కందాళ చిందంబర మేళాలు", "పల్నాటి సీమ మేళాలు" మొదలైనవి ప్రసిద్ధి జెందాయి.

నాటి వీథి నాటక రంగ స్థలం:

నాటినుంచీ నేటి వరకూ వీథి నాటకాలు వీథుల్లోనే ప్రదర్శింప బడుతున్నాయి. నాలుగు వీథుల కూడలిలో గానీ, వూరి వెలుపల బయలు ప్రదేశంలో గాని, లేక భాగ్యవంతుల ఇండ్ల ముందరో ప్రదర్శనాలు జరిగేవి. ఈ నాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగ స్థలంగా చూచేవారు. లేనట్టయితే మట్టిని దిబ్బగా పోసేవారు. ప్రదర్శన నాలుగు ప్రక్కలకూ కనిపించేటట్లు పందిరిని నిర్మించేవారు. పైన తాటి ఆకులుగానీ, ఈతచాపలుగాని కప్పేవారు. ఈ నాటి తెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది ఇరువురూ చెరొక ప్రక్కనా పట్టుకుని నిలబడే వారు. ఈనాడున్న లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనెకాగడాలమీద, ఇలాయి కర్రల దీపాల మీద ఆధారపడేవారు. ఇరుప్రక్కలా వెలుగునిచ్చే రెండు కంచునూనె కాగడాలు వేశేవారు. పాత్రల ప్రవేశంలో రాజుగానీ, రాణి గాని, యముడుగానీ, కంసుడుగాని ముఖ్య పాత్రల ప్రవేశంలో ఇంత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. ఆ సమయంలో గొప్ప కాంతితో గుప్పుమని మెరిసేది. ఆ మెరుపులో పాత్రలు ప్రవేశమయ్యేవి.

ఈ విధంగా వారు వారి రంగ స్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు గ్రామస్థులందరూ సహాయపడేవారు. ప్రదర్శనానికి కాకితో కబురంపితే సరి చుట్టుప్రక్కల గ్రామలానుండి, జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనే లేవు కనుక.

ప్రదర్శన ప్రారంభం ఎలా జరిగేది:

రాత్రి సుమారు పది గంటలకు, ప్రదర్శనం ప్రారంభమయ్యేది. ఈ లోగా

భాగవతులందరూ గ్రామంలో వున్న ఆయా ఇండ్లలో భోజనం చేయడం గాని, స్వయం పాకంకాని చేసుకునేవారు. రంగస్థలానికి కొంచెం దూరంలో వున్న ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. ప్రేక్షకులందరూ వచ్చేవరకూ సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలయిన పాటలను పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి, లక్ష్మీ ప్రార్థనలు చేసే వారు. ఒక ప్రక్క వేషాలు తయారవుతూ వుండేవి. మరో ప్రక్క ప్రేక్షకులందరూ, ఆసీనులై వుండే వారు. గ్రామంలో వున్న పండితులూ, గ్రామ పెద్దలూ, మునిసిఫ్ కరణం మొదలైన పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. పెద్దలందరూ వస్తే గాని ప్రదర్శనం ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వారందర్నీ వారికి సహాయాలు చేసిన వారినీ ఈ విధంగా సంబోధించేవారు. ఈ సభా రంగమునకు అందరూ వచ్చియున్నారటరా? చిత్తం, కరణంగారు, చిత్తం, మున్సిఫ్ గారు, చిత్తం, పెద్దలందరూ వచ్చియున్నారటరా, చిత్తం సెహభాష్, వారందరికీ ఉచితాసనాలను అలంకరింప చేసి యుంటివా? చిత్తం ఈ విధంగా ప్రేక్షకులందర్నీ ఆకర్షించి, ప్రదర్శన ప్రారంభించేవారు. ప్రతి జట్టులోనూ సమర్థులైన ఇద్దరు ముగ్గురు హాస్య నటులుండేవారు. వీరు ఏ పాత్ర బడితే ఆ పాత్రను అచ్చు గుద్దినట్లు చెప్పేవారు. వేష ధారణలో ఈ నాటికీ కేకులు గానీ, పౌడర్లు గానీ, బ్రష్ లు గానీ లేవు. ముఖాలంకరణకు అర్దళం, మణిశిల, బొగ్గుపొడి, సింధూరం ఉపయోగించే వారు. క్రీప్ హెయర్ కు బదులు నార పీచు ఉపయోగించేవారు.

ప్రేక్షకుల్నీ ఇలా ఆకర్షించేవారు:

పొరదర్శనంలో ప్రతి పాత్రా రంగ స్థలంలో మూడు ప్రక్కలకూ తిరిగి అభినయించేవారు. దూరంగా వున్న వారికి వినబడేందుకు సూత్రధారులు హెచ్చు స్థాయిలో పాడేవారు. ప్రతి చరణాన్ని ఒక సారికి రెండు సార్లు రెట్టించి పాడే వారు. ఇలా రెట్టించడం వల్ల, అందరికీ ఇట్టే అర్థమయ్యేది. ఈ ప్రదర్శనంలో సాత్విక భావాలు దగ్గరగా వున్న వారికి తప్పా, దూరాన వున్నవారికి కనిపించేవి కావు.. అందువల్ల కాళ్ళతో నృత్యం చేసే వారు, నోటితో పాట పాడేవారు, చేతులతో భావానికి తగినట్లు అంగ చలనాన్ని ప్రదర్శించేవారు, మధ్య మధ్య శ్లోకాలను చదివే వారు. ఈ శ్లోకాలు చాలమందికి అర్థం కావని హాస్యగాని ద్వారా వివర మడిగించి, శ్లోకార్థాన్ని విశదపరిచేవారు. ప్రదర్శనంలో ఏ మాత్రం విసుగు జనించకుండా, హాస్య పాత్ర ధారులైన మాధవి, చోపుదారు, ద్వారపాలకుల ద్వారా చిత్ర విచిత్రమైన లోక ధర్మాలను, సాంఘిక ఆచారాలనూ ప్రవేశపెట్టి మధ్య మధ్య కడుపుబ్బ నవ్వు పుట్టించేవారు. ప్రదర్శనం పది గంటలకు ప్రారంభిస్తే, తెల్లవారి ఆరు గంటల వరకూ ప్రదర్శనాన్ని సాగించేవారు. ప్రేక్షకులు తెల్లవార్లూ, రెప్ప వాల్చకుండా ఈ ప్రదర్శనాలను చూసి ఆనందించేవారు.

వీధినాటక సూత్రధారుని విశిష్టత:

పూర్వం మన గ్రామాలలో ప్రదర్శించే వీథి భాగవత ప్రదర్శనాల లోనూ, కొన్ని పౌరాణిక నాటక ప్రదర్శనాల లోనూ, ప్రదర్శనానికి ముందు, సూత్ర ధారుడు ప్రవేశించే వాడు. ఈ నాటికీ జాన పద కళారూపాల్లో సూత్ర ధారుడు ప్రత్యక్ష మౌతూనే వున్నాడు.

ఆ రోజుల్లో ప్రదర్శనాలు వీథుల్లో ప్రదర్శింప బడేవి. ప్రేక్షకులు ఏడు గంటలకే తెరముందు కూర్చునేవారు. ప్రదర్శనం ప్రారంభించమని వత్తిడి చేసేవారు. ఈ వత్తిడి నుంచి తప్పుకోవటానికి ఈ సూత్రధారుని నాందీ ప్రస్తావన తెచ్చేవారు. అతగాడు ప్రదర్శించ బోయే, ప్రదర్శనాన్ని గూర్చి ప్రజలకు టూకీగా కథ చెప్పే వాడు. తన హాస్య చతురతో ప్రేక్షకుల్ని అదుపులోకి తెచ్చేవాడు.

సూత్రధారుని లక్షణం:

నాటక రచయిత గుణగణాలను, కథావస్తువు విశిష్టతను గురించి స్పష్టంగా వివరించ గలిగినవాడు. అంతే కాక రంగ స్థలంలోని పాత్రధారు లందరిని సిద్ధం చేయ గలిగినవాడు. లయ తాళం - సంగీత విద్యల్లో ప్రజ్ఞ కలిగిన వాడు, పాత్రల నిర్ణయంలో సహకారి, అన్ని దేశాల నృత్య భేదాలను ఎరిగిన వాడు, సూత్రధారుడని కాళిదాసుని శాకుంతలంలో ఉదాహరింప బడింది.

నాటకాల్లోనూ, జానపద కళారూపాల్లోనూ విటుడూ, విధుషకుడు, చేతకుడు, పీఠమర్థుడు, మొదలైన కొందరు పాత్రలు వస్తూ వుండేవి.

నాయకుని నమ్మిన నేస్తం:

విటుడు ముఖ్యంగా శృంగార నాయకునికి సహాయంగా వుండేవాడు. నాయకుడు నాయకి కోసం, అన్వేషించడంలో తగిన సలహాలనిస్తూ అటు నాయిక చర్యలూ, ఇటు నాయకుని చర్యలూ గమనిస్తూ వారిద్దరినీ ఒక చోట కలిపేటందుకూ కలిపిన తర్వాత వారి మధ్య శృంగారం తొణికిస లాడేటట్టు చమత్కారంగా మాట్లాడటం, వా

రిద్దరి మధ్య ప్రణయ కోపాలను తెప్పించటం., ఇరువురి మధ్య చేరి చమత్కార సంభాషణలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ, ధర్మాలను, నీతులనూ, బోధించడం చేస్తూ వుండే వాడు. అలాంటి విటుల వల్లనే ఆనాటి ప్రదర్శన సారాంశ ప్రేక్షకులకు చక్కగా అర్థమయ్యేది.

విదూషకుడు:

ఈతని పాత్ర కూడ హాస్యంతో కూడుకున్నదే. విరహంతో కూడుకున్న నాయకీ నాయకుల మధ్య వుండి వారిని నవ్విస్తూ సరియైన త్రోవలోకి తీసుకు రావడమే విదూషకుని కర్తవ్వం. అంతే కాక ఆనాటి ప్రజలకు అక్షర జ్ఞానం తక్కువ. ప్రదర్శనాకారుల భాష, ప్రదర్శన ఇతి వృత్తం, కఠినమైన భాషలో వుండటం వల్ల, వాటిని ప్రజలకు అర్థమయ్యే భాషలో తెనిగిస్తూ ఆయా పాత్రల మధ్య చేరి హాస్యాన్ని గుప్పిస్తూ వుంటాడు, ఈ విదూషకుడు.

కూర్మిని కూర్చే చేటకుడు:

సూత్రధారుడూ, విటుడూ, విదూషకుడూ, కాక ఈయన నాలుగవ వాడు. ప్రదర్శనాల్లో ఈతని పాత్ర, నాయికా నాయకుల మధ్య వచ్చే కలహాలను తీర్చడం, నాయిక చెప్పిన విషయాలను, నాయకునికి చెప్పడం, వీరిద్దరి మధ్యా రంగస్థలం పైనే వార్తలు మోస్తూ, ఏదో విధంగా వారిని సమాధానపరచి నేర్పుతో ఆకార్యాన్ని నిర్వహించేవాడు. ఇలా నిర్వహించిన తరువాత నాయికా నాయకుల ద్వారా పారితోషికం పొందేవాడు. ఈ దృశ్యమంతా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించడం వల్ల, ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారు. నిత్య జీవితంలో దంపతుల మధ్యా, ప్రేమికుల మధ్యా జరిగే సంఘటనలే గనుక ఇవి ప్రేక్షకుల నెంతో అనంద పరిచేవి.