తెలుగువారి జానపద కళారూపాలు/సిద్ధేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం

వికీసోర్స్ నుండి

సిద్ధేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం


కూచిపూడి భాగవతుల పేరు వినని వారుండరు. ఆంధ్రదేశంలో ప్రతి మారుమూల గ్రామంలోనూ, వారి ప్రదర్శనాలు ప్రదర్శింపబడ్డాయి. పెద్ద పెద్ద రాజాస్థానాలలోనూ, దేవుళ్ళ కళ్యాణ ఉత్సవ సమయాల లోనూ, తిరునాళ్ళ సమయం లోనూ, కూచిపూడి భాగవతుల ప్రదర్శనాలు తప్పని సరిగా వుండేవి. ఆ విధంగా వారు కొన్ని శతాబ్దాల బట్టి ఏక ఛత్రాధిపత్యంగా విశాలాంధ్రలో విశేషంగా ప్రదర్శనాలిచ్చి వేనోళ్ళ వినతులు గొన్నారు.

వీరు ఆట ప్రారంభించారంటే భరతముని ప్రాసాదించిన భరతనాట్యాన్నీ, నంది కేశ్వరుని అభినయ దర్పాణాన్ని శాస్త్రయుక్తంగా తెల్లవార్లూ ప్రదర్శిస్తూ వుండే వారు. వేలాది ప్రజలు, వీరి ప్రదర్శనాలు చూసి ఉప్పొంగి పోయేవారు. ప్రదర్శనమంతా, ఆధ్యాత్మిక వాతారవణంతో నిండి వున్నప్పటికీ, ప్రజల చిత్త ప్రవృత్తులు కూడ ఆధ్యాత్మిక చింతనతో వుండడం వల్ల ప్రదర్శనంలో వచ్చే ప్రతి విషయమూ, అర్థమైనట్లు గానే వారు ఆహ్లాదంలో మునిగి ఆనందించేవారు. ఎంతో మంది పండితులు సైతం వీరి విద్యను పరీక్షించటానికి పోటీలు పడి మరీ కూర్చునేవారు.

కుచేలపురం అంటే:

కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్టణానికి పదిహేను మైళ్ళ దూరంలో, శాతవాహన చక్రవర్తుల ముఖ్య పట్టణమైన శ్రీకాకుళానికి చేరువలో వుంది. మువ్వ గోపాల పదాలతో దక్షిణ దేశాన్నంతా ఉఱ్ఱూత లూగించిన క్షేత్రయ్య స్వగ్రామ మని చెప్పబడే మువ్వ గ్రామానికి అతి సమీపంలోనె వుంది. ఈ కూచిపూడి కళాక్షేత్రం, ఒక బ్రాహ్మణ అగ్రహారం దీనిని కుచేల పురమని కూడ కొంతకాలం క్రితం వరకూ పిలుస్తూ వుండేవారని ప్రతీతి. దాదాపు అయుదు వందల సంవత్సరాల పూర్వమే ఇక్కడ నాట్య కళకు అంకురార్పణ చేశారని చరిత్ర కారుల వల్ల తెలుస్తూ వుంది.

సిద్డేంద్రయోగి సుద్దులు:

అసలు కూచిపూడికి ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుని ముందుకు నడిస్తే మనకు చరిత్ర బోధపడుతుంది. ఈ నాటికీ కూచిపూడి వారిని, మీకీ నాట్య సంప్రదాయం గానీ, భాగవత సంప్రాదాయం గాని ఎక్కడ నుండి వచ్చిందీ అని ప్రశ్నిస్తే వారు ఈ క్రింది గాథను తెలియజేస్తారు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనానికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి అని చెప్పుతారు. ఈయన కూచిపూడి గ్రామస్తుడే అని కొందరు , యాత్రలు చేస్తూ కూచిపూడి చేరిన పరదేశి అని కొందరు ఆయన కాపుర స్థలాన్నీ కాలాన్నీ నిర్ణయించలేకుండా వున్నారు.

గురువును మించిన శిష్యుడు:

కొన్ని శతాబ్దాల క్రింద కూచిపూడి గ్రామంలో సిద్దయ్య అనే ఒకాయన వుండేవారట. ఆ సిద్దయ్యగారు చాల అమాయకుడు. నిరక్షరాస్యుడు. సోమరితనంగా తిరుగుతూ వుండేవాడు. ఆ వూరి తక్కిన బాలురచే పరిహసింప బడుతూ, ఏ మాత్రం విద్యాసక్తి లేక అయోమయంగా వుండేవాడట. కొంత కాలానికి యుక్త వయస్సు వచ్చింది. సంప్రదాయసిద్ధంగా ఆ గ్రామంలోనే అన్ని విధాల తగిన కన్యనిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన కొద్ది దినాలకెల్లా సిద్దయ్యగారిలో ఒక కొత్త మార్పు రాసాగింది. విద్యాసక్తి కలిగింది. తల్లి దండ్రులవద్ద శెలవు తీసుకుని ప్రయాణమయ్యాడు. ఆ గ్రామానికి పశ్చిమంగా వున్న కృష్ణా నదిని దాటి విద్యాభ్యాసం కోసం పెళ్ళిపోయాడు. సిద్దయ్యలో కలిగిన ఈ వింత మార్పు గ్రామవాసులందర్నీ చకితులను గావించింది. కొంత కాలం ఇలా గడిచి పోయింది. సిద్దయ్యను గురించి చెప్పుకున్న వారు లేరు.

అన్ని విద్యలలోనూ ఆరితేరిన దిట్ట:

కాని ఇంతలోనే సిద్దయ్య గారు సకలవిద్యాపారంగతుడై అన్ని విద్యలలోనూ మరి ఇంతటివాడు లేడన్న పేరు తెచ్చుకొని తిరిగి వచ్చాడు.

వచ్చే ముందు సిద్దయ్యగారి గురువు, "నాయనా! నీవు నాదగ్గర అభ్యసించ వలసినదేమి యిక లేదు. పోయి గృహస్థాశ్రమ ధర్మం అనుసరించి సుఖంగా జీవించు" అని ఆశీర్వదించి పంపించాడు. గురువు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి ప్రయాణ మయ్యాడు సిద్దయ్య.

అది సంధ్యా సమయం. సూర్యుడు అరుణకాంతులు విరజిమ్ముతున్నాడు. సరిగ్గా ఆ వేళకు కృష్ణా తీరం చేరుకున్నాడు. సంజ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సిద్దయ్య గారు స్నానంచేసి సాయంసంధ్యావందనం చేస్తున్నారు. ఇంతలో ఉన్నదున్నట్లు కృష్ణానది పొంగి నీటి ప్రవాహం ఒక్క పెట్టున ఆయన కంఠంవరకూ ముంచుకొచ్చింది. సిద్దయ్య ప్రమాద స్థితిలో పడ్డాడు. తన ప్రమాద స్థితి గమనించి ఆత్మసన్యాసం చేశాడట.

ఇంతలో ఒక తరంగం హఠాత్తుగా వచ్చి సిద్దప్పను చిత్ర్రంగా ఒడ్డుకు చేర్చిందట. అంతట ఆయన సంసారాన్ని త్యజించి తన శృంగార భావాలను శ్రీ కృష్ణభక్తితో మిళితం చేసి భామాకలాపమనే పారిజాతాపహరణ యక్షగానాన్ని రచించి కూచిపూడి భాగవతులకు బోధించి ధన్యుడైనాడని ఒక కథ.

ఆత్మసన్యాసం తరువాత కథ:

సిద్ధేంద్ర యోగి మొదట శృంగేరీ మఠంలో ఒక చదువు రాని మొద్దబ్బాయిగా వుండి ఊసుపోకకు కృష్ణకీర్తనలు పాడుతూ వుండగా - యాదాలాపంగా నయితే నేమి..... అందులో అబ్బాయి తన్మయతను గమనించిన శృంగేరి పీఠాధిపతి

కృష్ణభక్తిని ప్రచారం చేయడానికి అతనిని దేశ సంచారం పంపినట్లూ, యాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ అతడు కూచిపూడి గ్రామం వచ్చినట్లూ, వూరి వెలుపల దేవాలయం వద్ద మకాం వేసినట్లూ, ఇంతలో ఆ వూరి బ్రాహ్మణ స్త్రీలు ఊరి వెలుపల నున్న ఊరబావికి నీళ్ళకు వచ్చి, ఈ సిద్ధేంద్రుని దర్శించి నట్లూ చెప్పుతారు.

ఆనాటి ఆచారం ఏమంటే గ్రామంలోకి ఎవరైనా అతిథులు వస్తే ప్రథమంగా వారిని సత్కరించాలి. అలాగే వీరిని సత్కరించటానికై కూచిపూడి బ్రాహ్మణులు వారిని దర్శించి ఆతిథ్యాన్ని అందుకోమన్నారు. అందుకు ఆయన సమ్మతించి అన్నం దగ్గర కూర్చుని ఒక కోరిక కోరినట్లూ, దానిని వీరు శిరసావహించినట్లూ చెబుతారు. ఏమిటా కోరిక? తాను ఒక భాగవతం వ్రాశాడట. దానిని వారు ప్రదర్శించాలట. అదే ఆయన కోరికట. ఆ కోరికను తిన్నగా తీరుస్తానంటేనే భోజనం చేస్తానని తీర్మానంగా చెప్పాడట. అందుకు వారు మారు మాట మాట్లాడక సరే నన్నారట. ఇందుపై సిద్ధేంద్రుడు నాట్య శాస్త్రాన్ని వారికి బోధించడానికి ఇష్టపడి , వారు ఈ శాస్త్రాన్ని వంశపారంపర్యంగా ప్రతి గృహంలోనూ కుల వృత్తిగా గ్రహించి, ప్రతి బ్రాహ్మణ యువకుడూ ముక్కు కుట్టించుకుని, కాలిగి గజ్జె కట్టి, ఆవూరి నాటరాజు ఆలయంలో ఒక్కసారైనా నాట్య ప్రదర్శనం చేసేటట్లు వాగ్దానం చేయించుకుని, పారిజాతాపహరణమనే భామాకలాపాన్ని వారికి ఉపదేశించాడట. ఆయన ఆదేశానుసారం ఆనాటి నుండి ఈనాటి వరకూ వారు నాట్య విద్యలో దినదినాభివృద్ధి పొంది వివిధ దేశాలను సందర్శించి నానారాజ సందర్శనం చేసి శతాబ్దాల తరబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.


అక్షరాభ్యాసానికి ఆరంభం:

ఆనాటి నుంచే నాట్యంలో అక్షరాభ్యాసం చేయబడింది. వెంటనే సిద్ధేంద్రుడు బాలురనందర్నీ సమకూర్చి, వారికి నాట్యాభినయాన్ని, సంగీతాన్నీ నేర్పాడు. అనాటి నుంచి వారి భాగవతాల ప్రదర్శనలకు అంకురార్పణ జరిగింది. ఈ రీతిగా సిద్ధేంద్ర యోగి నాట్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు.

ఆనాటి నుంచీ ఈనాటివరకూ కూచిపూడి నాత్య ప్రదర్శనలూ, వారి భాగవతాలూ, వారి పగటి వేషాలూ, విశాలాంధ్ర దేశంలో వంశపారంపర్యంగా ప్రచారం పొందాయి.

వంశపారంపర్య వారసత్వం:

ఇలా ఆ కళను వంశపారంపర్య విద్యగా చేసి, దానిని నశింపనీయక కాపాడేందుకు కూచిపూడి గడ్డ మీద పుట్టిన ప్రతి బ్రాహ్మణ మగబిడ్డకూ ముక్కులూ చెవులూ కుట్టిస్తారు. కారణం ముక్కులకూ చెవులకూ రంధ్రాలుంటే ఆభరణాలు ధరించడానికి అనువుగా వుంటుండి. అది స్త్రీ పాత్రగానీ, పురుష పాత్ర గానీ రంధ్రాలు వుంచడం అవసరం. అందువల్ల, వయస్సు ముదిరితే రంధ్రాలు వేయడం కష్టం కనుక, ఆ పనిని బాల్యంలోనే ముగిస్తారు. పసిపిల్లలకు విద్యాభ్యాస మెటువంటిదో వారి కీకర్ణవేధమటువంటిది. ముక్కులూ చెవులూ కుట్టించిన తరువాత మరి కాలికి గజ్జె కట్టించి నటరాజు ముందు నాట్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.

పదిహేనవ శతాబ్దికే ప్రబలంగా ప్రఖ్యాతి:

కూచిపూడి భాగవాతులు 15 వ శతాబ్దం నాటికే వారి కళా ప్రదర్శనలను ప్రదర్శిచటంలో ప్రఖ్యాతి వహించారు. ఇందుకు ఆధారం 1502 నాటి మచ్చుపల్లి కైఫీయతే. 16 వ శతాబ్దం చివరి భాగం నుండి ఈ నాటి వరకూ పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ వారు ప్రశంసల్ని అందుకున్నారు.

భామాకలాపంలో శ్రీకృష్ణుడు నాయకుడు. సత్యభామ నాయిక. శ్రీకృష్ణుడు రుక్మిణి యందుంచిన అనురాగం తనపట్ల చూపలేదని, సత్యభామ శ్రీకృష్ణునితో కయ్యమాడి విడిగా వుండి పోయి ఆ వియోగాన్ని మరి భరించ లేక దూతికతో రాయబారం పంపడం, దూతిక సత్యభామ విరహ వేదనను ఉపశమింపజేయడం అందులో కథ. శ్రీకృష్ణుని దక్షిణ నాయక లక్షణాలను, సత్యభామ అష్టవిధ నాయిక లక్షణాలను అవస్థా భేదాలను అద్భుతంగా చిత్రిస్తారు. భామా కలాపంలో సత్యభామ ఒక్కతే పాత్రధారి. సూత్రధారుడు కథకుడు గాను, చెలికత్తె మాధవిగాను సమయానుకూలంగా ద్విపాత్రలనూ ధరించి చక్కని హాస్యాన్ని ప్రదర్శిస్తారు. భామాకలాపం సిద్ధేంద్రుడే వ్రాసినట్లు ఈ క్రింది నాందీ పద్యం ద్వార వెల్లడౌతుంది.

వినరండి హరికథను:

జనులార, వినుడి హరికథ
విన వేడుక గలిగెనేని వీనుల కొలదిన్
కొనుడీ కర్ణామృతముగ
ఘనుడగు సిద్ధేంద్ర యోగి కవితారచనన్.

అనే పద్యంతో ప్రారంభించిన తరువాత సత్యభామ ఈ విధంగా పాడుతూ తెర వెడలుతుంది.

భామనే,సత్యభామనే
భామనే, పదహారువేల
కోమలు లందరిలోనూ
భామరో, గోపాల మూర్తికి
ప్రేమదాసినగు సత్య ॥భామ॥

అట్టహాసము చేసి సురల
నట్టె గెలుచుక పారుజాతపు
చెట్టు దెచ్చి నాదు పెరటా
గట్టిగా నాటించుకొన్నా ॥భామ॥

అంటూ గర్వాతిశయంతో నృత్యం తొక్కుతూ అభినయ చేస్తుంది.

భామాకలాపంలో -భామవాచిక విధానం:

భామాకలాపంలో కథ యొక్క సందర్భాన్ని బట్టి వచనం నడుస్తూ వుంటుంది. సత్యభామ ఒక్కతే __ ఏకపాత్రధారి. ప్రక్కనున్న విధూషకుడు తా నొక్కడే, అవసరాన్ని బట్టి పురుష హాస్యగాని వలెను, మాధవి అనే స్త్రీ పాత్ర ధారిగాను రెండందాలా నిర్వహిస్తాడు. ఉదాహరణకు భామాకలాపంలో సత్యభామ వాచికం చూడండి:

ఓయమ్మా:

ఓ యమ్మా, వకావకనాడు పడక మందిరంలో హంసతూలికా తల్పమందు కాకేళి గృహములయందు వజ్ర వైడూర్య గోమేధిక వుష్యరాగ మరకత మాణిక్యములు స్థాపించి నటువంటి నగరి యందు పవళించి యుండగా, స్వామి వారు వచ్చి శయ్యమీద కూర్చునారమ్మా, లేచి పరిమళ ద్రవ్యములు మొదలైన చందన గోష్టి చేసినానే, అంతట స్వామి వారు పరున్నారే, నేను కూర్చున్నానే, పాద సేవ చేసినానే. అప్పుడు స్వామి వారు నన్ను తొడపై కూర్చుండ బెట్టుకుని అమూల్యమైనటువంటి ఆభరణములు అలంకరించి నిలువుటద్దం తెచ్చి ఎదుట నుంచి నీడలు చూసి, సత్యభామా!నీవే చక్కని దానవా, నేనే చక్కని వాడనా? అని అడిగేనే, వోశమ్మా అడిగేటంతవరకు, ఆడబుద్ధి గనుక, తెలియక, నేనే చక్కని దానినంటినే వోశమ్మా, అంతట స్వామి వారు నామీద కోపంచేసి దిగ్గున లేచి చక్కా పోయెనే వోశమ్మా! మన స్వామివారు ఎందు బోయెనో, యెక్కడ బోయెనో వెదుకుతారటే వోశమ్మా!

అంటూ మాధవితో ఎంతో అద్భుతంగా వాచికాభినయం నడుస్తుంది. ఇది వినడానికి ఆహ్లాదకరమైన వాచిక విధానం.

భామా కలాపాన్ని కూచిపూడివారు ఒకమహాకావ్యంగా తీచి దిద్దారు. ఏండ్ల తరబడి ప్రదర్శించి ప్రజా హృదయాలను చూరగొన్నారు. దీని తరువాత వారి ప్రదర్శనాల్లో ముఖ్యమైంది గొల్లకాలాపం.

గొల్లకలాపం తీర్చిన గొప్ప సందేహం:

గొల్లకలాపంలో నాయిక గోపకన్య. ఆమె "బ్రాహ్మణ, గోప జన్మలో ఏది ఉత్తమమైంది? బాపడు గొప్పవాడా? గోపుడు గొప్పవాడా?"అని బ్రాహ్మణునితో వాదోపవాదాలు జరుపుతుంది. ఈ గొల్ల కలాపాన్ని భగవతుల రామలింగ శాస్త్రిగారు రచించారని ప్రతీతి. గొల్ల కలాపంలో గొల్లభామ వేషం ధరించి వీథిలో చల్ల అమ్మి నట్లు అభినయిస్తూ వుండగా శిష్టాచారం గలిగిన బ్రాహ్మణుడు చల్ల కొనాలని గొల్ల భామను పిలుస్థాడు. ఇరువురూ ఏ కులం గొప్పదో అని వాదోపవాదాలు జరుపుతారు మానవ సమాజమంతా సమానంగానే సృష్టింప బడిందని, బ్రాహ్మణులు అధికం కారని వాదిస్తుంది. ఇందుకని ప్రదర్శనంలో ఇద్దరు గొల్లపడతులు చల్ల అమ్మేటట్లు వేషాలు ధరించి, భాగవతంలో వర్ణించిన పిండోత్పత్తిని గురించీ, నవమాసాల పిండచలాన్ని పిండం బయటపడిన వరువాత, ప్రపంచ సృష్టి ఏ విధంగా వుండేదీ అభినయంతో వర్ణించేవారు. ఇందులో వేదాంత చర్చ జరుగుతుంది.

గొల్లకలాపంలో ఘనాపాటి:

ఈ భామా, గొల్ల కలాపాలలో పేరు ప్రఖ్యాతులు గడించి అనేక మన్ననలు పొందిన సిద్ధహస్తులు వెంపటి వెంకట నారాయణగారు. ఆయన తరువాత కొంత మంది ఆ పాత్రను ధరించి నప్పటికీ ఆయనతో సరితూగరనే చెప్పవచ్చు. ఎంతో కాలం - ఏళ్ళతరబడి ఈ గొల్ల కలాపాన్ని ప్రదర్శించారు. ఇదంతా యక్షగాన రూపంలో జరిగింది.

కూచిపూడి వీథి భాగవతులు భారత - భాగవత - రామాయణాల నుండి కథలను తీసుకుని యక్షగాన నాటక రూపంలో భరత నాట్యశాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి ప్రదర్శనాలను ఇస్తూవుంటారు. వీరు ప్రదర్శించిన యక్షగానాల్లో గిరిజా కళ్యాణము- కీచక వధ - హరిశ్చంద్ర -కిరాతార్జునీయం- కాళీయమర్దనం - శశిరేఖా పరిణయం - రామనాటకం-రుక్మాంగద - లవకుశ - ఉషా పరిణయం మొదలైనవి ముఖ్యమైనవి. ఈ కోవకు చెందిన పురాణ సంబంధమైన గాథలనే యక్షగానరూపంలో ప్రదర్శించే వారు. రాను రాను వారు ఈ యక్షాగాన రూపాలను కొంత వరకు మార్చి వీథి నాటకాలుగా ప్రదర్శించారు.

తెరమీద జడ పండితుల ప్రతా ప్రదర్శనం:

కూచిపూడి భాగవలుల ప్రదర్శనల్లో ముఖ్యంగా భామాకలాప ప్రదర్శనంలో తెర మీద ఒక జడవేసి తద్వారా తమ పాండితీ ప్రకర్షను వెల్లడించేవారు. ఈ జడ వర్ణనను పరిశీలించి తప్పులు పట్టడానికి పండిత ప్రకాండులందరూ ముందు వరుసలో వుండేవారు.

జడను 27 నక్షత్రాలతో ఒక నక్షత్రమాలగా అలంకరించి తెర వెలుపలి భాగంలో ప్రేక్షకులకు కనబడేటట్లు వ్రేలాడదీసేవారు. ఒక్కో బిళ్ళకు ఒక శ్లోకం చదివేవారు. జడ గంటల్ని నవగ్రహాలనే వారు. ఆ జడను మయుడనే శిల్పి స్వయంగా సృష్టించాడని ప్రతీతి, తలకు సూర్యుడూ, చంద్రుడూ అలంకరింప బడేవి. ఇదీ ఆ జడ స్వరూపం. ప్రదర్శన ప్ర్రారంభంలో ఈ జడ వర్ణనను ప్రదర్శిస్తూ వుండగా, ప్రేక్షకులుగా కూర్చున్న పండితుల్లో ఎవరైనా లేచి జడను గురించి ప్రశ్నిస్తే తగిన సమాధానం చెప్పి వారిని ఆశ్చర్య చికితుల్ని చేసేవారు. అలా సమాధానం చెప్పలేనట్లయితే పండితోత్తములు ఆ జడను కత్తిరించి కళాకారులను అవమానపరిచేవారు. అలాంటి సందర్భాలను రానీయకుండా వేదాంతం లక్ష్మీ నారాయణ లాంటి వుద్దండులు ఎంతో ప్రావీణ్యంతో ఒక మహా పర్వతంలా నిలబడి జడవర్ణనను పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేసి పండితుల్ని, పామరుల్ని రంజింప జేసే వారు.

వ్యాయామం ద్వారా నాట్య శిక్షణ:

కూచిపూడి కళాకారుల నాట్యాభ్యాసం వ్వాయామంతో ప్రారంభమవుతుంది. వారు బస్కీలు తీస్తారు; దండెములను తీస్తారు. ఇలా చేయడం వల్ల అవయవ సౌష్టవం చక్కగా అమరుతుంది, తరువాత అభినయాన్ని నేర్పుతారు. నాట్యంలో పాదగతులు _ ఆళి, ప్రత్యాళి మొదలైనవన్నీ నేర్పుతారు. హస్త ముద్రల్ని, అంగ విన్యాసాల్నీ మూడు కాలాలలో అడుగులు నేర్చుకుంటారు. ఇక నాలుగవ దశలో నవరసాలను అనుభవించడం, ముక్తాయింపులు, పాటల్లోని భావాన్ని అనుసరించి భావవిన్యాసాన్ని అభ్యసిస్తారు. ఈ విధంగా నాలుగు దశలుగా విభజించుకుని నాట్యంలో వుత్తీర్ణులుగా తయారవుతారు. ఇందువల్ల విద్యాభ్యాసమే కాక వ్యాయామ శిక్షణద్వారా అంగ సౌష్టవం, కుదిరికలూ, ఆరోగ్యం ఎంతో బాగుండి ఎక్కువకాలం జీవించడానికి, అయాసం లేకుండా ఎక్కువకాలం నృత్యం చేయ డానికి వీలవుతుంది.

కూచిపూడి భరతనాట్యం:

భావ, రాగ, తాళ యుక్తంగా నటించే నాట్యాన్నే భరత నాట్య మంటారు. నాట్యం నృత్యమనీ, నృత్తమనీ రెండు భాగాలు. భావాని స్పష్టపరచేది నృత్యం, భాషతో భావాలను వ్వక్తం చేసేది నృత్తం. కూచిపూడి నాట్యాచార్యుడు వీటినన్నిటినీ మేళవించి నృత్యం చేస్తారు. పాటలో వున్న ప్రతి పదం యొక్క భావాన్నీ అభినయం ద్వారా చూపిస్తారు. ఈ విధంగా సంగీతం, సంగీతం ద్వారా పదం, పదం ద్వారా అభినయం. అభినయంద్వారా భావ విశిష్టత వెల్లడిస్తూ నృత్తమూ, నృత్యమూ కూచి పూడి సాంప్రదాయంలో ప్రాముఖ్యం వహించాయి.

ముద్దులొలికే క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు:

మువ్వగోపాల పదాలను కూచిపూడి భాగవతులు వారి వీథి భాగవతాల్లో పాడడం, భరత నాట్య సంప్రదాయం ప్రకారం అభినయించడం చేశారు. క్షేత్రయ్య పదాలను ఎక్కువ ప్రచారంలోకి తీసుకొచ్చిన వారు కూచిపూడి భాగవతులే. ప్రాచీన కాలంనుంచీ మన కళారూపాలు ఎలా ఎలా పరిణామం చెందాయో, అలాగే మన గేయ వాఙ్మయం కూడ అభివృద్ది పొందింది. క్షేత్రయ్య నివాస స్థానం కృష్ణా జిల్లా దివి తాలూకా మువ్వ గ్రామం. ఆ గ్రామంలోని గోపాలస్వామి మీదే క్షేత్రయ్య గోపాల పదాలను రచించి దక్షిణదేశ మంతా సంచారం చేశాడు. అనేక యాత్రాస్థలాలకు పోయి కంచి వరదునిపైనా, తిల్ల గోవిందునిపైనా, యదుగిరి స్వామి, శ్రీ వెంకటరమణుడు, ఇనపురిధాముడు, పాలగిరి చెన్నడు, మధురాపురాధీశుడు మొదలైన దేవుళ్ళపైనా క్షేత్రయ్య అక్షయంగా పాటలను రచించాడు. క్షేత్రయ్య తన పదాలను భక్తిభావంతోనే గాక సంగీత సమ్మేళనాలతో, అభినయ ప్రదర్శనానికి కూడా ఎన్నో గీతాలను రచించాడు. దక్షిణ దేశంలో త్యాగరాజు, ఉత్తర దేశంలో జయదేవుని మాదిరి క్షేత్రయ్య కూడ అశేష ప్రాముఖ్యత వహించిన గేయ వాఙ్మయ కారుడు. ఆంధ్రుల నాట్యకళా సాంప్రదాయాలలో క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలు ఒక మెట్టు లాంటివి.

ఏ హంగామా లేని వీధి నాటక రంగస్థలం:
వీథి నాటకంలో యముడు

కూచిపూడి వీథి నాటకాలు అనాటినుంచీ ఈ నాటివరకూ వీధుల్లోనే ప్రదర్శింపబడుతూ వున్నాయి. నాలుగు వీథుల కూడలి గాని, ఊరిమధ్య పెద్ద బజారులో గాని ఊరి వెలుపల బయలు ప్రదేశంలోగాని ఈ ప్రదర్శనాలు జరిగేవి. ఈనాటి మాదిరి ఆనాడు రంగస్థలాలు లేవు. ఎత్తైన ప్రదేశమే రంగ స్థలంగా ఎంచుకొనేవారు. లేనట్టయితే మట్టిని దిబ్బగా పోసేవారు. ఇంగా జనమమ్మర్థం ఎక్కువగా వుంటే ఎత్తుగా బల్లలతో ఒక బల్లకట్టు నిర్మించేవారు. పైన తాటి ఆకులుగాని, ఈత చాపలు గాని కప్పేవారు. ఈ నాటితెరలు ఆనాడు లేవు. మామూలు కలంకారీ అద్దకం బొమ్మల దుప్పటి లాంటిది ఇరువురు వ్యక్తులు చెరో ప్రక్క పట్టుకుని నిలబడేవారు. ఈ నాటి లైట్లు ఆనాడు లేవు. కేవలం నూనెకాగడాలమీదా, విలాయి కర్రల మీదా ఆధారపడేవారు. ఇరుప్రక్కలా వెలుగునిచ్చే రెండు కంచు నూనె కాగడాలు వేసేవారు. పాత్రల ప్రవేశంలో రాజు, రాణి, యముడు, కంసుడు మొదలగు ముఖ్య పాత్రల ప్రవేశంలో ఇత గుగ్గిలాన్ని ఆ కాగడాలపై గుప్పేవారు. అది ఆ సమయంలో గొప్ప కాంతితో గుప్పుమని మెరిసేది. ఈ మెరుపులో పాత్రలు ప్రవేశమయ్యేవి.

ఈ విధంగా వారు వారి రంగ స్థలాన్ని నిర్మించుకునేవారు. అందుకు గ్రామస్థులందరూ సహాయపడేవారు. ప్రదర్శనానికి కాకితో కబురంపితే సరి చుట్టుప్రక్కల గ్రామాల నుండి, జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. ఇందుకు కారణం ఇంతకు మినహా ఆనాడు వినోద కార్యక్రమాలు లేనే లేవు కనుక.

ఊరిపెద్దలందరికి పిలుపు - ప్రదర్శన ప్రారంభం.

రాత్రి సుమారు పది గంటలకు, ప్రదర్శనం ప్రారంభమయ్యేది. ఈ లోగా భాగవతులందరూ గ్రామంలో వున్న ఆయా ఇండ్లలో భోజనం చేయడం గాని, స్వయం పాకంకాని చేసుకునేవారు. రంగస్థలానికి కొంచెం దూరంలో వున్న ఇంటిలో ముఖాలంకరణ చేసుకునేవారు. ప్రేక్షకులందరూ వచ్చేవరకూ సూత్రధారులు వాద్య విశేషాలతో వివిధ రకాలయిన పాటలను పాడుతూ గణపతి ప్రార్థన, సరస్వతి, లక్ష్మీ ప్రార్థనలు చేసే వారు. ఒక ప్రక్క వేషాలు తయారవుతూ వుండేవి. మరో ప్రక్క ప్రేక్షకులందరూ, ఆసీనులై వుండే వారు. గ్రామంలో వున్న పండితులూ, గ్రామ పెద్దలూ, మున్సిఫ్ కరణం మొదలైన పెద్దలందరూ వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. పెద్దలందరూ వస్తేగాని ప్రదర్శన ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వారందర్నీ, వారికి సహాయాలు చేసేవారిని ఈ విధంగా సంబోధించేవారు.

అందరూ వచ్చియున్నరటరా?:

ఈ సభారంగమునకు అందరూ వచ్చి యున్నా రటరా?,

చిత్తం!

కరణంగారూ? చిత్తం!


మునిసిఫ్ గారు,

చిత్తం!


ఈ విధంగా ప్రేక్షకులందర్నీ ఆకర్షించి, ప్రదర్శన ప్రారంభించేవారు. ప్రతి జట్టులోనూ సమర్థులైన ఇద్దరు ముగ్గురు హాస్య నటులుండేవారు. వీరు ఏ పాత్ర బడితే ఆ పాత్రను అచ్చు గుద్దినట్లు చెప్పేవారు. వేష ధారణలో ఈ నాటికీ కేకులు గానీ, పౌడర్లు గానీ, బ్రష్ లు గానీ లేవు. ముఖాలంకరణకు అరదళం, మణిశిల, బొగ్గుపొడి, సింధూరం ఉపయోగించేవారు. క్రీప్ హెయర్ బదులు నార పీచు ఉపయోగించేవారు.

ప్రదర్శనంలో ప్రతి పాత్రా రంగ స్థలంలో మూడు ప్రక్కలకూ తిరిగి అభినయించేవారు. దూరంగా వున్న వారికి వినబడేందుకు సూత్రధారులు హెచ్చు స్థాయిలో పాడేవారు. ప్రతి చరణాన్ని ఒక సారికి రెండు సార్లు రెట్టించి పాడే వారు. ఇలా రెట్టించడం వల్ల, అందరికీ ఇట్టే అర్థమయ్యేది.

మాధవీ - చోపుదారు:

ఈ ప్రదర్శనంలో సాత్విక భావాలు దగ్గరగా వున్న వారికి తప్పా, దూరాన వున్నవారికి కనిపించేవి కావు.. అందువల్ల కాళ్లతో నృత్యం చేసే వారు, నోటితో పాట పాడేవారు, చేతులతో భావానికి తగినట్లు అంగచలనాన్ని ప్రదర్శించేవారు, మద్య, మధ్య శ్లోకాలను చదివే వారు. ఈ శ్లోకాలు చాలమందికి అర్థం కావని హాస్యగాని ద్వారా వివర మడిగించి, శ్లోకార్థాన్ని విశదపరిచేవారు. ప్రదర్శనంలో ఏ మాత్రం విసుగు జనించకుండా, హాస్య పాత్ర ధారులైన మాధవి, చోపుదారు,

ద్వారపాలకుల ద్వారా చిత్ర విచిత్రమైన లోక ధర్మాలను, సాంఘిక ఆచారాలనూ ప్రవేశపెట్టి మధ్య మధ్య కడుపుబ్బ నవ్వు పుట్టించేవారు. ప్రదర్శనం పది గంటలకు ప్రారంభిస్తే, తెల్లవారి ఆరు గంటల వరకూ ప్రదర్శనాన్ని సాగించేవారు. ప్రేక్షకులు తెల్లవార్లూ, రెప్ప వాల్చకుండా ఈ ప్రదర్శనాలను చూసి ఆనందించేవారు.

అందరకీ మక్కువైన పెక్కు నాటకాలు:

కూచిపూడి భాగవతులు నాటకాల్లో రామాయణ, భారత, భాగవతి గాథలకు సంబంధించిన గాథలను యక్షగాన వీథినాటకాల రూపంలో సాంప్రదాయ సిద్ధంగా ఈ క్రింద వుదాహరించిన వాటి నన్నిటిని ప్రదర్శించేవారు.

త్యాగరాయ కృతులు__జయదేవుని అష్టపదులు__మువ్వ గోపాల పదాలు, __ భద్రాచల రామదాసు కీర్తనలు__ నారాయణ తీర్థుల తరంగాలు__సారంగపాణీ కీర్తనలు__ తుంగతుర్తి కృష్ణదాసు కృష్ణలీలలు__ తాళ్ళపాక అన్నమాచార్యులు గారి ప్రహ్లద__హరిశ్చంద్ర.__ రామనాటకం __ఉషాపరిణయం గొల్లకలాపం__భామాకలాపం__ దాదినమ్మ వేషం__ దశావతారాలు__మండూకశబ్దం ప్రహ్లద పట్టాభిషేకం__బాలగోపాల తరంగం మొదలైన వెన్నో ప్రదర్శించేవారు.

ప్రతిభావంతులైన కళాకారులు:

కూచిపూడి కళాకారులు ఒక్క నాట్య సంగీతాల్లోనే గాక అలంకార శాస్త్రంలోనూ, మంత్ర శాస్త్రంలోనూ, భాషా శాస్త్రంలోనూ, వాద్య శాస్త్రంలోనూ కూడ నిరుపమానమైన ప్రజ్ఞానైపుణ్యం గలవారు. కూచిపూడి వారిలో వేదాంతం వారనీ, చింతావారనీ, పసుమర్తి వారనీ, భాగవతుల వారనీ, వెంపటి వారనీ, ఇంగువ వారనీ, బుక్కా వారనీ ప్రసిద్ధ కుంటుంబాల వారున్నారు. కొన్ని శతాబ్దాల పాటు దీర్ఘప్రశస్తిని పొందారు. 19 వ శతాబ్దం ప్రారంభం నుండి నేటివరకు అఖండమైన కీర్తి నార్జించుకుని కూచిపూడి సాంప్రదాయాన్ని వుద్ధరించిన ఈ క్రింది కళాకారులు కీర్తి శేషులైనారు.

ఎందరో మహానుభావులు:

1.చింతా వెంకటరామయ్య
2.చింతా రత్తయ్య
3.చింగా నారయణమూర్తి
4.చింతా ఆదినారయణ
5.చింతా రామమూర్తి
6.వెంపటి వెంకట్ఘనారాయణ
7.పెంపటి పరదేశి

8.వెంపటి సుబ్బారావు
9. వేదాంతం లక్ష్మినారాయణశాస్త్రి
10. వేదాంతం వెంకటరత్నం
11.వేదాంతం వెంకటాచలపతి
12.వేదాంతం పెదరామయ్య
13.వేదాంత్గం చినరామయ్య
14.వేదాంగం లక్ష్మీనారాయణ
15.మహాకాళి గంగయ్య
16.మహాకాళి సీతారామయ్య
17.మహాకాళి సూరయ్య
18.మహాకాళి చలపతి
19. మహాకాళి శ్రీరాములు
20.బొక్కా రామబ్రహ్మం
21.బొక్కా వెంకటాచలపతి
22.బొక్కా సీతారామయ్య
23.భాగవతుల రామయ్య
24.భాగవతుల అనంతరామయ్య
25.భాగవతుల రామదాసు
26.భాగవతుల రామలింగం
27.భాగవతుల విస్సయ్య
28.భాగవతుల కుటుంబశాస్త్రి.

29.పసుమర్తి భగవంతం
30.వసుమర్తి కొండలరాయుడు
31.యేలేశ్వరపు రామకృష్ణయ్య
32.యేలేశ్వరపు వేంకటేశ్వర్లు
33.తాడేపల్లి పేరయ్య
34.జోస్యుల నారాయణమూర్తి
35.హరిచలపతి

వయసును మిందిన విద్వత్తు:

పై వారిలో శ్రీ చింతా వెంకటరామయ్య గారు సుప్రసిద్ధులు. అనాటి వెంకటరామా నాట్య మండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్ఛిన్నంగా నిర్వహించి, ఆ సంస్థ ద్వారా అనేక మంది వుత్తమ నటశేఖరులను సృష్టించి, ఈ నాటి కూచిపూడి నాట్య కళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన ప్రముఖ నాట్యాచారుడు.

చింతా వెంకటరామయ్య

శ్రీ వెంపటి వెంకటనారాయణగారు భామాకలాప, గొల్ల కలాప ప్రదర్శసనాల ద్వారా విశేష ఖ్యాతి నార్జించుకున్న నటశేఖరుడు. అనేక సంస్థానాలలోనూ, విద్వత్సభలలోనూ విద్వత్తును ప్రదర్శించి అనేక సువర్ణఘంటా కంకణాది అమూల్య సత్కారాలను పొందిన లయబ్రహ్మ. పాత్ర ధారణలోనూ, నాట్య శిక్షణలోనూ ఆరితేరి మిగిలిన వారు కూడ __ ఈక్రింది వారితో పాటు సేవచేశారు.

సాటిలేని మేటివారు:

వేదాంతం రామకృష్ణయ్య
వేదాంతం ప్రహ్లదశర్మ
వేదాంగం సత్యనారాయనశర్మ
వేదాంతం వీర రాఘవయ్య

వేదాంతం ఆంజనేయులు
చింతా రాధాకృష్ణమూర్తి
చింతా కృష్ణమూర్తి
మహంకాళి సత్యనారాయణ
మహంకాళి సుబ్బారావు
మహంకాళి వెంకటాచలపతి
మహంకాళి శ్రీరాములు
మహంకాళి శ్రీమన్నారాయణ
పసుమర్తి ఆదినారాయణ
పసుమర్తి రత్తయ్య
భాగవతుల రాజేశ్వరావు
భాగవతుల లక్ష్మీనరసింహ
హరి పున్నయ్య
దర్భా వెంకటేశ్వర్లు

చింతా కృష్ణమూర్తి

పైన వుదాహరించిన వారిలో చింతా కృష్ణమూర్తి కీ॥శే॥ చింతా వెంకటరామయ్యగారి పుత్రులు, ఆనాటి వెంకటరామా నాట్యమండలికి మేనేజరు. ఢిల్లీ, బొంబాయి, హైదరాబాదు మొదలైన ప్రముఖ నగరాలలో అమూల్యమైన సన్మానాల నందుకున్నారు. తండ్రిగారి వలే వీరు కూడ ప్రధాన పాత్రల్లోనూ, సూత్రధారుడు గాను ప్రఖ్యాతి వహించారు. ఆ మధ్య హైదరాబాదులో జరిగిన సంగీత నాటక అకాడమీ వారి నాట్య సదస్సులో సన్మానించ బడ్డారు. నేటి నటశేఖరుడైన వేదాంతం సత్యనారాయణ శర్మకు గురువులు.

ఆడవేషాల్లో అందెవేసిన మగధీరుడు వేదాంత సత్యనారాయణశర్మ:

ఈ నాటి యువనటుల్లో పేర్కొనదగిన వారు, వేదాంత సత్యనారయణశర్మ గారు. వీరు గొప్ప నటశేఖరులు. సత్యభామ, ఉష, మోహిని మొదలైన స్త్రీ భూమికల్ని ధరించి అనేక విద్వత్సభలలో అనేక పారితోషికాలను పొందడమేకాక కేంద్ర ప్రభుత్వం వారిచే అవార్డును అందుకుని సన్మానించబడ్డారు. నేటి నటుల్లో ప్రముఖుడు.

ఈ తరం రత్నాలు:

వేదాంతం పార్వతీశం
వేదాంతం మల్లికార్జున శర్మ
భాగవతుల రామతారకం
భాగ్వతుల రామకోటయ్య
భాగవతుల యజ్ఞనారాయణశర్మ
పసుమర్తి సీతారామయ్య
పసుమర్తి వేణుగోపాలశర్మ
పసుమర్తి సీతారామ శాస్త్రి
హేమాద్రి చిదంబర దీక్షితులు
చింతా సీతారామాంజనేయులు
యేలేశ్వరపు నాగేంద్ర శర్మ

కూచిపూడి ఆచార్యులపై సినిమాల ప్రభావం:

కూచిపూడి నాట్యాచార్యులపై సినిమా ప్రభావం కూడ జోరుగా పడింది. సినిమాలలో నృత్యాలు ప్రవేశ పెట్టబడడంతో కూచిపూడి నాట్యాచార్యులు సినిమాల మీదికి దృష్టిని మళ్ళించారు. అలా సినిమాల్లో ప్రవేశించి కీర్తి ప్రతిష్టలు గడించిన వారు వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యనారాయణ, వసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం, వేదాంతం జగన్నాథశర్మ మొదలైన వారు సినిమాలలో నృత్య దర్శకులుగా వెలుగొందుతున్నారు. వీరిలో వేదాంతం రాఘవయ్య గారు కొంతకాలం నృత్యదర్శకులుగా వుండి ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వమూ వహించి ప్రసిద్ధ దర్శకులలో ఒకరుగా వెలుగొందారు.

దాదినమ్మ భాగవత ప్రదర్శనం:

లీలావతి విజయగాథ వీథి భాగవతంగా రచించబడి అల్లంపాటీశ్వరునకు అంకితం చెయ్యబడింది. దీని వ్రాత ప్రతి మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో వుంది. ఈ గాథను దాదినమ్మ భాగవత ప్రదర్శనంగా కూచిపూడి వీథి భాగవతులు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఆంధ్ర దేశం అంతటా జేగీయమానంగా ప్రదర్శించారు. ఆ గాథ ఇది.

ఉజ్జయిని రాజైన భోజరాజుకు శివుని వరాన జన్మించిన గారాల బిడ్డ లీలావతి. లేక లేక కలిగిన ఆ బిడ్డకు ఏడుకోటల నడుమ ఒంటి స్థంభపు మేడ నిర్మించి అల్లారుముద్దుగా పెంచు కుంటున్నారు.

దిదిన ప్రవర్థమాన అవుతున్న ఆ సౌందర్యరాశి లీలావతి అంద చందాలను గురించి పురోహితుని ద్వారా విన్న మగధ దేశపు రాజు ముగ్ధుడై, లీలావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించి ఉజ్జయిని రాజుకు వార్తాహరుని ద్వారా వర్తమానం పంపిస్తాడు. ఇందుకు ఉజ్జయిని రాజు సమ్మతింపడు. ఆ వార్త విని ఉగ్రుడయిన మగధరాజు రాజ్యంలోని గజదొంగలను పిలిపించి ఎవరైతే లీలావతిని తెచ్చి తనకిస్తారో వారికి తన దేశంలో సగం భాగాన్ని దానంగా ఇస్తానని ప్రకటిస్తాడు. కర్ణకరుడనే దొంగ అందుకు అంగీకరించి ఉజ్జయిని నగరానికి బయలు దేరుతాడు. అక్కడ ఉజ్జయిని నగరంలో లీలావతి చెలికత్తెలతో ఆటపాటలతో అలిసి పోయి, దోమ తెర మంచంలో హాయిగా నిద్రిస్తూ వున్న సమయంలో దొంగ అయిన కర్ణకరుడు దొంగ చాటుగా ఆ ఒంటి స్థంభపు మేడకు కన్నంవేసి లీలావాతిపై మత్తుమందు చల్లి ఆమెను మంచంతో సహా కోట దాటించి అరణ్యంలోకి తీసుకొని పోతూ వుండగా మధ్యలో మేల్కొన్న లీలావతి దిగ్గున లేచి

దిగ్భ్రమ చెంది దుఃఖిస్తుంది. చెలికత్తెలందరిని పరస వరసన పేర్కొని విలపిస్తుంది. ఆ దొంగను అనేక విధాల శపిస్తుంది. రాజడండన తప్పదని వాణ్ణి వలువిధాల బెదిరిస్తుంది. ఏమీ పాలుపోక చివరికి భగవంతుణ్ణి వేయి విధాల ప్రార్థిస్తుంది. పుణ్యాత్ము లెవరైనా వచ్చి తనను రక్షించ వలసిందిగా అరణ్యమంతా దద్దరిల్లి పోయేటట్లు రోదిస్తుంది.

ఇంతలో ఆ అడవికి వేటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న మాళవ రాజుకు లీలావతి రోదన వినిపిస్తుంది. అతడు దిగ్గున లేచి రోదన వినిపించే దిక్కుకు వెడలి మంచంలో ఉన్న సుకుమారిని ఉజ్జయిని రాకుమార్తె లీలావతిగా తెలుసుకుని తగిన దండ ప్రయోగంతో దొంగల బారినుండి తప్పించి ఉజ్జయిని తీసుకుపోయి భోజరాజుకు అప్పగిస్తాడు. మాళవరాజు ఉపకారాన్ని మెచ్చుకున్న భోజరాజు లీలావతిని అతనికిచ్చి వైభోవోపేతంగా వివాహం చేస్తాడు. ఇదీ ఆ కథ.

దాదినమ్మా, నే దాదినమ్మ

దాదినమ్మా నే దాదినమ్మా
దాదిలో చిన్నదానవే యమ్మా
బాలనమ్మా నే బాలనమ్మా
బాలనపకీర్తి పాలైతినమ్మా
పుట్టకోటా, భూమి కోటా
కంచుకోటా, కల్వకోటా

ఇనుపకోటా, ఇత్తడి కోటా
వెండికోటా వెలసినాదీ
ఏడుకోటల నట్టనడుమా
ఒంటిస్థంభం మేడమీదా
పవ్వళించి నే నుండగా
మాయదారి కర్ణకరుడు
మత్తు చల్లీ నన్ను తెచ్చే.

అంటూ దరువుతో లీలావతి పాత్ర ధారిణిపై కథ అంతా వివరిస్తుంది.

తంత్రమూ, తంతూ

దాదినమ్మ ఉంటూ వచ్చిన పందిరిపట్టి మంచం ఒక వ్యక్తి పరుండడానికి

సరిపోయేటంత పొడవూ, వెడల్పూ కలిగి వుంటుంది. ఆ మంచానికి ఒక చిన్న పందిరికి చాందినీ దోమతెర, లోపల పందిరికి వ్రేలాడుతూ రకరకాల పన్నీటి బుడ్లు, మంచం వెదురు కర్రలతో చెయ్యబడి చాల తేలికగా వుంటుంది. లీలావతి పాత్రధారి మంచాన్ని రొమ్ముకు దిగువ కదలకుండా గట్టిగా కట్టివేసు కుంటాడు. నడుము కింది భాగమంతా పాదాల వరకూ కాళ్ళు కనబడకుండా మంచం కోళ్ళ చుట్టూ మంచానికి జాలరు దించి వుంటుంది. చూచేవారికి మంచం అలంకారం ఎంతో శోభాయమానంగా ననిపిస్తుంది. కాళ్ళ వద్ద మంచం మీద రెండు లక్కకాళ్ళు బయటకి కనబడేటట్లు అమరుస్తారు. ఇలా కాళ్ళు అమర్చడం వల్ల మంచంలో దిగబడిన లీలావతి ప్రాత్రధారి మంచంలో పరుండినట్లే ప్రేక్షకులకు భ్రాంతి కలిగించేది. భూమిమీద ఆనకుండా మంచం దానంతట అదే మధ్య అంతరంలో నిలబడినట్లు కనబడేది. కాళ్ళకు గజ్జెలు కట్టి లీలావతి పాత్రధారి పాట ప్రారంభించి నృత్యం చేస్తూ వుంటే పరుండిన వ్వక్తి పరుండి నట్లుగానే ఉన్నప్పుడు మంచం ఎలా నృత్యం చెయ్య గలుగుతున్నదా అని ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించేది.

ఈ ప్రదర్శనం మూడు గంటల కాలం జరిగేది. మంచం బరువుతో మూడు గంటల కాలం ఒకే పాత్రధారి విసుగు జనించ కుండా పాడుతూ, అభినయిస్తూ నృత్యం చేస్తూ ప్రేక్షకులను ఆనందింప జేసేవాడు. ఈ ప్రదర్శన ఇవ్వడంలో కూచిపూడి భాగవతులు సిద్ధ హస్తులు. వీరిలో నైనా అందరూ దీనిని ప్రదర్శించ గలిగేవారు కారు. దాదినమ్మ వేషం వెయ్యడంలో పూర్వం నాట్యకళానిధి వేదాంతం లక్ష్మీ నారాయణశాస్త్రి, వెంపటి వెంకటనారాయణ గార్లు సుప్రసిద్ధులు. వీరి తరువాత చెప్పుకోదగిన వారు చింతా రామమూర్తి, భాగవతుల రాజయ్య, వేదాంతం జగన్నాథశర్మ మొదలైనవారు.

వీథి భాగవతానికి వలెనే గ్రామంలో నాలుగు వీథుల నడుమ రచ్చబండ వద్ద వేసిన పందిరిలో ప్రదర్శనం, తెర, కాగడాలూ, వంతపాట గాండ్రూ, హాస్యా గాడూ మొదలైన హంగులతో, ఇరువైపులా జోడించి పట్టిన కాగడాలమీద చల్లిన గుగ్గిలం భగ్గు మనడంతో తెర తొలిగి పోయేది. తరువాత వెంటనే దాదినమ్మ పాత్ర ప్రవేశమై భాగవతం ఆరంబమయ్యేది. ఈ నాడు ఈ ప్రదర్శనం మచ్చుకు కూడ కనబడకుండా పోయింది. ప్రదర్శించే సమర్థులూ ఎవరూ లేరు. ఇది ఏకాపాత్రాభినయం లాంటిది.

ఆభరణాలూ, అలంకారాలూ:

కూచిపూడి భాగవతులు వారు ప్రదర్శించే ప్రదర్శనాలలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన వేషధారణను, ప్రాచీన సంప్రదాయలతో కూడుకున్న ఆభరణాలను ప్రవేశపెట్టారు. నాయిక, నాయకుడు, విదూషకుడు, చెలికత్తె, వుపనాయకులు మొదలైన అనేక పాత్రలు వారి వారి తారతమ్యంతో కూడుకున్న శరీరాలంకరణాలను, కంఠాభరణాల్ని, శిరోభూషణాలను ధరించేవారు. పురుషపాత్రల్లో ముఖ్యంగా రాజు కిరీటాన్ని, శంఖ చక్రగదాదండాల్ని, భుజ కీర్తుల్నీ గండ భేరుండ పతకాలలు, కర్ణ పత్రాలు, కాశికోక, కండువాలు, నల్లకోటు మొదలైన వాటిని ప్రధాన భూషణాలుగా ధరించేవారు.

ఇంకా పురుష పాత్రల్లో తార తమ్యాలను బట్టి తదితర కోట్లు, ఘర్వాలు, చొక్కాలు, అంగరఖాలు ఉపయోగించేవారు.

నరసింహ స్వామి, శక్తి, రావణుడు, హిరణ్యకశిపుడు, హనుమంతుడు మొదలైన భీకర పాత్రలకు కరాళములను, ముఖాలకు ముసుగులను వాడేవారు.

అందమైన ఆభరణాలు:

నిత్య జీవితంలోనే పురుషులకంటే స్త్రీలకు ఆభరణాలు ఎక్కువ. అలాగే ప్రదర్శనాలలో కూడ ఎక్కువగా ధరించేవారు. నిజంగా కూచిపూడి కళాకారులు వారి భాగవతాలలో స్త్రీ పాత్రలకు ఒక ప్రత్యేకమైన ఆభరణాలను ధరింపజేసేవారు. ఆ కాలంలో ఆచరణలో వున్న స్త్రీల అభరణాల నన్నింటినీ పుపయోగించేవారు. కొన్ని లోహాలకు సంబందించినవి, మరి కొన్ని పేడతో తయారు చేసినవి, మరికొన్ని కాగితాలతో మోల్డింగులుగా తయారుచేసినవి ధరించేవారు.

భామ వేషపు నగలు:

భామ వేశ్హానికి ఎన్నో ప్రాచీన ఆ ఆభరణాలను ఉపయ్హోగించేవారు. వారానికి కొన్ని నగలు చొప్పున, ఏడువారాలకు ఏడు రకాలైన వివిధ ఆభరణాలను ధరించే వారు: పెద్ద జడ, చిన్న జడ,__ శిఖ, __రాగిరేకులు, __ మొగిలి రేఖులు, __రాగిడి__ చంద్రవంక__ కమ్మలు, __ జూకాలు __ తాయెత్తులు__ చేర్లు__ పాపిట తురాయి__ పాపిడి పింజరాలు__ కడియాలు__ డండ కడియాలు __పోచీలు __దట్టెడ__ అడ్డబాస__ బిళ్ళలమొలత్రాడు__ కట్టడపు బులాకి __ ముక్కుపుల్ల మొదలగునవి. ఇవిగాక కాసులపేరు__ సూర్యుడు__ముత్యాలు__తాయెత్తులు __కితకి వడ్డాణము __ జడకుప్పెలు __ మొదలైనవి కూడా ధరిస్తారు. వారి జడబిళ్ళలు నవరత్నాలు చెక్కినట్లుండేవి. ఆ బిళ్ళ సూర్యుడు__ చంద్రుడు __నక్షత్రాలు మొదలైన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలుండేవి.

అసలు తానీషా భూరి విరాళం:

సిద్ధేంద్రయోగి పెట్టిన బిక్షతో అనేక సంవత్సరాలు కూచిపూడి వారు యక్షగానాల ద్వారాను, వీధిభాగవతాల ద్వారాను నానాదేశ సందర్శనం చేసి విరాళాలను పొందారు. ఆ విధంగానే గోల్కొండను పరిపాలించిన నవాబ్ అబ్దుల్ హసన్ తానీషా కూడ కూచిపూడి కళాకారులకు 1687 లో కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దాన మిచ్చారు. ఆ కాలంలో సిద్ధేంద్ర యోగి జీవించే వున్నాడని, నవాబుతో రాగి రేకుమీద ఆగ్రహారపు దానపట్టాను వ్రాయించింది కూడ సిద్ధేంద్రుడేనని కొందరంటున్నారు. ఏది ఏమైనా నాట్య కళా సాంప్రదాయాలకు తమ జీవితాన్ని అంకితం చేసిన బ్రాహ్మణ కుటుంబాల కళాకారు లందరూ ఈ ఆగ్రహారపు దానాన్ని పొందేటట్లు పట్టాలో వ్రాయబడిందట. ఆ నాటి నుండి ఈనాటివరకూ తరతరాలుగా ఆ కుటుంబాలన్నీ దీనిని అనుభవిస్తూనే వున్నాయి.

'సాహెబా సల్లామురా'తో సన్మానం:

కూచిపూడి భాగవతులు ఆనాటి ఆంధ్ర దేశమే కాక హైదరాబాదు, విజయనగరం, తంజావూరు మొదలైన సంస్థానాలన్నిటిని సందర్శించే వారు. అనేక మంది రాజుల్నీ సామంతుల్నీ ఆశ్రయించారు. అలా సంచారం చేసే రోజుల్లో బననగాని పల్లె నవాబు వారిని ఆహ్వానించి వారి ప్రదర్శన లన్నిటినీ చూసి వారి కౌశల్యాన్ని వేనోళ్ళ పొగిడి వారికి తగిన పారితోషికాన్నిచ్చారు.

కూచిపూడి ఇలా మహమ్మదీయ నవాబుల సన్నిధికి వెళ్ళినప్పుడల్లా వారిని స్త్రోత్రం చేస్తూ వుండేవారు. వారి పాటల్లో ఎక్కడో ఒక చోట వారిని స్తుతిస్తూ వుండేవారు. వారి జతులు రాముని మీదో, విష్ణువు మీదో, కృష్ణుని మీదో రచింపబడి, కీర్తనాంతంలో తుది పాదంలో 'సాహెబా

సల్లామురా' అని స్తుతించేవారు. అంటే అటు హిందువులకు ఆగ్రహం లేకుండా హిందుమత సాంప్రదాయ ప్రకారం విష్ణునీ కృష్ణునీ కీర్తించి, ఇటు 'సాహెబా నల్లామురా' అని నవాబుల మెప్పును పొందే వారు. ఇలా లౌకిక వృత్తితో కళా ప్రచారాన్ని అన్నిమార్గాలా, అన్ని మతాల ప్రజల్లోకీ చొప్పించారు. ఉదాహరణకు వారు కీర్తించిన ఒక జతిలో__

తాకు ఝేకుకు ఝేకు రేకిణ
సారెసారెకు పరశురాముని
సన్నుతించె నీరజాక్షవినయా
రతిరతిందరి
తాకిణాంగ ఝేకిణాంత
రవికులాంబుధి సోమ దశరథ
రామచంద్ర నిండుపున్నమ
వెన్నెలాయెర మన్నెధీర
భళిర మేల్ సెబాసు సల్లాముర!

అని దీవించేవారు. వారు ఈ విధంగా తురుష్క ప్రభువుల్ని మెప్పించి అనేక జాగీర్లను పొందారు. అలాంటివే పైన వివరించిన బనగాని పల్లె నవాబు వ్రాసి యిచ్చిన గ్రామాలు కోటకొండ _కపట్రాల.

రాచగద్దె ఎక్కిరాణ కెక్కిన వేదాంతం సాంబయ్య:

వేదాంతం సాంబయ్యగారనే కూచి పూడి భరతనాట్యాచారుడు 18 వ శతాబ్దంలో అనంతశయనం మహారాజుగారి ఆస్థానంలో ప్రవేశించి తన పాండిత్య ప్రావీణ్యాన్ని, నటనాకౌశల్యాన్ని ప్రదర్శించాడు. అనంతశయనం మహారాజు అబ్బురపడ్డాడు. ఆయనను తన సింహాసనం మీద ఒక గంట కాలం తృప్తిదీరా కూర్చుండ బెట్టి సువర్ణహస్త కంకణాలను ధరింప జేసి సాంబయ్యగారిని సన్మానించాడు.

ఆశక్త దుర్జనత్వం, మంత్ర తంత్రాల ప్రయోగం:

కూచిపూడి వారు వుధృతంగా ప్రదర్శనాలిస్తున్న రోజుల్లో చాతబడులు, మంత్ర తంత్రాలతో మచ్చుజల్లడం మొదలైనవి ఎక్కువగా వుండేవి. కళాకారుల్లో విపరీతమైన పోటీ భావం వుండడం వల్ల ఒకరికంటే ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తుండేవారు. శాస్త్ర పరీక్షతో పాటు ఈ మంత్ర పరీక్షలు కూడ వుండేవి. ముఖ్యంగా ఒకరిని మరొకరు జయించలే మనుకున్నప్పుడు ఈర్ష్యాభావంతోనూ, రాజాధిరాజులు, మహారాజుల మెప్పు పొందడానికి పడే పోటీలవల్ల కుళ్ళు బుద్ధితోనూ ఒకరిమీద ఒకరు మంత్ర ప్రయోగాలు చేసుకునేవారు. అలా ప్రయోగించిన ప్రయోగాలలో మచ్చుకు ఒక ఉదాహరణ:

కుక్కకాటుకు చెప్పు దెబ్బ:

ఒకసారి మన భాగవతులు మలయాళ దేశానికి సంచారం వెళ్ళగా ఒక గ్రామంలో వీరి ప్రదర్శనానికి అనుమతి ఇవ్వలేదు. కారణం ఆ గ్రామంలో ఒక మంత్ర వేత్త వున్నాడట. అతని అనుమతి లేక ఎవరూ ప్రదర్శన ఇవ్వకూడదట. అయినా మన కూచిపూడి వారు ఆ మంత్ర వేత్తని లెక్క చేయకుండా ప్రదర్శనాన్ని యివ్వడానికి నిర్ణయించుకున్నారు.

ఆనాడు ఉదయం మన భాగవత శిఖామణి భాగవతుల దశరథరామయ్య గారు ఆ మలయాళ మాంత్రికుని ఇంటికి వెళ్ళాడు. మాంత్రికుడు ఇంటివద్ద లేడు. ఈయన ఆ మాంత్రికుని భార్యను చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అర్థించగా ఆమె నిప్పు ఇవ్వడం, ఈయన చుట్ట కాల్చుకోవడం, తదనంతరం ఆ అగ్నిని ఈయన గుడ్డలో మూట గట్టుకొని వెళ్ళి పోవడం జరిగిందట. ఎక్కడికో వెళ్ళివచ్చిన మలయాళ మాంత్రికునికి భార్య ఈ వృత్తాంతం చెప్పగా అతగాడు మండిపోయి ఆనాటి ప్రదర్శనంలో ప్రతి క్రియగా భామావేష కారునికి కడుపుబ్బునట్లు జలోదర ప్రయోగం చేశాడట. ఇంకేముంది? దశరథ రామయ్య గారు చూచి కించిత్తు చలించకుండా, 'చూడు నా తడాఖా ' అని ప్రతీకారంగా ఒక గంటాన్ని తీసుకుని ఒక స్థంభాన్ని పొడవగా ఆరంధ్రం నుంచి నీరు కారడం ప్రారంభించి, భామ వేషధారికి కడుపు నొప్పిచట్టున తగ్గిందట.

దెబ్బపై దెబ్బ:

దశరథ రామయ్యగారు అంతలో ఊరుకోలేదు. మలయాళ మాంత్రికునికి ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాడు. వెంటనే ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న మలయాళ మాంత్రికుణ్ణి కదల లేకుండా కూర్చున్నట్లే బంధించి వేశాడు. ప్రదర్శనం తెల్లవారులు జరిగింది. కాని మాంత్రికుడు కదలలేదు. ప్రదర్శనం ఆ సాంతమై అందరూ వెళ్ళిపోయారు. కాని ఆ మాంత్రికుడు మాత్రం శిలలా అలాగే కూలబడి వున్నాడు. ఈ స్థితిని చూచిన మాంత్రికుని భార్య దశరథ రామయ్య గారిని వేడుకోగా ఆయన జాలి దలచి మంత్ర బంధనాన్ని సడలించాడు. తరువాత మాంత్రికుడు ఇల్లు చేరాడట. ఈ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే ఇటువంటి ప్రమాదాల నన్నింటినీ తప్పించుకుంటూ వుండేవారని అనేక కథలున్నాయి.

గొల్లకు గొల్ల, భామకు భామ:

భాగవతుల దశరథ రామయ్య గారు గొల్ల కలాప ప్రదర్శనాల నిర్వహణలో అఖండ ప్రఖ్యాతి పొందిన వారు. బాల్యంలో గొల్ల వేషం; కౌమార దశనుండి యవ్వన దశవరకూ భామ వేషం, ఆ తరువాత భామా కలాపంలో సూత్రధారిగా వుండి గొప్ప ప్రతిష్ఠ పొందారు.

దశరథ రామయ్యగారు ఈ విధంగా కొంతకాలం భామకలాప వ్రదర్శనలో వుండి, తరువాత భూత వైద్యవిద్య కూడ అభ్యసించారు. ఒక సమాజానికి దర్శకత్వం వహించి ఆ బృందాన్ని నడుపుతూ దేశ పర్యటన చేస్తూ వుండే వారట. ఈ యన సకల శాస్త్ర పారంగతుడైన భాగవతుల ల్లక్ష్మీ నారాయణగారికి, భాగవతుల రామనాథ శాస్త్రి గారికి సమకాలికులు. వీరు తమ జట్టులతో దేశ సంచారం చేస్తూ గొప్ప గొప్ప సంస్థానాల కేగి పండిత సభల్లో ప్రదర్శనాలు ఇచ్చి అఖండమైన ఖ్యాతి ఆర్జించారు. ఈ విధంగా వీరు విజయయాత్ర చేస్తూ వుండేవారు. వీరి విద్యా ప్రభావానికి ఆబాల గోపాలం అనందపడుతూ వుండేవారు.

పండితుల సవాళ్ళు:

ఆ రోజుల్లో కేవలం ప్రదర్శనమిచ్చే మామూలు నటులుగానే గాక, సభాముఖంలో అప్పటికప్పుడు పరీక్షలతో ప్రశ్నించే పండితులకు సమర్థతతో సమాధానం చెప్పి ఎటువంటి పరీక్షల కైనా తట్టుకో కలిగిన పండితులూ సమాజాల్లో __స్త్రీల లోనూ, పురుషులలోనూ _ వుండేవారట.

ఇటువంటి కుటుంబాలు కృష్ణాజిల్లా నంగిగెడ్డ గ్రామంలో అనేకం వుండేవి. గుంటూరు జిల్లాలోని బోడాయి పాలెంలో చిన్న రాణి అనే ఒక నర్తకి ప్రదర్శనాన్ని ప్రసిద్ధ పండితులందరూ మెచ్చుకునేవారట. అలాగే రేపల్లె తాలూకా, ధూళిపూడి గ్రామస్థులు మహంకాళి సీతయ్యగారు, ఒంగోలు తాలూకాలోని తమ్మవరం కాపురస్తుడు తమ్మవరం వేంకటస్వామి మొదలైన వారు ప్రసిద్ధులు.

గజ్జె కట్టిన అందరికీ గురువు:

చింతా వెంకటరామయ్యగారు 1860 వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి శివరామయ్య; తల్లి అరుంధతమ్మ. పది సంవత్సరాల ప్రాయంలోనే పాటలో, ఆటలో, హాస్యంలో అనుభవం సంపాదించి, భామవేషపు దరువుల్ని పాడుతూ వుండేవారు. వెంకాటరామయ్యగారి ప్రాతిభా విశేషాలను గనమించి ఏలేశ్వరపు నారాయణప్ప గారు వారి మేళంలో చేర్చుకున్నారు. 12 వ సంవత్సరం లోనే అన్న గారైన వెంకటరత్నం గారి వద్ద నాట్య శిక్షణను ప్రారంభించి 16 సంవత్సరాలకే విశేష నాట్యశాస్త్రానుభవాన్ని సంపాదించారు.

వీరు భాగవతామేళాన్ని 1875 నుండి దాదాపు 1936 వరకూ నిర్వహించారు. ఈనాడు నిర్వహించబడుతున్న వెంకటరామా నట్యమండలి 1875 లో వెంకట రామయ్య గారితో ప్రారంభించపడిందే. కొంతకాలం భాగవతమనే పేరుమీద, భామాకలాపాన్ని ప్రదర్శించారు. ప్రజాభిరుచుల్ని అనుసరించి యక్షగానాలను ప్రవేశపెట్టి, ప్రహ్లద, ఉషాపరిణయం, గయ నాటకము, రుక్మాంగద, రామ నాటకం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం మొదలైన నాటకాలను ప్రదర్శించి ప్రజామన్ననల్ని పొందారు.

ప్రయాణ సౌకర్యాలు లేని ఆనాడు ఆంధ్రదేశపు నాలుగు చెరగులా ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసి ప్రదర్శనాలిచ్చి, ఉన్నతాధికారుల వద్దా, సంస్థానాధీశ్వరుల వద్దా పారితోషికాలు పొందారు.

ఆనాటినుండి చనిపోయే వరకూ కూచిపూడిలో గజ్జెకట్టిన ప్రతి కళాకారుడూ ఆయన వద్ద శిష్యరికం చేసినావారే. ప్రాచీనులైన చింతా నారాయణమూర్తి, వెంపటి పరదేశి వేదాంతం చలపతి, చింతా ఆదినారాయణ మొదలైన ప్రముఖులు ఆయన శిష్యులే.

ఆధునికులలో వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తిగార్లు ముఖ్యులు. వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలో సర్వసమర్థునిగా తయారు చేసి 1934 లో మద్రాసులో గూడవల్లి రామబ్రహ్మంగారి అధ్యుక్షతను జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో, తాము సూత్రధారులుగా ప్రదర్శనమిప్పించి, 'సెహభాష్ ' అనిపించి, నాటి రాఘవయ్యగారి ఉన్నత స్థానానికి పునాదులు వేశారు.

వెంకట రామయ్యగారి శిష్యులలో పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ కడపటి వారు.

వెంకటరామయ్యగారి శిక్షణ విచిత్రమైంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు ఏ భావం, ఏ రీతి, ఏ భంగిమ స్ఫురణకు వస్తే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు బోధించేవారు. ఇంతటి ప్రతిభావంతుడైన వెంకట్రామయ్యగారు 90 సంవత్సరాలు ధృవతారగా వెలుగొంది 6_1_1949 లో కీర్తిశేషులైనారు.

బహువేషధారి భాగవతుల విస్సయ్య:
భాగవతుల విస్సయ్య

భాగవతుల విస్సయ్య గారు వృషభనామ సంవత్సర పాల్గుణ మాసంలో కూచిపూడిలో జన్మించారు. వీరి తండ్రి గారు భాగవతుల రామయ్య గారు, విస్సయ్య గారు 7 సంవత్సరాల ప్రాయంలోనే సిద్ధేంద్ర యోగీంద్రుల భామాకలాపాన్ని రాగ, తాళ, హావ, భావాలతో అభ్యశించారు. తండ్రిగారి వద్దా, భాగవతుల యజ్ఞ నారాయణ గారి వద్దా భరత శాస్త్రాన్నంతా అభ్యసించారు. 10 సంవత్సరాల ప్రాయంలోనే బాలింత వేషం వేసి ప్రఖ్యాతి వహించారు. బహుమతుల్ని అందుకున్నారు. యుక్తవయస్సు రాగానే బాలింత వేషం, దాదినమ్మ వేషం, ప్రహ్లాదలో లీలావతి, ఉషాపరిణయంలో చిత్రరేఖ, ఉషా కన్యల పాత్రల్ని ధరించి ప్రఖ్యాతి వహించారు. సువర్ణ ఘంటాకంకణాలతో సన్మానాలు పొందారు. తరువాత నాటకాలలో పాత్రలు ధరించటం విరమించి నంగె గడ్డలో కళావంతులకు వారికి నచ్చిన విద్యనంతా నేర్పి, ఆ గ్రామంలో ఏడెనిమిది మేళాల్ని తయారు చేశారు.

నాట్యకళానిధి వేదాంతం:

కూచిపూడి నాట్య కళా కారులలో అగ్ర శ్రేణికి చెందిన వారిలో ముఖ్యులు బ్రహ్మశ్రీ నాట్య కళానిధి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారు.

యక్షగానాలూ, వీధి భాగవతాల్లో పారంపర్యంగా వచ్చే సాధారణ నృత్యాల బాణీకి భిన్నంగా శాస్త్రిగారు కొత్తపద్ధతి అనుసరించారు. భరతనాట్య శాస్త్ర సంప్రదాయాల ఆధారంతో శ్రీ నారాయణతీర్థుల కృష్ణలీలా తరంగిణి

వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి

తరంగాలకు, శ్రీ జయదేవ కవి అష్టపదులకు, క్షేత్రయ్య మువ్వ గోపాల పదాలకు, కృష్ణకర్ణామృతం, పుష్ప బాణ విలాసం శ్లోకాలకు నృత్యాలు సరికొత్తగా లల్పించి, ప్రధాన పాత్రల లక్షణాలు, మనస్తత్వాలు నిరూపించి, శాస్త్రోక్తంగా ఒక నూతన నాట్యశాస్త్రమే కల్పన చేసి, శిష్య ప్రశిష్యుల్ని తయారు చేసి ఆంధ్ర దేశానికి ప్రసాదించిన మహానీయులు వీరు. భామాకలాపంలో సత్యభామ నాయిక, సత్యభామ పాత్ర నిర్వహణలో అపూర్వంగా అఖండ ప్రజ్ఞ ప్రదర్శించిన వ్వక్తి ఈయన. ఈయన ఒక్క భామాకలాపం, గొల్ల కలాపాలే కాకుండా, దాదినమ్మ వేషం, లీలావతి విజయంలో బాలింత వేషం, శ్రీ కృష్ణ జననం మొదలైన యక్షగానాల పాత్రలనూ అత్యద్భుతంగా నిర్వహించేవారు. శాస్త్రిగారి విద్యను దర్శించిన ఉత్తరాది ఉజ్వల నటుడు ఉదయశంకర్ ఉండ బట్టలేక ఈయనకు అమాంతంగా సాష్టాంగమే పడ్డాడు.

శాస్త్రిగారి జీవితం అంతా రాజుల ఆస్థానాల్లోనే గడిచింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం భావనగర్ మహారాజా గవర్నరు గిరీకింద శ్రీ పి.వి.రాజమన్నారు సమక్షంలో ప్రముఖ కళాకారులుగా శాస్త్రిగారిని గుర్తించి సువర్ణ ఘంటాకంకణాలతో సత్కరించింది.

ఎందరో శిష్యులు:
వెంపటి చినసత్యం

శాస్త్రిగారి దగ్గిర భామాకలాపం, గొల్ల కలాపం, నేర్చుకున్న శిష్యులు అసంఖ్యాకం. ఈ నాడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులుగా కీర్తి సంపాదిందిన వేదాంతం రాఘవయ్య, వెంపటి సత్యం, వెంపటి చినసత్యం, మొదలైన వారు శాస్త్రి గారి శిష్యులే. మద్రాసు లోని సుప్రసిద్ధ నాట్యాచార్యుడు శ్రీ రామయ్యపిళ్ళె స్వయంగా కొన్ని నాట్య రీతులు శాస్త్రిగారి వద్ద అభ్యసించారు.

రామయణం, మండూకశబ్దం, ప్రహ్లాద పట్టాభి షేకం, తాటకి సంహారం, దశావతారాలు మొదలైన వాటిని శబ్ద రూపంలో శ్రీ శాస్త్రిగారు నృత్యం చేసే వారు. ఆంధ్రదేశం అంతటా జరిగిన ఆయ నృత్య ప్రదర్శనాలు విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి. ఆయన 82 సంవత్సరాలు జీవించి 1957 జూలై 13 వ తేదీన హైదరాబాదులో కీర్తి శేషులైనారు.

హరిపున్నయ్య:

కూచిపూడి నృత్య నాటక సంప్రదాయంలో, భయానక, భీభత్స, రౌద్ర, వీర రసాలను పోషించే పాత్రలను ధరించి ప్రేక్షకుల హృదయాలను రంజింపచేసి సుప్రసిద్ధ కళాకారులుగా వెలుగొందారు హరి పున్నయ్య గారు. వీరిది కూచిపూడి గ్రామం చిరకాలంగా కళాలక్ష్మిని ఆరాధించిన కళాజీవి.

హరి పున్నయ్య
సాత్విక వేషాల్లో సై అనిపించుకొన్న సవ్యసాచి:

కూచిపూడి వీథి నాటకాలలో సాత్విక పాత్రల్ని రసవంతంగా అభినయించడంలో ఆరితేరినవారు వేదాంతం రామకృష్ణయ్యగారు. యక్షగాన విద్యలోనూ, కలాప విద్యలోనూ అపారమైన జ్ఞానాన్ని ఆర్జించిన ప్రముఖ కళాకారులు. వృద్ధాప్యంలో సంగీత నాటక అకాడమీ వారి పారితోషికాలు పై సైతం పొందుతున్నారు.

క్షీణదశ:

ప్రాచీన నాట్య కళ ప్రచారమవడానికి కూచిపూడి వారు ఎంతో కృషి చేశారు. కాని ఎంత చేసినా, పాత పరిధిని మించి క్రొత్త వరిధిని చేపట్టలేక పోయారు. పౌరాణిక గాథలు తప్పితే చారిత్రిక, సాంఘిక ప్రదర్శనాలను తయారు చేయలేక పోయారు. కాగా రాను రాను రాజుల ఆదరణ తగ్గింది. పరిణామ స్థితిగతుల ననుసరించి వారి భాగవతాలు ముందుకు రాలేదు. వారు కాలంతోపాటు కాలు వేయ లేకపోయారు. అవి ప్రేక్షకులకు కూడా కొంతవరకు విసుగు పుట్టించాయనే చెప్పాలి.

అయ్యంకి తాండవకృష్ణ
శుక్లపక్షం నుంచి కృష్ణపక్షం:

కూచిపూడి వారి నాట్యకళా సాంప్రదాయాలు ఆంధ్రదేశమంతటా, వెలిగినంత మట్టుకు క్రీ॥ శ॥ 1180 వరకూ వేయి వెలుగులతో వెలుగొందాయి. ఆ రోజుల్లోనే ధార్వాడ నాటక సమాజాలు ఆంధ్ర దేశానికి వచ్చి ప్రదర్శనలిచ్చి, వేనోళ్ళ పొగడబడుతూ వచ్చాయి. దేశకాల లెరిగి రంగస్థలంలో వారు అనేక మార్ఫ్పులు తీసుకువచ్చారు. చెమ్కి దుస్తులతో రమణీయంగా ప్రదర్శనలిచ్చారు. తహతహతో మార్పు కావాలనుకుంటున్న ప్రజలకు ఒక నూతన ఆనందాన్ని కలుగ జేశాయి ఈ ప్రదర్శనలు. ఈ రోజుల్లోనే కూచిపూడివారి ప్రదర్శనల ప్రభావం మగ్గుపట్టి తగ్గుతూ వచ్చింది. అంతే కాక ధార్వాడ వారు వచ్చి వెళ్ళిన తరువాత వారి ప్రభల ప్రచారంతో ఆంధ్రదేశ ప్రముఖ పట్టణాలలో ఎన్నో విద్యావంతుల నాటక సంఘాలు బయలుదేరి, అచ్చంగా ధార్వాడ వారి అడుగుజాడల్లో ప్రదర్శన లిచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూచిపూడి వారి ప్రదర్శనాల మీద మోజు బాగా తగ్గిపోయింది.

యామిని కృష్ణమూర్తి

1930 నాటికి నాటకాల ఉధృతం కూడ కొంతవరకు తగ్గి సినిమాల ప్రభావం బహు ఎక్కువైంది. ఆ సినిమా ప్రభావంతో రంగస్థల నాటకాలు కూచిపూడి వారి నాటకాలు కూడా బాగా దెబ్బతిని పోయాయి.

మేలుకోలు - క్రొత్త మెరుగులు:

1880 - 1930 మధ్యకాలంలో కూచిపూడివారు ఏటి కెదురీదలేక తమ ప్రదర్శనాలలో కూడ కొన్ని మార్పులు తీసుకువచ్చాడు. రంగస్థల నాటకాలు ప్రేక్షకులను ఏ విధంగా ఎందుకు ఆకర్షిస్తున్నాయో ఆ కీలకాలన్నిటినీ తెలుసుకొని భాగవత సాంప్రదాయాలలో కొంత సంస్కారం తీసుకువచ్చి, తెరలు, హర్మోనియం, పద్యాలు, పాటలు, చెమ్కీ దుస్తులు ప్రవేశపెట్టి భరత నాట్య సంప్రదాయాల ననుసరించి ప్రదర్శనాలను ఇచ్చారు.

ఎందరో నిష్ణాతులు:

ఈనాడు కూచిపూడిలో వెనుకటి వైభవం లేదు. ఆ తరం వారెవ్వరూ లేరు. ఆ నాటకాలను ప్రదర్శించే వేదాంతం సత్యనారాయణగారు తప్ప మరొకరు లేరు. ఆయన స్త్రీ పాత్రలో, భామా కలాపాన్ని అభినయించడంలో దిట్ట. పద్మశ్రీ అవార్డులతో పాటు ఎన్నో అవార్డుల నందుకున్నారు.

కూచిపూడి నాట్యం జానపద నాట్యంమే కాని దానికి శాస్త్రీయత లేదని కొందరు వక్ర భాష్యాలు చెప్పారు. కూచిపూడి నృత్యాన్ని శాస్త్రీయ నృత్యంగా గుర్తింపు తీసుకు రావడానికి సంగీత నాటక అకాడమీ ద్వారా కృషి చేసి, శాస్త్రీయ నృత్యంగా స్థిరపరచారు. ఇందుకోసం ఎందరో మహానుభావులు కృషి చేసారు.

శిధిలమౌతున్న కూచిపూడి నృత్య కళను పునరుద్ధరించటానికి సిద్ధేంద్ర కళా క్షేత్రాన్ని ఎర్పాటు చేసి గురుకుల పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, సంగీత నాటక అకాడమీ గ్రాంటుల నిచ్చి పోషించింది. సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని ఈనాడు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకుని కూచిపూడి నృత్య కళను కాలేజీ స్థాయిలో పాఠ్యాంశంగా చేయాలని కృషి చేస్తూ వుంది. కూచిపూడి వీథినాటకాన్ని ఇటీవల వేదాంతం సత్యనారాయణ గారు వెలుగు లోకి తీసుకువస్త్గే, మరో ప్రక్క వెంపటి చిన సత్యంగారు ముప్పది సంవత్సరాలుగా మద్రాసులో కూచిపూడి ఆర్టు అకాడమీని స్థాపించి, ఎంతో మంది ప్రముఖులకు కూచిపూడి నృత్య కళలో శిక్షణ నిచ్చి... పద్మావతీ శ్రీనివాస కల్యాణం లాంటి నృత్య నాటకాలను కూచిపూడి శైలిలో తయారుచేసి దేశం అన్ని ప్రాంతాల్లోనూ, విదేశాల్లోనూ ప్రదర్శనాలను ప్రదర్శించి కూచి పూడి నాట్యానికి విశ్వ విఖ్యాత కీర్తిని సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సత్యంగారికి, కళా ప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరించింది. ఇంకా మరెన్నో అవార్డుల నందుకున్నారు. ఈనాడు అడయారులో, కూచిపూడి ఆర్టు అకాడమీ పేరున స్వంత భవనాలను నిర్మించి , దాని నొక విఖ్యాత కూచిపూడి నృత్య కళా కేంద్రంగా తీర్చి దిద్దటానికి కృషి చేస్తున్నారు. కూచిపూడి నృత్యంలో ప్రవీణురాలైన, యామినీ కృష్ణమూర్తి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి గోపాలశర్మ, చింతా కృష్ణమూర్తి మొదలైన వారి వద్ద నృత్యం నేర్చుకుని విదేశాలలో కూచిపూడి నృత్య కళకు పేరు తీసుకువచ్చారు. ప్రభుత్వం పద్మ శ్రీతో గౌరవించింది.

ఎం.ఏ. పట్ట భద్రులైన కోరాడ, అంతర్జాతీయ నృత్య సదస్సు పారిస్ లో జరిగినప్పుడు కూచిపూడి నృత్యం ప్రదర్శించి ప్రథమ పురస్కారాన్ని అందుకున్నారు. గుడిమెట్ల కృష్ణ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రి గార్ల వద్ద విద్య నభ్యసించి 1957 లో ఢిల్లీలో జరిగిన ప్రజా నాట్యమండలి మహా సభలో కూచి పూడి నృత్యం ప్రదర్శించి ప్రథమ బహుమతి నందుకున్నారు.

అన్నినృత్యాలనూ ఆకళింపు చేసుకున్న డా॥నటరాజరామకృష్ణ కూచిపూడి నృత్యంలో ఆరితేరి దేవదాసీ నృత్య సంప్రదాయాన్నీ ఆంధ్ర నాట్యాన్నీ పునరుద్ధరించి నృత్యకళమీద ఎన్నో గ్రంథాలను వ్రాసి, ఎంతో మంది శిష్యులను తయారు చేసి నృత్య కళకు ఎంతో సేవ చేసిన రామకృష్ణగారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ నిచ్చి గౌరవించింది.

సంగీత నాటక అకాడమీ భరతకళా ప్రపూర్ణ బిరుదునిచ్చింది. నిజమైన కళా తపస్వి నటరాజ రామకృష్ణ గారు.

అలాగే విజయనగరానికి చెందిన డి.వై.సంపత్ కుమార్, దువ్వూరి జగన్నాథశర్మ వద్ద నృత్యం నేర్చుకుని గీతాంజలి, నృత్యాంజలి సంస్థలను స్తాపించి, శాస్త్రీయ జానపద రీతుల్ని వెలుగు లోకి తీసుకువచ్చి, రాధాకృష్ణన్ లాంటి వారి ప్రశంసల నందుకున్నారు. ఆంధ్ర జాలరి నృత్యాన్ని 1968 లో బెర్లిన్ అంతర్జాతీయ యువజనోత్సవాలలో ప్రదర్శించి బంగారు పతకాన్ని అందుకున్నారు. జానపద నృత్యాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. అంధ్ర విశ్వవిద్యాలయం, కళా పూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది.

పైవారే కాక, రాజారెడ్డి, రాధారెడ్డి బృందం ఢిల్లీని కేంద్రంగా చేసుకుని కూచిపూడి నృత్యాన్ని ఇతర దేశాలలో ప్రదర్శించి ప్రఖ్యాతి వహించారు. కూచిపూడి నృత్యంలో రాజసులోచనకు ప్రత్యేక స్థానముంది. సినీ నటిగా, నర్తకిగా ఆమె ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, శిక్షణనిచ్చి కూచిపూడి నృత్యానికి మంచి పేరు తీసుకువచ్చింది.

అలాగే రత్నపాప పతివాడ రాధిక, కనక దుర్గ, ఉమాభారతి, అన్నపూర్ణ, సుమతీ కౌశల్, శోభానాయుడు, యడవల్లి రమ, చంద్రకళ, కళ్యాణి, మంజుభార్గవి మొదలైన ఎంతో మంది కూచిపూడి నృత్యకళకి ప్రాణం పోశారు. మరెందరి పేర్లో ఉదహరించలేక పోయి నందుకు విచారిస్తున్నాను. కావాలని ఎవరినీ విస్మరించ లేదు. ప్రతిభావంతులు మరుగున పడి వుండవచ్చును.

రాజసులోచన

ఈ నాడు రాష్ట్ర వ్వాప్తంగా ఎంతో మంది కూచి పూడి నృత్య విద్యాలయాలను స్థాపించి శిక్షణ ఇస్తున్నారు. కాని ఈ శిక్షఃణాలయాలను ప్రతిభావంతులు కాని వారు కూడా నడుపుతూ

కూచిపూడి నృత్య కళకు అపకీర్తి తెస్తున్నారు. ఏది ఏమైనా కూచి పూడి నృత్యంతో పాటు వారి యక్షగాన కళనూ, వీథినాటకాలనూ, పగటివేషాలనూ సంప్రదాయ పద్దతిలో రక్షించడం ఎంతైనా అవసరం.