తెలుగువారి జానపద కళారూపాలు/చూడచక్కని చోడిగాని కలాపం

వికీసోర్స్ నుండి

చూడ చక్కని చోడిగాని కలాపం

 వచ్చెర బాబు సోలిగాడు
ముక్కుమీద చుక్కబొట్టు
నిక్కి నిక్కి చూసుకుంటు
వచ్చెర బాబు సోలి గాడు

అంటూ ఆంధ్రదేశంలో దసరా వుత్సవ సమయాల్లోనూ, హరిజనులు జరుపుకునే గొంతాలమ్మ వండుగలలో ప్రదర్శించే విచిత్ర వేషాలలో ఈ సో(డి)లిగాడి వేషం అతి ముఖ్యమైంది.

ఆరవెల్లి వెంకటాఖ్యుడు:

వెంకటాఖ్యుడు రచించిన సింగి సింగడి కథే, సోడి గాడి కలాపం. సోడిగాడు వంకర దుడ్డు కర్రతో ప్రవేశించి పిల్లలందర్నీ హడలగొట్టే వాడు. వేషధారణ అంతా హాస్యపూరితంగా వుండేది. ముఖం నిండా సున్నపు బొట్లూ,బొట్టుల మధ్య నల్లచుక్కలు, నల్లటి గుడ్డ, అంట గట్టిన తలకు ఒక పక్కగా కాకి ఈకల కుచ్చు బెట్టి మొలకు గోచి పెట్టి, ఒక చేతిలో వంకర దుడ్డుకఱ్ఱ. మరొక చేతిలో చింకి జోలె వేసుకుని వున్నట్టుండి ఏదో ఒక మూల నుండి గొంతాలమ్మ పండుగ సందర్భంలో పిల్లలందర్నీ హడలగొట్టి ప్రేక్షకులందర్నీ ఒక అదుపులో వుంచేవాడు. ఇదే ఈ నాడు మనకు కనిపించే సోలిగాని వేషం. ఈ సోలిగానిని చోడిగాడని, సోడిగాడనీ, సింగడనీ వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ సోలిగాడి పేరు, ప్రాచీనం నుండీ ప్రస్తుతం వరకూ ఆంధ్రప్రజాజీవితంలో జీవించి వుంది.

తోలుబొమ్మలాటలో జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పాగాడు, కేతిగాడు ఎటువంటి ప్రాముఖ్యం వహిస్తున్నారో, ఈ చోడిగాడు కూడ చోడిగాని కలాపంలో అంతటి ప్రాముఖ్యం వహిస్తున్నాడు. కాని బొమ్మలాటలో పాత్రలు కేవలం హాస్య పాత్రలు మాత్రమే.

చోడిగాని పాత్ర అలా కాక, కథానాయకుడు గానూ, హాస్య పాత్రగానూ జీవిస్తున్నాడు. సోలిగాని పేరు ప్రజా జీవితంలో ఎలా హత్తుకు పోయిందో ఉదాహరణలు చూస్తే మనకు బోధపడుతుండి. పెళ్ళి పందిళ్ళలో ఫలానా వాడు సోలిగాడులా వున్నాడనీ, గాలిగా తిరిగే వాళ్ళను సోడిగాడిలా తిరుగు తున్నాడని, భార్య తోడు లేకుండా వచ్చిన వాడిని సోలిగాడులా వచ్చాడనీ రకరకాలుగా పిలుస్తూ వుంటారు.

కరకు గుండెల్ని కదిలించే కథా వస్తువు:

కూచిపూడి వారు ప్రదర్శించే భామాకలాపం, గొల్లకలాపం, మాదిరి ఈ చోడిగానిది కూడా ఒక కలాపమే. ఈ చోడిగాని కలాపానికి కథావస్తువు సింగణ్ణి మరిపించి పారిపోయిన సింగిని వెదుక్కుంటూ వియోగాన్ని అభినయిస్తూ తుదకు సింగిని కసులుకుని తనను వదిలి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో మొదలైన ప్రశ్నల ద్వారా వాగ్వివాదం జరిపి చివరికి సింగిని తీసుకుని ఇరువురూ ఒక ఇంటికి చేరడంతో చోడి గాని కలాపం కథ సమాప్తమౌతుంది. తొలి ఘట్టంలో చోడి గాడు తెర వెడలి

దరువు:

చోడిగాని జూడరే ఎరుకల చోడి గాని జూడరే
ఆడాడ సింగి జాడ - వేడుకుంటు వచ్చి నట్టి ॥చో॥

చక్కనైన చుక్క బొట్టు - ముక్కు మీద బెట్టెనే
వెక్కసముగ పంట నొక్క - పొక్కర్ర బెట్టెనే
కొంగ పిట్ట చంకబెట్టి - గొంగళి వహించెనే
రంగు మీర పురులుకోల - పొంగుచు ధరించెనే ॥చో॥

చంక చింకి పెట్టె కప్పు - పొంకము కలిగించెనే
బొంకమైన వంక కట్టె - బెదర జూపు కొనుచు వచ్చె ॥చో॥

వచనం
సుందరీ ఎందు బోయితివే:

మరియు సింగడు అంగజుని హోరంగైన మెరుంగు తూపలకు కరంగి, సింగిని కౌగలించుకుని, యెడ తెగని తమకంబున రతి పారవశ్యంబున కొంత తడవు సెజ్జపై నిమరించి పరాకున పరుపు పై దడువ సింగి గాన రాకున్న ఉలిక్కి పడి దిగ్గున లేచి దిక్కులం బెదరి చూసి యెట్టకేలకు బెట్టిదంబైన నిట్టూర్సు నిగిడించుచు అంగనాభంగ పెట్టితివిగదే అని గొంగళిం దులుపుచు పెక్కుగతుల మక్కువలు దలపోయుచు పొక్కర్ర దడుముచు కేలంగోల గీలించి సుందరీ ఎందు బోయితివే అంటూ తన పరిస్థితి నంతా ఈ విధంగా వివరంగా చెప్పడం ప్రారంభిస్తాడు.

అయ్యలారా? అమ్మలారా? నా పేరు సింగడు. నాభార్య పేరు సింగి. మేమిద్దరం పడక గదిలో పడుకుని వుండగా అర్థరాత్రి నా సింగి పక్కలో నుంచి మాయమై పోయింది. అని ఆ వృత్తాంతమంతా చెపుతూ హా! నా సుందరీ, ఎందు బోయితివే అని వెదకటం ప్రారంభించడంతో కథలో తొలి ఘట్టం ఆరంభమౌతుంది.

హాస్యగాడు సింగడే:

ఈ కలాపంలో హాస్య గాడు వుండడు. సింగ్దని పాత్రే హాస్య రసాన్ని అందిస్తుంది. సింగడే నాయకుడు. సింగీ సింగని పాటలకు వంత పాడే ఇరువురు తాళగాళ్ళలో ఒకడు ఈ నాయకీ నాయకులకు మధ్యవర్తిగా తోడ్పడుతూ, అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిస్తూ, కథా సంధుల్ని విపులంగా సభ వారికి ఎరుకపరుస్తూ వుంటాడు.

సింగి కోసం విసిగి వేసారిన సింగడు, సింగిని చూపమని స్వామిని ఇలా ప్రార్థిస్తాడు.

నింగినీ గానవుగా ఓ నా స్వామీ, సింగినీ గానవుగా
అంగ వంగ కళింగ బంగాళ జనులకు
కొంగు బంగారమై, కోర్కె లిచ్చిన స్వామి. ॥సిం॥

తాటకి తలగొట్టీ, సుబాహుని గొట్టీ
మారీచుని మట్టీ, గాథిరాజు పట్టీ
యజ్ఞము చేతబట్టి, హరుని విల్లు ముట్టి
ముక్కలు జేసి దట్టి, జగజ్జట్టీ. ॥సిం॥

అని వేడుకుంటాడు. కథా గమనంలో సింగిని వెదుక్కుంటూ, సింగడు అడవిలో కనపడిన మృగాలను వేటాడి, అవి లభించి నప్పుడు ఆయా దేవతల్ని సింగిని చూపమని ప్రార్థిస్తూ పోతాడు. ఈ ఘట్టంలో అఖేట నృత్యం ప్రదర్శింపబడేది. ఆ తరువాత దశావతరాలను అభినయించి నారాయణ మూర్తిని ప్రార్థించే వాడు. తరువాత రామాయణ గాధను స్మరించి శ్రీరాముని వేడుకుని రామాయణ గాథనంతనూ, పదాభినయం ద్వారా ఆభినయిస్తూ సింగి కనపడలేదనే ఆవేదనతో స్పృహతప్పి తూలిపడిపోతూ నిష్క్రమిస్తాడు.

ఇంతలో సింగి:

ఇంతలో సింగి ఎరుకో ఎరుకో అంటూ ప్రవేశిస్తుంది. సూత్రధారుడు సింగి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అంతట సింగి అతనికి సమాధానంగా తనయొక్క కుల గోత్రాలను గూర్చి, వృత్తి విద్యా విలాసాలను గురుంచి తన వన్నె చిన్నెలు అందచందాలను వివరిస్తూ సింగని వర్ణిస్తుంది. ఈ సమయానికి సింగడు ప్రవేశించి, సింగి దొరి కిందన్న సంతోషంతో ఉబ్బితబ్బిబై పోతూ, తన సంతోషాన్ని మాత్రం పైకి కనపడనీయక వాగ్వివాదానికి దిగుతాడు. ఈ సింగీ సింగని వాగ్వివాదంలో మొరటు హాస్యం ఎక్కువ దొర్లటం వలన కొంచెం విరసంగా వుంటుంది. సవతుల కయ్యం మాదిరి చోడిగాడు, సింగి ఈ విధంగా ప్రారంభిస్తారు.

సింగీ సింగన్నల వాదవివాదాలు:
చోడిగాడు:

మనసు లాకపోతే మును పెరుంగనె సింగి
అదును లంటినోరు అగలించి
కళ్ళెమంటి బిగ్గ కఱచియు బట్టితే
కొరడ దెబ్బలనుచు ఎరుగవటవె?

సింగి:

కొరడ దెబ్బలనుచు మారి మరి బలికేవు
తరముగాదు నాదు దరికి రాకు
మురువు పరువులేని పురుషత్వమేల నీ
సరసమెల్ల నాకు చాలు పోర.

చోడిగాడు:

సింగీ నను జూచితె నే
నంగజుడను రూపురేఖలందును నా
సంగతి నీవిటులైన తిరు
గంగను న్యాయంబు గాదు గట్టి సింగీ.

సింగి:

చేకువలె నుండు మీసాలు, చీపికళ్ళు
చింకితల గుడ్డ, గొంగళీ చంకబెట్టి
కప్పు పొక్కిడి పొగసిద్ద వొప్ప జూచి
నయమె నిన్నంగజుడవన్న నవ్వరటర?

ఈ విధమైన వాగ్వివాదంతో సంవాదం ముగిసి, ఇరువురికీ సఖ్యత కుదిరి, ఇంటికి పోవడంతో కథ సుఖాంతమై మంగళాంతం అవుతుంది.

పైన వివరించిన ఈ చోడిగాని కలాపం రాత్రి తెల్లవార్లూ ప్రదర్శిస్తారు. కథా వస్తువు దంపతుల కయ్యానికి సంబందించింది. దీనిలో శృంగారం రసా భాసమైనది. కురవంజిలో సింగీ సింగని వాగ్వివాద లక్షణాలు, నృత్యాలే ఈ చోడి గాని కలాపంలోనూ కనిపిస్తున్నాయి. ఈ కలాపంలో జిక్కిణీ చిందు మొదలైనవి విశేష నాట్యాలు. ఇది భార్యభర్తల సంవాదం అవడం వలన ప్రేక్షకులను ఎక్కువ ఆనందపరిచేది.

భామాకలాపం, గొల్ల కలాపం మాదిరే ఈ చోడిగాని కలాపం కూడ నృత్య రూపకం. సూత్రధారుడే విదూషక స్థానాన్ని అలంకరిస్తాడు.

చోడిగాని కలాపంలో ఉపయోగించే ఒంకి కఱ్ఱ ఒక ముఖ్యమైన విశేష మనీ, భరత్గ శాస్త్రంలో 'బ్రహ్మకుటిలకందద్వా'త్తని ఒక వాక్యం వుందనీ ఆ కుటిలకం విదూష కోవ యోగిగా అభినవ గుప్తులు వ్వాఖ్యానించారనీ, ఆనాడు బ్రహ్మదేవు డిచ్చిన వంక కర్ర ఈ నాటికి తెలుగు వారి వద్ద ఉండటమే చోడి గాని కలాపం లోని ఒక శాస్త్రీయమైన విశేషమనీ, శ్రీ ముట్నూరి సంగమేశం, సాళ్వ కృష్ణమూర్తి గార్లు భారతిలో ఉదహరించారు.

అసలు ఆధారం ఇల్లిదిగో ఇదీ:

చెంచునాటకం, ఎఱుకల కథ, ఎఱ్ఱ గొల్లల భాగవతం మొదలైన వాటన్నిటికీ మూలమైన చెంచులక్ష్మి నృసింహుల ప్రణయ గాధే ఈ చోడి గాని కలాపానికి ఆధారం. అనేక కురవంజి రచనలకు మూలాధారం ఈ ప్రణయ కలహమే.

ఈ కథావస్తువైన చెంచు లక్ష్మి నృసింహుల వివాహ గాథను కీ.శ. 1600 ప్రాంతంలో గరుడాచల మహాత్య మను పేర ఓబయమంత్రి యక్షగానంగా వ్రాశాడు. ఆ నాటికీ, ఈనాటికీ దక్షిణ దేశ భాషల్లో కొరవంజులలో దీనినే ప్రాచీన కృతిగా చెప్పుకోవచ్చు.

ఈ చోడిగాడి కలాపానికి ఎఱుకల కథ అని కూడ పేరు. తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో 'ఎఱుకల కథ ' అనే పేరుతో ఒక రచన వుంది. ముఖ్యంగా ఈ కలాపాలు వ్రాసిన వారిలో చెంగల్వ రాయ కవి - అరవెల్లి వేంకటార్యుడు -వంకాయల బలారామభుక్త - గొడవర్తి జగన్నాథం మొదలైన వారి రచనలు ముఖ్యమైనవి.