తెలుగువారి జానపద కళారూపాలు/మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు
మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు
ఝుక్కిణీ లాస్యం మతంగ మహముని వల్ల అవిర్భవించిందని, ఆయన రచన బృహద్దేశి వలన తెలుస్తూ ఉంది.
ఒక నాడు ఆంధ్ర దేశంలో జిక్కిణి నృత్యం బహుళ ప్రచారంలో వున్నట్లు 17 వ శతాబ్ధంలో వెలువడిన అనేక ప్రబంధాలలో జిక్కి ణి ఒక ప్రముఖమైన నాట్య విన్యాసమని తెలుస్తూంది.
రామాభ్యుదయంలోనూ, చంద్రభాను చరిత్రలోనూ, ఉత్తర రామాయణం లోను, పాంచాలీ పరిణయం మొదలైన ప్రబంధాలలో జిక్కిణి ప్రశంస వుంది.
ఇంక తంజావూరు ఆంధ్ర నాయక రాజుల ఆస్థానంలో "జిక్కిణి" నాట్య ప్రదర్శనలు విరివిగా జరిగినట్లు (క్రీ॥శ॥ 1631 - 73 ) ప్రాంతాలలో వెలువడిన రఘునాథ నాయకుని ప్రహ్లద యక్షగానాల వల్లనూ అదే ఆస్థానంలో వెలుగొందిన చెంగల్వ కాళ కవి, రాజగోపాల విలాస ప్రబంధాల వల్లా.
అలాగే తంజావూరు రాజాస్థానానికి చెందిన "అన్నదాన నాటకంలో" కూడ జక్కుల రంగసాని పదకేళిక ప్రసక్తి వుంది.
- తంజావూరులో జిక్కిణి వెలుగు:
విజయరాఘవ నాయకుని ఆస్థానంలో యక్షగానం ఒక సుందర కళారూపమై వర్థిల్లినట్లు "జిక్కిణి" నాట్యం కూడ గీత ప్రబంధాలలో ప్రసిద్ధి చెందినట్లు క్రీ॥శ॥ 1500 - 1550 ప్రాంతాల్లో వెన్నెల కంటి సూరన రచించిన "విష్ణు పురాణం" లో జిక్కిణిని ఒక వర్ణ విశేషంగా పేర్కొన్నాడు.
అలాగె తంజావూరు మహారాష్ట్ర ప్రభువైన, "శహాజీ" క్రీ॥శ॥ 1684 - 1712 ప్రాంతాల్లో రచించిన "చిత్ర ప్రబంధం" లోనూ
మధుర విజయరంగ చొక్కనాథనాయకుని ఆస్థానంలో క్రీ॥శ॥ 1706 - 32 లో వెలసిన తిరుమల కవి రచించిన "చిత్రకుంట మహత్యం" లోనూ జిక్కిణి దరువులు ఉదహరింప బడ్డాయి.
అలాగే కూచిపూడి వారి నాత్య పద్ధతుల్లో "జక్కిణీ" దరువు కూడ యక్షగానంతో పాటు ప్రాముఖ్యం వహించి నట్లు తెలుస్తూవుంది.
జక్కులవారే అసలు యక్షగాన ప్రదర్శకులైనట్లు "క్రీడాభిరామం" లో "కామవల్లీ మహాలక్ష్మి కైటభారి" వలపు బాడుచు వచ్చె జక్కుల పురంద్రి అని,
ఆ కామవల్లియే, కామేశ్వరీ పాటలోని కామేశ్వరి యనీ, ఆ కామేశ్వరి కథను క్రీ॥శ॥ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు "క్రీడాభి రామం పీఠికలో వివరించినట్లు, యస్వీ జోగారావు గారు తమ యక్షగాన వాఙ్మయం"లో వివరించారు.
ఈ కథలో మహాలక్ష్మి శాపం వల్ల పార్వతికి సద్వోగర్భాన సప్త కన్యలు ఉద్భవించి నట్లూ అందులో ఒక కన్య పేరు "జక్కులమ్మ" అనీ అందరికంటే చివరిదీ చిన్నదీ "కామవల్లి" అని తెలుస్తూ వుంది.
ఆ సప్తకన్యలనే "అక్కలు" లేక అక్క దేవతలనీ అంటారు. యక్షులు శివాజ్ఞవల్ల వంశపారంపర్యంగా కామవల్లిని కొలుస్తారు. వారే జక్కులనీ, శివుడు వారికి వాద్య ప్రదానం గావించాడనీ ఐతిహ్యం వుంది.
యక్ష శబ్ధం జక్క - ఎక్క అనే రూపాంతరాలే కాక, అక్క అనే రూప వికృతి కూడ అంగీకరించ తగిందే అని గంటి సోమయాజి గారన్నారు.
నాట్యంలో దేసి మార్గ నృత్యాలను గురించి శ్రీనాథుడు కాశీ ఖండంలో ఉదహరించాడు. జిక్కిణి చిందు అనీ, అది దేశీయ నృత్యమనీ దశావతార చరిత్రలో ఈ క్రింది విధంగా వర్ణించాడు.
దురుపదంబులు సొక్కు మైసిరుల నొసగ
సరిగె నిరుగెల కుంచియల్ నవదరించి
పెక్కువగ జిక్కినీ కోపు ద్రొక్కె
చక్కని మిఠారి నరపతుల్ సొక్కి చూడ
అనడాన్ని బట్టి, జిక్కిణి దరువు, జిక్కిణి కోపు చాల ప్రాచీనమైనవిగా ఎంచవచ్చు.
- యక్షుల జిక్కిణి:
నృత్యగానలలో ప్రజ్ఞావంతులైన యక్షులు, సింహళం వదిలి దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన జక్కుల జాతి వారనీ, ఇది పలువురి అభిప్రాయమనీ కీ॥శే॥ శ్రీనివాస చక్రవర్తి గారు వివరించారు.
సింహళంలో వాడుక భాష పాళీ భాష సంస్కృత యక్ష శబ్దానికి ప్రాకృతం, ఎక్కులు తెలుగు తద్భవం జక్కులు. జక్కులవారు వలస వచ్చిన వారైనా, ఆదిమ వాసులైనా, వారు సంగీత నృత్య కళాకారు లన్నమాట తద్యం. వీరి పేరనే జిక్కిణి రేకులు, జిక్కిణి నృత్యం వెలిశాయి. ఇందుకు ఉదాహరణ: "భామ వేష కథ" అనే యక్షగానంలో__
జోగక గీత వాద్యముల సొంపుగ నింపుగ
పంచ జక్కిని ప్రాగటమైన నాట్య
రసభావముల విన్పింతు వేడుకన్___ అని
అలాగే......................
అనూనిభ మధ్య లాక్రియలు నాపరిభాషలు నొప్ప జిందు జ
క్కిణి కొరవంజి మేళముల గోళిక సల్పిరి దేవతా నటీ
మణులకు బొమ్మవెట్టు క్రియ మర్దళ తాళ నివాద పద్దతిన్
రణదురు రత్న నూపుర ఝణముల్ మెఱయం బాదాహాతిన్
అని కవులు వర్ణించినారు. ఆనాడు తంజావూరు ఆంధ్ర నాయక రాజుల దర్బారులలో జిక్కిణి నాట్య గోష్టి జరిగేదట __విజయ రాఘవుని ఆస్థానంలో మూర్తి జిక్కిణి నృత్యం చేసేదట. (రాజగోపాల విలాసం) విజయ రాఘవ రాయలు, "కొరవంజి శుభలీల" గుజరాతి "దేశీ" చౌపదియు జిక్కిణి ... నాట్యములో హవణించు నవరసజ్ఞు.
(ప్రహ్లద చరిత్ర)
- జిక్కిణి దరువు:
జిక్కిణి దరువు అనేది ఒక కైవార గీతం. అది దేవతలకు సంబంధించింది గానీ, రాజులకు సంబంధించింది గానీ అయి వుండవచ్చు. కొన్ని మృదంగ జతులతో మిళితం చేసి నృత్యం చేయడానికి అనుకూలంగా కూర్చిన సంగీత రచనయే జిక్కిణి.
ఈ జిక్కిణి యక్షగానాల్లోనూ, వీథి నాటకాలలోనూ, సలాంజతిగా ప్రదర్శిస్తారు. అయితే ఈ దరువులు సలాంజతులకంటే అతి ప్రాచీన మైనవి సంప్రదాయ నృత్యకళకి సంబందించినవి.
కవుతములు, శబ్దాలు, (అంటే సలాంజతులు) జిక్కిణి రచనలు ఒక విధమైన నృత్య సంగీత రచనలుగా కనిపించినా, ఆట క్రమంలో మాత్రం చాల భేదం వుందంటారు నటరాజ రామకృష్ణ గారు.
కవుతాలంటే దేవాలయాల్లో దేవతల ఆరాధనా సమయాల్లో ఉపయోగ పడే సంగీత రచనా విశేషం. ఈ కవుతాలు ప్రత్యేక తాళ గతులతో ఆయా దేవతల ప్రీత్యార్థం చేయబడిన రచనలు.
సలాంజతులంటే రాజులపైన స్తోత్రాలుగానూ, రామాయణ భారతాది పురాణ గాథలకు సంబంధించిన వర్ణనలుగా వుండి, ఆ కథకు అంగీకాభినయ ప్రాధాన్యమైన నృత్యం, మృదంగ జతులతో నృత్యం ప్రదర్శించ బడుతుంది.
- జిక్కిణి విధానం:
జక్కిణికి సంబందించిన రచనలు కూడా శబ్దాల మాదిరే రచన చేయబడినప్పటికీ ఇందులోని అభినయ విధానం మాత్రం అడుగులకు సంబంధించిన సాంప్రదాయాలు మాత్రం భిన్నంగా వుంటాయి.
కవుతం, సమతాళం, శబ్దం సలాంజతి మొదలైన వాటి వివరాలకు పోకుండా జిక్కిణి విధానం ఎలా వుంటుందో పరిశీలిద్దాం.
ఉదాహరణకు జిక్కిణి.
తాం దణత జణు జణు తకతా కిటతక
తజణు తదణ దణ దణ దణ జనుతక
జణుత జణుత జణ జగన గదికి తక
దణుం జణుత జణుం తనత
దణం దనత దదదా గిణతక
విజయనగర పురపాల నురే
వీణాగాన వినోదరే
విజయశీల శ్రీ పూసపాటి కుల
విజయరామరాజా రవితేజ
జణుం దణత జనూ। జగనగ నగనగ
ణగన జంత జగ నగతా గిటతక
ణం ణం నాంగిట ననంగ దదిగిణతో ॥
జిక్కిణి దరువు ఈనాడు ఎక్కడా ప్రచారంలో వున్నట్లు మనకు పెద్దగా ఆధారాలు లేవు. అయితే, ఈ జక్కిణి దరువు ఎలాంటిదో.... దాని సంప్రదాయం ఎటువంటిదో దానిని నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతో వుంది. పేరణి నృత్యానికి ప్రాణం పోసిన నటరాజ రామకృష్ణ గారే దీనికీ పూనుకోవాలి.