తెలుగువారి జానపద కళారూపాలు/బుడిగె వాయిద్యకారులే బుడిగె జంగాలు

వికీసోర్స్ నుండి

బుడిగె వాయిద్యకారులే బుడిగె జంగాలు

వీరినే బేడ, బుడ్గ జంగంవారు అని కూడా అంటారు. దాసరులందరూ, వైష్ణవ భక్తులైనట్లే జంగాలందరూ శైవభక్తులు. వీరు చెప్పే కథలకు, జంగం కథలని పేరు. జంగాలే ఈ కథలను ప్రారంభించడం వల్ల వీరికి ఆ పేరు వచ్చి వుండవచ్చు. వీరికే బుడిగె జంగాలనే పేరు కూడా వాడుకలో వుంది. అందుకు కారణం వారు కథలో వుపయోగించే వాయిద్యానికి ...బుడిగె ...అనే పేరు కావటమే. ఈ బుడిగెనే ... డక్కీ అనీ, డిక్కీ అని, గుమ్మెట అనీ, అనేక రీతులలో, ఆయా ప్రాంతాలలో ఉదహరిస్తున్నారు. బుడిగెలు మామూలు కంటే చిన్నవి.

శైవ కథలనే ప్రచారం చేశారు:

జంగాలు ప్రారంభంలో శైవ కథలనే ప్రచారం చేశారు. తరువాత శైవ కథలనూ, ఇతర కథలనూ కూడ ప్రచారం చేశారు. వారు ప్రచారం చేసిన కథలు - దేశింగు రాజు కథ - పలనాటి బాలచంద్రుడు కథ - మైరావణ - విరాటపర్వం - భల్లాణ చరిత్ర - సిరియాళ - దేవయాని - వామన విజయం -అంబరీషోపాఖ్యానం -బసవ పురాణం -నిజలింగ చిక్కయ్య -దక్షయజ్ఞం -సుందరకాండ - గయోపాఖ్యానం - నీలకుంతినీ విలాసం -ఉషా పరిణయం - ఉత్తర గోగ్రహణం మొదలైన అనేక కథలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. ధేనువుకొండ వెంకయ్య గారి విరాట పర్వంలో జంగం కథలో జంగాలు యొక్క వేష ధారణ, వాయిద్యాల వర్ణన వుంది. 'ఆడిదం సూరకవి ' జంగాల పాలు ధేవాంగుల విత్తంబు అని వర్ణించడం వల్ల దేవాంగులైన సాలె వారిని యాచిస్తారని తెలుస్తూంది.

బేడ (బుడ్గ) జంగాలు:

బేడ - బుడ్గ - జంగం కులస్తులు, జన్మతోనే కళాకారులని చెప్పవచ్చును. వీరికి చదువు సంధ్యలు లేక పోయినా, బ్రతుకు తెరువుకోసం ఈశ్వరుడు ప్రసా దించిన ...జంగం కథలను చెపుతూ, శవ సంస్కార సందర్భంలో శంఖాన్ని ఊదుతూ, గంట వాయిస్తూ తమ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

బుడిగె స్వరూపం:

జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలుస్తారు. బుడిగెను కంచుతో గానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు.

గుమ్మెటకు ఒక వైపున బెత్తపు చట్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండప ప్రక్కన కూజామూతి లాగా, అనాచ్ఛాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కలా వున్న వంత గాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించు కుంటారు. కుడిచేతి వ్రేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండవ ప్రక్క మూస్తూ _గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు.

బుడిగె జంగాల వేష ధారణ:

కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగాచుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజంమీద తంబురాను ధరించి, చేతి వ్రేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంభిస్తారు.

కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి వంత పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య్త మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని క్రుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు.

జంగం కథ చెప్పదలచుకున్న గ్రామంలో ముఖ్యమైన చోట్ల గుమ్మెటలను ఉధృతంగా వాయిస్తూ ఫలానా చోట జంగం కథ చెప్పబడుతుందనీ, అందరూ రావాలని చెపుతూ, పాడుతూ వూరంతా తిరుగుతారు.

పగటిపూట ఇంటింటా కథ:

రాత్రిపూట కథలు చెప్పటమే కాక, వీరు పగటిపూట కూడ ఇంటింటికి తిరిగి కథలు చెపుతారు. ఏవిధమైన వర్ణ భేదాన్నీ పాటించక, హరిజన, గిరిజన, తదితర శూద్ర గృహాల ముందు కూడ నిలబడి, జంగం కథలు చెప్పి వారి వద్ద డబ్బుల్నీ, ధాన్యాన్నీ సేకరిస్తారు. ఒక వేళ అది భోజనసమయమైతే ఎవరు అన్నం పెట్టినా తింటారు. ఇటువంటి వారిని బుడిగె జంగం వారని పిలవటంకద్దు.

బుడిగె జంగాలు హరిజన, గిరిజన, మాల మాదిగల ఇండ్లలోనూ, ఇంకా వెనుక బడిన వారి ఇళ్ళలోనూ ఎవరైనా చనిపోతే శవ సంస్కార కార్యాన్ని శాస్త్ర యుక్తంగా జరిపిస్తారు. శంఖాన్ని వూదుతూ, గంట వాయిస్తూ, శవం ముందుండి శ్మశానవాటిక వరకూ వెళ్ళి ఆ కార్య క్రమాన్ని పూర్తి చేస్తారు. అందుకు వారు బేడ డబ్బులు మాత్రం ఇస్తే వారిని పొగడుతారు. బేడ డబ్బులతో తృప్తి పడతారు కనుక బేడ జంగాలనే పేరు సార్థకమైంది.

బుడిగెజంగం వీరశైవం
సంస్కారులు:

జంగమయ్యలు, జంగమ దేవరలు, వీర మహేశ్వరులు - వీర శైవ జంగాలనబడే వీరు, మాల మాదిగ గృహాలలో శవ సంస్కారం చేస్తూ శైవులైన మాలలకు బుడిగె జంగాలు గురువులుగా వున్నారు. వీరు మాంసాహారులు, తక్కువ మంది మాత్రమే శాఖాహారులు. వీరిలో వివాహాలకు ఓలి, అంటే కన్యాశుల్కం. 9 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ తీసుకునే పద్ధతి ఈ నాటికీ వుంది. అంటరాని తనాన్ని రూపు మాపటానికే బసవేశ్వరుడు చెప్పిన విధంగా వీరు అందరితో కలిసి మెలసి జీవిస్తూ, జానపద కళారూపమైన జంగం కథా ప్రదర్శనాల నిస్తూ,ఈ నాటికీ తెలుగు దేశంలో ఆయా జిల్లాల్లో వున్నారు.

శరభ, శరభ:

వీరు శివరాత్రి పర్వదినాలలో వారున్న గ్రామంలో బండ్ల మీద ప్రభలు కడతారు. వీటిని వీథి వీథికి ఊరేగిస్తారు. శివాలయం వద్దకు చేరుస్తారు.

శరభ, శరభా, దశ్శరభ శరభా
దేవర వేషం

అని ప్రభముందు, సన్నాయి వీరంగానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. ఇది ఎంతో ఆవేశంతో కూడుకుని వుంటుంది.

కొంత మంది పులితోలు కట్టుకుని పెద్ద పులి నృత్యం చేస్తారు. మరి కొంత మంది రంగు రంగుల గుడ్డముక్కలతో నిలువుటంగీ తొడిగి విభూది రేఖలను తీర్చి దిద్దుకుని, లింగ కాయను అందరికీ కనిపించే లాగ మెడలో ధరించి శివరాత్రి పర్వ దినాన నృత్యం చేస్తారు.

పగటి వేషాలు:

వీరు పగటి వేషాలను కూడా అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఏక పాత్రాభినయాలు చేస్తారు. అర్థ నారీశ్వర వేషం, అల్లూరి సీతారామరాజు, రామయణ భారత కథలకు సంబంధించిన వేషాలు నాటక రూపంలో, పద్యాలు, పాటలు పాడుతూ - హార్మోనియం, తబలా, తాళాలతో ఇంటింటి ముందు ప్రతిరోజు తిరుగుతూ, పది హేను రోజుల్లో వేషాలను పూర్తి చేసుకుని ఇంటింటికి తిరిగి, డబ్బునూ, ధాన్యాన్ని సంపాదిస్తారు.

కొమ్ము బాకాలు:

బుడిగె జంగాలలో కొంత మంది కవిత్వాన్ని చెపుతారు. కొంత మంది కథలు చెపుతారు. మరికొంత మంది వైద్యం చేస్తారు. సాముద్రికాన్ని చెపుతారు. ఇలా ఎన్నో ఉపవృత్తుల్లో వారు జీవిస్తున్నారు

ముఖ్యంగా భాగ్వవంతుల ఇళ్లలో వివాహ సమయాల్లో ఇద్దరు ముగ్గురు కలిసి ఊరేగింపులో అప్పుడప్పుడు ఈ బాకాలను ఊదుతారు. బాకాల ధ్వని గంభీరంగా వుండి విజయ చిహ్నంగా ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ బాకాలు ఇత్తడి తోనూ రాగితోనూ తయారు చేస్తారు. కొమ్ముల్లాగా వంకర తిరిగి వుంటుంది.

అలాగే దేవాలయ ఉత్సవాలలో కూడ ఊదుతారు. ఇది ఎంతో విన సొంపుగా వుంటుంది.

నిప్పుల గుండం, వీరభద్రుని పళ్ళెం:

వీరశైవ జంగం వారు కొన్ని గ్రామలలో వీరభద్రుని పళ్ళెం పట్టి, నిప్పుల గుండాలను ఏర్పాటు చేస్తారు. దక్షయజ్ఞం చేస్తారు. అ ఉత్సవానికి బుడిగె జంగాలనూ, వీరముష్టి వారినీ ఆహ్వానిస్తారు.

పది అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడగూ మూడు అడుగుల లోతు గుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ గుండంలో కణకణ మండే నిప్పు లుంటాయి.

బుడిగె జంగం వారు వీరా వేశంతో దక్షయజ్ఞ దండకం చదువుతూ, నారసాలను నాలుకలో గ్రుచ్చుకుని ఆవేశంతో నిప్పుల్లో నడిచి పోతారు.

దండకం:

భజే భద్ర! భద్రాంబికా ప్రాణనాథా! సురరాతిభంగా!ప్రభో!రుద్ర! రౌద్రావతారా! సునాశీరముఖ్యామకానేక సంభావితా సల్ప సుశ్లోక!! చారిత్ర! కోట్యర్కసంకాశ! దేదీప్యమాన! ప్రభా దివ్వగాత్ర! శివా! పాలితా! శేషబ్రహ్మాండ భాండోదరా! మేరుధీరా! విరాడ్రూపా! వారాశి గంభీర! సౌజన్య రత్నాకరా! వారిదశ్యామ__

మహాదివ్య వేషా! హరా! భక్త పోషా! దయావార్థి ! వీరేశ్వరా! నిత్య కళ్యాణ సంధాన ధౌశీయ! పాపాలు నీకేల! దావానలా! పుణ్యమూర్తీ ! నమస్తే! నమస్తే- నమః.

అంటూ ముగిస్తారు.


ఖడ్గం:

మూడడుగుల వంకర ఖడ్గాన్ని చేతిలో ధరించి, పై దండకాన్ని చదువుతూ, ఖడ్గాన్ని ఊపుతూ, కనుగ్రుడ్లు పెద్దవి చేసి నారసాలను శరీరంలో పొడుచుకుని, వీరావేశంతో వళ్ళు మరచి నృత్యం చేస్తూ, దక్షయజ్ఞ గుండంలో నడుస్తూ అవతల ప్రక్కనున్న దక్షుణ్ణి నరుకుతారు. ఈ ప్రదర్శనాన్ని చూడవలసిందే గాని వ్రాయలేము. జంగాల్లో అనేక తెగలున్నా అందర్నీ జంగాలనే పిలుస్తున్నారు. ఆంధ్రదేశంలో ఈ బుడిగె జంగంవారు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ పట్నం,

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఆ యా వృత్తులలో ఈ నాటికి జీవిస్తున్నారు. ఈ బుడిగె జంగాలను ప్రభుత్వం ఆదరించి వారిని పరిగణనలోకి తీసుకుని, ఇతర షెడ్యూల్డ్ జాబుల కిచ్చే సౌకర్యాలన్ని కలిగించే ఏర్పాట్లు చేయాలి.