తెలుగువారి జానపద కళారూపాలు/ప్రజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు

వికీసోర్స్ నుండి

ప్రజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు


ఆంధ్ర దేశంలో ఆనాటి నుండి ఈ నాటి వరకు బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఈ నాడు, బుర్ర కథలుగా పిలువబడుతున్నాయి. ఒకనాడు మత ప్రభోధానికి, దేశభక్తికీ ప్రతిబింబంగా నిలబడిన జంగంకథా కళారూపం రాను రాను యాచనకూ, వుదర పోషణకూ ఉపయోగ పడి తిరిగి ఈ నాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది.

జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడం వల్ల వీటికి జంగం కథలనేపేరు వచ్చింది. ఈ కథలను సిరికి జంగాలూ, బుడిగె జంగాలూ, సెట్టి బలిజెలూ, సెట్టి ఫణిజెలూ, ఈత ముక్కు జంగాలూ, వంశ పారంపర్యంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. జంగాలందరూ శైవ భక్తులు కావడం వల్ల, శైవ వైష్ణవ మతాల మధ్య వచ్చిన సంఘర్షణ కాలంలో శైవమత ప్రచారానికి ఈ కథలను ఉపయోగించారు. వీర శైవమతం బాగా వ్వాప్తిలోకి వచ్చే నాటికి, అంటే క్రీ॥శ॥ 1150 నాటికే ఈ కథలను జంగాలు పాడుతూ వుండేవారు. వీరు ఈ కథలతో పాటు పగటివేషాలను కూడ ప్రదర్శించేవారు. బైచరాజు వేంకటనాథకవి, పంచతంత్రంలో .... కడివోని తెర నాటకపుటూరి జంగాలు అని వుదాహరించడాన్ని బట్టి, జంగాలు నాటకాలను కూడ ప్రదర్శించే వారని తెలుస్తూ వుంది.

దాసరు లందరూ వైష్ణవ భక్తులైనట్లే జంగా లందరూ శైవభక్తులు. వీరు చెప్పే కథలకు జంగం కథలని పేరు. వీరికే బుడిగె జంగాలనే పేరు కూడ వాడుకలో వుండి. అందుకు కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగె అనేపేరును బట్టి బుడిగె జంగాలనే పేరు సార్థక నామమైంది.ఈ బుడిగెనే డక్కీ అనీ, డిక్కీ అనీ, గుమ్మెటనీ అనేక రీతులలో ఆయా ప్రాంతాలలో ఉదహరిస్తునారు. బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనూ, కంచు తోనూ చేయబడి వుంటాయి.

జంగాలు ప్రారంబంలో శైవ కథలనే ప్రచారాం చేసే వారు. తరువాత శైవేతర కథలైన దేసింగు రాజు, విరాటపర్వం, భల్లాణ, సిరియాళ, దేవయాని, వామన విజయం. అంబరీషోపాఖ్యానం మొదలైన కథలను కూడ ప్రచారంలోకి తెచ్చారు. జంగాలు వీర శైవ ప్రచారకులు కావడం వల్ల వారి కథలన్నీ వీరా వేశంతో చెప్పబడుతూ వుండేవి. ధేనువు కొండ వెంకటయ్య గారి విరాట పర్వం జంగం కథలో జంగాల యొక్క వేష ధారణ, వాయిద్యాల వర్ణనవుంది... ఆడిదం సూరకవి జంగాలు పాలు దేవాంగుల విత్తంబు అని వర్ణిచడంవల్ల, దేవాంగులైన సాలెవారిని యాచిస్తారని తెలుస్తూ వుంది.

ఆంధ్రదేశంలో శారగకాండ్రు అనే ఒక జాతి వారు, ఒక్క తెలంగాణాలో తప్ప మరెక్కడా అంతగా కనిపించరనీ, జానపద గాయకులుగా బిక్షకులుగా వుండే వారిలో కూడ వీరెక్కువనీ, మున్నూరు ముతరాసి మొదలైన కులముల నుండి ఉద్భవించిన జాతుల్లో శారద కాండ్ర జాతి ఒకటని జానపద వాఙ్మయంలో... బి. రామరాజుగారు వుదహరించారు. ఓ భారతీ, కరుణామతీ భళి, శారదా, కరుణానిధి అనేవంత పాట పాడటంవలన కూడ వీరికి శారద కాండ్రూనే పేరు వచ్చి వుండవచ్చు. అంతే కాక, వీరు పయోగించే వాద్యంలో భుజము మీద ధరించే తంబురాకు శారద అనిపేరు. బుర్ర కథలో ఉపయోగించే తంబురాకూ దీనికీ ఏమీ తేడాలేదు. శారదను ఒక భుజం మీద ధరించి వాయిస్తారు. శారద అంటే సరస్వతి. విద్యల తల్లి, సరస్వతి పేరును వారుపయోగించే తంబురా వాయిద్యానికి మారుపేరుగా శారదా అని నామ కరణం చేశారు. వీరి కథ శారదాదేవి స్తోత్రంతో ప్రారంభమౌతుంది. ముఖ్యంగా వీరి జట్టులో పురుషుడు కథ చెపితే అతని ఇద్దరు భార్యలూ వంత పాడుతారు. ఒక భార్యను కలిగి వున్న కథకుడు కథచెపితే, అతని భార్య డక్కీ కొడుతుంది. దీనిని వీరు డిమ్కీ అని కూడ పిలుస్తారు. వీరు పాడే పాటల్లో శారద వరుసలనే కాక చారిత్రాత్మకమైన గేయాలను వీరావేశంతో పాడుతారు. తెలంగాణాలో ప్రచారంలో వున్న ప్రసిద్ద వీరకథ లైన సదాశివ రెడ్డి కథ, సర్వాయి పాపడు కథలనూ, సర్కారు ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి వహించిన బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ మొదలైన కథలనూ శారద కాండ్రు చెపుతూ వుంటారు. పైన వుదాహరించిన ఒక్కొక్క కథనూ, మూడు నాలుగు రాత్రులు చెపుతారు. ఈ కథలు చెప్పేవారు ఎక్కువమంది వరంగల్లు తాలూకా వెంకట్రావుల పల్లి మొదలైన చుట్టుపట్ల గ్రామాలలో వున్నారు. శారద కాండ్రు అందరూ శైవమతస్థులు. మాంసాహారులైన జంగమ జాతివలన కలిగిన జాతి. ఈ శారద కాండ్రు అని కొందరి అభిప్రాయం. వీరు ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన ముఖ్య దేవతల్ని పూజిస్తారు. వీరు ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు. వీరందరూ శైవ మతస్థులైనప్పటికీ లింగధారణలో కొంతమందికి పట్టింపు లేదు.

ఉత్తమ కళారూపం:

ఈ జంగం కథలను ప్రజా ప్రబోధానికి ఆయుధంగా వుపయోగించారంటే అందులో ఒక విశేషం లేక పోలేదు.బుర్రకథ ఫణితులు చాల వుత్తేజ కరమైనవీ, వుద్రేకమైనవీ, అన్ని రసాలనూ తేలికగా ప్రజా హృదయాల్లో చొప్పించగల శక్తి ఈ జంగం కథలకుంది. వీర రసం ద్వారా ప్రజలను వుద్రేక పరచవచ్చును. కరుణరసం ద్వారా ఏడ్పించ వచ్చును. హాస్య రసంద్వార కడుపుబ్బ నవ్వించవచ్చు. శృంగార భీబత్స రసాలకు ప్రాముఖ్యం

బుర్రకథ

తక్కువైనా నవరసాలూ ఈ జంగం కథా విధానంలో మిళితమై యున్నాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం, వాద్యం, శిల్పం, తాళం, లయ, అభినయం, ఆహార్యం, మొదలైన హంగులన్నీ ఈ కథలో తొణికిసలాడుతూ వుంటాయి. ఈ కథల్లో వుపయోగించే గుమ్మెటలు వీరణపు మ్రోతలను గుర్తుకు తెస్తాయి. జంగం కథా కళారూపంలో ప్రజలను మేల్కొల్పే మహాత్తర శక్తి వుంది. ఈ నాటికీ ఈ కళారూపం విద్యాధికుల నుండి అతి సామాన్యుల వరకూ ఆనందింప జేయగల ఉత్తమ జాన పద సంగీత కళారూపంగా తయారైంది. జంగం కథను తెలుగు జాతి యొక్క సంగీత జానపద కళారూపంగా చెప్పవచ్చు. ఈ జంగం కథల్లో విద్వత్తును ప్రదర్శించే శ్లోకాలూ, దేశీయ ఛందస్సు అయిన మంజరీ ద్వపదలూ, దరువులూ, కీర్తనలూ, కందార్థాలు మొదలైన వన్ని ప్రవేశ పెట్టబడ్డాయి. ఉదాహరణకు శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి వీర చరిత్ర మంజరీ ద్విపదలో రచించిందే.

పూర్వ కథలు:

ఆంధ్ర దేశపు పల్లెల్లో రైతు కూలీలకు పని లేని తీరిక సమయాల లోనూ, దేవుని వుత్సవాల లోనూ ఈ కథలను చెప్పిస్తుండేవారు. ఈ కథలను చెప్పే జంగాలు పగటి పూట శంఖు, గంటలతో ఇంటింటా వ్వాచకం చేస్తూ, ఈ రాత్రికి నడి బజారులో ఫలానా కథ జంగం కథగా చెపుతున్నామని పలానా వారు చెప్పిస్తున్నారని ఇంటింటా ప్రచారం చేస్తూ, పది లాంతర్లను ప్రోగు చేసి తెల్లవారే వరకూ ఈ కథను చెప్పి వేలాది ప్రజలను ఆనందింప జేసేవారు. ఆనాడు జంగం కథలకు మంచి ఆదరణ వుండేది. ఈ కథకులు ఏ మారు మూల గ్రామంలో కథ చెప్పుకున్న హాయిగా రెండు మూడు బస్తాల ధాన్యం, డబ్బు సంపాదించు కోగలిగేవారు. రాను రాను కుటుంబంలోని సభ్యులందరూ ఈ కథల్లో పాల్గొనేవారు. పురుషుడు కథ చెప్పితే ఆయన భార్వ వంత పాడేది. కొంత మంది ఇద్దరు భార్యలను చేసుకుని జీవన భృతిని తేలికగా సంపాదించు కునేవారు. వృత్తి రీత్యా ఇరువురు భార్యలను చేసుకోవడం తప్పుగా ఎంచేవారు కారు. ఇలాంటి వీరికి ఏవిధమైనా ఆశయమూ వున్నదని చెప్పలేము. ఒకనాడు ప్రబోధం కొరకు ఏర్పాటైన జంగం కథా కళారూపం పారంపర్యంగా జీవనోపాధికి అందితమైంది. ఈ కథలను ముగ్గురు స్త్రీలు కలిపి చెప్పడం కూడ పరిపాటైంది. మూడు స్రీ కంఠాలు కలిపి ఏ బాలనాగమ్మ కథనో చెపుతూ వుంటే పల్లెల్లో కథలు వినే అమ్మలక్కలు కథలో వచ్చే హృదయ విదారక దృశ్యాలకు కండ్ల వెంట నీరు కార్చేవారు. స్త్రీ గొంతులతో చెప్పబడే ఈ కథలు అతి శ్రావ్యంగా వుండేవి.

ప్రదర్శనం, పరికరాలు:

వీరి ప్రదర్శనాలకు రంగస్థలమంటూ ఏమీలేదు. విశాలమైన ఒక వీథిలో పందిరి వేసి చుట్టూ కిరసనాయిలు లాంతర్లు వ్రేలాడ కట్టే వారు. ఈ లాంతర్లు లేని లేని రోజుల్లో ఆముదపు దీపాలనూ, నూనె కాగడాలనూ లేదా ఇలాయి కఱ్ఱలనూ విలిగించేవారు. ఈ నాడు పెట్రోమాక్సు లైట్లను వాడుతున్నారు. ముగ్గురు వ్వక్తులుండి, రెండు పెట్రోమాక్సు లైట్లుంటే అతి తేలికగా జంగం కథా కార్య క్రమం జరిగి పోతుందు. కథకునికి ఒక తంబురా, మూడు అందెలు, రెండు కాళ్ళకు గజ్జెలు, వంతకు రెండు గుమ్మెట్లు, ముగ్గురికీ మూడు గౌన్లూ, మూడు తలగుడ్డలూ వుంటేసరి కథ జరిగిపోతుంది. ఒక్కసారి ఈ సామాగ్రిని ఏర్పాటు చేసుకో గలిగితే రోజు వారిగా కావలసిన సామగ్రి ఏమీ వుండదు. ముగ్గురు వ్వక్తులూ వేలాది ప్రజలకు తెల్లవార్లూ

వుప్పుగుండూరు బుర్రకథ దళం

కథ వినిపించి కూర్చో బెట్టగలరు. వీరు బృందం ఒక గ్రామం నుంచి మరో గ్రామం వెళ్ళాలంటే ఎవరి సామాను వారు భుజాలకు తగిలించుకుని సునాయాసంగా ప్రయాణం చేస్తారు.

కథావిధానం, కథల కట్టు, పట్టు.

జంగం కథల్లో కథకుడు తంబురాను ధరించి శృతిని మీటుకుంటూ చేతి అందెలతో తాళం వేస్తూ కాళ్ళతో నృత్యం చేస్తూ కథను ప్రారంభిస్తాడు. ప్రక్క నున్న వంతదారులు రెండు గుమ్మెటలను భుజాలకు తగిలించుకుని 'దద్దోతిమి, తదిమి తత్తద్ధిమి, తకిట తతధిమి, దింతక్క దాతద్దిందా, తక తక్కి, తకతక్కా' అనే దరువు వేస్తూ 'తదిగిణతోం' అంటూ మధ్య గమకాలనిస్తూ కథా సన్నివేశాల ననుసరించి మధ్య మధ్య అరరె, భళీ, భళీ అంటు కథకుడికి హుషారు నిస్తూ, వుధృతంగా నృత్యం చేస్తూ ప్రజల కందుబాటులో అన్ని ప్రక్కలకు తిరుగుతూ వుంటారు. కథకుని లయ ప్రకారం, వంతలు గమకంగా వాయిస్తారు. కథకుడు చక్కగా చరణం పాడితే దానిని వంత దార్లు తిరిగి వంత పాడుతారు. కథకుడు కధను వివరిస్తే మరో వంతదారు (ఇతడు హాస్యగాడు) ప్రేక్షకులకు వచ్చే అనుమానాలను హస్య ధోరణిలో కథకుని ప్రశ్నించి, సున్నిత హాస్యంతో ప్రజలను ముగ్ధుల్ని చేసి కథను ముందుకు నడిపేవారు. ఈ హాస్యం వల్ల పరాకుగా వున్న ప్రేక్షకులందర్నీ ఒక హద్దులో వుంచి కథను వినేటట్లు అభిలాషను కలిగించేవారు. కథకునికీ, వంతలకూ మధ్య నున్న అవినాభావ సంబందం అంతా ఇంతా అని చెప్పలేం. కథా గమనంలో ఆయా ఘట్టాలలో ఎక్కడా వీసమంత వెలితి రానీయరు. కావాలనుకున్నప్పుడు ప్రేక్షకులను వవ్వించగలరు, ఏడ్పించగలరు, వుదృేకపరచగలరు.కథను విన్న ఆ కొంచెంసేపూ ప్రేక్షకులను ఒడలు మరచేటట్లు చేయగలరు. వంతలు కథను ఆలాపిస్తుంటే కథకుడు చేతిలో వున్న అందెలతో బాటు ఒక అందమైన చేతి గుడ్డను వూపుకుంటూ రెండవ చేతితో తంబురాను మీటుతూ, కాళ్ళ జగ్గెలు ఘల్లుమనేటట్లు నృత్యం చేస్తూ అటూ ఇటూ చేతులు వూపుకుంటూ సాత్విక, ఆంగిక చలనాదులతో రంగస్థలం అంతా కలియ దిరుగుతూ యుద్ధఘట్టాల లోనూ, రౌద్ర ఘట్టాలలోనూ పిడుగులు బడ్డట్లు ఎగిరి ఎగిరి గంతులు వేస్తూ, గిఱ్ఱుగిఱ్ఱున గిరికీలు కొడుతూ, పళ్ళు పటపట కొరుకుతూ అరరే, అరరే అంటూ వంతలను కేకలతో ఆదలిస్తూ హంగామా చేసి ప్రేక్షకులను నివ్వెర పోయేటట్లు చేసేవారు. పైన వివరించిన ప్రదర్శన విధానాన్ని బట్టి, జంగం కథా కళారూపం ఎంత పదునైనదో మనకు బోధపడుతుంది. ముగ్గురు వ్వక్తులతో కూడిన ఈ కళారూపం యొక్క ప్రాముఖ్యం అనిర్వచనీయమైనది. ఇది ఇంతటి వుత్తమ కళాయుధం గనుకనే చారిత్రాత్మకంగా ఆంధ్ర ప్రజాహృదయాలలో హత్తుకు పోయింది.

బుర్రకథ అంటే?

ప్రజాహృదయాలను ఇంతగా చూరగొన్న ఈ జంగం కథల యొక్క పూర్వ చరిత్ర మనకు సరిగా తెలియడం లేదు. జంగం కథగా వర్దిల్లి ఈ కళారూపం నేడు బుర్రకథ అనీ, తంబురా కథ అనీ, తందాన కథ అనీ, గుమ్మెట్ల కథ అనీ, అనేక ప్రాంతీయమైన భేదాలతో పిలువబడుతూ వుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఈ నాడు జంగం కథలంటే చాల మందికి తెలియదు. బుర్రకథ అనే పేరు ఆబాల గోపాలానికి తెలుసు. అలాగే రాయల సీమ జిల్లాలలో బుర్ర కథ అంటే ఎవరికీ తెలియదు. అక్కడ తందాన కథ లనే వ్వవహరిస్తున్నారు. ఈ విధంగా జంగం కథ ప్రాంతీయ మైన భేదాలతో పిలువ బడుతూ వుంది. ఈ కథకు ఇన్ని పేరులు రావడానికి కారణం కూడ లేక పోలేదు.

ఈ కథల్లో ప్రధాన కథకుడు తంబురాను వుపయోగిస్తున్నాడు. ఆ తంబురాకు ఉపయోగించే బుర్రను బట్టి దీనికి తంబురా కథ అనీ, బుర్రకథ అనీ పేరు వచ్చి వుండవచ్చు. ఈ కథలో ఉపయోగించే గుమ్మెట్లను డక్కీలనీ, బుర్రలనీ వ్వవహరించడం వల్ల ఈ కథలకు డక్కీ కథలు, బుర్రకథలు అనే పేర్లు సార్థకమై యుండ వచ్చునని కొందరి అభిప్రాయం.

ఈనాటివి కావు, అక్షరాలా ఆనాటివే:

అలాగే ఈ కథలకు తందాన కథలనీ తందాన పాటలనీ కూడ ప్రచారముంది. ముఖ్యంగా బుర్ర కథలలో గుమ్మెట్లు వాయిస్తూ వంతలు పాడేవారు తందానా, తాని తందానా అనే వంత పాట పాడటం వల్ల కూడ ఈ కథలకు తందాన కథలని పేరు వచ్చి వుండవచ్చు. తందాన కథలు ప్రాచీన కాలం నుండీ వున్నవనడానికి వుదాహరణగా క్రీడాభిరామంలో

అకలంగ స్థితిగోరి కొల్చెదరు బ్రహ్మానంద సంభావనన్
సకలానందమయైక మాతలగుచున్ సంతోష చిమ్మంబునన్
తకదుమ్ముల్ యకతాళముల్ జవనికల్ తందాన లమ్మయ్యకున్
ఏక వీరమ్మకు మూహురమ్మకు నధోహ్రీంకార మధ్యాత్మకున్.

అనిపేర్కొనడాన్ని బట్టి కాకతీయ యుగం నాటికే ఈ జంగం కథలు బహూళ ప్రచారంలో వున్నాయని తెలుస్తూంది. 'యకతాళముల్ జవనికల్ తఆందాన లమ్మయ్య కున్' అనడం వల్ల ఆనాటి జంగం కథల్లో జవనిక వాద్యం కూడ వుపయోగించినట్లు వూహించవచ్చు. 'తందాన' అనే వంత పదం ఆనాడు పాడబడే ప్రతి కథలోనూ వంతగా పాడి వుండవచ్చు.

ఆంధ్రప్రజా జీవితంలో ఇంత విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఈ బుర్ర కథను గూర్చి పాల్కురికి సోమనాథుడు బసవ పురణంలో గాని, పండితారాధ్య చరిత్రలో గాని, తొలి వీథినాటకం క్రీడాభిరామంలో కాని ఎవ్వరూ దీనిని పేరు పెట్టి స్పష్టంగా పేర్కొనక పోవడం చూడగా ద్విపద భూయిష్టమైన ఈ రచనకు ప్రక్క వాద్యాల ప్రాబల్యాన్ని బట్టి క్రమేపీ ఈ పేరు రూఢమై యుండవచ్చు. ప్రాచీన కళారూపాలైన యక్షగాన, వీథి నాటకాల పూర్వ రూపం బుర్రకథ కావచ్చుననీ శ్రీనాథుని కాలానికి ముందు నుంచే ద్విపద ప్రబంధం బుర్రకథ వంటిది గాన రూపంలో వుందనడానికి క్రీడాభిరామం లోని ఈ క్రింది పద్యమే తార్కాణమనీ తిరుమల రామ చంద్ర గారు 'జయంతి' పత్రికలో 'తెలుగువారి తొలి సంగీత కళారూప' మనే వ్వాసంలో వుదహరించారు.

ద్రుత తాళంబున వీరగుంభితక ధుంధుం ధుంకి టాత్కారసం
గతి వాయింపుచు నాంతారాళిక యతి గ్రామాభిరామంగా

ప్రజల నుర్రూత లూగించిన జంగం కథలు, బుర్ర కథలు.

యతి గూడం ద్విపద ప్రబంధమున వీరానీకముంబాడె నో
క్కతె ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం, దూలగన్.

ప్రజానాట్యమండలి మహిళా బుర్ర కథ దళం. తాపీ రాజమ్మ, కొండేపూడి రాధ, వి.సరోజిని

అని 14 వ శతాబ్దంలో రచింప బడిన క్రీడాభి రామ కాలానికే బుర్రకథ కళా రూపం ప్రచారంలో వుందనడానికి ఈ పద్యంలో వుదాహరించిన ఇతివృత్తమే నిదర్శనం. దీని ఇతివృత్తం వీర చరిత్రకు సంబంధించింది. పాడింది ద్విపద కావ్యం. వీర గుంభితను వాయించింది ఒక స్త్రీ. పైన వివరించిన వీరగుంభిత నేటి గుమ్మెటని పండితుల అభిప్రాయం. గుమ్మెట్ల వాద్యం గంభీరంగానూ, గుంభనంగానూ వుండే ధ్వని విశేషం అవడం వల్లదీనికి గుంభిత అనే పేరు వచ్చి వుండవచ్చు. ఈ గుంభితను ఆనాడు స్త్రీలు వాయించినట్లే ఈ నాటి కథల్లో స్త్రీలూ, పురుషూలూ కూడ వాయిస్తున్నారు. ఈ డక్కీలు పూర్వం నుంచీ వున్నవనడానికి కాశీఖండంలో శ్రీనాథుడు

వల్లకి చక్కి కాహళము వంశము డక్క హుడుక్క ఝర్ఘరుల్
ఝల్లని యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై

అని వుదాహరించడాన్ని బట్టి, డక్క హుడుక్క అనే దానిని బట్టి కాహళము మొదలైన వివిధ వాయిద్యాలతో పాడు ఢక్క అనే నేటి డక్కీని బుడబుక్కల వారు వుపయోగించే హుడుక్కను కూడ వుపయోగించి వుండవచ్చు. అలాగే పండితారాధ్య చరిత్రలో

అలరుచు బడి హరులట్ల ల్యందురును
లలినుచ్చి చాంగు భళా యను వారు

అనే దానిని బట్టి నేటి వంతలు పాడే 'భళానోయి భాయి తమ్ముడూ, మేల్ భళానోయి దాదానా' అనే దానికి దగ్గరగా వుండడాన్ని బట్టి 'తందాన తాని తంధనా, భళా, భళి' మొదలైన వంత విశేషాలు ఆనాటి నుంచీ ప్రచారంలో వున్నట్లు మనం తెలుసుకోవచ్చు.

బుర్రకథ గాన విశేషంగా రూపొందిందనడానికి పై ఉదాహరణలే గాక, క్రీడాభిరామంలో

రాగములనుండి లంఘించ రాగమునకు నుదురు సూరుదయ్యంబుపైనొత్తిగిల్ల
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి వలపు బాడుచు వచ్చె జక్కుల పురంధ్రి.

జక్కుల పురంధ్రి వలపు బాడుచు వచ్చె అనే దానిని బట్టి గాన విశేషంగా రుజువౌతుంది. అలాగే బసవ పురాణంలో సోమ నాథుడు శ్రీయాళ చరితను గురించి

కరిమర్థి నూరూర శిరియాలు చరిత__
పాటలుగా గట్టి పాడెడివాడు.

అనదాన్ని బట్టీ,

శ్రీనాథుడు కాశీ ఖండంలో దక్షవాటి పురమును వర్ణిస్తూ........

కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్ష గాన సరణి.

అనడాన్ని బట్టీ గంధర్వగానాన్ని యక్షగాన సరణిలో పాడి వినిపించే వారని అర్థమౌతోంది. పై వుదాహరణలను బట్టి _ ఒకే నటి వివిధ వాద్య విశేషాలతో వివిధ పాత్రల్నీ అభినయించేదని తెలుస్తూంది.

ఈ జాతికి చెందిన కథలను స్త్రీలే కాక, పురుషులు కూడ పాడి వినిపించినట్లు క్రీడాభిరామంలో..

వాద్యవైఖరి కడునెరవాది యనగ_ ఏకవీరా మహాదేవి ఎదుట నిల్చి,
పరశురాముని కథలెల్ల ప్రౌఢి పాడే _ చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.

వివిద వాద్యాలలో పరశురాముని కథలు బవనివారు పాడి వినిపించినట్లుగా వుంది. జవనికలు, డక్కీలు మొదలైన వాద్య వైఖరులన్నీ చేరి వుండవచ్చును. ఇందుకు మారో వుదాహరణగా పండితారాధ్య చరిత్రలో...

నాదట గందర్వ యక్షవిద్యాధి...
రాదులై పాడేడు నాడెడు వారు.

పై వర్ణనలను బట్టి నటి నాట్యానికి అనుకూలమైన దుస్తులు ధరించి యక్షిణి లాగా తంబూరా లాంటి జంత్ర వాయిద్యాన్ని వాయిస్తూ, పాడుతూ, ఆడుతూ కథ వినిపించేదని తెలుస్తూ వుంది. ఈ మాదిరి కథ వినిపించింది జక్కుల పురంధ్రి అని విదితమౌతోంది. దీనిని బట్టి మూల యక్షగానం సంగీత నృత్య సహాయంతో కథ వినిపించే కళారూపమని స్పష్టమౌతోంది.

ధర్మాంగద చరిత్ర, చిత్రాంగద విలాసం మొదలైన యక్షగానాలు 'వేషముల్ గట్టి జనులు పాడి వినిపింప' అనడాన్ని బట్టి 'వలుపు బాడుచు వచ్చె జక్కుల పురంధ్రి' అనేదాన్ని బట్టి గోవింద దీక్షితుడు సంగీత సుధ అనే లక్షణ గ్రంథంలో యక్షగానం యక్షులచేత పాడబడే ఒక సంగీత విశేషమని వుదాహరించడాన్ని బట్టి పాడి వినిపించడానికీ వుపయోగింప బడ్డాయని అర్థమౌతూంది. అతి ప్రాచీన యక్షగానాలైన ఓబయ మంత్రి గరుడాచల యక్షగానమూ, కందూకూరి రుద్రయ్య రచించిన సుగ్రీవ విజయమూ పాడి వినిపించినవేగాని యక్షగానాలుగా ప్రదర్శింప బడినవి కావు. కేవలం ఒకే నటి వివిధ పాత్రల్ని అభినయించేదని ఉదాహరణలను బట్టి తెలుస్తూవుంది. అయ్యగారి వీరకవి రచించిన చిత్రాంగద విలాసమనే యక్షగానంలో

చిత్రాంగద విలాసమనగ యక్షగాన మొనరించు.
వేషముల్ గట్టి జనులు పాడి వినిపింప.

అని పేర్కొనడాన్ని బట్టి యక్షగాన రూపంలో వున్న వీథి నాటకమని బోధ పడుతూంది. పై వుదాహరణలను బట్టి యక్షగానాలు, వీధి నాటకాలు, బుర్రకథలు మొదలైనవన్నీ దేశి సారస్వతానికి చెందిన సంగీతరూపకాలుగా పరిణామం చెందుతూ, దేనికి దానికే ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుని, వివిధ కళారూపాలుగా వృద్ధి చెంది వుండవచ్చు. ఇలా గాన రూపంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన యక్షగానంలో సూత్ర ధారుడు ప్రవేశించి, నటి యొక్క పాటకు వంత పాడుతూ, కథా గమనంలో వచ్చే చిల్లర పాత్రలకు వాచికం చెపుతూ వుండేవాడు. నటి వివిధ పాత్రల్ని అభినయిస్తూ కథ వినిపించేది. ఈ విధానమే భామాకలాపం, గొల్లకలాపంగా రూపొంది వుండవచ్చు. సూత్ర ధారుడు విదూషకుడుగా మారి వుండవచ్చు.

తరువాత యక్షగానంలో వచ్చిన మార్పులననుసరించి మరో దశ నందుకుంది. ఒకే నటుడు వివిధ రకాల పాత్రల్ని అభినయించడమే కాకుండా విడి విడిగా ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్రను అభినయించే సాంప్రదాయం ఏర్పడింది. తంజావూరు యక్షగానాల్లోనూ, యాదవ దాసు గరుడాచల యక్షగానంలోనూ, పాత్రల ప్రవేశం ప్రవేశ పెట్టబడి వుంది. అంటే ప్రవేశించే ప్రతి పాత్రా తన వూరు, పేరు తెలుపుతూ, 'వెడలె సత్య భామ ' అని స్త్రీ పాత్రలూ, 'వెడలె యమధర్మ రాజు' అని పురుష పాత్రలూ ప్రవేశించే వన్నమాట. ఈ దశలో పరిణామం చెందిన యక్షగానాలను యక్షగాన నాటకాలని, వీథి నాటకాలని పిలిచారు.

ఈ విధంగా యక్షగానాలు రచనలో, ప్రదర్శనలో అభివృద్ధి చెందుతున్నా మూల యక్షగాన మైన సంగీత రూపం బుర్ర కథగాను, హరికథ గానూ రూపొందింది. ఇందుకు వుదాహరణ _ హరికథా పితామహుడైన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు తమ కథలన్నిటినీ యక్షగానాలనే వ్వవహరించారు.

యక్షగానంలో సూత్రధారుడు, విదూషకుడూ వున్నట్లే బుర్ర కథలో వంత దారులు ప్రవేశించారు. యక్షగానంలో విదూషకుడు హాస్యం చెపితే బుర్రకథలో వంతదారు హాస్యం చెపుతాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ కొన్ని బుర్ర కథలను స్త్రీలూ కూడ చెప్పడం వల్ల ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించగలిగేవారు.

ఈవిధంగా పరీశీలన చేసేటట్లయితే మూల యక్షగానం రూపాంతరం పొంది బుర్రకథగా పరిణామం చెందిందని శ్రీనివాస చక్రవర్తి గారు నాజరు సన్మాన సంచికలో వుదహరించారు.

మహారాష్ట్ర కళారూపమా;

ఈ బుర్ర కథ కళారూపం మహారాష్ట్రం నుండి మనకు దిగుమతి అయిందనే వాదం కూడా వుంది. చాళుక్య రాజులు తూర్పు కోస్తాను పరిపాలించిన రోజుల్లో పశ్చిమ దేశాన్నుంచి తూర్పుకు వచ్చిన చాళుక్య రాజులతో పాటు ఈ బుర్ర కథలు, తోలు బొమ్మలాటలు మొదలైన జానపద కళా రూపాలు దిగుమతి అయినాయని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. కాని చరిత్ర గతిని బట్టి కొంచెం వెనుకకు వెళ్ళి పరిశీలిస్తే ఒకనాడు దక్షిణ భారత దేశమంతా అనేక పర్యాయాలు, అనేక చక్రవర్తుల ఏలుబడిలో ఏక ఖండంగా వుంది. కృష్ణదేవరాయల పాలనలో కన్నడ, తెలుగు, తమిళ రాస్ట్రాలు కలిసే వుండేవి. ఆనాడు ఆంధ్ర కళారూపాలు విజయనగరం తంజావూరు సరస్వతీ మహల్ యక్షగానాలూ, తెలుగు నాటకాలను ప్రదర్శించే మేలటూరు భాగవత మేళాలు ఉదహరణలుగా నిలిచి వున్నాయి. ఈ విధంగా ఆ యా కాలల్లో కళల యొక్క సారస్వతం యొక్క ప్రభావం ఆయా జాతుల మీద పడి వుండవచ్చు. అందువల్ల ఏ కళారూపం ఎక్కడి నుండి దిగుమతి అయిందనే మీమాంసకు తావు లేదు. కాని ఇందుకు ఉదాహరణగా తిరుమల రామచంద్రగారు 'జయంతి ' పత్రికలో బుర్రకథ తెలుగు వారి సంగీత కళారూపమే ననీ అది ఎక్కడనుండో దిగుమతి కాలేదనీ, కన్నడ మహారాష్ట్ర కళారూపాలైన పవాడా, లావణీలకూ మన బుర్రకథకూ వున్న వ్వత్యాసాలను గురించి చర్చిస్తూ ఈ క్రింది విధంగా ఉదాహరించారు.

తెలుగు బుర్ర కథకు, మహారాష్ట్రుల పవాడాకు, కన్నడుల లావణీకి, జానపదకళారూపా'లనడం తప్ప మరేమీ పోలిక లేదు.

పవాడాను కూర్చుని , నిలబడీ పాడుతారు. ఇది మన భజన గోష్ఠిలాంటిది. ఈ కథలో వీరరసం ప్రాధాన్యం వహిస్తుంది. వెనుక వంతదార్లు _ పురుషులు _దీదీ దీదీ అంటూ వంతరాగాలు పాడుతారు.

బుర్రకథలో మాదిరి అభినయం గానీ, నిలబడి నృత్యం చేయడం గానీ పవాడాలో లేదు. ఇక కన్నడ లావణీ ప్రాచీనమైనది. 16వ శతాబ్దంనుంచీ లావణీ ప్రచారంలో వుంది. పదిహేడవ శతాబ్దంలో నంది వర్మ దీనిని తన ఛందో గ్రంథంలో ఉదహరించి లక్షణం చెప్పాడు.

లావణి అనేది జనపద గాథలను తెలిపే ఛందోవిశేషం. ఇవి గ్రామీణ జీవిత గాథలను వివిధ రసాలతో ప్రకృతి సౌందర్యాన్ని వివిధ రీతులలోను వర్ణిస్తుంది. ఇద్దరు గాని ఒక్కరు గానీ నిలబడి పాడుతారు. దీనికి వంతపాట వుండదు. దీనికీ మన బుర్రకథకూ నిలబడి పాడడమనే పోలిక తప్ప మరే పోలికా లేదు.

పోతే మరాఠీలో కూడా లావణి వుంది. దానిలో స్త్రీలు పాడడం, చేతులు త్రిప్పడం వంటి అంగికాభినయం వుంది. కాని కథా విధానం వుండదు. గుమ్మెట్ల వంటి వాద్యాల ప్రసక్తి లేదు. అది కేవలం పేరంటపు పాటల వంటిది కావచ్చు. పై ఉదాహరణల ననుసరించి, బుర్ర కథ కన్నడ మహారాస్ట్రాల నుంచి గాని, మరే రాష్ట్రం నుంచి గాని దిగుమతి కాలేదని స్పష్టమౌతోంది.

బుర్రకథ:

జానపద వాఙ్మయంలొ జంగం కథల సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని వహిస్తూ వుంది. ఈ సాహిత్యంలో చాల రకాలు కనిపిస్తున్నాయి. చాలవరకు పూర్వపు యక్షగానాల్లో ఇతి వృత్తమంతా పురాణ గాథలకు సంబంధించింది యక్షగానాలు బుర్ర కథలుగా అభివృద్ధి చెందిన తరువాత

ప్రజానాట్యమండలి బుర్రకథ దళం. కథకుడు ఉమామహేశ్వరరావు- వంతలు మిక్కిలినేని_మాచినేని

బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీర చరిత్ర మొదలైన చారిత్రిక యుద్ధ కథలూ, బాలనాగమ్మ, కామమ్మ, చిన్నమ్మ, లక్ష్మమ్మ, తిరుపతమ్మ, జానకీ వాసం మొదలైన కరుణరస ప్రధానమైన పాతివ్రత్య గాథలూ, ఉత్తర గోగ్రహణం, వామన విజయం, దేవయాని చరిత్ర, అంబరీషోపాఖ్యానం మొదలైన భారత రామాయణ గాథలకు సంబంధించిన అనేక కథలూ వచ్చాయి.

ఆనాటి నుండి ఈ నాటివరకు జంగం కథలు ప్రచారంలో వున్నాయి. ఈ నాడు జంగం కథల పద్ధతిని రాజకీయ, సాంఘిక పరిస్థితులకు అన్వయించి ప్రచారం చేస్తు

న్నారు. వెనుకటి వీరరస గాథల్నీ దేశ భక్తిని పురికొల్పే దేశనాయకుల జీవితాలైన, "గాంధీ జీవితం, అల్లూరు సీతారామ రాజు, సుభాష్ చంద్ర బోస్" మొదలైన దేశభక్తుల జీవిత గాథలు, కష్టజీవి, రైతు విజయం మొదలైన కష్ట జీవుల గాథలూ చెప్పి ప్రజా ప్రబోధం చేస్తున్నారు.
పూర్వపు విధానా లేమిటి?

పూర్వపు జంగం కథల రచానా విధానం ఎటువంటిదో ఇదమిత్థంగా మనకు పూర్తిగా తెలియ లేదు. కానీ ఇటీవల రచించిన కథలు ఒక పద్ధతిలో జంగం కథలు గానే వ్రాయ బడ్డాయి. ఈ రూపంలో పూర్వం నుంచీ చెప్ప బడిన సంగీత రూపకమైన బుర్ర కథ, కురవంజీ, యక్షగాన రచనలనే బుర్ర కథలుగా చెప్పినట్లు ఒకే ఛందస్సును వివిధ కళారూపాలకు ఎలా వర్ణించాడో ప్రసిద్ధ బుర్రకథ గాయకుడు తన సన్మాన సంచికలో ఈ విధంగా వర్ణించాడు.

అప్పకవీయం:

తుద నేడు లఘువులు తొలగించి చదివిన
త్రిప్పుటకు వృషభగతి పదయుగము.
లలిగడపల నొక్క లఘువు దూసిన జంపె
మను ద్విరద గతి సమపద యుగము
గురుతుగ రబ్బరకు డురుగ వల్లనా
హ్వయమేక తాళియా మధుర గతికి

అంగి కిర్వదినాలు గటతాళమున
మాత్రలివి విశ్రాంతి పధ్నాలుగింట
తెలియ నర్ద చంద్రికల దీన

యక్షగాన ప్రబంధంబు లతుకవచ్చు
రగడ భేదంబు లివి యందు రసకవీంద్రు
                                     (అప్పకవీయము)

ఉదాహరణకు:

వృషభగితి రగడ యననేమి?
కుపికలోత్తమ నాకు చూడగ
కపటవేషము కానరానిది.
         (కందుకూరి రుద్రయ్య, సుగ్రీవ విజయం, యక్షగానం)

ఈనాడు ఆచరణలో నున్నది.

రాయు డొఛ్ఛే డాకలాకు
కొంగలే కోలాట మేసె.
           (సర్వాయి పాపడు బుర్ర కథ)

ఇక రెండవది ద్విరతగతి రగడ.

వనచరోత్తము లెల్లివచ్చి - మంచి
దినము చేకొని నన్ను దెచ్చి (సుగ్రీవ విజయం)

ఈనాడు కనిపిస్తున్నది.

ఓ రామ రాఘవా నేడు భళీ భళీ
శ్రీ రామరాఘవా నేడు
          (జానకీ వాసం లేక లవ కుశ బుర్రకథ)

మూడవదైన తురగ వల్లము.

ముక్కులు చెక్కులు మూపులు వీపుల్
ప్రిక్కలు పెక్కలు బరులు మదరులున్ (సుగ్రీవ విజయం)

ప్రస్తుతం కనిపిస్తున్న బుర్రకథ:

మందులు మందులు మందులంటడే
మహావ్యాథులకు మందులంటడే(శరాబంది రాజు బుర్రకథ)

నాల్గవదైన ఆట తాళము

కుపికులోత్తమా - నాకు చూడగా కపట వేషమేగా
(సుగ్రీవ విజయం)

ప్రస్తుతమున్న బుర్రకథ

శ్రీ ధేనువు గిరిధామా - యుదుకుల క్షీరాంబుధి సోమా.
(ధేనువు కొండ వారి, విరాటపర్వం)

అయిదవ అర్థచంద్రికలు

కుపిలులోత్తమా నాకు చూడగన్
కపట వేషము కానరాదిదిన్
(సుగ్రీవ విజయం)

ప్రస్తుతమున్న బుర్రకథ

ఉత్తరాదియా భూమే అమ్మయ్య
అందమైన లింగాల పురంలో
(లక్ష్మమ్మ కథ)

ఇవేకాక అర్థ చంద్రికలు అనేక పణుతుల్లో కనిపిస్తున్నాయి. ప్రాచీన కురవంజి నృత్య కారుల కోవకు చెందిన చెంచులు పాడే పణతులు.

ఏవూరు ఏ భామా - తంధానా
ఎవ్వారి భామవే - వై భామా
చేతిడే ముద్దమ్మా - తంధానా
చేయెత్తి దానాలు - వై భామా
వడ్డిచ్చెతల్లో వడ్డిచ్చెతల్లో
(చెంచులు)

అలాగే కోయలు>

మోకాళ్ళ నొప్పులకు
వాత నొప్పులకు
అమ్మా నే నింతగల్ల శ్రద్దనే ॥ఈ॥
నేనీ యంటే ఉన్నానే ॥ఈ॥
(కురవంజి)

ఈ విధంగా అనేక విధాలుగా ప్రజల్లో వినిపిస్తున్న విధానాలు భరతుడు నిర్వచించిన కొరవంజి ... యక్షగానాల నుండీ గాంధర్వ గానము లుద్భవించాయని మనం అర్థం చేసుకోవచ్చు. పై ఉదాహరణలను బట్టి మన జంగం కథలు, బుర్ర కథలు, కురవంజి, యక్షగానం మొదలైనవి అనేక దశలను దాటి నేటి సంగీత కళారూపంగా నిలబడిందని చెప్పుకోవచ్చును.

జంగం కథలు ఎప్పటినుండో వస్తున్నా జంగం చరిత్ర కథలనేవి ఇటీవలనే రచింప బడినాయనీ ఇవి ఒక పోషకుని కోరిక మీద వ్రాయబడి అతనికి గాని మరొకనికి గాని అంకిత మీయ బడతాయని అటువంటి జంగం కథా రచయితలు కొందురున్నారనీ వారి కాలాన్ని గురించి వారు రచించిన జంగం కథలను గురించి ..... టేకుమళ్ళ కామేశ్వర రావు గారు కొంత కాలం క్రితం ఆంధ్ర మహిళ పత్రికలో వివరించారు.

జంగం కథలు, కొందరు రచయితలు ధేనువుకొండ వెంకయామాత్యుడు:

ధేనువుకొండ వెంకయామాత్యుడు 1890 ప్రాంతానికి చెందిన వారు. ఒంగోలు తాలూకా గార్లపాడు గ్రామస్తులు. ధేనువు కొండ పిచ్చయ్య గారి పుత్రులు. ఈయన విరాటపర్వం అనే జంగం కథను రచించి ఆ వూరి విష్ణు దేవునికి అంకితమిచ్చారు. ఈయన యక్షగానాల్ని రక్షించినట్లు పీఠికలో వ్రాసుకున్నారు.

వీరు ఉషా పరిణయం, మైరావణ చరిత్ర ... విరాటపర్వం ... ఉత్తర గోగ్రహం, దక్షిణ గోగ్రహణం, కీచక వధ... వామన చరిత్ర ...ప్రత్యేకంగా వ్రాశారు. యక్షగాన కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి.

ప్రహ్లద చరిత్ర ...ప్రద్యుమ్న విజయం ...సుందరకాండ ... సీతా కళ్యాణం మొదలైన హరికథలను కూడా రచించారు. వెంకయ్యగారి కథలన్నిటినీ, కీ॥శే॥దొడ్డారపు వెంకటస్వామిగారు మహద్భుతంగా చెప్పి ప్రచారంలోకి తీసుకొచ్చారు. వెంకయ్య గారిని గురించి గృహలక్ష్మి సంపాదకులు కేసరి గారు తన చిన్ననాటి ముచ్చట్లలో ఉదహరించారు. వెంకయ్యగారు విరాటపర్వంలో ఉపయోగించిన రగడ.

రగడ

అనిన ద్రౌపదిని గనుగొని భామిను లాశ్చ్యరంబునను
ఘనముగ నిట్లని బల్కిరి తమలో వనిత లందరును గూడి
ఏమి చోద్య మిది నమ్మవచ్చునా ఇంతులార మనము
భామామణి యొక రింటివద్ద తా బానిసంబు చేయ.

గంజి నాగదాసు

గంజి నాగదాసు 1885 ప్రాంతానికి చెందినవాడు. స్వగ్రామం ఫలానా అని ఎక్కడా చెప్పుకోలేదు కాని ప్రతి కీర్తనలోనూ మంగళాద్రి అని చెప్పుకొనడం వల్ల అది గుంటూరు జిల్లాలోని మంగళగిరి కావచ్చును.

ఈయన శ్రీయాళు చరిత్రను రసవంతంగా రచించాడు. సరియైన పాత్ర పోషణతో పాటు కరుణ రసం నేర్పుగా చిత్రింపబడింది. సులభశైలిలో వ్రాయ బడిన ఈ కథలో రగడలు, కంద పద్యాలు అక్కడక్కడ కీర్తనలు, ఇతర ఛందస్సులతో పాటు కొన్ని శ్లోకాలు ఉదహరించబడ్డాయి.

కిలారు బ్రహ్మయోగి:

కమ్మ కులానికి చెందిన కిలారి బ్రహ్మ యోగి ...భళ్ళాణరాయ కథ ఆనే జంగం కథను రచించాడు. ఈయన 1895 ప్రాంతానికి చెందినవాడు. ఈయనది మొద పెండ్రేల గ్రామం. తరువాత చింతలపాలెంలో వున్నట్లుగా పీఠికలో వాసుకున్నారు.

బ్రహ్మయోగి విష్ణుభక్తుడైనప్పటికీ వీరశైవ కథను రచించాడు... భల్లాణరాయ కథ 1180 ప్రాంతంలో పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో వుంది. బ్రహ్మయోగి కవిత్వం విన సొంపుగా వుంది. జంగాలు పెట్టుకునే అనేక పేర్లనూ ఆనాటి జంగాల యొక్క ప్రాముఖ్యాన్ని ఇలా వివరించాడు.

రగడ

కోటి సంఖ్యలకు మిగిలిన సంగము లటకు చేరి రపుడు
ఘణం ఘణా యని ఘంటానాదము మింటికి నెగియగను
ధణం ధణా యని తాళనాదములు ధ్వనులట చెలగగను
ధిమి ధిమి ధిమి యని దిమ్మెట లపుడటు సమముగ వాయగను

ఈ విధంగా ఆనాటి జంగాల ఉద్రేకాలను రమణీయంగా వర్ణించాడు. ఈయన కథా రచనలో యక్షగానాన్ని, కందకావర్థ దరువుల్నీ, రగడల్నీ, శృంగార నాటకంగా కథా సరళిని చెపుతానని 14వ పేజీలో చెప్పుకున్నారు.

ఉప్పలపాటి వెంకటరామయ్య:

ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు. ఆరువేల శాఖీయుడు. ఈ కవి అంబరీషోపాఖ్యానం ... జంగం చరిత్ర కథను వ్రాశాడు. రావినూతలపాటి కాపురస్తుడు. వీరగుంట శేషయ్య. ఈ కవిని అంబరీషోపాఖ్యానాన్ని రచించమని కోరగా దీనిని రచించి ఆ వూరి చెన్న కేశవ స్వామికి అంకిత మిచ్చాడు.

ఈ కవి ఇలా వ్రాసుకున్నాడు

రంగుగ తాంబురా చిటి తాళములు ఖణింగున మోయగను
ఛంగు ఛంగున జంగము వారలు ప్పొంగుచు నిక్కథను
చెప్పుట కొర కీ రగడ పద్దతిగ జేసి నిక్కథను.

ఈయన రచన సులభమైన రచనలో సాగింది.

గంధి వెంకటసుబ్బయ్య:

ఈ కవి వైశ్యుడు. గుంటూరు జిల్లా నంబూరు నివాసి. ఈయన వామన విజయం, దేవయాని చరిత్రను రచించాడు. వామన విజయం కథను ఈయన మిత్రులైన పొట్టి పానయ్య, వెంకట సుబ్బయ్యను, వామన విజయాన్ని రచించి, నంబూరు గ్రామంలోని మల్లిఖార్జున స్వామికి అంకిత మియ్యమని కోరారు. అందు మీదట కవి ఈ జంగం కథను రచించాడు.

జంగం కథకులు, బుర్రకథకులు:

పూర్వం జంగం కథలు చెప్పిన వారిలో ప్రముఖులు దొడ్డారపు వెంకట స్వామి, అంజే కోటదాసు, జంగా సుబ్బదాసు, యాదవ దాసు, రెంట పాళ్ళ గుడ్డి జంగం, కోలవెన్ను సమ్మెట రామలింగం, జంగయ్య సుమ్మయ్య దేవర దావులూరు యల్ల మంద, మంతెన జంగాలు మొదలైన ఎందరో మహామహులు జంగం కథకులుగా వర్థిల్లారు. మరెందరో పేర్లు తెలియనంతగా కాల గర్భంలో కలిసిపోయారు.

ఆధునిక బుర్ర కథకులు:

పద్మశ్రీ షేక్ నాజరు, సుంకర సత్యనారాయణ, కోగంటి కాకుమాను సుబ్బారావు, పట్టం శెట్టి ఉమామహేశ్వర రావు, శరివి శేట్టి సుబ్బారావు, డా॥ మిక్కిలినేని, పెరుమాళ్ళు ...మాచినేని, వడ్లపూడి నాగేశ్వరరావు, ఉప్పుగుండూరు కృష్ణమూర్తి ... భీమవరం బాలికలు, చుండ్రు చిన్నాబ్బాయి ... కడప హుసేన్ బాబా, గిద్దలూరు తుపాకుల బసవయ్య, నిట్టల బ్రదర్స్, నలాది భాస్కరరావు, జూనియర్ నాజర్ బెనర్జీ, ప్రసాద్ మోటూరి వుదయం, తుమ్మల కేశవ రావు, గుడివాడ రాఘవులు, కాజబుర్ర కథ దళం నందిగం బ్రదర్సు సబ్బి కనకారావు, కొండేపూడి రాధ, రాఘవరెడ్డి దళం మొదలైన వారంతా ప్రజానాట్య మండలి కళల ద్వారా బుర్ర కథలను చెప్పారు.

పైవారే కాక:

డా: కుమ్మారి మాష్టారు, భద్ర కాళి _ పున్నమరాజు, హనుమంత రాజు, వింజమూరు రామారావు, గొఱ్ఱెల రామలింగం, సైదులు, నదీరా, జయంతి, త్యాగరాజు, బూర్గుల రామమూర్తి, వందన కోటేశ్వర రావు, శిష్టా సాంబశివరావు, రెడ్డి చిన వెంకటరెడడ్డి, కృష్ణమోహన్, తాత నాగేశ్వర రావు, జిల్లెళ్ళమూడి ప్రసాద దళం, పురుషోత్తం, కనకయ్య, చిట్టాల నారాయణరావు, నీలా జంగయ్య, రొంగ సత్యనారాయణ, రాజోలు లక్ష్మణరావు, భువనగిరి నారాయణ, కొమర శ్రీదశం, బళ్ళ గంగరాజు, బళ్ళా ఈశ్వరుడు, శ్రీమతి శారద, కుమారి వాణి, గంగా పట్నం ఆదిశేషయ్య, తిరుపతమ్మ _ తిరుపతి, మానాపురం

బుర్రకథకురాలు భద్రకాళి

నరసింగరావు, కవిశ్రీ ప్రకాశం, డి. ప్రసాద రావు, పైవూరి పాపారావు, దేవాదుల బ్రహ్మానందం, నీలకంఠం, రామ సుబ్బరాయుడు, రామి శెట్టి వీరేశం, తిరుపతి వెంకట సుబ్బమ్మ, చేజర్ల శివరామయ్య, మంగం సత్యనారాయణ, కంభంపాటి హనుమంత రావు మొదలైన వారెందరో బుర్ర కథకులుగా వర్థిల్లారు.

కొందరు వంతలు:

కోగంటి రామ కోటి, రాఘవాపురపు అప్పారావు, మాచినేని డా॥మిక్కిలినేని, పురుషోత్తం, రాజబాబు, పండు, చక్కా సూర్య నారాయణ, నిట్టల శతృఘ్నరావు, నిట్టల హనుమంత రావు, చుండ్రు సూర్యనారాయణ, చదలవాడ కుటుంబ రావు, సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళు, కోసూరు పున్నయ్య, పురుషోత్తం, లక్ష్మీ నరసయ్య మండలీక కృష్ణ, అల్లాడ బాల శంకర రావు, డొక్కా అనంత రామ మూర్తి, చిన్నబ్బాయి, కట్టా వీరయ్య, సుబ్బారెడ్డి, నూకల అప్పన్న శాస్త్రి, సలాది నాగరాజు, పిళ్ళా అప్పారావు, ఆడబాల కృష్ణమూర్తి, గంగాద్రి, వింజమూరి లక్ష్మణ రావు, వడ్డే రాజయ్య, లక్ష్మణ్, యాదగిరి, పి. ప్రభాకర రావు ఎ.ఎ. శర్మ, జిన్నాభట్ల రామం, కుసుమంజ ఝాన్సీ, తాపీ రాజమ్మ, వీరమాచనేని సరోజని, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి లక్ష్మి తులసి, మండలీక రామం, బళ్ళ అబ్బరాజు మొదలైన వారంతా బుర్ర కథల్లో వంతలుగా ప్రసిద్ధి చెందినట్లు నదీరా గారు ప్రపంచ తెలుగు మహా సభల్లో వెలువరించిన బుర్ర కథలు గ్రంథంలో ఉదహరించారు.

ప్రత్యేక వంతలు:

సాంప్రదాయమైన బుర్రకథ వాయిద్యాలతో పాడు హర్మోనియం, తబలా మొదలైన వాయిద్యాలను ప్రవేశపెట్టి కథలు చెప్పిన వారిలో నిడదవోలు అచ్యుత రామయ్య, సుంకర కృష్ణ, మాధవ రావు, కుమ్మరి మాష్టారు, డి.ఎ. నారాయణ, కప్పగంతుల రామం మొదలైన వారు కథలు చెప్పగా మల్లిక్ కూచి వీరభద్ర శర్మ, నలాది వెంకన్న, మండలీక కృష్ణ, భాస్కరం మొదలైన వారు వంతలుగా వ్వహరించారు.

కొందరు బుర్రకథా రచయితలు:

ప్రజాకవి సుంకర సత్యనారాయణ, కాకుమాను సుబ్బారావు, షేక్ నాజర్, వానమామలై వరదాచార్యులు, మాచిరాజు లక్ష్మీపతి, కోగంటి గోపాల కృష్ణయ్య, కవి కుమార్, జంపన చంద్రశేఖర రావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, లక్ష్మీకాంత మోహన్, తెల్లాకుల వెంకటేశ్వర గుప్త, రుక్కాభట్ల విధుమౌళి శర్మ, పేరి సుబ్బారావు, తిరునగరి టి. రామాంజనేయులు, నీలా జంగయ్య, శ్రీపాద రామ మూర్తి, వారణాసి వెంకట నారాయణ శాస్త్రి, రామ కవచం సత్యనారయణ, పి. బాలకృష్ణ ప్రయాగ నరసింహశాస్త్రి, రెడ్డి, చిన వెంకట రెడ్డి, ఎనమండ్ర సుబ్బారావు, దంటు కృష్ణమూర్తి, నదీరా మొదలైన వారెందరో సాంఘిక రాజకీయాలకు సంబందించిన బుర్ర కథలను ఎన్నిటినో రచించారు.

గుమ్మెట్ల వాయిద్య:

ముఖ్యంగా జంగం కథలకు గానీ, బుర్రకథలకుగానీ జీవం పోసేది గుమ్మట్లను ధరించిన వంత దారులే. బుర్రకథను దద్దోతిమి అనే మూడు దెబ్బలతో కూడ కథను చెప్పవచ్చు కానీ ఈ గుమ్మెట వాయిద్యాన్ని శాస్త్రీయమైన వరుసలతో కనువిందు చేస్తారు. ఈ వాయిద్యంలో ఖమ్మం వాస్తవ్యుడు బుర్ర పంతులు గుమ్మెట మీద అన్ని ధ్వనులనూ శాస్త్రీయంగా పలికిస్తాడు. సన్నివేశానికి అనుగుణంగా ధ్వనులను పలికించ గలరు. అలాగే దొడ్డారపు వెంకట స్వామి వంతదారు. తాడికొండ సుబ్బయ్య, యల్ల మంద గార్లు గుమ్మెట్ల వాయిద్యంలో సిద్ధహస్తులు. యల్లమంద వద్ద మిక్కిలినేని, మాచినేని అనేక వరుసల్ని నేర్చుకుని ప్రజానాట్య మండలి దళాలకు శిక్షణ ఇచ్చారు. ఎంతో సాధన చేస్తేగానీ, ఈ వరుసలు అంకెకు రావు. కథకు ఈ వరుసలే ప్రాణం. ఉదాహరణకు....

దద్దో తిమి, దద్దో తిమి
తక తక్క తక తక్క.
తక తక్క తత ధిమి
తక తకిట్ట తక్కిట తక్కిట
తక త్గకిట్ట తక్కిట తక్కిట
తక తక్కిట,దరికిట తక్కిట్ట,
త, ఝుణం తకత, ఝుణ తకత.
త, ఝుణం తక తకత ఝుణం తక్కిట త.
దరికిట తక్కిట్ట, ధిత్తరికిట తక్కిట్ట,తక దరికిట తక్కిట్ట.
ధిత్తరికిట తక తరికిట, ధిత్త్తరికిట తక దరికిట
తకిట తకిట తక _ఇదే _దిం తత ధిమి తక
దరికిట దరికిట _ ధోంకి తధోంకి.
తక ధింతక, దరికిట ధింతక

ఈ విధంగా ఎన్నో వరుసలతో జోడు గుమ్మెటలు ముక్తాయింపులతో వాయిస్తూ వుండే కథ ఎంతో రస వత్తరంగా నడుస్తుంది. వరుసలకు తగినట్లుగా కథకుడు నృత్యం చేస్తూ వుంటే ప్రజలు వుత్తేజితులౌతారు. ముఖ్యంగా రౌద్ర ఘట్టాలతో గుమ్మెటల మ్రోతలు, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ వుంటాయి. కథకీ, కథకునకు గుమ్మెట్లే ప్రాణం.

బుర్రకథలో వంత పాటలు:

బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత ఆయా కథకులు వారికి తోచిన వంత పాటను కథకునకు అండగా ఈ విధంగా పాడతారు.

శ్రీధేనువు గిరిధామా యదుకుల క్షీరాంబుధి సోమా.

అనీ

వినరా భారత వీరకుమారా, విజయము మనదేరా

అనీ

కూడి చరించిన విజయము మనదే కూలి రైతులారా

అనీ,

జయము జయము మన మహిళలందరకు జయము కలుగుగాక

అనీ,

సంఘోద్దరణ విచారాధీరా, సహజ గుణధామ
పండిత వితండ వాద ఖండనా, ప్రజాభాష పోష
మహిళావుద్యమ నిర్మాతా, ఓ మహిత గుణవిశాల.

అనీ,

వినరా నైజాం తెలుగు ప్రజల ఘన వీర సమర చరిత.

అనీ.

తంధానా, తాన తంద నానా,
భళానోయి భాయి తమ్ముడా భాయి భళానోయి తమ్ముడా,
భాయి భళానోయి దాదానా.
తందన భాయిదేవ నందనానా

అంటూ వివిధ కథలలో వివిధ ఘట్టాల ననుసరించి భళి భళీ,అరెరే, అనీ, హరి హరీ అనీ, అయ్యో అనీ, ఒరేయ్ అనీ, శహభాష్ అనీ, వహ్వా అంటూ కథకునికి ఊత యిచ్చి కథను రక్తికట్టిస్తారు.

బుర్ర కథ రగడలు:

జంగం కథల్లో బుర్ర కథల్లో ఆయా రచయితలు ఎవరికి వారు వారి ధోరణిలో ఎన్నో రగడలను కీర్తనలను బాణీలను వివరించారు. అలా సుంకర సత్యనారాయణ గారు కథలకు ప్రార్థన ఈ విధంగా వివరించారు.

ప్రార్థన:

మాతృ దేశము కొరకు మరణించు భక్తుల పూలతో పూజింపరావ ॥మా॥
స్వాతంత్ర్య పోరాటములలో చావు బ్రతుకో తేల్సు కొనెడి
వీర దేశ సేవాకులకు వేగ రార పూజ సేయ ॥మా॥

ఇలా ప్రార్థన అయిన తరువాత పల్లవితో కథ ప్రారంభ మౌతుంది. అలా నాజరు వ్రాసిన పల్నాటి వీర చరిత్రలో

వినరా భారత వీర కుమారా
విజయము మనదేర.
వినరా ఆంధ్రుడ పల్లనాటి
ఘన వీరచరిత నేడు.

అంటూ,నాగమ్మ నేర్చిన విద్యల్ని ఇలా వివరించారు:

శాస్త్రాలన్నీ చరచర నేర్చెను.
కొండల యుద్ధం మెండుగ నేర్చెను
నీటిలో చేపను ఇట్టె కొట్టెను.
వడిసెల యుద్ధం వడిగా నేర్చెను.

భిండివాలము లన్నిటీ
దండిగ పట్టుట నేర్చిందా?

భళా భళానోయి తమ్ముడా భాయి భళానోయి దాదానా?

అలాగే మరో రగడ

రహస్య తంత్రములెన్నోనేర్చిందీ, ॥తంధానో॥
మల్లయుద్ధమున మగవారిని మెంచే ॥తం॥

అలాగే నాగమ్మ బ్రహ్మనాయుడు కోడిపందాల కోసం ఎలాంటి కోళ్ళను తెచ్చారు

డేగలు, నెమిళ్ళు, మైలా, కీతువ
కాకి కథేలా కోడి డేగలు
జంకిణి అసిలి, బంకిణి పుంజుల
తపినీ పుంజుల గాజుల కెత్తిరి
కోడేరు గుట్టల కేగారా, కత్తుల దస్తా తీశారా.
భళా భళానోయి తమ్ముడా,
భాయి భళానోయి దాదానా.

ఇలా పలనాటి యుద్ధం బుర్ర కథలో ఆయా ఘట్టాల ననుసరించి నవ రసాలనూ ప్రతిబింబిస్తూ రసవత్తరంగా ప్రదర్శిస్తారు.