Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/గమ్మత్తుల గారడీ విద్యలు

వికీసోర్స్ నుండి

గమ్మత్తుల గారడీ విద్యలు


ఈనాటికీ ఆంధ్రదేశంలో గారడీ వేషాలను, కత్తుల గారడీలనూ చూస్తూనె వున్నాం. గారడి విద్యను సంస్కృతంలో ఇంద్రజాలమనీ, గారడీ వాళ్ళను ఇంద్ర జాలికులనీ వ్వవహరిస్తారు. ఈ గారడీ విద్య పూర్య కాలం నుండీ నేటివరకూ ప్రచారంలో వుంది. పూర్వం రాజాస్థానాలలో విరివిగా ఈ విద్యను ప్రదర్శించి అఖండమైన సన్మానాలను పొందే వారు. ఈ నాటికీ గ్రామాలలో ఈ విద్యను ప్రదర్శిస్తున్నారు.

మాయదారి విద్యలు:

వేపాకులు దూసి తేళ్ళను తెప్పించటం, అరచేతిలో రూపాయలు సృష్టించడము, అప్పటి కప్పుడు మామిడి టెంకను పాతి మొక్కను మొలిపించటం, మనిషిని బుట్టలో పెట్టి మాయం చేయటం ... గొంతును కోసి రక్తం చూపించటం,మనవద్ద నున్న వస్తువును మాయం చేసి మరొకరి జేబులో నుండి తెప్పించటం మొదలైన అనేక విచిత్రాలను చూస్తూనే వున్నాం. ఈ గారడీ విద్య పూర్వం నుంచీ ప్రచారంలో వుందనటానికి మన ప్రాచీన గ్రంథాల నుండి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. గారడీ విద్యల్ని గూర్చి పండితారాధ్య చరిత్రలో__

నావి యద్గతి బశులాడెడు నట్టి
భావన మ్రోకులపై నాడెడు వారు.

అని వుంది దొమ్మరసానులు గడలపై ఆడినట్లే గారడీ వారు మ్రోకులపై ఆడినట్లు పై రెండు పదాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

అంతరిక్షంలో వింత విద్యలు

పొడవైన మ్రోకును ఆకాశంలోకి విసరగానే అది వెదురు గడలా నిలుస్తుందా తరువాత గారడీ వాడు త్రాడు మీద నిచ్చెన ఎక్కినట్లు జర జరా ఆకాశంలోకి పోయినట్లు పోయి మాయమై తిరిగి కనిపించి అక్కడ చిత్ర విచిత్ర మైన విద్యల్ని ప్రదర్శించే వాడట.

ఈ విద్యను ఇంగ్లీషు వారు రోప్ ట్రిక్ అనేవారట. ఈ విద్యను గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.

కొరవి గోపరాజు:

ఒక ఇంద్రజాలికుడు తన భార్యను వెంట బెట్టుకుని రాజ సన్నిధిలో ఆమెను రక్షణార్థం విడిచి తాను దేవ సహాయార్థమై యుద్ధం చేయడానికి వేళుతున్నానని చెప్పి ఒక త్రాటిని పైకి నిలువుగా దానిని నిలబెట్టి, దానిపైకి ఎగబ్రాకి మాయ మయ్యాడట. తరువాత కొంత సేపటికి వాని కాళ్ళూ, చేతులూ, తల,మొండెం తుంపులై క్రిందబడ్డాయట. రాజు వద్ద రక్షణగా వుంచిన అతని భార్య రాజును వేడుకుని సెలవుపొంది, భర్తతో సహగమనం చేసిందట. వెంటనే త్రాడు పైకి పోయిన ఇంద్ర జాలికుడు పైనుండి దిగి వచ్చి తన భార్యను పంప మన్నాడట. అంతట రాజు విచార గ్రస్తుడై ఆమె సహగమనం చేసిందని చెప్పాడట. అంతట అతను__

ఇంద్ర జాల విద్యలు:

ఆ వీరుడప్పుడె నిజ
భావము ప్రకటముగ
నాత్మభామిని తోడన్
దావైతాళికు డగుచున్
గైవారము చేసె జనులు కడువెరగందన్
నరనాథ, నిన్ను నపుడవ
వరమడిగినాట నైంద్రజాలికు రీతిన్

నరుల వణికించి నీచే
సిరి వొందంజోద్యమిట్లు చేసితి వనియెన్.

ఇది ఆనాటి ఇంద్ర జాల విద్య అని, అదే సందర్భంలో చతుష్టష్టి, కళలైన ఈ క్రింది వాటిని కూడా వివరించాడు. అవే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, వాస్తు ఆయుర్వేదం, ధనుర్వేదం, మాంత్రికత్వం, సంగీతం, జలస్తంభన, మహేంద్ర జాలం, జూదం, అష్టావధానం, వాద్య నృత్య కౌశలం, బహురూప పటుత్వం అనగా పగటి వేషాలు, పరిహాసం మొదలైనవి. "సింహాసన ద్వాత్రింశిక" 111- 112 పేజీలలో ఉదహరింప బడిందని సురవరం వారు సాంఘీక చరిత్ర 185 వ పుటలో ఉదాహరించారు.

ఈ ఇంద్ర జాల విద్యల్లో జైనులు ప్రసిద్ధులని పైన ఉదాహరించిన ఇంద్రజాలికుని కథ జైనుల త్రిషష్టికా పురుష చరిత్రలో వుదహరింపబడింది.

ఈ క్రింది జాల విద్యను గురించి యథా వాక్కుల అన్నమయ్య సర్వేర శతకం 12 వ పద్యంలో వివరించాడు.

ఇదే ఇంద్ర జాలానికి సంబంధించిన మరియొక కళారూపం కూడా ప్రాచీన కాలం నుంచీ ప్రచారంలో వుంది. అదే విప్రవినోదం.

గారడీ వాళ్ళూ

రత్నావళి నాటకంలో గారడీ వాడు:

శ్రీ హర్షుని రత్నావళి నాటకం నాలుగవ అంశంలో ఇంద్రజాలికుని ప్రస్తావన వుంది. సాగరిక మీద విరహంతో వున్న...ఉదయనవత్స రాజుకు ప్రథమంలో వినోదం కల్పించటానికి, తరువాత సాగరికతో సంబంధాన్ని చేకూర్చి పెట్టటానికి ... యౌగంధరాయుణుడు వేసిన ఎత్తు సాగరికయే రత్నావళి. అదే ఈ ఇంద్రజాలికుడైన గారడీ వాని ప్రవేశం. ఈతని పేరు సంవరణసిద్ధి. ఉజ్జయినీ వాడు. వాసవిదత్తది కూడా ఉజ్జయినే, తన వూరి వాడు కావటం వల్ల వీడి గారడీ చూడటానికి ఆమెకు ఆసక్తి . ఆ పేరుమీద రాజుగారి దర్శనం వీడికి తేలికగా దొరుకుతుంది. కుతూహలంతో వున్న రాజుగారు గారడీ వాణ్ణి వెంటనే ప్రవేశపెట్టమంటాడు.

ఇంద్రజాలికుడు ప్రవేశించి నా పేరులో ఏ ఇంద్రుని పేరు ఇమిడి వుందో ఆ యింద్రునికి నమస్కరించ మంటాడు. ఆ తరువాత మహారాజా భూమి పైన చంద్రుడు, ఆకాశలో పర్వతం, మధ్యాహ్నంలో సాయత్రం వీటిలో ఏది కావాలి!

అడగండి అంటాడు. అలా వాడి కోతలను విన్న, విదూషకుడు మిత్రమా శ్రద్ధగా వును. వీడు అలా చేసేటట్లే వున్నాడు... అని తాను ఉబలాట పడతాడు.

ఈ వుబలాటాన్ని చూసిన గారడీ వాడు అంటాడు. వూరికే నేను నీకు మాటలు చెప్పటం దేనికి, మీరు ఏది చూపించమంటే అదే చూపిస్తానంటాడు.

వాడి మాటలు విన్న రాజు వాసవదత్తను కూడా రమ్మంటాడు. చూడటానికి సరే అందరూ గారడీ చూడటానికి ఆసక్తితో వుంటారు. ఇంద్రజాలాన్ని చూపించమంటారు.

మళ్ళీ వాడు పించికను అటూ ఇటు త్రిప్పి ఇదుగో చూడండి నృత్యంతో కూడిన దేవేంద్రుని దర్బారును చూడండి అంటూ చుట్టూ మూగిన జనాన్ని చూపిస్తాడు. రాజు ఆశ్చర్య పోతాడు.

ఒరే సన్యాసీ, వీళ్ళందరు ఎందుకోయి. సాగరికను జూపమంటాడు. అప్పుడు గానీ రాజుగారు తృప్తి పడరని విదూషకుడు చెపుతాడు.

ఇంతలో యౌగంధరాయణుడు పంపిన ఒక వార్త కారణంగా గారడీకి ఆటంకం వస్తుంది. రాజు గారడీ వానిని ఇక ఆపు అంటాడు. సరే వాడు ఆపేసి, మీరు నాది మరో ఆట చూడాలంటాడు. సరే నంటాడు రాజు. తరువాత వెంటనే అంతః

పురంలో మంటలు లేస్తాయి. అందులో చిక్కిం దనుకున్న సాగరికను రాజు మంటల్లోకి దూకి వెలికి తీస్తాడు. రాజుకూ సాగరికకూ సమాగమం జరుగుతుంది.

చివరికి రాజు విదూషకునితో అంటాడు ఇది స్వప్నమా? ఇంద్రజాలమా అని, అప్పుడు విదూషకుడు ఇలా అంటాడు. గారడీ వాడు పోతూ పోతూ అన్న మాటలను జ్ఞాపకం చేసి ఇది వాడి పనే అంటాడు.

ఇలా గారడీ వాళ్ళు వీథుల్లో ఎవేవో చెప్పి, వివిధ ప్రక్రియల్ని చూపించటం మనం మనం చూస్తూనే వున్నాం. వినోదిస్తున్నాం., అయితే కొన్ని శతాబ్దాల క్రిందే, శ్రీ హర్షుడు ఇంద్రజాలాన్ని తన నాటకంలో ప్రవేశపెట్టాడు.

దీనిని బట్టి నేటి మన జానపద కళారూపాలకు ఎంతటి ప్రాచీన చరిత్ర వుందో, ఆనాటి ప్రజలు వాటిని ఎలా ఆదరించారో పై వుదాహరణలే తార్కాణం.