Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/ప్రసిద్ధులైన పగటి వేషధారులు

వికీసోర్స్ నుండి

ప్రసిద్ధులైన పగటి వేషధారులు


పసుమర్తి శేషయ్య:

పసుమర్తి శేషయ్యగారు భట్రాజు వేషం వేసి, నానార్థ రూపాలలో పద్యాలను చదివేవారు. ప్రేక్షకులు సూచించిన ప్రతి అక్షరానికీ పద్యం చెప్పేవారు. జక్కుల పురంద్రీ వేషం వేసి, బొబ్బిలి, మరాఠీ మొదలైన కథలను నేర్పుగా ప్రదర్శించేవారు. ఉపమానం లేకుండా ఏ విషయమూ చెప్పేవారు కాదు. ఇంకా బైరాగి వేషం __సోమయాజులు __సోమి దేవమ్మ వేషాలను రమ్యంగా ప్రదర్శిచేవారు. వీరిని శిరోమణి గారూ అని పిలుస్తూ వుండేవారు.

భాగవతుల కుమారస్వామి:

కుమారస్వామి గారు పఠానీ, సోమయాజులు, సోమిదేవమ్మ, కోమటి, అర్థనారీశ్వర మొదలైన ముప్పై రెండు వేషాలను సమర్థవంతంగా పోషించేవారు. వీరు మద్దెల వాయిద్యంలో ప్రసిద్దులు. నోటితోనె అద్భుతంగా మద్దెల వాయించే వారు. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు కొన్ని ప్రదర్శించేవారు. కళాతపశ్వి యైన కుమారస్వామి గారు ఆజానుబాహుడు.

దర్బా శ్రీనివాసులు:

శ్రీనివాసులు గారు __ దాష్టీక పంతులు __ మందుల వేషం, ఎరుకల వేషం, పాముల వాడి వేష ధారణలో ప్రఖ్యాతి నార్జించిన వారు. వీరి తమ్ముడు దుర్గయ్య గారు వివిధ రకాలైన కూతలు కూయడంలో దిట్ట. కంఠస్వర మార్పుతో ప్రేక్షకులను దిగ్భ్రాంతులను చేసేవారు__ ఈయన బలే చమత్కారి.

చింతా ప్రకాశసర్మ - చింతా బాలకృష్ణ గార్లు వైష్ణవ, సాతానులు, చెంచు వేషాలను ప్రతిభావంతంగా పోషించేవారు.

మహంకాళి సత్యనారాయణగారు, జంగం దేవర వేషంలో సమర్థులు, వేదాంగం మల్లిఖార్జున శర్మ శారద, అర్థనారీశ్వరుడి వేషంలో ప్రసిద్ధులు.

పిల్లల మఱ్ఱి కామయ్య గారు, బైరాగి వేషం వేసి భగవద్గీత చమత్కారంగా వ్వాఖ్యానం చేసి ప్రేక్షకులను రంజింప జేసిన కళాకారుడు. ఈయన హస్త లాఘవాన్నీ, జల స్థంభననూ చేసేవారు.

పసుమర్తి చలపతి గారు, ఏలేశ్వరపు వెంకట నారాయణ గారు కాశీ కావడి వేషం వేసి యమపురిని వర్ణిస్తూ _ కాలకింకరులు పెట్టే యమయాతనల్నీ పటంలో చూపిస్తూ ప్రేక్షకులకు జ్ఞానోదయాన్ని కలిగించే వారు. బజారులో కాశీ కావడితో పోతూవుంటే జనం తండోపతండములుగా మూగేవారు. పెద్దిభొట్ల దశరథ రామయ్య గారు పఠానీ వేషం వేసి కృష్ణజిల్లా కలెక్టరు గారిని దిగ్భ్రాంతుల్ని చేశారట.