తెలుగువారి జానపద కళారూపాలు/ప్రజలకు నచ్చిన పగటి వేషాలు

వికీసోర్స్ నుండి

ప్రజలకు నచ్చిన పగటి వేషాలు

జానపద కళల్లో మరో జాతీయ కళ:

నాటకం, సినిమా, రేడియో, టీవీలు, అభివృద్ధి పొందిన ఈ నాటి దశనుంచి, కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచిస్తే మనకు జానపద కళారూపాలలో విరివిగా కనిపించేవి పగటి వేషాలు.

పట్టపగలు వేషాలు వేసుకుని, హావభావాలను బలికిస్తూ, రాగ మేళ తాళాలతో, పండిత పామరులను మెప్పించి, మురిపింప జేయటం పగటి వేషధారులకు వెన్నతో పెట్టిన విద్య.

అభినయంలో, వాక్చాతుర్యంలో కొందరిని అనుకరించడం అది కూడా గుర్తు పట్ట లేనంతగా ఆయా పాత్రల్లో లీనం కావడం వారి ప్రత్యేకత. ఆయా వేషాల ద్వారా, సంఘంలోని దురాచారాల్నీ, బలహీనతల్నీ వ్వంగ్యంగా ఎత్తి చూపటం వీరి వృత్తి లోని మూల సూత్రం.

పురాణకాలం నుంచీ:

పురాణకాలంనుంచీ ఈ పగటి వేషాలు వేయటం ఆనవాయితీగా వస్తోందని పెద్దల అభిప్రాయం. దశరథుడు సంతానం కోసం పరితపిస్తున్నప్పుడు బుడబుక్కల వేషంలో వచ్చి, యాగ రహస్యం చెప్పాడనీ, ఈ వేషధారణ కోసం డుంబకాసురుడు అనే రాక్షసుని చంపి, ఆతని దేహాన్ని బుడబుక్కగాను, నరాలు రాళ్ళుగాను, మెడను మైనంగానూ విష్ణువు ఉపయోగించాడని చెపుతూ వుంటారు.

ఒకనాడు భారత దేశంలో స్వతంత్ర సామంత రాజుల పరిపాలనలోనూ, చిత్ర విచిత్ర వేషాలు వ్వాప్తి లోకి వచ్చాయని ప్రతీతి. గూఢచారులుగా మారు వేషాలు ధరించి, వర్తమానాలు చేరవేసే బారులుగానూ, రత్నాలు పచ్చలు కెంపులు అమ్మే వ్వాపారులు గాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులుగానూ చిత్ర విచిత్రమైన మారువేషాలతో కోటల్లో జొరబడి, ఒక రాజు మరొక రాజును వంచించడం కోట లోని గుట్టుమట్టులూ, బలహీనతలూ తెలుసుకుని యుద్ధం ప్రకటించడం జరుగుతూ వుండేది. ఈ విధంగా బయలు దేరినవే పగటి వేషాలు;

పేరువచ్చిన కారణమూ, తీరూ.

ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు బహుళంగా రాత్రివేళలయందే ప్రయోగిస్తూ వుండేవారు. అలాకాక పగటి పూట ప్రదర్శించే ప్రదర్శనం అవడం వల్ల ఈ ప్రదర్శనకు పగటి వేష ప్రదర్శనమని పేరు వచ్చింది.

పగటి వేషాల్లో ముఖ్యంగా గమనించాల్చిన విషయ మేమిటంటే వారు కేవలం తమ వేష ధారణతోనే కాక వారి పాత్రలద్వార సంఘంలో వుండే మూఢనమ్మకాలనూ, మతాచారాలనూ, ప్రజాపీడననూ, హాస్య ధోరణిలో పెట్టి ప్రజలకు వినోదం ద్వారా విజ్ఞానపరుస్తూ వుండేవారు. ఈ నాటి కంటే ఆ నాడు ముఖ్యంగా గ్రామాల్లో పెత్తందారులు, కరణాలూ, మునసబులూ, వర్తకులూ లంచగొండి ఉద్యోగులూ మొదలైన వారంతా ఎలా మోసం చేస్తూ వుండేవారో వీరు వేషణ ద్వారా తగిన సాహిత్యంతో ఎవ్వరికీ నొప్పి తగల కుండా హాస్య ధోరణిలో వ్యంగ్యంగా గుట్టును బట్టబయలు చేసే వారు.

ప్రాచీనం నుండీ, ప్రచారంలో వున్నవే:

ఎన్నో సంవత్సరాల నుండీ జానపద కళారూపాలు ఎలా ప్రచారంలో వున్నాయో అలాగే ఈ పగటి వేషాలు కూడా ప్రచారంలో వున్నాయి.

ఈ నాటి పగటి వేషాలను పూర్వం, బహురూపాలని పిలిచేవారు. బహురూపాల గూర్చి భరత కోశంలో ఈ ద్రింది విధంగా ఉదహరించబడి వుంది.

దేశి నృత్య నానావేష ధరం.

యత్తత్ బహురూప మితీరితమ్ (భరత కోశం పుట 418 క్రీస్తు శకం 12342 వ సంవత్సరంలో యథావాక్కుల అన్నమయ్య తనచే రచింపబడిన సర్వేశ్వర శతకంలో నాటక ప్రదర్శనాలను గురించి వ్రాసూ ఈ క్రింది పద్యం ద్వారా నాటకాలు బహురూపాలని వివరించాడు.

పద్యం

అమరంగ స్ఫుట భక్తి నాటకము భాషాంగ క్రియాంగాభి, ర
మ్యముగా జూపిన మెచ్చి మీరలుపురేయన్నంతకున్‌యో నిగే
హములన్ రూపులు పన్నుకొంచును నటుండై వచ్చి సంసార రం
గములోనన్ బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా.

(సర్వేశ్వర శతం. 20 వ పేజి)

నాటకాలు బహురూపాలని పాల్కురుకి సోమనాథుడు కూడా (బసవ పురాణంలో) వివరించాడు.

అటుగాక సాంగభాషాంగ క్రియాంగ
పటునాటకంబుల నటియించువారు.

బహురూపాలంటే ఒకే వ్వక్తి వివిధ పాత్రల్ని ధరించటం. అవి పగటి వేషాలు కావచ్చు. పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో సోమనాథుడు.

ప్రమథ పురాతనవటు చరిత్రములు - గ్రమమొంద బహునాటకము లాడువారు
లలితాంగరస కళాలంకార రేఖ - లలవడ బహురూప మాడేడి వారు.

శ్రీశైలంలో శివరాత్రి పుత్సవాలలో ఈ నాటకాలను ప్రదర్శించే వారు, ఆనాడు ఈ రూపకాలకు ఎక్కువ ప్రచార మున్నట్లు సోమనాథుని పండితారాధ్య చరిత్ర వల్ల తెలుస్తూ వుంది.

జానపద గాధలతో రాజకీయాలను సాధించిన జాణ:

శివాజీకి సింహగడ విజయాన్ని చేకూర్చిన వాడు 'తానాజీ మాల్ సురే '. తానాజీ, మరి కొందరు మరాఠీ సైనికులూ పవాదాగాయకుల వేషాలతో కోటలో ప్రవేశించి దానిని జయించారు. జానపథ గాథల పద్దతిని రాజకీయాలకు ఉపయోగించిన వారిలో ప్రథముడు తానాజీ. అంతేగాక కళింగ గంగరాజు పగటి వేషాలవారి సహాయంతో శత్రువుల్ని జయించాడనే కథ కూడ వుంది.

కాకతీయ యుగంలో యుగంధర మహామంత్రి పిచ్చి యుగంధరుడుగా నటించి 'ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్' అంటూ ఢిల్లీ సుల్తానులను జయించింది పగటి వేషంతోనే.

పల్లావజ్ఝుల వారి ప్రతిభ:

ఇలా ఎన్ని వుదాహరణలనైనా మన చరిత్రల నుంచి తీసి చూడవచ్చు. కాని పగటివేషాల చరిత్ర మాత్రం మనకు సరిగా లభించడం లేదు. కాని రెండు మూడు వందల సంవత్సరాల క్రితం మైసూరు ప్రాంతం నుంచి పల్లావఝుల వెంకటరామయ్య అనే ఆయన వచ్చి రేపల్లెలో వుండిపోయి కొంత మందికి పగటి వేషాలు నేర్పి, ప్రదర్శించి, ఆంధ్ర ప్రజల మన్నన పొందారట. క్రమాను గతంగా ఆ పగటి వేషధారులకు, తరువాత, గడ్డి పాడు నివాసస్థానమైందని శ్రీనివాస చక్రవర్తి గారు తమ నాట్యకళ గ్రంథంలో వివరించారు.

గడ్డిపాడు పగటి వేషధారులు:

వీథి భాగవాలకు కూచిపూడి ఎలా కేంద్ర మైందో అలాగే పగటి వేషధారులకు గట్టిపాడు కేంద్రమైంది. కృష్ణా జిల్లాలో వీరంకి లాకుకు మైలు దూరంలో వున్న గడ్డిపాడు (హనుమంత రాయపురాగ్రహారం) ఈ భాగవతులకు కేంద్రం. గడ్డిపాడు భాగవతులుగా ప్రసిద్ధి నందినవారు పల్లావఝుల వారు__శ్రీకారం వారూ__ చూచివారు__కనువూరి వారు, బెల్లంకొండవారూ__బాపట్ల వారు__కవులవారు మొదలైన వారందరూ గడ్డిపాడు భావతులే. వీర్ఫందరికీ గురువు మైసూరు తెలుగు బ్రాహ్మణుడు. పల్లావఝుల వెంకటరామయ్య. వీరి ప్రతిభ ననుసరించి చూస్తే తెలుగు దేశంలో కంటే మైసూరులో(పగటి వేషాలు ఎక్కువగా వ్యాప్తిలో వున్నట్లు తెలుస్తూ వుందని శ్రీనివాస చక్రవర్తి గారు తమ నాట్యకళ గ్రంథంలో వివరించారు. రెండు శతాబ్దాలకు పూర్వం వచ్చిన పల్లావఝల వెంకట రామయ్యగారు ఆంధ్ర దేశంలో పగటి వేషాలతో సంచారం చేసి చివరకు రేపల్లెలో స్థిరపడి కృష్ణాజిల్లా గడ్డిపాటి వారికి ఈ విద్యను నేర్పి ఆర్యులైనారు. ఆంధ్రదేశంలో పగటి వేషాలకు భిక్ష పెట్టినవారు గడ్డిపాడు పగటి వేషధారులే. ఆ గ్రామంలో అందరూ పగటి వేషాలు వేయగల సమర్థులుగా వుండేవారు. వారు దాదాపు అరవై రకాల చిత్ర విచిత్ర మైన పగటి వేషాలను ధరించే వారు. ఆ పగటి వేషాలతో నిత్య జీవితానికి సంబందించినవి కొన్ని, హాస్య రసంతో కూడుకొన్నది కొన్ని మరికొన్ని పౌరాణిక వేషాలు, కల్పనా వేషాలూ, కొన్ని కేవలం హాస్య రసంతో కూడుకున్నవి. మొత్తంమీద సంఘంలో వుండే అన్ని జాతీయ పాత్రలూ వీరి వేషాల్లో మూర్తీభవించి వుండేది.

వేషగాండ్ల ప్రతిభ:

వేషం ఊరికే ధరించడం కాక తద్రూపంగానే నమ్మించేవారు. గొఱ్ఱెలు కాచే గొల్లల పాత్రలు ధరించి, సుద్దులు చెపితే అక్షరాలా గొఱ్ఱెల కాపరులను గుర్తుకు తెచ్చేవారు. వేషం వెయ్య వచ్చును కాని దానిని నమ్మించడం ఎలా? అదే గడ్డిపాడు పగటి వేషధారుల్లో వున్న ప్రత్యేకత. తెలుగు దేశంలో వర్గాలూ, కులాలూ, జాతులు వున్నాయో ఆయా జాతులకు సంబంధించిన అన్ని భాషలనూ ఆకళింపు చేసుకుని వారు ధరించే ప్రతి పాత్రకూ సాహిత్యాన్ని కల్పించి స్వతంత్రం చేసుకునే వారు. అన్ని మనస్తత్వాలనూ, ఆటనూ, పాటనూ, మాటనూ, వుచ్చారణనూ, వేషధారణనూ, ఒంపులూ వయ్యారాలనూ విధిగా ఒక విద్యగా అభ్యసించేవారు. అందు వల్లనే వారు పగటి వేషాల్లో ప్రఖ్యాతి వహించారు. పగటి వేషధారులు అంటే గడ్డిపాటి వారే ననీ, ఆ ప్రతిభకు వారే అర్హులనీ తేలి పోతుంది.

కృత్రిమ అలంకారాలు లేని సహజ కళ:

ప్రయోగాత్మకమైన కళారూపాలలో నాటకం వుత్తమమైంది. అలాగే జానపద కళారూపాలలో పగటి వేషధారణ కూడ వుత్తమమైంది. ఈ పగటి వేష ప్రయోగంలో చతుర్విధ అభినయాలూ ప్రాముఖ్యం వహిస్తున్నాయి. రంగస్థల పరికరాలూ, రంగ ప్రదీపనం మొదలైన కృత్రిమ అలంకారా లేవీ లేకుండా ప్రజలను రంజింప చేసే పగటి కళారూప మిది.

పగటి వేషధారులు ఆంధ్ర దేశం నాలుగు చరగులా పర్యటించి ఆయా ప్రాంతాలలో వున్న మాండలిక వ్వవ హరిక యాసలనూ, మాండలిక పదాలను గట్టిగా వంట బట్టించుకున్నారు. ఆ వేషధారులు ఆంధ్రదేశంలో అన్ని ప్రాత్రల మాండలిక వ్వవహారిక యాసలనూ ఆశువుగా బట్టీపట్టి నట్లు బయట పెట్ట గలరు.

కూచిపూడి పగటి వేషాలు:

కూచిపూడి కళాకారులు వీథి భాగవతాలలో ఎంతటి ప్రసిద్ధులో పగటి వేషాలలో కూడ అంతటి ప్రసిద్ధులే. ఈ పగటి వేషాలను కూచిపూడివారు ప్రారంభం నుండే వీటిని ధరించ లేదు. వారి వీధి భాగవతాలకూ యక్షగానాలకూ కొంత ప్రచారం తగ్గిపోయిన తరువాత భాగవతులలో చీలిక వచ్చి ఎవరికి వారై ఏదో రకంగా ఉదర పోషణార్థం ఈ పగటి వేషాలను ప్రారంభించారు.

ఆనాడు కొన్ని యక్షగాన ప్రదర్శనాల్లోనూ, వీథి భాగవత ప్రదర్శనాల లోనూ మధ్య మధ్య వచ్చే కొద్ది కొద్ది విరామ సమయాలలో ప్రేక్షకుల వినోదం కొరకు పంతుల వేషం, పఠాను వేషం, రెడ్డి వేషం, త్రాగు బోతు వేషం మొదలైన వాటిని ప్రదర్శించేవారు. పగటిపూట అంటే తెల్లవార్లూ ప్రదర్శనం ముగిసిన తరువాత ఆట ముగించి, అదే వేషాలతో ఇంటింటికి యాచనకు బయలు దేరేవారు. వెంటనే బయలు దేరడానికి కూడ కారణం లేక పోలేదు. తెల్లవార్లూ ప్రదర్శనం చూచిన ప్రేక్షకులు ముగ్ధులై ఇంకా ఆనందంలో వారుండగానే వారి నుంచి ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టేవారు. అలా ప్రారంభించబడిన పగటి వేషాలే అలా అలా అల్లుకు పోయి కళాఖండాలుగా ప్రచారం పొందాయి.

సహజ పాత్రలూ, సజీవ భాషా:

వీరు కూడ అనేక వేషాలు ధరించేవారు. కోమటిసెట్టి పాత్ర ధరిస్తే వైశ్యుల భాష, యాస, మాట తీరు, బొంగురు గొంతు, యుక్తి మాటలు, సునిశిత హాస్యం, వ్వాపార చమత్కారం, ఇతరులకు నొప్పిగలుగని అతిలౌకికమైన నటనా అచ్చు గుద్దినట్లు ఒప్పించేవారు.

గారకీ వేషంలో ఇంద్రజాల మహేంద్ర జాలాన్ని అద్భుతంగా ప్రదర్శించే వారు. బట్టల నేత, బట్టల అమ్మకం, కోడి పోరులో పందెం గాళ్ళ జోరు, వారి వికటాట్టహాసాలు, బైరాగి వేషాలతో ప్రజలను మోసపుచ్చే దొంగ సన్యాసుల వైఖరులు, చమత్కార సంభాషణలూ, అచ్చం అలాగే తెలుపుతారు. సోమివేదమ్మ పాత్రలో వైదిక సంఘంలో వుండే మంచి చెడులనూ లోపాలనూ వెల్లడిస్తారు. తర్క శాస్త్రాన్నీ, వ్యాకరణ శాస్త్రాన్ని, వేద స్వరూపాన్నీ హాస్య పూరితులైన సంస్కృత శ్లోకాలను కలిపి కట్టుదిట్టంగా చర్చించేవారు.

చిట్టిపంతులు వేషంలో, చిట్టిపంతులు వేశ్యాలోలుడై వ్యాపారులనూ, రైతులనూ బాధించి ఏ విధంగా ధనమార్జిస్తారో ఆర్జించిన ధనమంతా వేశ్యలకెలా ధార పోస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.

యాచనలో ప్రతి వారినీ పొగడుతూ భట్రాజులు ప్రజలను ఎలా పీడిస్తారో చూపించేవారు.

ఖురాన్ చదువుతూ, పాడిపంటల్ సల్ల గుండాలి అల్లాకెనాం, అంటూ ఫకీర్ల వేషంలోనూ, అంబ పల్కు జగదాంబ పల్కు, మాయమ్మా పల్కు, కంచి కామాక్షి పల్కు, అంటూ బుడ బుక్కల వేషంలోనూ, ఆ యా పాత్రలకూ, ఆయా వేషాలకూ కా వలసిన అన్ని రకాల సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని, ఆయా వేషాలను సజీవంగా ప్రదర్శించేవారు.

సున్నపు వీరయ్య పగటి వేషాలు

పగటి వేషధారుల్లో బహుముఖ ప్రజ్ఞావంతుడు క్రీ॥శే॥ సున్నపు వీరయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరుకు దగ్గరగా నున్న అప్పారావు పాలెం, తరువాత ఏలూరు స్తిర నివాసంగా చేసుకుని రాష్ట్ర వ్వాపితంగా పగటి వేషాలను ప్రదర్శించి బహురూప చక్రవర్తిగా ప్రశంస లందుకున్నారు.

ఇంటిపేరు సున్నంవారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు. ఆజాను బాహుడు, నిండైన విగహం, స్థూలకాయుడు, పెద్ద జరీ అంచు తెల్లని తలపాగా ధరించేవారు. బొద్దు మీసం నల్లని లాంకోటు, తెల్లని పంచకట్టు, చేతికి సువర్ణ కంకణాలు, కాలికి పెద్ద అందె ధరించి కిఱ్ఱు చెప్పులతో బయలు దేరితే చూచే వారికి అమిత గంభీరంగా కనిపించేవారు. అలాంటి నిండైన విగ్రహం, ఆంధ్రదేశంలో పగటి వేషధారుల్లో మరెవరికీ లేదనడం అతిశయోక్తి కాదు. వీరయ్యగారు పగటి వేషాలు ధరించి, ఆంధ్రదేశ మంతా పర్యటించారు. నాలుగు మూలలా ప్రదర్శనాల నిచ్చి, ఎంతో మంది జమీందార్లనూ, శ్రీ మంతులనూ వారి పగటి వేషాల ద్వారా మెప్పించి అనేక ఘన బహుమతుల్ని అందుకున్నారు.

బహురూప చక్రవర్తి సున్నపు వీరయ్య


వారి బృందం పగటి వేషాలంటే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చేవారు. కూచి పూడి పగటి వేష ధారులు సాత్విక ప్రధానమైన వేషాలు ధరిస్తే వీరయ్య గారు సత్వగుణ ప్రధానమైనవి, తామస గుణ ప్రధాన మైనవీ రెంటినీ ప్రదర్శించే వారు. తామస గుణానికీ చెందినవే వారి శక్తి వేషమూ, బేతాళుని వేషమూ.

సున్నపు వారి శక్తి వేషం:

వీరయ్యగారు ప్రదర్శించే ఇతర వేషాలన్నిటికీ ప్రేక్షకులు మూగే వారు. కానీ, ఈ శక్తివేష ప్రదర్శనం నాడు గ్రామంలో వున్న అనేక మంది పొలాలకు వెళ్ళి పోయేవారు. ఇక గ్రామంలో కొద్ది మంది తలుపులు బిగించుకుని ఇళ్ళలో వుండేవారు. వీరయ్యగారి శక్తి వేషం సరిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మండుటెండలో తప్పెట్ల వాయిద్యంతో బయలుదేరేది. వేషధారణ అతి భయంకరంగా వుండేది. కన్నులకు కోడి గ్రుడ్లు, ముఖానికి నల్ల రంగు, పెద్ద పెద్ద కోరలు, నల్లని దుస్తులు విరబోసిన జుట్టు, చేతిలో శూలం, నోటినుండి కారే రక్తంతో మహా బీభత్సంగా వుండేది ఆయన శక్తి వేషం.

అట్టహాసంగా అద్భుత ప్రదర్శన:

ఆయనను బండిమీద ఎక్కించేవారు. తప్పెట్ల నృత్యంతో వూరేగింపు సాగేది. ఈ లోగా గ్రామాంలోని వీథులన్ని నిర్మానుష్యం. పిల్లల్నీ ఎవర్నీ ఈ దృశ్యం చూడనిచ్చేవారు కారు. పెద్దలు మాత్రం తలుపు కంతల్లోంచీ, దూరంగా వుండేవాళ్ళు. ఈ విధంగా అంతమయ్యేది ఆయన శక్తి వేష ప్రదర్శనం. ప్రదర్శనాలన్నీ వరుసగా ఒక నెల రోజులు రోజు కొక వేషం చొప్పున, ప్రదర్శించిన తరువాత వీరయ్యగారు ఈ శక్తి వేష ప్రదర్శనాన్ని, బేతాళుడి వేషాన్నీ దేవర పెట్టె వేషాన్నీ ధరించేవారు.

భీతావహమైన బేతాళుని పాత్ర:

వీరయ్యగారి బేతాళుని పాత్ర ధోరణిలో రెండు చేతులకూ రెండు బలమైన తాళ్ళు గట్టి వెనుక కొంత మంది లాగి పట్టుకునేవారు. వీరయ్యగారు బుగ్గకు కత్తి పొడుచు కునేవారు. నోటి నుండి రక్తం రొమ్ము మీదికి కారుతూ వుండేది. ఒక్క లంగోటి మినహా మరే దుస్తులు వుండేవి కావు. తప్పెట వాయిద్యాల గమకంతో ఒక వీరసింహలా వీథిలో నడిచేవారు.

దేవర పెట్టె మహిమలు:

దేవరపెట్టె అంటే తిరుపతమ్మ దేవర పెట్టె. ఈ ప్రదర్శనానికి ప్రేక్షకులు విపరీతంగా హాజరయ్యేవారు. ఈ ప్రదర్శనంలో మంత్ర తంత్రాలనూ, మ్యాజిక్ లనూ, మహా జోరుగా చేసేవారు.

సున్నపు వీరయ్య దేవర వేషం
పాట


అమ్మసత్తెం చూడండీ, మల్లేలా, మల్లేలా
దేవి సత్తెం చూడండీ
సందుగొందులు తిరిగే తల్లి
సన్నపు కోకలు కట్టిందోయ్
మాయమ్మ, మాయమ్మ
ఎన్నో మాయల గల తల్లోయ్
మల్లేలా, మల్లేలా.

అంటూ నెత్తిన వున్న దేవర పెట్టెను క్రిందికి దింపి కుడిచేతిలో వీర భద్ర తాడును పట్టి ఫళ ఫళా అంటు నాదంచేస్తూ చూడండి బాబయ్యా, మా అమ్మోరు సత్తెం, అమ్మోరును ఎక్కడ నుండీ తీసుకు వచ్చాననుకున్నారు.

సీమకొండ, బెల్లంకొండ, నాగరాజకొండ, గోల్కొండ, కోరుకొండ, తిరుపతి కొండ, తిరుచునాపల్లి కొండ, తిరువాళూరు కొండ, ఆకొండ, ఈ కొండ అనేక కొండలు తిరిగి తీసుకువచ్చిన తల్లి బాబయ్యా, అమ్మోరు నామకారణాలు అనేకం వున్నై బాబయ్యా. కంచి కామాక్షమ్మ, గంటాలమ్మ, పెద్దింటమ్మ పోలేరమ్మ, నలజారమ్మ, నాంచారమ్మ, కలకత్తా మహాకాళి తల్లండి. అమ్మోరు సత్తెం మీలో వుంటది నాలో వుంటది, చెట్లో వుంటది, పుట్లో వుంటది, చేమల్లో వుంటది, దోమల్లో వుంటది. ఆండ పిండ బ్రహ్యాండలో ఆవరించి వుంది బాబయ్యా.

గజకర్ణ, కోకర్ణ
టక్కు టమాయీలు
గల తల్లె దిగుమఖతల్లె దిగుమఖ తల్లె.

బాబయ్యా ఇదిగోండి ఇది కుంకవండి. ఈ కుంకాన్ని అమ్మోరు సత్తెం వల్ల ఎర్రగా చేత్తాను బాబయ్యా అంటూ కొండలు మొదలుకుని దేవతల పేర్లూ, చెట్లూ పుట్టల పేర్లూ అన్ని గుక్క తిరగకుండా వల్లించి ఆ చేతిలో వున్న కుంకాన్ని రెండు చేతులకు మర్దించి అమ్మోరు సత్తెం వల్ల రక్తం అయింది చూడండి బాబయ్యా.

ఇది అమ్మోరు సత్తె మండి
ఇది పసుపండీ

పసుపును పచ్చగ చేస్తాను బాబయ్యా
ఇది అమ్మోరు సత్తెమండి.

ఇది మజ్జిగండి. మజ్జిగను చల్లచేస్తది బాబయ్యా. ఇదిగోండి ఇది పిడక కచ్చికండి. ఈ కచ్చికను బూడిద చేస్తంది బాబయ్యా. అమ్మోరు సత్తెం చూడండి. మల్లేలా, మల్లేలా.

అంటూ వీరభద్ర కొరడాతో గిఱ్ఱున తిరుగుతూ, భీకరాకారంగా నృత్యం చేస్తూ పెళపెళా మని కొరడా నాదములు భయంకరంగా మ్రోగిస్తూ గిరు గిర్రున త్రిప్పి, మోదుకుంటూ పాత గాయాలను పగుల గొట్టి, రక్తాని చిందించే వారు. ఆ దృశ్యాన్ని చూచిన ప్రేక్షకులు భయపడి ఇది అచ్చం అమ్మవారి సత్య మనుకుని తోచిన ధర్మం చేసేవారు.

ఔరా అనిపించే మంత్ర తంత్రాలు;

ఇంకా వేపాకులు దూసి తేళ్ళనూ మండ్రకప్పలనూ ప్రవేశపెట్టేవారు. పొడి ఇసుకను నీళ్ళలో వేసి మరలా పొడి ఇసుకను తీసేవారు. తడి బట్టను ఆరబెట్టి అందులో జొన్న గింజలు జల్లితే పేలాల వలె వేగేవి. కొబ్బరి కాయను నేల మీద పెడితే కొంత దూరం దానంతటది నడిచి వెళ్ళేది. ఒక రూపాయను వంద రూపాయలుగా ప్రత్యక్షం చేసి చూపించేవారు.

ఈ విధంగా కనికట్టూ, హస్తలాఘవం ద్వారా ఆయన దేవర వేషం పూర్తి అయ్యేది. ఈ వేషం గ్రామంలో సంచారం చేసేది కాదు. గ్రామం మధ్యన పెద్ద బజారులో రచ్చ బండ వద్ద జరిగేది. ఈ విధంగా వీరయ్య గారి బృందం ప్రదర్శనాలు భారి యెత్తున జరిగేవి. వారి ప్రదర్శనాల్లో ఇంగా చెప్పుకో తగింది భోగం మేళం.

అర్థనారీశ్వరి:

అర్థ నారీశ్వరి పగటి వేషాన్ని ధరించటంలో కూచిపూడి వారు బహు ప్రసిద్ధులు. దశావతార చరిత్రలో స్త్రీలు ఆర్థ నారీశ్వరి వేషం ధరించి నట్లు, ఈ క్రింది పద్యం వర్ణను బట్టి తెలుసు కోవచ్చును.

ఇంరి యొక్కతె అర్థనారీశ వేష
మూని సాక్షాత్కరించిన మౌని జనులు
భ్రమసి సద్భక్తి జయ జయ పార్వతీశ
యనుచు మ్రొక్కిరి నృపులు నన్గొనుచుననగ
                      (దశావతార చరిత్ర)

అర్ధ నారీశ్వర వేషం

కూచి పూడి వారిలో పురుషులే ఈ అర్థ నారీశ్వరి పగటి వేషాన్ని ధరించే వారు. ఈ పగటి వేషం జానపదుల్ని ఎంతగానో ఆకర్షించి, ఆనందింప జేసింది. ఈ అర్థనారీశ్వరి పగటి వేషాన్ని కూచి పూడి వారు...శంభో శంకర సాంబ సదాశివ, అంచిత కేశ, దిగంబర రూపా అని పాడుతూ, భృంగి వేషంలో ఒకరు, ఆర్థనారీశ్వర వేషంలో ఒకరు, హార్మోనియం, మద్దెల వాయిస్తూ_మరిద్దరు భాగవతులు _ కనీసంగా వస్తారు. అర్థనారీశ్వర వేషానికి, కుడి చెంప శివుడుగానూ, ఎడమ చెంప పార్వతి గానూ ఒక మనిషి రెండు వేషాలు వేసి తల మధ్యనుండి ముక్కు మీద నుండి పాదం వరకూ క్రిందికి ఒక తెర కడతారు. శివుని వేషం వైపు పులి చర్మం, మెడలో పాము, భుజానికి చేతులకు రుద్రాక్ష మాలలు, ముఖాన విభూతి బొట్టు, కంఠానికి నలుపు మచ్చ, మూతిపై ఒకవైపు మీసం జటాజూటంపై గంగను ధరిస్తాడు. అప్పుడప్పుడు జటాజూటంలోని గంగను గొట్టంలో పైకి తన్ని ధారగా పడుతుంటే విచిత్రంగా వుంటుంది.

పార్వతి

పార్వతి వేషం వైపు ముక్కుకు ముక్కెర, ముఖాన కుంకుంబొట్టు, చీర కట్టు, రవిక, చేతికి గాజులు, భుజకీర్తులు, తలకి ఒక ప్రక్క స్త్రీ విగ్గు అలంకరిస్తారు. శివుని పాత్ర అభినయించే టప్పుడు మధ్య తెరతో పార్వతి వేషము మూసేస్తూ నాట్యంలో ఈ మార్పు కనురెప్ప పాటు కాలంలో చేస్తూ ప్రేక్షకుల నలరిస్తారు.

ఈ వేషంలో బహుభార్యాత్వం వల్ల చిక్కులు, గంగా గౌరి సంవాదం, సవతుల కయ్యం, త్రిపురాసుర సంహారం, దక్షయజ్ఞం, దేవాసుర, అమృత మథనం, పార్వతీ పరిణయం, మొదలైన శివ లీలలు, పద్యాల రూపంలోనూ, పాటల రూపం లోనూ, నాట్యాల రూపంలోనూ ప్రదార్శిస్తారు. పగటి వేషాల్లో ఆది నుంచీ ప్రత్యేకతగన్న వేషం ఇది. నవరసాలూ చోటు చేసుకున్న వేషం ఇది.

పిట్టలదొర:

అయ్యా మాకేం తక్కువయిందని మీ దగ్గిరికి వచ్చా మనుకుంటున్నారు. ఏడంతస్తుల మేడ, ఏడు దున్నల పాడి వీపుమీద ఇస్తరి, పిర్రల మీద పీట, బాగా

పిట్టల దొర

భోంఛేసేవాళమే. ఇంతెందుకు గుమ్మడి కాయంత బంగారం కుక్క మూచ్చూసిందని, దిబ్బలో వెయ్యడానికి, మైల బడతాయని ముగ్గురు కూలీలకి మూడు దమ్మిడీల కూలిచ్చి, వూరవతల కోనేట్లో పారేయించాం. ఈ సంగతి తెలిసి పక్కింటి పరమేశం భార్య దాన్ని తెచ్చుకుని, కాళ్ళ కడ్డదిడ్డాలు, నడుముకు నానా తిప్పలు, ముక్కుకు ముంగిర, చెంపకు చెంప సెరాలు. నెత్తికి మూకుడు చిప్ప చేయించు కున్నది. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంట్లో పంపు, వీధిలోపంపు, పొయ్యి గడ్డమీద పంపు, పొయ్యిలో పంపు, అన్నీ వున్న పొయ్యి మీదికి, పై వంట మీదికి రెండు మాత్రమె తక్కువై వచ్చాం.

ఔను మొన్న మా నాయనమ్మ పెండ్లికి విమాన బంపితే రాలేదేమండీ. వూళ్ళొ వుండే ముండ మోపులంతా వచ్చారే. పెళ్ళికి చాటెడు బియ్యం చెరువులో బోసి తూముకు మందు పెట్టి ఆ బియ్యం కళా పెళా వుడుకు తుంటే, చెలకపొరల తోడి తిరిగేయించాం, కూరలేమి చేయించామంటే విచిత్రం పచ్చి పులుసు, ఇటుకరాయి ఇగురు, పలుగురాయి పచ్చడి, లోయలో తోటాకు, వేపాకు కూర, ఈగల తాలింపు, నల్లుల తిరగమోత, వంకాయ వరుగేసి, గుమ్మడి కాయ గుడించి, ముగ్గురికి ఒక, మెతుకు, నలుగురికి ఒక బద్ద... వచ్చిన వాళ్ళకు వాత, రాని వాళ్ళకు గీత వడ్డించాం. అదీ చాలక పోతే., ఒకరి మూతి ఒకర్ని నాక్కోమన్నాం.

పెళ్ళికి వచ్చిన పేరంటాళ్ళు కాటుక లేదన్నారండీ ఆక్షేపణ పడలేక చాటెడు మిరపకాయలు, కళా పెళా వేయించి, ఇద్దరు కూలీలతో మెత్తగా పొడి గొట్టించి, రెప్ప తప్పించి గుడ్లకతికించాం. అంతె చిర్రున చీది, చర్రున గోడకతుక్కున్నారు. తమల పాకులు లేవండీ, అంటే వెంటనే మునిసిపాలిటీ వాళ్ళకు కబురు పెట్టి, దిబ్బమీది ఇస్తరాకులు తెప్పించాం. ఇలా ఏమీ ఇబ్బంది లేకుండా పెళ్ళి జరిపించాం. మీరు రాకపోవట మొక్కటే లోటు.

నేనూ మా అవిడ మొన్న జరిగిన కృష్ణా పుష్కరాలకు వెళ్ళామండీ. అవిడ స్నానం చెయ్య బోయి, నీళ్ళలో మునిగి పోతుంటే, కొప్పు అయితే చేతి కొచ్చింది కానీ ఆమె రాలేదు. ఆరోజు నుంచి, ఈ రోజు వరకు కుండెడు అన్నం ముందు బెట్టుకుంటే లోపలికి పొయ్యే ముద్దేగాని బయటికి వచ్చే మెతుకే లేదంటే నమ్మండీ.

కారువాసాని సోమయాజులు:

పగటి వేషాల్లో వినోద ప్రధాన మైనది కారువాసాని సోమయాజులు వేషం. కారువాసాని తురక వేశ్య. సోమయాజులు చాందస బ్రాహ్మణుడు ఆమె తురకంలో మాట్లాడే మాటల్ని సోమయాజులు, తెలుగు భాషలో సంభాషించే తీరు ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ఎలా?

ఆమె ముసల్మాన్ అంటే, ముసలమ్మావా? కోన్ హై? అంటే, మాది కోనసీమ కాదంటాడు. గాన సునే గాయా.... అంటే గానుగ సున్నం వద్దు అంటాడు.

ఇక శాస్త్ర ప్రకారం పాప పుణ్యాల విషయం చెపుతూ, అవును దానం చేస్తే పుణ్యం అంటాడు. దూడ తోనున్న ఆవును దానంచేస్తే మహాపుణ్యం అంటాడు. ఈ ప్రకారం చూస్తే కన్యాదానం పుణ్యం గనుక గర్భిణీ స్త్రీని దానం చెయ్యడం మరీ పుణ్యం అంటాడు. అంతే కాదు పిల్లల తల్లిని దానం చెయ్యడం మహా పుణ్యం అవు తుందని సిద్ధాంతీకరిస్తూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచేస్తాడంటారు, పడా రామ కృష్ణారెడ్డి గారు విశాలాంధ్ర వ్వాసంలో.

తనగురించి తాను ఈ విధంగా చూపుతాడు. మేము బ్రాహ్మణులం, మా అన్నయ్య గారు వేరు. నిరక్షర కుక్షి విరూపాక్ష దీక్షితులు గారు. పొట్ట చింపినా అక్షరం ముక్కరాదు. ఇక మా తమ్ముడు తస్కర సోమయాజులు, పోలీసువాళ్ళతో మంచి దోస్తీ. నాశిష్యులు గోంగూర పేరి శాస్త్రులు, వుల్లిపాయల లింగావధాన్లు, దొమ్మరి రాఘవాచార్యులు, దూదేకుల పెద్దిబొట్లు సాతాని శంభు లింగం అని చెపుతుంటే ఆమాటలకు పగలబచి నవ్వుతూ వుంటారు జనం.

ఇక సన్మానాలను గురించి చెపుతూ కనకాభిషేకం, రత్నాభిషేకం, పుష్పాభిషేకంతో పాటు శిరాభిషేకం అని ఓ కొత్తది చెపుతాడు. శిరాభిషేకం అంటే ఆ మనిషి నెత్తిమీద రాళ్ళు రువ్వటమట... ఇదీ తీరు. ఈ విధంగా అస్తవ్యస్త పదాలను వాడుతూ, ప్రేక్షకులను నవ్విస్తారు. ఇందులో ఛాందసుల్ని విమర్శిస్తూ ప్రజలను వినోదపరుస్తారు.

మాదిగ వేషం:

పగటి వేషాల్లో మాదిగ వేషం కూడ ప్రాముఖ్యమున్న వేషం. ఈ వేషాన్ని ఏలూరు వాస్తవ్యుడు సున్నపు వీర్ఫయ్య అద్భుతంగా ధరించేవాడు. తలకు పెద్ద పాగా, చుట్టి నల్లని ముఖంమీద ఎర్రని కుంకంబొట్టు పెట్టి, మెడలో తాయత్తు కట్టి, కట్టు పంచను పైకి ఎగకట్టి, డప్పు వాయిస్తూ __తాలె విల్లియ్యలోయ్. రామా రాఘవ విల్లియ్యలోయ్, ఊరికి వెలుపల వున్నామండోయ్. ఊర పందిని తిన్నామండోయి. తాలే విల్లియల్లోయ్, శివాతాలే విల్లియల్లోయ్ అని పాడుతూ, దానికి అనుగుణంగా గంతులు

సున్నపు వీరయ్య చాటింపు వేషం

వేస్తూ, వేదాలను గురించీ, జాతులను గురించీ, అంటరాని తనాన్ని గూర్చీ, కులాల గురించీ, పాటల్లోనూ, మాటల్లోనూ విమర్శనాత్మకంగా చెపుతూ, విన్న ప్రతివారినీ ఆలోచింప చేస్తాడు. అంటరాని తనాన్ని గురించి ఈ విధంగా పాడుతాడు.

అంటరాని తనం పాట:

కుక్కని కోతిని కొల్చుతారయా
నందిని పందిని పూజ సేతురూ

తోటి మానవుడు ఎదురై వస్తే
దూర దూరమని తొలగి పోదురు ॥తాలే॥

కుక్కంటే కాలభైరవుడనీ, కోతంటే హనుమతుడనీ, పంది అంటే వరాహవతారమని గ్రహించాలి.

కులాల గురించి:

శునక గర్భమున జన్మించిన ఆ శైనకముని
గోత్రమ్ము చెప్పుతా -మండూకమునకు
పుట్టినట్టి ఆ మాండవ్యుని కులమేదో తెల్పుడి ॥తాలే॥

రకరకాలైన కులాలు లేవనీ, రంగు రంగుల మతాలు లేవని, కలిగిన వారిది గొప్ప కులమా, లేని వారిది లేని కులమా అంటూ.

వశిష్టుని గురించి:

తల్లి తొలుత లంజ తన యాలి మాదిగ
తాను బ్రహ్మడనగ తగునె జగతి
తపస్సు వల్ల ద్విజుడు తర్కింప కులమేది
విశ్వదాభిరామ వినుర మేమ.

అలాగే శూద్రుల గురించీ, బ్రాహ్మణుల గురించీ.

జన్మానా జాయతే శూద్రః
కర్మాణా జాయతే ద్విజః
వేదభ్యాసే విప్రశ్యాతేః
బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణః

అంటూ, ఇలా అనేక గ్రంథాలలోని పద్యాలూ, శ్లోకాలూ ఉదహరిస్తూ, కుల వ్వవస్థను తూర్పార బడుతుంటే అతని శాస్త్ర విజ్ఞానానికి ఆశ్చర్య మేస్తుందని, పడాల రామ కృష్ణా రెడ్డి గారు విశాలాంధ్రలో ఉదహరించారు. పైవిధంగా అంతా వల్లించి, దండోరా వేసినట్లు ఊళ్ళోకి ధాన్యమూ, పప్పులూ, ఉప్పులూ వచ్చాయనీ, ఉప్పు కుంచం వంద రూపాయలని, కావలసిన వాళ్ళంతా వచ్చి కొనుక్కోండహో. అని అంటూ వుంటే పల్లె జనం బిత్తరపోయి చూస్తూ వుంటారు. ఇలా ఈ వేషం ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్నీ కలిగించేవారు.

పగటివేషంలో సాతాని వైష్ణవులు:

పైన వుదహరించిన సాతాని వైష్ణవుల మాదిరి, ముఖంమీదా, గుండెలమీదా, భుజాలమీదా పెద్ద పెద్ద నామాలు దిద్ది, అక్షయ పాత్రలు ధరించి, హర్మోనియం, మద్దెళ్ళతో త్యాగరాయ కీర్తనలు పాడుకుంటూ వచ్చి మేమంతా వైష్ణవుల మండీ, అయితే శ్రీ వైష్ణవులం మాత్రం కాదు. నూట అయిదు దివ్వ క్షేత్రాలు సేవించుకుని తిరుపతికి వెళుతున్నామనీ, కంటెలు గానీ, కాసుల పేర్లు గానీ దుద్దులు గానీ, జూకాలు గానీ, వడ్డాణం గానీ, వెండి బంగారం రూపేణా మీవద్ద ముడుపులుంటే మా అక్షయ పాత్రలో వెయ్యండి. మీరిచ్చే ముడుపులన్నీ స్వామి పేర కైంకర్యం చేసేస్తాం. మీరే వెళ్ళాలంటే, రానూ పోనూ చాల ఖర్చు అవుతుంది. పైగా శ్రమ. అందువల్ల మా వంటి భక్తులకు ఇచ్చారంటే, మరేదో కాలేదు. అంటూ ఈ విధంగా ఊదర గొడుతూ వుంటే చుట్టూ చేరిన జనం, దొంగభక్తుల మాటలకు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ వుంటారు. ఈ వేషధారులు సమయానుకూలంగా విష్ణుపురాణం లోని ఘట్టాల ననసరించీ, శ్లోకాలనూ, పద్యాలనూ ఉదహరిస్తూ వుంటారు.

బాలరండా రుక్మాబాయి (వెధవముండల వేషం);
గోవింద నామాలు - ద్విపద నడక

ఆయువూ లేకను, గోవిందారామ,
ఆయనే పోయెను ॥గోవిందా॥
భుజము మీదా కొంగు ॥గో॥
బుర్రకు వచ్చెను ॥గో॥
బుట్టలో విభూతి ॥గో॥
నొస్టకు వచ్చెను ॥గో॥
కంట కాటిక బోయె ॥గో॥

ముక్కు వత్తూ బోయ ||గోవింద||
మొగము కుంకుమ పోయె ॥గో॥
చెవుల కమ్మలు పోయె ॥గో॥
చేతి గాజులు పోయె ॥గో॥
నొసట కుంకము పోయె ॥గో॥
నెత్తి జుట్టును పోయె ॥గో॥
చాకలి సుబ్బని కోరిక తీరెను ॥గో॥
మంగలి గురవని మనసును దీరె ॥గో॥
పోయిన మగడును పోతే పోయె ॥గో॥
పొన్నకాయ వలె కుదిరింది తల ॥గో॥
వారి వీరి పుణ్యాన గోవిందా రామ
అబ్బాయి పుట్టెను గోవిందా రామ
తాళిబొట్టు పోయె గోవిందారామ
తల వెండుకలు పోయె ॥గో॥

మొదటి వారు: అయ్యో నాయనా, ఏం చెప్పేది నాయనా (అని ముక్కు చీదుతుంది.)
రెండ: ఏమిటే యమ్మ - చెప్పారాదుటే అమ్మ
మొద: కోటప్ప కొండ ప్రభ అంతే మనిషే అమ్మ.
రెండ: అట్టాగుటే అమ్మ
మొ: ఏం చెప్పెదే అమ్మ.
రెండ: ఏమిటే అమ్మ.
మొ: మావారు నేను కలిసి, తీర్థయాత్రకని వెళ్ళామే అమ్మ.
రెండ:ఏం జరిగిందే అమ్మ.
మొ: తిరుగుతూ, తిరుగుతూ, శ్రీ రంగం, కంచి, కాళాస్త్రి, రామేశ్వరం వెళ్ళాం.
రెండ: ఏం జరిగిందే అమ్మ
మొ: అక్కడ సత్రంలో దిగి స్నానికని బయలు దేరినామే, నేనేం చేసానంటే.మళ్ళి
        వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని వంట చేస్తున్నా. ఆయనేం
         చేశారంటే. నువ్వు వెనకరావే, నే వెళ్ళి తీర్థ శ్రార్ధం పెడుతూ వుంటాను
         అని చెప్పి వెళ్ళి స్నానం చేసి శ్రార్థం పెట్టి నేను వెళ్ళె సరికి బాగా
         లోతుకు వెళ్ళారే అమ్మ.

రెండ: ఏమైందే అమ్మ.
మొ. లోతుకు వెళ్ళి పోతున్నా పోతున్నానే అన్నారు ఆయన.
రెండ: నువ్వేమన్నావే అమ్మ.
మొ: పోయేవారు పోతూనే వున్నారు__సోదుల్లోకి స్వప్నాల్లోకి రాకండి అని చెప్పి, ఇంటికి వచ్చి చేసిన పిండి వంటలు తిని బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యంలో మగ దక్షత లేకుంటే బాగుండదని ఈ ఆచారి గారి దగ్గర శిష్యరికం చేస్తూ, వీరితోనే జన్మ తరింప చేసుకోవాలని చూస్తున్నాను. (అయితే నేనూ నీతో వస్తానే గొవింద నామాలతో నిష్క్రమిస్తుంది)

ఈ విధంగా ద్వంద్వార్థాలలో గోవింద నామాలు సాగుతాయి.

శారద వేషం:

పగటి వేషధారులు ఏ గ్రామంలో పగటి వేషాలను ప్రారంభిస్తారో, అక్కడే అన్ని వేషాలనూ రోజుకొక వేషం చొప్పున ప్రదర్శించి చివరి రోజున ప్రతి ఇంటికి పారితోషికాల కోసం తిరుగుతూ, ప్రతి వారినీ పొగుడుతూ ఇలా ప్రారంభిస్తారు.

రాజాధిరాజ మహారాజ
రవికోటి చంద్ర తేజ
కళాపోషకా నటరాజ
కళారాధనయె శివ పూజ
అంగాబినయమె హరిపూజ
నన్మానమో కల్పభూజ

ఓ, శారదే, కరుణానిధో.

కళారాజ్య విస్తారం
శారదాంబ పరివారం
కృష్ణా ప్రాగ్దిశ తీరం
కూచిపూడి ఆగ్రహారం
కులమున బ్రాహ్మణవారం
కళాకేళిచే హారం
మిక్కిలి యడుగ నేరం

 చందమామ ఆకారం - మీ
మెడలో చంద్ర హారం - ఆ
హర మీవె అలంకారం.

ఇలా పాడుతూ__

తెలుగు మాగాణ మోయి
భాషకు తెలుగే మొఎరుగోయి
టంగుటూరి మనవాడు
ఆంధ్ర కేసరిగ వెలిగాడు
ఓ శారదే, కరుణానిధే, దాశరథీ సుగుణానిధే

అంటూ

మేలిమి కన్నులే సోగ - ఆ
కల్కితురాయి పాగ - మీ
సిరమున వెలిగేలోగా - ఆ
కోరమీసములు సరిగాగ
దానకర్ణుడని మీలాగ ॥ఓ శారదే, కరుణానిధే॥

అంటూ

ఇదినాలుగు జాముల పొద్దు
నన్నెగదిగ చూడవద్దు.
నాపేరే శారద పద్దు
తమ కీర్తి వింటే ముద్దు - ఆ
ముద్దుల మీసం దిద్దు
మాపు రేపు అనవద్దు

అన్నా

మీకే తెలుసుర ఆ పద్దు
కూచిపూడి రామాయన్న
పార్వతీశుడర న న్నెన్న
తాంబూల మిచ్చి పంపన్న.

ఓశారదీ, కరుణానిధీ _ అంటూ ఇంటింటికి తిరిగి వారిని వుబ్బి తబ్బిబ్బుచేసి బాగా డబ్బు గుంజుతారు. నెలరోజులు వేషాలు చూచిన గ్రామ ప్రజలు కూడా తృప్తిగా ముట్ట చెపుతారు.

శారద వేషంలో ప్రధానాంశం, రామాయణ కథా భాగాన్ని గేయరూపంలో వర్ణించి చెప్పటం ముఖ్యం. రాముడు సీతారామ లక్ష్మణులతో పర్ణశాలయందుండగా, మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి, దానిని కోరటం, సీతాపహరణం, జటాయువు కథ, లంకాదహనం, రావణ సంహారం మొదలైనవి వుంటాయి.


దాష్టీక పంతులు, చిట్టి పంతులు:

దర్జాను వెలగబెట్టేవారిని దారికి తీసుకువచ్చే విధంగా దాష్టీక పంతులు - చిట్టి పంతులు సంవాదం ఇలా ప్రారంభ మౌతుంది.

భళ దాష్టీక పండితేంద్రా, బరోబరి.

పంతు: వారెవరే, శహభాష్, అవునోయి చిట్టి పంతులు, పంతులు గారు వస్తున్నారంటే, ఎదురుగా రావటం కౌగలించు కోవడం, ఏమీ లేక పోయెనేమోయ్.

సున్నపు వీరయ్య చిట్టిపంతులు

చిట్టిపంతులు: అయ్యా చిట్టం. ఇంతగా బహువచనంగా సెలవిస్తున్నందున, మాకు తెలవలేదండీ.
ఇలా దాష్టీకం పంతులు తన గొప్ప తనాన్ని చాటుకుంటూ వుంటాడు. అయితే ఎవరూ లెక్కచేయరు. ఉదాహరణకు __ అవునోయ్ పంతులూ, యీ పిల్లలంతా ఏమిటోయి?
చిట్టి: భాగవతం ఆడుతున్నారండీ
దాష్టీ: అవునోయి పంతులు ఎవరాడిస్తే ఆడుతున్నారు.
చిట్టి: మహారాజరాజేశ్వరులు, లక్ష్మీ పుత్రులు.
దాష్టీ: ఎందు నిమిత్త మాడుతున్నారు.
చిట్టి: ఉదర నిమిత్తం బహుకృత వేషం_ అవునోయి మేము అధికారులము నువ్వు ముందు నడుస్తావటోయి.
చిట్టి:చిత్తం మహాప్రభో, వాళ్లను వెనుక నడిపిస్తాను లెండి.
దాష్టీ:అవునోయ్ చిట్టీ, నాకు నుయ్యి అయినదీ తెలియదు, గొయ్యి అయినదీ తెలియదు. ఈ గోతిలో పడమన్నావటోయ్.
చిట్టి: ముందు నడిస్తే ముందు నడుస్తారా అంటిరి. వెనుక నడిస్తే ఇలా అంటున్నారు. ఎలా అయ్యా__

ఇలా సంవాదం జరుగుతూ వుండగా భోగంవాళ్ళు వస్తారు.
చిట్టి: అయ్యా భోగంవారు వచ్చారు. వారికి బస ఎక్కడ కుదర లేదు.
పంతులు: మన దేవతార్చన గదిలో దించు.
చిట్టి: చిత్తం, అయ్యా. అక్కడ దేముడున్నాడండీ.
పంతు: దేముణ్ణి తీసి ముసలమ్మ కొట్లో పడవెయ్యవోయ్.
చిట్టి : ముసలమ్మగారున్నారండి
పంతు: ముసలమ్మను తీసి గుఱ్ఱాల సావిట్లో పడవెయ్యి.

ఇంతలో: బట్రాజులు వస్తారు.

భట్రాజులు: చిత్తం, అయ్యా, మోదుకూరు భట్టు మూర్తులం. మీ సందర్శనానికి వచ్చాం.
పంతు: అవునోయ్ పంతులు, మీ సందర్శనానికి వచ్చా మంటున్నారు. అది మానేసి, గడ్డం దర్శనం చేసు కోమనవోయ్ __

ఇలా భట్రాజులకూ, దాష్టీకం పంతులుకూ మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది. అంతా లోకంలో జరిగే విశేషాలన్నిటిని చర్చిస్తారు. ప్రశ్న సమాధానాలతో,

పాత్రల మనస్తత్వాలను తెలియజేస్తారు. ముఖ్యంగా సమాజంలో వుండే గొప్పవారి అహంభావాలనూ, అహంకారాలను, వానితోపాటు వారి తెలివితక్కువ తనాన్ని వెల్లడిస్తారు.

చివరికి చిట్టి పంతులు ఇలా అంటాడు భట్రాజులతో, ఏమోయ్ భట్రాజులూ, పంతులు గారు మీకి సన్మానం, శాంక్షన్ చేశారు - తీసుకోండి. భట్రాజులు: భళిభళీ, దాష్టీక పండితాతము ఉదారము. దరిద్ర దేవత తొలగి పోయింది. మహానంద మని నిష్క్రమిస్తారు.

ఫఠాన్, గులాం:

ఈ వేషం ముఖ్యంగా ఉర్దూలో వుంటుంది. పాత్రలు, ఫఠాన్, గులాం. బైరాగి వారి సంభాషణ ఉదాహరణకి ఇలా సాగుతుంది.

ఫఠాన్: అరే, ఖోనా, పేనా , ఫైరే, గులాం.
అలే గులాం. బిచానా తయార్ కరో.
అలే గులాం. యేబీ అచ్ఛానై హిసిడాలో,
అలే గులాం కోనా, పేనా, హుక్కా తయార్ కరో,
కులాం: తయారు. కర్తాహుం సర్థార్.
పఠాని: హుక్కామే క్యా బనాహై.
గులాం: హుక్కామే, లవంగి, యాలకి, జాజి, జాపత్రి, యేబీ నబీ మిళాకర్కె డాల్తాహుం, సర్దార్?

పఠాని: అచ్చాహై. అరె గులాం, అంగార్ దేఖో
గులాం: ఏ అంగార్ నహి సర్దార్.
ఫఠాని: గులాం అంగార్ లావో.
గులాం: లాతే హజరత్ సర్దార్.
ఫఠాను: హుక్కాలావ్.
గులాం: హం సర్దార్.

 ఇంతలో దర్వాజ దగ్గరకు బైరాగి వస్తాడు.

ఫఠాన్: యే దర్వాజాయే గడబిడ కడై__ కోన్ ఆయా.
గులాం: బైరాగి ఆయా సర్దార్.
ఫఠాణ్: యే బైరాగి ఆయా, కిత్నే జనే ఆయా.

ఫఠాన్: అరే గులాం, బైరాగిని బులావ్.

ఇలా బైరాగితోనూ, గులాంతోనూ, ఫఠాన్ దార్జానంతా చూపిస్తాడు. పై మాదిరే సంభాషణా ముగ్గురి మధ్యా జరుగుతుంది. చివరికి పఠాన్ ఇలా అంటారు.

ఫఠా: అరే కోనాధీ నా పైరె గులాం.

గులాం: అరే గులాం గులాం అంటావ్. కైకు పుకార్తే కే గులాం మే?

ఫఠా: నేనా గులాం, నువ్వా గులాం?

గులాం: నువ్వు గులాం, నీతాత గులాం.

ఫఠా: ఏ బారు రూప్యా నౌకరి హై?

గులాం: ఏక్ రూప్యా నౌకరీ హై?

ఫఠా: తేరే నిఖాయె తుంహె?

గులాం: మౌహు మేరె నిఖాయె తుంహో?

ఫఠా: చల్తి చల్తి __ యే హిస్ ఫర్, ఖద్గరెగ జాగిరా దారుహై, హమార్ వాఃఖోదా పంజలేగ.

గులాం: శినేకు మేరా ఆయా__సేనా జూదా కరే జావ్.

ఫటా: దీన్ మౌలా దిందింమౌలా, __యూహుదాంతహై, మహమ్మద్ దరసూలిల్లా, యా మహమ్మదరసో లిల్లా.

ఫఠాని సాహెబ్, పకీరయ్యాడు.

జంగందేవర వేషం

శైవ వైష్ణవ మతాల విజృంచణలో ఎవరి మతాన్ని వారు ప్రచారం చేయడంలో శైవభక్తులైన జంగాలు, జంగం దేవర వేషాలు ధరించి శైవ మత ప్రచారం చేసే వారు.

ఈ ప్రచారాంలో శత్రు మిత్ర భేదమనేది లేదనే విశాల విశ్వమంతా నిండి యున్నది. పరబ్రహ్మ స్వరూపమనీ, శైవమాతాన్ని గూర్చీ, శైవ క్షేత్రాల విశిష్టత గూర్చీ, పెడితే జంగానికే పెట్టాలనీ, కడితే లింగాన్నే కట్టుకోవాలనే తత్వాలను పాడుతూ, శైవమతాన్ని ప్రచారం చేస్తూ భుక్తి తో పాటు ముక్తినీ పొందుతూ ఆ ప్రచారానికి అంకితమై పోయేవారు.

అయితే ఈ వేషాన్ని పగటి వేషధారులు ధరిస్తూ వ్వంగ్యంగా ఇలా పాట పాడేవారు.

ఏమి సేతుర లింగ ఏమి సేతురా నీదు
మతము ఎవరికి తెలియరాదు
గంగ ఉదకము దెచ్చి నీకు లింగ పూజలు
సేతమంటే గంగలోన కప్ప చేప
లెంగిలంటున్నాయి లింగా.

అచ్చ ఆవుల పాలు దెచ్చి అరిపితంబు
సేతమంటే అచ్చ ఆవుల లేగదూడ
లెంగి లంటున్నాయి లింగా.

తమ్మి పూవులు దెచ్చి నీకు తృప్తిగా
పూజ సేతమంటే కొమ్మ కొమ్మకు కోటి
తుమ్మెద లెంగిలంటున్నాయి లింగా.

యనుచు తత్త్వాన్నాలపిస్తూ...

జాజీఫల రసపానమత్తః కేరో యథా
తథా ఆనంద అమనస్క రాజ యోగోధి రాజతే.

జాజీ ఫల రసపానం చేసి మత్తెక్కిన చిలుక చందము తెలియ రాజ యోగాను భవము అలా వుంటుందనీ కొంత సేపైనా మనసు నిల్పర విశ్వమంతయు నీవని

జంగం దేవర వేషం


మదిని దల్పర యని తాత్వికాన్ని ప్రబోధించేదీ వేషమని, భాగవతుల లక్ష్మి నరసింహం గారంటున్నారు.

మందుల వాళ్ళు:

సహజంగా భద్రాచల ప్రాంతం నుంచి గిరిజన జాతులకు చెందిన కోయ స్త్రీ పురుషులు, కొండ మూలికలు తెచ్చి ఆ మందులు ఏయే జబ్బులకు పని చేస్తాయో వాటిని వల్లిస్తూ బజారులన్నీ తిరుగుతూ ఏ జబ్బుకు ఏ మందు లున్నాయో ఏకరువు పెట్టటం మనకు తెలిసిందే.

అదే మాదిరి పగటి వేషధారులు ఓ వాత నొప్పులకు మందులు, ఓ కీళ్ళ నొప్పులకు మందులు, ఓ శిరో వాతానికి మందులు, ఓ సీత పైత్యానికి మందులు, ఓ కాళ్ళతీతలకు, అరికాలి మంటలకు మందు. ఓ దొరగారు, మంచి మంచి మందులుండాయి. ఓ, మేలాడి, దోమ తిరుగుడు, దేశ తిరుగుడు, తల తిరుగుడు, రోగాలకు మేలైన మందులు గాడిదలమీద మోయించుకొచ్చాము దొర.

ఓ పాము కరిత్తే, దోమ కుడితే, ఎలుక కరిత్తే, ఓ దొర కుక్క కరిత్తే, ముల్లు కొడితే, శెముడుకు మందు, పైత్యానికి మందు, ఓ దొర ఎన్నో మందు లుండాయి.

విభూతి భవానీలింగం పార్టీ- మందుల వాళ్ళు


ఓ దొర , తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, ఓ పిల్లి అడుగు, ఓ పిట్టకాలు, కస్తూరి, గోరోజనం, సీతమ్మ రసం, ఆనంద భైరవి, వంగ భస్మం, రాతి భస్మం, ఓ సువర్ణ భస్మం, తామ్ర భస్మం, మకర ధ్వజం, చంద్రోదయం, ఓ ఎన్నో మంచి మంచి మందులున్నాయి దొర.

ఇలా మందు ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని మందుల్నీ వివరిస్తూ, ఆ మందుల్లో ఏయే మందు, ఏయే జబ్బుకు వాడవచ్చునో, అయుర్వేద శాస్త్రాన్నంతా వివారిస్తారు. పెద్ద వాళ్ళకు, ఆడ వాళ్ళకు పిల్లలకు, ఎవరికి వాడే మందులు, వారి చెప్పి చివరికి.

ఒయమ్మో, ఓ తల్లో... ఊరికే సూతారేమమ్మో, మాదాకవళం వెయ్యమ్మో అంటూ, ఓ రామయ్యగోరో, ఓ రంగయ్య గోరో, ఓ రత్తయ్య గోరో, అయ్యో మా అయ్యో, ఓ అయ్యో.

కమ్మని కమ్మని కళలను జూపే
కళాక్షేత్రమే మాదయ్యా
కళాకారులము మేమయ్యా,
అబ్బో, - ఓ అబ్బో -ఓ -లబ్బో
పుట్టుక కళలను మాది
పొట్టల నింఫుట మీది
కోటకు దీటుగ కళల కెల్లను
కూచిపూడియే మాది.

ఓ అబ్బో, ఓ అబ్బో, ఓ అబ్బో అంటూ మాథాకవళం మాయమ్మ, మడిమాన్యాలే లేవమ్మా అంటూ పారితోషికాన్నందుకుంటారు.

వెంకట రాముడు:

ఈ వేషాన్ని కూచిపూడివారు ఒక పద్ధతిలో ప్రదర్శిస్తే వెంకట రాముడు సామెతలతో హాస్యోక్తులతో మూడువందల ఇరవై రోగాలకు మందుల పేర్లు చెప్పి ఆకిరి పిల్లి గట్టుకాడ, అవ్వసరికాడ, ఔషద క్రియలు తెచ్చానని చెపుతూ, హాస్య ధోరణిలో.

పందిపిల్లనిచ్చి పరువు నిలిపి నట్లుగను
కుక్కపిల్ల నిచ్చి కులము నిల్పినట్లుగను

కడుపుబ్బ నవ్విస్తూ కేవలం వినోదం బోధించడమే కాక ఆరోగ్య నియమాలను పాటించ కుండా, ఆరోగ్య చెడగొట్టుకున్న వారిని, హేళనచేస్తూ, సన్మార్గం బోధించటమే మందుల వాని వేషం యొక్క ముఖ్య వుద్దేశం.

సిద్దీ - కంచెనీ వేషాలు

జానపద కళారూపాలలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినవీ, బహు రూపాలుగా ప్రజలను అలరించినవీ, పగటి వేషాలే, ఆలాంటి వాటిలో నాటి సామాజిక పరిస్థితుల్ని వివరించేదే సిద్దీ - కంపెనీ వేషాలు. తురక జాతికి చెందిన వాడు సిద్దీ... ముఖానికి నల్లటి రంగు పూసుకుని, రెండు అంగుళాల పొడవైన గడ్డం పెట్టుకుని, చొక్కా పైన వేస్టు కోటు ధరించి టర్కీ టోపీ, సిల్కు లుంఘీ, బఫూన్ లా వుంటాడు.

కంచెనీ అంటే భోగంవారు. నాట్య కత్తెలైన వీరు ఇద్దరు ముగ్గురుంటారు. వీరు జావళీలనూ, కృష్ణ శబ్దాన్ని, మండూక శబ్ధాన్ని, దశావతారాలనూ, అష్టపదులను, తరంగాలను, అధ్యాత్మిక రామాయణ అకీర్తనలనూ, త్యాగరాయ కీర్తనలు పాడుతూ; సుందరంగా నృత్యం చేస్తూ చక్కగా ఆభినయిస్తారు. వీరికి హంగుగా, హర్మోనీ వాయించేవారూ మద్దెల వాయించే వారూ వుంటారు.

ఇంతలో సిద్దీ ప్రవేశించి నేనిక్కడ పాదుషా వారి కాపలాదారుననీ, అల్లరి చేయ వద్దనీ.. అంటాడు.

సోమయాజులు, సోమిదేవమ్మ

వినోదం కలిగిస్తూ, నవ్విస్తూ, పరిహసిస్తూ సంఘంలోని దురాచారాలను, దుర న్యాయాలను, బట్టబయలు చేస్తూ సాంఘానికి దర్పణంగా దిక్చూచిగా వ్వహరించటమే పగటి వేషాల ప్రధాన ఆశయం.

పాతోచిత భాషతో జాను తెలుగు నుడికారంతో వెలువడే వేషాలలో సోమయాజులు, సోమిదేవమ్మ వేషం ముఖ్యమైనది.

కుహనా వైదిక మతస్థులను పరిహిసించడమే ఈ వేషం యొక్క పరమాశయం. ఇందులో మూడే పాత్రలు. ఒకటి సోమయాజులు, రెండు సోమిదేవమ్మ, మూడు శిష్యుడు. ఈ మూడు పాత్రల సంభాపణలూ వ్వంగ్యార్థాలతో కూడి చమత్కారంగా వుంటాయి. ఈ పాత్రలు, పంచాంగ శ్రవణాన్నీ, రామాయణ శ్రవణాన్ని వైదిక కార్య కలాపాల్ని అవహేళన చేశాయి. ఒక రకంగా చూస్తే ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం మనస్తత్వాలను తెలియచేసేవే ఈ రెండు వేషాలు. సోమయాజులు ముసలివాడు. ఆయన భార్య సోమిదేవమ్మ పడుచు పిల్ల. వీరిద్దరి మధ్యా ఆసులో గొట్టంలా ఒక శిష్యుడు. ఆ దంపతుల మధ్య సంవాదం ఇలా సాగుతుంది. సోమయాజులు ఇలా ప్రవేశిస్తాడు, మహా ప్రభో మేము అయితాగ్నులం, పరాన్న ప్రియులం, శ్రోత్రియులం, ముమ్మారూ వెళ్ళి మూడు కావెళ్ళు తెచ్చినాము. కాశీ గంగ కావెళ్ళు... చెయ్యా చేయించా గల సమర్థులం. ఏమిటంటే యజ్ఞ యాగాది క్రతువులు, వివాహ ఉపనయనములూనూ నాయనా... మా సోమిదేవి అక్కడ వుందా లేదా? వాసే సోమీ, వాసే సోమీ, వాసే సోమీ... అని పిలుస్తాడు.

సోమిదేవి: సోమి సోమీ అన్న నోటికి విధి విరామం లేదుకదా? ఆ నోరు ఎన్నడైనా పచ్చి వెలక్కాయ చిప్పల్లాగా నొక్కుకు పోతే సుఖ పడుదును.

సోమ: ఏమిష్రా నాయనా! అంచోంది.

శిష్యుడు: తాతగారూ మిమ్ముల్ని తిడుతోదండి.

సోమ: ఒరే శిష్యా మిమ్మల్ని తిడితే నాతో చెపుతారేంరా దౌర్బాగ్యుల్లారా!

గొల్లపడుచు, బ్రాహ్మణుడు సంవాదం

శిష్యు: నిన్ను తిడుతోంది.

సోమ: నిన్న తిడితే ఇవ్వాళ చెపుతారేంరా!

శిష్యు: కాదండీ తాతగారూ. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు గనుక మిమ్మల్నే తిడుతుందండీ.

సోమ: నన్నే తిడుతోందీ. ఆసే సోమీ నన్నే తిడుతున్నావటే?

సోమి: ఇదుగో ఏమో విన్నారు కాదుకదా? నేను మాట్టాడితేనే మీకు తిట్టు.

సోమ: తిడితే తిట్టు అవుతుంది గాని, మాటలంటే తిట్టు ఎలా అవుతుంది? సరే నీవు తిట్టినా నాకు సమాధానమే. సోమి: అదిగో మీ ఇల్లు బంగారంగానూ, మీరన్నా నాకు సమాధానమే.

సోమ: నేనంటే నీకు ఎలా సమాధానమో చెప్పు.

సోమి: నేనంటే మీకు ఎలా సమాధానమో చెప్పండి.

సోమ: ఇదిగో నిన్ను చూచినా, నీ పాటలు చూచినా, నీ మాటలు చూచినా, నీ చక్కదనం చూచినా, నీ సౌందర్యం చూచినా, నీ నగలు చూచినా, నీ యొక్క నవ్వు చూచినా, నీ కులుకు చూచినా, నీ టక్కు చూచినా, నీ టమారం చూచినా, ఆ రెండు చూచినా, ఆనందో బ్రహ్మానంద మౌతుంది.

శిష్యు: ఏమిటండోయ్ తాతగారూ, ఆ రెండూ అంటున్నారు?

సోమ: కంటె, కాసుల పేరూరా?

సోమి: అదిగో ఏమో విన్నారు కాదు కదా! నాకు మిమ్ముల్ని చూస్తే చాల సంతోషంగా వుంది.

సోమ: నేనంటే నీకు యెలా సంతోషమో చెప్పవే.

సోమి: అదిగో మిమ్మల్ని చూచినా, మీ రుద్రాక్షలు చూచినా, మీ పురిపిడికాయ చూచినా, మీ దొప్ప చెవులు చూచినా, దోనె కడుపు చూచినా, మీ ముసలి గడ్డం చూచినా, మీ తలకాయ చూచినా, తట్ట తలపాగ చూచినా చాల సంతోషంగా వుంటుంది.

సోమ: నాముఖం. నాముఖం అని ముమ్మార్లు శ్లాఘించావు. నాముఖానికేమే

సోమి: ... దూరంగా వుండండి ముసలి కంవేస్తోంది.

సోమ: నాకంపే నీకు గిట్టదు. నిన్ను వదలి యే బ్రాహ్మడి మెళ్ళో జంధ్యాలు తెంచైనా గంగా యాత్ర పోతాను.

సోమి: అంత మాత్రం పోళెమి పుట్టాలి గాని నేనూ ఆశిష్యుణ్ణీ తీసుకుని రామేశ్వరం వెడతా నటుంది.

ఇలా ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ, భార్యా భరల మధ్య వుండే తగవులాటల్నీ ఏకరువు పెడతారు. మధ్యలో బొమ్మలాటలో గంధోళి గాడిలా శిష్యుడు ఇద్దరి మధ్య ప్రశ్నలు వేసి రెచ్చ కొడతాడు. ఆద్యంతం వారి మధ్య జరిగే సంభాషణా విధానం, చతురతా, ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.

భాగవతుల్ని అదిలిస్తాడు. బృందంలోని గురుమూర్తిని, గొఱ్ఱె మూతనీ, గోవిందప్పను గోడ్రుకప్పనీ, భరత నాట్యాన్ని బడెతె నాట్యమనీ, ఇలా వక్రంగా మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్విస్తాడు.

అమ్మాయిల్ని చూసి ఆడమంటాడు:

నృత్యం చేసే అమ్మాయిల్ని చూసి ఆనందపడిపోయి ఆడమంటాడు. అప్పుడు అమ్మాయిలు వివిధ నాట్యరీతుల్ని, శాస్త్ర విషయాలనూ, శ్లోకాల ద్వారా వల్లించి వాటి అర్థం వివరించి తల పండిన పండితులు కూడ తలలూపే విధంగా మెప్పిస్తారు. ముఖ్యంగా బాల గోపాల తరంగం, దశావతారాలు వంటి రూపాలను నడివీథిలోనే ముద్రలుపట్టి అభినయిస్తారు. అంటే శాస్త్రీయ రూపాలైన వీటిని సామాన్య జనానికి అందుబాటులో ప్రదర్శిస్తారన్నమాట.

అందంగా, సుందరంగా అభినయించిన నాట్య కత్తెల అభినయం చూసి, సిద్దీ ఏమీ ఇవ్వక పోగా చివరికి నవాబు దర్శనానికి అంగీకరించడు.

అందుకు జవాబుగా వళ్ళు మండిన భాగవతుడు, తుమ్మిచెట్టు తినేపళ్ళు కాయదు. పైగా పళ్ళచెట్టు ఎవ్వరూ ఎక్కకుండా ఈ తుమ్మకంచె కాపలా అంటూ, అలాంటి తుమ్మచెట్టు లాంటి వాడవు అని తిట్టడంతో, ఈ ఉపమానాన్ని సాహిత్య ప్రియులు కూడ మెచ్చుకుంటారు.

ముఖ్యంగా నాటి భాగవతుల ప్రావీణ్యాన్ని ప్రకటించే అవకాశం వున్న కళారూపమది. శృంగార, హాస్య రసాలకు పట్టు కొమ్మ అంటారు. (పడాల రామకృష్ణా రెడ్డి గారు, విశాలాంధ్ర వ్వాసంలో)

గంగిరెద్దు:


డూడూ బసవన్నా, దొడ్డ దొరండీ బసవన్న
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు
కోటి లాభములు కలగాలండి, కోట వేల్పుల దయ గలగాలి
డూడూ వెంకన్నా - తిరుపతి కొండకు ప్రయాణముండి, కుండీ
దేముని మొక్కులు తీర్చాలండీ బంగరు గిత్తల బసవన్నండీ
పయిడి కొమ్ముల బసవన్నండీ పాలమెరుగుల బసవన్నండీ
భాగ్యము లిచ్చే బసవన్నండీ - వెండి కొండపై విహారమండీ
విశ్వనాథునీ వాహనమండీ, పప్పు బియ్యం పట్టుకు రండీ
పట్టు వస్త్రముల బట్టుకురండీ - బసవన్ దయ సంపాదించండీ
                   డూ, డూ, బసవన్న.

డూ డూ డూ డూ బసవన్నా - డూ డూ వెంకన్నా
పెబువుగారికి దండం పెట్టు - పాదం వంచీ భక్తిని పెట్టు
పట్టు శాలువలు కప్పెదరంటా . కాసుల మువ్వలు కట్టెదరంటా - డూ. డూ

చెన్నపట్నం, చేరువకాదు - కాశీ పట్నం కానకపోదు
బాబుగారికి భాగ్యం గలిగే, పిల్లలు పాపలు చల్లగ వుండి
పైరు పంటలు గాదులు నిండి - పచ్చగాను పది కాలాలుండి
ఇంటి కొక్కడు వీరభద్రుడు - పంచ కొక్కడు బసవేశ్వరుడు
చల్లగ వెలసె పెబువులు వుంటె, కళ్ళ వేడుకలు మన కంతాను,

హెచ్చరిక:

హెచ్చరిక వేషాలని, కూచిపూడి వారు సాధువుల వేషంలో తత్వాల ద్వారా నీతులు చెప్పేవారు.

సత్యామయా, గురుడ సత్యమయా,
వీరబ్రహ్మం మాట నిత్యామయా ॥నందామయా గురుడ॥
దోకకాయలు తిన్న పోసముండల కెల్ల
ఆసనం బుడబుడ అరచే నయా ॥నం॥
పల్లాన కూర్చుండి మెరక నుచ్చోస్తేను
కాలి కిందా మడుగు కట్టేనురా ॥నం॥
తాటిచెట్టూ మీద తాబేలు కూకుంటే
గద్ద వచ్చీ దాన్ని తన్నేనురా ॥నం॥
మునగచెట్టూ క్రింద ముగ్గురు ముండలు
ముత్తైదు వేషాలు వేసిరిరా ప్రభూ ॥నం॥
గోలుకొండవతల గోవిందపురములో
డబ్బుకు ముంతెడు నీళ్ళయేనురా బ్రహ్మం ॥నం॥
అత్తలకు పీటలు, కోడళ్ళకు మంచాలు,
కలియుగంబున జనులు చేసేనురా. ॥నం॥

వారు వీరవుతారు, వీరు వారవుతారు,
తార తమ్యము లే మెలగేనురా ॥నం॥
నందామయా గురుడ, నందమయా, ఆనంద దేవికి నందాయమా.

వైష్ణవ వేషం.

వైష్ణవ వేషలో గురు శిష్య పాత్రలు రెండు వుంటాయి. వీరి ముఖ్య బోధన భక్తి లేని సర్వ కార్యాలు ఫలితార్థ శూన్యములనీ, గర్వంతో సర్వ శక్తుల్నీ కోల్ఫోయిన, అహంకారులను ఉదహరిస్తూ, బుద్ధి బలానికీ, కార్య సాధనకూ, చిన్న పెద్దా అనే తేడా లేదనీ వైష్ణవ వేషంలో.

హరి గోవింద, గోవింద, శ్రీ హరే హరి గోవింద,
గోవింద అనుకుంటు, కొబ్బరి తినుకుంటు,
నారాయణునుకుంటు, నములు కుంటు,
సర్వేశ్వరు డనుకుంటు, సర్వం తినుకుంటు
పరమేశ్వరు డనుకుంటూ పాట పాడుకుంటు.

పరమేశ్వర, పరమేశ్వర అంటూ పాడుకుంటూ ప్రవేశిస్తారు. ఈ కళారూప ఇతి వృత్తం, అధ్యాత్మిక ప్రచారానికి సంబందించింది. తిరుపతి అదిగో, శ్రీరంగమదిగో, భద్రాచల మదిగో, అంటూ వైష్ణవ క్షేత్రాల వైభవాన్ని వర్ణిస్తూ ప్రచారం చేస్తారు.

గారడి వేషం:

పగటి వేషాలతో పాటు కూచిపూడి వారు, మంత్ర తంత్ర విద్యల్నీ, గారడీలను కూడ చేసే వారు. ఈ గారడీ వేషం చాల సాహసవంతమైనది. ప్రేక్షకులకు భయం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది అగ్నికి సంబంధించింది.

గ్రామంలో కమ్మరిని పిలిచి బజారులో కొలిమిని పెట్టించి, గడ్డపారల్నీ, పలుగుల్నీ, ఇనప గుళ్ళనీ ఎఱ్ఱగా

కాల్పించి, ఎఱ్ఱగా కాల్చిన పలుగుల్నీ చేతితో దూయటం, ఇనపగుళ్ళు పళ్ళతో పట్టించటం, నెత్తిమీద పొయ్యి పెట్టి .... దాని మీద పెనం పెట్టి, గారెలు వండటం, ఇలా చూపరుల్ని ఆశ్చర్యంలో ముంచివేసే వాళ్ళు.

ఈ పనులు చేసేటప్పుడు వాయిద్యాలను ఉధృతంగా వాయిస్తూ, పాటలు పాడుతూ, కేకలు వేస్తూ

భాయి భాయిమే గారడి, భల్లె భల్లె గారడి
కట్టుమోతు విద్యలకు దిట్టమైన గారడి ॥భా॥

సున్నపు వీరయ్య పాములవాడి వేషం

ఇలా గారడి వాళ్ళు చేసే పనులు కూడా చేసి మాకు మంత్ర తంత్ర విద్యలొచ్చునని నిరూపించుకున్నారు. ఇవి రెండు వందల సంవత్సరాల నాటి మాట.

ప్రతిభకు ప్రతిఫలం:
కూచిపూడి పగటి వేషధారులు ప్రదర్శనాలన్నీ అయిన తరువాత చివరి రోజున శారద రామాయణం కథగా చెప్పి, పారితోషికాల కోసం ఇంటింటికీ తిరుగుతూ, కూచిపూడి ప్రశస్తిని ఈ విధంగా వివరించేవారు.

హారం త్రిపురాసుర సంహారం
ఈ నర్తకు లాడే బేరం
చూపుకైతే బహు దూరం
మేమున్నది కృష్ణాతీరం
మాది కూచిపూడి అగ్రహారం
మేము కులమున బ్రాహ్మణవారం
తమ మెడలో చంద్రహారం
ఆహార మిస్తే మీ భారం
దాశరథీ కరుణా పయోనిథీ.

అంటూ అది లౌకికంగా ఇంటి యజమానిని వూదర పెట్టి కానుకలు లాగేవారు.