తెలుగువారి జానపద కళారూపాలు/పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం


పరమ శివుడు పార్వతి ప్రీతి కోసం రజతోత్సవ సమయంలో కైలాస గిరిలో ప్రదర్శించిన తాండవాలలో పేరిణి తాండవము ముఖ్యమైనది.

పేరిణి శివతాండవం వీర నాట్య శైలికి చెందింది. వీరావేశంతో చేసే తాండవమిది. దక్షయజ్ఞం దండకం చదువుతూ నారసాలు పొడుచుకుని, 'శరభ శరభ అశ్శరభ శరభ అంటూ పరవళ్ళు తొక్కుతూ వీరభద్ర పళ్ళేం పట్టి, తాండవం చేసే ఈనాటి వీరముష్టి వారిని ఉదాహరణగా తీసుకుంటే నాటి పేరిణి శైలి ఎటువంటి విశిష్టమైనదో మనకు అర్థమౌతుంది.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఆంధ్రుల చరిత్రలో అత్యంత సిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు, క్రీ॥శ॥ 1050 మొదలు 1350 వరకూ దాదాపు మూడు వందల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. అంధ్రడేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్వలమైంది.

రమణీయమైన రామప్ప గుడి.

శిల్పకళా నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా, ములుగు తాలూకాలో వుంది. ఇది వరంగల్ కు నలభై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్ర సేనాని అనే రెడ్డి సామంతుడు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్రకళా కౌశలం శిల్పనైపుణ్యం వర్ణించ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా ఈ నాటికీ చూపరులకు ఆనందాన్ని కలిగిస్తూ వుంది. భరత నాట్యమంతా మూర్తీ భవించి స్థంభాల మీదా, కప్పుల మీదా కనబడుతూ వుంది.

జాయప సేనాని:

కాకతి గణపది దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయం శక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే కాక కళాకారుడు కూడా.

జాయపకు నృత్యాలంటే అత్యంతాభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ నృత్తరత్నావళి భారతీయ నృత్య కళా సంపదకు, ఆభరణం లాంటిదని నృత్య శాస్త్రవేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రులు రచించిన ప్రపథమ నృత్య శాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు తెలియజేశారు.

గణపతిదేవ చక్రవర్తి జాయప యందు అత్యంత ఆదరాభిమానాలతో అతనికి సకల విద్యల్నీ, కళలనూ నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమైన, అత్యున్నతమైన నృత్తరత్నావళి రచనకు పూనుకున్నాడు. దానిని క్రీ॥శ॥ 1253 - 54 ప్రాంతాల్లో పూర్తి చేశాడు.

మేటి నాట్య గ్రంథం:

నృల్త్తరత్నావళిలో మార్గ దేసి నృత్యాలు, రెండు కలిసినట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆధ్యాయాలున్నాయి.

జాయప నృత్త రత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశి నృత్యాలన్నిటినీ అమూలాగ్రంగా చిత్రించాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో చిట్టచివరి మూడు ఆధ్యాయాలూ, దేశి నృత్య సంప్రదాయాలైన, పేరణి ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్యరాసకం, దండ రాసకం, శివప్రియం, చిందు, కందుకం, భాండికం, ఘంటసరి, చరణము, బహురూపము, కోలాటం మొదలైన అనేక జానపద నృత్యాలను వివరించాడు. జాయప నృత్త రత్నావళిలో వివరించిన నాట్య సాంప్రదాయానికి అనుగుణంగా శిల్పి రామప్ప, అత్యద్భుతంగా నాట్య శిల్పాలను మలిచారు. సజీవ కళ వుట్టి పడే ఆ నల్లరాతి నాట్య శిల్పాలు, శృంగార, వీరలాశ్యాలతో తొణికిసలాడుతున్నాయి. ముఖ్యంగా పురుష విగ్రహాలు, వీరసాన్ని వెల్లడిస్తూ వుంటే, స్త్రీ మూర్తులు లాస్యాన్ని ప్రతి బింబిస్తున్నాయి.

నృత్తరత్నావళిలో వివరించిన నాట్య రీతులన్నీ వాటి వైనా లేమిటో మనకు తెలియక పోయినా, ఈనాడు అవి ఆచరణలో లేక పోయినా, ఒక్క పేరిణి, నృత్యాన్ని వెలికి తీయడానికి, ఎంతో పరిశోధన చేసి, నటరాజ రామకృష్ణగారు దానిని ఉత్తమ నృత్య కళారూపంగా తీర్చి దిద్ది, ఈనాడు ఆంధ్ర దేశంలో బహుళ ప్రచారం లోకి తీసుకువచ్చారు.

పేరిణి ప్రశంస:

పేరిణి నృత్య సాంప్రదాయం శైవమతానికి సంబంధించింది. పేరిణికి సంబంధించిన ప్రస్తావన, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాథుని కాశీఖండం భీమఖండం లోనూ, వెంకటగిరి ప్రభువు, సర్వజ్ఞకుమార యాచేంద్ర రచన సభారంజని లోనూ, నందికేశ్వరుని భరతార్ణవం లోనూ వర్ణించబడింది.

పేరిణి వర్ణన

అన్ని నృత్యాలను గురించీ, నృత్తరత్నావళిలో వర్ణించినట్లే, పేరణిని గురించి కూడా జాయప ఈ క్రింది విధంగా వర్ణించాడు.

శ్లోకం

"రంజకో రూప సంపన్నః...
భావకో రసిక స్తాలవే దిగమక కోవిదః
ధ్వని శరీక సంపన్నో..."

అంటూ

సురేఖో వాద్యవిరీ ప్రేరణీ మతః.

అని వర్ణించాడు. ఈ వర్ణను బట్టే ఈనాడు రామకృష్ణగారు పేరిణికి ఒక రూపకల్పన చేశారనుకోవచ్చు. పేరిణి నృత్యకారుడు, రక్తి కలిగించేవారుగా, రూప సంపన్నుడుగా, అందాన్ని భావింప గలవాడుగా, రసానుభావం కలవాడుగా, తాళజ్ఞడుగా, గమకంలో నేర్పరిగా, ధ్వని గల శరీరం కలవాడుగా, మంచి రేఖ గలవాడుగా, వాయిద్యాలను ఎరిగిన వాడుగా వుండాలనీ, అటువంటి వాడే, పేరిణీ నృత్యానికి తగిన వారనీ పై శ్లోకార్థం__ అంటాడు జాయప సేనాని.

TeluguVariJanapadaKalarupalu.djvu
తాండవ నృత్యం:

ఈ ఆధారాలు తప్ప, పేరిణిని గురించి మరిన్ని ఆధారాలు దొరకవు. పై వర్ణనను అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆ నృత్యం ఎలా వుంటుందో ఊహించవచ్చు. ఆ ఊహతోనే సృజనాత్మకంగా రామకృష్ణగారు, చరిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన ఈ ఉధృత తాండవ నృత్యాన్ని, వ్వయ ప్రయాసలతో తీర్చి దిద్దారు. పేరిణి తాండవ శైలికి సంబంధించింది. తాండవం అంటే తనలో తాను లయం చేసుకోవడ మంటారు ఉమా వైజయంతీమాల గారు.

లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్తమే గాక, భావ ప్రకటనకు అనువైన భంగిమ గల నృత్యం, పేరణి ఈనృత్యం. నృత్తంతో ప్రారంభమై ... నృత్యంతో వికశించి అంగికాభినయంతో ముగుస్తుంది.

పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే "పేరిణి శివ తాండవం". ఇది వీరులు చేసిన వీర నాట్యం. భారతీయ నృత్య రీతుల్లో ఎక్కడా ఈ పేరిణి నృత్యం కనిపించదు.

రామప్ప ప్రజ్ఞ:

సంగీతానికి సప్త స్వరాలు ప్రాణం. అలాగే మృదంగానికీ త, ది, తో, ణం, ఆధారమైనట్లు, నృత్యం ఎన్ని విధాలుగా రూపొందినా దానికి ప్రధాన స్థానాలు ఎనిమిది మాత్రమే. ఇటువంటి మూలసూత్ర స్థానాలు రామప్ప శిల్పంలో రూపొందించ బడ్డాయి. అంతే కాదు ఆ స్థానాలను ప్రయోగించేటప్పుడు, వాయించ వలసిన తొలి మృదంగ శబ్ధాన్ని ఎంత తూకంలో ప్రయోగిస్తే ఆ విన్యాసం పూర్తిగా వికసించటానికి అవకాశముందో ఆ హస్తవిన్యాస క్రమం, మొదలైన వెన్నో ఆ మృదంగ భంగిమలో రామప్ప మలిచాడంటుంది ఉమా వైజయంతీమాల.

రామకృష్ణ ఉవాచ:

ఇది ఒక అద్భుత ప్రక్రియ అంటారు నటరాజ రామకృష్ణ. నేను శాస్త్రాన్ని, సంప్రదాయాన్ని గురుముఖంగా అధ్యయనం చేయడం వల్ల ఆ భంగిమల్నీ పరిశీలించి అభ్యసించ గలిగా నంటారు.

ఆ మృదంగ భంగిమల్ని పరిశీలించి అభ్యసించగలిగాను. ఆ మృదంగ ధ్వనుల్ని మార్దంగికునికి నేర్పి వాయింప జేశాను. నేను పేరిణి తాండవాన్ని పునర్మించటానికి ఆ మాతృకలే నాకెంతో సహాయ పడ్డాయి. ప్రతి శబ్దానికి ఉత్పత్తి, పరాకాష్ట. అంతర్దానం అనే మూడు దశలున్నాయి. ఆ నాదోత్పత్తి, విజృంభణ నిశ్చ బ్దతలను గురించి వివరంగా తెలిసి యున్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నాదృఢ విశ్వాసమంటారు రామకృష్ణగారు.

శైవమత విజృంభణ:

కాకతీయ సామ్రాజ్యంలో శైవం, వీరశైవం విశృంఖలంగా విజృంభించింది.

ఆరోజుల్లో పశుపతి సాంప్రదాయం, వీరశైవం ముమ్మరంగా ప్రచారంలో వుంది. పశుపతులూ, మహేశులూ, వీర శైవులూ, మైలారదేవులూ, వీరందరూ శైవ మతాన్ని స్వీకరించినవారే. ప్రతి రోజూ వీరు ఆరుసార్లు శివుని నృత్యరీతుల్లో ప్రార్థనలు చేసేవారు. అందువల్లనే శైవ నృత్యాలు అత్యంత ప్రచారంలోకి వచ్చాయి.

శివాలయాల్లో పురుషులే నృత్యం చేసేవారు. దేవుని దర్బారని పిలువబడే కళ్యాణ మండపాలలో స్త్రీలు కేశిక నృత్యాలను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప్రదాయ సిద్ధమైన నృత్యాలు. ఇవి అనేక తాళగతులకు చెందేవిగా వుంటాయి. తాండవంలో అభినయానికి అంతగా తావు లేదు. శివస్తోత్రానికి సంబంధించిన శ్లోకాలు మాత్రమే చదువ బడతాయి. ఇవి నృత్యరీతులకు అను గుణ్యంగా విండి నూట ఇరవై అయిదు విన్యాసాలతో విరాజిల్లు తుంటాయట.

కేశికి ప్రదర్శనంలో నృత్త నృత్య అభినతాలు వుంటాయి. ఇది నృత్యంతో ప్రారంభమై అభినయంతో ముగించబడుతుంది.

TeluguVariJanapadaKalarupalu.djvu

కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ముఖమండపంలోనూ, పాలంపేట రామప్ప దేవాలయంలోనూ చూడవచ్చును.

వీర శైవం, వీర వైష్ణవం:

వీర వైష్ణవం, తమిళనాదులో ప్రారంభమై ఆంధ్ర దేశంలో ప్రవేసిస్తే వీరశైవం, కర్ణాటకలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేసింది. రెండు మతాల మధ్యా బద్ధవైరుధ్యం చెలరేగింది. ఉభయ మతాల మధ్య సామరస్య సాధనకు ఆంధ్ర దేశంలో పలనాటి బ్రహ్మనాయుడూ, తిక్కన సోమయాజీ కలసి హరిహర ఉద్యమాన్ని లేవదీసినట్లూ, ఆ వుద్యమంలో వీర శైవుల్నీ, వైష్ణవుల్నీ కూడ చేర్చుకుని మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని స్థాపించి ఆ ప్రాంగణం లోనే వీరభద్ర స్వామిని కూడ ప్రతిష్టించాడు.

శివకేశవుల ఎదుట పేరిణి:

మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన కోటప్ప కొండ, శ్రీశైలం మొదలైన పుణ్య క్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబందించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.

TeluguVariJanapadaKalarupalu.djvu

ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న కారంపూడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర్ఫుల దినోత్సస్వం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయాలున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్ని జతులు ప్రదర్శింపబడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేకపర్చేవి. పూర్వ వీరుల ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, సాంబ్రాణి రూపంలో మునిగి పోయి, సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పోయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.

అలాంటి పేరిణి నృత్యం:

పేరిణి నృత్యమంటే, అలాంటిది. పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధానం పేరణికి అతి ముఖ్యమైనది.

ఓ పరమశివా? నాలో శివశక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు. నిజానికి ఇది ఎంతటి ఔన్నత్యంతో కూడుకున్న నృత్యమో మనం అర్థం చేసుకోవచ్చు.

TeluguVariJanapadaKalarupalu.djvu

చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, నటరాజ రామకృష్ణగారు పరిశోధించి, పరిష్కరించి, దానికొక సజీవ రూప కల్పన చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళముందుంచారు. పేరిణి చరితార్థమైనట్లే, నటరాజ రామకృష్ణగారు కూడ చరితార్థులు.

TeluguVariJanapadaKalarupalu.djvu