తెలుగువారి జానపద కళారూపాలు/పీర్ల పండుగలో మొహరం గీతాలు

వికీసోర్స్ నుండి

పీర్ల పండుగలో మొహరం గీతాలు

మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహరం.

ముస్లిం పంచాంగ రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి తేదీ మొహరం. మొహరం పండుగనే పీర్ల పండుగ అని కూడ అంటారు. "పీర్ " అంటే మహాత్ములు, ధర్మనిర్దేశికులు అని అర్థం.

ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి గలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని 'పీర్లు' అని పిలుస్తారు.

మహమ్మదీయులు, మత కలహాలు:

మహమ్మదు ప్రవక్త నిర్యాణం చెందిన తరువాత ఖలీఫాలయిన నలుగురులో మత కలహాల దృష్ట్యా హత్య గావింపబడినందున ఆయన పెద్ద కుమారుడు 'హసన్' ఖలీఫా కాగా విష ప్రయోగం వలన అతి త్వరిత కాలంలోనే పదవీ త్యాగం చేయవలసి వచ్చింది. ఆ తరువాత రెండవ కుమారుడైన హుస్సేన్ ఖలీఫా కావలసి వుండగా " ము అని యా" అనే పీఠాధిపతి కుమారుడైన యజీద్ తాను ఖలీఫానని ప్రకటించు కున్నాడు.

కూఫా నగర వాసులు "యజీద్ దౌష్ట్ర్యం నుంచి కాపాడమని హుస్సేన్ ను అందరం బలపరచగలమని కోరుతున్నట్లు బూటకపు వర్తమానం పంపటం జరిగింది. హుటాహుటిని హుసేన్ కూఫాకు రాగా ఆయనకు సహరించే వారు ఎవ్వరూ కనిపించ లేదు. జరిగిన మోసం గమనించిన హుసేన్ యూషిటీస్ నదీ తీరాన "కర్బలా" మైదానంలో విడిది చేసి వుండాగా "యజీద్ సైన్యం ఆయనపై పడింది. శత్రు బలం నాలుగు వేలకు పైగా వుండగా ఆయన బలం కేవలం ఇద్దరు అశ్వికులు, నలబై మంది కాల్బలం కావడం వల్ల నిరాశ చెందిన హుసేన్ తన అనుచరులను వెళ్ళి పోయి ప్రాణాలు కాపాడుకోమని తన కొరకు బలి కావద్దని కోరారు. కాని వారు ఆ సంకట స్థితిలో హుసేన్ ను వదలి వెళ్ళడానికి సమ్మతించ లేదు.

అమరవీరుడు హుస్సేన్:

ఆ ధర్మ యుద్దంలో హుసేన్ అనుచరులు అంతమొందగా, ఆయన, ఆయన కుమారుడు నిరాశ్రులై రణరంగంలో నిలిచారు. చివరకు కుమారుడు కూడా ఒకడు దురాగతుని బాణఘాతానికి ఆహుతి కావడం జరిగింది. కుమారుని శవాన్ని నేలపై నుంచి, ఆ విషాదం భరించే నిగ్రహశక్తిని తనకు ప్రసాదించమని హుసేన్ భగవంతుని వేడుకుని, దప్పికగొని నీరు త్రాగడానికి ముందుకు వంగగా బాణం వచ్చి ఆయన నోట గుచ్చుకుని ప్రాణాలను బలి గొన్నది. ఆ యుద్దంలో హుస్సేన్ ధారుణ మరణాన్ని స్మృతికి తెచ్చుకుని సంతాపాన్ని ప్రకటించేందుకు నిర్దేశితమైన ముస్లిం పర్వదినంగా మొహరం నిలిచి పోయిందని రంజని గారు ఆంధ్రజ్యోతిలో వివరించారు.

ఖురాన్ నిర్వచనం:

మొహరం నెలలో పదవ రోజు "సహదత్" ను సంతాపదినంగా పాటించ వలసిందిగా "ఖురాన్ " నిర్వచింది. ఆ రోజున "పీర్లు" అనే హస్తాకృతులను ఊరేగించి, ఊరియందుగల బావి దగ్గరో, నదుల దగ్గరో వాటిని శుభ్రపరచి నిర్ణీత

పేటికలో వుంచి మరుసటి "మొహరం నెల వరకు" ముజావర్ వద్ద భద్ర పరచటం జరుగుతూ వుంటుంది.

ఆంధ్రదేశంలో వున్న ముస్లిములు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగను ఎంతో భక్తిగా జరుపుకుంటారు. ఎంతో ఉద్వేగంతో అమర వీరుల్ని స్మరిస్తారు. ఈ సందర్భంలోనే మొహరం గీతాలను అలాపిస్తారు.

మహమ్మదీయులకు విగ్రహారాధన లేదు. కాని ముస్లింలలో ఒక తెగ వారు మాత్రం ఈ పేర్లను ప్రతిష్టించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు.

హిందూ ముస్లిం ఐక్యత:

కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడ పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. అంటే జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో మనం అర్థం చేసు కోవచ్చు.

ఫీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా॥ టి. దోణప్ప గారు కూడ తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు.

ముస్లిములలో ముఖ్యంగా దూదేకుల వారు ఆటలమ్మ,మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నారసింహులు, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ, అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ, పరసలలోనూ పాల్గొనటం, దరగాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.

పీర్ల పంజా:

మొహరం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన అయిదవ రోజు రాత్రి పంజా కపిటార అనే విగ్రహాల నుంచిన పెట్టెను,ముజావిరు అనే అర్చకుని ఇంటి నుండి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ విగ్రహాలకు పది రోజులు పూజలు జరుగుతాయి. పీరులంటే వీరుల యొక్క హస్తాకృతిలో, విగ్రహాల రూపంలో కొలు స్తారు. హస్తం పంజా రూపంలో వుంటుంది గనుక వీటిని వుంచే స్థలాన్ని పీర్ల పంజా అంటారు. ఈ పీర్లకు కొన్నిటికి అయిదు వ్రేళ్ళు, కొన్నిటికి నాలుగు వ్రేళ్ళు, అలా మూడు, రెండు, ఒకటిగా విగ్రహాలుంటాయి. ఈ హస్తాలను పొడుగాటి కర్రల చివర భాగంలో అమర్చుతాడు. వాటిని రంగు రంగుల గుడ్దలతో అలంకరించి రక రకాల రంగుల కాగితాల పూల దండలను నిలువెల్ల అలంకరిస్తారు.

ప్రతి రోజూ ఆ పీర్ల పంజాలను సాంబ్రాణి ధూపంతో పూజిస్తారు. పీర్లను దర్శించటానికి పిల్లలు పెద్దలు వచ్చిపోతూ వుంటారు. ఆనాడు హిందూ ముస్లింల మధ్య ఏ మాత్రం భేదాలకు తావు లేకుండా సామరస్యపూర్వకంగా పూజిస్తారు.

పులి వేషాలు:

పీర్లను పంజాలొ నెలకొల్పిన తరువాత ఆవేశపరులైన ముస్లిం సోదరులు పులి వేషాలను ధరించి డప్పుల వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పెద్ద పులి నృత్యం చేస్తూ, పులి చేష్టలను అనుకరిస్తూ, హుంకరిస్తూ పిల్లలను భయపెడుతూ హంగామాగా వీధులన్నీ తిరుగుతూ పెద్ద పులి ఠీవిలో హుందాగా నడక నడుస్తూ పల్టీలు కొడుతూ ప్రతి ఇంటికీ వెళ్ళి వ్వాచిస్తారు. ఈ ప్రదర్శనాన్ని అందరూ ఎంతో ఆసక్తితో తిలకిస్తారు. పారితోషికాలనిస్తారు. ఇలా సంపాదించిన డబ్బును అఖరు రోజున ఆనందం కోసం ఖర్చు పెడతారు.

నిప్పుల గుండం:

పీర్లను మసీదు నుండి బయటికి తీసి విచార వదనాలలతో, సన్నాయి మేళంతో శోక గానం చేస్తూ ఊరంతా ఊరేగింపుకు బయలు దేరుతారు. తారతమ్యాలు లేకుండా అందరూ తరలి వస్తారు. ప్రతివారు సాంబ్రాణి ధూపంతో హారతి నిచ్చి, పారితోషికాల నిచ్చి ఆ విధంగా హసన్, హుస్సేన్ లకు జోహారు లర్పిస్తారు. ఊరేగింపు అయిన తరువాత రాత్రికి ఊరు మధ్యలో నున్న నిప్పుల గుండం దగ్గరకు వస్తారు. ఆఖరు రోజున బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి అందులో పెద్ద పెద్ద కట్టెలు పేర్చి నిప్పు ముట్టిస్తారు. అది బాగా మండి కణకణ మండే బొగ్గులుగా తయారౌతాయి. ఈ సమయానికి ఊరేగింపు ముగుస్తుంది.

హసన్, హుస్సేన్ పేరులతో పాటు, వారితో పాటు ప్రాణా లర్పించిన వీరుల పీర్లను కూడా పట్టుకుని హసన్, హుస్సేన్ __ హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేత బట్టి వుధృతంగా మారు మోగే సన్నాయి , డప్పు వాయిద్యాల

మధ్య పరుగు పరుగున ఆవేశంతో పరుగెత్తుతూ నిప్పుల గుండం మధ్య నుంచి నడిచి పోతారు. ఈ దృశ్యం ప్రేక్షకుల్ని చకితుల్ని చేస్తుంది. నిప్పుల గుండంలో దూకే వారికి ప్రజలు కూడ కేకలతో మద్దతు నిస్తారు. ఆ విధంగా మృత వీరులైన హసన్, హుస్సేన్ లకూ తదితర అమర వీరులకూ జోహార్లు ఆర్పిస్తారు. ఇలా నిప్పుల గుండంలో నడిచి వెళ్ళడం పీర్ల మహాత్మ్యంగా కీర్తిస్తారు. ఇలా పీర్ల పండుగ ముగుస్తుంది.

ఆ రోజున అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పలావు మొదలైన మాంసాహారాన్ని భుజిస్తారు. అలా ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులైన హిందువులను కూడా విందుకు ఆహ్వానిస్తారు. ఆలా హిందూ ముస్లిం సామరస్యానికి

దోహదం చేస్తారు. ఇలా ముగుస్తుంది పీర్ల పండుగ. ఈ పండుగలో అనేక మంది మొహరం గీతాలు పాడతారు. ఉదాహరణకు__

కలుపు పాటలో:

ఆసేని పూసేని అన్నదమ్ములు, అన్నదమ్ముల్లు
పూసేని సెరుగూన వూది బుక్కీటు స్వామి వుసేనీ
అసేని సెరుగూన అయిదు లాకీలు స్వామి వూసేని ౹౹ పూ౹౹

వూసేని మాసీదు వెలుగు మాసీదు స్వామి వుసేనీ ౹౹వూ౹౹

అసేని మాసీదు పాల మాసీదూ పాల మాసీదూ
దక్షిణ జెడగాలి పట్టి మంచమ్మూ పట్టి మంచమ్మూ
పట్టి మంచానికి బుట్ట చాందినీ బుట్టచాందినీ
పట్టి మంచం మీద లేవు దిండూలే స్వామి వుసేనీ ౹౹వూ౹౹

ఇలా సాగుతుంది. కాసీము వీరు విగ్రహమును సాధారణంగా వెండితో చేయించటం సంప్రదాయం. అందువల్ల ఈ పీరును వెండి దేవుడంటారు.

కాసీము నిలిచేది వెండి మాసీదో బంగారి మాసీదో
ఆతియ సక్కని వాడె మన కాసిములయ్య
మల్ల సక్కని వాడె మన పీరులయ్య
కాసీము వెలిగేటి గుండామె బంగారి గుండామె
అతియ సక్కని వాడె మన కాసిములయ్య
మల్ల సక్కని వాడె మన పీరులయ్య

అంటూ ఎంతో భక్తితో పాడతారు.

అలాగే మొహరం పండుగలో హసన్, హుసేన్ లిరువురి స్మృతిగా ఈ విధంగా పాడతారు.

నీకి దండమో నీకి దండమో
నీకి దండమో స్వామి నీకి దండమో
నీకి దండమో దేవ నీకి దండమో

ఆకాసిపట్నాన అందాల కోటా
అందాల కోటలో అద్దాల మాలూ ॥నీకి॥

అద్దాల మాలులో గెద్దె పీటల్లు
సురతీల సొగసుల్ల సుంవాసనలూ ॥నీకి॥

గెద్దె పీటల మీద ఇద్ద రెవ్వారు
అసేని వూసేని అన్నదమ్ముల్లు ॥నీకి॥

రచ్చనా రాజుల్లు తగువునా దొరలు
ఏడేడు దీవుల్ని యేలు పొచ్చాలు

ఇలా ఎన్నో పాటలు సాగిపోతాయి. హసన్, హుస్సేన్ వీరులను కీర్తిస్తూ అనేకమైన మొహరం గీతాలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలో వున్నా రాయలసీమలో ఎక్కువగా వున్నాయి. వ్రాసిన వారందరూ ఇతర కులాలవారే. ఇద్దరు అన్నదమ్ముల త్యాగాలను ముస్లిములు ఎలా కీర్తిస్తారో ఇతర కులాల వారు కూడా అలాగే పూజిస్తారు.

ఈ తెలుగు మొహరం గీతాలు జానపదులు ఎంతో భక్తితో పాడుకుంటారు. పని పాటల్లో కష్టాన్ని మర్చి పోతూ పాడుకుంటారు. ఈ మొహరం గీతాలను ఆచార్య తూమాటి దోణప్ప గారు తమ జానపద కళాసంపదలో వ్రాశారు. వారికీ, ఆ పాటలు వ్రాసిన వారికీ ధన్యవాదాలు.

ఈనాడు ఎక్కడో చెదురు మదురుగా తప్ప పీర్ల పండుగలు పూర్వంలా జరగటం లేదు. ఈ తరం వారికి ఈ పీర్ల వండుగను గురించి మొహరం గీతాలను గురించీ అంతగా తెలియదు.