తెలుగువారి జానపద కళారూపాలు/క్రైస్తవుల జానపద కళాప్రదర్శనాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క్రైస్తవుల జానపద కళాప్రదర్శనాలు

TeluguVariJanapadaKalarupalu.djvu

అనాది నుంచీ మన దేశంలో వున్న ప్రజలు వారి మత విశ్వాసాలనూ, ఆచారాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం కోసం జానపద కళారూపాలను బహుముఖాల ఉపయోగించుకున్నారు. అలా ఆయా మతాలు, కులాలు, జాతులు జానపద కళారూపాలకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. అలా ఆరాధించినవారిలో క్రైస్తవులు కూడా వున్నారు.

క్రీస్తుశకం 52 లో సెయింట్ థామస్ రాకతో మనదేశానికి క్రైస్తవ మతం ప్రవేశించిందనీ, మత ప్రచారార్థం మన దేశానికి చాలమంది మిషనరీలు వచ్చారనీ, ఈ దేశ సంస్కృతికీ, మతాచారాలకు వ్వతిరేకంగా తమ మతాన్ని ప్రచారం చేయలేమని గ్రహించారనీ, కేవలం అట్టడుగున వున్న ప్రజల్ని మాత్రం ఆకర్షించగలిగారనీ వెంకటేశ్వర యూనివర్శిటీ కాలేజి లెక్చరర్ డా॥ ఆనందన్ గారు 1990 డిసెంబరు 27_ వ తేదీన యస్.వి. యూనివివర్శిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్వంలో జరిగిన దక్షిణ భారత జానపద కళా ప్రదర్శనాల సెమినారు సందర్భంలో "క్రైస్తవ జానపద ప్రదర్శన కళలు" అనే పత్రాన్ని సమర్పిస్తూ ఈ క్రింది విధంగా వివరించారు.

17 వ శతాబ్దపు ప్రారంభంలో క్రైస్తవ మత ప్రచారం కోసం ఒక నూతన పంథాను అనుసరించింది. దీనికి అద్యుడు రాబర్టు డి నొబిలి. ఇతను జెసూట్ పాదరీల సంఘ ప్రతినిధిగా 1606 వ సంవత్సరంలో దక్షిణ భారత దేశం మధురకు వచ్చాడు.

వీరప్ప నాయకుని కాలంలో:

నొబిలీకి పూర్వం మధురను పాలించిన వీరప్ప నాయకుని కాలంలో (1572 - 95) ఫాదరీ ఫెర్నాండెజ్ పద్నాలుగు సంవత్సరాలు క్రైస్తవ మత ప్రచారం చేశాడు. పరవార్ లు అనే చేపలు పట్టే మత్స్యకారుల్ని మాత్రం క్రైస్తవ మతస్థులుగా మార్చగలిగాడు.

కానీ అగ్ర కులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించక పోవటానికి ఈ క్రింది కారణాలు అడ్డు వచ్చాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు హైందవ ఆచారాల్ని విస్మరించటమూ, పరవర్ లు అనబడే మత్స్య కారులు అంటరాని వారై వుండి క్రైస్తవులు కావటమూ, క్రైస్తవ మత ప్రచారకుల్ని నీతి నియమాలూ, మానమర్యాదలూ లేని త్రాగు బోతులుగా, గోమాంస భక్షకులుగా మంచివారిని పరంగేలుగా పిలవడం వల్ల అగ్ర కులాల వారెవ్వరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు.

మతం కోసం మార్చిన వేషం

ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొన్న "నొబిలి" తన ప్రచారం కోసం తన వేషభాషల్నీ, ఆచార వ్వవహారాల్నీ మార్చివేసి సన్యాసిగా కాషాయ వస్త్రాలను ధరించాడు. జంధ్యం వేసుకున్నాడు. ముఖానికి విభూతి రేఖలు దిద్దాడు. చేతిలో కమండలాన్ని ధరించాడు. శాఖాహారిగా ఒక చిన్న గుడిసెలో కాపరం పెట్టాడు. జగద్గురు తత్వ బోధక స్వామిగా పరసిద్ధి చెందాడు. బ్రాహ్మణులతో కలసి మెలిసి తిరిగాడు. ఇలా నొబిలీ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు చోటు సంపాదించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు కొనసాగుతున్నాయి. మధురలో క్రైస్తవ వేదాంత కళాశాల క్రైస్తవ మతాన్ని పూర్తిగా హైందవీకరణం చేయడానికి కృషి చేస్తూవుంది.

క్రైస్తవులు మన దేశ సంస్కృతికి అనుగుణంగా తమ మతాన్ని ప్రబోధించాలనుకున్నారు. తర తరాలుగా వస్తూవున్న ప్రచార సాధనాల్నే ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇలా అయితే విషయం ప్రజల్లోకి సులభంగా చొచ్చుకు పోతుందని వారి విశ్వాసం. అందుకు అనువుగా మన జానపద కళారూపాల్లో 'హరికథ ' 'బుర్ర కథ ' 'భజనలు ' 'కోలాటాలు ' మొదలైన వాటిని ఎంచుకున్నారు.

హరికథ:

క్రైస్తవ మతానికి చెందిన కథా రచయితలు, కథానాయకులు, దీనిని కాలక్షేపమనీ, సత్కథా గానమనీ అంటారు. బాపట్లలో 'ఇండియా బైబిల్ మిషను ' కు చెందిన షారోను ఆశ్రమ నిర్వాహకులు రెవరెండు మనోహర కవి వ్రాసిన 'అవతార విలాసం' 1959 లో ప్రచురింపబడింది. దీనిని ఆయన హరికథగా పేర్కొన్నాడు.

TeluguVariJanapadaKalarupalu.djvu

క్రైస్తవ కథాగానాన్ని రచించిన ప్రధమ కవి 'పిడతల జాన్ కవి.' (1876 - 1971) ఈయన భారత పురాణ కథల్ని వినడంవల్ల హరికథల్ని వినటం వల్ల అందులోని మెలకువల్ని తెలుసుకుని బైబిలులోని ఘట్టాలను అనుసరించి హరికథా కాలక్షేపాలుగా మలిచాడు. వాటిలో 'ఆదాం హవ్వలు ' 'క్రీస్తు జననం' పేర్కొన దగినది. అలాగే మంద పాటి అబ్రహాం భాగవతార్ 'ఏసు చరితము' 'అత్తోట రత్నకవి' 'సంపోను దెలీలా ' మొదలైనవారు వ్రాసినవి మాత్రమే లభ్యమౌతున్నాయి.

హరికథలు వ్రాసిన రచయితలు

బండారు ఇసాక్ భాగవతార్, కంబం జాకబ్, పాటి బండ్ల జాకబ్, పినపాటి జర్నియాబిరినీడి మోషే కవి, కంచం జాకబ్, చందోలు ఆనంద కవి మొదలైన వారు క్రీస్తు గాథల్ని హరికథలుగా వ్రాసున్న ప్రముఖులు. వీరు క్రైస్తవ హరికథల్నే కాక హిందూ పురాణ గాధల్ని కూడ వ్రాయడం చెప్పుకోదగిన విషయమంటారు ఆనందన్ గారు.

అంతే కాదు-మన పురాణ గాధల్ని హరి కథలుగా వ్రాసే రచయితలు క్రైస్తవ ఇతివృతాలను కూడ హరికథలుగా వ్రాస్తున్నారు. అలాంటి వారు జిన్నా అప్పారావు, అన్నం నాగ భూషణం, చేకూరి లక్ష్మీనారయణాచార్య, పెద్దింటి సూర్య నారాయణ దీక్షితులు మొదలైన వారు రచనలు చేస్తున్నారు.

గాన విధానం:

హరికథా గానంలో మొదట దైవ ప్రార్థన వుంటుంది. కథ పాత నిభంధనకు సంబంధించిందైతే యెహోవాను, కొత్త నిబంధనకు సంబంధించిందైతే ఏసు క్రీస్తును ప్రార్థించటం మామూలు.

ఉదాహరణలుకు ప్రార్థన

పరమపావన దేవా, దురిత భంజనా
దరనుత గుణ గణా యతిదీనావనా
వరదా నిను భజయించెద
కరుణ బ్రోవుము దేవా ॥పరమ॥

(కరుణాసాగర చరిత్ర) హనుమ గుత్తి దేవదానం.

తరువాత సభా స్తుతి ఇలా చేయబడుతుంది.

ఆత్మాభిషేకంబు నంది సంఘోన్నతి కొరకు
శ్రమియించు సద్గురువులార
క్రీస్తు నామార్చన నా గీతములో రచియించి
ప్రకటించుచున్నట్టి సుకవు లార
సతతము సువార్తను చాటించి నశించు
ఆత్మను రక్షించు ఆప్తులార
కవుల గాయకుల సత్కళల బోషింప
స్వధనము వ్వయించు వదాన్యులార.

పేద సాదల ప్రేమతో నాదరించి
దైవ వాక్యాలు సారమౌ జీవితమ్ము
గడుపు చున్నట్టి భక్తాగ్రగణ్యులార
సత్కథా గానము వినుడి సభ్యులారా...

ఇలా సభాస్తుతి చేసిన తరువాత కథా గానాన్ని చేస్తాడు. కాథాంతంలో ఫల శ్రుతి, ఆ తరువాత మంగళం పాడటంతో ముగుస్తుంది.

కోలాటం:

కోలాటాన్ని డిసెంబరులో వచ్చే క్రిస్ట్ మస్ పండుగకూ, వరికోతలప్పుడూ ప్రదర్శిస్తూ వుంటారు. కోలాటంలో పాల్గొనేవారు అందరూ ఒకే రంగు గల వస్త్రాలను ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. చేతిలో కోలలు ధరించి, ఇద్దరు చొప్పున సరి జోడిగా రెండు కక్ష్యలుగా నిలబడతారు. ఇలా నిలబడిన వారు కోపు ప్రారంభం కాగానే వెలుపలి కక్ష్య లోపలికి, లోపలి కక్ష్య వెలుపలికి వచ్చేలా ఆడుతూ, అటూ ఇటూ చిరుతలను తట్టుతూ అభినయిస్తారు. యేసుక్రీసు మహిమను చాటుతూ సరెల్ల సామ్యేల్ సుబ్బయ్య వ్రాసిన కోలాటపు పాట పేర్కొనదగినది.

TeluguVariJanapadaKalarupalu.djvu
కీర్తన

కోలలు వేయండి- ఏసుని కొనియాడను రండి
మేలులన్నిటికి మూలం బతడని చాల నుతించుచు జాలము చేయక
నృత్యము చేయండి - ఏసుని భక్తితో కొలవండి
నృత్యముగా ప్రభువు చావును గెలిచియు
నిత్యము మనతో కూడా వచ్చెనని
పొందుగ లేవండి - యేసుని ముందర నిలవండి

వింత దేవుడని సంతరించుచు
ఎగురుచు పాడండి - ఏసుని ఎదలో నుంచండి
సొగసుగ సభలో శుభముల నొసగు
తగిన విధంబున దయ జూపును అని

ఈ విధంగా కోలాటం ద్వారా తాము వివరించా లనుకున్న భావాన్ని వ్వక్తం చేస్తారు.

ప్రజల నుర్రూత లూగించే కళారూపాలలో బుర్రకథ కళారూప ప్రధానమైంది. బుర్రకథను గురించి ఆంధ్ర దేశంలో తెలియని వారెవరూ లేరు. అలాంటి బుర్ర కథను క్రైస్తవులు కూడా వారి మత ప్రచారం కోసం వినియోగించారు. బుర్రకథ లక్షణాలను గురించి గేరా ప్రేమయ్య అనే బుర్రకథా రచయిత "తన పండిత రామాబాయి" అనే బుర్రకథలో ఇలా ఉదహరించాడు.

రగడ

ఘనకవి పండిత సుజనుల్లారా తందాన తాన
తోడు వంతలు జోరుగ పాడ తందాన తాన
జోడు గుమ్మెట్లు తధిమి యనంగ తందాన తాన
రాగ తాళ గీతాది నృత్యముల తంబుర కథ నేడు వినుడీ

అని వివరించాడు.

క్రైస్తవ బుర్రకథా రచయితల్లో గేరా ప్రేమయ్య పేర్కొనతగినవాడు. ఆయన నలబై బుర్రకథల్ని రచించాడు. ఇంకా చిన్నా బత్తిని మైకేల్ కవి, జొన్న కూటి ప్రకాశం, వలుకూరి సత్యానందం, ఈదుల మూడి ఐజాక్, తోట శౌరి మొదలైన వారు రచయితలుగా కథకులుగా పేరు పొందారు.

బుర్ర కథలు:

అలాగే సి. బెనర్జీ, ధర్మయ్య, మస్తాన్ రావు, సత్యం బృందం, రెవరెండ్. కె.ఎస్.ప్రకాశ రావు, గంగోలు మోజెస్, తలతోటి ఏసేపు, బుద్దాడ జోసప్, సి.హె.పాలస్, పి. ఐజక్, సాధు తోమాస్ సుబ్బయ్య, వి. రత్నం., బి. జాన్ మొదలైన వారు బుర్రకథలు చెపుతూ తమ జీవితాలను సాగిస్తున్నారు. క్రైస్తవ బుర్ర కథలు మూడు విధాలుగా వున్నాయి. అవి పాత నిబంధనకు చెందినవి. క్రొత్త నిబంధనకు చెందినవి. క్రైస్తవ భక్తుల చరిత్రకు చెందిన బుర్ర కథలు.

గేరా ప్రేమయ్య వ్రాసిన నెహెమ్యా చరిత్ర, దావీదు విజయము, యేసేపు చరిత్ర, వలుకూరి సత్యానంద వ్రాసిన ఎలీషా, చిన్నా బత్తిన మైకేల్ వ్రాసిన "వీర సంపోను చరిత్ర" మొదలగునవి పాత నిబంధనకు సంబందించిన బుర్రకథలు.

పలుకూరి సత్యానందం వ్రాసిన యేసు జన్మము, గేరా ప్రేమయ్య తప్పి పోయిన కుమారుని చరిత్ర, యోహాను శిరచ్ఛేదము, క్రీస్తు శ్రమ మరణ పునరుత్థానముల కథ, సాధు తోమాస్ సుబ్బయ్య వ్రాసిన మృత్యంజయుడు మొదలైనవి కొత్త నిబంధనకు చెందిన బుర్ర కథలు.

TeluguVariJanapadaKalarupalu.djvu

గేరా ప్రేమయ్య గారి సాధు సుందరసింగ్, పండిత రామాబాయి, చిన్నాబత్తిని మైకేల్ కవి గారి బ్రదర్ జోసఫ్ తంబి గారి చరిత్ర. స్లీవశ్రీ వ్రాసిన "ఆగ్నేసమ్మ చరిత్ర" సాధుతోమాస్ సుబ్బయ్య వ్రాసిన విశ్వజనని మానవుల మాత మొదలైన భక్తుల చరిత్రకు చెందిన బుర్ర కథలు.

బుర్ర కథల్లో ప్రజా సమస్యలు:

క్రైస్థవ కథలు ప్రాచీనమైనవి. వీటిని ఈనాడు కొందరు బుర్రకథలుగా మలిచారు. అందులో ఈనాటి సమాజంలోని కుళ్ళును చెప్పడానికి ప్రయత్నించారు. గేరా ప్రేమయ్య గారి యోహాను శిరచ్ఛేదము బుర్ర కథలో బ్లాకు మార్కెట్టు బంధించబడాలని చెప్పే క్రింది ప్రబోధాన్ని చూడండి.

కట్టుకొనెడి గుడ్దకు బ్లాకు
పెట్టుకునే దీపానికి బ్లాకు
తిందామంటే తిండి బ్లాకు
మగ్గిపోయిన బియ్యం బ్లాకు
పప్పు పప్పులన్నియు బ్లాకు
పంచదారయు బెల్లము బ్లాకు
కట్టెపుల్లల కసలే బ్లాకు
వీధిలో యంగళ్ళన్నీ బ్లాకండో

తందాన
"
"
"
"
"
"
తందాన

ఇలా క్రైస్తవ బుర్ర కథలలో సామాజిక రుగ్మతలను గురించి కూడా ప్రస్తావించారు.

భజనలు:

పని పాటలు అయిపోయిన తరువాత పల్లెల్లో మామూలుగా భజనలు చేస్తూ వుంటారు. వీటిలో చెక్క భజనలు, పండరి భజనలు, హరి భజనలు , శాపమూళ్ళ భజనలు మొదలైనవి వున్నాయి. ఈ భజనలన్నీ భారత రామాయణ గాధలకు సంబంధించి భక్తి భావంతో కూడుకున్నవి. ఈ భజన పాటల్ని అనుసరించి క్రైస్తవులు కూడ భక్తితో భజన కీర్తనలు వ్రాశారు.

పండరి పురానికి వెళుతూ పండరి భక్తులు "రంగ ఎంత దూరమో ఎరుగము పండారి" అనే పాటను అనుకరిస్తూ__

ఇక నెంత దూరమో - ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
నడచి నడచియు కాళ్ళు - కడు బొబ్బ లెక్కెను _ కడు బొబ్బలెక్కెను

అని పాడుతూ, అలాగే మరో పాట.. ఏసుక్రీసు శ్రమావరణాల్ని గూర్చి పాడుతూ ఆయనకు జేజేలు పలికే క్రింది భజన కీర్తన కూడ ఈ కోవలో పేర్కొనదగినది.

ఏడమ్మా మన ఏసూ - ఏడనున్నాడో జై
ఏడనున్నాడో ఆ జాడ తెలియదాయొ ॥ఏడమ్మా॥
నీచిన్ని కాళ్ళల్లొ - శీలలే నాటిరిగ జై
కారినా రక్తంబూ
కాలువలై పారెనుగా ॥ఏడమ్మా॥

ఇలా ఏసు గాథలకు సంబంధించిన భజన పాటలు ఎన్నో ప్రచారంలో వున్నాయి.

ఇతర కళారూపాల క్రైస్తవులు జానపద కళాప్రదర్శనాలను శుభ సమయాలలోనూ, పెండ్లిండ్లు, సమయంలోనూ, పండుగల సమయం లోనూ, మహామహుల స్మృత్యర్ధం జరిపే జన్మ దినోత్సవాలలోనూ, క్రైస్తవ మహా సభలు జరిగే సమయాలలోనూ, ఈ కళాప్రదర్శనాలను ప్రదర్శిస్తారు. ఈ

TeluguVariJanapadaKalarupalu.djvu

కళలు హిందూ క్రైస్తవుల సంస్కృతికి దర్పణాలై క్రైస్తవ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. క్రైస్తవ సాహిత్యం జానపద కళలన్నిటిలోనూ ఉండటం గమనించదగిన విషయం.