Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/తెలంగాణా లత్కోర్‌సాబ్

వికీసోర్స్ నుండి

తెలంగాణా లత్కోర్‌సాబ్

పిట్టలదొర వేషం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వేషధారణను పోలి వుంతుంది. ఒక విధంగా తెల్లవాళ్ళ వేషాన్నీ, భాషనూ హేళన చేసేటట్లుగానూ వుంటుంది. నాడు సమాజంలో వున్న దుర్మార్గాలను ఎత్తిచూపుతూ హాస్యంతో ప్రజలను వినోదపరుస్తూ విజ్ఞానపర్చే నాటి జానపద కళారూపమే పిట్టల దొర. ఈ వేషాన్ని నాటి పగటి వేషధారులందరూ ప్రదర్శించేవారు.

లత్కోర్ సాబ్:

పిట్టలదొర వేషాన్నే లత్కోర్ సాబ్ "బుడ్డర్ ఖాన్" తుపాకి రాముడు అని పిలుస్తారనీ, అది పగటి వేషాల్లో ఒక రకమనీ, గ్రామాలలో ప్రదర్శించే పిట్టలదొర వేషగాళ్ళు సమాజంలో వున్న కుళ్ళు విషయాలను హాస్యంతోనూ, వ్వంగ్య రూపం లోనూ బయట పెడతారు. ఖాకీ ప్యాంటు, లేదా నిక్కరు, చిరిగిన ఖాకీ షర్టు తలపై దొర టోపీ, ఆ టోపీ పైన ఒక ప్రక్కగా తెల్లటి ఈక, చేతిలో కట్టె తుపాకీ, మెడలో రుమాలు, ముఖాని కంతా తెల్లరంగు పూసుకుని, ప్రెంచి కట్ మీసముతో, కాళ్ళకు బూట్లు తొడిగి ఒక దొరలాగా హంగామా చేస్తూ, అడుక్కుంటూ విరామం లేని తన వాగ్ధోరణితో శ్రోతలను చమత్కారంతో ముంచెత్తుతాడు. ఈ వేషాన్ని బ్రిటిష్ ప్రభుత్వ హయాములో 1943 ప్రాంతాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని దుయ్యపడుతూ, పాసిస్టు దురాక్రమణను వివరిస్తూ, సాంఘిక దుష్టశక్తుల కార్యక్రమాలను వెల్లడిస్తూ నాటి అంధ్ర ప్రజానాట్యమండలి విస్తృతంగా ప్రదర్శించిందని జయధీర్ తిరుమలరావు 'ప్రజా సాహితి ప్రత్యేక కళా రూపాల' సంచికలో వివరించారు.

తెలంగాణా పిట్టల దొర:

ఈ క్రింద సూచించిన కళా రూపం తెలంగాణా గ్రామాల్లో వృత్తి కళాకారులే, తెలంగాణా పోరాటానికి సంబంధించిన సమస్యల నన్నిటినీ పిట్టలదొర వేషంలో పొందుపర్చారు.


అంతా అనుకుంటే అవునేమో అనుకున్న ఊరూరు తిరగడం, ఉత్తుత్త మాటలు చెప్పడం దూటీ పొమ్మంటె దుమ్ము రేగంగ కోక జూడిచ్చిన ... గిదె నా బ్రతికిన బ్రతుకు నా రాతన్నారు ... గీతన్నారు ...ఖర్మన్నారు ...దుమ్మన్నారు కానీ మా రాజీ తెలంగాణా లోని తెగించుకపోయిన ముసలి ముతక తాతలంత తడాకా చూపిస్తుంటే నాకు కూడా రోశం వచ్చి, తుపాకి గట్టిగా పట్టి చివరిలో ...పోరాటంలో పోయనే పోయిన...


ఈ యిజై అన్న అంటే అండ్లేమున్న దనుకున్నారు. మా రాజ్ అంతా రైతులు, కూలీలు వింత వింతగ నన్ను జూసిండ్రు. ఇదేమి లాత్కోరి సాబ్ ఇట్ల బిచ్చమెత్తుట రాత గాదు. గీత గాదు అంతా నీ చేతులనే ఉన్నదన్నారు. అదెందో అనుకుని నా చేతులు చూచే సరికల్ల అన్నీ గీతలే ఉన్నయి. అప్పుడు నే ననుకున్న మారాజ్.

ఏమయ్య ఓ సంఘపోల్లు ఎక్కడ చూస్తే ఏమీ లేదు. చేతులు చూసే గీతలున్నాయ్ _ చేద్దామంటే భూమి లేదు _ వుందామంటే ఇల్లు లేదు. కొందామంటే పైసా లేదు _ తిందామంటే తిండి లేదు. ఈ సొరాజ్యంలో అప్పుడు ఆళ్ళేమన్నారను కుండ్రు, ఇదేవి లత్కోరు సాబు, వేల ఎకరాలు పెట్టిచ్చుకున్న దొరల భూమి అందుకే అచ్చింది దేశానికి సాతంత్రం _ అట్ల జూస్తే ఆయనకు దున్న రాదు _ ఇట్ల జూస్తే నీకు భూమి లేదు. కనుక దున్నుకున్న వాళ్ళు దుక్కి దున్నుకోమన్నరు. తీరా దున్నుకుందా మనుకున్న వరకల్లా ఎదురుంగ ఉన్న దొర భూమి యెదలు దున్నింది. వాళ్ళే దున్నుకొన్నరు. పనికి రాని భూమంతా పడావు పడుంటే ఎట్లనన్న కానీయని ... ఎట్లన్న యేగొచ్చని గుండె పెద్దది చేసుకుని గండికాడి ఎకరం భూమి కబ్జచేసిన ... నన్ను జూసి మా వూళ్ళో వున్న గొల్ల మల్లయ్య, చల్ల రంగయ్య, మాదిగ ముత్తయ్య, దూదిగ రామయ్య, పాలెం పాపయ్య, మాల గోపయ్య, మంగలి లింగయ్య, చాకలి నర్సయ్య, మేకల గురువయ్య, మేడ మీది రామయ్య, పీకే గోపాలం, ఏకే బడే సాబు జుట్టు కింత పట్టినంత దున్ననే దున్నిన్రు _ అల్కనే అల్కింన్రు _ అలికితే మారాజ్_ ఆండ్లేమి పండింది అనుకున్నరు...పందుం అలికెతె ఇద్దుం పండినయ్ _ ఇద్దుంలో కుండెడు తాలు _ బండెడు వడిసిలు _ లాగుల వొడ్లు _ నెత్తిమీద గడ్డి ఈడికి యింత సాలని ఇంటిదారి పడితే కర్నీకం వడ్లకని కాపలాయన రానే వచ్చిండ్రు. ఈ ఏడు ఏమీ లేదు _ ఇద్దుం అలిగితే తూమెడు పండినయ్.

వచ్చే ఏటికి వడ్డీతో ఇస్తనని కరణం పంతులు కాడికెళ్ళీ ఖాతా రాయించి పెట్టుకున్న అంతలోనే యూనియనొచ్చింది. ఇగ నాకే పర్వ అనుకున్న. పంతులు గింతులు గట్టా చేయిస్తరనుకున్న. పట్టా లేదు గిట్టా లేదు _ నెట్టడం మొదలుపెట్టిండ్రు _ఎల్లెలు యెదవ ... యెదవ నా కొడకా దొరోళ్ళ యిళ్ళకు పిలిచి దొంగ నా కొడక అని_ అంగీ లిడిపించి _ బీంగీలు తీయించి తొక్కించి దొబ్బించి తోలిరగ దీయించి ఎల్లెల్లు యెదవనా కొడక, అంటే భూమి లేకుంటనాయె, స్వరాజ్యంల సావుకే వచ్చిందనుకున్న. బతికి బయట పడితే బలుసాకు తిని బతకవచ్చు ననుకున్నా. ఇంటికెళ్ళి చూద్దును గద కుండలు కొడ్లాడు తున్నయ్. పోరగాండ్లు మూలుగుతున్నారు. పొయ్యిల పిల్లి లేవలేదు. ఇంత జూచి ఇదెట్లనాయ్ భూమి అనివోయి దున్ననే దున్నిన _ అల్కనే అల్కిన _ పంట పండే వరకల్లా నాతంట వాసింది. మరి

ఓట్లొచ్చినయ్. ఎడ్ల గుర్తు డబ్బాలకు అసలే వద్దంటున్నరు _ ఎన్నికల అత్తిడికి తెల్లోడు _ పోయ్ నల్లోడు వచ్చనే వచ్చిండు _ మెల్లగ మాట తిరిగ బెట్టి నల్లగ నాటిగస్తి? రాయనేరాసిన్రు.