Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/కొమ్మాయి దాసుడే, కొమ్మదాసరి

వికీసోర్స్ నుండి

కొమ్మాయి దాసుడే, కొమ్మదాసరి

మనం మన సంస్కృతిలో ఇప్పటికే విలువైన కళలనూ, సాంప్రదాయాలను పోగొట్టుకున్నాం. అలా మన ప్రాచీన సంస్కృతిని పోగొట్టుకుంటూ వచ్చాం. కాలక్రమంలో వాటిని పోషించే దిక్కు లేక అంతరించిపోయాయి. అలాంటి వాటిలో_

కడియాల కామమ్మక్కో - ముక్కు పుడకల చుక్కమ్మక్కో
కాసుల పేరుల కనకమ్మక్కో - గజ్జెల వీరమ్మక్కో
చేమంతిపూల సీతమ్మక్కో - చింతపూల రవికె చిలకమ్మక్కో
ముక్కు పుడకల చిలకమ్మక్కో - కొప్పుగొలుసుల కోటమ్మక్కో
బాజీబందుల బంగారమ్మో - దండ కడియాల కొండమ్మో
ముంతకొప్పుల కాంతమ్మో - ముత్యాలనత్తున్న ముత్యాలమ్మక్కో

అంటూ చెట్టు కొమ్మ మీద కూర్చుని, కొమ్మాయిదాసుడు పాడే, కొమ్మ దాసరి కళారూపం. ఈ తరం వారికి ఎవ్వరికీ తెలియదు. అంతరించిపోయిన జానపద కళారూపాలలో ఇదొకటి.

అయితే కొమ్మాయిదాసుడు అనే పేరు మాత్రం ఈ నాటికి ప్రచారంలో వుంది. సమాజంలో మామూలుగా వుండే వేషధారణకాక, విలక్షణ వేషధారణలో కనిపించే వ్వక్తిని ఏరా కొమ్మాయి దాసుడులా తయారయ్యావే అనే నానుడి ప్రచారంలో వుంది. కొమ్మ దాసరి పేరే కొమ్మాయి దాసుడుగా మారిపోయి వుండవచ్చు. కొమ్మ దాసరంటే కొమ్మమీద కూర్చుని ప్రసంగాలు చేసేవాడు. కొమ్మంటే కొమ్మే కాదనీ, ఎత్తైన చెట్టుగానీ, గుడిగాని, ఎత్తైన గోడగానీ, చివరికి బజారులో వుండే బండి గాని ఎక్కి కూర్చుని వినోదం చేకూరుస్తూ దానాన్ని పరిగ్రహించే వాడని, కె.వి. హనుమంత రావు గారు ఆంధ్రప్రభలో వివరించారు. ఒక రకంగా కొమ్మ దాసరి కళా రూపాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. వారికి కృతజ్ఞతలు. కొమ్మ దాసరులు చెట్టుకొమ్మమీదే కూర్చుని యాచిస్తారు. వారు అందరి మాదిరి ఇంటింటికి తిరిగి యాచించరు. చెట్టు దిగిన తరువాత ఎవరు ఏమిచ్చినా పుచ్చుకోరట. అది వారి కుల కట్టుబాటు. ఆ కట్టుబాటును విస్మరిస్తే కులంలో వెలివేస్తారట. అంటే యాచనలో కూడ ఎంత దర్జాగా యాచిస్తారో దీనిని బట్టి అలోచించవచ్చు.

ఒకరకంగా కొమ్మ దాసరులు ఎంత నీతిగా జీవించారో ఈ క్రింది ఉదాహరణ గూర్చి తెలుసు కోవచ్చును. కొమ్మ దాసరులు ఒక వూరిలో ఒకేసారి యాచిస్తారు. వ్యాచించిన వూరికి మళ్ళీ తిరిగిరారు... ఒక వేళ వచ్చినా ఎంతో కాలానికి గానీ తిరిగి రారు. వీరి తెగ చాల చిన్నదవటం వల్ల రాను రాను వారి జాతీ, జాతితో పాటు వారి కళారూపమూ క్షీణించి పోయింది.

కొమ్మ దాసరి చెట్టేక్కే ముందే ఆ చెట్టుక్రింద ఒక గుడ్డ పరుస్తాడు. ఆ తరువాత చెట్టెక్కి బిగ్గరగా గణగణమంటూ గంటను వాయిస్తాడు. ఈ గంట వాయిద్యంతో పూరిలో వున్న చిన్న పెద్దా అందరూ ఆ చెట్టు క్రిందికి చేరుతారు. అప్పుడు కొమ్మ దాసరి పాటలు ప్రారంభిస్తాడు. ప్రగల్భాలు సాగిస్తాడు. విమర్శిస్తాడు దూకి చస్తానని బెదిరిస్తాడు. ఎత్తు మీద కూర్చుని చుట్టు ప్రక్కల ఇళ్ళల్లో పని చేసుకునే స్త్రీలనూ, వారు ధరించిన నగలనూ, కట్టుకున్న చీరలనూ, పనులనూ రకరకాలుగా వర్ణిస్తూ వాళ్ళను రెచ్చ గొడతాడు. ఉదాహరణకు రక రకాల రంగుల చీరలు కట్టుకున్న స్త్రీలను వర్ణిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.

నాగుల చీర గట్టిన నాగమ్మక్కో
తెల్లచీర గట్టిన పల్లాలమ్మో
చెంగావిచీర గట్టిన చుక్కమ్మక్కో
వంకాయరంగు కోక కట్టిన వరదమ్మక్కో
నీలిచీర గట్టిన నీలమ్మక్కో
దొండపండు చీర గట్టిన బంగారమ్మో

అంటూ పేర్లు వారివి కాక పోయినా, ఆ రంగుల చీర్లను కట్టుకున్న వాళ్లను వయనంగా వర్ణిస్తాడు. అలాగే చుట్టు ప్రక్కల ఇళ్ళల్లో పనులు చేసుకునే స్త్రీలను ఈ విధంగా వర్ణిస్తాడు.

అంట్లు తోమే గంటాలమ్మో
చెంబులు తోమే చెల్లమ్మో
పిడకలు గొట్టే పిచ్చమ్మో
కూరలు తరిగే గౌరమ్మో
బట్టలు వుతికే చిట్టెమ్మో
గారెలు వండే గౌరమ్మో
ధాన్యం దంచే ధనమ్మో
కోడలు మీద చిందులు తొక్కే చంద్రమ్మో

ఇలా పని పాటల్లో మునిగి వున్న స్త్రీలను సంబోధిస్తూ పాటలు పాడుతూ వారిని రెచ్చగొడతాడు. ఈ మొండి వాడి పోరు పడలేక రుసరుసమంటూనే దానం చేస్తారు.

చివరికి అక్కయ్యో పప్పుదాకలో పడి పోతున్నా, పొయ్యిలో దూకేస్తున్నా అక్కో ఉరికేస్తున్నా.దూకేస్తున్నా. ముక్కు చితికింది, మూతి పగిలింది, అక్కో కాలు బెణికింది, చెయ్యి విరిగింది, నడుం వంగింది. నాలుక ఎండింది. గొంతుక పూడింది. కళ్ళు తిరిగి పోతున్నాయి. అక్కో దిగేస్తున్నానంటాడు.

అక్కల్లారా? అమ్మల్లారా? బిడ్డలు గల తల్లుల్లారా? బియ్యం పట్టుకు రండి. నాకు గుడ్డ లేయండి. చెట్టు దిగితే మీరేమిచ్చినా పుచ్చుకోను. అక్కో దిగేస్తున్నా, దిగేస్తున్నా, దిగేస్తున్నా అంటు నానా హంగామా చేస్తాడు.

ఈ వినోదం వింత మాటలు చూపరులకు ఆనందాన్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందరూ వాడి ఆకారాన్ని చూసీ, పాటలు వినీ, నవ్వుకుంటూ దాసరికి దబ్బు లేస్తారు. అంతటితో ఆ వూరిలో ప్రదర్శనం ముగుస్తుంది. అదే వూరిలో మరో చోట మరో చెట్టు ఎక్కడు, ఆనాటికి ఎంత దొరికెతే అంత. ఫూట కూటికే కోటి విద్యలన్నట్లు అడుక్కోవడంలో కూడా భేషజంగా అడుక్కునే కొమ్మ

దాసరులు ఈనాడు కనపించడం లేదు. అయితే ఈ కళారూపం ఎలాంటిదో భావితరాలకు తెలియజేయడానికి సేకరించాల్సిన అవసరం ఎంతో వుంది. అది మన సంస్కృతికి చిహ్నం.